గోరంత బొమ్మ – కొండంత బాపు

ఏదో పుస్తకం అవసరం అయ్యి మా పిల్లవాడు ఆ పుస్తకాన్ని పుచ్చుకుని తిరగేస్తూ “ఇదిగో, ఈ బుక్కులో వంద రూపాయలు పెట్టి మరిచిపోయావు, మొన్న ఆ పాత చలికోటు జేబులో కూడా ఇరవై రూపాయలు దొరికినాయి, ఎప్పుడు పెట్టి మరిచిపోయినావో ఏమో” అన్నాడు. మరిచిపోవడానికే అక్కడ పెట్టాను అని కాదు. కాసిన్ని డబ్బులని ఎక్కడపడితే అక్కడ పెట్టి ఉంచడం అదోరకం అలవాటు నాకు. ఆ డబ్బాలో కాస్త, ఈ సొరుగులో కాస్త ‘చేజారిన అదృష్ట రేఖలు’ అనే వ్యాసంవద్ద కాస్త డబ్బులు అలా వదిలేస్తూ ఉండటం అదో విధానం. (ఈ చేజారిన అదృష్ట రేఖలు అనేది శ్రీరమణగారి రచన. దొరికితే దొరికించుకుని చదవండి.)

డబ్బులే కదా! అవసరానికి ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండటం మంచిదే కదా! అని నేను అనుకుంటున్నట్లు, బాపుగారు మాత్రం నేనేదో ఆయన బొమ్మల గురించి నేను పుంఖానుపుంఖాలుగా రాస్తానని, విశ్లేషిస్తానని తనకు తొలుతే తెలిసి ఉండి ముందు జాగ్రత్తగా ఆయన బొమ్మలు కొన్ని నా దగ్గర వదిలిపోయారని నేను అనుకోవడం లేదు. కనులు మూసుకుని ఎంత నుదురుని గట్టిగా రుద్దుకున్నా ఈ బొమ్మలు, ఇటువంటి చిన్న చిన్న కానుకలు కొన్ని ఎందుకు నాపేరున వదిలిపోయారో గుర్తు రావడం లేదు. ఆయన వీటిని ఎందుకు వదిలిపోయినా నేను ఉన్నంతకాలం మాత్రం వేనోళ్ళ గొంతెత్తి ఆ రేఖాకీర్తిని గానం చేస్తూనే ఉంటాను. బాపుగారి పేరు వినగానే ఆయన్ని తలుచుకుని హృదయానికి దగ్గరగా చేతులని జోడించుకునే భక్తి ప్రకటనవాసులకు ఈ బొమ్మలు పంచుతూనే ఉంటాను.

బాపుగారి ప్రేమికులు, వీరాభిమానులు ఈ నేల మీద కొల్లలు. వీరిలో అసంఖ్యాకులు ఆయన్ని ఎన్నడూ ప్రత్యక్షంగా చూసి ఉండలేదు. ఆయన్ని చూసి ఉన్నవారికి సైతం ఆయన న్యూస్‌ప్రింట్ అచ్చుబొమ్మలని తప్ప మూల రేఖాలేఖనాన్ని కాని, ఆ రేఖ లోపల అలుముకున్న వర్ణరచనను కానీ తమ రెండుకళ్ళార ఒక చూపు చూసే, వారి సున్నితమైన మునివేళ్ళ తడుముతో ఆ బొమ్మను స్పర్శించే, అనుభవం కలిగే అవకాశం ఉంటుంది అనుకోను. బొమ్మల గురించి కాస్త తెలిసిన వారికయితే ఆయన చిత్రలేఖనానికి వాడిన కుంచె ఆ కాగితంపై తిరిగిన వంపు, ఆయన పట్టిన కలం ఆ బొమ్మలో ఒకానొక చోట గిర్రున తిరిగి అదృశ్యమైన మెరుపు తెలిసిపోతాయి. బొమ్మల గురించి బాగా తెలిసినవారికి ఒరిజినల్ బొమ్మని చూడటం ఎంత కన్నుల పండగో చెప్పలేము.

అటువంటి బొమ్మల అసలులు ఒకరి దగ్గర కాని, పదిమంది దగ్గర కాని, ఒక గొప్ప చిత్రకారుడి బొమ్మలు వందలుగా వేలుగా ఇనుప పెట్టెల మధ్య, చెక్కసొరుగు చీకట్లలోపల బంధింపబడటం కన్నా, ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క బాపు ప్రేమికుడి దగ్గరికి చేరితే, అవన్నీ ముచ్చటయిన నలుచదరపు చట్రం మధ్యకు చేరి గృహశోభై ఆ ఇంటి గోడ మీదికి చేరితే, తెలుగుతనం నుదుట ముచ్చట బొట్టయి కొన్ని, ఇంకొన్ని, ఎన్నో తరముల వరకు చూసే కన్నుల లోపల కాంతి ఊయలై గుండె ఊయలలూపదా? అలా గుండె ఊయలలూపమని కూడా నాకు బాపుగారు తమ బొమ్మలని ఇచ్చిపోలేదు. బుద్దిమంతుడు అనే సినిమా ఒకటున్నది. అందులో ఆరుద్రగారు వ్రాసిన పాటలో ఒక చరణం ఇలా ఉన్నది ‘ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చటనూ లేనే లేదని…’ నేను కేవలం ఆ పాట ద్వారా తెలుసుకున్న పని మాత్రమే చేస్తున్నా.

15-12-05 అనే అంకెలు ఈ బొమ్మల కాగితం పైన నాకు కనపడి ఉండకపోతే నేను ఈ బొమ్మల గురించి ఇలా రాయాలి అని కాని, ఇలా ఒకటి రాద్దాము అని కాని అనుకున్నవాడిని కాను. ఈ 2023వ సంవత్సరం బాపుగారి 90వ సంవత్సరపు పుట్టినరోజు దినము. పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇటువంటి డిసెంబరు పదహైదు అనే ఒక పుట్టినరోజు పండుగనాడు ఆయన యథాప్రకారం బాసింపట్టు వేసుకు కూచుని కాగితం పైన ‘శ్రీరామ’ అని రాసుకుని ఈ బొమ్మలకథని సినిమా స్టోరీ‌బోర్డ్‌గా లిఖించడం మొదలుపెట్టారు. దానికి ముందు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అంటే 21 డిసెంబర్ 1986 సితార పత్రికలో ఒక ఇంటర్‌వ్యూ ఇచ్చారు బాపుగారు. ఆ మాటామంతిలో ‘ఇంతవరకు శ్రీకృష్ణుని గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ కృష్ణలీలలు, రాసలీలలు, ఆయన మహిమలు మొదలైన అంశాలు తీసుకుని ఆసక్తికరంగా చెబుతూ ఒక సినిమా తీద్దామన్న ఆలోచన మాకెప్పటినుండో ఉంది. అయితే అనుకున్నంత ఎఫెక్టివ్‌గా దానిని తీయడానికి కాస్త టైమ్ పడుతుంది’ అని చెబుతూ ఆ ఇంటర్‌వ్యూ ముగుస్తుంది. బహుశా ఆయన అప్పుడు అనుకున్న ఆ సినిమాదే ఈ స్టోరీబోర్డ్ అనే చిత్రకథాసంగ్రహం కావచ్చు, కాకపోవచ్చు కూడా. నేను ఇక్కడ చెప్పబోయేది ఆ సినిమా తాలూకు కబుర్లు కూడా కాదు.

వృత్తిరీత్యా నేను ఎంతోమంది చిత్రకారులను తెలుసుకున్నాను. వెంటపడ్డాను, ఆరాధించాను, అందుకోచూశాను. వారందరిలో కూడాను ఎవరి పక్కనా చేర్చలేని, మరెవరికీ ఇంత విద్య తరము కాని, ఎవరితో సమంగా చూపలేని అసమానుడు బాపుగారు. మరే చిత్రకారులెవరైనా సరే! వారు ఫలానా ఫలానా పద్దతిలో, ఫలానా శ్రేణిలో, ఫలానా వర్గంలో చాలా గొప్పగా, అత్యంత గొప్పగా ఒక పనిని చూపించగలవారు మాత్రమే. వారికి బాగా తెలిసిన ఆ గడి దాటారా, ఆ సాము ముగిసిందా, ఇక అంతే! గీత చాలక, రంగు నిలవక ఎక్కడి వారక్కడ నిలువునా జారిపోవలసినదే, తెల్ల కాగితంలా ధవళ ముఖం వేసుకోవలసిందే. రచించవలసిన బొమ్మ ఏదైనా కానివ్వండి, ఆ బొమ్మ సైతం బాపురే! అని ముక్కున వేలు వేసుకుని ముచ్చట దిద్దుకునేది ఒక బాపు బొమ్మ దగ్గర మాత్రమే. బాపు అంటే బాపు అంతే. బాపుకు ముందు కానీ బాపు తరువాతనైనా బాపులో ఒక్క శాతమైనా గీత, పద్ధతి, కూర్పు, నేర్పు కలవారు రావడం అసాధ్యం. రాసి పెట్టుకొవచ్చు ఈ మాట, ములాజే లేదు.

ఇక్కడ మీకు చూపించడానికి, బాపుగారు చిత్రించిన బొమ్మ పరిమాణం మీకు తెలియడానికని ఈ బొమ్మల కాగితం మీద నా కళ్ళద్దాలని ఉంచి ఫోటో తీశాను. ఆకాశంలో మేఘం కానివ్వండి, మేఘం మధ్యన మెరిసిన మెరుపు కానివ్వండి, ఆ మేఘాల దిగువన వెలసిన రేపల్లె కానివ్వండి, ఆ రేపల్లియని, ఆ ఘట్టాలని ఆ ఇంత చిన్న బొమ్మల్లో మొత్తం చిత్రించిన కుంచెకారుడి నవరస మురళి అనే ఆ కుంచెకున్న వెంట్రుకలు మహా అయితే మన కనురెప్పకు ఉన్నన్ని మాత్రమే. అంతమాత్రపు కుచ్చుపుల్లని చేపట్టి ఆయన దాంతోనే అగ్గిపెట్టెలో పట్టగలిగిన కొలతలో బొమ్మలు వేశారు, అదే కుంచికని చేపట్టి రెండు కేలండర్లంత పెద్దకొలత బొమ్మలు కూడా వేశారు.

ఒక్కోసారి చెప్పుకుంటున్న ఈ విషయం ఇలా రికార్డ్‌లు నెలకొల్పగలిగిన బొమ్మలా, రంగులా, కల్పనా, చిత్రకళా అని కాదు. వీటిని చూస్తుంటే గర్వంగా ఉంటుంది, ఇది కదా మన ఆస్తి అని టెక్కుగా, డాబుగా, పరమ అహంగా ఉంటుంది. బాపు మాది అని దుడుకుగా ఉంటుంది. ఏమి కష్టపడకుండా, కనీసం చిన్నపాటి పుణ్యమో, పిసరెత్తు తపస్సో ఒనరించకుండానే బాపుని మావాడిగా పొందామే అని బిఱ్ఱుగా ఉంటుంది. అయితే ఈ బిఱ్ఱు వెనుక కనపడనిది తడిగుండెగా ఉంటుంది, చెమ్మ కన్నుగా ఉంటుంది, భక్తిగా, రెండు చేతుల కైమోడ్పుగా ఉంటుంది.

ఆ రెండు చేతుల కైమోడ్పు కాస్త దింపి, చూపుడు వేలుతో కాసింత ఒకటీ రెండు బొమ్మలని పాఠాలుగా చదువుకునే ప్రయత్నం చేస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు మీరూ తమరి తలలు ఇక్కడ దూర్చి బొమ్మలు చూడవచ్చు, వినవచ్చు.

ఒకటి, రెండు, మూడు బాక్సులలోని మూడు బొమ్మలలో ఆకాశంలోని నీలిమేఘాలు తమ ఆకారం మార్చుకుని పూతనగా అయ్యే రూపాంతరాన్ని గమనించండి. కాగితం పై కదలని బొమ్మలు సెల్యులాయిడ్‌ తెరపై కదలడాన్ని ఆయన ముందుగానే ఊహించి ఉంటారు కదా. అలా ఊహిస్తూ వారు ఇంకెన్ని ఊహనలు పోయి ఉంటారో! ఎంత ఉద్వేగం చెంది ఉంటారో, చూసే బొమ్మలో మనకు తెలియని రహస్యం. రాసిన దానికన్నా, గీసిన దానికన్నా, చెరిపేసిన దానికన్నా కలలు కని, ఊహించి, ఊహల్లో నిలుపుకున్న కళ అనంతం.

బాక్స్ నంబర్ 5. ఆ బుల్లి ఫ్రేములో చిన్ని కృష్ణుడు యశోద చేతుల్లో. ఉపరి దృష్టికోణం నుండి ఆ ఊయల అనురూపత. అక్కడి నుండి ఏడు, అయిదవ ఫ్రేముల్లో కూడా ఆ మీది కోణం నుండే కనపడే గొల్లవనితల ఫ్రంట్, బ్యాక్, సైడ్ పోజుల్లో లయ తప్పకుండా, జతి చెడకుండా అంగలు పడుతున్న పద్ధతి. తమాషాలు కాదు ఊహించినదానిని ఉన్నది ఉన్నట్టుగా బొమ్మలా దించెయ్యడం. ఆ ఇంత మాత్రం పరిధిలో ఆ అనాటమీ, అ అభినయం, ఆ కదలిక. కదలని బొమ్మలు కూడా కదులుతాయి కొందరి బొమ్మల్లో, లేదా బాపు బొమ్మల్లో.

బాక్స్ నంబర్ 20లో చూడండి. నేనెప్పుడూ చెబుతూ ఉంటాను. కొవ్వొత్తి చివర వత్తి వెలుగుతున్నట్లు వేసి ఆ వత్తి చుట్టూ దాని కాంతిని గుండ్రంగా చిన్న చిన్న గీతల్లో డిసైడ్ చేసిన చిత్రకారులెవరో మనకి ఎప్పటికీ తెలియదు. కాని రేఖా చిత్రకళలో ఆ రోజునుండే కాంతి పుట్టింది. అప్పటి నుండి ప్రతి చిత్రకారుడు కాంతిని చిత్రించాలంటే చిన్న చిన్న గీత తుంపులను గీసుకుంటూ పోవడమే. అలానే రెండు కాళ్ళని అడ్డంగా మడుచుకున్న పూతన భంగిమని గమనించండి. బాపుకు ముందు ఒక బొమ్మని ఇలా కూర్చుండబెట్టడమనే ప్రక్రియని ఇంత సరళంగా చేసినవారెవరూ లేరు. బొమ్మ కూచోడాన్ని, నిలబడటాన్ని, గోడకు జారగిలబడటాన్ని, కండువాని మెడకు చుట్టుకోవడాన్ని, లాల్చీని తలకు మీదుగా దింపుకోవడాన్ని… అలా ప్రతీ భంగిమకు ఒక సులభ వ్యాకరణం గీశారు. ఒక తేలిక వ్యాఖ్య చిత్రించారు. మీకు తెలియదా? తెలుసుకునే ఆసక్తి లేదా? దేవులపల్లిగారు వాపోయినట్లుగా ‘చూడలేని కన్ను మూగది. మాటాడలేని గొంతు గుడ్డిది.’

బాక్స్ నంబర్ 22లో ఉన్న పూతన మొహం నా చిటికెన గోరంత ఉంటుంది. ఆయింత ఇంతి మొహంలో కనపడుతున్న క్రూరమైన అభివ్యక్తి. దాని దిగువ బొమ్మలోని ఆవిడ కన్నులు. ఆ కన్నుల అడుగుకు జారిన కనుగుడ్లు. నుదుటి పైకి ఎక్కి ముడిపడిన కనుబొమలు. అంతకు ముందు 19వ నంబరు బొమ్మలో బాలుడిని ఎత్తుకుని ఇంటి బయటికి వస్తున్న పూతన ఆ చివర, ఈ చివర కాళ్ళ నడకని ఇంత సులువుగా చూపిన బొమ్మల భాషలో చదవండి, ఆవిడ ఎత్తు అక్కడ ఒకటిన్నర సెం.మీ. ఆ చివర చల్ల కుండలు, ఈ ముందు ఇత్తడి బిందెలు కూడా కలవు. అవేమీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయకపోతే మీరు ఏ శ్రీచరణస్పర్శా లభించని అహల్యలు కూడా.

ఇప్పుడు అగ్గిపెట్టె కొలత నుండి కాస్త వికాసము చెంది విస్తరించి పేకముక్క పరిమాణంలో ఉన్న బొమ్మ డబ్బా నంబరు 21లో. కంసుడి క్రూర శాసనాన్ని శిరసావహించి చంటి బిడ్డలను, పాలు తాగే పసికందులను తమ కరుకు కత్తులకు బలిచేసే పనిలో ఉన్న సైన్యం, వారి రాక్షసత్వం, ఎత్తిన పదును కత్తులు, దూసిన బల్లెం, దుముకుతున్న గుర్రం, కాలుతున్న పూరిపాక, బిడ్డలని కాపాడుకునే ప్రయత్నంలో మాతృమూర్తులు, సైన్యానికి అడ్డంపడ్డ తండ్రులు. ఏడుపు, కన్నీళ్ళు, రోదన, హింస – పచ్చని నేలపై ఎర్రని ఏడుపు ఈ బొమ్మది. ఇటువంటిదే మరో పేకముక్క బొమ్మ నంబరు 87లో హుఁ! పసి పిల్లలు! పాడు పిల్లలు! నేల రాలాల్సిన తలపండులు అని ఆగ్రహోదగ్రహాలతో అంతఃపురం లోకి అంగలు వేస్తూ వస్తున్న కంసమహారాజు. ఇక్కడంతా భవనశిల్ప బాహ్య సౌందర్యం. ఇదంతా క్రొక్విల్ చిలికిన రేఖా సృష్టి.

ఆ విధంగా ఎన్నో బొమ్మలు దాటుకుని బొమ్మ నంబరు 139 లోకి తొంగి చూస్తే మేఘాల మీద సువర్ణ తోరణాల మధ్యన ఆడుతూ పాడుతూ దేవ నర్తకులు, నర్తకీమణులు. ఇదంతా రెండు అగ్గిపెట్టెల కొలత లేదా సిజర్స్ సిగరెట్టు పెట్టె ప్రమాణము. ఈ బొమ్మ కిందే మోడల్ షీట్ అని పేరు కలిగిన పద్దతిలో ఏ నర్తకుడు ఏ భంగిమలో ఉండాలి, ఏ వాయిద్యాన్ని ఎవరు వినిపిస్తూ ఉండాలీ అనే తబ్సీలు చెప్పుకునే బొమ్మలు. ఇంతేనా ఇంకా చాలా కలవు. రాతిరి తాలూకు మూడవ ఝాములో పల్లె పైన పరచుకున్న నల్లని నీలి చీకటి రంగు మధ్యలో గుడిసెలో సన్నదీపం పచ్చని రంగు బొట్టు ఎలా వెలిగిందో, రెండవ ఝాములో నిదురపట్టక తన శయ్యపై అటూ ఇటూ పొర్లుతున్న కంసుడి శయ్య మీద నలిగిన దుప్పటి ఉబ్బెత్తు మడతల మీద కిటికి నుండి కురిసిన చంద్రుని వెలుగు ఎంత కురుస్తుందో, ఈ బొమ్మలన్నింటిని తెల్ల కాగితం మీద ఒక నల్లని కన్ను, ఆ కన్ను వెనుక ఆలోచన ఎలా చూసిందో, ఆలోచనను పట్టిందో ఎన్ని పాఠాలుగా చెబితే మాత్రం ఏమి అందుతుంది?

అచ్చమైన కళని, పదహారణాల సాంస్కృతిక సౌందర్యాన్ని స్వీకరించుకునే అర్హత, స్వంతం చేసుకోవాలనుకునే ఆసక్తి లేని జనాభా దేశంలో ఎందుకని ఈ బాపు పుట్టినట్లు? పుట్టినవాడు పుట్టినట్లు మామూలుగా కొంతకాలం ఉండిపోకుండా ఇన్ని రకాల బొమ్మలని ఇవన్నీ ఎందుకు, ఎవరికోసం చేసినట్లు? బాపు బొమ్మ అనే ఒకదానిని చూపులేని మనుషుల జాతికి వీలునామాగా ఎందుకు రాసిపోయినట్లు? ఈ పామరులు ఇంత బొమ్మ ఏం చేసుకుంటారు, స్పర్శజ్ఞానం తెలియని వేళ్ళకు ఎంత తడిమినా ఈ రేఖ లోతు అందేనా? బయట నూరువరహాల పువ్వు కొమ్మ మీద కూచున్న చిటికెన వ్రేలంత పిట్ట గొంతులో అంత పుట్ట తేనె తీపి రాగం నిర్విరామంగా ఎలా పలుకుతుంది? ఉండుండి వచ్చే చల్లగాలి శరీరానికి ఏ వేపు నుంచి ఎలా తగులుతుంది? బొమ్మ బొమ్మలా ఉండక బాపుగా ఎందుకు మిగిలిపోయింది? దేని కోసం? ఎందువల్ల? ప్రశ్నలకెప్పుడయినా శాపవిమోచనం కలిగిందని ఎక్కడయినా అనుకోగా చెప్పుకోగా చెవులపడిందా? ఎందుకో తెలియకనే ఇంత పనిని చేసి, సాధించి ఈ భూమ్మీద నాటిపోయిన ప్రియమైన బాపూ! మీకు తొంభైవ పుట్టినరోజు శుభాకాంక్షలు.

అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...