భాగఫలము

‘దేవుడా…’ అనుకున్నాడు. ‘నీకు మొక్కీ మొక్కీ చేతులు మొండయిపోతున్నాయి’ వాళ్ళ అమ్మనోట చిన్నప్పటినుండీ విన్నమాట గుర్తుకు వచ్చింది. రెండు చేతులూ జోడించే ఉన్నాడు. జోడించిన చేతులు పడుకొనివున్న అతని గుండెలమీదే ఉన్నాయి. ఊపిరి భారంగా వుంది. దృష్టి దేవుడిమీదే వుంది. అయితే ఆ మాటంటే దేవుడు కూడా ఒప్పుకోడు.

దేవుడు అలిగినట్టే ఎన్నడూ అతనితో మాట్లాడడు. దేవుడి అలుకతో నాకేమి సంబంధం అన్నట్టు రోజూ అలా నిద్రపోయే ముందు మాట్లాడుతూనే వుంటాడు అతను. అర్ధరాత్రి కళ్ళు మూతలు పడేదాకా. కొంతసేపు కళ్ళు మూసుకొని. కొంతసేపు కళ్ళు తెరచుకొని. ఇవేవీ తెలీని కొందరు నిద్దట్లో పలవరిస్తున్నాడని అనుకుంటూ ఉంటారు.

అతడు కూడా పగలంతా అచ్చం దేవుడిలానే ఉంటాడు. భార్యకీ పిల్లలకీ. ఔను, భార్యా పిల్లలూ అతనికి తమ అవసరాలూ కోరికలూ తీర్చమని దీర్ఘకాలికంగా విన్నవించుకుంటూనే ఉంటారు. అప్పుడు అతడు మాట్లాడకపోయినా సరే, తాము వేడుకోలు చేసేది చేస్తూనేవుంటారు. దిక్కులేనట్టు. ఉన్నది ఒక్కటే దిక్కన్నట్టు. ఇప్పుడు దేవుడి ముందు అతడి పరిస్థితీ అంతే.

‘దేవుడా… నిన్నుతప్ప యెవరిని యేమని అడగ్గలను?’ అనుకున్నాడు. నిజమే, అతను పని చేసే చోట కూడా నోరు తెరవలేడు. తెరిచి అడగాల్సింది అడగలేడు, కనీసం హక్కుగానైనా. అడగనిదే అమ్మయినా పెట్టదు. ‘అమ్మకంటే దేవుడు పైన కదా… అడక్కుండా పెట్టాలి. అడిగినా పెట్టడు. ‘హుఁ’ నిట్టూర్చాడు. అంతలోనే దేవుడితో గొడవ పెట్టుకొని బతకలేమన్నట్టు మళ్ళీ తన ఆలోచనలకు తనే లెంపలు వేసుకుంటాడు.

అప్పుడప్పుడూ దేవుడి స్థానంలోకి తన బాసు వచ్చి నిలబడతాడు. ఎందుకంటే తన జీవితకాలం బాసు చెంతే గడిచిపోయింది. నమ్మాడు. నమ్ముకొనివుంటే ఎప్పటికైనా ఏ మేలైనా చేస్తాడన్న నమ్మకాన్ని నమ్మాడు. దేవుణ్ణి నమ్మినట్టే. ‘నమ్మి నానబోస్తే… కుమ్మి కుడుములెట్టుకోవడమే’ అని దెప్పి పొడుస్తుంది పెళ్ళాం. ‘యేరోజైనా బాసు మనసు కరగకపోతుందా…’ అనుకుంటాడు. కరిగించే పని దేవునికి అప్పగించేసినట్టు రోజూ గుర్తుచేస్తూ ఉంటాడు. దాన్ని విన్నపాలని వేడుకోలని మొక్కని కూడా పేర్లు పెడుతున్నానేమో అని కూడా తనకితనే అనుమానపడుతుంటాడు.

‘నేను యిన్నాళ్ళుగా మీదగ్గర నమ్ముకొని పనిచేస్తూనే వున్నాను. నేను నాతోగాని నా భార్యతోగాని పిల్లలతోగాని యింత సమయం యెప్పుడూ వెచ్చించలేదు. నా జీవితం యిక్కడే అయిపోయింది. రేపు యిక్కడే ముసలైపోతాను. పనిచేస్తూనే చచ్చిపోవచ్చు. నన్ను నేను చూసుకుంటే పనిచేయడానికే పుట్టాను తప్పితే వెతికినా యింకేమీ అగుపించడం లేదు. నా పనికి తగ్గ ఫలం… వేతనం యిది కాదు.’ ఎప్పుడూ అనుకున్నట్టే ఇప్పుడూ అనుకున్నాడు.

‘దేవుని దృష్టిలో అందరూ సమానమే!’ బాసు అనే మాటా చేసిన ఆధ్యాత్మిక ప్రసంగమూ ఆ సమయంలో గుర్తుకు వచ్చింది. ‘నువ్వూ నేనూ సమానమా?’ అనుకోగానే, చెంప చెళ్ళుమంది. ‘అయిదువేళ్ళూ సమానంగా ఉంటాయా? ఆ పెద్దింటి పిల్లలతో నీకు పూపేటి?’ అమ్మ కూడా గుర్తుకు వచ్చింది. ఎప్పటి దెబ్బకో ఇప్పుడు చెంప తడుముకున్నాడు. ‘దేవుడికి కూడా సమదృష్టి లేదు’ అనుకున్నాడు. ఆ వెంటనే వొంటిచేత్తో రెండు లెంపలూ ఈసారి తనే వేసుకున్నాడు.

‘మీ యజమాని మీద దేవుని దయవుంది. అందుకే కోట్లకు పడగలెత్తాడు’ నాన్న మాట గుర్తుకు వచ్చింది. ‘దేవుని దయ అందరిమీదా వుండదా?’ తెలీక వయసులో ఉన్నప్పుడు అడిగాడు. ఉడుకు రక్తం. ఇప్పుడు ‘దయ’ అంటే ఏమిటి? అని అడగడు. అర్థం చేసుకున్నాడు. దయ అంటే కనికరం. యింగ్లీసులో ఫేవర్. ఫేవర్ అందరికి అందరూ చేయరు. ఫేవర్ చేసినవాళ్ళకే ఫేవర్ చేస్తారు. కనికరం చూపినవాళ్ళకే కనికరం చూపిస్తారు. దయ అనేది కూడా ఇచ్చిపుచ్చుకోవడం లాంటిదే. దాన్నే ప్రసన్నం చేసుకోవడం అనుకోవచ్చు…

‘నువ్వు నీ బాసునే ప్రసన్నం చేసుకోలేవు… యింక దేవుణ్ణి యేమి ప్రసన్నం చేసుకుంటావు స్వామీ?’ ప్రతియేటా ఆరేడుయేళ్ళుగా అయ్యప్పమాల వేస్తూ గురుస్వామిగా మారి అందరితో పాదపూజలందుకొనే బావమర్ది అప్పుడెప్పుడో నవ్విన నవ్వు ఇప్పుడు వినిపించింది. ఒక్కక్షణం తన బావమర్ది గుర్తుకువచ్చాడు. అతని ఆహార్యం చూసి అందరూ గౌరవంగా మెలగడం గుర్తుకువచ్చింది. జుట్టు విప్పి మళ్ళీ సిగవేసుకోవడం గుర్తుకువచ్చింది. జిల్లాలోని అయ్యప్ప ఆలయాలకు ప్రెసిడెంటయినప్పుడు తన కళ్ళలోని ఈర్ష్యను పసిగట్టినట్టు పొగరుగా కళ్ళెగరేసి నవ్విన నవ్వు కూడా యిప్పుడు కనిపించింది.

మళ్ళీ బావమర్ది స్థానంలోకి బాసు వచ్చాడు. భగవంతుణ్ణి తలచుకున్న ప్రతిసారీ బాసు వచ్చేస్తాడు. పోటీపడినట్టే. ‘మీ బాసు బాగా సంపాదించాడురా’ అంటాడు దోస్తు. నిజమే, తెల్లారి లేస్తే టీవీల్లో పేపర్లల్లో బాసు కనిపిస్తూనే ఉంటాడు. కొత్త రియలెస్టేట్ వెంచర్లు వేస్తూనో. ప్రభుత్వ కాంట్రాక్ట్ తమకంపెనీ దక్కించుకుందనో. ఎక్కడో ఏదో గుడి కట్టిస్తూనో. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూనో. చలివేంద్రాల్ని పెడుతూనో. విద్యార్థులకు బహుమతులు ఇస్తూనో. నిత్యం మీడియాలో మసలుతూనేవున్నట్టు ఉంటాడు. అందుకని ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ‘మీ బాసు కష్టపడి సంపాదించాడు, అందుకే సుఖపడుతున్నాడు’ టీవీ చూస్తూ దోస్తు అన్నప్పుడు ‘మనం పడ్డది కష్టం కాదా? మరి మనమెందుకు సంపాదించలేకపోయాం? సుఖపడలేకపోయాం?’ అని అడగాలని ఉంటుంది. కాని అడగలేడు. అడిగితే వచ్చే అవమానం మొయ్యలేడు. అందుకే ‘అన్ని కష్టాలూ వొకటి కాదు, కానేకాదు’ అని గట్టిగా అనుకున్నాడు.

ఆ వెంటనే ‘భాగ్యవంతులకు భగవంతుడు కూడా సేవ చేస్తాడు’ లెక్కల మాస్టారు ఎన్నడో అన్నమాట గుర్తుకువస్తుంది. వారికి ప్రభుత్వాలు కూడా సేవ చేస్తాయి. సేవ చెయ్యడం మనహక్కు. సౌఖ్యం పొందడం భాగ్యవంతుల హక్కు. అలా అని ఎప్పుడో తీర్మానించేసుకొని సరిపెట్టుకున్నాడు కూడా. కాని ఆలోచనలేవో అతనితో ఆటలాడుకుంటూ ఉన్నాయి.

‘అతగాడు యెంతడబ్బు సంపాదించినా బాబాల్నీ స్వామీజీల్నీ నమ్ముతాడురా’ గొప్ప విశేషంలా అంది అమ్మ. ‘నేను బాబాల్నీ స్వామీజీల్నే కాదు, అతణ్ణీ అంటే బాసుని కూడా నమ్ముతాను’ అని సమాధానం ఇస్తాడు. కాని ఆ సమాధానం పెదవి దాటదు.

బాసు ఆలయనిర్మాణానికి చెక్కు ఇచ్చిన సంగతి వార్తల్లో చూసి ప్రస్తావించాడు నాన్న. ‘నీ వయసే వుంటుంది కదరా’ అని అడిగాడు. అక్కడితో ఆగకుండా ‘పెట్టి పుట్టాడురా’ అన్నాడు. మేచ్చేసుకుంటున్నప్పుడు ‘పెట్టి… పెట్టుబడి పెట్టి… ఆ జన్మలో పెట్టుబడి పెట్టి యీ జన్మలో పుట్టాడు. ఈ జన్మలో పెట్టుబడి పెట్టి మళ్ళీ జన్మకు కూడా…’ అని తనలో తనే గొణుక్కున్నాడు. ‘జన్మంటే? జనరేషన్! తన తర్వాతి జనరేషనుకు కూడా రిజర్వు చేసేశాడు!’ ప్రశ్నా తనదే. జవాబూ తనదే. వెన్నంటి వివరణా తనదే. సాక్ష్యంగా ‘అంతా మీ బాసు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం’ అందరిదీ అదేమాట.

‘మరి ఆ పెట్టుబడేదో నువ్వూ పెట్టొచ్చుగా?’ ఆ ప్రశ్న వేసింది ఎవరో? తన లోపలి మరో మనిషో? ఇదమిత్థంగా తెలీలేదు. కాని సమాధానాలు వెతుక్కున్నాడు. పెట్టుబడి అంటే డబ్బు. ధనం. సంపద. అది ఎక్కడినుండి వస్తుంది? సాధారణంగా ముందు తరం నుండి వస్తుంది. ముందు తరానికి? ఆ ముందు తరం నుండి. వాళ్ళకి? ఏ ఈ తరానికైనా – వ్యాపారమో వ్యవహారమో… దానికి సపోర్ట్ కులంవల్ల వస్తుంది. మతంవల్ల వస్తుంది. వర్ధిల్లుతుంది. అంతో యింతో అవినీతి చెయ్యాలి. మోసం చెయ్యాలి. వ్యాపార వ్యవహారాల్లో అవినీతి మోసం కూడా ఇన్వెస్ట్‌మెంటే. బాసన్నమాటే. ఒట్టి సిమెంటుతోనే ఇల్లు కట్టలేం… ఇసుక కలపాలి. లేకపోతే నిలబడదు. కొత్త ఉద్యోగులకు ఉపదేశం ఇచ్చిన బాసు. నష్టాల్లో కాకుండా లాభాల్లో భాగం అధికారానికీ అధికారులకీ పంచాలి… తన చేతులమీదుగా ఎన్నో కవర్లో కట్టలో పంచాడు. ‘లెక్క తప్పని మనిషి’ అని బాసుని కీర్తించడమూ పునాదులు పటిష్టం అవ్వడమూ తెలుసు. అందువల్ల సంపద అంటే పెట్టుబడి అనేది అనేకానేక వాటివల్ల వస్తుందని – తనకవేవీ లేవని – అందువల్ల డోర్స్ క్లోజయిపోయాయని కూడా చల్లగయిపోయేడు.

‘దేవుడికి యెంత యిస్తే అంత యిస్తాడు’ అని అమ్మ బాసు పుణ్యాన్ని తన పాపాన్ని తలచుకుంటూ అంది. ‘ఎంత యిస్తే అంతకాదు, దేవుడికి కోటిస్తే తిరిగి నాలుగు కోట్లు యిస్తాడు’ అని నాన్న. వాళ్ళ మాటల్లో వాళ్ళుంటే ‘యింత లాభం యే షేర్స్ కొన్నా రాదు, మరియే బ్యాంకులో ఇన్వెస్ట్ చేసినా రాదు. పైగా పన్ను రాయితీ కూడా…’ తన ఆలోచనలకు తనే ఉలిక్కిపడ్డాడు. వెన్ను మీద చరుచుకోబోయాడు. అమ్మానాన్నల్ని చూసి ఆగిపోయాడు.

‘ఆ బాబు యేడాదికి పదిసార్లు తిరుపతికి వెళ్తాడు’ తాను వెళ్ళలేకపోయాననే దిగులుతో అమ్మ పరధ్యానంగా అంది. టీవీల్లో వీడియోల్లో చూసి వుంటుంది. ‘నిలువు దోపిడీ యిచ్చాడట’ నాన్న వంత పలికాడు. ‘నిలువు దోపిడీ యెవరన్నా యిస్తారు. ఒంటిమీద వున్నదే కదా? ఒంటిమీద యెంత వుంటుంది? ఇంట్లో యెంత వుంటుంది?’ తన ఆలోచనలకీ చర్యలకీ సంబంధం లేనట్టు లెంపలు వేసుకున్నాడతడు. చూసిన అమ్మానాన్నలకు అర్థం కాక అయోమయంగా చూశారు. ‘మొక్కిన మొక్కులు తీర్చకపోతే భగవంతుడికి కోపం వస్తాది’ అని అమ్మ, ‘అందుకే యిలా వున్నాం’ అని నాన్న, ‘మొత్తానికి పాపాలభైరవున్ని నేనే’ అని అతడు.

‘ఆయన పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు, అక్కడే సెట్లవుతారు’ మధ్యలో అంది అతని భార్య. సంబంధం లేకుండా కాదు. సంబంధం ఉంది. కొడుకునీ కూతుర్నీ మంచి రెసిడెన్షియల్ కాలేజీలో వేసి మంచి కోచింగ్ సెంటర్లో లాంగ్‍టర్మ్ పెడితే, ఒకరు డాక్టరూ ఒకరు ఇంజనీరూ అయ్యేవారని. ‘బాసు భగవంతుడికి పూజలూ నాకు అక్షింతలూ’ అనుకున్న అతడు దించిన తల ఎత్తలేదు. ‘వాళ్ళకేం కూర్చొని తిన్నా తరగని ఆస్తి’ అంది అమ్మ, దన్నుగా. ‘కూర్చొని తింటే కొండలు కరగవా?’ అని ఎప్పుడూ అలవాటుగా తిట్టే అమ్మే.

కలగాపులగంగా ఉన్నాయి అతడి ఆలోచనలు. కళ్ళు మూసుకున్నాడు. తెరిచాడు. తేడా లేదు. గతంలానే వర్తమానమూ. భవిష్యత్తూ. పెద్ద ఊపిరి తీస్తూ నిద్రపోవడానికి ప్రయత్నించాడు. శ్వాసమీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నించాడు. ఏ ఆలోచనా లేకుండా ఉండడమే ధ్యానమని గుర్తు చేసుకున్నాడు. వద్దన్నా ఆలోచనలు వీడడం లేదు. ఏమి ఆలోచనలు వస్తున్నాయి? అని బయటపడి ఆలోచనల్ని చూసే ప్రయత్నం చేశాడు. అప్పుడు అతని కళ్ళముందు బాసు ప్రత్యక్షమయ్యాడు. బంగారు ఆభరణాలతో కిరీటధారిగా వున్న బాసుకు వందలాది చేతులు ఉన్నాయి. ఆ చేతుల్ని దగ్గరగా చూశాడు. అందులో తన చేతులూ ఉన్నాయి. చేతికివున్న వాచీద్వారా గుర్తుపట్టాడు. ఒక్కసారిగా తన భుజాలు తడుముకున్నాడు. చేతులు లేవు. మొండి. బాసుకు చేతులు జోడిస్తూ అనేకానేకమంది. అందులో తన భార్యా అమ్మనాన్నలూ బంధుమిత్రులూ అందరూ ఉన్నారు.

‘మానవసేవే మాధవసేవ!’ అంటూ నవ్వుతున్నాడు బాసు. అతడు నవ్వలేదు. ‘నేను చేసేది మానవసేవ కాదా? నేను నా భార్యాపిల్లల్నీ తలిదండ్రుల్నీ తోబుట్టువుల్నీ చూస్తున్నాను కదా వారి ఆలనాపాలనా’ గింజుకుంటూ అన్నాడు అతడు. నవ్వుతూనే వున్నాడు బాసు. ‘నీది మాధవసేవ…’ అన్నాడతడు. బాసు పగలబడి నవ్వుతున్నాడు. ‘అసలు నీది సేవే కాదు’ అన్నాడతడు. బాసు విరగబడి నవ్వుతున్నాడు. ‘పబ్లిసిటీ… ఫ్రీ పబ్లిసిటీ’ అరిచాడు. నవ్వు ఆపేయడమే కాదు, బాసు చప్పున మాయమయిపోయాడు. ‘ఇంత వయసొచ్చింది, యీ పలవరింతలేమిటో…’ బయటగదిలో తల్లి గొణిగింది.

కళ్ళు తెరిచాడు. పరుపుమీద అటూయిటూ దొర్లాడు. బోర్లా పడుకున్నాడు. వెల్లకిలా పడుకున్నాడు. పక్కకు ఒత్తిగిల్లాడు. నిద్ర రాలేదు. ముఖంలో ముఖంపెట్టినట్టు బాసు ముఖమే. ఇకనుంచి బాసుని ఆఫీసులోనే వదిలిపెట్టి రావాలి అనుకున్నాడు చాలాసార్లు లాగే. ‘సాధ్యమా?’ బాసు గొంతు వినిపించింది. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. నిశ్శబ్దం.

‘నాకిప్పుడు టైం లేదు’ అన్నాడు బాసు. ఆ మాట గుర్తుకు వచ్చింది. ఆఫీసు అయిపోయేక వెళ్ళేముందు అడుగుదామని ఆగాడతడు. ‘సర్…’ అతడి గొంతులో ఎప్పటి దుఃఖమో పూడుకుపోయింది. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రకం కదా అవకాశం యివ్వలేదు. ‘సారీ నాకిప్పుడు టైం లేదు… అన్నదానానికి వెళ్ళాలి. ఇంకా కోటి దీప తెప్పోత్సవానికి వెళ్ళాలి…’ దూసుకుపోతున్నట్టు వెళ్ళబోతూ ఆగాడు. మాట్లాడడానికి అవకాశం దొరికినట్టు ‘థాంక్ గాడ్’ అనుకొని అతడు గొంతు సర్డుకుంటే, బాసు గొంతులోంచి మాట వచ్చింది. ‘రేపు నేను ముచ్చింతల్ వెళ్ళాలి, చినజియ్యరు స్వామివార్ని…’ మాట పూర్తికాలేదు.

“లక్షలిచ్చి వాళ్ళ పాదాలు కడిగి నెత్తిన పోసుకోండి, కోట్ల వ్యాపారాలు చేసుకోండి. కాని మా జీతాలు పెంచకండి” పెద్దగా అరిచాడు అతడు. అప్పుడు ఆఫీసులో కాదు. ఇప్పుడు ఇంట్లో.

“యీ నిద్దట్లో ప్రేలాపనలు పడలేకపోతున్నాం…” అని తలుపుని దగ్గరగా వేసి విసుగ్గా వెళ్ళి పడుకుంది భార్య.