మార్ట్ డ్రకర్

అనగనగా ఒకానొక కాలంలో ప్రపంచం నలుమూలల బొమ్మలేసేవారెవరికయినా తొక్కవలసిన దారి, ఎక్కవలసిన కొండ, చేరవలసిన లక్ష్యం, చదవవలసిన గ్రంథం ఒకటే. దాని పేరు మ్యాడ్ మాగజైన్. అందులో బొమ్మలు వేసిన మార్ట్ డ్రకర్, జాక్ డేవిస్, సెర్హియో అరగొనేస్, పాల్ కోకర్, బాబ్ జోన్స్, బాబ్ క్లార్క్, జార్జ్ ఉడ్‌బ్రిడ్జ్, ఆన్హేలో తొర్రెస్… వీళ్ళందరూ బొమ్మల దేవుళ్ళు. ఈ దేవుళ్ళకే పెద్దా దేవుళ్ళు మార్ట్ డ్రకర్, జాక్ డేవిస్, సెర్హియో అరగొనేస్ అనే త్రిమూర్తులు. ఎవరి గొప్పతనం వారిదే అయినా, వీరందరిలో మార్ట్‌ది చాలా చాలా ప్రత్యేక గొప్పతనం.

దాదాపు నూరేళ్ళ క్రితం, దాదాపుగా అనే దొంగ మాటలు కాకుండా ఖచ్చితంగా చెప్పాలంటే తొంభయ్ అయిదు సంవత్సరాల క్రితం మహా చిత్రకారుడు మార్ట్ డ్రకర్ పుట్టారు. మార్ట్ డ్రకర్‌ని మైకలాంజిలో ఆఫ్ కారికేచర్స్ అనేవారు. మార్ట్ డ్రకర్ గీసిన బొమ్మలు తరువాత వచ్చిన బొమ్మల తరాలని గొప్ప ప్రభావితంలో ముంచి తేల్చాయి. ఆయన బొమ్మల భంగిమల్లో, ఆయన క్రో క్విల్ ముంచిన ఇంకులో స్వచ్ఛందంగా మునగని వారు లేరు, ఆయన చిత్రరేఖనలోని సౌందర్యాన్ని పట్టుకుని తేలి మంచి చిత్రకారులుగా వాసికెక్కని వారూ లేరు అన్నంతగా ఉండింది ఒకానొక కాలం. చిత్రకళా చరిత్రలో మార్ట్‌లా గీయగలిగినవాళ్ళు అప్పుడూ లేరు, ఇంకెప్పటికీ రారు. మార్ట్ డ్రకర్ క్రో క్విల్‌తో బొమ్మలు వేసేవారు. క్రో క్విల్‌తో చాలామంది బొమ్మలు వేయగలిగినా మార్ట్ అంత ప్రతిభావంతంగా క్రో క్విల్‌ కలాన్ని తిప్పగలిగినవాడు మాత్రం ఈరోజుకూ ఎవడూ భూమ్మీద అవతరించి ఉండలేదు. మార్చ్ ఇరవైరెండు ఆయన జన్మదిన తారీఖు. ఇదీ మార్చి నెలే కాబట్టి ఒక నెల పేరు చెప్పుకుని ఆయనని ఇష్టంగా తలుచుకోవడం ఒక సందర్చం.

2002 ప్రాంతాల్లో నన్ను దొరకపుచ్చుకుని రచయిత శ్రీరమణ అన్నారు కదా! “బాపుగారు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. సోమాజిగూడలో ఈ-టీవీ ఆఫీస్ ఉంది రమ్మన్నారు, వెళ్ళి కలవండి.” అప్పటికి బాపుగారి పేరుతో తప్పా, మనిషి రూపానా పరిచయమేం లేదు. ఆయన్ని కలవడానికి కాస్త భయం భయంగానే వెళ్ళా. ఫలానా నేను వచ్చాను అని కబురు అందగానే చేతిలో ఒక కాగితాల కట్ట పట్టుకుని డబ్బింగ్ రూమ్ నుండి రివ్వున వచ్చేశారు. నన్ను ఎప్పటినుండో తెలిసి ఉన్నంత నిండుగా, స్నేహంగా నవ్వుతూ ఆ కాగితాలు నా చేతిలో పెట్టి, తలమీద చేయి వేసి దీవించారు. ఆయన నాకు ఇచ్చినవి ఏమిటంటే పాత మ్యాడ్ పత్రికలోని డ్రకర్‌గారి బొమ్మల పేజీలు, ఇచ్చి ఇలా అన్నారు కదా! “ఇది చాలా గొప్ప స్కూల్ అండి, తెల్లవారుజామునే లేచి ఈ బొమ్మలు కళ్ళకద్దుకుని ఉన్నది ఉన్నట్టు ప్రాక్టీస్ చెయ్యండి. ఇది గొప్ప బలం. వీరు మహానుభావులు, మనలాంటి వారికి గురువులు, నేను ఇలా ఇవ్వడం, మీరు అలా పట్టుకుని పోవడం కాదు. నాకు తరుచు హైద్రాబాద్‌లో పని ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు చేసిన ఈ బొమ్మల సాధన నాకు చూపించాలి!”

లెక్కల మాస్టారుగారిలా హెచ్చరించారు కానీ నాకు అంతకు మునుపునుండే మార్ట్ తెలుసుగా! ఆయనకు అతి పెద్ద అభిమానిని నేనుగా! ఆ తెలిసినదల్లా బాపుగారికి చెప్పలా, ఆయనకు ఒక దణ్ణం పెట్టుకుని, ఆ కాగితాలు తెచ్చుకుని, చక్కగా బైండ్ బుక్ చేయించుకుని ఉన్నది ఉన్నట్టుగా, అంతే పేజి కొలతలో మక్కీకి మక్కీ కాపీ చేసేవాణ్ణి. ఆ బొమ్మలు ఒక్కోసారి, చాలాసార్లు కుదిరేవి కాదు. కుదరనపుడు అలానే భోరున ఏడిచేసేవాణ్ణి కూడానూ. అయినా బాపుగారికి మాట ఇచ్చిన ప్రకారం రోజూ ఒక పేజీ సాధన చేసేవాణ్ణి. బాపు అంతటివారు చెప్పగా, డ్రకర్ అంతటివారిని గీయకపోవడమా? నా ప్రపంచంలో నేను హనుమంతుడంతటి శిష్యుణ్ణి. నాకు కలిగిన గురువులు మరెవరికీ లేనంత నా భాగ్యాలు. అలా గీయగా గీయగా గీయగా కూడా మార్ట్ డ్రకర్‌లో ఒక శాతం ఆర్టిస్ట్‌ని కూడా కాలేకపోయా. అవడం, కాకపోవడం కాదు ప్రధానం. మనం మార్ట్ డ్రకర్‌ని దిద్దుకున్నాము, మార్ట్ డ్రకర్‌ని చదువుకున్నాము, మార్ట్ డ్రకర్‌ని సాధన చేశాము. అదే గొప్ప భాగ్యం.

ఇలా ఆదివారం అబిడ్స్‌లో పాత ఎర్రబారిన, దుమ్ముపట్టిపోయిన మార్ట్ డ్రకర్ బొమ్మల పేజీలు కాకుండా, ఒకసారి మార్కెట్‌లోకి మార్ట్ డ్రకర్: ఫైవ్ డికేడ్స్ ఆఫ్ హిస్ కెరీర్ అనే పేద్ద పుస్తకం వచ్చింది. బ్లాక్‌లో మరీ వైట్ మనీ పెట్టి ఆ పుస్తకం కొన్నా. పుస్తకం పేజీ తిప్పగానే మార్ట్ డ్రకర్ ఇంటర్‌వ్యూ ఉంది. ఇలా…

“మార్ట్! బొమ్మల్ని నువ్వు మొదలుపెట్టినదెప్పటినుంచి?”

“నేనా! స్కూల్లో చేరడం కన్నా ఇంకా ముందుగానే.”

“అబ్బా! అంతప్పటినుంచే?”

“ఊహూ! ఉండు, కాదు, కాదు. అప్పుడు కాదు, ఇంకా ముందట్నుంచే, అప్పటికి ఇంక న్యూస్ పేపర్లు పుట్టలేదు, పత్రికల ఊసే లేదు, బహుశా అచ్చు కూడా కనిపెట్టబడలేదు. అప్పట్లో నాకు బలే కష్టంగా వుండేది గుహల్లో గోడల మీద బొమ్మలు వేయడం. అసలు నేను పుట్టింది, గిట్టింది ఎప్పుడని? నేను బొమ్మల కోసం ఎప్పుడూ పుడుతూనే ఉన్నా, గీస్తూ గీస్తూ ముగుస్తూ మళ్ళీ బొమ్మల కోసం పుడుతూనే ఉంటా.”

ఊపిరి స్తంభించిపోలా! రోమాలు నిక్కపొడవలా! మీసాలు మెలివేయ బుద్ది కాలా! వీడు కదా ఆర్టిస్ట్ అంటే, వీడిది కదా మగతనం అంటే! వినయాలు లేవు, దొంగ వేషాలు లేవు, అబ్బే నాకేం చేతనవునండీ అనే నంగి నకరాలు లేవు. బొమ్మలు అట్లే వేశాడు, మాటలు అట్లే చెప్పాడు. సత్యంగా, ఇంత చెప్పాక, ఇట్లా చెప్పాక కూడా మార్ట్ డ్రకర్‌కు కూడా జనన మరణాల తారీఖుల కొలతలు ఉంటాయా? అలా ఉంటాయని భావించి ఇలా వ్యాసాలు గట్రాలు రాయడం తప్పు కాదూ?

మార్ట్ డ్రకర్‌గారిది బలమైన డ్రాయింగ్, సుళ్ళు తిరిగే గట్టి అలవోక గీత. ఎప్పుడయినా పనికట్టుకు ఆయన బొమ్మలని పరిశీలించండి. మార్ట్ డ్రకర్ చాలా గొప్ప కారికేచరిస్ట్. కార్టూన్ డ్రాయింగ్‌లో మైకలాంజిలో అంతటివాడని కదా ఆయన పేరు. ప్రపంచంలో అతి గొప్ప కేరికేచరిస్టులు పదకొండుమంది పేరు చెప్పమంటే అందులో పదిసార్లు మార్ట్ డ్రకర్ పేరే తలుచుకోవాలి.

మ్యాడ్ మాగజైన్‌లో మార్డ్ డ్రకర్ చేసిన ముఖ్యమైన పని ఏమిటంటే ఆ వారం విడుదలై విజయఢంకా మోగించిన ఏ సినిమానయినా చూసి వ్వెవ్వెవ్వె అని వెక్కిరించడమే! రీళ్ళకెక్కిన రెండు గంటల సినిమా మొత్తాన్ని ఉన్నది ఉన్నట్టు వ్యంగ్యరూపంలో బొమ్మల కథగా వేసేవాడు. సినిమాలో ఎంతమంది పాత్రలు ఉంటే వారంతా 360 కోణాల్లో మార్ట్ క్రో క్విల్‌ చివర కార్టూన్ రూపాలై కదిలి వచ్చేవారు. ఒకసారి పికాసో ఒకానొక శ్రీ ధనవంతురాలి పొర్‌ట్రైట్ గీశాట్ట, అది చూచి ఆవిడ ‘ఈ బొమ్మేం నాలా లేద’ని విమర్శించిందట. అందుకు పికాసో తాపీగా ‘బొమ్మ నీలా లేదని ఏం ఫీలవ్వకు, ఏదో ఒక రోజున నువ్వే ఆ బొమ్మలా తయారవుతావులే’ అన్నాట్ట. ఆ మాదిరే 1986 సంవత్సరాల్లో ఎల్. ఎ. లా (L.A. Law) అనే టివి సిరీస్ ఒకటి మొదలయ్యింది. అది చూసి దానికి తాటాకులు కడుతూ మార్ట్ డ్రకర్ ఒక బొమ్మ కట్టారు. మార్ట్ డ్రకర్ గీసిన ఆ బొమ్మని, దానిలోని వెటకారానికి, వ్యంగ నైపుణ్యానికి ముగ్దుడై దాని నిర్మాత స్టీవెన్ బాచ్కో ఆ టివి సిరీస్‌‌లో ప్రధాన పాత్రలు ధరించిన వారినందరినీ ఒకరోజు పిలిపించి మార్ట్ డ్రకర్ తమని ఏ ఏ భంగిమల్లో ఎలా అయితే బొమ్మలు వేశారో ఆయా పోజుల్లోనే, అలానే వారందరిని కూర్చి దానిని ఒక ఫోటో తీసి దానిని మార్ట్ డ్రకర్‌కి, మ్యాడ్ మాగజైన్‌కి కానుకగా పంపారు.

ఒక రాజకీయ నాయకుడి మీదో, ఒక పనికిమాలిన కార్యక్రమం మీదో, ఒక సినిమా మీదో, ఒక తుక్కు కథ మీదో, ఒక చెత్త కవిత మీదో ఒక చిన్న వెటకారం, సునిశితమైన చురక, కాస్తంతంటే కాస్తంత అపహాస్యం చేస్తే ఆ కాస్త కూడా తట్టుకోలేని సెన్స్ ఆఫ్ హ్యూమర్‌లెస్ ప్రపంచంలో ఇట్లా ఒక చిత్రకారుడి బొమ్మలకు జోహార్లు అర్పించేవాళ్ళ గురించి విన్నప్పుడు ముచ్చటగా అనిపించింది. దీనిని వంకగా పెట్టుకుని ఈ నెల మార్ట్ డ్రకర్ పుట్టిన నెలగా చెప్పుకుంటూ ఒక నాలుగు మాటలు రాసినా, నా ఉద్దేశం వెనుక సదాలోచన ఏమిటంటే మీరు మరిన్ని మార్ట్ డ్రకర్ బొమ్మలు చూడాలని, మీకు కాస్త బొమ్మలు గీసే అలవాటు ఉంటే మీ వేళ్ళకు కాసింత మార్ట్ డ్రకర్ బొమ్మలని మప్పాలని, ఆ రకంగా ఇంకా చాలా తరాలు ఆ మహా చిత్రకారుడిని ప్రేమించాలని, ఆరాధించాలని, అలవాటవ్వాలని ఇట్లు నా చిన్న కోరిక.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...