కథలు-గాథలు 1

బొమ్మలపట్ల ఇష్టం, బొమ్మలు వేయడం మీద కాస్త నైపుణ్యం ఉన్నంత మాత్రాన బొమ్మల గురించి రాసేయవచ్చని అనుకోవడము తప్పని నాకు తెలుసు. అయితే ఫలానా రంగంలో చాలాకాలం ఉండి కూడా, జీవితం మొత్తాన్ని అదే జీవితంగా వెళ్ళదీసినవాళ్ళకు, ఆ పనిని అత్యున్నతస్థాయికి తీసుకువెళ్ళినవారికి కూడా తమ వృత్తి గురించి, తాము చేసిన ఆ పని గురించి రాయొచ్చని, రాయాలని తెలీదనుకుంటాను. తెలిసినా ఎందుకులే రాయడం అని బద్దకం కూడానేమోనని అనుకుంటాను. నేను బొమ్మల రంగంలో చాలాకాలంగా ఉంటున్నాను కానీ ఆ కళలో ఉండవలసినంత ప్రతిభ కాని, తెలుసుకోవలసినంత అధ్యయనం కానీ చేసినవాడిని కాను. అలా చేయడానికి తగినంత చదువు, కుదురు, క్షుత్తు నాకు లేకపోయింది. అవేమీ లేకపోయినప్పటికీ చెప్పవలసినది ఒకటి చెప్పి తీరాలి, దానిని ఎలాగోలా రాసి తీరాలి, నేను కాకపోతే ఇక ఇంకెవరూ చేయరేమోనన్న భయం, బెంగ వల్ల కూడా.

లేనిదాని సంగతి సరే, నాకు ఉన్నదల్లా బాల్యం నుండి బొమ్మలపట్ల చాలా ఇష్టం. ఆ చాలా ఇష్టం వలన గాలికి కొట్టుకువచ్చిన కాగితం మీది బొమ్మ దగ్గరినుండి గోడకు అంటించబడిన పెద్ద వాల్ పోస్టర్ మీద చిత్రకళ వరకు కళ్ళప్పగించి చూస్తూ ఉండిన అనుభవాలు కొన్ని, బొమ్మలకు సంబధించిన అనుభవము కాస్త, జ్ఞాపకాలు కొంత, ఇప్పటి ప్రస్తుతంలో ఆచూకీకి కూడా దొరకని ఒకరకమైన వాతావరణంతో నాకున్న పరిచయం. ఆ గత వాతావరణానికి సంబంధించి మిగిలి ఉన్న స్మృతుల అవశేషాలు… ఇవన్నీ తుడిచిపెట్టుకోకపోకముందే, ఏమి రాస్తావు లేద్దూ అనే బద్దకం నన్నూ వచ్చి మింగేయకముందే ఇదిగో ఇలా ఒకసారి వాటన్నిటిని రాసి ఉంచుకోవడం చాలా అవసరం అనిపించి, చెప్పుకుంటున్న కథలూ-గాథలివి.

ఏడవ తరగతిలో బాబూబాషా అని మా క్లాస్‌మేట్ ఉండేవాడు. బహుశా నాకన్నా ఒకటీ రెండు సంవత్సరాలు పెద్దవాడు అవ్వవచ్చు. ఆయనని ‘బాబన్న’ అని పిలిచేవాడిని. ఆయన్న ఒకరోజు స్కూలుకి వస్తూ వస్తూ కూడా కొన్ని డ్రాయింగ్ షీట్లు రోల్ చేసి పట్టుకువచ్చాడు. ఒక నాలుగయిదు బొమ్మలు చిత్రించి ఉన్నాయి ఆ కాగితాల్లో. అవన్నీ సినిమానటుడు చిరంజీవి బొమ్మలే. తలమీద కౌబాయ్ హేట్ పెట్టి, భుజాన తుపాకి పట్టి ఉన్న బొమ్మ ఒకటి, కాస్త ముందుకు ఒంగి రివాల్వర్ పేలుస్తున్నట్టు బొమ్మ మరొకటి, రెండు చేతులా పిస్తోళ్ళు ధరించి జోడు గుళ్ళ మెరుపులు కురిపించే బొమ్మ ఇంకొకటి, ఇవి కాకుండా ఒక రెండు పెన్సిల్ స్కెచ్చులు కూడా. ముందు చెప్పిన తుపాకుల బొమ్మలయితే రంగు పెన్నులతో ప్యాచ్ వర్క్ చేసినవి. మాకు అప్పటికీ థ్రిల్ అనే పదం ఒకటి ఇంగ్లీషులో ఉందని తెలీదు కానీ ఒళ్ళు పులకరించిపోవడమనే భావన బాగా తెలుసు. ఆ బొమ్మలు చూశాక మాకు కలిగిన భావన థ్రిల్లింతే.

ఆ రోజుల్లో మా స్కూలు మొత్తానికి బొమ్మలు వేసేవాళ్ళు ఇద్దరే. నేనొకడు, చలం మరొకడు. కానీ బొమ్మలంటే బాగా ఇష్టపడేవారు బడి యావత్తు పిల్లలు. ఆ చిరంజీవి బొమ్మలు కనుక తమరికి ఇచ్చేసేట్లయితే మా స్కూలు పిల్లలు సమస్తులు ఆ చిత్రకళ పాదాల చెంత తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్దం అన్నంత ఉద్వేగంగా కనపడ్డారు ఆ దినమున. బాబూబాషా చెప్పిన ప్రకారం ఆ బొమ్మలు వేసినది వాళ్ళ బావగారని, ఆయన విజయవాడలో ఉంటారని, ఆయనొక పెయింటరని, సినిమాహాళ్ళ ముందు నిలిపి పెడతారే పెద్దపెద్ద కటవుట్లు ఆయన వాటిని చిత్రిస్తాడని. ఒక సినిమాకు కటవుట్ వేయడానికి ముందుగా బాబూబాషా బావగారివంటి చిత్రకారులు వాటిని రకరకాల ఫోజుల్లో చిన్న బొమ్మలుగా వేసి చూసుకుంటారని, అలా గీసుకున్న చిత్తు బొమ్మలే ఇప్పుడు తను తెచ్చినవని, మాకు సిలబస్‌లో లేని, తెలియని కొత్తపాఠాలు చెప్పాడు బాబన్న. అలా నాకు విజయవాడలో చాలా గొప్ప ఆర్టిస్టులు ఉండి ఉంటారని ఒక ముద్ర తొలిసారిగా ఏర్పడిపోయింది. ఇంకాస్త పెరిగి పెద్దయ్యాక, మా ఊర్లో సైన్‌బోర్డ్ ఆర్టిస్టులూ తతిమ్మాలూ పరిచయం అయ్యాక వాళ్ళూనూ రకరకాల రంగులు, రంగు పొడులు, కుంచెలు కొనడానికి విజయవాడ పోవడం, రావడం అయ్యేది. అలా కూడా విజయవాడ ఒక గొప్ప కళాకేంద్రమేమో అనే నమ్మికో, భ్రమతో కూడా నాకు స్థిరపడిపోయింది. అంతకు మించి విజయవాడ చిత్రకళతో నాకు ఏ విధమైన సంబంధం లేదు.

ఏళ్ళ క్రితం, అంటే పంతొమ్మిది వందల తొంబై నాలుగవ సంవత్సరంలో నేనూ నా ఫ్రెండు మధుసూదన్ రెడ్డి ఇద్దరమూ కలిసి మదరాసు వెళ్ళాము. మదరాసు నగరాన్ని ఒక చూపు చూద్దామని బయట వీధులెంట తిరుగుతుంటే పదిహేడు-పద్దెనిమిది ఏళ్ళ వయసు కుర్రవాడొకడు, ఇంకా తక్కువ వయసు కూడానేమో! ఒక గోడ మీద రాజకీయనాయకుడి పోర్ట్రయిట్ ఒకటి వేస్తూ కనపడ్డాడు. చాలా పెద్ద బొమ్మ అది. అతను చిత్రిస్తున్న కనుగుడ్డు పరిణామమే ఒకటీ రెండు తలకాయల గుండ్రాలకన్నా పెద్దగా ఉంటుంది. సాధారణంగా ఎ-4 సైజు మీద వేసే పోర్ట్రయిట్‌కే నాకంటి జడ్జ్‌మెంట్ చాలదు నాకు. స్కెచ్చు వేస్తున్నప్పుడూ, రంగు పులుముతున్నప్పుడూ ప్రతిసారి బొమ్మని దగ్గరగా ఒకసారి, దూరంగా ప్రతిసారి పెట్టుకుని చూసుకుంటూ బొమ్మ వేసే రకాన్ని నేను. గోడ మీద, అదీనూ అంత పెద్ద గోడ మీద, ముక్కు గోడకు అంటేంత దగ్గరలో కర్రల పైన నిలబడి కన్ను, ముక్కు, మెడ, నుదురు, బుగ్గ, చొక్కా, చొక్కా మడత, గుండీ… ప్రతి డిటెయిల్‌నీ ఒకటీ రెండు ఇంచుల బ్రషుని చేతపట్టి అతను ఎంత ఖచ్చితమైన స్ట్రోక్స్ పెడుతున్నాడో, ఆ కళానైపుణ్యం మాటల్లో చెప్పలేనిది. ఆ రోజు నాకు ఆ గోడ బొమ్మల అబ్బాయి మీద ఎంత ఈర్ష్య, ఎంత కుళ్ళు కలిగిందో చెప్పలేను. ఎంత దుఖం అనిపించిందో చెప్పలేను. ఎన్ని జన్మలెత్తినా, ఎంత సాధన చేసినా నేను ఆ అబ్బాయి వంటి ఆర్టిస్ట్‌ని కాగలనా? ఒక ఆ అబ్బాయి లాంటి మాత్రమే కాదు, తమిళనాట పుట్టిన ఏ అరవ ఆర్టిస్ట్ వంటి అమోఘమైన ఆర్టిస్ట్‌ని అయినా ఎప్పటికీ కాలేను.

ఇందాక విజయవాడలోని గొప్ప ఆర్ట్ అని చెప్పానే, అది అదేమిటో తెలియకుండా, అక్కడి పని చూడకుండా కర్ణాకర్ణిగా విని ఏర్పర్చుకున్న, గుడ్డిగా నమ్మిన అభిప్రాయం మాత్రమే. కానీ తమిళుల చిత్రకళని అక్కడి గోడ మీది ఎంజిఆర్, అన్నాదురై బొమ్మల నుండి, గోడకు కొట్టిన మేకుకు తగిలించిన తంజావూరు సంప్రదాయ చిత్రకళ దగ్గరి నుండి డ్రాయింగ్ రూమ్‌నందు గోడ మీద తగిలించిన కేన్వాస్ చిత్తరువు కింద చేసిన సంతకం కె. జి. సుబ్రమణ్యం నుండి, తమిళనాడు రోడ్ల మీద నడక మొదలయ్యి దేశం యావత్తు రోడ్ల మీద బొమ్మలేసిన రంగురంగు చాక్‌పీసులు పట్టిన రాజన్‌లు, అన్నామలైలు, సెల్వంల వరకు, పత్రికలలో ఇలస్ట్రేషన్లు, కార్టూన్లు, కేరికేచర్లు గీసే అనేకులు, తమిళనాట పుణ్యక్షేత్రాల క్షేత్రమహిమలను బొమ్మలుగా కీర్తిస్తూ వేసిన, పేరు తెలీని, సంతకాలు పోల్చలేని చిత్రకారులు అనేకానేకులు, శివకాశి అనే ఊరిలో కూచుని సమస్త దేశానికంతా ముక్కోటి దేవతల రూపారూపాలను, దివ్య లక్షణాలను పరిచయం చేసిన కొండయ్య రాజు వంటి చిత్రకారుల వరకు అందరూ తమిళవాళ్ళే. మనం మన అనుకునే మన బాపు, మన బుజ్జాయిలు కూడా ఆ తమిళగాలి తగిలి, ఆ తమిళనీరు తాగి, ఆ తమిళ చిత్రకారుల సాంస్కృతిక ప్రేరణ ఒళ్ళంతా పూని మాత్రమే ఆస్థాయి చిత్రకారులయ్యారని కళ్ళు మూసుకుని కాగితం మీద రాసి ఇవ్వవచ్చు.

ఈ రోజుకి దేశం మొత్తానికి అతిగొప్ప ఇలస్ట్రేటర్ ఎవరన్నా, సూపర్ కార్టూనిస్ట్ కౌన్ హై అని ప్రశ్న వేసినా, ఆసమ్! అని ఆశ్చర్యపోదగ్గ కేరికేచర్లు ఎవరి సొంతం అనే ఇరవై అయిదు మార్కుల ప్రశ్నకు జవాబు కావాలి అన్నా, మైండ్ బ్లోయింగ్ అనదగ్గ కామిక్ క్రియేటర్ ఎక్కడున్నాడు అని వెదుక్కోవాలన్నా అన్నిటికీ జవాబు ఒకటే. అతని పేరు బాలమురగన్. మన తమిళుడే. అదే తమిళనాడులో సెంథిల్ కుమార్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. నేను కవిని కాదు కానీ ఇలా మనిషిని కాక, కవినే కనుక నేనయి ఉంటే నా కవితల పుస్తకానికి సెంథిల్‌తో బొమ్మలు వేయించుకుని ఉండేవాడిని. బుర్ర ఏ మూలనుండి ఆ మనిషి ఆ ఆకారాలు పుట్టిస్తాడు? మస్తిష్కపు ఏ ప్యాలెట్ మీద ఆ రంగులు కలుపుతాడు. తలుచుకుంటేనే వళ్ళు పులకించిపోతుందే. ఇదంతా ప్రాంతీయోన్మాదానికి మించిన గొప్ప పిచ్చి, గొప్ప బొమ్మ మీద పూనిన మహా కళావెఱ్ఱి. చిన్నాతనాన జ్వరం వచ్చిందనో, కడుపు నొప్పి కలిగిందనో కారణం చేత డాక్టర్‌గారి క్లినిక్‌కు నన్ను తీసుకుపోతే, అక్కడి పేషంట్ల వరుస మధ్య నా వంతు వచ్చేవరకు కూర్చోవాలి కదా, ఆ సమయంలో నా కళ్ళు ఆ గది గోడలమీద అంటించిన బొద్దు బొద్దు పిల్లల ఆరోగ్యపు బొమ్మల మీద, ఆ బొమ్మల వంటిమీద పూత పూసిన సుతారపు రంగులమీద మాటిమాటికి వాలుతూ ఉండేవి. అప్పుడు తెలీలేదు కాని ఆ బొమ్మలన్నీ తమిళ చిత్రకారుల కలర్ స్కీములే. అవేకాదు ఒకానొక సమయంలో కొత్త సంవత్సరం వచ్చింది అంటే పుంజీలుగా కొత్త క్యాలెండర్లు ఇంటికి దిగేవి. అన్నీ దేవతామూర్తుల బొమ్మలే. అన్నీ పెయింటింగులే, అంతా ఒపేక్ పనితనమే. వ్యాసం ముందులో ప్రస్తావించినట్లు ఆ కటవుట్ కళ వెనుక కథలు కాని, ఈ క్యాలెండర్ల వెనుక గాథలు కానీ నేను తెలుసుకోలేకపోయాను. ఏదోవిధంగా ప్రయత్నించి ఒకసారి దగ్గరుండి అవన్నీ చూడవలసినది. వాటి స్కెచింగ్, కలరింగ్, స్ట్రోక్ పెట్టే విధానం, లైను కట్టే పద్ధతి అవన్నీ తెలుసుకోవలసినది.

అప్పుడప్పుడూ కొన్ని వియత్నమీ సినిమాలలో, పంతొమ్మిది వందల డెబ్భయ్‌లనాటి సినిమా నేపథ్యాలలో, ఆ వాతావరణంలో వీధుల్లో కట్టిన సినిమా బ్యానర్ వర్క్ కనపడుతుంది, చాలా గొప్పగా ఉంటుంది వారి వర్క్. మన రంగులు వేరు, వారి రంగులు వేరు. లేత రంగుల్లో కంటికి ఇంపుగా వారి బ్యానర్ మీది బొమ్మ రెపరెపలాడుతూ ఉంటుంది. హో షియావ్-షియెన్ (Hou Hsiao-hsien) అనే దర్శకుడుగారి డస్ట్ ఇన్ ది విండ్ అనే ఒక సినిమాలో ఒక కుర్రవాడు బజారు సందులో చిన్న స్టూలు మీద కూచుని ఒక బోర్డ్ మీద పెద్ద బొమ్మ వేస్తూ ఉంటాడు. అలాంటి సన్నివేశాలు చూస్తే నా నోట్లో నీళ్ళు ఊరుతాయి. అమాంతం నేను సైతం ఒక పెద్ద ఫ్లాట్ బ్రష్ చేత పట్టుకుని పెద్ద విసుర్లతో బొమ్మ వేయబుద్ది అవుతుంది. అచ్చం వర్డ్స్ అండ్ పిక్చర్స్ సినిమాలో జులియెట్ బినొష్ వేస్తుందే అలా.

ఒకానొక సమయంలో మన ఊళ్ళల్లో వీధి చిత్రకారులు చాలమంది ఉండేవాళ్ళు ఇప్పుడు దాదాపుగా లేరు. అద్దె సైకిళ్ళ వెనుక షాపు పేరు వ్రాసి, సైకిల్ నెంబర్ వేయాలన్నా, డాక్టర్‌గారిదో లాయర్‌గారిదో ఇంటి ముందు తగిలించుకునే నేమ్ ప్లేట్ వ్రాయాలన్నా, డుగుడుగు బండి నెంబర్ ప్లేట్, బస్సు మీద అర్ధ వర్తులాకారపు చెక్క మీద గంగాధర ప్రైవేట్ బస్ సర్వీస్, పాఠశాల గోడ మీద భారతమాత, క్లాత్ ఎంపోరియం ముందు బిన్నీవారి సూట్‌లో జాకీష్రాఫ్, సైన్ బోర్డ్‌ల లెటరింగ్ వర్క్, ఆ అక్షరాల పొరుగునే చూడచక్కని పోర్ట్రయిట్ పెయింటింగ్, అంతా నశించింది. వేయవలసిన బొమ్మ, రాయవలసిన అక్షరం గోడ మీద చిత్రించాల్సి వస్తే అయితే గోడకు ఆనించిన నిచ్చెన మీదో, పెద్ద స్టూల్ మీదో నించుని గంటల తరబడి ఓపిగ్గా నిలబడి రాసే, గీసే కళాకారుడు ఇప్పుడు ఎక్కడా కనపడ్డం లేదు. అదే రాయ గీయ వలసిన బోర్డ్ స్టూడియో‌లో అయితే బోర్డ్ క్రింద మూడు నాలుగు ఇటుకల ఆసరాతో బోర్డ్‌ని తమ దృష్టికి సమాంతరంగా పైకి లేపుకుని దాని మీద ఫిగర్ వర్క్ చేసేవాళ్ళు. చూస్తూ వేయాల్సిన బొమ్మ తాలూకు చిన్న రిఫరెన్స్‌ని ఆ బోర్డ్‌కి ఒక పక్కన అంటించుకుని తదేక దీక్షతో తీక్షణంగా పని చేస్తూనే ఉండేవారు. మధ్య మధ్యలో సిగరెట్టు దమ్ములు లాగుతూ, టీల మీద టీలు పుచ్చుకుంటూ పని నడుస్తూనే ఉండేది. వీరు ఉపయోగించేవి అంతా చాలా మామూలు చవక ఎనామిల్ రంగులే, పిచ్చి బోడి కుంచెలే. కిరసనాయలు, టర్పెంటైనాయిలు పోసి కుంచెలు తుడిచి ఆ మురికికి అట్ట కట్టుకు పోయిన తుడుపుడు గుడ్డలు, నేల మీద సిగరెట్ తుంపులు, ప్లోర్‌పై ఒలికిన టీ మరకలు, వాటన్నిటి మధ్య తళతళ మెరిసిపోయే సరికొత్త సైన్ బోర్డ్. ఆర్టిస్ట్ లేచి వళ్ళు విరుచుకునేవాడు. చేతులు బారుగా చాపి వేళ్ళల్లో వేళ్ళు ఇరికించుకుని పటపటలాడించేవాడు. దారిన పోయే జనం అంతా ఆగి ఆగి ఆ బొమ్మలు చూసి కదిలేవారు. మెచ్చుకోలు మాటలు, చూపుడు బొటనవేళ్ళు కలిపి హస్తాదుల సంజ్ఞలు చేసేవారు. బోర్డు మీద బొమ్మ తమ అభిమాన కథానాయకుడిది అయితే ఇక వారి ఆనందానికి చెప్పనక్కరలేదు.

మా చిన్నాయన ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఒకసారి కృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ పాంచజన్యం పూరిస్తున్న చాలా పెద్ద కాన్వాస్ బొమ్మని, మా ఇంటి నిండుగా పట్టేంత పెద్ద బొమ్మని తెచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు. చాలా నా ఉదయాలు ఆ బొమ్మని చూస్తూ నిద్ర లేచేవి. నీలిరంగు కృష్ణమూర్తి, బుగ్గలు గులాబి, మెడలో ముత్యాలమాల, ఛాతీ మీద కౌస్తుభం, వేళ్ళకు బంగారు ఉంగరాలు, వాటి మెరుపులుగా తెలుపు రంగు చుక్కల హైలెట్స్. నిద్ర లేచిన కాసేపటి వరకు ఆ బొమ్మని అలానే చూస్తూ ఉండేవాడిని నేను. ఆ బొమ్మ తాలూకు మాతృక వేసినది మహా చిత్రకారులు ఈశ్వర్‌గారు. మా ఊరి గోడల మీద ఆయన బొమ్మల పోస్టర్లు చూస్తూ పెరిగాను నేను. ఉమ్మడి కుటుంబం, నర్తనశాల, పాండవ వనవాసం, కదలడు వదలడు… ఇంకా అనేకాలు. నా ఇరవైల వయసుల్లో ఆయన్ని ఒకటీ రెండు సార్లు కలిశాను, మా సీనియర్ చిత్రకారులు రవికిశోర్ అనే గారి దయవల్ల. నా బొమ్మలు చూసి ఈశ్వర్‌గారు, వారి సొదరులు బ్రహ్మానందంగారు ఎంత ఆనందపడ్డారో చెప్పలేను. ఈశ్వర్‌గారు మదరాసుకు తిరిగివెళ్ళి నా బొమ్మల గురించి మెచ్చుకుంటూ ఎంత మంచి ఉత్తరం రాశారో కూడా చెప్పలేను. ఆరోజు ఈశ్వర్‌గారిని నేను కలిసినపుడు ఆయన దగ్గర తన బొమ్మల ఒరిజినళ్ళు చాలా ఉన్నాయి, నన్నెంతో దయగా చూస్తూ ఈ బొమ్మల్లో మీకేవయినా కావాలంటే తీసుకోండి అని కరుణపోయారు. నా చేయి, చూపు చాలా సేపటివరకు కృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ బొమ్మ మీదే ఉంది. అది నా చిన్ననాటి నేస్తుడి బొమ్మ, తీసుకుందామని చాలా ఉండింది. అయితే ఆయన ఆ బొమ్మలు శ్రీ రవికిశోర్‌గారి కోసం తెచ్చినవి. ఆయన భోజనంలో చేయిపెట్టి కొన్ని మెతుకులు కొట్టేయడానికి మనసు ఒప్పలేదు. ఎట్లాగూ పోర్ట్రయిట్‌ల ప్రస్తావన వచ్చింది కాబట్టి అదే దారిలో మిమ్మల్ని ఇంకొంత దూరం తీసుకెడతా.

ఆ 1980ల చివరి రోజుల్లో ఉన్నది ఈరోజు లేనిది, ఇక మరెన్నటికీ కనపడని గొప్ప అనుభవాల్లో ఒకటి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితర ఆ కాలపు సినీ హీరోల పుట్టినరోజులు వచ్చినపుడు, తెలుగువారి పెద్ద పండగలు వచ్చినపుడు మామూలు దినపత్రికలే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలవారి సహకారంతో మామూలు ధరకే ఎక్కువ పేజీలతో ప్రత్యేక సంచికలు వెలవరుస్తూ ఉండేవి. మామూలు రోజులకు భిన్నంగా రెండింతలు, మూడింతల ఎక్కువ పేజీలతో ఆ రోజు పత్రిక వెలువడేది. ఆ ప్రత్యేక సంచికలో సదరు హీరోలవి ఫుల్ పేజీ పోర్ట్రయిట్‌లు, రకరకాల పోజుల పెయింటింగ్స్‌ తోనూ, ఫోటోల తోనూ దినపత్రిక మొత్తం బొమ్మల కొలువులా ఉండేది. ఒక ఆర్టిస్ట్ వేసినట్లు బొమ్మ మరో ఆర్టిస్ట్ వేసేవాడు కాదు. రంగులు పులిమేవాడు కాదు, అక్షరాలు రాసేవాడు కాదు, ఒకరిని మించి ఒకరు బొమ్మని రచించడంలో ఎన్నెన్నో పోకడలు పోయేవారు. ఒకరకంగా ఆ సినీ హీరోల బొమ్మల పత్రికల పేజీలు ఆ తరంలో బొమ్మల పట్ల ఆసక్తి అనురక్తి ఉన్నవారికందరికి అలా గీయడానికి దారులయ్యాయి. ఇప్పుడు అటువంటి నైపుణ్యం, అంత విన్యాసం, ఆ ఆబతో పోర్ట్రయిట్ ఆర్ట్ వేసేవాళ్ళు ఎవరూ లేరు. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి పోర్ట్రయిట్ వెయ్యడానికి రోజులు, వారాలు, నెలలు కూడా పట్టేది. ఆ రోజుల్లో ఫోటోగ్రఫీనే అత్యంత అపురూపం. మరి చేత్తో బొమ్మ వేయడం ఎంత అసాధ్యమైన పనో చెప్పనక్కరలేదు. పోర్ట్రయిట్ నేర్చుకునే సాధన కూడా అంతే కష్టంగా సాగేది రోజుల తరబడి కాగితం మీద పెన్సిల్ గీతలు సర్దుతూ, పోలిక కుదిరింది అని నమ్మకం ఏర్పడగానే పోస్టర్ కలర్ ఆ స్కెచ్ మీద పులుముతూ, కాగితం తడిచి ప్రతిసారి బొమ్మ చినిగిపోయేది. అలా వేసిన బొమ్మే మళ్ళీ మళ్ళీ వేస్తూ ప్రతి బొమ్మ మీద పరీక్ష తప్పుతూ నేర్చుకోవడంలోనే జీవితమంతా క్రుంగి పోతుందేమోనంత భయం వేసేది. ఎన్నిసార్లు వేసినా బొమ్మ కుదిరేది కాదు.

ఆ రోజుల్లో ఊరి మొత్తానికి కూడా ఒకరిద్దరిని మించి మంచి పోర్ట్రయిట్ ఆర్టిస్ట్‌లు ఉండేవారు కాదు. మొనగాడు అనే ఆర్టిస్ట్ జిల్లా మొత్తానికి ఎవరో ఒకరనే పేరు మాత్రమే వినపడేది. గ్రూఫ్ ఫోటోలో బొటనవేలు గోరంత కనపడే మనిషి మొహన్ని భూతద్దంలో చూస్తూ రెండు ఇంటూ ఒకటి అడుగుల పెయింటింగ్ అద్భుతంగా వేసే ఆర్టిస్టులను అమిత ఆశ్చరంతో చూసేవాడిని కర్నూలు జిల్లాలోనే ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, పేరు ఇప్పుడు గుర్తులేదు. ఆయన ఆటోల ముందుభాగంలో పోర్ట్రయిట్స్ వేసేవారు, ఎనామిల్ రంగు బొమ్మని నీటి రంగుల్లో వేసినంత పలుచగా, పనితనంగా చిత్రించేవాడు. మామూలు ప్లాట్ సర్ఫేస్‌పై బొమ్మ వేయడం సులువు, ఆటో ముందు భాగం పుటాకారంగా ఉంటుంది కదా దానిమీద అంత ఫ్రీగా కలరింగ్ చేయడం ఎలా సాధ్యమా అని నాకు తెగజడుపు కలిగేది. ఊళ్ళల్లో రెండు రకాల సైన్ బోర్డ్ ఆర్టిస్ట్‌లు ఉండేవారు. అక్షరాలు బాగా రాయగలిగేవారు, బొమ్మలు బాగా వేసేవాళ్ళు. మా ఊరిలో తిరుమల, చెన్నా అనేవాళ్ళు ఇద్దరు చిత్రకారులది బొమ్మలు వేయడంలో పెద్ద పేరు. తిరుమలగారితో నాకు కాస్త పరిచయం ఉండేది. ఆయన ప్యాలెట్ మీద ఇంత బురద పూసి దానితో కూడా పెయింటింగ్ చేయగలడని ఆయనకు పేరు. ఇక చెన్నా ఆర్ట్స్ వారి పేరు వినడమే తప్పా వారి పని నేనెప్పుడూ చూడలేదు.

నా చిన్నప్పుడు ఒక చందమామ కథ చదివా. ఒకానొక చిత్రకారుడు నదీస్నానానికి వెళ్ళినపుడు ఒక పొడవాటి బంగారు రంగు తలవెంట్రుక అతగాడికి తగిలిందని. అతను తన ఊహాశక్తి అంతా ఉపయోగించి ఆ వెంట్రుక తాలూకు అందగత్తె నిలువెల్ల బొమ్మ చిత్రిస్తే ఆ పురపు రాజుగారి ఒక్కగానొక్క కుమారుడు ఆ బొమ్మలో అమ్మాయిని ప్రేమించి, ఆ పిల్లనే పెళ్ళియాడదలచి వెదుక్కుంటూ వెళ్ళాడని. మనకంత సృజన అక్కర లేదు కాని, కనీసం ఉండవలసిన నిజాయితీ, పని కష్టం కూడా నశించింది. కంప్యూటర్‌లు, మొబైల్‌లు, వాటిల్లో అప్లికేషన్లు వాడి పావుగంటలో అరడజను పోర్ట్రయిట్లు వేసి పడేస్తున్నారు. మొబైల్ అప్లికేషన్లలో ఫోటోలను ఫిల్టర్ చేసి తయారైన బొమ్మల కింద రవ్వంతకూడా అపరాధభావన లేకుండా సంతకాలు చేసే ఒకరకం దొంగ మనుషులు ఆర్టిస్టులము మేమున్నాము అని మీసాలు మెలేస్తున్నారు. ఉన్న కాస్తో కూస్తో బుర్రని పట్టుకు వెళ్ళి కంప్యూటర్ నోట్లో పెట్టేస్తున్నారు. ఆ కంప్యూటర్ డబ్బా ఈ కాలం చిత్రకారుల కాగితాలని, రంగులని, రేఖల్ని, గీతలని, వారి ఊహాశక్తిని వారి మునివేళ్ళని, వాళ్ళ మెదడులని కూడా చప్పరించేసి మూతి చుట్టూ నాలుక కలియతిప్పింది.

(సశేషం)


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...