కంబైన్డ్ స్టడీ

మీరు దానిని మేడ అంటారో, మిద్దిల్లు అంటారో, మిద్దె అంటారో, మరి డాబా అంటారో మీ ఇష్టం. మేము దానిని మాడి అని అంటాము. మా ఇంటి ఎదురుగా ఉండే నా క్లాస్‌మేట్ పుల్లయ్యవాళ్ళది మాడి. మాకున్నవి ఒక కొట్టం, దానికి ఆనుకుని ఉన్న రెండు పెంకుటిళ్ళు. అప్పుడప్పుడూ నేతి బీరకాయలు తెంపడానికి మా కొట్టం మీదికో పెంకుటిళ్ళ మీదికో ఎక్కడమో, పాకడమో చేయాలి కానీ, కొట్టం మీదికెక్కి చదువుకుంటా అని అనరాదు.

అందుకని మాసిక, త్రైమాసిక, అర్ధ, వార్షిక పరీక్షల సమయాల్లో సంవత్సరానికి రెండుసార్లు పుల్లయ్యగాడి మాడిమీద మా కంబైన్డ్ స్టడీ సాగేది. మా అంటే నేను, పుల్లయ్య, ఎర్ర బాషా, తిరుమలరావు, వరప్రసాదులము అన్నమాట. పుల్లయ్యవాళ్ళ మాడికి మెట్లు ఉండేవి కావు, నిచ్చెన వేసుకుని ఎక్కాల్సిందే. పుల్లయ్యవాళ్ళ మాడి అనే కాదు, మా రాయలసీమలో చాలా మిద్దెలకు మెట్లు కట్టబడేవి కావు. మిద్దె వెనుకతట్టున చిన్న రాతి పలకలు కాస్త బయటికి పొడుచుకు వచ్చినట్లు పెట్టేవారు. వాటిని పట్టుకుని ఎక్కవచ్చు. కానీ అది కొంచెం కష్టమైన పనే. అయినా వాటిని పట్టుకుని కొందరు పిల్లలు అలానే చకచకా పైకి ఎక్కేసేవారు. మేము మాత్రం కంబైన్డ్ స్టడీ నిమిత్తం సంవత్సరానికి, ఒకటీ రెండుసార్లు పుల్లయ్యగాడి మిద్దెకి నిచ్చెన తగిలించి పైకి ఎక్కేవాళ్ళం. నలుగురు పిల్లలు, నాలుగు పుస్తకాలు, కాస్త చీకటి కలిస్తే మాత్రమే కంబైన్డ్ స్టడీ కాదనే విషయం మీరు తెలుసుకోవాలి. అదంతా కూలంకషంగా తెలపడమే నా ఈ రాత ఉద్దేశం కూడా.

రాత్రి భోజనాల తరువాత మా చదువు మొదలయ్యేది. అప్పుడప్పుడూ ఆదివారాలు మధ్యాహ్నాలు కూడా. మధ్యాహ్నాలు పర్లేదు వెలుతురయ్య ఎల్లడై ఉన్న సమయం అది. రాత్రి సమయపు లెక్కలు వేరు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో అనవసరమైనది, అవసరానికి మించినదీ ఏది ఉండేది కాదు. రాత్రి చదువుకు వెలుతురు కావాలి అంటే దానికి బల్బు కావాలి, కరెంటు లాగడానికి వైర్ కావాలి, బల్బ్‌కు హోల్డర్ కావాలి, వైరుకు ప్లగ్గు కావాలి, ఒక స్విచ్చు కావాలి. అవి కొనడానికి డబ్బులు కావాలి. ఉన్న నలుగురైదుగురం తలా ఇంత అని వేసుకుని అవన్నీ కొనుక్కుని తెచ్చుకుని బిగించుకుని చదువుకు సిద్దం అయ్యేవాళ్ళం. పుల్లయ్యగాడు వాడి వాటాకు డబ్బులు కాక ఇంటినుండి కరెంటు గుంజి తెచ్చేవాడు. బల్బు వెలిగేది. ఒక పని అయిపోయేది. ఇక చదువు పని మొదలెట్టాలి. దుప్పట్లు, చాపలు, బొంతలు, దిండ్లు, ఒక బ్యాటరీ రేడియో, ఒక టార్చి లైటు, చిన్నడబ్బాలో పప్పు బొరుగులు అందులోకి కొన్ని బూందీ కారాలు – వీటితో పాటు ఏరోజుకారోజు చదువుకోవలసిన సబ్జెక్ట్ పుస్తకాలు కూడా తీసుకుని మిద్దె ఎక్కి చదువుకు ఉపక్రమించేవాళ్ళం. అప్పుడప్పుడూ పుల్లయ్య వాళ్ళ కొట్లోనుండి బెల్లంపాకం బొరుగుముద్దలు పట్టుకుని వచ్చేవాడు, వాటిని కూడా మెక్కేసి, మిద్దె మీది కుండలో చల్లనీళ్ళు తాగేసేవాళ్ళము. ఆ రోజుల్లో ప్లాస్టిక్ సీసాలు కనిపెట్టబడలేదు, అందుకని మాడి మీద ఒక కుండలో నీరు పోసి, దానికో మట్టి మూత కప్పెట్టి మీద ఒక స్టీలు గ్లాసు బోర్లించి ఉంచేవాళ్ళం.

అదంతా హైస్కూలు రోజులు. మా చదువు చాలామటుకు బట్టీ కొట్టుడే. మిద్దె మీద తలా ఒక మూల చేరిపోయి గడగడా చదువుకుంటూ, చదువుకున్నదాన్ని ఒకళ్ళకొకళ్ళం అప్పచెప్పుకుంటూ, మధ్యలో ధార ఆగిపోయి, ఊహూఁ, ఊహూఁ అని తల అడ్డంగా ఆడించుకుంటా… ‘ప్లీస్ రా కొంచెం అందించరా’ అని దీనంగా చూస్తే ఎదుటివాడు ‘మ’ అని మాత్రం అని గమ్మున ఉండేవాడు. అప్పుడు మధువైరిఁ దవిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు అని ఊపిరి తీసుకోకుండా ఆ బట్టీయాన్ని పలికేసి ఆ తరువాతే ఊపిరి తీసుకునేవాళ్ళము.

ఆ విధంగా కాంచిపురముననొకడు కాంచనగుప్తుడను వైశ్యుడి దగ్గరి నుండి, వాటర్‌లూ యుద్దాలు, చిరపుంజిలో వర్షపాతము, గర్జించే నలభైలు, తళ్ళికోట చరిత్ర, గణిత సూత్రాలు, బీజీయ సమాసాలు, ఐ లే ఇన్ సారో డీప్ డిస్ట్రెస్స్డ్, మై గ్రీఫ్ ఏ ప్రౌడ్ మ్యాన్ హర్డ్, హిజ్ లుక్స్ వర్ కోల్డ్, హి గేవ్ మీ గోల్డ్… అనే శబ్ద పాండిత్యాన్ని బట్టీప్రవాహంలా ఒకళ్ళమీదికి ఒకళ్ళము ప్రవహింపజేసుకునేవాళ్ళము. ఆ రోజుల్లో అప్పుడప్పుడూ రేడియోలో సంక్షిప్త శబ్దచిత్రాలు వస్తూ ఉండేవి. నిలయంలో సమయం రాగానే పుస్తకాలు మూసేసి చెవులు తెరుచుకుని అంతా మౌనంగా ఆ రేడియో కథ అంతా శ్రద్దగా వినేవాళ్ళం. అప్పుడప్పుడూ పెద్దవాళ్ళు తనిఖీకి పైకి వచ్చేవాళ్ళు, అందరమూ గమ్మున చదువుతూ ఉంటే వాళ్ళూనూ గమ్మున దిగిపోయేవాళ్ళు. కబుర్లలో ఉంటే మాత్రం ‘రేయ్’ అని ఒక హెచ్చరిక అరిచేవాళ్ళు. ఆ రోజుల్లో ఎవరి తలిదండ్రులకైనా తమ పిల్లలనే కాదు, ఎవరి పిల్లవాడిని అయినా, ర్యాయ్ అనడానికి, థాయ్ అనడానికి, నాయాల అనడానికి, మాట వలన పనికాకపోతే చేయెత్తి ఒక దెబ్బ వేయడానికి కూడా అధికారం ఉండేది. ఈ రోజుల్లో మా పిన్ని తన మనవరాలిని ఒసేయ్ అని పిలిచినందుకే ఆ పిల్ల పుట్టెడు దుఃఖంతో చలించిపోవడం చూశాను నేను.

సరేలే! మన ప్రెండ్ బాషావాళ్ళ నాయన అయినా మన నేస్తుడు శంకర్‌గాడి మామ అయినా అంతా మనకు తెలిసినవాళ్ళే, మన ఇంటి పక్కవాళ్ళే కాబట్టి వాళ్ళు ఒక తులువ మాట అన్నా పడి ఉంటాము అనుకోవచ్చు. అప్పుడప్పుడూ మనం మన గేరి కాని గేరిలో, మన వీధి కాని వీధిలో ఎవడితోనో పోట్లాట పెట్టుకుని కొట్టుకుంటూ, గిచ్చుకుంటూ, కొరుక్కుంటూ, జుత్తులు జుత్తులు పట్టుకుని పీక్కుంటా ఉంటామా! మధ్యలో ఎప్పుడూ ఎరుగని ఒక పెద్ద మనిషి వచ్చి ఫట్ ఫటామని ఇద్దరికి రెండు చెంపదెబ్బలు వేసి తరిమేసేవాడు. అతగాడికి మనల్ని తన్నడానికి ఒక హక్కు ఉన్నట్లు, అతగాడి దెబ్బలు తినడం మన బాధ్యత అయినట్లు అమాయకంగా దొర్లిపోయింది ఆ కాలం. ఇప్పుడు ఆ పెద్దరికపు జనాభా అంతా అంతరించిపోయినట్లుంది. చొక్కా చేతులు పైకి మడిచి గిచ్చుకుంటూ, కొరుకుతూ, జుత్తు పీక్కుంటూ కొట్లాడి, కొట్లాట అనంతరం ఓడిపోయిన దద్దమ్మ పిల్లాడు ఏడుచుకుంటూ ‘దమ్ముంటే మా ఇంటి సైడుకు రారా దుబ్బోడా, మా అవ్వకు చెబుతా’ అని బెదిరించే పిల్లలు కూడా ఇప్పుడు పెద్దగా ఉన్నట్టు లేరు. పిల్లలంతా మర్యాదస్తులు అయిపోయారు. రోడ్డు మీద ఎవడూ తన్నుకోవడం కనపడ్డంలేదు.

సరే! అలా పుల్లయ్యవాళ్ళ మాడి మీద హైస్కూలు పాసయ్యి పోయి ఇంటర్మీడియట్లో బాలాజీ కాలేజీ చేరేసరికి నేస్తులు కూడా మారిపోయారు. శేనాగాడు, రవి, నాగేషు, సుబ్బన్న అనే తదితరులు నందవరం అనే ఊరినుండి వచ్చి మా నూనెపల్లె కొలింపేటలోని ఒక ఇంటి మిద్దె మీది గదిలో ఉండసాగారు. అప్పటికి కాలం కాస్త మారింది. మా ఊరి మిద్దెలకు మెట్లు వచ్చినాయి. లోకల్ పీపుల్స్‌మి అయిన నేను, శేఖర్, మాభుగాడు, మధు అప్పుడప్పుడూ శేనాగాడి రూమ్‌లోకి పోయి అక్కడే కంబైన్డ్ స్టడీ చేసేవాళ్ళము. ఆ రోజుల్లో శేనాగాడు అనే శేషశయనారెడ్డి కిలోమీటర్ల పొడుగు ఉండే ఇంగ్లీష్ స్టోరీలు బట్టీపట్టడానికి ఒక సూత్రం కనిపెట్టినాడు. ఆ రోజుల్లో అంటే పందొమ్మిదివందల తొంభైలలో విడుదలయిన సినిమాలలోని హిట్టుపాటల రాగ చాయల్లో, స్వరాల్లో పాఠాలు పాడుకునేవాళ్ళము. అక్షరం పొల్లు పోకుండా పాట అంతా నోటికి వచ్చేసేది, సారీ, పాఠం పలికేసేది.

అప్పుడప్పుడే వయసు మొదలవుతున్న రోజులు. చదువుకు తక్కువ సమయం – గిదువుకు ఎక్కువ కాలం అవసరమైన కాలం. కాబట్టి ఆ రోజుల చదువుకు అవసరమైన, సంబంధించిన, గుర్తుంచుకోదగిన పెద్ద జ్ఞాపకాలు ఏమీ లేవు నాకు. అలా పెరుగుతూ, పెరుగుతూ, పెద్దవుతూ, ఎద్దవుతూ, ఉన్న ఇల్లు, పెరిగిన వాడ దాటి చాలా చాలా దూరంలో ఉండే ఆత్మకూరు బస్టాండు దగ్గర మూడవరకం కంబైన్డ్ స్టడీ మొదలయ్యింది. ఇక్కడో తమాషా చూడండి. నాకు ఈ రోజుకూ బడిలో, హైస్కూలులో, ఇంటర్మీడియట్‌లో చదువుకున్న కొన్ని పాఠాలు, వాటి పేర్లు మతికి ఉన్నాయి కాని, డిగ్రీ రోజుల్లో ఏమి చదువుకున్నానో, ఎవరు నా నేస్తులో ఒక్కరి పేర్లూ గుర్తులేదు. గుర్తు ఉన్నదల్లా మా కాలేజీ లైబ్రరిలో కూర్చుని శ్రీశ్రీగారి మహాప్రస్థానాన్ని మొత్తం నా నోటు బుక్కులోకి ఎక్కించుకున్నది మాత్రమే. అలా ఏడ్చింది చివరి రోజుల్లో నా చదువు.

డిగ్రీ రోజుల్లో శేఖర్‌వాళ్ళ మిద్దె మీద, ఇంకా అక్కడి నుండి దూరంగా చెరువుకట్ట పంప్‌హౌస్ చెట్ల నీడల్లోకి కంబైన్డ్ స్టడీకి వెళ్ళేవాళ్ళము. తెచ్చుకున్న అన్నాల క్యారియర్‌లలోని, అన్నం, కూరలు అంతా ఒకచోట కుంభం పోసి మధుగాడు అంతటిని కలగలిపి ఇక తినమనేవాడు. దానికి వాడు చాకలి కూడు అని పేరు పెట్టాడు. భలే రుచిగా ఉండేది ఆ అన్నపు రాశి. అన్నాలు తినేసి, పొడుగ్గా ఉండే మెంథాల్ సిగరెట్లు ఊదేసి, చేతికి అందిన జామ ఆకులు నమిలేసి మళ్ళీ చదువుకు సిద్ధం అయ్యేవాళ్ళం. మా నూనెపల్లెలో, మా ఇంటి ఎదురుగానే చాలా పెద్ద మార్కెట్ యార్డ్ ఉండేది, దాని నిండా పెద్ద పెద్ద చింత మానులు ఉండేవి. ఇక్కడయితే విద్యార్థులు విచిత్రంగా చెట్లు ఎక్కి కొమ్మల్లో కూర్చుని చదువుకునే వాళ్ళు, నేను అంతగా మార్కెట్ యార్డ్ ఖాతాదారుణ్ణి కాను. అంటే అక్కడ చదువుకునేవాళ్ళలో మన ఫ్రెండ్ సర్కిల్ ఏమీ ఉండేది కాదని అర్థం.

ఉదయాలు ఎక్కడెక్కడ తిరిగినా రాత్రిళ్ళు మాత్రం శేఖర్ అనే మిత్రుడి ఇంటి మిద్దె మీదే మా వ్యవహారం నడిచేది. మా అంటే శేఖర్, మాభూ, మధు, అజీమ్, సిద్ధికి, శేనా ఇంకా నేనూ. రాత్రి పూట కంబైన్డ్ స్టడీలో చదువు తప్పా అంతా నడిచేది. నేనయితే మరీ అన్యాయంగా రేపు పరీక్ష అంటే దాని తాలూకు పుస్తకం ఆ ముందు రాత్రి తెరిచేవాడిని. పరీక్షల రోజులు తప్పించి మిగతా సంవత్సరమంతా ‘పచ్చని పచ్చికల మధ్య, విచ్చిన తోటల మధ్య, వెచ్చని స్వప్నాల మధ్య, మచ్చికపడని పావురాల మధ్య, పరువానికి వచ్చిన ఆడపిల్లల మధ్య, పరుగెత్తే నిర్ఘరుల మధ్య, తెరలెత్తే మునుమాపుల మధ్య’ జీవితమై, తిలక్‌ని చదువుకుంటూ. వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు ఎక్కడున్నారో వెదుక్కోడానికి వీధులు వీధులు తిరుగుతూ ఆ వీధిలో ఆ అమ్మాయిల తాలూకు శత్రువులు ఎదురయినపుడు ఎదుర్కోడానికి కండల పైకి చొక్కా చేతులు మడవడానికే సరిపోయేది. ఉదయం ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా సాయంత్రం కాగానే రాత్రంతా బాగా చదవాలని ఒకరికొకరం ప్రమాణాలు చేసుకుని మిద్దె మీదకి చేరేవాళ్ళం. పుస్తకాలు ఇక తెరుద్దాము అనుకుంటుండగానే కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళి పాతబడిన జంటలు కూడా వారి వారి మేడల మీదికి దిండూ పరుపులతో సహా ఎక్కేవారు. వారికి మేము కనపడేవాళ్ళం కాదు. వాళ్ళు మాకు కనపడేవారు. మాకు అప్పటికి అంతగా తెలియని పరకాయ ప్రవేశవిద్య ఒకటి వారు సాధన చేస్తూ ఉండేవారు. దానివలన చదువు భంగం అయ్యేది. విశ్వామిత్రుడికీ దూర్వాసుడికీ కూడా ఎదురవ్వని అనుభవాలు మావి. సామూహిక తపోభంగం తర్వాత ఇలా కుదరదని అందరమూ లేచి చెప్పులు తొడుక్కుని, ఊరి సెంటర్‌లో జావేద్ టీ స్టాల్‌లో టీ తాగి వద్దాము పదరా అని బయలుదేరేవాళ్ళము.

మీరెప్పుడయినా నంద్యాల జావేద్ టీ స్టాల్‌లో టీ తాగి ఎరుగుదురా? అక్కడ గులాబ్ జామ్ తిని, చివరన పెట్టే కాసింత కారంబూందీ తిని టీ తాగి చూడండి. అదేమీ చేయకపోవడం వల్లనే సుదర్శన్ ఫాకిర్ అనే ఒక పాటల రచయిత ‘వో కాగజ్ కి కష్తి, వో బారిష్‌ క పానీ’ అనే రసహీనమైన గౙల్ రాయగలిగాడు. నేషనల్ థియేటర్ దగ్గర హర్యానా జిలేబీ, చంద్రశేఖర్ థియేటర్ దగ్గర చల్లని లస్సి, సాయిబాబా గుడి దగ్గర మిర్చీ బజ్జి, మునిసిపల్ హైస్కూల్ ఎదురుగా మసాలా దోశ, రెవెన్యూ క్వార్టర్స్ మొగదలలో బండి మీద కట్ మిర్చి, ఎగ్ బజ్జి, గుర్రాల షెడ్డు దగ్గర ఉర్లగడ్డ కూరా చిప్సూ, ఇవన్నీ సృష్టిలోకెల్లా ఎంత అందమైన మాటలో మీరెరుగరు. ఇలాంటి అందమైన పేర్లున్న చిరుతిండి తినుకుంటూ, అందమైన అమ్మాయిల ఇళ్ళు ఉండే సందుల దగ్గర దండాలు పెట్టుకుంటూ వెనక్కి వచ్చి ఈ రోజంతా ఇలా అయింది కానీ రేపటి నుండి ఖచ్చితంగా ఏ దిక్కులు చూడకుండా దిక్కు దిక్కునా అడ్డంపడి నడవకుండా బాగా చదువుకుందామని, కనీసం కలెక్టర్లమైపోదామని ఎవరికీ వాళ్ళమే నిర్ణయమై పోయి నిద్రపోయేవాళ్ళం. అదేమిటో కానీ ఆ రోజుల్లో ప్రతిరోజూ మా క్యాలెండర్లలో ప్రతి రోజూ అదే రోజు తిరిగి తిరిగి వచ్చేది. మళ్ళీ మేడ మీదికి జంటలు వచ్చి వాలేవి. భాగ్యరాజా సినిమా చిన్నరాజా లోని ‘మంచమైతే చప్పుడౌనని’ అనే పాటే మనసులో మోతెత్తేది, జావేద్ హోటల్ దాకా నడక సాగేదీ. మేము ఎదురు చూసిన ఆ రేపు మరెప్పుడూ రాలేదు. రాకపోవడమే బావున్నట్టుగా ఉంది. ఆ అప్దేట్ అనే డేట్ కుదరకపోవడం వలన ఈ రోజుకు మా స్నేహితులందరం, ఫోనులు చేసుకోవడానికి, కబుర్లాడుకోవడానికి మాకు ఇంకా చాలా వ్యవహారాలు మిగిలి ఉన్నాయి. దయ్యాలకు కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయట. నావంటి గతచింతలు పడే మానవుడి కాళ్ళు ముందుకే ఉన్నా కళ్ళు, ముక్కు, వాక్కు, మనసు, ఆత్మ వెనక్కి చూస్తూనే ఉన్నాయి.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...