మోహన రాగ మహా!

దినపత్రికలు తిరగేసేవారికి, సాహిత్యపు పుస్తకాల అభిరుచి ఉన్నవారికి, ఆయనతో మాటామాటా కలిపినవారికి, భుజం భుజం కలిపి నడిచినవాళ్ళకి వీళ్ళకీ తెలిసిన మోహన్ అంటే తెలుగు జాతి తొలి అనిమేటర్లలో ఒకరు; మన పొలిటికల్ కార్టూన్‌ని, ఇక్కడి వామపక్ష పోస్టర్‌ని నిప్పుల కక్కించినవారిలో ఒకే ఒకరు; రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, కళారంగాలపై విమర్శనాత్మక విచక్షణాత్మక సాధికారికత గల రచన, చిత్ర రచన రెంటిని ప్రతిభావంతంగా చేసిన చేయగలిగిన అతనొక్కడే మాత్రమే. మోహన్ తాలూకూ కార్టూన్లు, కారికేచర్లు, కథలకు బొమ్మలు, కదిలే బొమ్మలు మాత్రమే తెలిసిన వారికి ఆయన పెన్సిల్ ములుకుకు మానవ శరీర భాష అత్యంత సుందరంగా తెలుసని, ఆయనకు తెలిసినంతగా పెన్సిల్ అంచును నిర్దాక్షిణ్యంగా మానవ శరీరంపై కవాతు చేయించడం మా తెలుగు బొమ్మల కాలంలో మరెవరికీ తెలియదని తెలియదు!

చాలా యేళ్ళ క్రితం తన పొడవాటి వేళ్ళ మధ్య సుతారంగా నిలిచిన పెన్సిల్ సుకుమార హృదయాన్ని నుసి చేస్తూ కొన్ని వందల బొమ్మలని శృంగార వచనంగా గీశారని ఆ గీసిన దానినల్లా కవిఁలె కట్టగా ఓ మూలలో పడేశారని, ఆ మూలలోని బొమ్మలన్నీ ఏమయ్యాయో, ఏమై ఉంటాయో తెలియని ఒక కథ చెబుతా.

తను ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడో ఆయన చెప్పలేదు, నేనూ అడగలేదు. అది 1997 సంవత్సరపు రోజులు. అంత ఉదయాన్నే మోహన్‌గారి స్టూడియోకు అందరికన్నా ముందుగా ఫూలన్ దేవి వస్తుంది. ఫూలన్ దేవి అసలు పేరు ఏమిటో నాకే కాదు అక్కడికి వచ్చేవారికి ఎవరికీ పట్టలేదు అనుకుంటాను. ఆవిడ వచ్చి ఆమూలా ఈమూలా ఊడ్చి, ఉన్న అరడజను టీ కప్పులు, టీ ప్లాస్కు తోమి, టేబుళ్ళు, కుర్చీలు తుడిచి వెళ్ళిపోతుంది. నేను ఆ రోజుల్లో శంషాబాద్‌లో ఉండేవాడిని, శంషాబాద్ పొస్ట్ ఆఫీసు ఎదురుగా రోజూ ఏడు గంటలకు ఒక బస్సు హైద్రాబాదుకు బయలుదేరుతుంది. అది స్టార్టింగ్ పాయింట్. బస్సు అక్కడ ఎక్కితే హాయి, కూర్చోడానికి సీటు దొరుకుతుంది. ఎనిమిది గంటలకల్లా అఫ్జల్ గంజ్‌లో దిగుతా, ఎనిమిదిన్నరకు కాస్త అటుగా రెడ్ హిల్స్ లోని మోహన్‌గారి స్టూడియో చేరుకోవచ్చు.

దాదాపుగా ఫూలన్ దేవిగారి తరువాత నేను, నా తరువాత మోహన్‌గారు ఆఫీసులో అడుగుపెట్టేవాళ్ళం. ఒక ఉదయాన మేమిద్దరమే ఉన్న రోజున తన టేబుల్ అడుగు నుండి ఒక ప్యాకెట్ తీసి నా ముందు పడేశారు. “ఒకసారి ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చిందబ్బా, రోజంతా హోటల్ రూమ్‌లో ఖాళీగా ఉంటున్నాను, ఏమీ తోచలేదు, చేతిలో పుస్తకాలు కూడా లేవు. ఉన్న ఆ రెండు రోజులు ఈ బొమ్మలు గీశాను” అన్నాడు. దాదాపు వందకు తక్కువ ఉండవు ఆ కాగితాలు. ఏదో పుస్తకాన్ని జిరాక్స్ తీసిన కాగితాలు అవి. ఒకవైపు మేటర్, మరోవైపు ఖాళీ. ఆ ఖాళీ వైపున బొమ్మలు గీసి ఉన్నాయి, కొన్నిటిలో పేజీకి ఒకటి, కొన్నిటిలో పేజీకి మూడూ నాలుగు కూడా. అన్నీ శృంగార భంగిమలే. కూచున్న, పడుకున్న, నిలబడ్డ, ఎత్తుకున్న, సోలిన, వాలిన, పేలిన కామకేళి విన్యాసాలే ఆ బొమ్మలు. వాత్సాయనుడు కూడా కనిపెట్టలేని సూత్రాలన్నిటిని మోహన్‌గారి పెన్సిల్ పని పట్టింది. వాటిని చూడటానికి ముందస్తుగా నాకు సిగ్గేసింది. మా నాయన లాంటి వాడు కదా మోహన్‌గారు. ఆయనే ఒకసారి అన్నారు అప్పుడు కాదు, తరువాతి కాలంలో. “ఇక్కడ ఒక రోజు వస్తుందబ్బా! ఇంట్లో తండ్రి కొడుకు కలిసి కూచుని పోర్న్ చూస్తారు, చూస్తూ ఉండు.” ఇంటర్‌నెట్ జీవితంలో భాగం అయ్యాక, నట్టింట్లోకి ఒటిటిలు కిటికీలు తెరుచుకుని వచ్చి అందరి ముందు మగ జిప్పులు, ఆడ హుక్కుల బీగాలు తెరవడం మొదలయ్యాక, ఇక పద్దతులు, మర్యాదలు, పెద్దంతరం, చిన్నంతరం, సంబంధబాంధవ్యాలు లేవు. అది ఆడ, వీడు మగ అంతే. రెండే జంతు జాతులు.

పెద్దాయన ఎదుట మొదట ఆ బొమ్మలు చూడటానికి లజ్జ చెందినా, ఒకే ఒక రేఖ విదిలింపుతో ఏర్పడ్డ వంపులు, ఆ శరీరం, అంత పటిమ, ఆ కూర్పు, అనాటమీని ఎంతగానో సాధన చేసిన చూపుడువేలు నరంతో పాటుగా ఊపిరితిత్తుల లోనికి ఉచ్ఛ్వాసంగా గ్రహించకపోతే ఒక ఆర్టిస్ట్‌కి శరీర నిర్మాణం అంతగా ఎట్లా పట్టుబడుతుంది? స్టయలైజ్‌డ్ క్లాసిక్స్ ఆ బొమ్మలు, అనితరసులభము ఆ బొమ్మలు మరెవరికైనానూ. చాలామంది బొమ్మల ప్రేమికులకు తెలుగు పత్రికల్లో ఆర్టిస్ట్ చంద్రగారి అనాటమీ మీద మక్కువ ఎక్కువ. ముఖ్యంగా రెంటాల గోపాలకృష్ణగారి వాత్సాయన కామసూత్రాలు పుస్తకానికి ఆయన వేసిన భంగిమలు చూశాక మరెవరూ అలా వేయలేరు అనుకుంటారు. నిజానికి ఆ రియలిస్టిక్ ఆడా మగా పోజుల కన్నా, ఆయన అదే పుస్తకంలో జానపద శైలిలో వేసిన రతి బంధాలు, ఆ గీతలు, ఎర్రమన్ను రంగు డిజైన్లు మహాద్భుతంగా ఉంటాయి. ప్రపంచం కళ్ళు చూడని ఎన్ని వందల, వేల డ్రాయింగులు వేశాడు చంద్రగారు? అవన్నీ ఏమయిపోయాయి?

ఏ లింగబేధమూ పట్టని తన కుంచెతో మానవశరీరాన్ని ఇంకు గీతలుగా చెక్కిన మహా మహా చంద్రగారితో ఒకసారి అన్నాను కదా, “ఇలాంటి బొమ్మలు వేయడంలో మీరు గొప్ప అని అందరూ అంటారు కానీ, ఎరోటికాని బొమ్మ కట్టడంలో మోహన్ గారి తరువాతే ఎవరైనా.” పెద్దల ముందు ఎలా మాట్లాడకూడదో తెలియని తెంపరి మాటల ప్రాయం అది, పిచ్చి పోలికలు చూసే వయసది. నా మాటకు చంద్రగారికి కోపం వచ్చింది. అయినా తమాయించుకుని “అంత గొప్పగా వేస్తే మరి ఎప్పుడూ చూపించడే?” అన్నారు. ఏమో, ఎందుకు చూపించడో ఏం తెలుస్తుంది. నాకు, నా వంటి మరో నలుగురు అయిదుగురికి మాత్రమే ఎందుకు చూపించాడో కూడా నాకేమని తెలుస్తుంది? ఈ బొమ్మలు వేసిన చాలా కాలం తరువాత ఒకసారి ఆయనతో అన్నా “మీరు వేసిన న్యూడ్స్ ఉన్నాయి కదా, వాటిని బాపుగారికి పంపిద్దాం అనుకుంటున్నా” ఆయన అమాంతం కంగారుపడిపోయాడు. మోహన్ అంటే ఎప్పుడూ ఆ ఎర్ర బొమ్మలు, ఈ వంకర బొమ్మలేనా, ముళ్ళపూడిగారు చెప్పినట్లు బీరు, బ్రాంది, రమ్ముల కన్నా కిక్కెక్కువిచ్చు రొమ్ముల… “ఒద్దబ్బా! అట్లాంటి పరువు తక్కువ పనులు చెయ్యబాక” అన్నాడు. “అట్లా కాదండి, ఆయన చూసి థ్రిల్లయిపోతారు.” “ఛ! ఛ! వద్దబ్బా! వద్దు!” ఏం చెప్పినా ఆ బొమ్మలు బాపుగారి వరకు చేరడానికి మోహన్‌గారు అసలు ఒప్పుకోలేదు.

ఆ బొమ్మల పొత్తిని చాలాకాలం నా దగ్గర దాచిపెట్టా. దాచిపెట్టా అంటే నిజంగానే దాచిపెట్టా. దాచిపెట్టడమనేదానికి ఇంకో రకం ఉంటుంది. నేనెవరికయినా బొమ్మలేస్తా కదా. ఆ వాళ్ళల్లో ఒక రకం వాడులు ఉంటారు. వారు మనకి డబ్బులు ఇవ్వరు, అలా అని ఇవ్వము అని కూడా అనరు. ఎప్పుడు డబ్బుల ప్రస్తావన తెచ్చినా “డబ్బులెక్కడికి పోతాయి సర్? నా దగ్గర ఉంటే, మీ డబ్బులు బ్యాంక్‌లో ఉన్నట్టే” అనే రకము. నేను ఆ బొమ్మలని అలా దాచిపెట్టిన రకాన్ని కాదు. ఆ బొమ్మలన్నీ ఎప్పటికీ మోహన్‌గారి సొత్తే. అవన్నీ ఆయన సమగ్ర చిత్రకళా రచన వంటి ఒక పుస్తకంలో రావాలి అని నా గట్టి కోరిక. అయితే ఆయన ఈ రోజు ఉదయం ఒక ఇంట్లోకి అద్దెకి దిగారనుకో, మరుసటి రోజు అదే ఇంట్లో ఉంటారనే నమ్మకం లేదు. ఓనర్ కాస్త గట్టివాడయితే ఉదయం అద్దెకు ఇచ్చిన ఇల్లు సాయంత్రానికే ఖాళీ చేయించేస్తాడు. ఇట్లా ఆ ఇల్లు, ఈ ఇల్లు మారుతూ ఉన్నప్పుడు ఆ బొమ్మలు గాలికి లేచిపోతాయి అని ఒక ముందుచూపుతో ఈ విలువైన బొమ్మలని నా దగ్గరే దాచి ఉంచా. ఒకానొక సమయంలో ఇక మోహన్‌గారికీ మనకూ కుదరదు, నడవదు, పడదు అని గట్టిగా అనుకున్న రోజు వచ్చినపుడు మా ఇంటికి వచ్చిన కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌కి నా వద్ద ఉన్న మోహన్‌గారి ప్రతి బొమ్మ, చిన్న కాగితపు ముక్క వరకు సమస్తాన్ని కట్ట కట్టి “నా దగ్గర ఉన్న మోహన్‌గారి సొత్తు ఇదే, మొత్తం వెనక్కి పంపిస్తున్నానని చెప్పు” అనేసి ఇచ్చి పంపా. శంకర్ అదంతా పట్టుకువెళ్ళి మోహన్‌గారికి అప్పగించేసి నేను చెప్పిన చివరి ముక్క కూడా ఒబీడియంట్‌గా ఒప్పచెప్పానన్నాడు.

ఇది జరిగిన తరువాత జరిగిన సంగతి ఏమిటయ్యా అంటే, ఆ రోజు రాత్రో, మరో ఏ రాత్రో మోహన్‌గారు మరియూ ఆయన పరిజనం అంతా కూచుని మంచి చెబ్బర, కష్టం సుఖం మాట్లాడుకునే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయాన, ఆ మూలన పడి ఉన్న ఈ శృంగార రేఖల కవిఁలె కట్టను ఏమిటా అని పరామర్శించిన మోహన్‌గారి ప్రియశిష్యుడు పాండు వాటిని దొరకపుచ్చుకున్న ఆనందోత్సాహలతో, ఈ బొమ్మలన్ని ఎట్లా పోయాయి, మళ్ళీ ఎట్లా వచ్చాయి అనే కథనంతా కబుర్లుగా చెప్పుకోని ఇకపై అవన్నీ తనవే అని ప్రకటించుకుని రాత్రికి రాత్రే ఇంటికి పట్టికెళ్ళిపోయాడుట. ఇదంతా పాండూనే నాకు చెబుతూ ‘ఆ బొమ్మలు నా వద్దే ఉన్నాయి గురూ’ అన్నాడు. బొమ్మలు అట్లా పోవడం కాస్త గుచ్చుకున్నట్టు అనిపించినా, మోహన్‌నే వద్దు అనుకున్నపుడు ఆయన బొమ్మలతో మనకేమిరా పని అనుకుని ఊరికే ఉండిపోయా. ఆ తరువాత కొన్ని రోజులకు ఒక మంచి నిద్దరలో ఆర్టిస్ట్ పాండు చనిపోయాడు. ఆ మరుసటి రోజే పాండూని హైద్రాబాదు నుండి దూరాన ఎక్కడికో తీసుకుపోయి అంతిమకార్యక్రమాలు ముగించారు.

మీరు ఎంత పెద్ద సాహితీవేత్తవయినా, గొప్ప చిత్ర కళాకారుడివయినా తను సంపాదించుకున్న పుస్తకాలు, నలిగిన కుంచెలు, అరిగిన పెన్నులు, జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వేసుకున్న బొమ్మల కలెక్షన్ ఎక్కడా అని వెతికిపట్టండి. మహా అయితే ఒకటీ అరా పుస్తకాలు సెకండ్ హేండ్ పుస్తకాల షాపుల్లోనో, పేవ్‌మెంట్ల మీదో దొరకవచ్చు. బొమ్మలు మాత్రం దొరికే అవకాశం ఉండదు. ఎంతమంది చిత్రకారులు వేసిన పత్రికల బొమ్మలని ఎక్కడున్నాయో ఆరా తీయ ప్రయత్నించండి చూద్దాం? వాటికి ఏ మాత్రం విలువ లేదు. అనాయాసపు వారసత్వ హక్కుదారులకు ఆ బొమ్మలన్నీ కాగితాల మీద వేసే కొన్ని గీతలు, పులిమిన కొన్ని రంగులు. వారు తమ నాన్న పేరిట బ్యాంకులో ఉన్న నోట్లపై ఉన్న అల్లిబిల్లి తీగల అల్లికను కళాఖండాలు అంటారు, చేరడేసి రెండు కళ్ళకు అద్దుకుంటారు. మోనాలిసా కన్నా మత్తుగా నవ్వే గాంధీ తాతగారి ముద్రణ గల నోటు ప్రపంచంలో ఏ బొమ్మ కన్నానూ చాలా బరువు. రెవెన్యూ బాండు కాగితపు మీద చక్ర విచక్రాల డిజైన్ పెయింటింగ్ కింద ఇదిగో ఇన్ని గజాలు, ఇన్ని ఎకరాలు అని వ్రాసి ఉన్నదే అది గొప్ప కలిగ్రఫీ. మరి బొమ్మలు? వాటి సంగతి ఏమిటి? వాటికీ ఒక వెల ఉంది, వాట్లకూ ఒక ధర పలుకుతుంది. బయట వినపడటం లేదా, ప్లాస్టిక్ సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం…

మోహన్‌గారు అపురూపంగా వేసి ఉంచారే ఆ రతీరూప విన్యాసాల కాగితాల బొత్తి. దానికి మాత్రం ఈనాడు, వార్త, సాక్షి, ఆంధ్రజ్యోతి… అనే కాగితాల తూకాలలో కేజీకి ఇంతని చెల్లిపోయే వెల మాత్రమే. చిల్లర డబ్బులు చేతులు మారాకా ఆ బొమ్మల కాగితాలన్నీ ఏ రీసైకిల్ ప్రక్రియ కిందో టాయ్‌లెట్ పేపర్‌గా రూపాంతరం చెంది ఉండవచ్చు. ఇదంతా బెంగపడవలసిన విషయాలు కాదు, దిగాలు పడవలసిన అవసరాలు కాదు. ఏదో చాదస్తం, అంతే!


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...