సిలబస్: 2. తొలి ప్రేమలేఖ

వెన్నెల ఎందుకు కాస్తుంది? కృష్ణశాస్త్రి పొయెట్రీ ఎందుకు రాస్తాడు? ముళ్ళపూడి అప్పారావు ఎందుకని అప్పులు చేస్తాడు? డబ్బులు రాలవని తెలిసినా జెండాచెట్టు కింద కూచుని గుడ్డి మగ్బుల్ ‘బహారో ఫూల్ బర్సావో…’ అని నవ్వుతూ పాటను తగులుకుంటాడెందుకు?

ఏమో! ఎవడికి తెలుసో నాకేం తెలుసు? కానీ ఇలా అకారణంగా నేనెందుకు స్కెచింగ్ చేస్తానో నాకు మాత్రం తెలీదు. ఏం వస్తుంది ఇలా గీస్తే? ఏం తెస్తాయి ఈ స్కెచ్‌లు? పుస్తకాలు పుస్తకాలుగా నిలువుగా పెరుగుతూ పోతే? ఎప్పటికీ చేతరాని బొమ్మల గురించి వ్రాయరాని మాటలు ఇలా అల్లుకుంటూ పోతే?

ఏం తెలీదు. ఈ పని ఒక్క మనసుకు ఇష్టమని తెలియడం తప్ప. జీవితం అంతం వరకు ఇలా గీతలపై గీతలు అకారణంగా గీసుకుంటూ ఉండాలనిపిస్తుంది. ఆకలేసినపుడు కాసింత అన్నం చాలు. చెవులకు కొంచెం సంగీతం చాలు, పుస్తకాల గూళ్ళో ఏరి దాచుకున్న కాసిని పుస్తకాలు చాలు. ఇంకేం, ఇంతకన్నా మరింకేం గీతల వెంట సాగడానికి? జీవితాన్ని ఇలా కొద్దికొద్దితో నింపుకుని భద్రంగా అపురూపంగా రేఖల్ని, రంగుల్ని ఏరుకుని మరీ ‘నేనొక పుష్పాన్ని, నీ కోమల పాదాలతాగ్రాల పూచిన పుష్పాన్ని నేనని, తొట్టతొలి ఋషులు అగ్నికీలల్లో మంత్రగ్రామాలు దర్శించినట్లు నీ కౌగిట్లో ప్రేమ జ్యోతిని చూసినట్లు, నీ వలలో చిక్కిన శబలవర్ణసంచాలిత శఫరి నేనేనని…’ గీసుకునే బొమ్మలివి. వట్టి గాలి వేళ్ళు సుడులు సుడులుగా శూన్యంలో తిప్పి వేసిన బొమ్మలు జేబులో దాచుకోలేక ఆ ఊహలన్నిటిని గాలిపటం కట్టి ఆ మఖ్‌మల్ దారం వెంటపడి సాగిన స్కెచ్‌ల లేఖలివి. ఫైనల్ డ్రాయింగ్ పెళ్ళాం వంటిది. బొమ్మ పూర్తికాగానే మోహం నశిస్తుంది. మాయ ఆవిరవుతుంది. ఈ నా గీసుకునే స్కెచ్‌లన్నీ దరిచేరని నా ప్రేయసికి వ్రాసుకునే ప్రేమ లేఖలే! ఎందాకా ఎందాకా ఎగిరేవంటూ తన వెంట అనంతకాలం తరమనిస్తుంది.

మీట్ మై స్కెచ్ బుక్. లేదా డ్రాయింగ్ జర్నల్. కాదా వంటరి జీవితంలోకి ఇల్లామై అని వగచనవసరం లేకుండా కోరి జన్మతో పాటుగా తోడు తెచ్చుకున్న పవిత్ర గ్రంథం. ఇది నా బైబుల్, ఇది నా ఖురాన్, ఇది నా ప్రేయసి, నా తల్లి, నా సహచరి, నా నేస్తం, నా ఆస్తి, నా నాస్తి… నా అంతటికీ నేను అనునిత్యం వ్రాసుకునే ప్రేమలేఖల సమాహారం కథ ఇది. తాళం చెవి పుట్టని, కనిపెట్టని నా బొమ్మల ప్రపంచపు తలుపు తెరుచుకోడానికి నేను దొంగిలించి తెచ్చిన జవరాలి పక్క పిన్ను కథ ఇది. ఓపిక ఉంటే వినండి.

ఎందుకు స్కెచింగ్ అంటే, అక్షరమాలలో ముందు ‘అ’ నేర్చుకుంటాం కదా! కొంత తరువాత ‘మ’ కూడా నేర్చుకుంటాం. ఇంకా వత్తులు, దీర్ఘాలు గట్రా గట్రా… ఆ పై ‘అ’ పక్కన ‘మ’ వ్రాసి ‘మ’కు ‘మ’ వత్తు ఇచ్చి ‘అమ్మ’ అని నేర్చుకున్నదాన్ని ఏం చేస్తాం? అమ్మ వస్తుంది, అమ్మ పోతుంది, అమ్మ కూచుంటుంది, అమ్మ తల దువ్వుకుంటుంది, అమ్మ చదువుకుంటుంది, అమ్మ నాన్నకు ప్రయివేట్ చెబుతుంది… ఇట్లా బోలెడు మాటలు అక్షరాల్లో నేర్చుకుని వ్రాసినంత అంతే ఇదిగా బొమ్మల్లో కూడా గీతల అమ్మ ఈ పనులన్నీ చేస్తుంది. కాదు… చచ్చినట్లు మీరు చేయించాలి. ఊరికే మాటలు చెప్పినట్లు పుట్టుకతోపాటు బొమ్మలు తెచ్చుకోడం, దేవుడు ప్రత్యేక శ్రద్దతో మన మునివేళ్ళని తీర్చిదిద్దడం, భూమ్మీదకు పంపడం అంతా హంబక్, వట్టి సొల్లు మాటలు, పంచదార పూతల కవిత్వపు కబుర్లు. నిజానికి సత్యం అనునది సత్యప్రమాణకంగా ఏవిటంటే, చచ్చేదాకా 24 ఇంటూ 7 బై 365 అనే కాలమానంలో ఇలలో కలలో స్కెచింగ్ చేస్తూనే ఉండాలి. బొమ్మని రకరకాలుగా ఊహల్లో చిలుకుతూనే ఉండాలి. ఆర్టిస్ట్‌గా పుట్టడం ఈజీ, అది డిఫాల్ట్. కానీ క్రాఫ్ట్‌మన్ కావడం కఠినాతి కష్టం. ఆర్టిస్ట్‌గా ప్రపంచాన్ని నమ్మించడం పరమ ఈజీ. దునియా మూర్ఖపుది, అది దేన్నయినా నమ్మేస్తుంది. బట్ ఆర్టిస్ట్‌గా సిసలు క్రాఫ్ట్‌మన్‌గా నిన్ను నువ్వు ఒప్పించుకోడం కుదరని కార్యం, అది అందని ఎత్తు. ఆ విషయం ఎరిగి సాధన చేయడమే నువ్వు కనీసం ఎక్కగలిగిన ఎత్తు.

‘టు హూమ్ ఇట్ మే కన్సర్న్’ వోలె ఎవరికి వారికి వారి స్కెచింగ్ అర్థం ఏమైనా కాని, కానీ నేనదేవిటంటే స్కెచింగ్ అంటే గీస్తూనే వుండు అని అర్థం. గీతని ముచ్చటపడమని కూడా ఒక అర్థం. కదులుతున్న పిల్లి తోకపై ముచ్చటపడ్డం ఆరంభించి దాని మీసాల దాకా గీత గీసి చటుక్కున ఆపడం ఒక ముచ్చట. యూఅన్ అగ్లో (Euan Uglow) పెయింటింగ్ పనితనంపై మనసు పారేసుకుని ముని వేళ్ళతో కుంచెని తడిగా సాపుచేసి సుతారంగా అతనిలా రంగుని అద్దడానికి ప్రయత్నం చెయ్యడం ఒక ముచ్చట అన్నమాట. ఆర్టిస్ట్ మిన్యోలా (Mike Mignola)లాగా పలకలు పలకలుగా నల్ల రంగుని పులిమేసి హెల్‌బాయ్ పెదవి చివర, ఓవర్ కోటు అంచున చిన్న ఎరుపుని మరకలా అంటించడం కూడా అచ్చం ముచ్చటే. చూపుడు వేలు చివరని గుండ్రంగా గులాబి గోరు గీసేసి ఆ పై చిన్న స్కిన్ ముద్దని సున్నితంగా బాపు గీసినట్టు గీయాలని చూడటం అదో ముచ్చట; వేలి ముద్రల, కాగితపు అచ్చుల, ఎండుటాకుల ముద్రలని భద్రంగా కాగితంపైకి తర్జుమా చెయ్యడం కూడా బత్తాల్యా (Dino Battaglia) ముచ్చటే. ఇదంతా స్రష్టల వారి వారి పనితనంపై నా వంటి బుడత బుడిబుడి అడుగుల మర్యాద ముచ్చట. స్కెచింగ్ అంటే నాకు బొమ్మ నుంచి బొమ్మ కాపీ చెయ్యడం. (అనగా, నచ్చిన బొమ్మ ఏదైనా దాన్ని చూసి అలాగే గీసెయ్యడం అన్నమాట.) పత్రికల్లో అచ్చయిన ఫోటోలని రేఖాచిత్రాలుగా, రంగు నకళ్ళుగా గీసుకోడం. అలా బయటికి వెళ్ళి కదలని చెట్లు, కదిలే రైళ్ళు, ఆడే పిల్లలు, టీవీ ముందు పడతులు, ఆశాపాతకుల ఏడ్పు మొహాలు, ఊళ్ళో వీధులు, ఊరి బయటి గుట్టలు మిట్టలు, నడిచే గుంపులు, పడుకుని నిలబడి జారిగిలబడి మొబైల్ చూసుకుంటున్నవాళ్ళు, వికారంగా మొహం పెట్టుకుని కవిత్వం పుస్తకం చదివే పాపం వాళ్ళు, ఫేస్‌బుక్‌లో మొహం దూర్చి ఎన్ని లైకులు ఏమేం కామెంట్లు ఎవరెవరు ఇచ్చారు అని ఆత్రంగా చూసేవాళ్ళు; ఇంకా పెద్దపెద్ద పొట్టలవాళ్ళు, వంగిన వీపులవాళ్ళు, నడుములు లేని అమ్మాయిలు, బోలెడు బోల్డ్ మడతలు గల నడుములు గలవాండ్లు, కాటన్ ప్యాంట్ నిలువు ఫోల్డులు, స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ మోకాలి కింది అడ్డ ఫోల్డ్స్, బూట్‌కు కట్టిన లేస్, స్నీకర్స్ సోల్-రన్నింగ్ షూ సోల్‌ల మధ్య తేడా, ఇదీ అదని కాదు, సమస్తాన్ని చూస్తూనే ఉంటూ బుర్రలోని బోల్దంత ఖాళీని, స్కెచ్‌బుక్ లోని పేజీల ఖాళీని వీలయినంత నింపుతూనే ఉండాలి. ఇదంతా స్కెచింగే.

ఇక్కడ ప్రస్తావించిన ఏ విషయం కూడా నేను ఇతరులనుండి విన్నది కాదు, చదివినదీ కాదు; నాకు నేనుగా తెలుసుకున్నవివన్నీనూ. ఇన్నేళ్ళ బొమ్మల జీవితంలో ప్రత్యక్షంగా ఏ గురువూ తగిలింది లేదు, తట్టింది లేదు. ఇదిగో ఇదే దారీ అదే చెట్టు అక్కడే పిట్ట అని గురి చూపించిందీ లేదు. నాకు నేను గురువునై శిష్యుడనై నేర్చుకున్న చాలా చిన్నచిన్న పాఠాలు ఇవన్నీ. మొన్నటికి మొన్న కూడా అత్యంత మొదటిసారిగా ‘ఇది ఇలా కదా’ అని తట్టినపుడు అమితాశ్చర్యంతో ‘అరే అవును కదా’ అనుకోవడం. మనం మళ్ళీ మళ్ళీ ఎంత ఫూలిష్ అని తెలుసుకోడం. ఇవన్నీ పాఠాలే. ఇక్కడే కొన్ని బొమ్మలు భోజనం చేస్తున్న వారివి. గుర్తులేదు దేనికని వేసుకున్న స్కెచ్‌లో ఇవి. భోజనం అంటే ఏవుంది, ఒకణ్ణి కూచోబెట్టి వాడి ముందు కంచంతో సహా రకరకాల గిన్నెలుగా వడ్డించడం, అంతే కదా! పరమ మెకానికల్‌గా గీసుకున్న స్కెచ్‌లు. బుర్ర ఏమాత్రం వాడకుండా వేసుకెళ్ళిన బొమ్మలు. అలా వేస్తూ ఉండగా మధ్యలో తట్టింది! “ఏవిరా ఫూలిష్ ఫెలో! మనిషి కుడి చేత్తో అన్నం తింటున్నాడు. నువ్వు వాడి ముందు పెట్టిన నీళ్ళ గ్లాసు కుడి చేతి వైపే వుంది. గిన్నెలు, గరిటలు అన్నీ కుడి చేయి వైపే పెడితే వాడు ఆ ఎంగిలి చెయ్యే ఉపయోగించి, ఎంగిలి చేత్తో పనులన్నీ చేసుకోవాలా!” అనుకున్నా. అరే, ఎంత బుద్దితక్కువ బొమ్మలు! ఆ పక్కనే పచ్చ చొక్కావాడు పద్దతిగా తింటున్నాడు. వాడు కూచున్న తీరు, పళ్ళెం, చెంబూ అన్నీ గ్రామర్‌ని అనుసరించి ఉన్నాయ్. ఇక్కడ ఇది ఓ మంచి పాఠం. ఈ పచ్చ చొక్కావాడి బొమ్మ నేను ఎక్కడో ఫోటోగ్రాఫ్ చూసి వేసుకున్నది, స్వంతంగా గీసినది కాదు. మన మూలాలు మన బొమ్మల్ని డిసైడ్ చేస్తాయి. అదెలా అనడుగుతే, నేను ముసల్మానుల ఇంట పుట్టి పెరిగిన వాణ్ణి. నేను మసలిన వాతావరణంలో పీట వేసుకుని భోజనం చేసే సంప్రదాయం లేదు కాబట్టి, నాకు స్పృహ కలిగి ఎన్నడూ నా బొమ్మల్లో పీట తేను. ఇంకోటి మానసికమైనది. నాకు మొహమాటం చాలఎక్కువ. కొన్ని చెడ్డ అనుభవాల వలన జనానికి అనునిత్యం స్పృహలో ఉండే స్థాయీభేదం వల్ల ఎవరి ఇంటికి వెళ్ళినా భోజనం చెయ్యను. అత్యంత బలవంతం మీద వెళ్ళినా అక్కడి తిండి తినాల్సి వచ్చినా ప్రాణం పోతున్నంత గాభరాగా నిముషాల్లో విషయం ముగించి ప్రాణవాయువు కొరకు బయటపడతాను. ఈ గందరగోళంలో అక్కడ ఆ వాతావరణం, ఆ కప్పులు, స్పూన్లు, చెంబులు, లోటాలు, డైనింగ్ టేబుల్, నాప్కిన్ గుడ్డలు గమనించేదెక్కడా? నిజానికి ఇది ఒక ఆర్టిస్ట్‌గా నా పెద్ద లోపం. మనం ఎక్కడికి వెళ్ళినా అబ్జర్వేషన్ అనే స్కెచింగ్ చెయ్యాలి. అందుకని ఈ పచ్చ చొక్కావాడి బొమ్మ టెక్నికల్‌గా కరెక్ట్. కానీ ఆ పీట, ఆ చెంబు, ఆ మనిషి నావాడు కాదు. ఇంత చెబుతున్నందుకైనా నా పాఠం నేనే నేర్చుకుంటూ విషయాన్ని గ్రహించుకునే సామర్ధ్యం పెంచుకోవాలి, శక్తి ఏర్పరుచుకోవాలి.

మరోటి, నెలలు నిండిన గర్భిణి స్త్రీ బొమ్మ వేయబోతాం. గట్టిగా గమనిస్తే ఆయమ్మ బ్రస్ట్ లైన్, కడుపు ఆ సమయంలో దాదాపూ వేరు వేరుగా ఉండవు. ఛాతీదాక దిగిన గీత సుతారంగా మర్యాదగా చాలా చిన్న జర్క్ ఇచ్చి పెద్ద కడుపు ఆర్క్ అల్లా దిగాలి. కానీ చాలామంది ఆ పెద్ద నిండు వక్షోజాలు వేరుగా, కడుపు వేరుగా అలా వేసేస్తారు. ఎప్పుడైనా చొక్కా లేని బ్రాహ్మణుల బొమ్మ గీయాలంటే నాకు ఎప్పుడూ కన్‌ఫ్యూజనే, జంధ్యం ఏ వైపునుండి ఏ వైపుకు వేసుకుంటారబ్బా అని. ఇలా రకరకాల డిటైళ్ళ గురించి ఆలోచించుకోవాలి. సిగరెట్ ముట్టించుకున్నవాడు తదనంతరం అగ్గిపుల్లని గాల్లో ఆర్పేసి ఎలా చెయ్యిని మెలితిప్పి విసిరి పడేస్తాడో అలాంటి వాళ్ళని ఊహించుకుని స్కెచ్‌లు గీసుకుని మన బంధుమిత్రసపరివారంలో ఎవరైనా పనీపాటా లేకుండా దొరికినపుడు అలాంటి అగ్గిపుల్ల పడేసే యాక్షన్ వాడితో చేయించి, దాన్ని మనం గీసుకున్న ఊహాచిత్రాల పక్కని గీసుకుని తేడా చూసుకోవాలి.

ఇక్కడో గులాబీ చొక్కా వాడు వున్నాడు, ఊరికే పని వున్నా లేకపోయినా ఒక క్యారెక్టర్‌ని అనుకునో, చదివో, ఊహించో వాడిని రకరకాలుగా వేయ ప్రయత్నించండి. ఆ పక్కనే కప్పు కాఫీనో ఉగ్గెడు పెగ్గో పుచ్చుకునేవాణ్ణి కూడా గీయండి. బొమ్మ అంటే అన్నిసార్లు తలనుంచి కాళ్ళదాక గీయనక్కరలేదు. ఆ మొహం, ఆ చేతులు, వాడి మూడ్ చూపించగలిగితే చాలు- అదే మజా ఇస్తుంది కొన్నిసార్లు. ఆ తరువాత ఆ పైన కార్నర్‌లో చిన్న మురిపమైన ముద్దు బొమ్మ, ఈ కింద ఒక నాగుపాము బుసలవంటి కురుల అందం. తొలినాళ్ళల్లో ఈ శ్రమ అంతా తెగ శ్రమ అనిపిస్తుంది. కానీ అలా వేసి వేసి మీరు మరిచిపోయిన ఈ బొమ్మలు అకస్మాత్తుగా ఓ రోజు మీ కంటపడి ఒక వెర్రి ఆనందం అవుతుంది. శ్రమైకజీవనసౌందర్యం అనేది రంపపు మిల్లులో రిక్షా చక్రంలోనే కాదు, అరిగిన పెన్సిల్ ములుకులో కూడా వుంటుంది. ఎటొచ్చీ ఈ అందం శ్రీశ్రీతో సహా ఎవరికీ అందనిది, మీకు మాత్రమే ఎరుకైనది. అందుకు కంగ్రాట్స్!

ఇక్కడ పక్కకు ఒత్తిగిలించి పడుకున్న ముసలివాడి బొమ్మ మళ్ళీ మళ్ళీ వేసుకున్నది, అలా సాధన చేసుకున్నది. అయితే మళ్ళీ మళ్ళీ అదే బొమ్మని సాధన చెయ్యడం మా చెడ్డ బోరింగ్ కావచ్చు. కానీ ఒకదాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే దాన్ని ఆధారం చేసుకునే మిగతా అంతా కథ నడుస్తుంది. రెండు రెక్కలు, ఒక ముక్కు, కాసింత కడుపు, బారచాచిన కాళ్ళు ఇంత ఆకాశం చాలు. కాకి, చిలుక, కంజు, పిట్ట అంతా ఒకే సూత్రం. పిల్లి బొమ్మ వచ్చినవాడికి పులి కూడా తెలుస్తుంది.

లెజెండ్ బ్రూస్‌ లీ ఇలా అన్నాడు: “నేను పదివేల కరాటే విన్యాసాల్ని సాధన చేసినవాడిని లెక్కచెయ్యను కానీ ఒకే విన్యాసాన్ని పదివేలసార్లు సాధన చేసిన వాడంటే భయభక్తులు చూపిస్తాను.” ఎంత గొప్ప సూత్రం! అయితే అన్నిసార్లు వద్దు కానీ ఒక బొమ్మని పదిసార్లో ముప్ఫై సార్లో గీద్దాం రండి.

మరి ఇంకా బొమ్మలు వేసేవాళ్ళు ముఖ్యంగా ఏం చెయ్యాలంటే, మానవుడి వెన్నెముకకు ఫెవికాల్, గంజి కలిపి పెట్టి ఇస్త్రీ చేయించినట్లు వాడిని నీలిగినట్లు వేయకండి. మీ బొమ్మల్లో కొద్దిగా యాక్షన్ జోడించండి. నటుడు అమోల్ పలేకర్ తెలుసుగా, తను తన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ జ్ఞాపకాలు చెబుతూ ఇట్లా అంటాడు: “నేను నటుడిగా శిక్షణ పొందిన సమయంలో హావభావాలు ఎలా పలికించాలో, డైలాగ్‌ని ఏ ఏ సంధర్భాల్లో ఎట్లా చెప్పాలో, నవరసాలు ఎట్లా ఒలికించాలో అన్నీ శుభ్రంగా చేసేవాణ్ణి. కానీ నా ఈ రెండు చేతులు వున్నాయే, వాటిని మాత్రం ఏంచెయ్యాలో నాకు అర్థంకాలేదు. చేతులు ఖాళీగా ఉన్నాయి కదాని తెగ ఊపుతూ మాట్లాళ్ళేను, అండర్ ప్లే అనేది ఒకటి ఉంటుంది కదా! అప్పుడు నేనేం చేశానంటే నా చేతులకు పెన్నునో, పెన్సిల్‌నో, సిగరెట్‌నో ఆ సన్నివేశానికి తగినట్లు అలవాటు చేశాను. ఇక అంతే, నా సమస్య తీరిపోయింది. రెండు చేతులు పెన్నుతో ఆడుతూ తన పని చేస్తుంటే మిగతా శరీరంతో నా నటన నేను కానిచ్చాను.” ఈ చిన్న ఎక్సర్‌సైజ్ తెలీక ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ అయ్యాడు. నటుడు కాలేదు. మీ బొమ్మ సూపర్ స్టార్ కావడానికి మీరు పెద్ద కష్టపడనక్కరలేదు. ఆల్రెడీ తెలుగులో బొమ్మలు వేసేవారు చాలా మంది సూపర్ స్టార్లే. అయితే మీ బొమ్మని నటుడిగా మలచడానికి మాత్రం మీరు తెగ కష్టపడక తప్పదు. ఆ సదరు బొమ్మ వాడిని ఊరికే నిలబెట్టకండి, వాడికో బొమ్మల చొక్కా తొడగండి, చేతిలో సిగరెట్ అంటించండి, భుజాన సంచో ఫ్లాస్కో తగిలించండి, నెత్తి మీద మూట ఎక్కించండి, ఆ బరువుకు తగిన నడక అలవాటు చెయ్యండి, ఆ పై వాడిని ఒక పరుగు తీయించండి… ఇదంతా సోది అంటారా? అయితే ఓకే. నో ప్రోబ్లెమ్! మామూలుగా ఎప్పటిలాగే మీ బొమ్మకి కృష్ణలాగే చంకలు గట్టిగా అంటించండి, ఏం భయం లేదు. పోలీసులు ఎన్‌కౌంటర్ కాదు కదా, కనీసం ఉరి కూడా వెయ్యరు. కడమకి మీ అభిమానులెవరూ మిమల్ని ఫేస్బుక్ నుంచి అన్‌ఫ్రెండ్ కూడా చెయ్యరు, నో వర్రీస్. లైఫ్ ఈజ్ గుడ్ పైగా ఇగ్నోరెన్స్ బ్లెస్సు కూడానూ.

ఇంకా, స్కెచ్ పుస్తకాలు మూడు రకాలువి ఏ3, ఏ4, ఏ5 అని ఎప్పుడూ వెంట వుంచుకోడం మంచిదంటాడు రాన్ టైనర్ (Ron Tiner) అనే ఒక చిత్రకళా గురువు. నేను రెండు చాల్లే నాకు అనుకున్నా. ఒకటి ఏ5, ఇంకా జేబులో పట్టే పాకెట్ స్కెచ్ పుస్తకానికే పరిమితమయ్యా; అదీ కాదూ అనుకుంటే మడతలుగా పెట్టుకున్న తెల్ల కాగితం కూడా మోర్ దాన్ ఎనఫ్. నిజానికి ఓ అయిదారు సంవత్సరాల క్రితం వరకు మన దేశంలో మంచి స్కెచ్ బుక్‌లు మార్కెట్‌లో అందుబాట్లో వుండేవి కావు. ఇప్పుడు చాలా నయం, ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో, హైద్రాబాద్‌లో అయితే పంజాగుట్ట హిమాలయలో చాలా రకాల స్కెచ్ బుక్‌లు అందుబాటులో వున్నాయి. ఆ స్కెచ్ పుస్తకాల పక్కనే బోల్డని పెన్నులు కూడా వుంటాయి. ఒకటో రెండో పద్నాలుగో మీ పర్స్ ఓపిక మేరకు ఎన్నుకోవచ్చు. సరే ఈ సరంజామా మంచి చెడ్డలు చాలా విస్తృతంగా రాబోయే నెలల్లో ముచ్చటించుకోవచ్చు.

చివరగా, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువేనంటారు. ఇలా నాకు తెలిసీ తెలీని సంగతులు బోల్డన్ని ఈ కచేరీలో వెయ్యొచ్చు. కానీ దానికి కూడా ఒక ఓపికుండాలి. అదీ కాక నాకు ఈ చెవిటి ప్రపంచం మీద చాలా నమ్మకం, నేను చచ్చుకుంటూ వ్రాసే ఇదంతా వినడానికి చదవడానికి కోరి ఈ జన్మ మీరు ఎత్తలేదు. జానేభీదో యార్! సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ న భ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ్ నానృతమ్ భ్రూయాత్ ఏషా ధర్మః సనాతనః అనగా… ఈ భగవంతుని సృష్టిలో కరీనా కపూర్ బొడ్డుని మించిన మాస్టర్ పీస్ గీయబడలేదు, ఇది సత్యం. కింబర్లీ కేన్ క్లియవేజ్‌ని బోలిన ప్రకృతి సృష్టించబడలేదు, ఇదీనూ సత్యమే. పరనిందని మించిన పరమగాంధర్వమగు రాగం పాడబడలేదు, దీని సంగతి అతి సత్యమని కొత్తగా చెప్పనక్కరయే లేదు. శుభమ్ భూయాత్!

చిట్టి సలహా: నిజానికి ఈ రాతలు చాలా కాలం క్రితం నేను బొమ్మలు మొదలెట్టిన సమయంలో ఎవరో అప్పుడే వ్రాసిపెట్టి ఉండాల్సింది. అవి చదుకుని అన్వర్ అనే కాసింత మంచి చిత్రకారుడు ఇప్పుడు నాకు తగిలేవాడు. కనుకొలను చివరి వెచ్చని చిరు చెమ్మంత స్కెచ్ బుక్ సలహా ఏవిటంటే, పుస్తకాన్ని ర్యాండమ్‌గా నింపొద్దు నాకు మల్లే. సబ్జెక్ట్‌కు కొన్ని పేజీలు వదులుకోండి. నిలబడ్డ మనుషులంతా ఒక చోట, కుక్కలు పిల్లులు వంటి జంతుజాలం ఒక చోట, కుర్చీలు మేజాలు భోజనాల బల్ల ఇత్యాది ఒక దగ్గర, మసీదులు గుళ్ళు గోపురాలు ఒకే సైడునా… ఇది అవసరమైనప్పుడు మీ సబ్జెక్ట్‌ని ఎక్కువ కష్టపడి వెదుక్కునేట్టు చెయ్యదు. ఆ స్కెచ్‌లోంచి మీరు మీకు కావాల్సిన రిఫరెన్స్‌ను అనాయాసంగా పొందగలరు.

(సశేషం)


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...