స్క్రాప్ బుక్ మాటలు

వెధవ్వేషాలు కాదు కాని, ఇప్పుడు ఎవరు ఎలా బొమ్మలు వేస్తున్నారు? ఏమి బొమ్మల గురించి చదువుతున్నారు? వాళ్ళ వర్కింగ్ ప్లేస్ ఎలా ఉంది? టూల్స్‌ని ఎలా వాడుతున్నారు? ఏ ఏ కొత్త పుస్తకాలు కొన్నారు, కొంటున్నారు? ఏ కొత్త పద్ధతులలో బొమ్మల ప్రయోగాలు సల్పుతున్నారు? అనే విషయాలు ఏమీ తెలియడంలేదు. మా తరంలో మొదలయిన చిత్రకారుల వంటివాళ్ళము కొంతమందిమి ఏ మంచి పుస్తకం ఎక్కడ కనపడ్డా దొంగచూపులతో చూడటమూ, ఏ ఊరిలోనో మంచికుంచెలో, చక్కని పాళీలో దొరుకుతాయంటే కాలినడకన పాదయాత్రలు చేయడమూ, మార్కెట్టులోకి వచ్చిన ప్రతి కొత్త ఇంకుబుడ్డికి ప్రేమపత్రము వ్రాయడమూ, ఇదే పని.

పదిహేడు ఇరవై ఏళ్ళ ప్రాయం వరకూ నాకు బొమ్మల పద్దతుల గురించి ఏమీ ప్రత్యక్షజ్ఞానం లేదు. తెలుగు పత్రికలలో అడపాదడపా ఆర్టిస్టుల మీద వచ్చే వ్యాసాలు చదివి బ్రిస్టల్ బోర్డ్ అని, స్ప్రే గన్ అని, క్రోక్విల్ పాళీ అని, ఆయిల్ పేస్టల్ అని, వాటర్ కలర్ అనీ చదువిడి జ్ఞానం మాత్రమే నాలిక మీద పలికేది. వయసు ఇరవైలలో నాకు కమర్షియల్ ఆర్ట్ నేర్చుకోవాల్సిన అక్కర వచ్చిపడింది. ఆ అవసరం కొద్ది మా నంద్యాలలో ఉన్న కొంతమంది చక్కని సైన్‌బోర్డ్ ఆర్టిస్ట్‌లతో పరిచయం పెరిగింది. అప్పుడే తొలిసారిగా వారి దగ్గరే చూశా ఈ స్క్రాప్ బుక్కుల జ్ఞానాన్ని. ఇంతింత లావుగా ఉబ్బిపోయిన పుస్తకాలు అవి, వాటి పేజీల్లో పత్రికలలో వచ్చే రకారకాల సినిమా టైటిళ్ళు, అమ్మకపు అడ్వర్‌టైజ్మెంట్ ప్రకటనల రైటింగ్ స్టైళ్ళు, అల్లిబిల్లి డిజైన్లు, గులాబీ పూలు, చేతి గడియారాలు, కలర్ కాంబినేషన్లు, ఫోజుగా కూచున్న పెళ్ళి కూతుళ్ళు, వాళ్ళ మెడలోని నగలు, జరీ చీరలు, వాటి మామిడి పిందెల అంచులు, శివకాశి కాలెండర్ల దేవతల బొమ్మలు, సినిమా తారల మొహాలు, అదీ ఇదని కాదు బొమ్మల ప్రపంచానికి, డిజైన్ కళకు సంబంధించి ప్రతీది అందులో అతికించబడి ఉండేది. ఆ పుస్తకం ఎవరికి వారికి పవిత్ర గ్రంథం. ఏ గ్రంథానికి ఆ గ్రంథం విభిన్నం, వైవిధ్యం.

చిత్రకారులు వారి షాపులకు వీరు, వీరి షాపులకు వారు పిచ్చాపాటిగా వచ్చినపుడు ఈ స్క్రాప్ పుస్తకాల కోసం అడిగేవారు. అదెక్కడో లోపల భద్రంగా ఉండేది. కనీసం చూడటానికి కూడా మామూలుగా ఎవరికీ ఇచ్చేవారు కాదు, అడగగా అడగగా ఇక తప్పదు అని మొహమాటపు మొహంమాడ్చుకుంటూ కాసేపటికొరకు ఇచ్చినా గుండెలు మాత్రం లబలబలాడుతూ ఉండేవి. తాను దాచుకున్న రిఫరెన్స్ వీడెక్కడ ఏ షాపుబోర్డు మీద దించేస్తాడోనని భయం. అప్పుడు జనం దగ్గర ఇప్పట్లోలా మాలావు చులకనగా కెమెరాలు ఉండేవి కావు, అయినా ఫోటోగ్రఫిక్ మెమొరీతో చటుక్కున కావలసిన డిజైనులను కళ్ళల్లో లటుక్కున బంధించుకునేవాళ్ళు.

చెప్పాగా ఏగ్రంథానికాగ్రంథం విభిన్నం, వైవిధ్యం అని. నావరకు నేను కూడా ఒక స్క్రాప్ బుక్ తయారు చేసుకున్నాను. లోగోలు, లెటరింగ్ స్టయిళ్ళు, ప్రిన్సెస్ డయానా, జాన్ ట్రవోల్టా, ఎమ్మెఫ్ హుసేన్ ఫోటోలు, క్రికెట్ స్టార్‌ల పోజులు, కథలకు అచ్చయిన బాప్బాలిచంద్రమోహన్గోపీకరుణాకర్జేల ఇలస్ట్రేషన్లు, కొంగలు, వాటి పిల్లలు, ఏనుగులు, వాటి మందలు, అవీనూ ఇవీనూతో మందంగా, మందలుగా తయారైనవి నా పుస్తకాలు. బొమ్మలు వేసి బ్రతుకుదామని హైద్రాబాదుకు వచ్చాక ఇక్కడ విభిన్నమయిన పత్రికలు, ఆ పత్రికలలో అచ్చయిన చిత్ర విచిత్రమయిన రేఖా విన్యాసాలతో, వర్ణ వైవిధ్యంతో కూడిన బొమ్మలు. మారియో మిరండాలు, ఆర్కే లక్ష్మణ్లు, అజిత్ నైనన్లు, అనూప్ రేలు, ఇర్ఫాన్ హుసేన్లు, జయ చంద్రన్లు, జయంతోనీలాంజన్ దాసులు, ప్రకాశ్ షెట్టీలు, ఏసుదాసన్లు, శేఖర్ గురేరాలు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఇంకు బొమ్మలేసే, రంగుల మునకలేసే గజయీతగాళ్ళు అందరూ నా స్క్రాప్ పుస్తకాల్లో వేయిన్నొక్క వర్ణాల హరివిల్లులై విరిసినవారే. ఆ రోజులే వేరు. చక్కని ప్రతి చిత్రకారుడి బొమ్మ గీత గేలమేసి మా మనసుల్ని, మమ్మల మనుషుల్ని ముగ్గులోకి లాగేసి మంత్రమేసి కట్టుబడి చేసేది.

ఇంటర్నెట్ బలిసిన తరువాత పత్రికల్లో దొరికే ప్రతి బొమ్మని, ప్రతీ ఫోటోని కత్తిరించి దాచుకునే అవసరం, ఆయాసమూ అనేది పోయింది. అవసరమైన ఫోటోలను కంట్రోల్ ఎస్ కొట్టి సేవ్ చేసుకోవడమే. తీరిక సమయాల్లో వాటిని తెలుగు సాహితీవేత్తలు, అంతర్జాతీయ స్మగ్లర్లు, రాజకీయ నాయకులు, కంచర గాడిదలు, బోన్సాయ్ మొక్కలు, ఓరిగామి కళ, గ్రామీణ వాతావరణం, కొబ్బరిచెట్లు, పెంకుల ఇళ్ళు, యూరోపియన్ కామిక్ కళ, అనేటువంటి ఫోల్డర్లుగా, సబ్ ఫోల్డర్లుగా దాచుకున్నవి లెక్కకు మించి. ఇపుడు పుస్తకాల కట్టలు ముందేసుకుని ఏ రిఫరెన్స్ ఎక్కడ ఉందో అని వెతుకులాటలో మునగక్కరలేదు. డెస్క్‌టాప్ సెర్చ్‌బాక్స్ లోనో, గూగుల్ ఇమేజెస్ లోనో కావలసిన పదాన్ని టైపితే చాలు. సెకన్లల్లో బొమ్మ ప్రత్యక్షం.

అంతేనా, అంత త్వరగా స్క్రాప్ పుస్తకాల తరం ముగిసిందా, పాత అనే ఏ మంచి పద్దతినయినా గోయితీసి పాతెయ్యాల్సిందేనా అనుకునే రోజుల కాలంలోకి ‘టక్కరి నక్క- టక్కుటమారి రాకుమారి’ అని పేరేసుకున్న కథ ఒకటి తనని బొమ్మ వేసి పెట్టమని నా దగ్గరికి వస్తుంది. రోజువారీ బొమ్మల జీవితంలో ఎన్ని బొమ్మలు వేసినా, ఎన్నిసార్లు బొమ్మలు వేస్తూనే ఉన్నా ఒక పద్ధతిగా, ఒక శాస్త్రంగా, ఒక బడి నీడన, ఒక గురువు చెంతన నేర్వనిది నా విద్య కాబట్టి వేసే ప్రతి బొమ్మని కనపడని తెల్ల కాగితంపై ఎక్కడ దాక్కుందో వెతికి వెతికి బయటికి తీయవలసివస్తుంది. ముఖ్యంగా జంతువుల బొమ్మలేయాలనేసరికి నా పెన్సిలుకు ఎక్కడ లేని అయోమయం, ఆయాసం, యాసిరికా పుట్టుకు వచ్చేస్తాయి. నక్క, నక్క, నక్క, దీనక్క అనుకుంటూ కాగితం మీద అంతా పెన్సిల్ మొనతో కలియగిరుగుతూనే ఉంటాను. ఒక్క నక్క బొమ్మ వేయాల్సిన కథలో చివరికి పేజీ అంతా రకరకాల నక్కలతో నిండిపోతుంది. ఇది ఇక్కడితో ఆగదు, ఒక రెండు వారాలు గడిచినాక చేతికి అందిన కొత్త కథలో మళ్ళీ నక్కో, పందో, సింహమో, పెద్ద పులో తగులుతుంది. మళ్ళీ పని మొదలు. బొమ్మల రఫ్‌లతో కాగితం నిండా మళ్ళీ జంతుసభ మొదలు. పెద్ద తలకాయ నొప్పిరా దేవుడా ఇది.

అటువంటి తలనొప్పి తలలో నాకు నా పాత స్క్రాప్ బుక్ స్కూల్ గుర్తుకు వచ్చింది. ఇలా వేసిన బొమ్మల ఫోజుల కాగితాలని అవసరం అయ్యాకా పడేసే బదులుగా ఈ బొమ్మలన్నింటిని కత్తిరించి ఒక పుస్తకంలో అతికించుకుంటే పని హాయికదా అనిపించింది. ఇక అదే పని చేయ్యడం మొదలుపెట్టాను. పైగా ఇందులో ఒక విశేషం ఉంది. అచ్చుకు వెళ్ళబోయే ఫైనల్ బొమ్మపై చాలా జాగ్రత్తగా పట్టి పట్టి గీతలు గీస్తాము. తిన్నగా, నున్నగా రేఖని లాగుతాము. చిత్తు బొమ్మల్లో ఆ జాగ్రత్త ఏమి ఉండదు. చటుక్కున, చివాలున, విసురుగా గీతని గుంజెయ్యడమే. అందుకే ఒక చిత్రకారుడి నైపుణ్యాన్ని కొలవాలంటే వాడి స్కెచెస్ మాత్రమే చూడండి. అక్కడ వాడి విశ్వరూపం కొండంత. లే ఔట్ కాగితాలు, రఫ్ స్కెచ్చులు కల్తీ లేని బంగారం వంటివి. తరువాత అచ్చుకు ఇచ్చే బొమ్మలన్నీ భయం భయంగా శ్రద్దగా నగిషీ పనిమీద తయారవుతాయి కానీ, భయం, జయం, జంకు, బ్రేకు లేకుండా గీసిన బొమ్మల నుండి నేర్చుకునేది చాలా ఉంటుంది. భయం వలననో, భక్తి వలననో, పాతని వదలలేనితనం వలననో ఏదో ఒక వలన కాస్త రూపం మార్చుకుని స్క్రాప్ పుస్తకం మరలి వచ్చి నా సంచికి ఎక్కింది. కత్తెర కత్తిరింపులు, జిగురుతో అతికించడాలు, పాత బట్టతో బంకపట్టిన ముని వేళ్ళు తుడుచుకోవడాలు, పుస్తకాల పేజీలు నింపడాలు, అప్పుడప్పుడూ పుటలు తిరగేసుకుంటూ మురిసిపోవడాలు అనే స్క్రాప్ పుస్తకపు మాటలివి. చూడగలరు.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...