రచయిత వివరాలు

చీమలమర్రి బృందావనరావు

పూర్తిపేరు: చీమలమర్రి బృందావనరావు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

మహాకవులు ఇలాంటి కథలు ఎందుకు వ్రాస్తారో నాకు అర్థం కాదు. శివపూజ చేస్తే పాపాలు పోతాయి అని చెప్పడానికి ఇంత మహా పాపాల్ని చేయించాల్నా? కనీసం భక్తి అనేదే లేక, అనాలోచితంగా జరిగిపోయిన పనులే పూజలుగా భావింపబడి–వినటానిక్కూడా అసహ్యం అనిపించే తనయాగమనం లాంటి భ్రష్టకార్యాలు కూడా మానవుడి ప్రయత్నం గానీ, కనీసం పశ్చాత్తాపం గానీ లేకుండా మాసిపోయేటట్లయితే–ఇక భక్తి దేనికి, సత్కర్మాచరణ ఎందుకు?

తెలుగు పెండ్లిళ్ళలో స్నాతకమనీ, నాగబలి అనీ, తలంబ్రాలు అనీ, మాంగల్యధారణ అనీ ఉండేవి కేవలం లాంఛనాలు అయితే కావచ్చునేమో గాని అప్పగింతల సమయం మాత్రం గొప్ప హృదయస్పర్శి అయిన సన్నివేశం. పెండ్లి చూడ్డానికి వచ్చినవాళ్ళకు అదొక తంతుగా కనిపించొచ్చు గాని, వధువుకూ, ఆమెని కన్నవారికీ మాత్రం అది వారికే అనుభవైకవేద్యమైన బాధ.

ఒక స్త్రీ ఏడ్పును వర్ణించే ఘట్టం అది. ఆ స్త్రీ మనుచరిత్రంలోని కథానాయిక వరూధిని. తాను కామించిన ప్రవరుడు తనను తిరస్కరించిన తరువాత, తాను కొంత చొరవ చూపబోతే త్రోసేసినప్పుడు- ఆ తిరస్కృతి కలిగించిన అవమానమూ రోషమూ వేదనా ముప్పిరిగొని ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది ఆమెకు. కన్నీరు ఉబికింది. అయితే ఆమె రోషావమానాలకన్నా, నొప్పిని కారణంగా చూపించింది.

పదాలకుండే సౌందర్యాన్ని ఎరిగి, వాటిని ఉచిత స్థానంలో పొదిగి, ఆ సౌందర్యాన్ని దిగంత ప్రదర్శనం చేసే కళను స్వాధీనం చేసుకున్న కవి వ్రాసింది ఈ పద్యం. శబ్దాలొలికించే సంగీత మాధుర్యాన్ని ఆకళింపు చేసుకుని, వాటి ప్రవాహపు ఒరవడిని ఒక క్రమవిభక్తమూ, సమవిభక్తమూ చేసి, పద్యగతిని హయగతిలోనూ, గజగతిలోనూ నిబంధించగలిగిన కవి వ్రాసిందీ పద్యం. కవి ఏమి చెపుతున్నాడు అనేది తరవాతి సంగతి. పద్యం చదువుతుండగానే శభాష్ అనిపించే పద్యం ఇది.

ఎఱ్ఱాప్రగడ రామాయణం కూడా రచించాడనీ, అది లభ్యం కావడంలేదనీ అంటారు. ఎఱ్ఱాప్రగడ రామాయణంలోవని ఒకట్రెండు పద్యాలు కొందరు లక్షణ కర్తలుదాహరించడమే ఈ అపోహకు ఆధారం. ఆ ఊహ నిజమై, ఇరవైయవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో హఠాత్తుగా నన్నెచోడుని కుమారసంభవం ప్రత్యక్షమైనట్లు ఎఱ్ఱన రామాయణం కూడా మున్ముందెపుడైనా ప్రత్యక్షమైతే తెలుగు భాషా, తెలుగు జాతీ చేసుకున్న అదృష్టం పండినట్లే.

ఏ కావ్యానికయినా దాని భాగధేయాన్ని నిర్ణయించేది కవి యెడ సానుభూతి లేని రంధ్రాన్వేషణాతత్పరులైన పండితులు కారు. సాధారణ పాఠకులు. తెలుగు పాఠకులు మొల్ల రామాయణాన్ని ఆనందంగా ఆహ్వానించి గుండెలకు హత్తుకున్నారు. మళ్ళీమళ్ళీ చదువుకొని మననం చేసుకోదగిన పద్యాలు చాలానే ఉన్నాయి అందులో. తాను విదుషిని కాదనీ, శాస్త్రాదులు తనకు తెలియవు అని అన్నాకూడా కవిత్వమనేది ఎలా ఉండాలో కచ్చితమైన అభిప్రాయాలే ఉన్నాయి మొల్లకు.

భారత యుద్ధానంతరం ఒకరోజు అర్జునుడు ద్వారకకు వస్తాడు, కృష్ణుణ్ణి చూడడానికి. ఆ రోజు కృష్ణుడు ఏదో దీక్షలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక బ్రాహ్మడు ఏడ్చుకుంటూ కృష్ణార్జునుల దగ్గరికి వస్తాడు దీనంగా. ఆయన శోకాన్ని చూసి కృష్ణుడు కన్నీరు పెట్టుకుంటాడు. కృష్ణుడి బాధను చూసి అర్జునుడూ కళ్ళనీళ్ళపర్యంతమవుతాడు. సంగతేమిటంటే ఆ విప్రుని భార్య గర్భవతిగా వుండి, శిశువును ప్రసవించగానే ఆ శిశువు చనిపోతాడు.

మారన ఒక సంస్కృత పురాణాన్ని తెనిగించిన తొలి తెలుగు కవి. ఈయనకు తిక్కనగారంటే మహా గౌరవము. ‘తిక్కన సోమయాజి ప్రసాదలబ్ధ సరస్వతీపాత్రుడ’నని తన కావ్యంలోని ఆశ్వాసాంత గద్యల్లో చెప్పుకున్నాడు. అన్నట్టు ఈయన తండ్రి పేరు కూడా తిక్కనామాత్యుడే. తన మార్కండేయ పురాణం అనువాదాన్ని మారన ప్రతాపరుద్ర చక్రవర్తి సేనానాయకుడైన గన్న సేనానికి అంకితమిచ్చాడు.

కవి వృత్తిరీత్యా కృషీవలులు. జానపద సౌందర్యాన్నీ, సంప్రదాయాల కమనీయతనూ గుండెల్లో నింపుకున్నవారు. ఆ నేపథ్యం వలన కమ్మటి తెలుగు జాతీయాలూ, పలుకుబడులూ వారి పద్యాల్లో బహుళంగా మెరుస్తుంటాయి. పై పద్యమే చూడండి: తీర్థమాడుట, గాజువారుట, చేయికల్పుట, చిగురుపట్టుట, పసని నిగ్గులు లాంటి పలుకుబడులు ఎంత సొగసుగా ఉన్నాయో!

వేదులవారి కవిత్వంలో ఒక గాఢ విషాదపు జీర కనిపిస్తుంది. మహాప్రస్థానానికి పీఠికగా ఇచ్చిన యోగ్యతా పత్రంలో లోకమంతటి బాధా శ్రీశ్రీ బాధైతే, కృష్ణశాస్త్రి బాధ లోకమంతటిదీను అంటాడు చలం. అది కృష్ణశాస్త్రి ఒక్కడిదే అనుకోనక్కరలేదు. దాదాపు భావ కవులందరిలోనూ ఆ లక్షణముంది. వేదులవారి కవిత్వంలో ఐతే మరీను.

ఈ పద్యాలున్న చిరుకబ్బం–కేవలం 122 పద్యాలది, వ్రాసేనాటికి ఏతత్కవి వయస్సు కేవలం 12 సంవత్సరాలేనట! పన్నెండేళ్ళ వయస్సులో ఒకట్రెండు పద్యాలు గిలకడం అంత గొప్ప ఏమీ కాకపోవచ్చుకాని చిరస్థాయి ఐన ఒక చారిత్రక స్మృతికావ్యాన్ని మనోహరంగా శిల్పించడం అసామాన్యులకూ, కారణజన్ములకూ మాత్రమే సాధ్యమయ్యేపని.

కేవలం ద్రాక్షాసవపు గిండి మాత్రమే అయితే అది అసంపూర్ణమే. ఆ చషకాన్ని సాకీ ఒయ్యారంగా అందిస్తుంటేనే సందర్భానికి సార్థకత. ‘రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురపు విడెమ్ము’లాగా. అయితే అక్కడ రమణికీ స్వీకర్తకూ మధ్య ప్రియ దూతిక వుంది గాని, సాకీ స్వయంగానే రమణిలాంటిది.

…పరమేశ్వరునితో ఎన్ని రకాలుగా ముచ్చట్లు చెప్పాడో, ఎన్ని చోట్ల ఆశ్చర్యం పొందాడో, ఎంత బ్రతిమలాడాడో, ఎంత అలిగాడో, ఎంత కోపపడ్డాడో, ఎంత భక్తిభావాన్ని వెలార్చాడో, శివుణ్ణి ఎంత పరిహాసం చేశాడో, ఎన్ని వైవిధ్య భావాలను రాశిపోశాడో, ఎన్ని అద్భుతమైన సమాసాలు గుప్పించాడో, ఎన్ని విధాలుగా స్వామిని సంబోధించాడో, ఎంత ఛందస్సుందరంగా పద్యాలను పొదిగాడో…

మన పురాణాల్లోని కొన్నికొన్ని పాత్రలు అన్యాయానికి గురైనాయని మనకు అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కవి హృదయం సాధారణంగా ఆర్ద్రంగా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రల యెడ సహానుభూతి కలిగి ఉంటుంది. ఒక ఏకలవ్యుడు, ఒక ఊర్మిళ, ఒక అహల్య, ఒక కర్ణుడు లాంటి వారి యెడ ఏంతో అనుకంపనని చూపిస్తుంటారు చాలామంది. వాల్మీకి ఊర్మిళకు అన్యాయం చేశాడని వాల్మీకి రామాయణాన్ని మార్చబూనాడట పుట్టపర్తి నారాయణాచార్యులుగారు.

ఇండ్ల పెరళ్ళలో నాలుగైదు పెద్ద వృక్షాలు– మామిడీ పనసా లాంటివి ఉండటం సర్వసాధారణం. అలాంటి ఒక చెట్టు మీద పొద్దున్నే కాకి ఒకటి వచ్చి వ్రాలి కౌ కౌ అని అరుస్తున్నది. మరో చెట్టు మీద కోకిలలు కూర్చుని వాటి అరుపులను అవి తుహీ తుహీ అని అరుస్తున్నాయి. ఒక కూత వినపడగానే జవాబుగా కూయడం కోకిలలకు అలవాటు.

మోహావేశం రావాలంటే పరిసరాలూ ఆహ్లాదకరంగా ఉండాలి కదా. పర్యావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేది వసంతం కాక మరేమిటి? అందుకనే వసంతుణ్ణి వెంటపెట్టుకుని వచ్చాడు మన్మధుడు. వెన్నెల రాత్రుల్లో ఆ పూలూ, పరిమళాలూ లోకాన్ని సౌందర్యంతో ముంచెత్తుతుండగా తను పూల బాణాలు సంధిస్తే — శివుడయ్యేది కాని, మరెవరయ్యేది కాని — ఇక తిరుగేముంది అనుకున్నాడు మన్మధుడు.

మూలభారత కథలో దుష్యంతుడు కొద్ది గడియల సేపు మాత్రమే కణ్వాశ్రమంలో ఉండి శకుంతలను లోబరుచుకొని – కణ్వ మహర్షి వచ్చేలోగా వెళ్ళిపోతాడు. కాళిదాసు నాటకంలో దుష్యంతుడు మున్యాశ్రమంలో కొన్ని రోజులుండి, మునులకు రాక్షస బాధ లేకుండా చేసి, శకుంతలతో ప్రణయ కథ నడిపి వెళ్ళిపోతాడు. పిన వీరన దుష్యంతుణ్ణి చాలా రోజులు అక్కడ వుంచి – ప్రణయానికీ విరహానికీ, చంద్రోదయ వర్ణనకూ, యుద్ధ వర్ణనకూ – అన్నిటికీ అవకాశం ఆ సమయంలో కల్పించుకున్నాడు.

మణికంధరుడేమో గంధర్వుడు. విరాగి కాడు. అందుకని అమ్మాయిలను చూడగానే కొంచెం ముచ్చట పడింది అతని మనస్సు. నారదుడు అతని ముచ్చటకు ముచ్చట పడి, “సెబాశ్, మంచి కవివోయి నువ్వు,” అని మెచ్చుకోవడమే కాకుండా ఆ ఊహకు తన ఉత్సాహాన్ని కొంత జోడించి, “త్రైవిష్టప స్త్రీల యౌదల్ దన్నన్ జనునట్లు మించెననినన్ దప్పేమి, యొప్పేయగున్” అని ముక్తాయించాడు.

స్వతహాగా సత్య వీరనారి. నరకుని లాంటి వీరునితో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. ఆ ఉత్సాహం కొంత. తన పరాక్రమం భర్త ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు భర్త ముందు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆ ఆనందం కొంత. ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏకకాలంలో వీరాన్నీ, శృంగారాన్నీ ప్రదర్శిస్తున్నది.

ఏనుగు అరటి తోటలో పడిందంటే ఒక్కొక్కచెట్టునూ తొండంతో పెళ్ళగించి పారెయ్యకుండా వూరుకోదు. దానికి అరటి చెట్టంటే అంత వైరం ఎందుకో తెలుసుకోవాలని వుందా? వినండి. అందమైన అమ్మాయి తొడలను ఏనుగు తొండంతోనూ, అరటిచెట్టు బోదెతోనూ పోల్చడం మన ప్రాచీనకవులకు అలవాటు. ఇలాంటి అలవాట్లు చాలా వున్నాయి వారికి.

నిద్ర లేచిన భీముడు ‘ఎవరూ’ అని అడిగి, ద్రౌపది గొంతు గుర్తించి – కీచకుని దురాగతం నాకు చెప్పి వాణ్ణి చంపేందుకు నన్ను నియోగించడానికి వచ్చింది కాబోలు అనుకుంటూ, అయినా తన నోటితోనే విందామని నిశ్చయించుకొని – ‘ఇంత రాత్రివేళ ఎందుకొచ్చావు, ఎవరూ చూళ్ళేదు గదా’ అంటాడు. ఆమె ఆ మాత్రం అర్థం చేసుకోలేదా?

కవి చేమకూర వెంకటరాజు లోకంలో వెంకటకవిగా సుప్రసిద్ధుడు. ఆయన కావ్యం విజయవిలాసంలో ప్రతి పద్యం లోనూ చమత్కారం చూపిస్తానని శపధం చేశాడట ఈయన. అలాగే ప్రతి పద్యమూ ఆలోచనామృతం చేశాడని చెప్పవచ్చు. పైకి చూస్తే ఒక భావంతో కనిపించే పద్యంలో తవ్వుకుంటూ పోతే ఎన్నో విశేషార్థాలు ద్యోతకమౌతాయి. ఒక రకమైన రసానందం కలిగించే కావ్యమే ఇది.

ఒక ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న మనస్వి స్వానుభవపు తీవ్రత దీనిలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. గుండెలోని బాధని గుదిగుచ్చి పోసిన కవిత ఎంత ఆర్ద్రంగా, హృదయస్పర్శిగా వుంటుందో చెప్పడానికి ఈ చక్కని పద్యం ఒక మంచి ఉదాహరణ.

నర్తనశాల సినిమాలో ఘంటసాల గానం చేసిన ఈ పద్యం చాలామంది వినివుంటారు. భారతం విరాటపర్వం లోనిది ఈ పద్యం. కవి తిక్కన సోమయాజి. ఉత్తర గోగ్రహణ సమయంలో దుర్యోధనుణ్ణి ఓడించి, అతని ఎదురుగా నిలిచి అతన్ని ఉద్దేశించి అర్జునుడు ఎగతాళిగా ఎత్తిపొడుస్తూ చెప్పిన మాటలు ఇవి.

విదర్భ రాజపుత్రి రుక్మిణి. వివాహయోగ్యమైన వయసు వచ్చింది ఆమెకు. చిన్నతనం నుంచీ శ్రీకృష్ణుని పరాక్రమమూ, లీలలూ విని వుందేమో – ఆయననే పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. కానీ ఆమె అన్న రుక్మికి అది ఇష్టం లేదు. తన స్నేహితుడైన చేది రాజు శిశుపాలునికి చెల్లెలినివ్వాలనేది అతని ఉద్దేశం.

హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి, అక్షకుమారాది దైత్యులను చంపి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి ఐచ్ఛికంగా లొంగిపోయి, రావణుని సభలోనికి తీసుకురాబడి – అక్కడ అవకాశం దొరికే సరికి రావణునికి హితబోధ చేసే సందర్భం లోనిది ఈ పద్యం.

హిమాలయాల్లో ప్రవరుడు, భగీరథుడు తపస్సు చేసిన చోటు, శివుని కంటిమంటకు మన్మధుడు బూడిద అయిన చోటు, సప్తర్షుల భార్యలను మోహించి అగ్నిదేవుడు విరహం అనుభవించిన చోటు, కుమారస్వామి పుట్టిన చోటు – ఇలా చాలా ప్రదేశాలు చూస్తాడు.

కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మూడోరోజు భీష్ముని యుద్ధపరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. సారధి అయిన కృష్ణుడిని కూడా ముప్పుతిప్పలు పెడుతున్నాడు.

బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన.

ఇక ఆమె కూర్చున్న వైఖరి – రావణ నిర్మూలనానికి, అంటే అధర్మ నిధనానికి సన్నద్ధుడైన శ్రీరాముని పూనిక రూపం దాల్చినట్లు – లోనే ఆమె నిశ్చయమూ, ఆమె నిశ్చలతా, తన భర్త యెడ ఆమెకు గల అనంత విశ్వాసమూ అన్నీ ద్యోతకమౌతున్నాయి.

అంతవరకూ శ్రీరాముడు తల్లిదండ్రుల చాటు బిడ్డ. అదే ప్రథమంగా రాజభవనాల్లోంచి విశాల ప్రపంచంలోకి ఒక బాధ్యతను నెత్తిన వేసుకొని రావడం.

మొల్ల అంటే మల్లెపూవు. కవయిత్రి మొల్ల రామాయణాన్ని తలచుకోగానే మనసుకు ఒక కమ్మని పూతావి సోకినట్లుంటుంది. ఆమె తన భక్తినీ, కవితాశక్తినీ కలబోసి క్లుప్తంగా ఓ మనోహరమైన రాయాయణాన్ని తెలుగు భాషకు దయచేసింది.

ఆరెకులు బిక్కమొగం వేసుకుని చూస్తుండగా, ఆడవాండ్లు నవ్వబట్టారట. ఖంగుతిన్న ఆరెకులూ, నవ్విన ఆడువారూ పరువంలో వున్నవారైతే ఆ దృశ్యం సొగసు చెప్ప తరమా!

నమస్కరించినా మోమైనా ఎత్తి చూడలేదే అని ఒళ్ళు మండుతుంది దేవదేవికి. ఈ స్వామి దొంగస్వామి అని తేల్చేస్తుంది. అక్క కాదని చెప్పినా వినదు. స్వామి నిజంగానే విరాగి.

నాటకం బలిజేపల్లి లక్ష్మీకాంత కవిది. కాటి సీనులో బలిజేపల్లి వారి పద్యాలతో పాటు మరో మహాకవి పద్యాలు – కేవలం శ్మశానాన్ని వర్ణించేవి – నటకులు పాడటం పరిపాటి అయింది.

ఇది ఏదో ఒక పతివ్రతా స్త్రీ తన భర్తను గూర్చి పలికే చిలక పలుకుల్లా అనిపించడం లేదు. అతడు కేవలం మానవుడే? అని నిజంగా ఆశ్చర్యపోతున్నది.

వసంతోత్సవం అనేది ఒక ఉల్లాసకరమైన పండుగ. ఇలాంటిదాన్ని వర్ణించే అవకాశాన్నీ ఏ కవి వదులుకుంటాడు? శ్రీనాధుని వంటి రాసిక్య రాశి అసలే వదులుకోడు.

బహూశా విశ్వనాథ సత్యనారాయణ రావణాసురుడంతటి వాడు. ఈమాట నేను చులకన భావంతో అనడం లేదు. ఆయన సర్వజ్ఞత, సమర్థతల మీద అపారమైన గౌరవంతో అంటున్నాను. ఆయన ఊహాదృష్టి ప్రసరించని ప్రదేశం ఈ చతుర్దశ భువనాల్లో ఉండి వుండదు. ఆయన ఊహలూ, కల్పనల అపురూపత మరే కవిలోనూ కానరాదు.

ముఖ్యంగా మన తెలుగిండ్లలో ఆడపడుచులకు వుండే స్వతంత్రం చెప్పనలవి గానిది. పెండ్లయి అత్తింటికి పోయినా పుట్టింటి ధ్యాస వుంటూనే వుంటుంది వారికి. అన్నలూ, తమ్ములూ, వారి కాపురాలూ క్షేమంగా వుండాలని కోరుకునేది ఆడబడుచే.

ఎంతో మురిపెంగా నాలుగు రోజులు మునిపత్నులతో గడిపి వద్దామని బయలుదేరిన సీతకు ఈ ఆజ్ఞ వినడం పిడుగుపాటే అయింది. తాను ఏ నేలమీద నిలబడి ఉన్నదో ఆ నేల గభాలున పగిలి తానందులో కూరుకొని పోతున్నట్లుగా అనిపించింది.

ప్రధాన పాత్రలయిన రాజకుమారుని గురించో, రాజకుమార్తె గురించో కొంచెం పొగుడుతారు. రాగాలతో, సరాగాలతో ఆ పాత్ర ఎవరో సభికులకు పరిచయం చేస్తారు. కొద్దిపాటి బూతునూ, సమయానుకూలంగా సంభాషణల్లో చొప్పిస్తారు.

అర్జునుడు ఈ విధంగా జనులను ఆశ్చర్యమగ్నులను చేస్తుండగా ద్వారం దగ్గరకు ఒక యువకుడు వచ్చి భుజం చరుస్తాడు. ఆ శబ్దం కొండ మీద పడే పిడుగుపాటు లాగా భయంకరంగా వినిపిస్తుంది.

గౌరి పరమ సుకుమారి. గొప్ప సౌందర్యవతి. వయస్సులో వున్న కన్యక. మిక్కిలి నిష్ఠతో, శివారాధన తాత్పర్యంతో, నితాంత తపోవృత్తిలో నున్నది. చక్కనమ్మ చిక్కినా అందమే గదా.

నీవేమో నీ ప్రతాపంతో ఇంద్రుని గెలిచావు. కానీ నన్ను చెరపట్టి లాక్కు రమ్మన్నావు. చెరబట్టడం ఏం వినోదం? నీకు వినోదం గావచ్చు గానీ, చెరబట్ట బూనితే నా మనస్సు బాధ పడదా?

మల్లికార్జున భట్టు పద్యాన్ని మొల్ల చూసే ఉంటుంది. చూసింతర్వాత ఆకర్షింపబడి కొద్ది మార్పులతో తన పద్యాన్ని తాను వ్రాసుకొని పైపద్యం మీద తన గౌరవం ప్రకటించింది.

తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే వేరు.

తన జైత్రయాత్రల సందర్భంగా కృష్ణా తీరంలోని శ్రీకాకుళం అనే వూరిలో ఒక రాత్రి ఉండగా, ఆ వూరి గుడి లోని శ్రీ ఆంధ్రమహావిష్ణువు కలలో కనిపించి ఆముక్తమాల్యద వ్రాయమని ఆదేశించినట్లు ఆయనే ఆ కావ్యంలో చెప్పుకున్నాడు. చెప్పినది తెలుగుదేశం లోని గుళ్ళో దేవుడు. వ్రాసినది కర్నాటక చక్రవర్తి. కథ జరిగినది తమిళ దేశంలో – ఎంత మంచి సన్నివేశమో గమనించండి.

శృంగార నైషధం నల దమయంతుల కథ. వారిద్దరి మధ్యా సఖ్యతను పెంపొందింప జేసి ప్రేమను కలిగించింది ఒక హంస. ఈ హంస మొదట నలుని ఉద్యానవనం లోని కొలనులో విహరిస్తూ నలునికి పట్టుబడుతుంది. తనను రక్షించి వదిలి పెట్టమని వేడుకుంటున్న సందర్భం లోనిది ఈ పద్యం.

శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా     షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా     శోణం బయ్యెఁ బతంగ […]

కురుసభకు రాయబారానికి పోయేముందు కృష్ణుడు పాండవుల అభిప్రాయాన్ని తెలుసుకుంటాడు. ఆ సందర్భంలో తన అభిప్రాయాన్ని పై విధంగా చెప్పింది ద్రౌపది.