నాకు నచ్చిన పద్యం: ఎఱ్ఱన ప్రాభాత వర్ణనం

చం.
స్ఫురదరుణాంశు రాగరుచి బొంపిరివోయి నిరస్త నీరదా
వరణములై దళత్కమల వైభవజృంభణ ముల్లసిల్ల, ను
ద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళ జూడగన్.

మహాకవి ఎఱ్ఱాప్రగడ పద్యం ఇది. నన్నయభట్టు మిగిల్చిన భారతారణ్యపర్వపు శేషభాగాన్ని పూరిస్తూ ఎఱ్ఱన వ్రాసిన తొట్టతొలి పద్యం. నన్నయ శరత్కాలపు రాత్రులను వర్ణిస్తూ తన కవిత్వాన్ని ముగిస్తే, ఎఱ్ఱన దానికి కొనసాగింపుగా శరత్సమయ ప్రాభాత వేళలను కళ్ళక్కడుతూ వ్రాసిన పద్యం. శారద రాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్ అంటూ ప్రారంభించి, సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచిపూరములంబరి పూరితంబులై అంటూ ఎంతో మనోహరంగా శరద్యామినీ వేళలను చక్కని పద్యంలో రూపుకట్టించాడు నన్నయ. అంతే మనోజ్ఞమైన మరో పద్యంలో రాగరంజితమైన సూర్యప్రకాశాతిశయాన్ని వర్ణిస్తూ–మబ్బులూ, విచ్చుకునే తామరలూ, తెల్లవారేవేళల్లో పక్షులూ తుమ్మెదలూ చేసే మధురనాదాలూ–వీటితో కళ్ళకూ చెవులకూ విందుచేశాడు ఎఱ్ఱన. నిరస్తనీరదావరణములై… శారదాకాశంలో మబ్బులుంటాయి. కానీ నిర్జలాలు. స్వచ్ఛమైన, ప్రశాంతమైన, ఆకాశంలో తెల్లగా మెరిసిపోయే నిరస్తనీరదాలు. రిత్త మబ్బులు. పర్యావరణమంతా ప్రశాంతంగా ఉండే ప్రొద్దు. పిట్టల కువకువలూ, తుమ్మెదల ఝాంకృతులూ–ఆ ప్రశాంతతకు మాధుర్యాన్ని అద్దేవేగాని భంగం చేసేవి కావు. ఇంత చక్కని దృశ్యాలతో, ఇంత హాయైన పద్యంతో ఎఱ్ఱన తన భారత పూరణాన్ని ప్రారంభించాడు. సుధాంశుని నుంచి నిమ్మళంగా అరుణాంశుని వద్దకు కథను జరిపాడు.

పదకొండో శతాబ్దపు మొదటి సగంలో నన్నయ ప్రారంభించిన భారతానువాదం అరణ్యపర్వం నాలుగో ఆశ్వాసం సగం దాకా సాగి ఆగిపోయింది. ఆ పిమ్మట పన్నెండో శతాబ్ది ఆఖర్లోంచి పదమూడో శతాబ్ది తొలి ఏడాదులవరకూ– విరాట పర్వం నుంచి చివరిదాకా–తిక్కన పూర్తిచేశాడు. ఆ తర్వాత దాదాపు వందేండ్లకుగాని నన్నయభట్టు విడిచిన అరణ్యపర్వ శేషాన్ని స్పృశించే మహానుభావుడు రాలేదు. ఎఱ్ఱన పూనుకొని ప్రయత్నించేవేళ ఆయన ఒక చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కేవలం పూరణం అయిందనిపించడం ఆయన ఉద్దేశ్యం కాదు. తాను చేసే పూరణ నన్నయ తిక్కనల కవిత్వాలకు ఒక అందమైన అనుసంధానంగా కుదిరిపోవాలి. ఆ ఇద్దరివీ రెండు విభిన్న శైలులు. ఐనా దేనికదే ఉత్కృష్టమైనది. ఆ మహనీయుల మధ్యలో తన కవిత పేలవంగా ఉండిపోరాదు. నన్నయ కవిత్వంలోని మృదు సంస్కృత పదాల బాహుళ్యమూ, ప్రసన్నతా; తిక్కన శైలిలోని నాటకీయతా, నిరాడంబరంగా, నిసర్గంగా ఉంటూనే ప్రౌఢిమను నింపుకున్న అద్వితీయ ధోరణీ; ఈ రెంటిలో దేన్నీ వదలడం కుదరదు. ఎఱ్ఱనకు నన్నయ అన్నా, తిక్కన అన్నా మహా గౌరవం. వారిపేర్లు వింటే చాలు, పరవశించేంత మన్నన. వారు ‘ఆద్యులు, అబ్జాసనకల్పులు’. వారి కవిత్వాన్ని హృద్గతం కావించుకున్నాడు. మరీ తిక్కననైతే ‘తను కావించిన సృష్టి తక్కొరుల చేతంగాదు’ అని స్పష్టమైన అభిప్రాయం చెప్పాడు. అరణ్యపర్వం నన్నయ ప్రారంభించాడు కాబట్టి ఆయన పేరుతోనే వ్రాసి పూర్తి చేద్దామనుకున్నాడు. ‘నన్నయభట్ట మహాకవీంద్రు సరస సారస్వతాంశ ప్రశస్తి తన్ను చెంది’నట్లు అనుభూతి పొందినాడు. అందుకని ‘తత్కవితా రీతియు గొంతదోప-తద్రచనయకా’ అరణ్యపర్వ శేషపూరణకు ఉపక్రమించాడు. సందేహం లేదు. ఆ కార్యం జయప్రదంగా నిర్వహించాడు.

ఎఱ్ఱన గొప్ప వినయ సంపన్నుడు. నన్నయ తిక్కనల ఎడల ఆ వినయం మరీ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అది అతి వినయం ధూర్త లక్షణం లాంటిది కాదు. కొందరు తమ గర్వాన్ని వినయంగా ప్రదర్శిస్తుంటారు. ఇది అలాంటిది కాదు. తన సమర్థత తాను ఎరిగి, మరి ఇరువురు మహా సమర్థులతో సహమాన్యత పొందగోరుతున్న ఒక మనీషి యొక్క నైజ వినయం. లేకపోతే ‘కతిపయాక్షర పరిగ్రహ జనితంబైన నైసర్గిక చాపలంబు కతంబున’ అనీ, ‘రాయంచలు గూయుచుండ క్రౌంచమును నావల కూయదొడంగు భంగి’ అనీ, చెపుతూ ‘ప్రౌఢాంచిత శబ్దసారులు మహాకవులాద్యులు కావ్య శయ్య గీలించిన కీర్తి సంగసుఖలీలకు నేనును కాంక్షజేసితిన్’ అనగలడా! కీర్తిసంగ సుఖలీలకు నేనూ కాంక్షించాను అని అనడం ఆయన సహజ మానవీయ స్వభావం. అరమరికలు లేని ఆయన అంతరంగానికి అద్దం పడుతున్నది.

ఎఱ్ఱన భారతారణ్యపర్వ శేషాన్ని నన్నయభట్టులాగా ప్రారంభించి క్రమంగా తిక్కన సోమయాజి శైలితో ముగించాడని కొందరు పెద్దలు చెపుతారుగాని అంత స్పష్టంగా విభాజనం చేయలేమనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇద్దరి పద్యాల శైలీ ముందూ వెనకా అని లేకుండా చాలా చోట్ల కనిపిస్తాయి. అయినా నన్నయ శైలీ తిక్కన శైలీ అని అంటం పోలికకేగాని ఎఱ్ఱన పద్యాలు ఆ కవులకు అనుకరణలు కావు. ఆయన స్వీయ ప్రతిభాజనితాలు. ఖచ్చితంగా ఎఱ్ఱాప్రగడ పద్యాలు అని తన ముద్రను కనిపించీ కనిపించకుండా చూపించడం కేవలం తాను నిర్ణయించుకున్న అసిధారా చలన ధోరణి వల్లనే. చదువుతుంటే ప్రాణం లేచొచ్చేంత ముచ్చటగా ఉండే పద్యాలు వ్రాశాడు ఎఱ్ఱన కవి. ఉదాహరణకు పై పద్యం చూడండి: ‘స్ఫురదరుణాంశు రాగరుచి, పొంపిరివోవు – నిరస్తనీరదావరణములు, వైభవజృంభణము – వాసర ముఖంబులు లాంటి పదబంధాలు పద్య ధారనూ ధోరణినీ ఎంతో హాయిగా సంపద్వంతం గావించాయనిపిస్తుంది.

ఎఱ్ఱన పద్య శైలికి మరో ఉదాహరణ మనవి చేస్తాను. పాండవులు ఆశ్రమంలో లేనపుడు ద్రౌపది ఒంటరిగా ఉండగా సైంధవుడు వచ్చి కామించి, తిరస్కరించబడి, ఆమెను బలాత్కారంగా తన రథం మీద పెట్టుకొని బయలుదేరుతాడు. ద్రౌపది కొంత ప్రకంపితచిత్త అవుతుందిగాని పెద్దగా భయపడదు. ఈ దౌర్భాగ్యుడు ఎట్లయినా తన భర్తల చేతుల్లో తన్నులు తింటాడని నమ్మకం ఆమెకు. అప్పుడు తన భర్తలను గురించి వాడికి చెపుతుంది. ధర్మజుని గురించి రెండు పద్యాల్లో, భీమార్జునులను గురించి చెరో పద్యంలో, మాద్రేయులిద్దరిని గురించీ ఒక వృత్తంలో వివరిస్తుంది. ఎంత అద్భుతమైన పద్యాలవి! విరాట పర్వంలో కీచకునితో తన భర్తలందరి పరాక్రమాన్ని గురించి ఒకే పద్యంలో ‘దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ‘ (తిక్కన) చెప్పిందిగాని, ఇక్కడ సమయముండటంవల్లా, సైంధవుడు కీచకుడంతటి భయంకరుడు కానందువల్లా, తమ ఉనికి వెల్లడౌతుందేమోననే భయం అప్పుడు లేనందువల్లా, తీరిగ్గా తన భర్తలను ఒక్కొక్కళ్ళను గురించి వివరించింది. అంతే కాదు, ఆమెకు తన భర్తల ఎడ ఉండే మహా ప్రేమాతిశయం వల్లా, వారి ఎడ ఉండే గౌరవం వల్లా, తనకు వారిపై ఉండే నమ్మకం వల్లా, అదే సందర్భంలో మళ్ళీ మరోసారి వాడికి పరిచయం చేస్తుంది. తన భర్తల వ్యక్తిత్వాలను మహాద్భుతంగా మూర్తి కట్టిస్తుంది. సంగతి తెలిసి వెంటపడి తరుముకుంటూ వచ్చే పాండవులను చూసి ‘వీరు నీ మగలేనా, వీరెవ్వరు ఏవిధమువారు చెపుమ’ అని అడిగితే, ‘అనాదర క్రోధ ఘూర్ణిత’ అయి ‘ఇంక వీరినెఱిగితేనియు నెఱుగకనుండితేనియు చేయునొండుగలదె’ అని ‘అయినను నన్నడిగితివి గావునం జెప్పెద నింతియగాని నీవలన నాకు భయంబించుకంతయు గలుగదు’ అని వారి మూర్తిమత్వాన్ని మురిసిపోతూ చెపుతుంది. ఈ రెండుసార్లూ చెప్పిన పద్యాలు మణిమకుటాయమానాలు. కొన్ని పద్యాలు అలా కుదిరిపోతాయి. నన్నయభట్టు ఉదంకోపాఖ్యానంలో ‘బహువన పాదపాబ్ధి’ ఆదిగాగల నాగస్తోత్రం చేసేటప్పటి పద్యాలూ, రామాయణ కల్పవృక్షంలో శ్రీరాముడు శివధనుర్భంగం కావించినప్పటి ఐదారు విశ్వనాథవారి పద్యాలూ, తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ విజయాల్లోని ‘చెల్లియొ చెల్లకో, అలుగుటయే ఎరుంగని, జెండాపై కపిరాజు, సంతోషంబున సంధి సేయుదురె’ అనే నాలుగు పద్యాలు–లాగా ఎఱ్ఱనగారి పైన పేర్కొన్న పద్యతతి అలా కుదిరిపొయ్యాయనిపిస్తుంది.

ఎఱ్ఱనగారికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వుంది. మనకాలంవారు ఏర్పాటుచేసిన కొలతబద్దల ప్రకారం చూస్తే భారతంగానీ హరివంశంగానీ ప్రబంధాలు కావు. అప్పటివారు ప్రబంధం అనే పదాన్ని కావ్యం అనే సామాన్యార్థంతోనే వాడారు. ఎఱ్ఱన వ్రాసిన కావ్యాల్లో నృసింహ పురాణము ఒక్కటే ప్రబంధం అనిపించుకునే కొలబద్దలకు సరిపోతుంది. అయినా నృసింహ పురాణం వ్రాయకముందే, భారతారణ్యపర్వ పూరణం వల్లనే ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది. చూడండి: ‘ప్రబంధ పరమేశుడనంగ నరణ్యపర్వ శేషోన్నయ మంధ్రభాష సుజనోత్సవ మొప్పగ నిర్వహించితివి’ అని ఎఱ్ఱన తాతగారు ఎఱపోతన సూరిగారు అన్నారు.

ఎఱ్ఱన హరివంశంలోని పద్యాలూ, నృసింహ పురాణంలోని పద్యాలూ భాగవతంలో పోతన్నకు స్మరణీయాలూ, అనుసరణీయాలూ అయినవి. అందుకు అనేక ఉదాహరణలు చూపించవచ్చుగాని ఇది సందర్భం కాదు.

ఎఱ్ఱాప్రగడ రామాయణం కూడా రచించాడనీ, అది లభ్యం కావడంలేదనీ అంటారు. ఎఱ్ఱాప్రగడ రామాయణంలోవని ఒకట్రెండు పద్యాలు కొందరు లక్షణ కర్తలుదాహరించడమే ఈ అపోహకు ఆధారం. ఆ ఊహ నిజమై, ఇరవైయవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో హఠాత్తుగా నన్నెచోడుని కుమారసంభవం ప్రత్యక్షమైనట్లు ఎఱ్ఱన రామాయణం కూడా మున్ముందెపుడైనా ప్రత్యక్షమైతే తెలుగు భాషా, తెలుగు జాతీ చేసుకున్న అదృష్టం పండినట్లే.

ఎఱ్ఱనను కేవలం నన్నయ తిక్కనల మధ్య కొంతభాగాన్ని అతుకువేసినవాడిగా చూడగూడదు. నన్నయ తిక్కనలతో సమాన స్కంధుడైన మరో మహాకవి కవిత్వం కేవలం అతుకు కాదు. అదీ మూడున్నర ఆశ్వాసాల విస్తృతి కలిగిందే. అతుకులు వేసిన కవులూ ఉన్నారు. వెలిగందల నారయ, ఏల్చూరి సింగన పోతన భాగవతంలో శిథిల పూరణం చేశారు. భాస్కర రామాయణంలో కూడా భాస్కరుడు కాక ఇతరులు చేయిచేసుకున్నారు. వారెవ్వరికీ రాని మహాకీర్తి ఎఱ్ఱనకూ ఆయన పద్యాలకూ వచ్చిందంటేనే ఆయన ప్రాముఖ్యం తెలుస్తుంది.

నేను చాలా గొప్పగా అభిమానించే కవుల్లో ఎఱ్ఱన మొదట మొదట్లోనే పేర్కొనబడే మహనీయుడు. ఆయన ప్రారంభించి సాగించిన దీర్ఘ కవితా ప్రయాణంలో తొట్టతొలి పద్యం–పైన పేర్కొన్నది–కేతనప్రాయమైందని చెప్పొచ్చు.

అన్నట్టు ఇంకో ముచ్చట చెప్పి ముగిస్తాను. నన్నయభట్టు ఆఖరి పద్యంలో ‘పాండు రుచిపూరములంబర పూరితంబులై’ అనే చోట రుచిపూరములం-బర పూరితములై అని విరిచి, తద్వారా ఇక భారతం పరులచే పూరించబడుతుందని ఆయన సూచించాడని కొందరన్నారు. అలాగే ‘స్ఫురదరుణాంశురాగరుచి’ అనే పద్యంలో, తాను ఇక రంగం మీదికి వచ్చానని ఎఱ్ఱన సూచించాడనీ అంటారు. అయితే అక్షరాల మధ్యలోంచి ఏదో ఒక వింతను బయటకు లాగే ప్రయాసే గాని అలాంటి సూచనలు వారు ఉద్దేశించి ఉండకపోవచ్చు!

మొన్న ఒక మిత్రుడు మాట్లాడుతూ శారదరాత్రుల పద్యంలో నన్నయ 16 రకారాలు ప్రయోగించాడు గమనించారా? అని అడిగాడు. అదొక తమాషా. అందులో పెద్ద విశేషం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నన్నయే దానిని గమనించి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నేను వెంటనే ఎఱ్ఱన ‘స్ఫురదరుణాంశు…’ పద్యంలో లెక్కిస్తే 15 రకారాలు ఉన్నాయి!