శా. సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోభాసితున్
బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రనిస్త్రింశు శౌ
ర్యాలంకారు సువర్ణవర్ణు ఘనుఁ కర్ణాఖ్యున్ జగత్కర్ణపూ
ర్ణా లోలద్గుణుఁ జూచి చూపఱు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్
ఈ పద్యం ఆదికవీ, వాగనుశాసనుడు అయిన నన్నయ భట్టు రచించినది. భారతం ఆదిపర్వం ఆరవ ఆశ్వాసం లోనిది. కురు పాండవ కుమారులు అస్త్రవిద్యా ప్రదర్శనం కావించే సందర్భం లోనిది. మహాభారత రంగం మీదికి కర్ణుని పాత్ర ప్రవేశాన్ని దృశ్యమానం చేసే పద్యం.
(ఈమాటలో ‘నాకు నచ్చిన పద్యం’ శీర్షిక ప్రారంభంలోనే నన్నయ భట్టు పద్యం రావలసి వుండింది. కానీ, ఇది నేను ప్రణాళికతో ప్రారంభించినది కాకపోవడం వల్లనూ, దీనిని చదువుతున్న పాఠకులు సహృదయపూర్వకమైన స్పందనతో దీనినింత కాలం ఆదరించి కొనసాగింపజేస్తారనీ ఊహించలేకపోవడం వల్లనూ – కవుల పద్యాలను పరిచయం చేయడంలో ఒక కాలక్రమాన్ని పాటించలేదు. అయినా, పాఠకులు నన్ను మన్నన చేసి ప్రోత్సహించారు. అందుకు అందరికీ వందనాలు.)
తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా ఛందోబద్ధ పద్యాన్ని అభిమానించే ఎవరైనా తమ మొదటి వందనం అర్పించేది నన్నయ భట్టుకే. ఆయనకు ఆ అర్హత కేవలం ఆదికవి ఐనందువలన మాత్రమే వచ్చినది కాదు. పద్యవిద్యకే ఆద్యుడాయన. ఎంతో ప్రసాద గుణ మాధుర్యంతో, చెవికి ఇంపు గొలిపే పదాల ప్రయోగంతో, ఏ మాత్రం అడ్డూ ఆపూ లేక ప్రశాంత గంభీరంగా సాగిపోయే ధారతో – తెలుగు పద్యం సౌందర్యం వెలార్చింది ఆయన చేతిలోనే.
అంత ప్రసన్నంగా, అంత సుభగంగా, అంత మార్దవంతో నన్నయ తర్వాత వేరెవరూ పద్యం రాయలేదని అంటే అతిశయోక్తి కాదు. అల్పాక్షరాలతో భావగర్భితంగా రసాభ్యుచితంగా తిక్కన వ్రాసి వుండవచ్చు. మహా ప్రౌఢంగా శ్రీనాధుడు వ్రాసి వుండవచ్చు. భక్తి బంధురంగా పోతన వ్రాసి వుండవచ్చు. ప్రౌఢంగానూ, గొప్ప విద్వత్కాంతితో మెరిసిపోయేట్టు పెద్దన వ్రాసి వుండవచ్చు. ముద్దులారే పలుకులతో తిమ్మన వ్రాసి వుండవచ్చు. కానీ, ఆది, సభా, అరణ్య పర్వాలలో నన్నయ వ్రాసిన 3906 గద్య పద్యాలు – దాదాపు అన్నీ, మరీ ముఖ్యంగా వృత్తాలు – ఒకే ప్రసన్నతను వెలువరిస్తూ వుంటాయి. ఇది సాధారణ కవిమాత్రునికి సాధ్యమయే పని కాదు. తన రచన భగవదాదేశంగానూ, ఒక విధ్యుక్తమైన కర్మగానూ భావించి, ఒక వైదిక భావనను ఆవేశింప జేసుకున్న మహాతపస్వి మాత్రమే అటువంటి సృష్టి చేయగలడు. తిక్కన నన్నయను సాక్షాత్తూ ‘విద్యా దయితుండు’ అని గౌరవించాడు. ఎఱ్ఱా ప్రగడ అయితే ‘నన్నయ భాట్టు మహాకవీంద్రు సరస సారస్వతాంశ తన్ను జెందుటయూ, తద్రచనయ గా’ అరణ్య పర్వ శేషం పూరించాననీ తన వినయాన్నీ, నన్నయ భట్టు ఎడల తన గౌరవాన్నీ ప్రకటించాడు. విశ్వనాధకు ‘ఋషి’ వంటి నన్నయ్య ‘రెండవ వాల్మీకి’.
నన్నయ పద్యాల్లోని ఆ ప్రసాద మాధుర్యాలకు కారణం ఎక్కువగా సంస్కృత పదాలు వాడడమే అంటే అది కొంతవరకే నిజం. సంస్కృత పదాలు ధట్టించి తెలుగు పద్యాలు వ్రాసిన కవులు చాలామందే వున్నారు. నిజానికి పద్యమంతా పరుషమైన శబ్దాలను పొడుగైన సంస్కృత సమాసాలలో కూర్చి గుప్పిస్తేనే ప్రౌఢంగా వుంటుందని భావించి ప్రయత్న పూర్వకంగా అలా వ్రాసిన కవులూ తక్కువేమీ లేరు. కానీ, నన్నయ ఏరుకున్న సంస్కృత పదాలు చాలా మృదువైనవి. పెద్ద పెద్ద సమాసాలను నిబంధించేటప్పుడు గూడా ఆరేడు చిన్న చిన్న పదాలను ఒక దాని వెంట ఒకటిగా ఒక మాలలోకి పూలెక్కించినట్లు అమర్చుతాడే గానీ గుచ్ఛంగా నిబంధించడు. పద్యం మొత్తం సంస్కృత పదాల గొలుసుగా వున్నా కూడా, ఆ పదాలు వేటికవే విడివిడిగా అర్ధం అవుతాయి. పూలమాల లోంచి మెల్లిగా దారాన్ని లాగేసినా ఒక్క పువ్వూ వసి వాడకుండా విడివడినట్లు – పదాలు విడిపోతాయి. ఈ పద్యం చూడండి:
జలధి, విలోల, వీచి, విలసత్, కల, కాంచి, సమంచిత, అవనీ
తల, వహన, క్షమంబయిన, దక్షిణ హస్తమునం, తత్ ఉన్నమత్
గళత్, ఉరు, ఘర్మ, వారి, కణ, కమ్ర, కర అబ్జము, పట్టి, నూతిలో
వెలువడ, కోమలిన్, దిగిచె, విశ్రుత కీర్తి, యయాతి, ప్రీతితోన్
సంస్కృతంతో విశేష పరిచయం లేకున్నా, మన తెలుగు కావ్యాలు చదివే సామాన్య పాఠకునికి గూడా పెద్ద కష్టం పడకుండానే అర్ధమయ్యే సంస్కృత పదాలే ఎక్కువగా నన్నయ వాడాడు. (ఈ పద్యాన్ని నేను విడగొట్టి వ్రాయటం వల్ల అది మరింత సులభతరం ఏమీ కాలేదు). “ముహోర్ముహోర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల” అంటూ పెద్దన వలె పదాలతో నాట్యం చేయించే పని పెట్టుకోలేదు. “మరుద్రయ దవీయః ప్రేషితోద్యచ్ఛదో వంచత్కీటా కృత వ్రణచ్ఛలనవి వ్యాపాదితా ధ్వన్య నిస్సంచారాత్య” అంటూ కృష్ణరాయని వలే నిఘంటువులు వెతికించే పని పెట్టుకోలేదు. “సముదగ్ర నిరర్గళ ఘర్ఘరాభటీ లగన ఘనోచ్చలజ్జల ఝుళంఝుళ నిర్ఝర జర్జరీ గళన్నగ నిగళచ్చిలాగణ ఘణంఘణ ఘోషణ భీషణంబుగా” పిడుగులు కురిపించలేదు, పింగళి సూరన లాగా. ఆఖరకు సభాపర్వంలో భీముడు మహావేశంలో ప్రతిజ్ఙలు చేసిన ఘట్టంలో ఉపయోగించిన పదాలు కూడా, కేవలం పండ్లు కొరికినంత మాత్రమే శబ్దించాయి. ఇంత మృదువుగా, కోమలంగా పద్యాన్ని నడిపించడం ప్రయత్న పూర్వకంగా సాధించాడో, సహజ సిద్ధంగా అబ్బిందో కానీ, కమ్మని పద్యాలు తెలుగువారికి లభించాయి. తిక్కన పదిహేను పర్వాలలో పద్యాల కన్నా, నన్నయ మూడు పర్వాల్లోని వందలాది పద్యాలు చాలామందికి వాచోవిధేయంగా వుండడానికి ఆ పద్యాలలోని మాధుర్యధారే కారణం. ఇది నన్నయ పద్య విద్యకు సంబంధించిన ముచ్చట. ఇక, పైన ఉటంకించిన పద్యం లోకి పోదాం.
భీష్మ ద్రోణాదులైన పెద్దలు అస్త్రవిద్యాభ్యాసం పూర్తి చేసిన పాండవ కౌరవులకు తాము నేర్చుకున్న విద్యలను ప్రదర్శించే పరీక్షకు ఏర్పాటు చేస్తారు. కుమారులందరూ అప్పుడప్పుడే యౌవనం లోనికి ప్రవేశిస్తున్నారు. ఒక బహిరంగ ప్రదేశంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ధృతరాష్ట్రుడూ, గాంధారీ, కుంతీ, భీష్మాదులు ఒకవైపు ఆశీనులై వున్నారు. చూడటానికి వచ్చిన ఆశేష ప్రజా కూర్చుని వున్నారు. తమ్ముళ్ళ గుంపుతో సుయోధనుడొక వైపూ, ద్రోణుని ముద్దుల శిష్యుడైన అర్జునుని ముందు పెట్టుకొని ఐదుగురు పాండవులు ఒక వైపూ వున్నారు. ముందు భీమ దుర్యోధనుల గదాయుద్ధ ప్రదర్శన జరిగింది. అది ప్రదర్శనగా కాక “భావి పాండవ కౌరవ్య రణాభి సూచన పటిష్ఠంబయ్యె”నట. వారిని విడదీసిన తరువాత అర్జునుడు తన చాప కౌశల్యాన్నీ, అస్త్రవిద్యను అమోఘంగా ప్రదర్శిస్తాడు. జనం బాగా మెచ్చుకుని, అతణ్ణి పొగుడుతూ జయజయ ధ్వానాలు చేస్తారు. కొడుకు పేరు ప్రతిష్ఠలకు కుంతి పులకిస్తుంది.
అర్జునుడు ఈ విధంగా జనులను ఆశ్చర్యమగ్నులను చేస్తుండగా ద్వారం దగ్గరకు ఒక యువకుడు వచ్చి భుజం చరుస్తాడు. ఆ శబ్దం కొండ మీద పడే పిడుగుపాటు లాగా భయంకరంగా వినిపించితే – భీతులై పాండవులంతా ద్రోణుని దగ్గరకూ, కౌరవులంతా దుర్యోధనుని వద్దకూ చేరతారు. అంత భయాశ్చర్యాలు కలిగించిన ఆ శబ్దంతో పాటు ద్వారం దగ్గర ఓ ఆకారం ప్రత్యక్షమయింది. పై పద్యం ఆ సందర్భంలో ఆ యువకుని వర్ణించేది. మహాభారత రంగం మీదికి ఒక ప్రముఖ పాత్ర – కర్ణుని – ప్రవేశాన్ని కండ్లకు కట్టించే సన్నివేశం లోనిది. అప్పటికే అతనెవరో, అతని గుణగణాలేమిటో ప్రజలందరకూ తెలుసు. కానీ అతడు రాజపుత్రుడు కాడు. రాజకుమారులకే ప్రత్యేకంగా జరుగుతున్న ఆ విద్యాప్రదర్శన లోకి అనాహూతంగా ఒక సామాన్యుడు భుజం చరిచి ప్రవేశించడమూ, ఆ వచ్చినాతడు “జగత్కర్ణ పూర్ణా లోలద్గుణుడు” – అప్పటికే ప్రజాభిమానం పుష్కలంగా పొంది వున్నవాడు – కావడమూ, అనే నేపథ్యంలో ఆ మహావీరుని ప్రవేశాన్నీ, ఆకారాన్నీ రూపు కట్టించిన పద్యం ఇది.
అతడు సాలప్రంశుడు – మద్దిచెట్టువలె ఎత్తైన దృఢమైన శరీర పుష్టి కలిగినవాడు. ప్రకాశిస్తున్న సహజ కవచం కలిగినవాడు. వెలిగిపోతున్న కుండలాలు కలిగినవాడు. ఉదయిస్తున్న సూర్యునిలా ప్రభా భాసమానంగా వున్నాడు. బాణ తూణీరాలు ధరించి, ఉగ్ర కరవాలాన్ని ధట్టీకి కట్టుకొని, శౌర్యమే అలంకారంగా వెలుగుతుండగా నిలబడిన, బంగారు మేని చాయతో వున్న కర్ణుని, ప్రజాభిమానం చూరగొని వున్న అతన్ని, చూసి, చూపరులందరూ ఆశ్చర్యపోయినారు. ఇదీ ఆ పద్యార్ధము. ఎంతో నాటకీయంగా, ఉదాత్తంగా వుంది కదా రంగం మీదకి ఒక ప్రధాన పాత్ర ప్రవేశించిన తీరు. ఎంతో ఉత్తమమైన పోలికలతో కర్ణుని మూర్తిమత్వం ఆవిష్కరించబడింది ఇక్కడ.
తరువాత అర్జునుడు చూపిన అస్త్రవిద్యలన్నీ ద్రోణుని అనుమతితో అశ్రమంగా ప్రదర్శిస్తాడు కర్ణుడు. అంతకు ముందు అర్జునుని కీర్తిస్తూ జయజయ ధ్వానాలు చేసిన ప్రజల పొగడ్తలు వింటూ తల్లి కుంతికి, ఆనంద బాష్పాలతో బాటు, ఆ వాత్సల్యోద్రేకంలో పయోధరాల్లో పాలు చేపాయట. ఒక అసహాయ స్థితిలో కొడుకును వదలి పెట్టవలసి వచ్చిన ఆ దురదృష్టవంతురాలైన తల్లికి – తన మరో కొడుకూ అంత ప్రజాభిమానం సంపాదించుకొని, పేరు కూడా తెచ్చుకోడం చూసి తప్పకుండా హృదయం చెమర్చే వుంటుంది. కానీ ఏమి చేయగలదు, “రవి సమాను ప్రత్యభిజ్ఞ నెరిగి ప్రథమ పుత్ర స్నేహ మెరుక పడక యుండ ఇంతి యుండె” నట.
పై పద్యంలో కవి కర్ణుని చిన్న చిన్న సమాసాల్లోనే వర్ణించాడు. ఆ చిన్న సమాసాల్తోనే ఒక సుందర మూర్తినీ, అతని శౌర్య స్ఫూర్తినీ సాకార పరిచాడు. బాలార్క ప్రతిమున్ అని చెప్పడంతో అతని ఆభిజాత్యాన్నీ సూచించాడు. జగత్కర్ణ పూర్ణా లోలద్గుణుడని చెప్పడంలో – రాజ వంశీకుడు కాక పోయినా – అతను జనంలో అది వరకే సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు విశదపరిచాడు. ఈ పద్యం యొక్క సందర్భాన్ని పరామర్శించుకొనేటప్పుడు ఇదే సమయంలో కర్ణుని ప్రతిద్వంది అయిన అర్జునుని వర్ణించిన పద్యాన్ని కూడా చూసుకుని బేరీజు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ పద్యం ఇది:
ఉ. హోరి విచిత్ర హేమ కవచావృతుడు న్నత చాప చారు దీ
ర్ఘోరు భుజుండు భాస్వద సితోత్పల వర్ణుడు సేంద్రచాప శం
పారుచి మేఘమో యనగ బాండవ మధ్యము డొప్పి బద్ధ తూ
ణీరుడు రంగ మధ్యమున నిల్చె జగంబులు తన్ను జూడగన్
కర్ణుని వర్ణించిన దానికంటే కొంచెం పొడుగైన సమాసాలు వాడుతూ, ఇరువురినీ పోల్చి చూసుకోవలసిన అవసరాన్ని కవి కల్పించాడు.
అర్జునుడు మనోహరమైన, వింతయైన కవచం కలవాడు. కర్ణుడు సహజమైన ఉజ్జ్వల కవచుడు. అర్జునుడు చాప చారు దీర్ఘ ఉరుభుజుండు – అందమైన విల్లుని ధరించిన పొడుగూ ఎగువు అయిన బాహువులు కలవాడు. కర్ణుడు కేవలం శరాసన ధరుడు. అర్జునుడు ప్రకాశిస్తూ ఉండే నల్ల కలువ రంగు వాడు. కర్ణుడు బంగరు వన్నె వాడు. కర్ణుడు బాల సూర్యునిలా వుంటే అర్జునుడు ఇంద్రధనస్స్సునూ, మెరుపు తీగె కాంతినీ – అంటే వర్ణ బాహుళ్యాన్ని, కాంతి జ్వాజ్యల్లతనూ – ఏక కాలంలో కలిగి వున్న నీలమేఘం లాంటివాడు. బాలార్క ప్రతిమున్ అని వాడటంలో కర్ణుని మూలాన్నీ, ఇంద్రచాపాన్ని సూచించటంలో అర్జునుడి ఆభిజాత్యాన్నీ ప్రకటించడం జరిగింది. అనితోత్పల వర్ణుడు అయిన అర్జునుని ఉత్పలమాలతో వర్ణించడమూ – ఆలోచనా, ముందుచూపు కన్నా లంఘనావేశం ఎక్కువగా వుండే పులిపిల్ల లాంటి కర్ణుని శార్దూలంలో వర్ణించడమూ కూడా, యాదృచ్ఛికంగా జరిగి వుండకపోవచ్చు. ఇరువురిలో ఏ వొక్కరినీ తక్కువ చేసి చూపడం అనే ఉద్దేశం నన్నయకు ఉండి వుండదు. అయినా కొద్ది పాటి అర్జున పక్షపాతం పైపద్యాల్లో కనిపించక పోదు. కానీ, పెద్ద పెద్ద సమాసాలూ, విశేషణాలూ చేర్చి అర్జునుని మూర్తిమత్వాన్ని చూపినా – కొలది కొలది పలుకుల్లో అదే పనిని అంతకంటే ఎక్కువ ప్రభావంతో కర్ణుని విషయంలో చేశాడు నన్నయ. గొప్ప నాటకీయ ధోరణితో – ఆశ్చర్యాన్ని రూపిస్తూ పాత్ర ప్రవేశాన్నీ నిర్వహించిన ‘సాలప్రాంశు… ‘ పద్యం నాకు ఎంతో బాగా నచ్చిన పద్యాల్లో ఒకటి.