నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుడు చూపిన తల్లిప్రేమ

చం.
అరుణ గభస్తి బింబముదయాద్రి పయింబొడతేర, గిన్నెలోఁ
బెరుఁగును, వంటకంబు, వడపిందియలుం గుడువంగబెట్టు, ని
ర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి యున్నదే
హరహర! ఎవ్వరింక గడుపారసి పెట్టెదరీప్సితాన్నముల్.

చాలా మృదువుగా హృదయాన్ని స్పర్శించే భావం కలిగిన ఈ పద్యం తల్లిని తలచుకొంటూ, ఇకపై ఆ ప్రేమకు దూరమౌతున్నందుకు వగచే ఒక కొడుకు స్వగతంగా వ్యక్తీకరించుకునే బాధ. ఇంత సున్నితంగా మాతృ ప్రణయాన్ని తెల్పగలగడం–నాకు బాగా నచ్చడం అలా వుంచితే–ఈ పద్యం వ్రాసిన కవికి గూడా బాగా నచ్చింది. లేకపోతే తను రచించిన రెండు కావ్యాల్లో అక్షరం మార్చకుండా దీనికి చోటు కల్పించడు. కవిసార్వభౌముడైన శ్రీనాథుడు తన ప్రౌఢ కావ్యమైన కాశీఖండములో గుణనిధి చేత ఈ పద్యం చెప్పించాడు. మళ్ళీ తన శివరాత్రి మాహాత్మ్యము కావ్యంలో కూడా కథానాయకుడైన సుకుమారుని చేత ఈ పద్యం అలాగే చెప్పించాడు. అదేలాంటి సందర్భంలో చొప్పించాడు.

కాశీఖండము ప్రారంభంలో తను రచించిన కావ్యాల సూచిని ఇచ్చాడు శ్రీనాథుడు. పసితనంలోనే మరుత్తరాట్చరిత్రను వ్రాశాననీ, ఆరంభ యౌవనదశలో శాలివాహన సప్తశతి చెప్పాననీ, నిండు యవ్వనాన హర్షనైషధాన్ని ఆంధ్రీకరించాననీ, ప్రౌఢ వయస్సులో భీమేశ్వర పురాణాన్ని కూర్చాననీ చెపుతూ, ముదిమి మీదపడకముందే–ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ–కాశీఖండము రచిస్తున్నాననీ చెప్పాడు. ఆయన వ్రాశానని చెప్పుకున్న మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి ఇంతవరకూ లభించనేలేదు. ఆయన చెప్పుకోని మూడు రచనలు మాత్రం–హరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, శివరాత్రి మాహాత్మ్యము–తెలుగువారి చేతుల్లోకి చేరాయి. హరవిలాసం, ఆయన మంచి దశలో ఉన్నప్పుడే బయటికి వచ్చిందని ఆయన కాలపు వణిక్‌శ్రేష్టుడూ, దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించే పెద్దాయన ఐన అవచి తిప్పయ్యకు అతిథిగా ఉండి, వ్రాసి, ఆయనకే అంకితమిచ్చినందున తెలుస్తున్నది. ఆయన కొండవీటి విద్యాధికారిగా పలనాట పర్యటిస్తూ అక్కడి స్థానిక గాథను, అక్కడి జానపదుల కొరకు ద్విపదలో పల్నాటి వీర చరిత్రముగా అక్షరీకరించడం, వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం అనే వీధిలో తన ముద్రను స్పష్టంగా రూపు దిద్దడం, ఈ రెండూ ఆయన కీర్తికి ఎత్తిన కేతనాలే. ఇక శివరాత్రి మాహాత్మ్యము మాత్రం ఆయన అదృష్ట దశ క్షీణించడం ప్రారంభమై కొనసాగినాక, బాగా ముసలితనాన వ్రాయబడింది అని తోస్తుంది. ఇది ఊహే కావచ్చు.

తెలుగు సాహిత్యంలో అంత సౌభాగ్య దశను అనుభవించిన కవి మరొకడు లేదు. ప్రభువైన వీరభద్రారెడ్డి చేత రత్నాంబరాలు స్వీకరించాడు. విస్సనామాత్యుని సహపంక్తిన బంగరు పళ్ళెరాలలో భోంచేశాడు. సాంపరాయని తెలుగుధీశుని ప్రస్తుతించి, కస్తూరిని–వివరాలు తెలిపి మరీ: దక్షారామ చాళుక్య భీమ వరగంధర్వాప్సరో కామినీ వక్షోజద్వయి కుంభికుంభములపై వాసించు తద్వాసనల్–దానం పుచ్చుకున్నాడు. రాజుల చేతనే తన దినవెచ్చాలు తీర్చుకున్నాడు. వీటన్నిటికీ మకుటాయమానంగా విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో, అక్కడి పండితులను జయించి వారి ఔద్ధత్య చిహ్నాలను నిర్మూలింపించి కనకాభిషేకం చేయించుకున్నాడు. గొప్ప ఫలవంతమైన జీవితాన్ని అనుభవించాడు. దానికి తగ్గట్టే గొప్ప సాహిత్యాన్నీ సృష్టించాడు. కానీ బండ్లు ఓడలూ, ఓడలు బండ్లూ అయి, పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మాల్సి వచ్చింది. తనను ఆదరించిన మహనీయులందరూ మరణించారు. కొందరు ప్రాభవం కోల్పోయారు. తాను దిక్కు తోచక ఒంటరిగా మిగిలిపోయాడు. ముదిమి మూపు మీదికెక్కింది. భార్య కూడా గతించి ఏకాకి అయినట్లున్నాడు. చిత్తశాంతి కోసం శ్రీశైలం పోయి అక్కడ కొన్ని రోజులున్నాడు. అక్కడుండగానే శివరాత్రి మాహాత్మ్యము వ్రాసి అక్కడి ఒక మఠంలోని యతిగారి శిష్యునకు, ముమ్మిడి శాంతయ్య అనే ఆయనకు అంకితం ఇచ్చాడు. అప్పుడు దొరికిన తృణమో పణమో తెచ్చి, కృష్ణ వడ్డున బొడ్డుపల్లె అనే గ్రామంలో వ్యవసాయం ప్రారంభించి వరదల వల్ల, మిడతల దండు వల్ల పంట పాడైపోగా, ఈయన ఎవరో తెలియని ఓఢ్రరాజులకు శిస్తు కట్టలేక, భయంకర దండనలు అనుభవించి దైన్యంతో శివైక్యం చెందాడు. అలా తెలుగు సాహిత్యంలోని ఒక మహత్తర ఘట్టం ముగిసిపోయింది.

తెలుగు సాహిత్యంలో ముగ్గురు ప్రసిద్ధి చెందిన భ్రష్టులున్నారు. వారిలో నిగమశర్మ అనేవాడిని తెనాలి రామకృష్ణయ్య సృష్టిస్తే, మిగతా ఇద్దరినీ శ్రీనాథుడు పుట్టించాడు. వీరిలో ఒకడు గుణనిధి. వీడు కాశీఖండములో కనిపిస్తాడు. రెండోవాడు సుకుమారుడు. వీడు శివరాత్రి మాహాత్మ్యములో పరుచుకున్నాడు. కాశీఖండములో గుణనిధి కథ ప్రసక్తంగా వస్తుంది. శివరాత్రి మాహాత్మ్యము పూర్తిగా సుకుమారుని కథే. శివరాత్రి మాహాత్మ్యానికి మరోపేరు సుకుమార చరిత్రము. వీళ్ళ పేర్లు చూడండి ఎంత డాబుగా ఉన్నాయో; నిగమశర్మ, గుణనిధి, సుకుమారుడు. వీరు చేయని దుష్ట కార్యాలు లేవు. సుకుమారుడిది అయితే పరమ ఏవపు బ్రతుకు. ఎన్ని దురితాలు చేసినా చివర్న ఆయా దేవతలకు చేసిన పూజతో అన్ని పాపాలూ ఎంత భయంకరమైనవైనా నశించి, భగవంతుడే వారిని స్వయంగా చేరదీసి, ఏ పాపము చేయనివారికి గూడా దొరకని మరణానంతర సౌభాగ్యాన్ని అప్పనంగా అప్పచెపుతాడు.

సుకుమారుడొక మంత్రి కొడుకు. అన్ని దుర్వ్యవహారాలకూ చిన్ననాడే అలవాటుపడ్డాడు. వాడి దుశ్చేష్టలు తండ్రికి తెలియరాకుండా తల్లి కప్పిపుచ్చుతుంటుంది. వాడిక్కావలసిన డబ్బు ఇస్తూ ఉంటుంది. వాడి ‘కడుపారసి’ ‘ఈప్సితాన్నాలు’ తినబెడుతుంటుంది. వాడి దుష్కృత్యాలు తెలిసి రాజు వాడిని దేశబహిష్కారం కావిస్తాడు. వాడు వెళ్ళిపోతూ అడవిలో ఒక మాలెతను తగులుకొని ఆమెతో కాపురం పెడతాడు. అక్కడి నుంచి వేరేచోటికి పోయి, నిజం దాచి, అక్కడి బ్రాహ్మణ్యంతో కలిసిపోతాడు. భార్య చనిపోతుంది. ఈడొచ్చిన కూతుళ్ళతో కాపురం చేసి సంతానం కంటాడు. నిజం తెలిశాక ఊరినుండి వెళ్ళగొట్టబడతాడు. కేవలం అనాలోచితంగా ఒక శివరాత్రినాడు శివాలయంలో నిద్రపోకుండా కూచుని, అన్నం దొరక్క ఉపవసించి, అనుకోకుండా దేవాలయ ఘంటానాదం విని, గుళ్ళో జరిగే శివపూజ చూస్తాడు. ఇదంతా వాడు ఇచ్ఛగా చేసింది కాదు. అయినా వాడి సర్వపాపాలూ పోయాయట! మరణానంతరం అతన్ని తీసుకుపోవడానికి వచ్చిన యమదూతలను తరిమి శివదూతలు అతనిని శివలోకానికి తీసుకుపోతారు. కథ ఇది.

మహాకవులు ఇలాంటి కథలు ఎందుకు వ్రాస్తారో నాకు అర్థంకాదు. శివపూజ చేస్తే పాపాలు పోతాయి అని చెప్పడానికి ఇంత మహా పాపాల్ని చేయించాల్నా? కనీసం భక్తి అనేదే లేక, అనాలోచితంగా జరిగిపోయిన పనులే పూజలుగా భావింపబడి–వినటానిక్కూడా అసహ్యం అనిపించే తనయాగమనం లాంటి భ్రష్టకార్యాలు కూడా మానవుడి ప్రయత్నంగానీ, కనీసం పశ్చాత్తాపంగానీ లేకుండా మాసిపోయేటట్లయితే–ఇక భక్తి దేనికి, సత్కర్మాచరణ ఎందుకు? నా ఉద్దేశంలో ఇలాంటి కథలు కవులు ఆశించిన ఫలితాలకు ఫక్తు వ్యతిరేకమైన ఫలితాలే కల్గిస్తాయనిపిస్తుంది. పద్యాలు ప్రౌఢంగా, అందంగా రాస్తే ఆ పద్యాలు చదవడానికి బాగానే ఉండొచ్చును గాని కథాకథనమూ ఉచితంగా లేకపోతే ఏం లాభం? శ్రీనాథుని ఇతర కావ్యాలకు వచ్చిన ప్రశస్తి దీనికి రాకపోవడానికి ఇదే కారణమేమో.

సరే, ఇక పద్యం గురించి. సుకుమారుడు రోజూ జూదాలాడుతూ రంకులు తిరుగుతూ ఉన్నా అతని తల్లి మాత్రం దండించకుండా, తెల్లవారేసరికి గిన్నెలో పెరుగన్నం, బాగా తాళింపు వేసి కలిపి ఆవకాయ ముక్కో, నిమ్మ ఊరగాయ బద్దో, వడపిందెలో నంచుకోవడానికి ఉంచి, స్వయంగా చేత్తో ముద్దలు చేసి తినిపించేది గామాల. వడపిందెలు అంటే ఇంకా బాగా పులుపు పట్టని, వగరువగరుగా ఉండే లేత పచ్చి మామిడి ముక్కలను మజ్జిగలో ఊరవేసి ఉంచుకుంటారట. వాటిని పెరుగన్నంలో నంచుకుంటారట. అలా గోముగా తల్లి పెట్టే గోరుముద్దలకు అలవాటు పడ్డవాడు రాజు దేశ బహిష్కారం చేసేసరికి ఊరొదలాల్సి వస్తుంది. అప్పుడు వాడికి తల్లి రోజూ పెట్టే పెరుగన్నం ముద్దలు మదిలో మెదిలి, అయ్యో ఇవి ఇక దొరకవే అని వాపోతాడు. ఆ సందర్భంలోది ఈ పద్యం. తల్లి ప్రేమ ఎంత ఆప్తంగానో, ఎంత ఆర్ద్రంగానో రూపించబడింది పద్యంలో. ’అరుణ గభస్తి బింబముదయాద్రి పయిన్ బొడదేర’ ప్రొద్దు పొడవగానే కొడుకును గురించి ఆలోచిస్తుంది తల్లి. ఎంత భ్రష్టుడైనా తల్లిని గురించి తలచుకోకుండా ఉండలేడు కొడుకు. ఆమె ఆపేక్షలను మననం చేసుకోకుండా ఉండలేడు. తండ్రి తిట్టినా సరే, తల్లి మాత్రం ఏమీ అనదు. కొడుకెక్కడ కందిపోతాడోనని కాచుకుంటుంది తల్లి. ఎందుకంటే ఆమె నిర్భర కరుణా ధురీణ. భర్త కోపాన్ని కూడా నిబ్బరించుకుని కొడుకును కాపాడుకుంటుంది. నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే, అని అనుకుంటాడు వాడు. ప్రాణము ప్రాణము అని రెండుసార్లు ఆ పదాన్ని రొక్కించి ఎంత ప్రేమార్తినో వెలయించినాడు కవి. పైగా వెంటనే ‘హరహర’ అనే పదం (ఒక రకంగా ఊతపదం) ఎంతో తీవ్రతను ఆ ఆర్తికి జత చేసింది. ఎవరింక ‘కడుపారసి’ పెట్టెదరు అని దుఃఖిస్తాడు. చక్కని ఆ జాతీయం కూడా అతని ఆర్తి సాంద్రతను ఎగసనదోసేదే. పైగా ఎవరు పెడతారు ‘ఈప్సితాన్నముల్’ అని అనుకోవడం–ఇదే వుంది ఇది తినిపోరా నాయనా అనడం గాక, వాడికి ఇష్టమైనవే నిత్యమూ పెడుతుంది అనుకోవడం గూడ ఆమె ప్రేమాతిశయాన్ని తెలివిడి కావించేదే. కాశీఖండములో గుణనిధి సందర్భంలో చెప్పిన ఇదే పద్యానికి సన్నివేశం కూడా ఇలాంటిదే. అందుకనే ఆ పద్యం ఆ ఘట్టాల్లో అంత బాగా అమరిపోయింది. శ్రీనాథుడికి కూడా ఆ పద్యం బాగా కుదిరిందనిపించి, సన్నివేశపు ఔచిత్యానికి తగిపోయిందనిపించి, రెండు కావ్యాల్లోనూ పొందుపరుచుకున్నాడు. నిజంగా చాలా చక్కని పద్యం.