నాకు నచ్చిన పద్యం: అర్జునుని వర్ణన

చం. అతని నుతింప శక్యమె జయంతుని తమ్ముడు సోయగంబునన్
        పతగ కులాధిప ధ్వజుని ప్రాణసఖుండు కృపారసంబునన్
        క్షితిధర కన్యకాది పతికిన్ సరిజోడు సముజ్జయంబునం
        దతని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలంబునన్

నాగభూషణం రక్తకన్నీరు నాటకం తెలుగునాట కొన్ని వేల ప్రదర్శనలు ఆడింది. నాటకం ఆడుతున్న వూరి మునిసిపాలిటీ గురించో, స్థానిక రాజకీయాల గురించో నాటకంలో లేని మాటలు నాగభూషణం చాలా పేల్చేవాడు. కథానాయకుడైన తను బిచ్చగాడిగా మారినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఒక కూలీ పాత్ర ఇతన్ని “పోరా, ముష్టోడా” అంటుంది. దానికి జవాబుగా నాగభూషణం, “ఆ – యీడు బిర్లా బావమరిదండీ” అని అంటాడు. ఇదేమంత పెద్ద చమత్కారం కాదు గానీ, ఒక మనిషిలోని (లేని) లక్షణాన్ని ఆ లక్షణానికి ప్రసిద్ధుడైన వ్యక్తిని పేర్కొని ఉటంకించడం మొదటినుంచీ ఉన్నదే. బిర్లా దేశంలోని గొప్ప ధనవంతుల్లో ఒకడు (50, 60 దశకాలలో టాటా, బిర్లా – ఈ రెండు పేర్లే వినపడేవి). ‘నన్ను ముష్టోడంటున్నావు, నువ్వేదో మహా ధనవంతుడివైనట్టు’ అన్న అర్థంలో వాడింది ఆ పలుకుబడి. ఎవరైనా ‘నేను అబద్ధమాడనే ఆడను’ అంటే ‘ఆ వచ్చాడండీ హరిశ్చంద్రుడి అన్నగారు’ అనడం; ముక్కు మీద కోపం ఉండేవాడిని ‘వీడు దూర్వాసుని తమ్ముడండీ’ అనడం లోని వ్యంగ్యమే పైన చెప్పిన పద్యంలో కూడా ఉన్నది. అయితే కవి ఆ చమత్కారాన్ని మరి కాస్త పొడిగించి అతిశయోక్తిని స్వభావోక్తిగా మార్చి చూపిస్తూ ఒక వినూత్నమైన అందాన్ని సాధించాడు. వివరంగా పద్యాన్ని గురించి చెప్పుకునే ముందు ఒకట్రెండు మాటలు కవిని గురించి, కావ్యాన్ని గురించి మనవి చేస్తాను.

పైపద్యం వ్రాసిన కవి చేమకూర వెంకటరాజు లోకంలో వెంకటకవిగా సుప్రసిద్ధుడు. ఈ పద్యం ఆయన కావ్యం విజయవిలాసం లోనిది. ఈ వెంకటకవి 17వ శతాబ్దం వాడు. 1600-1631 సంవత్సరాల్లో తంజావూరు రాజధానిగా దక్షిణదేశంలో రాజ్యం చేసిన తెలుగు రాజు రఘునాధ రాయల ఆస్థానంలో ఉండేవాడు. ఈ రాజు కూడా తక్కువ వాడేమీ కాదు. శ్రీ కృష్ణదేవ రాయనిలా రాజ్యపాలన లోనూ, సాహిత్యం లోనూ సమర్థవంతంగా సవ్యసాచిత్వం నెరపినవాడు. స్వయంగా గొప్ప కవి. నాలుగైదు కావ్యాలు వ్రాశాడు. వాటిలో బాగా ప్రసిద్ధమైంది వాల్మీకి చరితము. ఈయన ఆస్థానంలో ఉండి, తను రచించిన విజయ విలాస కావ్యాన్ని ఈయనకే అంకితం చేశాడు వెంకటకవి.

శ్రీ కృష్ణదేవ రాయలు, అష్ట దిగ్గజ కవులూ తెలుగు కవిత్వాన్ని అంబరచుంబిగా చేసిన తర్వాత – మళ్ళీ ఆధునిక యుగం వచ్చేదాకా ఉన్న కాలంలో – చెప్పుకోదగ్గ ఏ ఇద్దరు ముగ్గురో కవుల్లో చేమకూర వెంకట కవి అగ్రగణ్యుడని చెప్పుకోవచ్చు. విజయవిలాసంతో ‘చేమకూర మంచి పాకాన పడింది’ అని అనిపించుకున్న కవి ఇతను. ప్రతి పద్యం లోనూ చమత్కారం చూపిస్తానని శపధం చేశాడట ఈయన. అలాగే ప్రతి పద్యమూ ఆలోచనామృతం చేశాడని చెప్పవచ్చు. పైకి చూస్తే ఒక భావంతో కనిపించే పద్యంలో తవ్వుకుంటూ పోతే ఎన్నో విశేషార్థాలు ద్యోతకమౌతాయి. తాపీ ధర్మారావుగారు ఈ కావ్యాన్ని అంగాంగ పరీక్ష చేసి, ఎన్నో అందమైన భావాలు, చమత్కారాలు దాదాపు అన్ని పద్యాల్లోనూ ఉన్నాయని నిరూపించాడు. అప్పటిదాకా చాలామంది పండితులకు గూడా ఆ చమక్కులూ, అందాలూ స్ఫురించలేదు. అటువంటి గొప్ప స్వారస్యాలు అందించాడు వెంకటకవి. వందలకొద్దీ ఉన్న అలాంటి పద్యాలనూ, వాటి విశేషాలనూ వర్ణించటానికి ఇది సమయం కాదు కానీ, మచ్చుకొక్కటి మనవి చేస్తాను. ఆ వూళ్ళో మంచి చెట్లున్న వనాలు, ముత్యాల మేడలు చాలా వున్నాయి.

పోక మ్రాకుల మహిమ కప్పురపుటనటి
యాకు దోటల సౌభాగ్యమందె గలదు
ప్రబలు మౌక్తిక సౌధ సంపదల మహిమ
వీటి రహి మెచ్చవలయుబో వేయునోళ్ళ!

పోక మ్రాకులున్న వనాలు, అరటి తోటలలో పెరిగే ఆకుతోటలు, మౌక్తిక సౌధాలు – వీటి సమృద్ధిని వేయినోళ్ళ మెచుకోవాలి అని పద్య భావం. ఇది బాగానే ఉంది. పద్యానుకూలమైన తాత్పర్యం బాగానే వచ్చింది కాబట్టి ఇక ఈ పద్యంలో తరచి చూడవలసినదేమీ లేదు; తరవాతి పద్యానికి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారేమో. అదేమీ కుదరదు. కాస్త తరచి చూడండి అంటాడు వెంకట కవి. పద్యంలో పోకలున్నాయి, ఆకులు ఉన్నాయి. సున్నం కూడా ఉంది. ఎలాగంటారా. ముత్యాలు కాల్చి సున్నం చేస్తారు. భోగ భాగ్యాలున్నవారు ఇలాంటి సున్నాన్నే వాడతారు. మౌక్తిక సౌధం అంటే ముత్యాల తాలూకు సుధ. సుధ అంటే సున్నం అనే అర్థమూ ఉంది. ఆకులు, వక్కలు, సున్నం ఉన్నాయి కాబట్టి తాంబూలం వున్నట్టే. “వీటి రహి మెచ్చవలయుబో వేయునోట్ల” అన్నాడు కదా. అంటే తాంబూలం, తాంబూలపు రుచిని మెచ్చవలె గదా. ‘వేయునోళ్ళ’ అంటే తాంబూలం వేయు నోళ్ళతో అన్నమాట. ఎంతో స్వారస్యంగా వుంది గదా ఈ వివరం. ఇలాంటివి చాలా వున్నాయి ఈ విజయ విలాసంలో.

విజయ విలాసమంటే అర్జునుని విలాసం. ఈయన ఉలూచి అనే నాగకన్యకను, చిత్రాంగద అనే మణిపుర రాజపుత్రికను, సుభద్ర అనే యాదవ కన్యను వలచి వలపించుకొని, పెండ్లాడి సుఖాలను అనుభవించే కథ. సందర్భం దొరికింది గదా అని ముగ్గురు కన్యలనూ, వారి విరహాలనూ, శృంగారాలనూ తనివి తీరా వర్ణిస్తాడు. అంగాంగ వర్ణన మహా చాపల్యంగా చేస్తాడు. అన్నీ పాత ఉపమానాలే. అన్ని పాత కవిసమయాలే. కానీ వాటన్నిటినీ తన చాతుర్యంతో చమత్కారంగా చూపిస్తాడు. మెడ శంఖంలా ఉండటం మామూలే. “ఊదుకుపోవు శంఖము నహోగళరేఖ” అంటాడు. శంఖం మామూలుగా ఊదబడుతుంది. కానీ, గళరేఖ శంఖాన్నే ఊదుకు పోతుందట. ఊదుకుపోవు అనే పదంలో ఆ భావానికి మరికొంత అందము, వర్ణనీయ వస్తువుకు మరికాస్త గరిమా వచ్చాయి. “కడు హెచ్చుకొప్పు, దానిం గడవం జనుదోయి హెచ్చు, కటి యన్నిటికిన్ కడు హెచ్చు, హెచ్చులన్నియు నడుమే పసలేదు గాని నారీమణికిన్” అంటాడు. ఇలాంటి పద్యాలు చాలా వున్నాయి. ఇక పదాలతో గూడా విన్యాసాలు చేయించాడు వెంకటకవి. “మీరందందందు నరుగ నరుగా నరుగా” – మీరు అటు ఇటుగా పోతున్నప్పుడు నరుని చూడరుగా అని అర్థం. “సవ్యసాచి నింద్రోపల రోచి జూచి తలయూచి యులూచి రసోచితంబుగన్” అంటాడు. పలువరసను పల్కుదురు అని, పల్కుదురు గూర్చి పల్కుదురని, నెన్నుదురు నెన్నుదురనీ – ఇలా పదాలతో ఆడుకుంటాడు. మొత్తమ్మీద ఒక రకమైన రసానందం కలిగించే కావ్యమే ఇది.

ఇక పద్యానికి వద్దాం. ఇది అర్జునుని వర్ణించేది. అర్జునుడు సోయగంలో జయంతునికి తమ్ముడు. కృప చూపించడంలో శ్రీకృష్ణునికి స్నేహితుడు. పరాక్రమంలో ఆ శివుడికి సరి వీరుడు: అని ఈ మూడు ముక్కలూ మూడు పాదాల్లో చెప్పాడు. నలకూబరుణ్ణీ, చంద్రుణ్ణీ, జయంతుడినీ, వసంతుడినీ, మన్మధుడినీ – అందమైన మగవారిని వర్ణించేటప్పుడు పోలిక తెస్తారు. “యక్ష తనయేందు జయంత వసంత కంతులన్ చక్కదనంబు నన్ గెలువ జాలెడివాడు” అని ప్రవరుణ్ణి చూసి వరూధిని అనుకుంటుంది మనుచరిత్రలో. ఇక్కడ అర్జునున్ని జయంతునితో పోల్చాడు. మొట్ట మొదట మనం చెప్పుకున్న బిర్లా బావమరది చమత్కారం గురించి చెప్పుకున్నాం కదా. అందులోని ముష్టివాడు నిజంగా బిర్లా బావమరది కాదు. కానీ ఇక్కడ అర్జునుడు నిజంగానే జయంతుని తమ్ముడు; ఇద్దరూ ఇంద్రుని కొడుకులే కాబట్టి. అలాగే కృపారసంలో పతగ కులాధిపధ్వజునికి – గరుడ ధ్వజుడైన కృష్ణుడు అంటే ఈయన కృపారసంబు పైజల్లెడు వాడు గదా – ఇతనికి ప్రాణసఖుడు. నిజంగా కూడా అర్జునుడు కృష్ణసఖుడే. ఇక పరాక్రమంలో శివునితో సమానమైన జోదు – క్షితిధరకన్యకాధిపతి అంటే పర్వతరాజపుత్రిక భర్త అయిన శివుడు. నిజంగా కూడా అర్జునుడు శివునితో ద్వంద్వ యుద్ధం చేసి మెప్పు పొందినవాడు. ఇన్ని కారణాలవల్ల అర్జునుడు ఈ నాలుగూ సముద్రాల మధ్య భూమిలో అతనికి అతనే సాటి, అనేది పద్య భావం. ఒక సాధారణమైన పలుకుబడిని ఒక యదార్థ విషయంలో అనుసంధించి ఒక సార్ధకతను, చమత్కారాన్ని సాధించడం ఈ పద్యంలోని విశేషం. ఇంకో సందర్భంలో కూడా వెంకటకవి ఇలాంటిదే మరో మాట అంటాడు – ” ఈ బిత్తరి ముద్దు నెమ్మొగము పిన్నమ పున్నమ చందమామకున్” అని.

విజయవిలాసంలో నాకు నచ్చిన పద్యాలు చాలానే వున్నాయి. వాటిలో ఇది ఒకటి.