మ. హరిదం భోరుహ లోచనల్ గగన రంగాభోగ రంగత్తమో
భర నేపధ్యము నొయ్య నొయ్య సడలింపన్ రాత్రి శైలూషికిన్
వరుసన్మౌక్తిక పట్టమున్ నిటలమున్ వక్త్రంబునున్ దోఁచె నా
హరిణాం కాకృతి వొల్చె రేకయి సగంబై బింబమై తూర్పునన్
ఈ పద్యం రామరాజ భూషణకవి రచించిన వసుచరిత్రము లోనిది.
ఇప్పుడైతే సినిమాలూ, సినిమాటిక్ టెక్నిక్కులతో నాటకాలూ వచ్చాయి గానీ అరవై, డెబ్భై యేండ్ల క్రితం తెలుగు దేశపు పల్లెల్లో వీధి నాటకాలూ, తోలు బొమ్మలాటలూ – ఈ రెండే ప్రధానంగా దృశ్యవినోదపు సాధనాలు. శ్రవ్యాలంటారా – హరి కథలూ, బుఱ్ఱ కథలూ, జముకుల కథలూ, పిచ్చుగుంట కథలూ, ఇలాంటివి – ఇప్పటివారిలో చాలామంది ఈ పేర్లు గూడా వినివుండరు. తోలుబొమ్మలాటలు తెర వెనుక జరిగే తతంగం. పల్చటి తెర వెనుక ఆడిస్తున్న రంగు రంగు తోలు బొమ్మలు దీపం వెలుతురు నీడలో బయట కూర్చున్న వాండ్లకు కనిపిస్తుంటే, తెర వెనక నుంచి ప్రయోక్త సంభాషణలు చెపుతూ కథ నడిపిస్తూ బొమ్మలను ఆడిస్తుంటాడు.
ఇక వీధినాటకాలంటే తెర ముందు రంగమ్మీద నటీనటులు వేషాలు వేసుకొని ఆడుతూ పాడుతూ నటించడం. ముఖ్యంగా దైవ సంబంధంగానే ఈ నాటికలుండేవి కాబట్టీ వీటిని వీధి భాగవతాలనే పిలుస్తుండేవారు. ఇవి రాత్రి ఏ పదికో, పదకొండుకో ప్రారంభమై, వేకువ ఝామున ఐదూ ఆరు గంటల దాకా నడుస్తాయి. ఈ వీధినాటకాల్లో ముఖ్యపాత్రలకు తోడుగా కొందరు చోపు దార్లుంటారు. ముఖ్యపాత్ర పాట పాడిన తర్వాత ఆఖరి చరణం అందుకొని కోరస్‌గా రాగం తీస్తారు. అప్పటికప్పుడు చెలికత్తెలు గానో విదూషకుడి లానో ఆశు సంభాషణలతో హడావుడి చేస్తూ వారూ నటిస్తారు.
వీధి నాటకాల్లో ముఖ్యపాత్ర హఠాత్తుగా రంగం మీదికి రాదు. కథానాయకుడో, నాయికో రంగం మీద ప్రవేశించే ముందు అటు ఇద్దరూ, ఇటు ఇద్దరూ చోపుదార్లు వారికి అడ్డంగా ఒక తెర పట్టుకుంటారు. కథానాయకులైన రాజకుమారుని గురించో, రాజకుమార్తె గురించో కొంచెం పొగుడుతారు. రాగాలతో, సరాగాలతో ఆ పాత్ర ఎవరో సభికులకు పరిచయం చేస్తారు. కొద్దిపాటి బూతునూ, సమయానుకూలంగా సంభాషణల్లో చొప్పిస్తారు. అడ్డంగా పట్టుకున్న తెరను నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా తలనుంచి క్రిందికి తొలగిస్తారు. ముందు తలమీది పాపిడి బిళ్ళ కనిపిస్తుంది. తర్వాత నొసలు, ఆపైన కండ్లు, ముక్కు, కంఠ హారాలు, వడ్డాణమూ – ఇలా ఒక్కొక్కటీ కనిపించేలాగా తెరను క్రిందికి దించి అలాగే లాగేస్తారు. ఇదీ, పూర్వకాలంలో వీధినాటకాల పద్ధతి.
రాయల కాలంలో కూడా ఇంతకన్నా విశేషమైన జనవినోద సాధనాలుండే అవకాశం లేదు. రాజులూ, సర్దార్లూ, వాళ్ళ ఇండ్లల్లోనో, దర్బారుల్లోనో నృత్యాంగనల నాట్యాలనూ, విద్వాంసుల గానాలనూ ఆనందించేవారేమో గానీ, జనసామాన్యానికి వీధిభాగవతాలే కాలక్షేప సాధనాలు. రామరాజ భూషణుడు విజయనగరం పరిసరాల్లోనూ, పెనుగొండ చుట్టుపక్కల వున్న పల్లెల్లోనూ, ఈ నాటకాలు చూసే వుంటాడు. రాజులూ, రాణుల మనోరంజనం కోసం కోటల్లోనో, అంతఃపురాల్లోనూ ప్రత్యేకంగా వేయించే నాటకాలైనా చూసే వుంటాడు.
ఇక ఇప్పుడు పై పద్యం చదవండి. గగన రంగాభోగం వేదిక. ఆభోగం అంటే విశాలమైనది. ఈకాలం భాషలో 70mm అనుకోండి. తమోనేపథ్యం అంటే చీకటి యవనిక. రాత్రి అనే శైలూషి(అంటే నటి). దిక్కులు అనే స్త్రీలు – హరిదంభోరుహ లోచనల్, హరిత్తులు అంటే దిక్కులు – ఆ చీకటి తెరనూ కొంచెం కొంచెం దించుతున్నారు. ముందు నిశాశైలూషి మౌక్తిక పట్టం కనిపించింది. తరువాత నొసరు కనిపించింది. ఆపైన ముఖం పూర్తిగా కనిపించింది. అలా క్రమక్రమంగా చంద్రబింబపు ఆకారం, ముందు రేఖలాగా, తర్వాత అర్ధచంద్రుని లాగా, ఆ తర్వాత పూర్ణ బింబంగా తూర్పు దిక్కున కనిపించింది. నటీమణులు నొసటిపైన ముత్యాల పట్టీ ధరించడం ప్రసిద్ధం. స్త్రీ నొసరు చంద్రరేఖలా ఉండడం, స్త్రీ వదనం పూర్ణ చంద్రునిలా ఉండడం కూడా ప్రసిద్ధ కవి సమయాలే. తాను నాటకాల్లో చూసిన నటీమణి రంగప్రవేశాన్ని మనసుకు తెచ్చుకొని, కవిత్వంలో దానికి అందంగా చంద్రోదయంతో పోలిక సంధించాడు, రామరాజ భూషణకవి. చాలా సహజంగా ఉంది కదా, పోలిక! జానపదుల నిత్యానుభవ దృశ్యాలు ప్రతిబింబించిన కవిత్వం ఎంత నిసర్గంగా ఉంటుందో ఈ పద్యం చెప్పకనే చెపుతున్నది.
రాయల కాలంలో వెలువడిన గొప్ప కావ్యాల్లో వసుచరిత్ర మొకటి. చాలా పట్ల మనుచరిత్రకు అనుకరణలూ, అనుసరణలూ కనిపించినా, రామరాజ భూషణూడు సంగీతజ్ఞుడు కావడం వలన, వసుచరిత్ర లోని చాలా పద్యాలు సంగీతధారతో గానయోగ్యం గానూ, వినసొంపు గానూ ఉంటాయి. రామరాజ భూషణుని సంగీత శాస్త్ర పరిచయం కావ్యంలో కానవస్తుందనీ పెద్దలు చెబుతారు. చెవికి హాయిగా అనిపించే శబ్దాలంకారాల సొంపుతో ‘వీనుల విందై, అమృతపు సొనల పొందై, ఆమంద సుమ చరదళినీ గానము క్రందై’ నట్లు, వసుచరిత్రలోని పద్యాలు ఉంటాయి. తీరా చూస్తే వసుచరిత్రలో కథంటూ ఏమీలేదు. చక్కని పద్యాల కోసం చదవాలి ఆ కావ్యాన్ని. మంచి భావుకతా స్ఫోరకమైన వర్ణనల కోసం చదవాలి.
పైపద్యం అలాంటి చక్కని వర్ణన గలిగిన ఒక అందమైన పద్యం.