ఉ. రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహినీ
రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళి యందు గో
రాజులు భోగమందు దినరాజులు సంతతతేజమందు రా
రాజులు మానమందు నగరమ్మున రాజకుమారులందరున్
ఈ పద్యం చాలా ప్రసిద్ధమైన పద్యం. కవయిత్రి మొల్ల. ఆమె వ్రాసిన రామాయణం ప్రారంభంలోనే అయోధ్యావర్ణన చేసేటప్పుడు ఆ నగరంలోని రాజకుమారులను వర్ణించే సందర్భం లోనిది.
మొల్ల అంటే మల్లెపూవు. కవయిత్రి మొల్లనూ, ఆమె రామాయణాన్నీ తలచుకోగానే మనసుకు ఒక కమ్మని పూతావి సోకినట్లుంటుంది. ఆమె తన భక్తినీ, కవితాశక్తినీ కలబోసి క్లుప్తంగా ఓ మనోహరమైన రాయాయణాన్ని తెలుగు భాషకు దయచేసింది. 15వ శతాబ్ది ప్రారంభంలో జీవించిన మొల్ల పెద్దనాది రాయల కాలపు ప్రబంధ కవులకన్నా కొంచెం పూర్వపు కవయిత్రి అని చెపుతారు.
ఆమె కవిత్వంలో వ్యాకరణ దోషాలున్నాయని సమకాలీనులు కొందరు కవులూ, పండితులూ ఆమెనూ, ఆమె రామాయణాన్నీ అంతగా ఆదరించినట్లు కనపడదు. ఆమె అగ్రకులజ కాదు. పైగా స్త్రీ. ఇక మహాపండితులం అనుకునేవారు ఆమెను సంభావిస్తారా! అయినా కవిత్వాన్ని సంభావించాల్సింది సహృదయులైన పాఠకులు. ఐదు వందలేండ్ల నుండీ మొల్ల, ఆమె రామాయణము ఎంతో ప్రేమతో ప్రపత్తితో సంభావింపబడుతూనే వున్నాయి. ఇకముందూ వుంటాయి.
ఇక పద్యం గురించి. ప్రతికావ్యంలోనూ పద్ధెనిమిది రకాలైన వర్ణనలు ఉండాలనేది ఒక ఆనవాయితీ. ఋతువర్ణన, సూర్యోదయ వర్ణన, సంధ్యా వర్ణన, శృంగార వర్ణన, పుర వర్ణన – ఇత్యాదివి ప్రతి కావ్యంలోనూ తప్పనివి. మన ప్రాచీన కవులు తగిన చోట్లల్లో, సందర్భాన్ననుసరించి ఈ వర్ణనలు చొప్పించి మెప్పించారు. ఈ వర్ణనల్లో ఎంతో అందమైన కల్పనలు చేయడానికి అవకాశం కల్పించుకొని ఒకరిని మించి ఒకరు గొప్ప ఊహలు కనపరిచారు. కావ్యంలోని కథ ఏ పట్టణంలో జరుగుతుందో ఆ పట్టణాన్ని వర్ణించడంతో కథ ప్రారంభమవుతుంది. ఈ వర్ణనల్లోని అతిశయోక్తులు అంతా ఇంతా కావు. సౌధాలు చాలా ఎత్తుగా వుంటాయి అని చెప్పడానికి సౌధాగ్రాల గవనుల్లోకి చంద్రుని లోని కుందేలు అప్పుడప్పుడూ వచ్చి దూకుతుందని ఒక కవి శలవిస్తే, కోట గవనుల మీద నిలబడి సూర్యుని తాకుతూ పూజలు కావిస్తారని మరో కవి చమత్కరిస్తాడు. తమాషాగానే వుంటాయి ఈ వర్ణనలు.
నగరవర్ణనమంటే కోట, పరిభ మాత్రమే కాదు. జనాన్నీ వర్ణించాలి. జనం అంటే చాతుర్వర్ణమూను. పెద్దన ఒక సీస పద్యంలో ఒక్కో పాదంలో ఒక్కో కులాన్ని వర్ణించి, ఎత్తుగీతిలో ప్రత్యేకంగా వారవనితలను వర్ణించాడు. మొల్ల అయితే అయోధ్యా నగరాన్ని అయిదు పద్యాల్లో వర్ణించి ఆ తర్వాత పురజనులను, ఒక్కో కులం వారిని ఒక్కో పద్యంలో వర్ణించింది. వాటిలో నగరంలోని రాజకుమారులను వర్ణించినది పై పద్యం.
అయోధ్యలోని రాజకుమారులందరూ కాంతిలో చంద్రుని వంటివారు. రూపంలో మన్మథుని వంటివారు. దానగుణంలో సముద్రుని వంటివారు (సముద్రుడు తన నీటిని మేఘాలకు నిరంతరమూ దానం చేస్తుంటాడు). పరాక్రమంలో సింహం వంటివారు. వైభోగంలో వృషభాల వంటివారు (పోతెద్దులు నిష్పూచీగా వీథుల్లో తిరుగుతూ గోవుల వెనక పడుతుంటాయి. అదే కాబోలు భోగమంటే. రైతులు కూడా ఎద్దులను అలంకరించడంలో గానీ, ఆహారం ఇవ్వడంలో గానీ చాలా మురిపెంగా చూసుకుంటారు. అదీ భోగమే). నిరంతర తేజంలో సూర్యుని వంటివారు. అభిమానంలో సుయోధనుడంతటివారు.
ఇలా మొల్ల ఆ నగరంలోని రాజకుమారుల రూపలావణ్యాలనూ, భోగవితరణ శీలతనూ, పరాక్రమ తేజోభిమానాలని ఆయా గుణాలతో ప్రసిద్ధులైనవారితో పోల్చి వర్ణించింది. అంతేకాక ఆ పోలికలన్నిటికీ రాజులు అనే శబ్దాన్ని జోడించి ఒక గొప్ప అందాన్ని సాధించింది. మొదటిరాజు చంద్రుడు. రెండో రాజు రతిరాజైన మన్మథుడు. మూడో రాజు నదుల రాజైన సముద్రుడు. నాలుగో రాజు మృగరాజు అయిన సింహం. ఐదో రాజు గోరాజైన వృషభుడు. ఆరోరాజు దినరాజు అయిన సూర్యుడు, ఆఖరి రాజు రారాజైన సుయోధనుడు. కాబట్టి ఆ నగరంలోని రాజులు కేవలం శబ్దానికీ, కులానికే రాజులు కారు; అన్ని లక్షణాలకీ రాజులే అని ఉపపత్తికలతో సహా నిరూపించడం పద్యానికి శబ్దగతమే కాక అర్థగతమైన సొగసునూ ఇచ్చింది.
‘రాజు’ శబ్దం పదే పదే రావడంవలన చెవులకు ఇంపు కలిగే ఒక ధార సృష్టించబడింది. అందువలన ఆ పద్యం చాలా ప్రాచుర్యం పొందింది. మొల్ల రామాయణం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ పద్యం ప్రసక్తి రాకుండా ఉండదు. పైపద్యంలో రారాజులు మానమందు అని ఉన్నది. కుబేరునీ, సుయోధనునీ కూడా రాజరాజు అని పిలుస్తారు. కానీ మానధనుడిగా లోకంలో సుయోధనునికే పేరుంది. కుబేరునికి ఆ ప్రశస్తి లేదు. కాబట్టి ఇక్కడ సుయోధనుణ్ణే స్వీకరించాలి. అయితే మొల్ల వర్ణిస్తున్నది త్రేతాయుగం నాటి అయోధ్యా నగరపు రాకుమారులను. సుయోధనుడు ద్వాపర యుగం నాటి వాడు. అందుచేత ఔచిత్యం కొంచెం ప్రశ్నార్థకం అవుతుందంటారు కొందరు. కానీ ఆనాటి రాజులను గురించి ఈనాటి కవయిత్రి చెబుతున్నది కాబట్టీ ఔచిత్య భంగమేమీ ఉండదు. Anachronism అన్నది సాహిత్యంలో అంగీకరించబడిందే.
చక్కని పద్యాలతో సంగ్రహంగా రచించిన మొల్ల రామాయణంలోని మరో ప్రసిద్ధమైన పద్యం “నారదులైరి సన్మునులు నాకమహీజములయ్యె భూజముల్” గురించి మునుపు ఇదే శీర్షికలో ముచ్చటించుకున్నాం. పండు వెన్నెల తెల్లగా కాస్తుంటే ఆ వెన్నెల్లో సర్వ ప్రపంచమూ తెల్లగా మారిపోయిందట. మునులందరూ నారదులైనారు. చెట్లన్నీ కల్ప వృక్షాలైనాయి. స్త్రీలందరు సరస్వతులుగా, కొండలన్నీ కైలాస పర్వతాలుగా, సాగర జలమంతా పాదరసంలా, పాములన్నీ వాసుకిలా మారిపోయాయని ఈ పద్యంలో మొల్ల వర్ణిస్తుంది. నారదుడు, కల్పవృక్షము, పాదరసము, వాసుకి – ఇవన్నీ తెల్లవే. కైలాసం రజతగిరి. సరస్వతి సర్వశుక్ల.
తెలుగు భాష ఉన్నంత వరకూ మొల్ల, ఆమె రామాయణము చిరంజీవులుగా వుంటారు.