నాకు నచ్సిన పద్యం: గౌతమీకోకిల వేదుల

ఉ.
ఈ విషమంపు గాడ్పుటలయింపుల గ్రుచ్చిన దండ ఛిన్నమై
పూవులు రేకులూడి పడిపోయె, మిగిల్చితి ప్రేమ వాసనా
ప్లావిత తంతువిద్ది, యురివైతువొ నా మెడ, నీ ప్రవాళరే
ఖావర హస్తమందభయ కంకణమట్లు ధరింతువో ప్రభూ!

ప్రేమ వాసనాప్లావిత తంతువు! ఎంత పరిమళభరితంగానో ఉందికదా ఈ పదబంధం! విరిసిన పూలతో, ప్రభుని మెడలో కీలించడానికి కట్టిన దండ అది. అయినా ఏం లాభం. కట్టిన దండ స్వామి గళసీమ చేరడం అంత సులభసాధ్యమా? అసలు లోకమెట్లా వుంది? పరిసరాలెట్లా వున్నాయి? వీస్తున్న గాలులన్నీ విషబింబితాలు. ఆ విషమంపు గాడ్పులలయిస్తుంటే సుకుమారాలైన పూలేం తట్టుకుంటాయి? గాడుపుల దాడి, సోకుతున్న విషతిక్తతతో కట్టిన పూలన్నీ రాలిపోయాయి. కేవలం పూలు కట్టిన సూత్రం మాత్రమే మిగిలింది. అయినా మామూలు దారం కాదు అది. తన హృదయంలో వెల్లువెత్తుతున్న మహా ప్రణయానురాగాల లతాంతాలు దాని చుట్టూ కట్టబడ్డాయి. పూరేకులన్నీ రాలిపోయినా, ఆ రాగమూ ఆ ముమ్మరమైన తావీ దారాన్ని వీడిపోలేదు. అది ప్రేమ వాసనాప్లావిత తంతువు. ఏం చేస్తావు ఆ దారాన్ని? ఏదో మామూలు దారమే కదా, ఇలాంటిది తెచ్చాడేం అనే కోపంతో దాంతోనే నా మెడకు ఉరివేస్తావా? లేక సర్వమూ ఆకళించుకోగల స్వామివి ఆ సౌరభసిక్త సూత్రాన్నీ దాన్ని అంటుకొని ఉన్న నా ప్రణయభావననూ అర్థంచేసుకుని నీ పగడాల చేతికి అభయ కంకణంగా స్వీకరిస్తావా? అని వేడుకుంటున్నాడు. సుందరమైన మృదుల భావనా, పరమ సుందరమైన పదాల పొందిక, సుకుమారమైన ప్రేమ నివేదనలతో గుండెల్లోని ఆర్ద్రసీమలను సున్నితంగా స్పృశించే ఈ పద్యం గౌతమీకోకిల వేదుల సత్యనారాయణశాస్త్రిగారి ప్రభూ! అనే కవితా ఖండికలోనిది.

తెలుగువాళ్ళ తొలినాళ్ళ కార్టూనిస్టు తలిశెట్టి రామారావుగారు ఒక కార్టూన్ వేశారు. ఒక అమ్మాయి బొమ్మ. కళ్ళ దగ్గర రెండు కలువలుంచాడు. ముక్కుండాల్సిన చోట ఒక సంపెంగ పువ్వు, పెదాలకు బదులు రెండు దొండపండ్లు, మెడ దగ్గర శంఖమూ, చేతులూ కాళ్ళూ తామర తూళ్ళూ–ఇలా చిత్రించి దానికి ప్రబంధ సుందరి అనే కేప్షన్ పెట్టాడు. స్త్రీ అవయవాలకు అవన్నీ కవి సమయాలు అనుమతించిన ఉపమానాలే. ఐనా బొమ్మ చూస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా! అలాగే ఒక జోకు కూడా వచ్చింది. ఆ అమ్మాయికి కళ్ళు తామరలు. ముఖం తామర. కరాబ్జాలూ పాదాబ్జాలూ తామరలే. ఈ పిల్లకు ఒళ్ళంతా తామరా! అని విస్తుపోయాడా జోకు రచయిత. తామరంటే ఒక చర్మరోగం మరి. ఈ కార్టూనూ, జోకూ ఆనాడు తెలుగు పద్య ప్రబంధాల్లో వెర్రితలలు వేస్తున్న కవి సమయాల ‘అతి’త్వం మీదా, రొడ్డకొట్టుడులాగా వస్తున్న మూస ఉపమానాల మీదా అధిక్షేపాన్ని సూచిస్తున్నాయి. ఆ ధోరణులను నిరాకరిస్తూ వచ్చిందే భావ కవిత్వం. ముఖ్యంగా కవిత్వమంటేనే శృంగారం, శృంగారమంటే స్త్రీల అంగాంగాల వర్ణన అనే భావాలను తిరస్కరిస్తూ, స్త్రీని సంభోగ వస్తువుగా మాత్రమే చూపిస్తూ వచ్చే ధోరణులను నిరాకరిస్తూ, స్త్రీని ప్రణయ పీఠం మీద కూర్చోబెట్టి ప్రేమైకమూర్తిగా ఆరాధించడం ప్రారంభమైంది. కవితా సామగ్రిని గంపలో పెట్టుకొని అమ్మే ఒక సన్నివేశం –-పింగళి-కాటూరివారిదని గుర్తు– వచ్చింది. కొనడానికి వచ్చినవాళ్ళు, మీ దగ్గర శ్లేషార్థాలున్నాయా, రెండు మూడు నాలుగర్థాల మాటలున్నాయా, చిత్రబంధాల మూటలున్నాయా అని అడిగితే, అలాంటివేమీ లేవు, జాబిలి కూనలూ వెన్నెల సోనలూ సెలయేళ్ళ జాలులూ ప్రణయాల ప్రోవులూ లాంటివే ఉన్నాయంటాడు విక్రేత. నవ్య కవిత్వాన్ని ఈ కొత్త కవులు ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అనిపిస్తుంది ఇది చూస్తే. అలా భావ కవిత్వం ఒక ఉద్యమ రూపం తీసుకున్నది.

అప్పటిదాకా చంద్రాస్య, చక్రస్తని, ఐరావత ద్విపకుంభ కుచకుంభ ఐన స్త్రీ ఇప్పుడు నవనీత హృదయ, అంతరంగ శాంతి దేవత, ఆశాపథాంతరాళ కైశికీగీతి, తపఃకల్పవల్లి, జగదీశు మకుటాగ్ర సీమ నుండి ఉర్విపై జారిన సుధామయూఖ రేఖ, తలిరాకు జొంపముల సందుల త్రోవల నేలరాలు తుహినకిరణ కోమలరేఖ, పువుదీవ అయింది. కార్టూను బొమ్మలాగా కాక ఒక కొత్త వ్యక్తిత్వంతో, మనసూ దాని సుకుమార ప్రకంపనలూ, మృదులోహలూ ఊదే ఒక సంస్కారవతిగా సాక్షాత్కరించింది. ఎంత హాయిగా ఉండేది భావకవిత్వం పేరుతో వచ్చిన ఆ కవిత్వం! పద్యాలు మారిపోయాయి. పదాలు మారిపోయాయి. భావాలు మారిపోయాయి. అసలు పద్యానికే ఒక గ్లామరొచ్చేసింది! అక్కిరాజు ఉమాకాంతంగారు ఏకిపారేసినా, అనంత పంతులవారు శుక్లపక్షం పేరుతో కృష్ణశాస్త్రి కృష్ణపక్షాన్ని హేళనచేసినా కవిత్వ ప్రియులు వారిని లెక్కచేయకుండా కొత్త కవిత్వాన్ని చేతులు బార్లా జాపి ఆహ్వానించి గుండెలకు హత్తుకున్నారు. ప్రేయసి కళ్ళను వర్ణిస్తూ సాక్షాత్తూ కృష్ణశాస్త్రిగారే ‘అర్థమ్ముగాని భావగీతాలు’ అని భావగీతాలను చమత్కరించినా, దరిమిలా ఎప్పుడో పింగళి ‘భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్’ అని తమాషా పట్టించినా–ఎంత బాగుండేవండీ ఆ పద్యాలు! ‘చిర విరహవహ్ని ప్రాణముల్ మఱుగుచోట సేకరించిన ఉష్ణాశ్రుశీకరములు’ (నాయని) లాంటి గుండెలను తట్టి రేపే వక్కాణింపులు ఎంత మార్మికంగా ఉండేవి!

భావ కవిత్వం అనగానే గుర్తొచ్చే మొదటి పేరు కృష్ణశాస్త్రిగారిదైతే, రెండో పేరు మాత్రం వేదులవారిదే.

ఓఢ్ర సీమ నుంచి అరవ పొలిమేర దాకా కొత్త కవిత్వాన్ని భుజాన వేసుకొని ఊరూరూ తిరిగి, జనంలోకి చొచ్చుకుపోయేట్లు పద్యాలు పాడి ప్రచారం చేసి భావ కవిత్వాన్ని అంగీకరింపజేసినందునా, విశాలమైన సాహిత్యాన్ని పుస్తకాల ద్వారా, రేడియో ద్వారా, సినీగీతాల ద్వారా తెలుగునాట ఆవరింపజేసినందువల్లా మొదటి పేరుగా కృష్ణశాస్త్రిగారు పేర్కొనబడటం న్యాయమే. కానీ వేదులవారి యోగదానమూ తక్కువేమీ కాదు. కృష్ణశాస్త్రి కవిత్వమూ వేదులవారి కవిత్వమూ దాదాపు ఒకేరకముగా ఉంటాయని చెప్పొచ్చు. ప్రతి పదాన్నీ చెక్కి చెక్కి, చికిలీ పట్టి, ఒకటికి నాలుగుసార్లు సవరించుకొనిగాని కృష్ణశాస్త్రిగారు ప్రయోగించేవారు కాదు అని తజ్ఞులు అంటారు. వేదులవారు అలా శ్రమపడేవారో కాదో తెలియదుగాని వారు వాడిన పదాలు కూడా అంతే కోమలంగానూ సుకుమారంగానూ ఉంటాయి పై పద్యంలోని ప్రేమవాసనాప్లావిత తంతువులాగా.

వేదులవారు ఆంధ్రాంగ్ల సంస్కృతాలతోపాటు కన్నడ వంగ భాషలూ నేర్చారు. దీపావళి, ముక్తఝరిలాంటి ఖండకావ్యాలు వెలయించారు. వంగ నవలానువాదాలు చేశారు. కథలు వ్రాశారు. భాస నాటకాలను తెలుగు చేశారు. సొంతంగా తెలుగులో నాటకాలూ రచించారు. వేదులవారి సాహిత్య సృష్టి కూడా విస్తృతమైనదే.

వేదులవారి కవిత్వంలో ఒక గాఢ విషాదపు జీర కనిపిస్తుంది. మహాప్రస్థానానికి పీఠికగా ఇచ్చిన యోగ్యతా పత్రంలో లోకమంతటి బాధా శ్రీశ్రీ బాధైతే, కృష్ణశాస్త్రి బాధ లోకమంతటిదీను అంటాడు చలం. అది కృష్ణశాస్త్రి ఒక్కడిదే అనుకోనక్కరలేదు. దాదాపు భావ కవులందరిలోనూ ఆ లక్షణముంది. వేదులవారి కవిత్వంలో ఐతే మరీను. ‘ఈ మహాసాగరాగాధ హృదయబాడబానల జ్వాల ఎవారికి తెలియు’ అంటాడొకచోట. ‘దేవతా విగ్రహములేని తేరువోలె, నీరస నిరుత్సవ నిరలంకారమైన యీ వ్యథాక్లిష్ట జీవిత కావ్యమునకు – నంతిమాశ్వాస శాంతి సమాప్తి యెపుడొ!’ అంటాడు మరోచోట.

నేను నిశీథి నొంటి శయనించి గభీరతమోబ్ధి సంకులో
ర్మీనికరమ్ములుం బులకరింపగ నా తుదిలేని సైపగా
రాని ప్రవాస జీవనభరమ్ము స్మరించుచు రక్తబాష్పముల్
సోనలు వార నేడ్చెద నులూక విలోకనముల్ చెమర్పగన్

అంటాడు ఇంకోచోట. గుడ్లగూబల కళ్ళు కూడ చెమ్మగిల్లుతాయట వీరి ఏడ్పుకు!

‘నా యెదకీ ప్రపంచమనినన్ మృగతృష్ణల ఇంద్రజాలమైపోయె’ అంటాడు. ‘కార్తికజ్యోత్స్నలందునేకాకినగుచు, ప్రాణ సంత్రాణమీ భగ్నవీణ దాల్చి పాడుకొందు మౌన ప్రేమ బాష్పగీతి’ అంటూ విలపిస్తాడు. వేదులవారి పద్యాలు ఎంతో లలితంగా, కోమలంగా, హాయిగా ఉంటాయి. ‘మాయని ప్రేమ చిహ్నల కమర్చెద బాష్ప సుమార్చనా విధుల్’ అంటాడు. ‘బాష్ప సుమార్చన’ట. రాలిపోతున్న పూలూ పండుటాకుల్నీ గూర్చి ‘చ్యుత సూన గంధముల్ కొందలపెట్టె’ అనీ, ‘పతితశ్లథ పత్ర మర్మరాక్రందం సందడించె’ననీ అందంగా వెల్లడౌతారు.

కోమల వల్లికావృత నికుంజ తలమ్ములయందు, శాద్వల
శ్యామల భూములందు, సువిశాల తమాల మహీజ వాటికా
రామములందు శీతల తరంగ నిషిక్త నదీతటోపల
స్తోమములందు నీ యునికి దోప దెటేగితొ శ్యామసుందరా!

అంటూ నునుమెత్తని సంస్కృత పదాలతో అందమైన పరిసరాలనూ అన్వేషణానందాలనూ నిరీక్షణ సందర్భాలనూ ఆవిష్కరిస్తాడు. గీతులు కానీండి, వృత్తాలు కానీండి, పట్టుచీరమీద ముత్యాల్లాగా సుతారంగా జారిపోతుంటాయి. ‘ముదిపొద్దు రేపటి యుదయమ్ము కొరకు దాచుకొన్న ప్రతాపరోచిర్లవాలు’ అంటూనూ, ‘ముదిశిశిరమ్ము ఆకు చిదిమిన పట్లు పూలకారు చివుళ్ళ పురిటి పొత్తిళ్ళు’ అంటూనూ సుందరమైన భావాలకు పరమ సుందరరూపం తొడుగుతాడు. ‘ఆత్మను దహించు ప్రణయ దుఃఖాగ్ని నీలమై వంగి వాపోవు నింగి నెలత’ అంటాడు విచిత్ర మనోహరంగా. వేదులవారి పద్యాలు మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూనే ఉండాలన్నంత బాగా ఉంటాయి.

ఒక పద్యం మనకు బాగా నచ్చుతుంది, అంతే. ఎందుకు నచ్చుతుందో వివరించడం అంత సులభం కాదు. అదొక అనుభవం. పద్యం యొక్క అందంతో పాటు దాని నేపథ్యం అంతా మనసులో మెదుల్తుంది. ఆ చరిత్రంతా మనోయవనిక మీద మెరుస్తుంది. అప్పటి కవులందరూ గుర్తుకొస్తారు. ఇవన్నీ ఎంతో సంతోషం కలిగిస్తాయి. ఇదంతా పాఠకులతో పంచుకుందామనిపిస్తుంది. ఈ సంగతులన్నీ ఇంతకుముందు ఎందరో చెప్పినవే ఐనా ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ లేకపోయినా చెప్పాలనిపిస్తుంది. నచ్చిన పద్యం గురించి నాలుగు ముక్కలు చెప్పి ఊరుకోకుండా చరిత్రను మళ్ళీ చర్వణం చేసినందుకు పాఠకులు విసుక్కోరని ఆశిస్తాను.

చివరగా ఒక తాజాకలం ముచ్చట: ఈ క్రింది గీత పద్యం వేదులవారిది. మొదటి మూడు పాదాలూ ఇవి-

మంజుల సుమామృతములోని మధురిమమ్ము
మధుర చంద్రాతపములోని మార్దవమ్ము
మృదు సమీరమ్ములోని పరీమళమ్ము

వేదులవారు వ్రాసిన నాలుగో పాదం ‘కలవు గోపాల! నీ వేణుగానమందు’ అనేది.

బుచ్చమ్మగారి పూటకూళ్ళ హోటల్లో పచ్చిపులుసు ఫస్టుగా ఉండేదిగామాల, అక్కడ దాన్ని రుచి చూశాక మాచిరాజు దేవీప్రసాద్‌గారు వేదుల పద్యంలోని మొదటి మూడు పాదాలనూ అలాగే వుంచి, నాలుగో పాదం ‘కలవు బుచ్చమ్మ! నీ పచ్చిపులుసునందు!’ అని మార్చాడట. (చూ. శ్రీరమణ పేరడీలు)

అయ్యా! అదీ సంగతి.