ఉ.
భాసురరూపకాంతిజిత భావజ చంద్రుడితండు, రాగలీ
లా సరసత్వమొప్ప గడులాలసుడైనను జూచెనేని నే
జేసిన పుణ్యమెవ్వరును జేయరు కాముని దక్కనేలుదున్.
పద్యం చాలా ముచ్చటగా ఉన్నదిగదా! చక్కని ధార. ఏమాత్రం అన్వయ క్లిష్టత లేని పదాల పోహళింపు. ఒక అందగాడిని చూచి అతని సౌందర్యానికి ముగ్ధురాలై–ఇతడు మన్మథునిలానూ, చంద్రునిలానూ రూపకాంతితో మెరిసిపోతున్నాడు. ఇతడు అనురాగంతో నన్ను అంగీకరించి చేరదీస్తే నేను చేసిన పుణ్యం మరెవ్వరూ చేయనంత గొప్పదవుతుంది. మన్మథ రాజ్యాన్ని ఏకచ్ఛత్రంగా ఏలనూ! అనుకుంటున్న ముద్దరాలి ఊహల రమ్య చిత్రణ ఈ మంచి పద్యం. భావజ చంద్రులిద్దరినీ భావజ చంద్రుడని ఏక వచనంలో ఒకే పదంలో చెప్పి, భావజుని రూపాన్నీ చంద్రుని కాంతినీ గూడా కలిపి రూపకాంతి అని ఒకే పదంలో చెప్పడం చాలా బాగుందనిపించింది నాకు. ఈ పద్యంలో మగవాని సౌందర్యానికి చొక్కిపోతున్న వనిత వరూధిని. ఆమె మోహించిన పురుషుడు ప్రవరుడు. అయితే, తొందరపడి ఈ పద్యం మనుచరిత్ర లోదనుకుంటారేమో! కాదు. ఇది మార్కండేయ పురాణం లోనిది. కవి మారన.
మారన ఒక సంస్కృత పురాణాన్ని తెనిగించిన తొలి తెలుగు కవి. ఈయనకు తిక్కనగారంటే మహా గౌరవము. ‘తిక్కన సోమయాజి ప్రసాదలబ్ధ సరస్వతీపాత్రుడ’నని తన కావ్యంలోని ఆశ్వాసాంత గద్యల్లో చెప్పుకున్నాడు. అన్నట్టు ఈయన తండ్రి పేరు కూడా తిక్కనామాత్యుడే. తన మార్కండేయ పురాణం అనువాదాన్ని మారన ప్రతాపరుద్ర చక్రవర్తి సేనానాయకుడైన గన్న సేనానికి అంకితమిచ్చాడు. తాను తిక్కన సోమయాజి ప్రసాదలబ్ధ సరస్వతీపాత్రుడనని చెప్పుకొన్నాడని మారన తిక్కన శిష్యుడై ఉండవచ్చని, తిక్కన గణపతిదేవ చక్రవర్తి వద్దకు ఓరుగల్లు వచ్చినప్పుడు కలిసి శిష్యరికం చేసి వుంటాడని ఊహించారు (ఆరుద్ర) గాని అది సంభవం కాకపోవచ్చు. ఎందుకంటే గణపతిదేవ చక్రవర్తి కాలానికీ ఆయన మునిమనమడైన ప్రతాపరుద్రునికీ మూడు తరాల అంతరం ఉంది. పైగా మారన ఓరుగల్లువాడు. తిక్కన నెల్లూరివాడు. తిక్కన ఓరుగల్లుకు తన రాజుకు సాయపడమని ప్రార్థించడానికి గణపతిదేవుని వద్దకు వచ్చాడు. అక్కడే నెలలూ సంవత్సరాలూ ఉండడు. అందుకని మారన తిక్కనకు ప్రత్యక్ష శిష్యుడు కాకపోవచ్చు. తిక్కన భారతం సమీపగతంలోదే కాబట్టి పదేపదే చదివి, పరవశుడై ప్రభావితుడై తిక్కనను గురుస్థానీయునిగా సంభావించుకొని ఉండవచ్చు.
మారన మంచి కవియేగాని గొప్పగా ఆయన్ను గురించి చెప్పుకునే వీలు చాలా తక్కువ. భారతం అనువాదమైపోయింది. భాగవతం మీద ఇంకా చేయి వెయ్యలేదెవ్వరూ. రామాయణం కూడా బయటకు రాలేదు. భాస్కరాదులు ప్రయత్నం చేస్తుండవచ్చు. తిక్కన నిర్వచనంగా ఉత్తర రామాయణం మాత్రం వ్రాశాడు. మారన కావ్యం వ్రాయాలనుకుంటే భాగవత రామాయణాల మీదికి మనస్సు పోలేదో, ధైర్యం చాలలేదో… మార్కండేయ పురాణం అనువదిద్దామనుకున్నాడు. అది కావ్యం కాదు. పురాణం. పురాణాన్ని తెలిగించదలచుకుంటే అది సాహిత్య కారణం కాక ధార్మిక కారణమే అవుతుంది. మారన ధార్మిక కారణం వైపే మొగ్గు చూపాడు. అందుకనే సాహిత్య ప్రియులు దానిని అంతగా ఆదరించలేదు. రసికులకు పద్యం బాగుండటమొక్కటే చాలదు. ఒక ప్రవాహి అయిన కథ ఉంటే పాఠకులు దానివెంట పయనిస్తారు. వారికి అలా ఆసక్తి కలిగించే కథ కావాలి. మంచి సన్నివేశాలు కావాలి. పాత్రలు కావాలి. పాత్రల బాహ్యస్వరూపాల వర్ణన కావాలి. ఆంతరిక స్వభావాల చిత్రణ కావాలి. సన్నివేశోచితమైన వర్ణనలూ, సంభాషణలూ, అలంకారాలూ, చమత్కారాలూ కావాలి. మార్కండేయ పురాణంలో ఏకసూత్రమైన కథ లేదు. మనుష్యుల శుభాశుభ కర్మభోగాల వివరణా, రకరకాల నరకాలూ, చతుర్యుగమన్వంతర కాల సంఖ్యలూ, గ్రామ్యారణ్య ఔషధులూ, నిత్య నైమిత్తికాలైన శ్రాద్ధాలూ, శ్రాద్ధాల్లో ఏవి పెట్టాలి, ఏవి పెట్టగూడదు–ఇలాంటివన్నీ ఎంత అందమైన పద్యాల్లో వ్రాసినా పురాణాన్ని పురాణంగానే చూస్తారుగాని కావ్యంగా ఎవరు చదువుతారు? చదివినా ఒకసారి చూచి పక్కన పడేస్తారుగాని మళ్ళీ మళ్ళీ చదివి మననం చేసుకోరు. అసలు పురాణాన్ని ఎన్నుకోవడంలోనే మారన తప్పులో కాలేశాడు. అయితే అందులో మూడు పెద్ద కథలున్నాయి. 1. స్వారోచిష మనుసంభవము 2. హరిశ్చంద్ర చరిత్ర 3. కువలయాశ్వ చరిత్ర. వీటిల్లో ఏదో ఒకదాన్ని తీసుకుని విస్తరించి ప్రస్తరించి ప్రబంధంగా రాసివుండవచ్చు. ప్రబంధ ధోరణి అప్పటికింకా కుదురుకోలేదు. ఒక కొత్త దారి నిర్మించుకోవాలంటే మహా ప్రతిభ కావాలి. అది మారనకు తోచలేదు. అలాంటి మహా ప్రతిభతో, అందులోని ఒక చిన్న కథను స్వీకరించి పెద్దన బంగారపు పంట పండించాడు. మారన అది చెయ్యొచ్చు, ఇది చెయ్యగూడదు అని చెప్పే కేటలాగు కవిగానే మిగిలిపోయాడు. పద్యం హాయిగా చెప్పగలిగీ, ఒక మంచి కావ్యాన్ని ప్రయత్నించకుండా నీరస వివరాల జాబితాలాగా మార్కండేయ పురాణం రచించాడు. అందులో కవితా శిల్పాన్ని చూపించే ఆస్కారం చాలా తక్కువ.
ఇకపై పద్యమూ, దాని సందర్భమూ, దాని ప్రభావమూ గురించి ముచ్చటించుకోవాలి. దాదాపు 150 పైచిలుకు పద్యాలున్న స్వారోచిష మనుసంభవ కథను పెద్దన గొప్ప ప్రబంధ కావ్యంగా తీర్చిదిద్దాడనుకున్నాం. పెద్దన ఒక చక్కని ప్రణాళికతోనే మనుచరిత్ర రచనను నిర్వహించాడుగాని ఆయన కేవలం సంస్కృత మార్కండేయ పురాణాన్నే అనుసరించలేదు. మారనను బాగా అనుసరించాడు. ఆయన పద్యాలను దాదాపు మక్కీకి మక్కీ తీసుకున్నాడు. అలా అనుసరించినా, తన స్వీయ ఉపజ్ఞతో మారనకన్నా గొప్పగా కవితా సృష్టి చేశాడనేది వేరే విషయం. పద్యానుసరణా భావానుసరణా రెండూ స్పష్టంగా కనపడతాయి. ముఖ్యంగా పై పద్యమే చూడండి, దానికి పెద్దన పద్యం:
ఎక్కడివాడొ యక్షతనయేందు జయంత వసంత కంతులన్
చక్కదనంబునన్ గెలువజాలెడువాడు మహీసురాన్వయం
బెక్కడ ఈ తనూవిభవమెక్కడ ఏలని బంటుగా మరున్
డక్కగొనంగరాదె అకటా నను వీడు పరిగ్రహించినన్
పెద్దన పద్యం జాజ్వల్యమానంగా ఉంది. సందేహం లేదు. కానీ అనుసరణ ఉందా లేదా?
మరొక్క మారన పద్యంలోని కొంత భాగం:
అనలునియందు రేపునుమాపు వేల్వంగబడు
హవ్యములుజేసి పడయవచ్చు పుణ్యలోకములు పడతి…
వినుము దర్భలు, సరణులు వేదికలును
నగ్నులును నాకు గరము ప్రియంబొనర్చు
గాని యొండెందు ప్రియమెద గలుగదనిన
నవ్వరూధిని యిట్లనునతని తోడ
ఈ సందర్భంలో పెద్దన పద్యం:
తరుణీ రేపును మాపు హవ్యములచేతన్ తృప్తుడౌ వహ్ని స
త్కరుణాదృష్టి నొసంగు సౌఖ్యములెరుంగన్ శక్యమే నీకు? నా
కరణుల్, దర్భలు, నగ్నులున్ బ్రియములైనట్లన్యముల్గా వొడల్
తిరమే! చెప్పకుమిట్టి తుచ్ఛసుఖముల్ మీసాలపై తేనియల్
ఇలా చాలా పద్యాలున్నాయి ఏకరువు పెట్టదలచుకుంటే. పెద్దన గొప్ప కవే. రెండో మాట లేదు. ఆయన ఇతర ప్రసిద్ధులనుండీ చాలా ప్రభావితుడైనాడు. ముఖ్యంగా ప్రౌఢిమలో ఆయన శ్రీనాథునికి చాలా ఋణపడ్డాడు. తన కావ్యంలో పూర్వకవి స్తుతి చేశాడుగాని మాటవరసకైనా మారననూ శ్రీనాథునీ తలవనైనా తలవలేదు. ఈ విషయంలో పెద్దన్న కేవలం చిన్నన్న అనిపిస్తాడు. కృతజ్ఞతగా ఎవరినించి తీసుకున్నారో వారిని స్మరించకపోవడం మంచి గుణమేం కాదు.
సరే, మళ్ళీ మారన దగ్గరకు వద్దాం. తనకు ముందుండే కవుల వ్రాతల్లో మనసుకు నచ్చిన పద్యాలుంటే అలాగే రాద్దామనిపించడం చాలా సహజం. మారన ఈ పద్యం చూడండి…
వీని సురూప విభ్రమము వీనితనూద్గత చారు కాంతియున్
వీని మృదూల్లసద్గతియు వీని వినిర్మల దృగ్విలాసమున్
వీని ముఖాంబుజద్యుతియు వేడ్కగనుంగొననింత యొప్పునే
మానవ, దేవ, కిన్నర కుమారుల జూడనె! వారునిట్టిరే!
ఎంతో హాయిగా, ముచ్చటగా ఉంది ఈ పద్యం.
భారతాదిపర్వంలో శంతనుడు దాశరాజ పుత్రిని యమున వొడ్డున చూసినప్పటి సందర్భంలో నన్నయ వ్రాసిన ఈ పద్యం చూడండి.
దాని శరీర వైభవము, దాని విలోల విలోకనంబులున్
దాని మనోహరాకృతియు, దాని శుచిస్మిత వక్త్రకాంతియున్
దాని విలాసమున్ గడుముదంబున జూచి మనోజబాణ సం
తాన హతాత్ముడై నృపతి దానికి నిట్లనియెన్ ప్రియంబునన్.
మారన పద్యానికి ఈ పద్యం కొంతైనా కారణమై ఉంటుందనిపిస్తుంది. అయితే అదేమీ నేరం కాదు. మంచి పద్యాలను మెచ్చుకొని అలాగే వ్రాయడం పెద్దవారి కవిత్వం ఎడల గౌరవం ప్రకటించడమే.
మారన చాలా సొగసుగా వ్రాసిన ఈ పద్యం గమనించండి.
ఆ నగుమోముచెన్ను శశియందును పంకరుహంబునందు లే
దా నయనప్రభాతి మదనాస్త్రములందు మెరుంగులందు లే
దా నును మేనికాంతి లతికావలియందు పసిండియందు లే
దా నలినాయతాక్షి లలితాకృతి నా మతి బాయనేర్చునే!
ఈ పద్యం పైలాపచ్చీసులో ఉన్న ఒక యువ రసికుడు తన ప్రేయసి గురించో, అప్పుడే చూసిన ఏ అందగత్తె గురించో చెప్పి ఉంటాడనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. ఒళ్ళంతా భయంకరంగా రోగం అలముకున్న ఒక కుష్టురోగి ఒక వెలయాలి మీద మనసుపడి ఆమెను తనకు కూర్చమని తన భార్యతో చెపుతూ ఆ పణ్యాంగనను వర్ణించే పద్యమిది. ఈ సందర్భం ఎంత జుగుప్సాకరంగా ఉందో, ఇంత మంచి పద్యాన్ని ఆస్థాన పతితం చేశాడే మారన అని అంతే మనస్సు చివుక్కుమంటుంది.
కవి ఔచిత్యం పాటించడమూ అవసరమేగదా.
మారన మంచి కవి. ఎందుకంటే మార్కండేయ పురాణంలో మొదటినించీ చివరిదాకా అన్ని పద్యాలూ బాగుంటాయి. సులభగ్రాహ్యంగా వుంటాయి. పద్య రచనలో చేయితిరిగినతనం కనబడుతుంది. ఏ మాత్రమూ ఆసక్తి కలిగించని ముచ్చటలు ఎంత మంచి పద్యాల్లో రాస్తే ఏం? మారనను గొప్ప కవి అనిగానీ, ఆయన మార్కండేయ పురాణాన్ని గొప్ప కావ్యమనిగానీ అనాలనిపించదు. అయితే ఎలాంటి చోట వున్నా మంచి పద్యం నచ్చకపోదుగదా!