ఉ.
చ్చోట భవన్నఖాంకురము సోకె కనుంగొనుమంచు జూపె య
ప్పాటలగంధి వేదన నెపంబిడి యేడ్చె కలస్వనంబుతో
మీటిన విచ్చు గుబ్బ చనుమిట్టల నశ్రులు చిందువందగన్.
మనుచరిత్రములో అల్లసాని పెద్దన వ్రాసిన ఈ పద్యం బాగా ప్రసిద్ధమైన పద్యం. పద్యప్రియులూ, ప్రాచీన సాహిత్య ప్రియుల్లో ఈ పద్యం చదవనివారూ, దీన్ని గురించి తెలియనివారూ ఉండరు. దీని సందర్భంగానీ, దీనిమీద వచ్చిన వ్యాఖ్యానాలుగానీ ఎరుగనివారు అసలే ఉండరు. ఈ పద్యం స్ఫూర్తితో వ్రాసిన ఇతరుల పద్యాలు కూడా దీనితోపాటు ముచ్చటింపబడుతూనే ఉంటాయి. అందుకని దీన్ని గురించి చెప్పుకోవడమంటే చర్విత చర్వణమే అవుతుంది. ఐనా సరే ముచ్చటించుకుందాము.
ఒక స్త్రీ ఏడ్పును వర్ణించే ఘట్టం అది. ఆ స్త్రీ మనుచరిత్రంలోని కథానాయిక వరూధిని. తాను కామించిన ప్రవరుడు తనను తిరస్కరించిన తరువాత, తాను కొంత చొరవ చూపబోతే త్రోసేసినప్పుడు- ఆ తిరస్కృతి కలిగించిన అవమానమూ రోషమూ వేదనా ముప్పిరిగొని ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది ఆమెకు. కన్నీరు ఉబికింది. అయితే ఆమె రోషావమానాలకన్నా, నొప్పిని కారణంగా చూపించింది. ‘వేదన నెపంబిడి ఏడ్చె.’ నొప్పి ఎందుకు కలిగింది? ‘పాటునకు ఇంతులోర్తురె’ అంటున్నది. ఇక్కడ ఇంతులోర్వలేనంత వేదన కలిగించే ‘పాటు’ ఏమున్నది? ముందు పద్యంలోకి పోవాల. ఆ పద్యం ఇదీ:
ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార పై
యంచుల్మొవగ కౌగలించి యధరం బాశింప, హా శ్రీహరీ
యంచుం బ్రాహ్మణు డోరమోమిడి తదీయాంసద్వయంబంటి పొ
మ్మంచుం ద్రోసె – కలంచునే సతుల మాయల్ ధీరచిత్తంబులన్.
అంతకుముందు చాలాసేపు ఇద్దరూ వాదించుకున్నారు. మీరు యజ్ఞాలూ తపస్సులూ చేసేది మాలాంటి అప్సరసలతో స్వర్గంలో సుఖాలనుభవించడానికేగదా అంటుంది. ఇక్కడే నాతో ఉండి సశరీర స్వర్గసుఖాలు అనుభవించమంటుంది. ఇక్కడి రత్నకందరములూ, ఇక్కడి నందన చందనోత్కరాలూ మీ ఇంటిపాటి చేయవా అంటుంది.
అసలు ఇంద్రియముల్ సుఖంబు గను ఆ ఇంపే పరబ్రహ్మము, ఆనందోబ్రహ్మ అనే వేదవాక్యం అర్థమదేగదా అంటుంది. ఇన్ని చెపుతున్నా ప్రవరుడు మాకు అరణులు, దర్భలు, అగ్నులు ప్రియములైనట్లు అన్యముల్ కావు అంటాడు. ఆమె అతన్ని ఒడబరచే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. అతనేమో ‘ఏనిక నిల్లు చేరుటకు నెద్ది యుపాయము’ అని గునుస్తూనే ఉన్నాడు. అతనితో మాట్లాడుతున్నంతసేపూ ఆమెలో ప్రణయోత్సేకం పెల్లుబుకుతూనే ఉన్నది. ఎంత ఒడబరచ జూచినా ఏమీ ప్రయోజనం కనబడటంలేదు. మాటల్లాభంలేదు, కొంచెం శరీర స్పర్శ ఏమైనా ఫలితం ఇస్తుందేమో అనుకున్నదేమో – బాహుమూలాలు మెరిసిపోతుండగా, పాలిండ్లు పొంగారుతుండగా అతని సమీపానికి వచ్చింది. అంటే ఆమెలో కామోద్రేకం ఎక్కువవుతున్నదనే అర్థం. ఇంకా ముందు పద్యంలో ఆమె మోహాధిక్యతను స్పష్టంగా చూపాడు కవి. నీవీబంధమూడన్, రయోద్ధతి నూర్పుల్ నిగుడన్, వడిన్ విరులు చిందన్, కొప్పువీడన్, రతిసంరంభము మీరగా అతన్ని కౌగిలించి, అధరం అందుకోడానికి మోవిని మోవి వద్దకు చేర్చ ప్రయత్నించింది. ప్రవరుడు ఓరమొహం చేసుకుని, ఆమె పెదాలకు అందకుండా మోము దూరంగా జరిపి – ఆమె భుజాగ్రాలను ‘అంటి’ పో అంటూ త్రోసివేశాడు. అంసము అంటే భుజం పైభాగము. ఆ రెంటినీ, రెండు చేతులతో కనీసం పట్టుకోనుగూడలేదు. ‘అంటి’ త్రోశాడు. అంతే. ఆమె పడినట్లు చెప్పలేదు. అయినా ఆమె ‘పాటునకింతులోర్తురే’ అన్నది. ‘నీవు త్రోవ నిచ్చోట భవన్నఖాంకురము సోకె కనుంగొను’మంటూ చూపింది. ఆ ఇచ్చోట అనేది ఎచ్చోటనైనా కావచ్చు. నఖక్షతాలకు శృంగారంలో పెద్ద వ్యవహారమే ఉంది. ఆమె భుజపు కొనలనంటి నెట్టడమే అతను చేసింది. నఖాంకురము సోకే అవకాశం చాలా తక్కువ. అయినా ఆమె గోరు గుచ్చుకుంది చూడు అంటూ చూపిస్తున్నదంటే – అంత దుఃఖంలోనూ అతన్ని ఆకర్షించే ప్రయత్నమే కన్పిస్తున్నది. సరే, అదలా ఉంచితే, ఆమె వేదన నెపంబిడి కలస్వనంతో ఏడ్చిందట. కలస్వనమంటే కోకిల, నెమలి, పావురము ఇవి చేసే అవ్యక్త మధుర ధ్వని. ఇక్కడ మనం కోకిల అనే తీసుకుందాం. గానానికి – నెమలీ పావురాలకన్నా, కోయిలనే అన్వయిస్తారుగాబట్టి. ఆమె ఏడ్పు కోయిల కూతలాగా గానమధురంగా వుంది అనుకుంటేనే బావుంటుంది. నెపం గానీండి, రోషంగానీండి – ఆమె దుఃఖం మాత్రం నిజమే. ఏడ్పూ నిజమే. కన్నీళ్ళు వచ్చాయి. కన్నీళ్ళు పాలిండ్ల మీదపడి చిందిపోతున్నాయి అన్నాడు. ఈ పద్యంలో ఒక స్త్రీ కామోద్రిక్తతా, తద్వైఫల్యంవల్లా తిరస్కృతివల్లా కలిగిన భంగపాటుతో వచ్చిన రోషమూ, అది తట్టుకోలేక ఏడవడమూ, ఆ ఏడుపు కలస్వనంతో ఉండడమూ, కన్నీరు కారడమూ, అవి రొమ్ముల మీద పడి చిందడమూ, ఆ ఏడ్పులోగూడ ఆమె అతన్ని ఆకర్షించే ప్రయత్నం చేయడమూ – ఇన్ని ఉన్నాయి. ఒక అందగత్తె దుఃఖం ఇంకా అందంగా రూపించబడటమూ ఉంది. బయటికి కన్పించేదే కాక ఆ తిరస్కృత స్త్రీ హృదయారాటమూ, ఆ ఆరాటంలో ఆమె ప్రతి చర్యా ఇవన్నీ ఎంతో అద్భుతంగా బొమ్మకట్టించాడు పెద్దన. ఇది మామూలు కవి వ్రాయగలిగిన పద్యం కాదు. ఒక మహాకవి మాత్రమే వ్రాయగలిగింది. ఈ ఏడుపు పద్యం తరువాత ఇద్దరు గొప్ప కవులను – ఆయన సమకాలికులను – ప్రభావితం చేసింది. సందర్భం కూడా దాదాపు అలాంటిదే. ఒకటి రామరాజ భూషణుడిది. మరొకటి ముక్కు తిమ్మనది. రామరాజ భూషణుని పద్యం ఇదిగోండి:
ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకానిశా
రాజ శ్రీ సఖమైన మోమున పటాగ్రంబొత్తి యెల్గెత్తి యా
రాజీవానన యేడ్చె కిన్నర వధూ రాజత్కరాంభోజ కాం
భోజీ మేళ విపంచికారవ సుధాపూరంబు తోరంబుగన్.
ఇది వసుచరిత్ర నాయిక గిరిక ఏడుపు. ఈ ఏడుపుకు కారణం ఏమీ లేదు. ప్రియుడు ఆమెకు అనురక్తుడే. పరస్పరం చూసుకోగానే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఇక కలుసుకోవడమే. ఈ లోపలే విరహం. విరహబాధకు తోడు వెన్నెల. ఆ వెన్నెలను భరించలేక ఈ ఏడుపు. ఆ వెన్నెల వెలుగులను భరించలేక, పున్నమ చందమామలాంటి ముఖానికి పైట చెరగు వొత్తుకుంటూ గొంతెత్తి ఏడ్చిందట. ఆ ఏడుపు – కాంభోజి రాగం మేళవించి శ్రుతి సుభగంగా వాయించే కిన్నెరలేమ చేతి వీణాస్వనంలాగా అమృతోపమానంగా ఉందిట. పద్యమూ పదాలూ ఉపమానాలూ బాగానే ఉన్నాయి. కానీ పెద్దన పద్యంలోని రససిద్ధి లేదు. అసలామె ఏడ్పుకు కారణమే లేదు. విరహం కోసం విరహమూ – ఏడుపు కోసం ఏడుపూ అన్నట్టు ఉన్నది. ఒక అందమైన స్త్రీ అందంగా ఏడ్చింది అని చెప్పడమే ఇక్కడ ఉన్నది. పైగా ఆమెది రాకానిశా రాజశ్రీసఖమైన మోము. పున్నమ చందురునిలాంటి మోము వెన్నెలను భరించలేకపోవడం నాకు అసంబద్ధంగా కన్పిస్తున్నది. అయితే రామరాజభూషణుడు సంగీతజ్ఞుడు. ఆయన పద్యాలు సంగీతమయంగా ఉంటాయి. ఆయన ఉపమానాలూ సంగీత సంబంధిగా ఉంటాయి. కాంభోజిరాగమూ, విపంచీస్వనమూ ఆయన స్వభావానికి అనుగుణంగానే ఉన్నాయి.
ముక్కు తిమ్మన పద్యం:
ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోక దవానలంబుచే
గాసిలి ఏడ్చె ప్రాణవిభు కట్టెదుటన్ లలితాంగి పంకజ
శ్రీ సఖమైన మోముపయి చేలచెరంగిడి, బాల పల్లవ
గ్రాస కషాయకంఠ కలకంఠవధూ కలకాకలీ ధ్వనిన్.
ఇది దగ్గరదగ్గరగా పెద్దన పద్యంతో తులతూగగల పద్యం. ఏడుస్తున్న స్త్రీ హృదయంలోని అలజడిని పెద్దన్న పట్టుకున్నట్లే తిమ్మన్నా పట్టుకున్నాడు. ఇది సత్యభామ రోదన. ఇక్కడ కూడా పారిజాత పుష్పం తనకు ఇవ్వకుండా రుక్మిణికి ఇచ్చినందున తనకు జరిగిందనుకుంటున్న అవమానమూ, దానివలన రోషమూ, దానివలన శోకమూ పోటెత్తుతున్న స్త్రీ, భర్త రాగానే ‘ప్రాణవిభు కట్టెదుట’ ఆ దుఃఖము పొంగిపొర్లి ఏడ్వడం ఎంతో గోముగా, సహజ సుకుమారంగా ఉంది. ఈమె కూడా కలస్వనంతోనే ఏడ్చింది. అయితే లేత లేత మావిచివుళ్ళు తిని ఆ వగరుతో కషాయితమైన గొంతుతో కూసే కోయిల పడుచులాగా మధురంగా ఏడ్చింది. గిరికది రాకానిశా రాజశ్రీకరమైన మోము. దాని మీద పటాగ్రం వొత్తుకుంటూ ఏడ్చింది. సత్యభామది పంకజశ్రీసఖమైన మోము. దానిమీద చేల చెరంగిడి ఏడ్చింది. పెద్దన వరూధిని ముఖ సౌందర్యాన్ని వర్ణించలేదు. కేవలం కలస్వనంతో ఏడ్చింది అని వదిలేశాడు. భట్టుమూర్తీ తిమ్మనా ఆయా స్త్రీల ముఖసౌందర్యాన్ని ఉపమలతో సహా చెప్పారు. రెండేసి లైన్ల పొడవైన సమాసాలతో వారి ఏడుపులను వర్ణించారు. పెద్దన పద్యంలో మరో అద్భుతమైన సొగసుంది. అది ముందు ముందు చెప్పుకుందాం.
ఈ మూడు పద్యాలనూ బేరీజు వేస్తూ తెనాలి రామకృష్ణుడు- అల్లసాని పెద్దన అటూ ఇటూ గాకుండా ఏడ్చాడు, ముక్కు తిమ్మన ముద్దుముద్దుగా ఏడిచాడు, భట్టుమూర్తి బావురని ఏడ్చాడు అని చమత్కరించాడట. యతి అక్షరాలు కుదిరేట్లు తన సహజ హాస్యప్రియత్వంతో అన్నాడనుకున్నా, ఆయన విశ్లేషణలో నిజం ఉంది. అల్లసానివారి దేవతాసాని అటు రోషమా ఇటు నెప్పా – అనే విచికిత్స కలిగిస్తూ ఏడిచింది. సత్యభామ ప్రియుని కట్టెదుట గోముగా ఏడ్వడం ముద్దుముద్దుగానే ఉంటుంది గదా. ఇక గిరిక ‘ఎల్గెత్తి’ ఏడిస్తే బావురుమన్నట్లుండటం భావ్యమే. కాబట్టి తెనాలి కవిది సరైన విశ్లేషణే.
ఐతే పెద్దనగారి పద్యానికి అంతకుముందెవరైనా వ్రాసిన పద్యం మార్గదర్శనం చేసిందా అంటే చేసింది మరి. కాశీఖండంలో శ్రీనాథుడు వ్రాసిన ఒక ఏడ్పు పద్యం పెద్దనను ప్రభావితం చేసింది. అది ఇది:
కొసరి వసంతకాలమున కోయిల గ్రోల్చిన భంగి యేడ్చె న
బ్బిసరుహనేత్ర కొండచరి పెద్ద యెలుంగున వెక్కి వెక్కి వె
క్కసమగు మన్యువేగమున కాటుకకన్నుల నీరుధారలై
ఉసిరికకాయలంతలు పయోధరముల్ దిగజారునట్లుగన్.
ఈ పద్య సందర్భం మనవి చేస్తాను. పూర్వం కాశీలో సుశీల అనే ఒక అందమైన విప్ర బాలిక ఉండేది. ఆమె శివభక్తురాలు. ఒక విద్యాధరుడామెను మోహించి ఒక వెన్నెల రాత్రి ఆమె నిద్రిస్తుండగా, నిద్రాభంగం కానీకుండా మెల్లగా ఎత్తి ఆకాశమార్గాన మలయ పర్వతానికి తీసుకుపోతాడు. దరిమిలా ఆమెకూడా అతని ఎడల అనురక్త అవుతుంది. ఒక రాక్షసుడు సుశీలను చూసి పట్టుకుందామని వస్తాడు. విద్యాధరుడికీ రాక్షసుడికీ యుద్ధం జరుగుతుంది. ఇద్దరూ చనిపోతారు. విద్యాధరుడు చనిపోతూ తన ప్రేమ ఆమెకు తెలిసేలా మహా ఆర్తిగా సుశీలను చూస్తూ చనిపోతాడు. ఆమె కూడా విద్యాధరుణ్ణి నచ్చి, మెచ్చి, అతను చూసిన మోహంపు చూపులకు కరిగి నీరయి ఇక ఇతనే తన భర్త అని నిశ్చయించుకుని – సహగమనం చేయాలని నిర్ణయించుకొని శివునిగూర్చి ప్రార్థిస్తూ ఏడుస్తుంది. అప్పటి ఏడ్పు పై పద్యం. ఈ పద్యం ఛాయలు పెద్దన్న పద్యంలో కనపడుతున్నాయి. అయితే శ్రీనాథుడి ధోరణికి తన స్వీయోపజ్ఞతో గొప్ప మెరుగులు దిద్దాడు పెద్దన. ఇద్దరు స్త్రీలూ కలస్వనంతోనే – సుశీలైతే కొసరి వసంత కాలమున కోయిల గ్రోల్చిన భంగి – ఏడ్చారు. అయితే శ్రీనాథుడి పద్యంలో సందర్భశుద్ధి లేదు. భర్త చనిపోతే దుఃఖంతో ఏడ్చిన ఏడుపు. పెద్దన పద్యం శ్రీనాథుని పద్యంకన్నా జాజ్వల్యమానంగా ఉండటానిక్కారణం – ఆ పద్యంలో నాటకీయత ఉంది. కృపారహితాత్మకా! అని తిట్టడమూ, నీ గోళ్ళు గుచ్చుకున్నాయి చూడూ అని చూపడమూ లాంటి ‘చర్య’ కొంత ఉంది. శ్రీనాథుడి పద్యంలో ఏడుపే ఉంది. అంతేకాక కొన్ని పదాలు కొండచరి, పెద్ద ఎలుంగున, వెక్కి వెక్కి, వెక్కసమగుమన్యు వేగమున లాంటివి ఆ స్త్రీ ఏడుపులోని అందం చూపించడానికి దోహదం చేసేట్లు లేవు. “రోదనాభ్యుదయ మనోజ్ఞత” కన్పించదు. శ్రీనాథుని పద్యం ప్రౌఢంగానే ఉన్నా, పెద్దనది ప్రౌఢిమతోపాటు మంచి కాంతిగలిగి సహజ మనోజ్ఞంగా ఉంది. శ్రీనాథునినుంచి పెద్దన చాలా ప్రభావితుడైనాడు. తన స్వీయ ప్రతిభతో మరింత బాగా కవిత్వం చెప్పాడనేది వేరే సంగతి. శ్రీనాథుడు సామాన్యుడు కాడు. ఆంధ్ర సాహిత్య రంగస్థలి మీద విశృంఖల విహారం చేసి, తన ముద్రను చాలా స్పష్టంగా అచ్చుగుద్దిన కవిసార్వభౌముడు. కనీసం పూర్వకవి స్తుతిలో తలచుకొని ఉండాల్సింది పెద్దన.
శ్రీనాథుని పద్యానికంటే మెరుగుగా, మెరుపుగా పెద్దన ఎలా నగిషీలు చేశాడో ఈ రెండు పద్యాలనూ బేరీజు వేస్తే తెలుస్తుంది. తమ తమ పద్యాల చివర ఇద్దరూ కొంత చమక్కు చూపించారు. శ్రీనాథుడు ‘కాటుకకన్నుల నీరు ధారలై ఉసిరిక కాయలంతలు పయోధరముల్ దిగజారునట్లుగన్!’ అన్నాడు. ఇక్కడ కన్నీటి బిందువులుగదా ఉసిరిక కాయలంతవి. ధార అయినాక బిందురూపం కోల్పోతాయి గదా. ఐనా అవి పయోధరాలు దిగజారుతున్నాయన్నాడు. మరీ ఉసిరిక కాయలంతలా! ప్రాస కోసం ఉసిరిక కాయలను పట్టుకొచ్చాడని అర్థమవుతున్నదిగాని సైజు కొంచం మిక్కుటంగా అనిపించటంలేదూ! సరే, ఎలాగైతేనేంగానీ, పయోధరాలను కూడా లాక్కొచ్చి వాటిని తడిపిందాకా ఆయనకు తృప్తి కలగలేదు. ఇక పెద్దన అయితే అశ్రువులను బిందువార జేశాడుగాని వాటి సైజుగానీ, ధారగా రావడంగానీ పట్టించుకోలేదు. ఆయన దృష్టి వేరే ఉంది. శ్రీనాథుడు పయోధరముల్ దిగజారుచుండగన్ అంటే పెద్దన ‘గుబ్బ చనుమిట్టలు’ అనే కమ్మటి తెనుగు పదం వాడి, వాటికొక పరమాద్భుతమైన విశేషణాన్ని జోడించాడు. అవి ‘మీటిన విచ్చు’ గుబ్బచనుమిట్టలట. మీటితే విచ్చుకోవడం అనేదాన్ని ఉరోజాలకు అంతకుముందుగానీ తర్వాతగానీ ఏ కవీ ఆరోపించలేదనుకుంటాను. (భట్టుమూర్తిగారైతే ఎక్కడో ఉన్నదున్నట్టుగా ఆ పదాన్ని కాపీ కొట్టినట్టున్నాడు) గొప్ప చమత్కృతీ, గొప్ప రసానుభవమూ, గొప్ప పరిశీలనా, గొప్ప చిలిపిదనమూ ఈ అభివ్యక్తిలో నిండి ఈ పద్యాన్ని శిఖరాగ్రం మీద నిలబెట్టాయనిపిస్తుంది నాకు.
శ్రీనాథునికి శయ్యాసౌఖ్యం కావాలి. పెద్దనకు అంతేకాక మరేదో కావాలి. శ్రీనాథుడు సూచించిన వ్యంజనానికి తన రాసిక్యంతో మనోజ్ఞమైన గార్నిషింగ్ చేశాడు పెద్దన. శ్రీనాథుడు కవిసార్వభౌముడు, నిజమే. పెద్దన ఆంధ్రకవితా పితామహుడు మరి.
ఏడుపు పద్యాల ముచ్చట చెప్పుకుంటున్నాం కాబట్టి శ్రీనాథుని తర్వాతా, పెద్దనకు ముందూ వున్న ఒక కవి వ్రాసిన పద్యం చెప్పుకుందాం. ఇది కూడా శ్రీనాథుని పద్యాన్ని అనుకరించిందే. ఆ కవి భాగవతం షష్ఠమ స్కంధం తెలిగించిన ఏర్చూరి సింగన.
కుంకుమరాగ రమ్య కుచకుంభములన్ కడు కజ్జలంబుతో
బంకిలమైన బాష్పముల బాల్పడ మజ్జనమాచరింపుచున్
కంకణ పాణి పల్లవ యుగంబున వక్షము మోదికొంచు నా
పంకరుహాక్షి ఏడ్చె పరిభావిత పంచమ సుస్వరంబునన్!
శ్రీనాథుని పోకడ కనిపిస్తున్నది నిజమే గాని – ఇక్కడ బిడ్డ చనిపోతే గుండెలు బాదుకుంటూ ఏడ్చే స్త్రీ రోదన ఇది. ఇలాంటి చోట కుంకుమరాగ రమ్య కుచకుంభాలూ, పరిభావిత పంచమ సుస్వరాలూ పెట్టడం అనౌచిత్యానికి పరాకాష్ఠ!