మ. ఉదయ గ్రావము పానవట్ట, మభిషేకోద ప్రవాహంబు వా
ర్ధి, ధరధ్వాంతము ధూపధూమము, జ్వలద్దీప ప్రభారాజి కౌ
ముది, తారానివహంబు లర్పిత సుమంబుల్‌గాఁ దమోదూర సౌ
ఖ్యదమై శీత గభస్తి బింబ శివలింగం బొప్పెఁ బ్రాచీదిశన్
ఈ పద్యం ధూర్జటి కవిది. శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధ కావ్యం, రెండవ ఆశ్వాసం లోనిది. ఈయన శ్రీ కృష్ణదేవ రాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. ధూర్జటి స్తుతమతి అనీ, ఈయన పలుకులకు అతులిత మాధురీ మహిమ కలదనీ శ్రీ కృష్ణదేవరాయ ప్రభువు అన్నట్లు ఒక చాటు పద్యం ప్రచారంలో ఉంది.
మొదట రసికుడై సుఖభోగాలు అనుభవించి, రాజాశ్రయం వల్ల వచ్చే సౌఖ్యాలన్నీ చవి చూసి, ముదిమి ముసిరే వేళకు మోక్షకామియై శివభక్తిలో పూర్తిగా మునిగిపోయిన దశలో, శివ ప్రభావాన్ని తెలిపే శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధాన్నీ, శ్రీకాళహస్తీశ్వర శతకము అనే శతకాన్నీ భక్త్యావేశంలో రచించాడు ధూర్జటి. శ్రీకాళహస్తి మాహాత్మ్యము – శ్రీకాళహస్తి క్షేత్రం లోని ఈశ్వరుని లీలలూ, ఆయన భక్తుల కథలూ తెలిపే గ్రంథం. శ్రీకాళహస్తికి ఆ పేరు రావడానికి కారకాలైన సాలెపురుగూ, పామూ, ఏనుగుల శివభక్తి కథా, తిన్నడూ మరి ఇద్దరు వేశ్యా యువతుల శివభక్తి పారమ్యమూ, ఇంకా నత్కీరుడు అనే తమిళదేశపు కవి కథా, మొదలైన విశేషాలున్నాయి ఈ కావ్యంలో.
ఏనుగు వచ్చి పత్రి తోనూ, పూలతోనూ శివలింగాన్ని పూజించి పోతుంది. తర్వాత పాము వచ్చి ఆ ఆకూఅలములను పక్కకు నెట్టేసి తన వద్ద ఉండే మణిమాణిక్యాలతో శివుణ్ణి అర్చిస్తుంది. మర్నాడు పూజ చేయడానికి వచ్చిన ఏనుగు తన పూజాద్రవ్యాలు తొలిగింపబడి ఉండటం చూసి చింతిస్తుంది. రెండు మూడు రోజులు ఇలాగే జరిగే సరికి ఏనుగుకి కోపం వస్తుంది. తన పూలనూ పత్రినీ పక్కకు నెట్టేస్తున్న వారి అంతు చూడాలని నిశ్చయించుకుంటుంది. ఇక ఆ రాత్రి ఆ గజరాజుకి కోపంతో నిద్రపట్టదు. ఆ సందర్భంలో కవి చేసిన నిశా వర్ణనా, చంద్రోదయ వర్ణనల్లోనిది పై పద్యం.
ధూర్జటి గొప్ప శివభక్తుడు. ఆయనకు సర్వమూ శివమయం గానే కనిపించింది. ఆ రాత్రి ఉదయించిన చంద్రబింబమూ శివలింగం గానే తోచింది. మరి, శివలింగం అనగానే అందుకు సరిపోయిన ఇతర పరికరాలూ కావాలి. చంద్రుడు ఉదయించిన ఉదయశైలం శివలింగం వుండే వేదిక అయిన పానవట్ట మయింది. రుద్రాభిషేకం కావించగా ప్రవహించిన అభిషేక జలం తూరుపు సముద్రమైంది.సముద్రపు గట్టు మీద కనిపించే మసక చీకటి అగరొత్తుల ధూపంగా మారింది. చంద్రుడు వెదజల్లే వెన్నెలే శివ దీపారాధన వెలుతురు. ఆకాశంలో ప్రకాశించే తారలే శివపూజకు తెచ్చిన పూలు. ఈ విధంగా సర్వాంగ సహితంగా శివుడు కొలువైనాడు. తమస్సును దూరం చేసే చంద్రునికీ, తమోగుణాన్ని నిర్మూలించే చంద్ర చూడునికీ అభేదాన్ని భావించాడు కవి.
ఒక పోలిక చెప్పగానే దానికి సంబంధించిన ఇతర పోలికలను లాక్కొచ్చి, ఉపమానోపమేయాభివృద్ధిలో ఒక దృశ్యాన్ని సంపూర్ణం గావించడం, ప్రధానమైన పోలికను సమర్ధించే ఇతర పోలికలను రచించడం ఏ కవికైనా సాధారణమే. చంద్రబింబం ఎప్పుడైతే శివలింగంగా పోల్చబడ్డదో, వెంటనే పానవట్టమూ, అభిషేక జలమూ, ధూపమూ, పూలూ, దీప ప్రకాశమూ – వీటికి తగిన వస్తువులూ దొరికాయి కవికి. ఈ విధమైన పోలికలు మామూలే. ఉదాహరణకు, నరకునితో యుద్ధం చేసే సత్యభామ వర్షాకాలాన్ని సృష్టించింది అంటాడు పోతన. వర్షాకాలం అనగానే మేఘమూ, వానజల్లూ, శంపాలతా కావాలి. నీలమేఘశ్యాముడైన కృష్ణుడు మేఘం గానూ, సత్యభామ మెరుపుతీగ లాగానూ, ఆమె గుప్పించే శరపరంపరలు చినుకుల జల్లు గానూ అమరిపోయాయి కాబట్టీ ఆ పోలికలో ప్రత్యేకత ఉన్నది. అలానే ఈ పద్యంలో గొప్పతనం ఇతరపోలికలు అమర్చుకోవడంలో కాదు. అసలు ఆ రాత్రి ఉదయించిన చంద్రబింబం శివలింగంగా తోచడమే అక్కడి అందం. ధూర్జటి శివభక్తి ఎంత గొప్పదంటే ఆయనకు సర్వమూ శివమయంగానే కనిపించిందన్నమాట.
అంతే కాక, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూన్న ఆ ఏనుగు – “ప్రాణలింగ పూజనా విఘ్నమున యందు బుట్టినట్టి చింత” తో, “తనలోన తలపోతతో బ్రుంగు”తూ, ఆ నాటి సూర్యాస్తమయం ఇంకా కాక ముందే “ఎపుడు పడమటి కొండపై కెక్కు భానుడు? ఎప్పుడుదయించు, నేఁ బోదునెప్పుడు?”- అని మరుసటి రోజు కోసం తహతహ పడి శివపూజనే భావించే నేపథ్యంలో, తనకి కూడా జగమంతా శివమయమై పోయిన ఆ ఏనుగు మనస్థితిని చక్కగా పట్టుకున్నాడు ధూర్జటి. ఆయన పద్యాల్లో తరచుగా ఉటంకించబడే ఈ పద్యం, చాలామందికి నచ్చినట్లే, నాకూ నచ్చిన పద్యం.
జీవితమంతా రాజసేవ చేసి, సుకుమార వారవనితల మధురాధరోదిత సుధారసధారలు గ్రోలి, చిట్టచివరికి తన కోర్కెలు ఏదో రాజు తీర్చలేదని “రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు” అని రాజులందర్నీ చెడ తిట్టి ముసలితనంలో ఆక్రోశించే ధూర్జటిని తలచుకుంటే గొప్ప గౌరవమేమీ కలక్క పోగా “వృద్ధనారీ…” అనే సామెత గుర్తొస్తుంది. ఐతే, రసప్రోతంగా, భక్తి బంధురంగా, శిల్ప రమ్యంగా తీర్చిదిద్దబడ్డ శ్రీకాళహస్తి మాహాత్మ్యమూ, కాళహస్తీశ్వర శతకాల లోని దొడ్డ కవిత్వాన్ని ఆస్వాదించి తలవూపే సౌహార్దానికి ఆ చులకన భావం అడ్డం కాగూడదని నా నమ్మిక.