నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం

సీ.
లలనా జనాపాంగ వలనావసదనంగ
తులనాభికాభంగ దోఃప్రసంగ
మలసానిల విలోలదళ సాసవ రసాల
ఫల సాదర శుకాలపన విశాల
మలినీ గరుదనీక మలినీకృత ధునీ క
మలినీ సుఖిత కోకకులవధూక
మతికాంత సలతాంత లతికాంతర నితాంత
రతికాంత రణతాంత సుతనుకాంత
తే.
మకృత కామోద కురవ కావికల వకుల
ముకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠకుల కంఠకాకలీ వి
భాసురము వొల్చు మధుమాస వాసరంబు!

పదాలకుండే సౌందర్యాన్ని ఎరిగి, వాటిని ఉచిత స్థానంలో పొదిగి, ఆ సౌందర్యాన్ని దిగంత ప్రదర్శనం చేసే కళను స్వాధీనం చేసుకున్న కవి వ్రాసింది ఈ పద్యం. శబ్దాలొలికించే సంగీత మాధుర్యాన్ని ఆకళింపు చేసుకుని, వాటి ప్రవాహపు ఒరవడిని ఒక క్రమవిభక్తమూ, సమవిభక్తమూ చేసి, పద్యగతిని హయగతిలోనూ, గజగతిలోనూ నిబంధించగలిగిన కవి వ్రాసిందీ పద్యం. తెలుగు సాహిత్యంలో బాగా ప్రసిద్ధమైన వాటిలో ఒకటైన ఈ పద్యాన్ని వ్రాసింది భట్టుమూర్తి అనే నామాంతరం కలిగిన రామరాజభూషణ కవి. ఆయన వసుచరిత్రలోని వసంత వర్ణన ఇది.

కవి ఏమి చెపుతున్నాడు అనేది తరవాతి సంగతి. పద్యం చదువుతుండగానే శభాష్ అనిపించే పద్యం ఇది. సీస పద్యంలోని తొలి మూడు పాదాల్లో ఒక్కోదాంట్లో నాలుగేసి అంత్యప్రాసలూ, నాలుగోపాదం ఎనిమిది అంత్యప్రాసలూ పొదిగించి గొప్ప శ్రవణసౌఖ్యాన్ని కలిగించాడు కవి. పై ఎత్తుగీతిలో రెండుమూడేసి అక్షరాలను అవికల, వకుల, ముకుల, సకల- అనీ, చలిత కలిత- అనీ, కలకంఠ కులకంఠ- అనీ, భాసురము వాసరము- అనీ పునరావృత్తి గావించి, చక్కని శబ్దాలంకారంతో రమణీయతను దృశ్యమానం కావించాడు. భట్టుమూర్తి వసుచరిత్రములో పరమ సంగీతమయంగా శిల్పించిన వందలాది పద్యాల్లో మకుటాయమానమైనదీ పద్యం. అన్నట్టు భట్టుమూర్తి సంగీత విద్వాంసుడు కూడానట. అందుకే ఆయన పద్యాలన్నీ సంగీతం వినిపిస్తుంటాయి. కొందరు సంగీతవేత్తలు, ఈతని పద్యాలకు రాగాల వరసలు కట్టి వీణమీద వాయించేవారట.

రామరాజభూషణుడు కృష్ణరాయల భువనవిజయంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడు అంటారు. ఈయన అల్లసాని పెద్దన వద్ద ప్రత్యక్ష శిష్యరికం చేశాడు అంటారు. వసుచరిత్రము తిరుమలదేవరాయలు అనే రాజుకు అంకితం ఇవ్వబడింది. కృష్ణరాయలు 1530 ప్రాంతాల్లో మరణిస్తే, ఆయన కుమార్తె భర్త అయిన అళియరామరాజు విజయనగర సామ్రాజ్యంలో పెత్తనం చేస్తూ వచ్చాడు. కృష్ణరాయల మృతి అనంతరం మిగిలిన దిగ్గజాలు చెల్లాచెదురైపోయారేమోగానీ భట్టుమూర్తి మాత్రం రామరాజును కనిపెట్టుకొని ఉండి రామరాజభూషణుడైనాడు. 1565లో తల్లికోట యుద్ధం విజయనగర సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసింది. రామరాజు మరణించాడు. ఆయన తమ్ముడైన తిరుమలరాయలు పగ్గాలు స్వీకరించి రాజ్యంలో కొంత స్థిమితం సాధించినట్లున్నాడు. అయితే రాజధానిని విజయనగరం నుంచి పెనుగొండకు మార్చింది ఈయనే. ఈయన పట్టాభిషేకం కూడా పెనుగొండలోనే జరిగింది. ఈ తిరుమలరాయలే వసుచరిత్రమునకు కృతిభర్త.

వసుచరిత్రము తెలుగు పంచకావ్యాల్లో ఒకటి. కవిత్రయ భారతమూ, పోతన భాగవతమూ తరువాత ఈ పంచకావ్యాలూ సాహిత్య విద్యార్థికి అవశ్యపఠనీయాలట. ఆ పంచకావ్యాలు: మనుచరిత్రము, వసుచరిత్రము, పారిజాతాపహరణము, పాండురంగ మాహాత్మ్యము, శృంగారనైషధము. సంస్కృతంలోనూ వ్యాసవాల్మీకుల రచనల పిమ్మట చదివి తీరాల్సిన పంచకావ్యాలంటూ రఘువంశము, కుమారసంభవము, మేఘదూతము, కిరాతార్జునీయము, శిశుపాల వధము అనే ఐదింటినీ చెపుతారు. అయితే ఈ ఎంపిక శిలాక్షరమేమీ కాదు. ఎవరికి ఇష్టం వచ్చినవి వారు ఆ జాబితాలో కలుపుతూ మరోదాన్ని తొలగిస్తూ వుంటారు, వారి వారి ఇష్టాలనుబట్టి.

భట్టుమూర్తి పద్యాల్లోని పదాల పోహళింపు సొగసునూ, శబ్దాలంకారాల వైచిత్రినీ, గేయ సౌలభ్యపు సేరునూ చెప్పాలంటే ఆయన వసుచరిత్రములోని వందలాది పద్యాలను ఉటంకించాల్సివస్తుంది. అన్ని వందల పద్యాలు అంత నైపుణితో శిల్పించడం సామాన్య కవికి సాధ్యం కాదు. భట్టుమూర్తిలాంటి విశేష ప్రతిభాశాలికే అది సాధ్యం. ఆయన శైలిని అనుకరించడానికి ఎందరో ప్రయత్నాలు చేశారు. ఎన్ని పిల్ల వసుచరిత్రలో వచ్చాయి. కాని, ఆయన పద్యరీతిని సాధించినవారు లేరు. ఎంతమందిచేతనో అనుకరించబడటం నిస్సందేహంగా భట్టుమూర్తి గొప్పతనమేగదా. పిల్ల వసుచరిత్రలు వచ్చాయిగాని, పిల్ల మనుచరిత్రలూ, పిల్ల పాండురంగమాహాత్మ్యాలూ, పిల్ల పారిజాతాపహరణాలూ రాలేదు మరి.

కొన్ని మనోహరమైన పద్యాలను సూచించి వదిలిపెడతాను. తెలుగు సాహిత్యం మీద అభిరుచి వుండి, భట్టుమూర్తి కవిత్వంతో అంత ఎక్కువ పరిచయం లేనివారి పిపఠిషను ఎగసనద్రోయడానికి పనికివస్తాయి.

  1. ఇమ్ములై మరుహజారమ్ములై పొదలుండ పూజవికలు వేఱ పూనవలదు
    తెప్పలై నెత్తావి కుప్పలై పుప్పొళ్ళు రుల గందవొడి త్రోవ జిలుకవలదు
  2. ఒక చాయ ననపాయ పికగేయ సముదాయ, మొక సీమ నానా మయూర నినద
    మొకవంక నకలంక మకరాంకహయహేష, లొక క్రేవ వనదేవ యువతిగీతి
  3. కనకవల్లిమతల్లికల పెంపు జడగుంపు, పుష్పపరాగసంభూతి భూతి
    కమనీయ శాఖాప్రకాండంబు దండంబు, తరుణ పల్లవకోటి ధాతుశాటి
  4. మందయానము నేర్పు నిందిందిరాజీవ రాజీవరాజన్మరాళ రాజి
    కలికి పల్కులు నేర్చు లలిత నానావాసనావాస నికట కానన శుకాళి
  5. తలిరుబ్రాయమువాని వలరాజు నలరాజు నలరాజు దెగడు సోయగమువాని
    పసిడి చాయలవాని బగడంబు జగడంబు జగడంబుగల మోవి సొగసువాని
  6. ఏపారు పొదరిండ్ల నాపాటలాశోక దీపార్చి కనక కలాపమరసె
    సాలావలులు దాటి ఏలాలతావార బాలాతతి పరాగ పటము లూడ్చె
  7. పవమాన మానస ప్లవమాన కైరవ చ్యవమాన రజము మైనంట దివురు
    గరసారసాగ్ర తామరసాతిసాంద్ర సీధురసాప్తి కన్నీరు దుడువగోరు

ఇలా చెప్పుకుంటూనే పోతుండవచ్చు. ఇలాంటి పద్యాలు చదివి పరవశించకుండా ఉండటం సాధ్యమా? ముఖ్యంగా తన కౌశలం విశాలంగా చూపడానికి సీసాలను ఎన్నుకొన్నట్టు కనిపిస్తుంది కాని, ఆయన వృత్తాలు కూడా మనోజ్ఞమైనవి చాలా ఉన్నాయి.

ఈయన కేవలం అందంగా పద్యం వ్రాయడంలోనే కాక శ్లేషను కూడా రమ్యంగా మెప్పింపగలిగిన ప్రోడ. పింగళి సూరన రాఘవ పాండవీయం అని రామాయణ భారత కథలు రెండూ వచ్చేట్లు కావ్యం వ్రాస్తే, ఈయన హరిశ్చంద్ర నలోపాఖ్యానం వ్రాశాడు. ఒక్క పద్యం రసోచితంగా శ్లేషలో ఒప్పించడమే మహా కష్టమైతే, రెండు దీర్ఘ కథలను, అవీ ప్రసిద్ధమైన వాటిని, ఒకే కావ్యంలో రెండూ చెపుతూ, కవనంలో మెప్పించడం సామాన్యమైన నైపుణ్యమా! వసుచరిత్రములోనే ఒక పద్యం కవి శ్లేషచమత్కార వైఖరి వెలార్చేది మనవి చేస్తాను. నాయిక గిరిక తన చెలికత్తెలతో వనంలో ఉండగా, వసురాజు నర్మ సచివుడు (విదూషకుడు) మునివేషంలో వచ్చి, ఏమీ తెలియనట్లు- ఈమె ఎవరు? సింధు నందన(లక్ష్మీదేవి) లాగానూ, అచలేంద్ర నందన (పార్వతీదేవి) లాగానూ ఉంది, ఈమె పావన కులగోత్రభూతి తెలపండి (అంటే ఆమె పుణ్యవంశ వైభవాన్ని గురించి చెప్పండి) అని అడుగుతాడు. అప్పుడొక చెలికత్తె ‘అయ్యా, సింధు నందన, అచలేంద్ర నందన అని అంటూనే ఎవరు అని అడగడం మీ కూరిమి పెంపునగదా’ అంటూ, ‘నిజంగా ఈమె సింధు నందనే – శుక్తిమతీ నది కూతురు (సింధు అంటే నది అని కూడా అర్థం), అచలేంద్ర నందనే – కోలాహల పర్వతం కూతురు (అచలేంద్రం అంటే గొప్పపర్వతం)’ అని వివరించి, ఆమె ‘పావన కులగోత్రభూతి’ని – అంటే నీటికీ (పావనం అంటే నీరనే అర్థం కూడా ఉంది), కొండకూ (కులగోత్రం అంటే పర్వతం) పుట్టిన వైనాన్ని వివరిస్తుంది. ఇలాంటి అందమైన శ్లేషలు చాలా పద్యాల్లో కనిపిస్తాయి.

అల్లసాని పెద్దన వ్రాసిన మనుచరిత్రమునూ, దిగ్దిగంతాల్లో ఆ కావ్యానికి వచ్చిన ప్రశస్తినీ చూసిన తర్వాత, అంతకన్నా గొప్ప ప్రబంధాన్ని, అంతకన్నా గొప్పగా వ్రాయాలనుకున్నాడు భట్టుమూర్తి. ప్రారంభించాడు. పెద్దన హిమాలయాల్లో ఒక కొనను వర్ణిస్తే; తాను కోలాహల పర్వతం మీది ఒక కొనను వర్ణించాడు. ప్రవరుని ఒక తాంబూలపు తావి ఆకర్షిస్తే; వసురాజును ఒక గానం ఆకర్షించేట్లు చేశాడు. ప్రవరుణ్ణి చూసిన వరూధిని అతని అందానికి ముగ్ధురాలై ఇతన్ని ‘నేరెటేటియసల్ దెచ్చి, నీరజాప్తు సానబట్టిన రాపొడి జల్లి మెదిపి, పదను సుధనిడి జేసెనో పద్మభవుడు’ అనుకుంటే; గిరికను ‘మేటిజమ్మేటి యసట గ్రొమ్మించు మించు, బొదవి ప్రతాపాగ్ని పుటమువెట్టి, తమ్మిగద్దియ దాకట గ్రెమ్మి యిట్టి కొమ్మ గావింపబోలు నెత్తమ్మి చూలి’ అనిపిస్తాడు. అక్కడ బ్రాహ్మడు వరూధినిని చూడగానే ఎలావుందో ఒక వృత్తంలో ‘శతపత్రేక్షణ, చంచరీక చికురన్, చంద్రాస్య, చక్రస్తనిన్, నతనాభిన్’ అంటూ వర్ణిస్తే; ఇక్కడ రాజసఖుడైన బ్రాహ్మణుడు గిరికను చూచి ‘తరుణి, తమోవినీలకచ, తామరసామరసోదర ప్రభన్, దరళవిలోచనన్, దత నితంబ, దటిన్నిభ గాత్ర’ అంటూ అలాగే అంగాంగ వర్ణన చేశాడు. భట్టుమూర్తి వ్రాసిన ఆ పద్యాలన్నీ గొప్పగానే ఉన్నాయిగాని ఇంత సమర్థత కల్గిన తాను మరొకరిని అనుకరిస్తున్నానే అనే సంగతి గమనంలోకి రానీయలేదు. ఇంకా చాలా చోట్ల ఈ అనుకరణ కనిపిస్తుంది. ఈ అనుకరణప్రియత్వం భట్టుమూర్తికి నిజంగానే కొంత లాఘవం ఆపాదించింది అనేది కాదనలేని నిజం. కొద్దిపాటి అనుకరణ అయితేనేం అమోఘమైన కవిత్వంగదా, అనేవాళ్ళూ, ఎంత అద్భుతమైనా అనుకరణ అనేది స్వీయ గౌరవం తగ్గిస్తుందిగదా అనేవాళ్ళు కూడా ఉన్నారు.

తన పద్యాల్లో శబ్ద సౌందర్యాన్నీ, శబ్ద ప్రసన్నతనూ, విస్ఫోట శక్తినీ, పదప్రయోగ కుశలతనూ బాగానే ప్రదర్శించాడు గాని సూక్ష్మేక్షికకు శబ్ద ప్రాధాన్యం భావ ప్రాధాన్యాన్ని బాగానే మరుగుపరచిందనిపిస్తుంది.

ఇంతకూ వసుచరిత్రంలో ‘కథ’ అనబడే పదార్థమేమీ లేదు. గిరికా వసురాజులు కలుసుకోవడమూ, ప్రణయమూ, విరహమూ, చెలికత్తె దౌత్యమూ, పెండ్లీ–ఇంతే. పూర్వరంగంగా శుక్తిమతీ కోలాహలుల కథ కొంత ఉన్నది. ఈ శూన్యం చుట్టూ ఎంత అందమైన కవిత్వం అల్లాడు భట్టుమూర్తి అనుకుంటే మహాశ్చర్యం కలుగుతుంది. భట్టుమూర్తిని చదవకపోతే, తెలుగు సాహిత్యంలోని ఒక మనోహర ఘట్టాన్ని గమనించకుండా వెళ్ళిపోయినట్లే.

ఇక మనం ఉల్లేఖించుకున్న పద్యాన్ని గురించి కొద్దిగా.

లలనా జనాపాంగ/ వలనావసదనంగ/ తులనాభికాభంగ అంటూ అన్ని పాదాల్లోనూ సమాసాలను సరిగ్గా విరవడం కుదరదు. అలసానిల, విలోల దళ, సాసవ, రసాలఫల, సాదర, శుక, ఆలపన, విశాలము అనీ; అలినీ, గరుత్ అనీక, మలినీకృత, ధునీ, కమలినీ సుభిత, కోకకుల, వధూక అనీ విడదీసుకుని చదువుకుంటేగాని అన్వయం అర్థంకాదు. ఇది వసంతకాలపు వర్ణన అనుకున్నాంగదా, అది ఎలా ఉందంటే:

లలనాజన అపాంగ వలనా వసత్, అనంగతులన, అభికా, అభంగ దోః ప్రసంగము: తరుణుల కడగంటి చూపుల కదలికల్లో కాపురముండే మన్మథ సములైన కాముకులు కావించే బిగి కౌగిలింతలను కలిగి ఉన్నది. (మొదటి పాదం)

అలస అనిల విలోల దళ సాసవ రసాలఫల సాదర శుక ఆలపన విశాలము: మెల్లగా వీచే పిల్లగాలికి మామిడి చెట్ల చివురాకులు కదుల్తుండగా తీయ తేనియల్లాంటి మామిడిపళ్ళ రసాన్ని ఆస్వాదిస్తూ గోముగా పలికే చిలుకలు కలిగి ఉన్నది. (రెండో పాదం)

అలినీ గరుత్ అనీక మలినీకృత ధునీ కమలినీ సుభిత కోకకుల వధూకము: తుమ్మెదగుంపుల రెక్కల వల్ల నల్లబడిన సరోవరాల్లోనూ, నదుల్లోనూ ఉన్న తామర కొలనుల్లో సుఖంగా చొక్కుతున్న ఆడ చక్రవాక పక్షులు కలిగినది. (మూడవ పాదం)

అతికాంత, సలతాంత లతికాంతర, నితాంత, రతికాంత రణతాంత సుతనుకాంతము: అత్యంత మనోజ్ఞంగా తీవతీవకూ కుసుమించి వికసించిన పూలుగల పొదరిండ్లలో ఎడతెగకుండా జరిపే రతికేళి వలన అలసిన ప్రేమికులు గలది. (నాలుగో పాదం)

వనమంతా గోరింటలు పూచాయి. పొగడలు మొగ్గలు వేశాయి. కోయిలలు అవ్యక్తమధురంగా గానం చేస్తున్నాయి. మధుమాస వాసరము అంటే వసంత సమయము భాసురంగా ఒప్పి ఉన్నది.

ఇదీ పద్యం యొక్క పిండితార్థం.

ఏమాటకామాటే చెప్పుకోవాలిగదా! ఈ పద్యంలో వసంతాన్ని గురించి భట్టుమూర్తి కొత్తగా చెప్పిందేమీ లేదు. ఒక క్రొత్త ఊహగానీ, ఉత్ప్రేక్షగానీ ఏమీ లేదు. వసంతం గురించి ఏ కవి చెప్పినా యువతుల కడగంటి చూపులూ, ప్రేమ ప్రసంగాలూ, పొదరిండ్ల రతికేళీ, మావి చివుర్లూ, తేనె మామిడిపండ్ల రసాన్ని గ్రోలి అవ్యక్త మాధుర్యంతో పలవరించే చిలుకలూ, కోయిలల గానాలూ, గోరింటలూ, పొగడలూ ఇవే చెపుతాడు. భట్టుమూర్తి కూడా ఇవే చెప్పాడు. కానీ చెప్పడం ఎంత అందంగా చెప్పాడు! ఎంత అద్భుతంగా, ఎంత స్వభావోక్తి రమ్యంగా, ఎంత అనితరసాధ్యంగా చెప్పాడు! అందుకే ఈ పద్యం అంత ప్రసిద్ధి పొందింది.

ఇలాంటి పద్యాలను ఆస్వాదించాలంటే ఓపిక, తీరిక రెండూ చాలా అవసరం. ఉదాహరణకు, మొదటి పాదం మాత్రమే తీసుకుని దాన్ని మనసులో చర్వణ చేసిన కొద్దీ అందులో కవి చెప్పక చెప్పిన విషయాలెన్నో స్ఫురిస్తాయి. స్త్రీల కడకంటి చూపులలో మన్మథుడు ఉన్నాడన లేదు కవి! వారి కడకంటి చూపుల కదలికల్లో ఉన్నాడన్నాడు. అంటే ఆ చూపుల కదలికల్లో కోరిక ఉంది, తమ ప్రియుల గూర్చిన వెదుకులాట ఉంది. మనసుని మథించే మదనుడు ఆ కడకంటి చూపులను కూడా అంతగా చలింపజేశాడన్న మాట! అలాగే అక్కడున్న కాముకులైన యువకులు, సాక్షాత్తుగా కాముని పోలిన వారు. యువకులను మన్మథునితో పోల్చడం మామూలు విషయమే. అది వారి సౌందర్య, యౌవనాల మహత్తును సూచించే పోలిక. ఇక్కడున్న యువకులు ఎలాంటి మన్మథుని పోలి ఉన్నారు? యువతుల కడకంటి చూపుల కదలికలలో కాపురమున్న మన్మథుని పోలి ఉన్నారు. అంటే ఆ యువతులకు కూడా వారు మన్మథుల వలెనే కనిపిస్తున్నారు. వారు ఆ యువతుల కడకంటి చూపులలో కాపురమున్నారు! ఇదంతా కలుపుకుని చూస్తే – ప్రియుల కోసం కోరికతో వెతుకులాడే యువతులు, వారి కంటికి చిక్కిన మదనుని వంటి కాముకులు, తుదకు వారి కలయిక సుఖాంతమై ఆ ప్రియుల బిగికౌగిళ్ళలో చిక్కువడ్డ యువతులు – ఇలా ఒక చలనచిత్రం కనులముందు కదలాడుతుంది.

ఈ కాలంలో చిలకలూ కనిపించవు, కోయిల పాటలూ వినిపించవు. తుమ్మెద గుంపులూ, తామర కొలనులు, గోరింటలూ, పొగడలూ, పూపొదలూ, ప్రకృతి ఒడిలో ఉవ్వెత్తున ఎగసే కోరికలతో ప్రేయసీప్రియుల గాఢాలింగనాలు, సంగమాలు – ఇవేవీ ఇప్పుడు సగటు మనిషికి తెలియని అనుభవాలు, అనుభూతులు. అందుకే అవి వట్టి పాతబడిన, పాచిపట్టిన మాటలుగా మిగిలిపోయాయి. మహా అయితే – యివి ఒకానొక కాలంలో యీ జాతి జీవన విధానంలోని కొన్ని లక్షణాలకు మాసిపోతున్న సాక్ష్యాలు మాత్రమే.

మనసుకి భావాలందక పోయినా, చెవులకందే శ్రుతి మాధుర్యం ప్రశస్తం. లలనాజనాపాంగ అనే పదం ఎంతో ముచ్చటగా ఉంది కదూ! అందుకే అన్నమయ్య కూడా తన ఒక కీర్తనలో ‘లలనా జనాపాంగ లలిత సుమచాపా’ అని గండవరంలోని బాలకృష్ణుడిని కీర్తించాడు. సాదా సీదా తెలుగు పదాలలోని పరమ సౌందర్యాన్ని తన కీర్తనల నిండా నింపిన అన్నమయ్యలాంటి మహాత్మునికి నచ్చిన మాటగల ఈ పద్యం ఎవరికైనా నచ్చకుండా ఎలా ఉంటుంది!