నాకు నచ్చిన పద్యం: పౌలస్త్యుని అంతరంగం

శా.
పాతాలాధిపు తోకఁద్రొక్కితి, శచీ ప్రాణేశుకైశ్యమ్ముడా
చేతంబట్టితి, వెండికొండ శివుతో శీతాచలేంద్రాత్మజో
పేతంబల్లలనాడఁజేసితిగదా! ఈ విశ్వవిక్షోభ మే
లాతప్పింపడుసామి నన్నెరిగి? యేలా నన్ను వంచించుటల్

ఈ పద్యంలో ఒకాయన తను చేసిన మహా కార్యాలను– అవేమీ సామాన్యమైనవి కావు. విశ్వ సంక్షోభం కలిగించేవి– పేర్కొంటూ కూడా, చివరన తననెవరో వంచించారే అనే ఒక తీవ్ర ఆక్రోశాన్ని వెలిబుచ్చుతున్నాడు. అంత విశ్వక్షోభ కారకాలయిన పనులను చేసినవాడూ తనను ఎవరో మోసగించారే అని వాపోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయన ఎవరో అర్థమవుతూనే వుంది గదా? వెండికొండను శివునితో, శీతాచలేంద్రాత్మజతో సహా అల్లల్లాడేట్లు చేశాను అని రావణుడు తప్ప మరెవరు అనగలరు! పాము తోక పొరపాటున త్రొక్కినా చర్రున పైకి లేస్తుంది. ఇక్కడ పొరపాటున గాదు; కావాలనే. అదీ ఏదో మామూలు పామును కాదు; పాతాలాధిపుణ్ణి! ఇక ఇంద్రుడి జుట్టును ఎడమ చేత్తో ఒడిసిపట్టుకు లాగాడట. ఈ చర్యలు సామాన్యమైనవి కావు. సామాన్యులు చేయగలిగినవీ కావు. రావణాసురునిలాంటి లోకాతీత పరాక్రమశాలీ అభిమానవంతుడూ చేసినవి. ‘నాచేత ఇవ్వన్నీ ఎందుకయ్యా ఆయన చేయించాడూ? అదిన్నీ ‘నన్నెరిగి’! నేనెవరో తెలుసు ఆయనకు. నా ఆంతర్యమేదో తెలుసు. నేనిలాంటి లోకక్షోభం చేయగలిగినవాడిననీ తెలుసు, చేయడం ప్రారంభించాననీ తెలుసు. అయినా ఎందుకయ్యా దీనిని మాన్పలేదు ఆయన? నా అంతరంగంలోని క్షోభ తెలిసీ దానిని పట్టించుకోకపోవడమంటే నన్ను వంచించడమే గదా! ఆ స్వామి ఎందుకిలా చేస్తున్నాడు?’ అని అడుగుతున్నాడు. ఇది గొప్ప ‘జీవుని వేదన’. తన ఘనకార్యాలను పేర్కొని ఉగ్గడించడం ముఖ్యం కాదు రావణాసురుడికిక్కడ. అయ్యో, నన్నెరిగీ ఇంత మోసగించాడే… అనే ఆక్రోశం వెలిబుచ్చడం ముఖ్యం. అదే చెపుతున్నాడు రావణుడు. ఇక్కడ శ్రోత సముద్రుడు. ఆయనతో తన గోడు వెళ్ళబోసుకుంటున్నాడు రావణుడు. నా వింశతి హస్తాల వరుసా నీకు కాపు? నీ ఉత్తుంగ తరంగాల ఉరవడి నా లంకాపురికి కాపు. నీకూ నాకూ ఒక ఆత్మీయ అనుబంధమున్నది. అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ స్వామికి కూడా తెలుసు. అయినా ఇంకా రాడేమి? ఆయన ఆలస్యం చేసేకొద్దీ నేను ఆయన ధ్యానాన్ని ఆకృష్టం చేసుకోవడానికి ఇలాంటి కార్యాలు చేస్తూనే ఉండాల్సొస్తుంది గదా, అది మేలా! అంటున్నాడు రావణుడు.

ఇది లోకానికి తెలిసిన రావణునియొక్క తెలియని మరో పార్శ్వాన్ని- పార్శ్వం కాదు, అంతరంగాన్ని- వెలువరిస్తున్న సందర్భం. తను చేసిన కార్యాలకు గర్వపడటంలేదు రావణుడు. ఏదో తీవ్రమైన బాధే ఉంది ఆయన మనసులో. ‘ఇంతజేసినగాని నాకించుకంత – మంచి దక్కకనీడాయె మాధవుండు. సాగరా! ఏమి వచియింతు! జానకమ్మతల్లినే హరియింపక తప్పదాయె’ అంటాడు ఈ సందర్భంలోనే మరొకచోట. దానితో ఆయన మనస్సు సాగరునికే కాదు, అందరికీ అర్థమైపోతుంది.

పై పద్యం శ్రీ కాటూరు వేంకటేశ్వరరావు వ్రాసిన పౌలస్త్య హృదయము అనే ఒక చిన్న కావ్యం లోనిది. చిన్నది అంటే కేవలం 39 పద్యాలే. అయితే ఏం? ఎంత కమ్మని పద్యాలు!

మన పురాణాల్లోని కొన్నికొన్ని పాత్రలు అన్యాయానికి గురైనాయని మనకు అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కవి హృదయం సాధారణంగా ఆర్ద్రంగా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రల యెడ సహానుభూతి కలిగి ఉంటుంది. ఒక ఏకలవ్యుడు, ఒక ఊర్మిళ, ఒక అహల్య, ఒక కర్ణుడు లాంటి వారి యెడ ఏంతో అనుకంపనని చూపిస్తుంటారు చాలామంది. వాల్మీకి ఊర్మిళకు అన్యాయం చేశాడని వాల్మీకి రామాయణాన్ని మార్చబూనాడట పుట్టపర్తి నారాయణాచార్యులుగారు. కన్న కొడుకును కసాయితనంతో ఏట్లో త్రోసేసిన కఠినాత్మురాలు అని నలుగురూ అనుకునే కుంతీకుమారి అంతరంగంలోకి పోయి కరుణను కురిపించారు కరుణశ్రీ. కులవివక్షతో బాధలు పడ్డ కర్ణుని గురించి జాషువాలాంటివారు ఎందరో వ్రాశారు. కైకేయిని పూర్తిగా మార్చి ఒక కారణజన్మురాలైన మహాదేవిగా తీర్చిదిద్దారు విశ్వనాథ. నూరు శాతం మంచి లక్షణాలున్న ఒక పాత్రలోని ఒక చిన్న అప్రధాన విషయాన్ని పట్టుకొని, అది తప్పు అని తాను తప్పు అభిప్రాయం పెంచుకొని, మొత్తం మంచినీ చెడుగా దృశ్యమానం చేసి విషవృక్షాలు మొలిపించేకన్నా, చెడు అని చెప్పబడేదాంట్లో మంచిని చూపించాలనుకోవడం నిజంగా సహృదయత గదా! కాటూరు వెంకటేశ్వరరావు పౌలస్త్య హృదయములో అదే చేశారు. రావణునిలోని విష్ణుభక్తి పారవశ్యాన్ని దర్శించారు. అతను కావించిన లోకక్షోభ కారకాలయిన కార్యాలకు ఒక సముచితమైన కారణాన్ని అన్వేషించారు. వాటి వెనకుండే ఆయన ఆర్తికి కేతనం ఎత్తారు. తన అసలు స్థానమైన వైకుంఠం చేరడానికి జరుగుతున్న ఆలస్యానికీ, తనకు విముక్తి కలిగించాల్సిన స్వామి, రామచంద్రుడు రావడంలో జరుగుతున్న జాప్యానికీ, ఆ జాప్యాన్ని తగ్గించి ఆయన్ను తొందరించడానికి తనెన్ని ఘోరాలు చేస్తున్నా ఇంకా రాడేమీ, నా సంగతి తెలిసీ ఆలసిస్తూ నన్నింకా మోసగిస్తున్నాడే అనీ వాపోతున్నాడు. రావణునిలోని ఈ ఆర్తిని ఎంతో సుందరంగా, ఆర్ద్రంగా రంగరించి వింగడించారు కాటూరువారు.

కాటూరు వేంకటేశ్వరరావు భావకవిత్వ కాలంలోని శిఖరాయమాన కవుల్లో ఒకరు. వీరూ, పింగళి లక్ష్మీకాంతంగారూ పింగళి-కాటూరి జంట కవులుగా గొప్ప సాహిత్యాన్ని పండించారు. పదహారో శతాబ్దం తర్వాత బాగా చప్పబడిపోయి ఏమాత్రం స్ఫూర్తి కలిగించలేని ధోరణిలో వెర్రిపూలు పూస్తున్న తెలుగు కవిత్వం మీద తిరుగుబాటులాగా వచ్చిన భావకవిత్వోద్యమం కేవలం ముప్ఫై, ముప్ఫై అయిదేండ్లకే – శ్రీశ్రీ అనే ఆయన కావించిన దారిమళ్ళింపు వల్ల – తన ఉరవడిని చాలావరకు కోల్పోయింది. అయితే ఏం, ఆ మూడూ మూడున్నర దశాబ్దాల్లో ఎంత పుష్పఫల సంపన్నమైన ఉద్యానంగా మారిపోయింది తెలుగు కవిత్వ సీమ! తెలుగు పద్యానికి ఎంత శోభ సమకూరింది ఆ సమయంలో! పద్యం లోని భావాలే కాక, పద్యం యొక్క రూపం కూడా ఎంత ఆహ్లాదకరమైన మార్పు పొందింది! అంగాంగ వర్ణనలూ విరహబాధలూ మదనోపాలంభాల స్థానంలో మధురమైన ప్రేమభావం వచ్చింది. శర్వరీకౌముదులు, శీతపవనపక్షాలు, తవిరాకుజొంపాలు, తుహినకిరణ కోమలరేఖల వంటివి పద్యాలను కమ్మేశాయి. చాలామంది వీటిని ఆహ్వానించారుగాని, పద్యంలోని ప్రౌఢిమ కొట్టుకుపోయి లాలిత్యమే ప్రధానమైపోయిందని బాధపడ్డవారూ వున్నారు. వారి బాధనూ పూర్తిగా కొట్టిపారవేయలేం. ఎందుకంటే శ్రీనాథ, పెద్దనాది కవుల పద్యాలూ వాటి ప్రభావమూ పద్యప్రియులను వదలడం జరిగే పనికాదు. పద్య నిర్మితిలో లాలిత్యాన్నీ ప్రౌఢిమనూ ఏక కాలంలో చూపించిన భావకవుల్లో కాటూరివారు (నాయనివారూ) ముఖ్యులని నా వినమ్రోద్దేశం. పౌలస్త్య హృదయము నలబై పద్యాలు కూడా లేని చిన్న ఖండిక అయినా, ఎంతో సుందరమైన పద్యాలన్నీను. అలానే వారే రచించిన గుడిగంటలు అనే మరో చిన్న 42 పద్యాల లఘు కావ్యం కూడా. ఈ రెండూ కాటూరు వారు స్వయంగా వ్రాసినవైతే, తొలకరి, సౌందరనందము అనేవి పింగళి-కాటూరి జంటగా వ్రాసినవి.

పరిమాణంలో చిన్నవైనా పరిణాహంలో దొడ్డవి- పౌలస్త్య హృదయము, గుడిగంటలు. వారి పద్యాలు మననం చేసుకోవడం ఎంతో హాయిగానూ తృప్తిగానూ ఉంటుంది.