పినాకపాణి గార్ని చూస్తే ఓ త్యాగరాజూ, ఓ దీక్షితారూ, ఓ శ్యామశాస్త్రీ – ఈ ముగ్గురి రూపం ఒక మనిషిని ఆవహించిందా అనిపిస్తుంది. సంగీత పాఠం చెప్పడంలో శిష్యులకుండాల్సిన శ్రద్ధ, జిజ్ఞాస కంటే వందరెట్లు ఎక్కువగా ఆయనలో కనిపిస్తుంది. అటువంటి వారి వద్ద నేర్చుకోవడం ఒక అదృష్టం. ఆయన వట్టి గురువు కాదు. గురువులకే గురువు.
ఈమాట సెప్టెంబర్ 2012 సంచికకు స్వాగతం!
జయంతితే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషామ్ యశః కాయే జరా మరణజమ్ భయమ్!
శాస్త్ర , కళా రంగాల్లో ఎనలేని కృషిచేసి ధృవతారలల్లే దారి చూపిన ఏ కొద్దిమందో మాత్రమే పార్థివ శరీరాన్ని ఒదిలి వెళ్ళిపోయినా యశఃకాయులై మనమధ్యే ఉండిపోతారు. అటువంటి మహామహుడు, తెలుగువారు గర్వించదగ్గ ద్రావిడ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఇటీవలే అస్తమించారు. ఆచార్య కృష్ణమూర్తి, విశిష్ట ప్రతిభాసంపన్నులు. భాషాశాస్త్రంలో తమ విశేషమైన కృషితో అంతర్జాతీయ స్థాయిలో మన్ననలందుకున్నవారు.
తమ వెలుగుతో ప్రపంచపు చీకట్లను పారద్రోలే దీపాలు కొడిగట్టటం, సహజమరణం అనివార్యమని తెలిసినా కూడా బాధించే విషయం. గత కొద్దికాలంగా, అతి తక్కువ వ్యవధిలో చనిపోయిన తెలుగు తేజోమూర్తులను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇది ఒక తరం అంతరిస్తున్న సమయమేమో అనే భావన రాకా మానదు. వారు వెళ్ళిపోగా ఏర్పడ్డ శూన్యం భయపెట్టకా మానదు. దీపాన్ని దీపంతో వెలిగించి దీపావళిగా మార్చినట్లు వారి మార్గదర్శకతను ఆదర్శంగా తీసుకొని ముందు తరాలకు అందించడం మన బాధ్యత, మనం ఆ జ్ఞానమూర్తులకు చూపగల గౌరవం. ఈ తరంలోనూ, రాబోయే తరాల్లోనూ వారు వెలిగించిన జ్ఞానదీపాలు కొడిగట్టకుండా కాపాడే సమర్థులు ఉన్నారనీ, ఉంటారనీ ఆశించడం ఒక పగటికల కాదనే మా బలమైన నమ్మకం.
సెప్టెంబర్ 8, 2012: రచయిత, సంగీత విద్వాంసుడు, శాస్త్రవేత్త, ఈమాట సాహితీకుటుంబంలో సభ్యుడు అయిన ఇప్పుడే మాకు తెలిసింది. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.
ఈ సంచికలో కథలు, కవితలు, వ్యాసాలతో పాటుగా సంగీతపరిమళం వెదజల్లే డా. శ్రీపాద పినాకపాణి గారు నిండు నూరవ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభసందర్భంలో వారి గురించి పరిచయ వ్యాసం, ప్రత్యేకం. భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ జన్మదినం సందర్భంగా ఈమాట ప్రచురించిన ప్రత్యేక సంచిక ఈ సమయంలో మరొక్కసారి గుర్తు చేయడం సముచితం. విశ్వనాథ వేదాంత చర్చ ఆడియో మరొక విశేషాంశం. ఇంకా…
కన్నయ్య, భార్య బుల్లెమ్మ, వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారిగా బుల్లెమ్మకి ఓ చీరె కొందామని వస్తారు. ఆ కొట్టు, ఆ లైట్ల హడావిడి చూడంగానే కన్నయ్యకి భయంవేస్తుంది, తనని బయటికి గెంటేస్తారేమోనని! భయపడుతూ భయపడుతూ ” మా ఆడోళ్ళకి చీరెలు కొనాలండి,” అంటాడు, కొట్లో గుమాస్తాతోటి, అదేదో తప్పుచేసిన వాడిలా!
వ్యక్తిగతంగానో, ఆయన రచనల ద్వారానో తెలిసినవారికే కాదు, ఈమాటకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికీ రోహిణీప్రసాద్ ఆకస్మిక మరణం ఒక పిడుగుపాటు. ఈమాటకు రోహిణీప్రసాద్ లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.
అమెరికా నించి కృష్ణమూర్తిగారు తిరిగి వచ్చిన తరవాత తెలుగుశాఖ వాళ్ళే ఆయనని తమ శాఖలో కలుపుకుని ఉంటే ఏమయి ఉండేది అన్న ప్రశ్న నన్నెప్పుడూ ఆలోచింపజేస్తూ ఉంటుంది. మొదటిది, పరిశోధనలో అంతర్జాతీయంగా ఒప్పుకున్న ప్రమాణాలు ఆయన తెలుగుశాఖలలో అమలులోకి తెచ్చేవారు.
సాహిత్య దంపతులు ఆర్. సుదర్శనం, ఆర్. వసుంధరాదేవి విశ్వనాథ సత్యనారాయణగారితో బహుశా పంతొమ్మిదొందల అరవైల చివరలో జరిపిన ఇష్టాగోష్టి ఇది. ఇందులో సాహిత్యం కన్నా ఎక్కువ వేదాంత పరమైన అంశాల మీదే చర్చ జరిగింది. కాని, వాటిపై విశ్వనాథ వారికి ఎంత లోతైన అవగాహన ఉన్నదో మనకు తెలుస్తుంది.
ఒకరు(లు) మరొకరు(లు)ని
కనుమరుగు చేసేస్తూ వ్యాపించే
అందమైన అబధ్ధం లాంటి నిజం పేరు
నాగరికత.
చరిత్రకారులు నవలారచయితల దగ్గరనుంచీ నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ఒక సాధారణ పాఠకుడు చరిత్రని తెలుసుకోవడానికి ఏ కెన్నెత్ రాబర్ట్ నవలనో, మార్గరేట్ మిచెల్ నవలనో దొరకబుచ్చుకుంటాడు గాని, ఫలానా చారిత్రకుడు ఏం రాశాడు, ఫలానా పండితుడు ఏమన్నాడు అని వెతకడు కదా? ఎందుకని అని ప్రశ్నించుకుంటే?
పైన బడబాగ్నిలాంటి ఎండ
కింద పిచ్చుకల్లాంటి పిల్లలు
పైన భగ్గు మంటున్న ఎండ
కింద మగ్గిపోతున్న పిల్లలు
స్టాప్! స్టాప్! ఆల్ట్-కంట్రోల్-ఎఫ్8! ప్రోగ్రాం ఆపాలి. ఇంతకు ముందు ఇన్‌పుట్ చేసిన నియమం – పీక పిసికించుకున్న వ్యక్తికి కత్తిపోటు అనవసరం – మార్చాలి. కంప్యూటర్ పాత మెమరీని తుడిచేసుకొని సున్నాలూ ఒకట్లను కొత్త కొత్త వరసల్లో నిలబెట్టుకుంటోంది. నాకు సన్నగా చెమట పడుతోంది.
ఏనుగు అరటి తోటలో పడిందంటే ఒక్కొక్కచెట్టునూ తొండంతో పెళ్ళగించి పారెయ్యకుండా వూరుకోదు. దానికి అరటి చెట్టంటే అంత వైరం ఎందుకో తెలుసుకోవాలని వుందా? వినండి. అందమైన అమ్మాయి తొడలను ఏనుగు తొండంతోనూ, అరటిచెట్టు బోదెతోనూ పోల్చడం మన ప్రాచీనకవులకు అలవాటు. ఇలాంటి అలవాట్లు చాలా వున్నాయి వారికి.
“అలాగే ఏం పందెం వేసుకుందాం? నువ్వే చెప్పు. నువ్వేదంటే అదే” తలెత్తి చూపు సారించి సుబ్బలక్ష్మిని తనివిదీరా చూసుకున్నాను. చింపిరి జుట్టును చేత్తోనే అటూ ఇటూ సరిచేసి వేసుకున్న రెండు జడలు, కళ్ళనిండుగా కాటుక, పెదవులపై అస్తవ్యస్తంగా పూసుకున్న ముదురు ఎరుపు లిప్‌స్టిక్.
ఆ కిటికీ గుండానే మూడేళ్ళ క్రితం ఒకరోజు మా చిన్నాన్న, ఆవిడ తమ్ముళ్ళిద్దరూ, బయటికెళ్ళారు, వేట కోసం. వాళ్ళిక మరి తిరిగి రాలేదు. బయట అడవుల్లో మంచులో, వానలో చిక్కుకు పోయారు. ఆ సంవత్సరం కనీ వినీ ఎరగని వర్షాలు పడి బయట నేలంతా చిత్తడిగా అయింది. ఏ ఊబిలోనో చిక్కుకొని వుంటారు, వాళ్ళ శవాలు కూడా దొరకలేదు.
గోపాలన్ మా ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్. చాలా కఠినమైన వ్యక్తి. జీవితంలో ఒక్కొక్క మెట్టుగా ఎక్కి వచ్చిన మనిషి. అందువల్ల అందరూ అలాగే రావాలని అనుకునే వ్యక్తి. ప్రొద్దున్న తొమ్మిది గంటలకి ఆఫీసుకి వస్తే సాయంత్రం ఐదు గంటల దాకా వేరే ఆలోచనలు లేకుండా అన్నిటినీ మూటకట్టి పెట్టి ఆయనతో సమంగా పరుగెత్తాలి.
పైన నల్లని ఆకాశం
కింద మర్రి చెట్టు
దాని కింద వీళ్ళూ
వీళ్ళ మూటలూ
తన పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్న కొద్ది ధరలు పెంచటానికి బదులు తగ్గించాడు. దానితో మధ్య తరగతి ప్రజలు సహితం కొనడం ప్రారంభించారు. బహుశా ప్రజల అందుబాటులోకి తన చిత్రాలు రావడం రాయ్‌కి ఎంతో ఆత్మసంతృప్తి ఇచ్చి వుండవచ్చు.
మంగలి వ్యాపారాన్ని దెబ్బతీసేలా ఫేషన్ పేరుతొ గుండు కొట్టించుకొని, మీసాలూ, గెడ్డాలూ తీసేయమని ఏ విద్యార్థికయినా చెప్పే ధైర్యం మనకుందా? కానీ ఇవాళ రేపు యోగా పేరుతో యూరపులోని విద్యార్థులందరూ గుండు కొట్టించుకుంటే, మర్నాడే కనాట్ సర్కస్ అంతా గుండ్లతో నిండిపోతుందని ఘంట వాయించి మరీ చెప్పగలను.