శా. ఆకాశంబును కారుమబ్బుగము లాహారించె, దయ్యాలతో
ఘూకంబుల్ చెరలాడసాగినవి, వ్యాఘోషించె నల్దిక్కులన్
గాకోలంబులు, గుండె ఝల్లుమనుచున్నన్ గాని, ఇక్కాటియం
దొకల్లాడిన జాడ లేదిచట, సౌఖ్యంబెంత క్రీడించునో
చం. ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముదముడిపోయినన్ సమసిపోవుట లేదిది, దీపమందు మా
హృదయము సుమ్మి! నిల్పి చనియెన్ గత పుత్రిక యే యభాగ్యయో
శా. ఆలోకించిన గుండియల్గరగు, నాయా పిల్ల గోరీలలో
నేలేబుగ్గల సౌరు రూపరియెనో, ఏ ముద్దు నిద్రించెనో
ఏ లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో
యీ లోకంబున వృద్ధి కాదగిన యే యే విద్యలల్లాడెనో!
నేను హరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకాన్ని కనీసం ఇరవైసార్లు చూసి వుంటాను. తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలతో సమానంగా ప్రజాదరణ పొందిన నాటకం హరిశ్చంద్ర. దర్బారు సీను, అడవి సీను, వారణాసి సీను, కాటి సీను అని విడివిడిగా ఆ అంకాలను గురించి ముచ్చట్లు చెప్పుకుంటారు ప్రేక్షకులు. నాటకం బలిజేపల్లి లక్ష్మీకాంత కవిది. ఆయన నాటక నిర్వహణా, పద్యాలూ చాలా జనరంజకంగా ఉంటాయి. కాటి సీనులో బలిజేపల్లి వారి పద్యాలతో పాటు మరో మహాకవి పద్యాలు – కేవలం శ్మశానాన్ని వర్ణించేవి – నటకులు పాడటం పరిపాటి అయింది. ఆ కవి పద్యాలు లేని హరిశ్చంద్ర కాటి సీను ఊహించను గూడా లేనంతగా జనంలోకి చొచ్చుకుపోయిన పద్యాలవి. ఈ వాడుక ఎవరు తెచ్చారో, ఎప్పుడు ప్రారంభించారో తెలియదు.
పాతకాలంలో నటులు గూడా గొప్ప సాహిత్యవేత్తలై ఉండేవారు. బళ్ళారి రాఘవ, అద్దంకి శ్రీరామమూర్తి, పీసపాటి నరసింహమూర్తి, స్థానం నరసింహారావు వంటివారు సాహిత్యంతో బాగా పరిచయమున్నవారు. వారు నాటకాల్లో నటించేటప్పుడు, ఎప్పుడైనా సందర్భానుసారాంగా ఆ నాటకాల్లో లేని ఇతర పద్యాలేమైనా పాడారేమో తెలీదు గానీ, ఒక్క సీనులోనే అన్ని పద్యాలు నాటకం వ్రాసిన కవివి గాక ఇతరులవి ఇమిడిపోడం ఈ కాటి సీనులోనే చూస్తాం. ఈ సీనులో ఏ పద్యమూ ప్రేక్షకుల “వన్స్ మోర్ల” దాడిని తప్పించుకుని ఒంటరి పఠనంతో ముగింపు పొందింది లేదు అనేది అత్యుక్తి కాదు. శ్మశానపు భయదమైన నిశబ్ద నిశ్చలత్వము, వైరాగ్యము – కరుణ రసంగా కరిగి తడిపేస్తున్నట్లుండే ఈ పద్యాలు – సమర్థులైన నటులు హృదయస్పర్శిగా పాడుతుంటే – తెల్లవారు ఝామున నిశ్చేష్టంగా వినడం, అదో గొప్ప అనుభవం (కాటి సీను వచ్చేసరికి రాత్రి 2-3 గంటల సమయం అయ్యేది).
పై పద్యాలు మహాకవి జాషువా వ్రాసినవి. శ్మశాన వాటి అనే పేరుతో తన ఖండకావ్యంలో వ్రాసుకున్న ఈ పద్యాలు హరిశ్చంద్ర నాటకంలోకీ, అక్కణ్ణుంచి జనం నాలుకల మీదకీ ఎక్కినవి. నటకుల నటనా సమర్ధతా, గాయన ప్రావీణ్యతా, సన్నివేశపు గంభీరతా – ఈ మూడూ ఒక ఎత్తయితే, ఈ పద్యాల ప్రభావం ఒక ఎత్తుగా ఉండి సన్నివేశాన్ని పండించేవి అనడం పూర్తిగా నిజం.
జాషువా నాకు అత్యంతాత్యత్మంత అభిమానకవి కావడం వల్లా, ఆయన పద్యాలలో నాకు నచ్చిన పద్యం ఏరడం నాకు చేతగాకపోవడం వల్లా, నాటకం పద్యాల యెడవుండే ప్రీతిచాపల్యాల వల్లా నాకు నచ్చిన పద్యంగా ఏదో ఒకటి కాక మూడు పద్యాలను ఉటంకించాను. పై పద్యాలు చదవని, చూడని వారు ఈమాట పాఠకుల్లో వుండరనే భావిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఉన్నా, ఇప్పుడు చూసి ముగ్ధులు కాకుండా వుండలేరనీ అనుకుంటున్నాను.
వల్లకాడు. నింగిని నల్లని మబ్బులు పూర్తిగా ఆక్రమించుకున్నాయి. గుడ్లగూబలు దయ్యాలతో ఆటలాడుకుంటున్నాయి. నలుదికుల్నించీ బొంతకాకులు గుండెలు ఝల్లుమనేట్లు ఘోషిస్తున్నాయి (కాకోలము అంటే పాము, బొంతకాకి అని రెందు అర్థాలున్నాయి. వ్యాఘోషిస్తున్నాయి కావున బొంతకాకి అనే అర్థమే సమంజసం). గాలి లేనేలేదు. ఆకు అల్లాడటం లేదు. ఇలాంటి ముదురు తమస్సు.
చిమ్మ చీకటి. కొత్తగా కట్టిన ఒక గోరీ గూటిలో ప్రమిద. ఆముదం అయిపోయినా ఆరిపోక, మిణుగురు పురుగు లాగా వొత్తి కాలుతూనే వుంది. దాన్ని దీపమందామా – చనిపోయిన కూతురుని కాట్లో పెట్టి ఏడుస్తూ పోయిన ఓ అభాగ్య మాత అక్కడే వదిలేసిన హృదయమందామా! ఈ గోరీల్లో ఎన్ని లేత ప్రాయాలు మాడిపోయాయో, ఎందరు తల్లుల గర్భ కుహరాలు కాలిపోయాయో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘనిద్ర పోయాయో, వృద్ధిలోకి రావల్సిన ఏ విద్యలు అల్లాడిపోయాయో! ఆలోచిస్తే గుండెలు కరిగి ప్రవహిస్తాయి కదా! ఎంత కరుణార్ద్రమైన సన్నివేశాన్ని ఈ పద్యాల్లో పొదిగాడో చూడండి. ఒక్క డాంబికమైన పదం లేదు. పద్యం చెప్పడంలో ఎంత అలవోకతనం. ఎంత ఒడుపు. ఎంత వ్యావహారిక ధోరణి. ముదురు తమస్సు ఎంత చక్కని పదబంధం. కారుమబ్బుగము లాహారించె అనడం యతిస్థానంలో అందు కోసమే పడినా ఎంత సొగసుగా ఉంది. పిల్ల గోరీలు, విద్యలల్లాడెనో లాంటి పదాలు ఎంత సునాయాసంగా ఒదిగిపోయాయి. గుండియల్గరగుట, సౌరు రూపరుట, ముద్దు నిద్రించుట, ఆకు అల్లాడుట, ఆముదముడిపోవుట, గుండె ఝల్లనుట – కమ్మటి తెలుగు పదాలు ప్రాణం లేచొచ్చేట్టు చేస్తాయి. జాషువా గొప్ప శబ్ద మాంత్రికుడు. సాదాసీదా పదాలను అలవోకగా ప్రయోగించి, వాటితోనే పద్యంలో గొప్ప ప్రౌఢిమ సాధిస్తాడు. నిజానికి ఆయన వాడేవి సాదాసీదా పదాలనడానికి వీల్లేదు. అవి భాష యొక్క ఎసెన్స్ లాంటి పదాలు. ఇతరులకు అలాంటి పదాలు పట్టుకోవడం ఏ మాత్రం సాధ్యం కాదు. అందుకే జాషువా రాసిన ప్రతి పద్యమూ నిసర్గ మనోహరం.
ఏదో నాటకంలో విన్న నాలుగు పద్యాలు ఉటంకించి జాషువాను పరిచయం చేయబూనటం న్యాయం కాదని నేనెరుగుదును. కానీ ఈ శీర్షిక ఇంకా వివరంగా విస్తరించడానికి అనుమతించదు. ఆయన వ్రాసిన కమ్మని కావ్యాలూ, అనేకానేక ఖండకావ్యాలూ ఆయన కవితా విశ్వరూపానికి నిదర్శనాలు. ఒక శివభారతం, రాణా ప్రతాప చరిత్ర, రామాయణ కల్పవృక్షము, పోతన చరిత్రము, మహాత్మ కథ లాంటి పెద్ద ఉద్గ్రంధం ఒకటి జాషువా రాయలేదే అనేది నాకు కొరతగా అనిపించదు. గబ్బిలము, ఫిరదౌసి, ముంతాజ్ మహలు లాంటి చిరు కబ్బాలు పరిమాణంలో మాత్రమే చిన్నవి. కవితా పరిమాణంలో చాలా మిన్నవి.
నిజజీవితంలో తన ‘కులం’ కారణంగా ఎన్నో తిరస్కారాలకు గురైనాడు జాషువా. శ్మశాన వాటి పద్యాల్లో కూడా ‘ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు’ అని వ్రాశాడంటే ఆయన ఎంత హృదయక్షోభ ననుభవించాడో అర్థం చేసుకోవచ్చు. అయినా ఈ ధూర్తలో కొన్ని క్షమించి తన్ను తాను విశ్వనరునిగా చెప్పుకున్న పెద్ద మనసు జాషువాది.
భావకవిత్వ ధోరణిలో చాలా పద్యాలు వ్రాశాడు జాషువా. కానీ ఆయన్ను భావకవిగా అంగీకరించరు. అభ్యుదయ ధోరణి ప్రకటిస్తూ ఎన్నో పద్యాలు వ్రాశాడు. అయినా ఆయన్ను అభ్యుదయ కవిగా ఒప్పుకోరు. వారి వారి కొలబద్దల చట్రంలో ఇమిడిపోతేనే ఎవరికైనా ఆ తాతాచార్యుల ముద్ర పడుతుంది. జాషువాను ఇలాంటి చట్రాల్లో బిగించనక్కరలేదు. ఆయన ఇమడనూ ఇమడడు. ఎందుకంటే ఆయన నిజమైన మహాకవి. నిజంగా విశ్వకవి.
ఫిరదౌసి కావ్యంలో, గజినీ నుంచి తప్పించుకొని పారిపోయి అడవుల్లో తిరిగేటప్పుడు అతను చేసిన ప్రకృతి వర్ణనా ఘట్టంలోని పద్యాలు ఇక్షుఖండాలు. మచ్చుకు ఒక్కటి మనవి చేయనీయండి.
ఉ. ఈ తొలికోడి కంఠముననే యినబింబము నిద్రపోయెనో
రాతిరి, తూర్పుగొండ లభిరామములైనవి, దీని వక్రపుం
గూతల మర్మమేమి? కనుగొమ్మని యల్లన హెచ్చరించి ప్రా
భాత సమీర జాతములు పైకొనియెం దొలి సంజ కానుపుల్