ఇక్కడ, నా ఆలోచనలు, అనుమానాలు, అభిప్రాయాలు కాసిని మీతో పంచుకుంటాను, ఓపికుండి చదవగోరే వారికోసం. దీనిని నేను ఒక క్రమపద్ధతిలో వ్యాసంలాగా నిర్మించటం లేదు. మాటల పొదుపు పాటించటం లేదు. ఇది ఒక డిౙల్టరీ కాన్వర్సేషన్, ఒక అన్‌ప్లగ్‌డ్ మోనోలాగ్. తీరిగ్గా, పొడూగ్గా ఊహకొచ్చినట్టు వ్రాసుకుంటూ పోతాను, మిమ్మల్నీ అంతే తీరిగ్గా నిదానంగా చదువుకోమని చెప్తాను. ఇప్పుడే చెప్తున్నాను, మీరు చదవకపోతే కోల్పోయేదీ ఏమీ లేదు!
రచయిత వివరాలు
పూర్తిపేరు: మాధవ్ మాౘవరంఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
మాధవ్ మాౘవరం రచనలు
ఆత్మవిమర్శ చేసుకోలేని, ఏ ఉద్యమమైనా ఏ వాదమైనా అంతిమంగా పెడదారే పట్టింది, పడుతుంది. ఎటువంటి ఉద్యమమైనా వాటిలో ఈ ఆత్మవిమర్శ అన్నది లేనంతవరకూ వాటివల్ల సమాజానికి చిరకాలపు మంచి జరగదు. తాత్కాలికంగా కొంత అభ్యుదయం ఉన్నట్లు కనిపించవచ్చు. అంతే. ఆత్మవిమర్శ లేని ఉద్యమాలు వాటిని నడిపే వ్యక్తులకు మాత్రమే లాభం చేకూరుస్తాయి. ఆత్మవిమర్శ లేనంతకాలం ఈ అస్తిత్వవాద ఉద్యమాలపై నా అభిప్రాయం మారదు.
ఎలా అయితే వారి జీవన అస్తిత్వానికి మతమో, దేశమో, సినిమా నటులో ఊతమో, వీరి అస్తిత్వానికి ఈ అభ్యుదయవాదం అలా ఒక ఊతం. అందుకే వీళ్ళు కాలంతో మారరు. ఇది ఆవేదన నుంచి నిజాయితీగా పుట్టిన ఆవేశం కాదు. అలా ఆవేశించడం సమాజంలో వారి ఉనికికి కేవలం ఒక అవసరం. రాజకీయనాయకులు ప్రజల పట్ల చూపించే ప్రేమ లాంటిదే ఇది. వకాలత్‍గిరీ అంటే ఇదే. రాముడు వచ్చి తనను రక్షించమని భక్తులకు చెప్పాడా? లేదు.
మానవస్వభావానికి, కులాలు మతాలు భాష ప్రాంతాలు దేశాలు వంటి నియమాల గోడలు ఉంటాయా? చట్టం వారిని పట్టుకున్నప్పుడో, సమాజం వారిని వేలెత్తి చూపినప్పుడో, మేము నిమ్న/దళిత/ముస్లిం/స్త్రీ కాబట్టే మమ్మల్ని ఇలా… అని ‘సమయానికి తగు కార్డు’ వాడిన రాజకీయ నాయకులు, ఉన్నత ప్రభుత్వోద్యోగులు, క్రీడాకారులు, రచయితలు, నటులు ఎందరు లేరు వీరిలో? వీరిని విమర్శించినంత ‘మాత్రాన’ అగ్రవర్ణ, మతదురహంకారులు అని ముద్ర వేసేయచ్చా ఎవరినైనా?
పట్నాలు – ప్రేమలు: మేము ఇటుపక్క ఒడ్డు మీద ఉన్నాం. ప్రేమ అంటారే, దానిలో మునిగి. ఒకరినొకరు చూసుకుంటూ, తెలుసుకుంటూ, ఒకరి రుచి ఒకరికి వగరుగా, తెలుసుగా నీకు, ప్రేమలో. నా మనసంతా నిండిపోయిన విషాదం, ఒంటరితనం. ఆ సాయంత్రం నదుల ఒడ్డున నీడలు, కొత్త ప్రేమలలో ఉండే విషాదం, ఒంటరితనం. పాతప్రేమల నెమరువేత తెచ్చే విషాదం, ఒంటరితనం, పోగొట్టుకున్నతనం.
రామచంద్రమూర్తి అర్థమయిందన్నట్టు తలూపి వెంటనే తన చివరి కోరిక కోరుకున్నాడు. కానీ “నీ యాస తమాషాగా ఉందే! దేవతలు మాట్లాడేదిలా లేదే!” అని వ్యాఖ్యానించి మరీ కోరుకున్నాడు. దేవత నొచ్చుకున్నాడు, కొద్దిగా కోపం తెచ్చుకున్నాడు. “దేవతల యాసా? అంటే? ఉన్నట్టుండి నేను మాట్లాడే తీరును ఆక్షేపించడానికి దేవతల యాస ఏదో నువ్వెప్పుడైనా విన్నావా ఇంతకు ముందు?” దేవత మొఖంలో దైవత్వం కాస్త తగ్గింది.
కాలక్రమేణా రామాయణాలు మారుతూ వచ్చాయి, కొత్తగా పుడుతూ వచ్చాయి, కొత్త కొత్త కథనాలు, దృక్కోణాలు వాటిలో ప్రక్షిప్తమయ్యాయి, అవుతూనే ఉంటాయి. రామాయణం ఏ కొందరి సొత్తో కాదు. సీతారాములు ఏ కొందరికో మాత్రమే దేవుళ్ళు కారు. మరెందరికో కేవలం దేవుళ్ళు మాత్రమే కారు. ఇది రామాయణానికి, వాల్మీకికీ అశేష భారతం చూపుతూనే ఉన్న గౌరవం. ఎప్పుడైతే ఇది మరిచిపోయి రాముడు ‘మా’వాడు, రామాయణం ‘మాది’, ‘మాకు నచ్చిందే, మేము చెప్పిందే రామాయణం’ అన్న దౌర్జన్యం ప్రబలుతుందో అప్పుడు సమాజంలో భిన్నవర్గాల మధ్య ఘర్షణ అనివార్యమవుతుంది. ఈ పోరులో మనగలిగితే, మానవజాతి సజీవంగా ఉన్నంతవరకూ రామాయణం కూడా సజీవంగా ఉంటుంది. లేదూ, ఒక నిర్జీవ కావ్యంగా మాత్రమే మిగిలిపోతుంది.
గూఢచారి కోడిపెట్ట: యాజమాన్యం ఎప్పుడూ పనివారిమీద ఒక కన్నేసి ఉంచాలి. కేవలం వారితో సమర్థవంతంగా పని చేయిస్తే సరిపోదు. వారి మెదడులోనూ ఖాళీలుంచకూడదు. అలా ఖాళీ ఉండి, పనివారికి ఆలోచనలొచ్చినప్పుడల్లా చరిత్రలో ఏం జరిగిందో, యాజమాన్యం వారికి తెలుసు. అందుకే వారి ఆలోచనల్లో ఎప్పుడూ కుట్ర గురించిన భయాలుంటూనే ఉంటాయి.
ఐతే, ఏ దుర్ముహూర్తాన శ్రీశ్రీ సంపాదకుడంటే నాకింపారెడు భక్తి కలదు అని వెటకరించాడో, అది ఆయనకు ఏ అనుభవం అయో, కాకో, సరదాకో చెప్పాడో కాని అది పట్టుకుని కర్రసాము చేయడం ఒక అలవాటయింది కవులకూ రచయితలకూ. అసలే సాహిత్య విమర్శ మనకు మృగ్యం. అలాంటప్పుడు నేను రాసింది దిద్దడానికి నువ్వెవరు అనడం రానురానూ ఏ విమర్శనూ తీసుకోలేకపోవడానికి దారి తీసింది.
ఏమనుకుంటున్నావు నాగురించి? వెండిరంగు దేవుడు పసుపుపచ్చ ఫాదర్‌ను అడిగేడు ఆక్రోశంతో, అలిసిపోయి, రాజీ పడిపోయిన గొంతుతో. నేను మిమ్మల్ని ఇలా కావాలనే, నాకు ఇష్టమయే పుట్టించాననుకుంటున్నావా? నేను మీ అందరూ బాధ పడుతుంటే చూసి ఆనందిస్తున్నానని అనుకుంటున్నావా? మీరు ఏడుస్తుంటే చూసి నవ్వుకొనే శాడిస్టులాగా కనిపిస్తున్నానా నీకు? ఇలా పుట్టించడమే నేను చేయగలిగింది. నాకు చేతనయింది. అంతే.
టీమ్ వర్క్ అనగానే వాడి కళ్ళు మెరిశాయి. ఆ మెరిసిన కళ్ళల్లోంచి మిగిలిపోయిన నీటిచుక్కలు మరింత మెరుస్తూ స్ఫటికాలలాగా రాలిపడ్డాయి. వాడు నా ఒళ్ళో కూర్చొని స్టీరింగ్ వీల్ తిప్పుతుంటే నేను కాళ్ళతో పెడల్స్ కంట్రోల్ చేస్తూ, పార్కింగ్ లాట్‌లో అలా ఒక అరగంట టీమ్ ఆట ఆడేం. నేను వాణ్ణి గేర్లు కూడా మార్చనిచ్చాను కాసేపు. రివర్స్ గేర్ వేసినప్పుడల్లా వాడు ఒకటే కేరింతలు. కన్నబిడ్డ నవ్వును మించింది ఏముంటుంది ఈ లోకంలో.
ఒక అద్దం, ఒక లక్ష్యం: ఒరే మాధవా! మనిషన్నాక ఒక లక్ష్యం ఉండాల్రా. జీవితంలో తనకేం కావాలో, దాన్ని ఎలా సాధించాలో తెలిసుండాల్రా. ఏం చేయదల్చుకున్నావని ఎప్పుడడిగినా అలా మాట దాటేస్తావేంట్రా! చుట్టూ చూడరా ఒకసారి. నీ స్నేహితుల్ని, మిగతావాళ్ళని చూడు. అందరూ ఎంత కష్టపడుతున్నారో చూడు ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని, సీఈఓలు కావాలని. కష్టపడాల్రా, లేకుంటే ఏమీ సాధించలేవు ఈ జన్మలో.
కరుణను ఎన్నో విషయాలు బాధపెట్టేవి. తను ఒక్కతే కూతురు. చిన్నతనం చాలా వరకూ ఒంటరిగానే గడిచింది. వాళ్ళ నాన్నకు జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు, రోజు రోజూ చావుకు దగ్గరవుతూ చివరికి ఒకరోజు చచ్చిపోయినప్పుడు, తనకు ఎవరూ తోడు లేరు. తనకు అన్న, తమ్ముడు అంటూ ఎవరూ లేరు. ఆ లోటు పూరించడంలో తనకు బాగా దగ్గరగా వచ్చింది నేను, శ్రీనివాస్ మాత్రమే.
నేతల తలకోతలు: నాయకులు బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా చంపబడ్డారనేది నిజం కాదు. అలా అంటున్నారూ అంటే మన రాజ్యాంగపు చట్టాలను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాటే. నాయకులను ప్రజలతో నిజంగా కలిపే బంధం మన చట్టాల నిజమైన అర్థం, ఆశయం. నేతల తలలే తెగిపడతాయి ఎందుకూ అంటే తెగిపడడానికి సిద్ధపడని తల ఒక సమాజానికి పెద్దతల కాలేదు.
ఇది తెలుగులో ఎలా పుట్టింది? మీకు తెలియనిది ఒకటి ఉంది. అదేమిటంటే ఇదే సమయంలో అమెరికన్లు కూడా మీలానే ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. ఇక ర్యాండమ్ హౌస్, మెక్‌మిలన్, పెంగ్విన్, హార్పర్ కాలిన్స్ వంటి పెద్ద పెద్ద ప్రచురణ సంస్థల్లోని పెద్ద తలకాయలెన్నో తెగిపడబోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం వారికీ తెలియక, అవసరం తీరేలోపు వారికది దొరకక.
నేను ఉదహరించబోతున్న కవిత్వ పద్ధతులు కేవలం సూచన ప్రాయమే, స్థాలీపులాకమే అని గమనించండి. ఈ ఉదాహరణలు ఇవ్వడం మీకు ఇటుకలు పేర్చడం చూపించడం వంటిది. ఆపైన మీరు పదాలు ఎలా పేరుస్తారు అన్నది మీకే ఒదిలేస్తున్నాను. ఈ ఉదాహరణలు అలానే పాటించవచ్చు, లేదూ ఏ కొన్ని పద్ధతులైనా మిశ్రమించి ఒక కొత్త కవితాపద్ధతి మీరు సృష్టించవచ్చు. మీ సృజనే మీ దారిదీపం. మీ కవిత్వ కాంక్షే మీకు కాలిబాట.
“మనకంటూ స్వర్ణ యుగం అనేది ఉండేదో లేదో మనకిక ఎప్పుడూ తెలియదు. వేల సంవత్సరాల భారతీయ సంస్కృతి మనది అని గొప్పలు చెప్పుకోడానికి బాగున్నా, మన సంస్కృతి గురించి మనం తెలుసుకోగలిగినది గత ఐదు లేదా ఆరు శతాబ్దాల దాకానే. అంతకు ముందు చరిత్ర అని మనం అనుకుంటున్నది కేవలం మన ఊహాసృష్టి.”
సాంప్రదాయ వాదాన్ని ఎదురించే ఆధునిక కవులు, వ్యాసకర్తలు ఇతిహాసాలను పుక్కిటి పురాణాలుగానే భావిస్తారు, ఆ అభిప్రాయాన్నే బలంగా వినిపిస్తారు. గజేంద్ర మోక్షంలో ఏనుగు, మొసలి మధ్య పోరాటం, సమాజంలోని పీడితుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు, పాలక వర్గం ప్రచారం చేసే ఒక అబద్ధంగా శ్రీశ్రీ వాదించాడు.
ఆయన పాఠకులకు భాగవత పురాణం ఒక కట్టు కథ మాత్రమే. కానీ సాంప్రదాయ హిందువుల దృష్టిలో గజేంద్ర మోక్షం నిజంగా జరిగిన సంఘటన. వారికందులో ఏ సంశయము లేదు. ఒక ఇతిహాసపు స్థాయి, అది ఎంత నిజం అనే నమ్మకం పైన ఆధారపడి ఉందని ఇక్కడ గ్రహించవలసిన సంగతి.
కొన్నేళ్ళ పాటు ఆ కథ రాసింది ఎవరో, ఆ కథ పేరేమిటో ఏమీ గుర్తు లేదు. ఈ కథ నిజంగా గొప్ప కథేనా? ఏమో, నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ వనసంతర్పణం జరుగుతున్న ఆ తోటకెళ్ళి భోజనం చేస్తున్న బావగాణ్ణి ఒక్కసారి చూసుకోవాలనుంటుంది కళ్ళనిండా, ఈ రోజుకీ.
గూగోళ జ్ఞానం – మన అనుభవాలను గుర్తుంచుకోవడం కోసం భాషలను పుట్టించుకొని, వ్రాయటం నేర్చుకొని సమాచారాన్ని పెంచుకోవడం పంచుకోవడమే మన లక్ష్యంగా, సమాచారమే మన ఉనికికి ప్రమాణంగా చేసుకున్నాం. సమాచార జీవితం యదార్థం గానూ, యదార్థ జీవితం సమాచారంగా మారడానికి పనికొచ్చే జ్ఞాపకంగా మాత్రమే మనం బ్రతుకుతున్నాం.
తిరగబడ్డ తొమ్మిది – ఇప్పుడీ సంగతి నాకు కాక నీకొక్కడికే తెలుసు. ఇంకెవరికీ చెప్పకు! నువ్వు మర్చిపోకు! నువ్విందాక అన్నావే కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ బుర్రలు, వాటిని నడిపే మేధావులందర్నీ వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని లెక్కలేసుకోమను. కానీ ఇప్పుడు అర్థమయిందా మన లెక్కలన్నీ శుద్ధ తప్పని?
స్టాప్! స్టాప్! ఆల్ట్-కంట్రోల్-ఎఫ్8! ప్రోగ్రాం ఆపాలి. ఇంతకు ముందు ఇన్‌పుట్ చేసిన నియమం – పీక పిసికించుకున్న వ్యక్తికి కత్తిపోటు అనవసరం – మార్చాలి. కంప్యూటర్ పాత మెమరీని తుడిచేసుకొని సున్నాలూ ఒకట్లను కొత్త కొత్త వరసల్లో నిలబెట్టుకుంటోంది. నాకు సన్నగా చెమట పడుతోంది.
“ఆ కళ్ళు ఇంతకు ముందు నిన్ను ఇలా నిలదీసి చూడలేదు. నిన్ను చూసి చూపు తిప్పుకునే కళ్ళు నిన్నిప్పుడు సూటిగా చూస్తున్నాయి. నువ్వూ మెల్లిగా మర్చిపోతున్నావు. ఆ కళ్ళు అప్పటి శత్రువులవి. వీళ్ళవి కాదు. ఇప్పుడు వీళ్ళూ అవే కళ్ళతో మనల్ని చూస్తున్నారు.
హటాత్తుగా అతను నన్నే చూస్తున్నాడని నాకనిపించింది. మామూలుగా చూడటం కాదు. అతని చూపులు సూటిగా, అటూ ఇటూ తొణక్కుండా నన్ను ఆపాదమస్తకం శ్రద్ధగా చదువుతున్నట్టుగా, అక్కడితో ఆగకుండా లోపల్లోపలికి చొచ్చుకొనిపోయి నా వీపుని కూడా ఒదిలిపెట్టకుండా, నా శరీరాన్ని బైటా లోపలా కూడా శల్యపరీక్ష చేస్తున్నాట్టుగా, అబ్బ! చటుక్కున చూపు తిప్పుకున్నాను.
అప్పల్నర్సిమ్మడికి తర్కం బోధపడలేదు. “సూడండి బాబులూ. మీకేఁవో నానెవర్ని సంపినా పర్నేదు. నాకు మాత్రం ఖదీరుగాడే గావాల. ఆడికి బదులు, ఆడికేవిటికీ సమ్మందం లేనోల్లని సంపీడానికి నా మనసొప్పుకోదండి. అన్నెం పున్నెం తెలీనోల్లని చంపి ఆల్ల ఉసురు నేనెందుకండీ పోసుకుంట?” అని వాదించేడు.
“నన్ను క్షమించండి.” అన్నాను వాళ్ళను సమాధానపరుస్తూ. “బహుశా సవ్యంగా లేనిది నేనేనేమో. తప్పు నాలోనే ఉందేమో. ఎందుకో ఒక్క క్షణం నాకలా అనిపించింది. ఇప్పుడంతా మళ్ళీ మామూలుగానే, బాగానే ఉంది. దయచేసి నన్ను క్షమించండి.” అని మెల్లిగా వాళ్ళ మధ్యనుండి తల దించుకొని బయటకొచ్చాను.
ఏ కవితనో చదువుతున్నప్పుడు మనందరికీ ఎప్పుడో ఒక్కప్పుడు వచ్చే సందేహం – ఇదసలు కవితేనా, లేకపోతే వాక్యాన్ని పొట్టీ పొడుగూ ముక్కలుగా విరక్కొట్టి ఇది కవితే అని రాసినవారు బుకాయిస్తున్నారా అని. అది కవిత్వమే అయితే, కవి ఏ ఆధారంతో ఆ కవితలో పాదాలని విరక్కొడుతున్నాడు? అని.
మావాడు మాటలాపి
సూపు తాగుతున్నాడు.
చెట్టుకు కట్టేయబడ్డ సీతారాఁవుడి
శరీరం వైపుకి తూటాలు మాత్రం
దూసుకొని వస్తూనే ఉన్నాయి.
సీతారామారావుని అసమర్థుడిగా మొదలుపెట్టబోయినా ఆ తర్వాత గోపీచంద్ విఫలమైనాడనీ, అది ఆ రచయితకూ తెలుసనీ, కానీ అతనేమీ చేయలేదనీ నా అభియోగం.
ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని ఈమాట పాఠకులైన మిమ్మల్ని చర్చకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అభిప్రాయాలు మాకు చెప్పండి, వీలైనంత వివరంగా.
ఈ కథను అర్ధం చేసుకోవాల్సింది నేనే. ఇది మంచి సాహిత్యం కలిగించే అవసరం అనీ, ఇది నాకు నేను చేసుకుంటున్న సహాయం అని తెలుసు నాకు.
సెన్సారుషిప్పు సంగతి దేవుడెరుగు, వాటిపై గూండాలదాడి జరుగుతుంటే చిద్విలాసపు చిరునవ్వుల్లో అంతా ఈశ్వరేచ్చ అనే ప్రభుత్వాన్ని చూస్తే ఏ ప్రజాస్వామ్యికవాది గుండెలుప్పొంగవూ?
ఏదో చెప్పేసి ప్రపంచాన్ని ఉద్ధరించేయాలన్న విపరీతమైన తపనలో, అలా చేయడం ద్వారా ఏదో మహత్తర సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నామన్న ఆత్మ సంతృప్తితో స్మగ్వినయంగా కథలు రాసేస్తూ వారూ, ఏమిటంటున్నారో ఎందుకంటున్నారో అర్థం కాక తల పగిలిపోతూ కూడా, మనకర్ధంగానిదేదో ఉండే వుండాలనుకుని సమర్ధించుకుంటూ మన అటెండన్సూ మామూలే.
“రాలిపోయే కండకు మల్టీనేషనల్ అత్తరు సోకులు జేసే ఓ గ్లోబల్ రాబందూ,
ఎముకను ప్రేమించే నేను, నేనే నేనైన నేను, నేనిక స్నానం చేయను”
“టూ వీలర్ కాలుష్యంతో బిరుసెక్కిన నా కళ్ళతో
నీ రక్తమాన్‌దిరాక్స్ తాగడానికే నేను రక్తనేత్రుడనైనాను”
అని కవి ఆగ్రహంతో చేస్తున్న ప్రకటనలు సమాజాన్ని పీడిస్తున్న సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దుష్టశక్తులపైకి దూసుకొస్తున్న కవితా సునామీలు!
శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి మాటల్లో చెప్పాలంటే “ఎమెనో కేవలం ఒక విశిష్ట శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు. ఒక మహామనీషి కూడానూ. ఆయన మంచితనం, ఏమాత్రమూ గర్వం లేని ప్రవర్తన, శాస్త్రీయ పరిశోధనలో ఆయన చూపించే ఏకాగ్రత, శ్రద్ధాసక్తులు ఆయన శిష్యులందర్నీ ఎంతగానో ప్రభావితంచేశాయి. ఆయన శిష్యులందరికీ ఆయన ఒక గొప్ప స్ఫూర్తీ, మార్గదర్శీ”.