1. తెరెసా! ఓ తెరెసా!
పేవ్మెంట్ దిగి పైకి చూసుకుంటూ ఓ ఆరడుగులు వెనక్కేసి వీధి మధ్యలో నిలబడి రెండు చేతులతో నోటిని మెగాఫోన్లాగా కప్పి పై అంతస్తుల కేసి చూస్తూ గొంతెత్తి అరిచాను: “తెరెసా!”
నడినెత్తికెక్కిన చంద్రుణ్ణి చూసి నా నీడ నాకాళ్ళ మధ్యలో దాక్కుంది. ఎవరో అలా ఆ పక్కగా నడుచుకుంటూ వెళుతున్నాడు. నేను మళ్ళీ అరిచాను: “తెరెసా!” ఆ వెళ్ళే ఆయన నాదగ్గరికొచ్చాడు.
“ఇంకొంచెం పెద్దగా అరవండి. లేకపోతే ఆవిడకు మీ పిలుపు వినపడదు. నేనూ సహాయం చేస్తానుండండి. మూడు లెక్కెట్టి ఇద్దరం ఒకటే సారి పిలుద్దాం.”
“ఒకటీ, రెండూ, మూడు.” ఇద్దరం పెద్దగా గొంతెత్తి అరిచాం: “తెరెసా!”
కొంతమంది కుర్రాళ్ళు, స్నేహితుల గుంపు అనుకుంటా, సినిమా చూసి వస్తున్నారో, లేదూ సెంటర్లో కాఫీ తాగి వస్తున్నారో, వీధి మధ్యలో నిలబడి మేం పిలవడం చూసి, “మేం కూడా గొంతు కలుపుతాం. అందరం కలిసి పిలుద్దాం” అంటూ మా దగ్గరికొచ్చారు. వీధి మధ్యలో నిలబడి పైకి చూస్తూ, మొదటాయన “ఒకటీ, రెండూ, మూడు!” అనగానే అందరం కలిసి పెద్దగా అరిచాం: “తెరెసా!”
ఇంకెవరో వచ్చి మా గుంపులో కలిశారు. ఓ పావుగంట గడిచేప్పటికి ఓ ఇరవైమంది దాకా అయ్యాం. ఒకళ్ళూ ఇద్దరూ అడపా దడపా వచ్చి కలుస్తున్నారు.
ఇంతమందిమయ్యేప్పటికి అందరూ ఒకే గొంతుతో అరవడం కుదరలేదు. ఒకరు ఒక క్షణం ముందు మొదలెట్టేవాడు. లేదూ, ఇంకొకాయన ఓ క్షణం ఎక్కువగా పిలుపు సాగదీసేవాడు. ఇక ఇలా కాదని అందరం ఓ ఒప్పందానికొచ్చాం – తె లోగొంతుకతో పొడూగ్గా, రె గొంతెత్తి పొడూగ్గా, సా లోగొంతుకలో పొట్టిగా సాగదీయకుండా పిలవాలి. ఒప్పందం బానే కుదిరింది, ఒకటీ అరా బెసుగులు మినహాయించి, పిలవడంలో ఒక పద్ధతి అంటూ వచ్చింది.
కాసేపటికి, ఒకే గొంతుతో పిలవడం మాకు కుదుర్తున్న వేళకి, మా గుంపులో చేరిన జీరగొంతు పెద్దమనిషి నావైపు తిరిగి, “ఏం సార్, ఆవిడ ఇంట్లోనే ఉందని మీకు ఖాయంగా తెలుసా?” అనడిగాడు.
“తెలీదండీ.”
“అయ్యో, అవునా,” ఇంకొకాయన, “తాళం చెవి మర్చిపోయారేఁవిటి?”
“లేదండీ. నా కీ నా జోబులోనే భద్రంగా ఉంది.”
“ఆఁ, మరైతే మీరే పైకెళ్ళిపోవచ్చుగా?”
“వెళ్ళచ్చు. కానీ నేనిక్కడుండనండీ. నేనుండేది సెంటర్కి అటువైపు వీధిలో”
“అయ్యా, మీ వ్యవహారంలో వేలెట్టడం కాదు కానీ, మరిక్కడ ఉంటుందెవరండీ?” జీరగొంతాయన కొంచెం గీరగా అడిగాడు.
“నాకు తెలీదండీ,” చెప్పాన్నేను.
ఈ విషయం మా గుంపుకి నచ్చినట్టు లేదు. కాస్త చిరాగ్గా నావైపు చూశారు.
“మరైతే మహాశయా. ఇలా ఇక్కడ వీధి మధ్యలో నిలబడి తెరెసా! తెరెసా! అని ఎందుకు పిలుస్తున్నారో మేం తెలుసుకోవచ్చునేం?” అన్నాడొకాయన కాస్త కటువుగానే.
“నిజం చెప్పాలంటే తెరెసాకి బదులుగా ఇంకో పేరు పెట్టి పిలుద్దాఁవంటే నాకేఁవీ అభ్యంతరం లేదు. నాకే పేరైనా పర్లేదు, అదేమంత పెద్ద విషయం కాదు.”
ఈసారి అందరికీ బాగానే కోపం వచ్చినట్లుంది.
“ఏఁటి గురూ, మా చెవుల్లో పూలెడతన్నావా?” కటువుగొంతాయనకు అనుమానమొచ్చింది.
“నేనా?” విసురుగా, కొంచెం కోపంగా అన్నాను గుంపులో మొఖాలకేసి చూస్తూ. ఎవరూ మాట్లాడలేదు. నా నిజాయితీ మీద వాళ్ళకి నమ్మకం ఇంకా ఉండే ఉండాలి.
“అబ్బ పోనియ్యండి సార్! ఓ పన్చేద్దాం. అందరం కలిసి ఆఖరు సారిగా పిలిచి, ఎవరి పని వాళ్ళు చూసుకుందాం,” అన్నాడు కుర్రాళ్ళ గుంపులో టీషర్టు కుర్రాడు.
సరే, అలానే అందరం కలిసి ఇంకోసారి పిలిచాం. “ఒకటీ, రెండూ, మూడు!”, “తే-రే-సా!”
ఒకరటూ, ఒకరిటూగా గుంపులో జనాలంతా ఎవరి దారి వారు పట్టుకుని పోవడం మొదలెట్టారు. నేనప్పటికే వీధి మొగదలకొచ్చి సెంటర్ వైపుకి నడుస్తుంటే లీలగా అరుపు వినిపించింది: “తే-రే-సా!”
ఎవరో ఇంకా అక్కడే ఉండి అరుస్తున్నట్టున్నాడు. ఎవరో కాస్త మొండిఘటం.
(మూలం: The man who shouted Teresa, 1943.)
2. జ్ఞానోదయం
ఉన్నట్టుండి ఒక రోజు చెప్పా పెట్టకుండా హఠాత్తుగా కిక్కిరిసిన నాలుగు రోడ్ల కూడలిలో జనాలంతా హడావిడిగా అటూ ఇటూ నడుచుకుంటూ పోతున్నప్పుడు, జరిగిందది.
నేను ఠకామని ఆగిపోయి, తల విదిలించేను. నాకున్నట్టుండి ఏఁవీ అర్థం కాలేదు. నా చుట్టూ మనుషుల గురించి, వస్తువుల గురించి, ఈ లోకం గురించి, ఏఁవీ, అసలేఁవీ, దేని గురించీ ఏమాత్రమూ అర్థం కాలేదు. అంతా ఒక అర్థం పర్థం లేకుండా అసంగతంగా తోచింది. అక్కడే నిలబడిపోయి పెద్దగా నవ్వడం మొదలెట్టాను.
నాకా క్షణంలో వింతగా కొత్తగా, అప్పటిదాకా నాకెప్పుడూ తట్టని నిజం ఒకటి ఉన్నట్టుండి తట్టింది. అదేమిటంటే నేనప్పటిదాకా ఈ ప్రపంచంలో ప్రతీదీ ఒక కారణం తోటే ఉందని నాకు తెలియకుండానే నేను నమ్ముతున్నానన్న నిజం. నా చుట్టూ నడుస్తున్న ఈ మనుషులు, కార్లు, ఈ ట్రాఫిక్ లైట్లు, ఈ దుకాణాలు, సినిమా పోస్టర్లు, యూనిఫాముల్లో స్కూలు పిల్లలు, మునిసిపాలిటీ వర్కర్లు, ఈ కూడళ్ళలో అలా నిలబడిపోయున్న ఈ నాయకుల విగ్రహాలు, చెల్లా చెదురుగా పడున్న ప్లాస్టిక్ సంచులు, వాటర్ బాటిళ్ళు, గాలికటూ ఇటూ ఎగిరిపోతున్న చిత్తు కాగితాలు ఇవన్నీ కూడా, – నిజానికి ఒకదానికొకటి ఏమాత్రమూ సంబంధం లేని ఇవన్నీ కూడా – ఒక అవినాభావ సంబంధంతో, ఒక అవసరంతో, ఒక కార్యకారణబంధంలో అలా అక్కడ ఉన్నాయనీ, అవి అలా ఉండటానికి ఒక కారణం, వాటన్నిటి మధ్యా ఒక బలమైన బంధమేదో ఉందనే ఒక నమ్మకాన్ని – నేనెప్పుడూ ఏమీ ఆలోచించకుండానే ఒప్పుకుని అప్పటిదాకా బతికేస్తున్నానని నాకు తట్టింది.
ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే నా నవ్వు వెంటనే ఆగిపోయింది. సిగ్గుతో నా ముఖం కందిపోయింది. నా చుట్టూ హడావిడిగా కదిలిపోతున్న జనాల దృష్టి నామీదకు మరల్చడం కోసం చేతులు బార్లా ఊపుతూ పెద్దగా అరవడం మొదలు పెట్టాను.
“ఆగండి, అందరూ ఆగండి! నేను చెప్పేది వినండి. ఒక్కసారి దయచేసి వినండి. ఇక్కడేదో తిరకాసుంది. ఇక్కడొక పెద్ద తప్పు జరుగుతోంది. మనమందరం మనకు తెలీకుండానే, అర్థం లేకుండా, కారణమేదో తెలియకుండా, ఇలా ప్రవర్తిస్తూ బతికేస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఇదిలా ఉండకూడదు. ఇదెప్పటికైనా మారాల్సిందే. మనం ఇలా ఎంతకాలం ఉండాలి? ఎందుకు ఉండాలి?”
నా చుట్టూ జనాలు గుమిగూడారు. కాస్త ఉత్సుకత తోటీ, కొంచెం అనుమానంగా నన్ను పరిశీలించడం మొదలెట్టారు. గుంపు మధ్యలో నేను చేతులూపుతూ, నా ఆలోచనలని వాళ్ళకర్థమయేలా వివరించి చెప్పడానికి ప్రయాసతో, నాకు హటాత్తుగా కలిగిన ఈ జ్ఞానోదయంలో వాళ్ళని భాగస్వాముల్ని చేద్దామని, నా జ్ఞానాన్ని వాళ్ళకు పంచుదామని ప్రయత్నించ బోయాను. కానీ మాట పెగల్లేదు. నేను మాట్లాడదామని చేతులెత్తిన క్షణం, నోరు తెరవబోయిన మరుక్షణం, నా జ్ఞానోదయం నాలోనే పొగమంచులా ఆవిరై పోయినట్లయి, నాలోపల్లోపలే ఆనవాలు లేకుండా కరిగిపోయి, కేవలం ఖాళీ మాటలు, ఉత్త మాటలు మాత్రమే తత్తరపాటుతో తోసుకుంటూ నా నోట్లోంచి బయటకు వచ్చినై.
“”ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ఇప్పుడేమయిందని?” అని నన్ను వాళ్ళంతా నిలదీశారు. “జరక్కూడనిది ఏమిటి జరిగిందని నీ కంగారు? మేమూ చుట్టూరా చూస్తున్నాం. అన్నీ సక్రమంగా, సవ్యంగానే ఉన్నాయే! ఏదెక్కడుండాలో అక్కడే ఉంది. ఏదెలా జరగాలో అలానే జరుగుతూ వుంది. నువ్వంటున్నట్టు అర్థం పర్థం లేని అయోమయంగా మాకేమీ కనపట్టం లేదు మరి!”