తోడు

తను ఇష్టపడ్డ ముగ్గురిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించారు. ఈ సంగతి కరుణ బాధపడుతూనే చెప్పింది. కాని, ఆ గొంతులో పిసరంత గర్వమూ ఉంది. ఆ ఇద్దరిలో ఒకడి ప్రయత్నం ఫలించింది కూడా. యూనివర్సిటీ కేంపస్ మధ్యలో ఉన్న లాంగ్వేజ్ ఆర్ట్స్ బిల్డింగ్ ఆరో అంతస్తు నుండి దూకి, శరీరం లోపలంతా చిన్న చిన్న ముక్కలుగా పిగిలిపోయి చచ్చిపోయాడు. కాని, ఒంటిపైన ఒక్క గాటు కూడా కనిపించలేదు సరికదా, అతని ముఖం చాలా ప్రశాంతంగా ఉండింది. కరుణ ఆ రోజు యూనివర్సిటీకి రాలేదు. తనకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అప్పుడప్పుడూ తను ఒంటరిగా ఉన్నప్పుడు, అతను తనతోపాటుగా లివింగ్ రూమ్‌లో ఉన్నట్టు, తననే చూస్తున్నట్టు అనిపించి కరుణకు ముందు ఒక్క క్షణం భయం వేసేది, కానీ ఆ వెంటనే ధైర్యం వచ్చేది. ఎందుకంటే తనకు అతను తోడున్నాడు. తను పూర్తిగా ఒంటరి కాదు.

నేనంటే తనకు చాలా ఇష్టం. ఇష్టమే కాని నేనంటే కోరిక లేదు. ఈ సంగతి కరుణ బాధపడుతూనే చెప్పింది. నాకూ అంతకంటే బాధగానే అనిపించింది. నిజానికి–తెలివైనవాడు, సరదాగా ఉండేవాడు, తనను చాలా సున్నితంగా చూసుకొనేవాడు, తనను పిచ్చిగా ప్రేమించేవాడు–అచ్చు నాలాంటివాడు కావాలి తనకు. కాని నాతో అలా ఉండలేకపోవడం తనను బాధిస్తుంది. తనకు రెండేళ్ళుగా ఒక హాస్పిటల్ డైరక్టర్‌తో సంబంధం ఉంది. అతను వయసులో కరుణకంటే చాలా పెద్ద. అతనికి పెళ్ళయింది, కానీ భార్యను వదిలివేసే ఆలోచన ఏమీ లేదు. అది అసలు అతని ఊహకే రాదు. అయినా సరే, కరుణకు అతనంటే మోహం. ఇది నిజంగా క్రూరమైన శిక్ష. ఈ శిక్ష అనుభవించేది, బాధలో నలిగిపోయేది నేనే కాదు, తను కూడానూ. తనకే గనక నామీద ఇష్టంతో పాటూ కోరిక కూడా ఉంటే మా ఇద్దరి జంటజీవితం ఎంత సజావుగా సాగిపోయేది!

అప్పుడప్పుడు కరుణ నన్ను తనను తాకనిచ్చేది. తనకు వీపు నొప్పిగా ఉన్నప్పుడో, భుజాలు పట్టేసినప్పుడో తనే అడిగేది కూడా. మెడ దగ్గర కండరాలు మసాజ్ చేస్తున్నప్పుడు తన కళ్ళు మూతబడేవి. మొఖంలో తమకపు హాయితో చిన్న నవ్వూ వచ్చేది. ‘అబ్బా, ఎంతా బాగుందో నీ వేళ్ళు అలా కదులుతుంటే!’ అనేది. తన పాదాలు ఒత్తితేనూ, తన మెటికలు సున్నితంగా విరిస్తేనూ, తన పిక్కలకు బామ్ రాసి జమిరితేనూ, తనకు ఎంతో హాయిగా ఇష్టంగా ఉండేది. ఒకసారి మేమిద్దరం కలిసి పడుకున్నాం కూడా. మనిద్దరం సెక్స్ చేయకుండా ఉండాల్సింది ఆ రాత్రి, వెనక్కు తిరిగి ఆలోచిస్తే అది చేయకూడని పొరపాటు–అనేది తను తర్వాత ఎప్పుడూ. మా బంధం పనిచేయాలని తనలో ఎక్కడో బలంగా ఉండడంతో తన మనసు చెప్పే జాగ్రత్తలేవీ వినిపించుకోలేదు. నా శరీరమో, నా ఒంటి వాసనో, మా ఇద్దరి మధ్య ఇంకేదో తెలీనిది, పేరు పెట్టలేనిది, ఏదో తనకు నచ్చలేదు, ఏదో ఒక అడ్డుగోడ తనలో. తను సైకాలజీ చదువుతోంది నాలుగేళ్ళుగా యూనివర్సిటీలో. అయినా తనూ చెప్పలేకపోయింది మాటల్లో అదేమిటో. మనసు ఎంతగా కావాలి కావాలి అని కోరుకుంటున్నా, ముందుకు నెడుతున్నా, తన శరీరం సుతరామూ ఒప్పుకోటల్లేదు, ఏమాత్రమూ తోడు రాటల్లేదు. ఈ సంగతి కరుణ బాధపడుతూనే చెప్పింది. మా గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా కరుణ బాధ పడేది. మేమిద్దరం కలిసిన ఆ రాత్రి గుర్తు వచ్చినప్పుడల్లా కరుణ బాధపడేది.

కరుణను ఎన్నో విషయాలు బాధపెట్టేవి. తను ఒక్కతే కూతురు. చిన్నతనం చాలా వరకూ ఒంటరిగానే గడిచింది. వాళ్ళ నాన్నకు జబ్బుచేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు, రోజురోజూ చావుకు దగ్గరవుతూ చివరికి ఒకరోజు చచ్చిపోయినప్పుడు, తనకు ఎవరూ తోడు లేరు. తనకు అన్న, తమ్ముడు అంటూ ఎవరూ లేరు. ఆ లోటు పూరించడంలో తనకు బాగా దగ్గరగా వచ్చింది నేను, శ్రీనివాస్ మాత్రమే. యూనివర్సిటీ కేంపస్ మధ్యలో ఉన్న లాంగ్వేజ్ ఆర్ట్స్ బిల్డింగ్ ఆరో అంతస్తు నుండి దూకి, శరీరం లోపలంతా చిన్న చిన్న ముక్కలుగా పిగిలిపోయి చచ్చిపోయాడే, ఆ శ్రీనివాస్. కరుణకు నాతో ఏ దాపరికమూ లేదు. తను నాతో ఏ సంగతయినా హాయిగా మనసు విప్పి గంటలు గంటలు మాట్లాడగలదు. నా ముందు సిగ్గు కూడా పడదు. నన్ను బట్టల్లేకుండా చాలాసార్లు చూసింది. నా ముందు తనూ ఒంటి మీద ఏమీ లేకుండా తిరిగేది. తనకు నాతో ఏ రకమైన సంకోచమూ ఉండేదికాదు. నేను ఏది చేసినా అది తనను ఇబ్బంది పెట్టేదికాదు. నేను తనముందు మాస్టర్బేట్ చేసుకున్నా సరే. తను అప్పుడప్పుడూ నా పక్కలోకి వచ్చి నా దుప్పట్లో దూరిపోయేది. తన వేడి ఊపిరి, తన మెత్తని ఒళ్ళు నన్ను కదిలించేవి. లేచి బాత్రూమ్ వైపు పోబోయేవాణ్ణి. పక్క బట్టల మీద మరకలు పడితే తను బాధపడుతుంది. అక్కర్లేదు, ఇక్కడే చేసుకో అనేది. నన్ను ప్రేమించలేనందుకూ, నా కోరిక తీర్చలేనందుకూ తను బాధపడేది. అందుకోసం అయినా సరే ఇక్కడే చేసుకో, మరకలు పడితే పడనీ, దుప్పట్లు నేను ఉతుక్కుంటాను పర్లేదు, అనేది అది తనకు బాధ కలిగించినప్పటికీ. కబుర్లు చెప్పేది.

కరుణకు వాళ్ళ నాన్న చచ్చిపోయేదాకా కూడా బాగా దగ్గర. శ్రీనివాస్ తనను పిచ్చిగా ప్రేమించాడు: అలా శ్రీనివాస్ కూడా తనకు బాగా దగ్గర. తనకు బాగా దగ్గరైనవాళ్ళలో బతికి ఉంది నేనొక్కణ్ణే ఇప్పుడు. కొంతకాలం అయినాక, నేనూ ఎవరో వేరే అమ్మాయిని ఇష్టపడి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతే తను ఒంటరి అయిపోతుంది. రేపో మాపో ఇలా జరగక తప్పదు. ఆ సంగతి తనకు తెలుసు. అది తనను బాధపెడుతుంది. తను ఒంటరి అయిపోతానని బాధపడినా, నేను ఆనందంగా ఉన్నానని, నాకూ చివరికి నేను కోరుకున్న ప్రేమ దొరికిందని తనకూ ఆనందంగా ఉంటుంది. నేను వచ్చేసినాక బిగుసుకున్న నా శరీరం మళ్ళీ తేలికపడుతున్నప్పుడు తను నా జుట్టు నిమిరేది. నా మొఖంపై తన వేళ్ళతో రాసేది. నా కోరిక తీర్చలేనందుకు బాధగా ఉన్నా, ప్రపంచంలో ఇంతమంది ఆడవాళ్ళలో నేను ఆ సమయంలో తనను మాత్రమే తలుచుకుంటున్నందుకు కొద్దిగా ఆనందంగా కూడా ఉంటుంది తనకు. ఆ హాస్పిటల్ డైరక్టర్ నాకంటే ఏమీ బాగుండడు. పొట్టిగా లావుగా ఉంటాడు. ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి. కానీ, తనకు భలే సెక్సీగా అనిపిస్తాడు. అతనికి ఛీఫ్ మినిస్టర్ చిన్నప్పణ్ణుంచీ పరిచయం. ఇద్దరూ ఒకే స్కూలుకెళ్ళారు. ఇద్దరూ ఒకే పార్టీకి పనిచేశారు. ఇద్దరూ ఇప్పటికీ బాగా స్నేహితులు, తరచూ కలుస్తుంటారు. కరుణ దగ్గరికి వచ్చినప్పుడల్లా, ఛీఫ్ మినిస్టర్ ఇంటికి వెళుతున్నాననే చెప్తాడు అతను.

ఒకరోజు కరుణ మాల్‌లో ఏదో కొనడానికి వెళ్ళినప్పుడు, ఆ డైరక్టర్, అతని భార్య ఎదురుపడ్డారు అనుకోకుండా. ఇద్దరి మధ్య ఐదడుగులు దూరం కూడా లేదు. కరుణ ఎవరూ గమనించకుండా పెదవులు కదిలీ కదలకుండా ఒక చిన్న నవ్వు నవ్వింది అతని వైపు చూసీ చూడకుండా, ఏదో సంకేతం పంపుతున్నట్టు. అతను ఏమాత్రమూ పట్టించుకోలేదు. తనను పూర్తిగా ఇగ్నోర్ చేశాడు. అతని కళ్ళు కరుణ మీదే ఉన్నా, గాజుకళ్ళలా వాటిలో ఏ భావమూ లేదు. అవి కరుణ అక్కడసలు లేనట్టు, కేవలం శూన్యంలోకి చూస్తున్నట్టు ఉన్నాయి. కరుణకు తెలుసు, భార్య పక్కనే ఉంది కాబట్టి అతను తనను చూసి నవ్వలేడు. తనను గుర్తుపట్టినట్టు ప్రవర్తించలేడు. కాని, కరుణను అది బాధపెట్టింది. పరుగెత్తుకుంటూ బైటకు వచ్చి మాల్ రెస్ట్‌రూమ్‌లో కూర్చుని పెద్దగా ఏడ్చింది చాలాసేపు. ఆ రాత్రి మేమిద్దరం కలిసి పడుకున్నాం. వెనక్కు తిరిగి ఆలోచిస్తే అది చేయకూడని పొరపాటు.


తను ఇష్టపడ్డ నలుగురిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించారు. ఆ ముగ్గురిలో ఇద్దరి ప్రయత్నం ఫలించింది కూడా. ఆ ఇద్దరంటేనే కరుణకు బాగా ఇష్టం. వాళ్ళు తనకు చాలా చాలా దగ్గర. ఎంత దగ్గరంటే వాళ్ళు తన తోబుట్టువులు అన్నంత దగ్గర. అప్పుడప్పుడూ తను ఒంటరిగా ఉన్నప్పుడు మేము తనతో పాటుగా లివింగ్ రూమ్‌లో ఉన్నట్టు, తననే చూస్తున్నట్టు అనిపించి కరుణకు ముందు ఒక్క క్షణం భయం వేసేది, కానీ ఆ వెంటనే ధైర్యం వచ్చేది. ఎందుకంటే తనకు మేము తోడున్నాం. తను పూర్తిగా ఒంటరి కాదు.

(మూలం: Not completely alone.)