ఇతిహాసాలు, ఆదర్శాలు: ఆరు జానపద వీరగాథలు

ఉపోద్ఘాతం

భారతదేశంలో మౌఖిక ఇతిహాసాలు (Oral epics) ప్రాచుర్యంలో ఉండేవని చాలాకాలంగానే సాంప్రదాయ సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి తెలిసినా, వారు ఈ వాఙ్మయం మీద శ్రద్ధాసక్తులతో దృష్టి నిలిపింది గత కొన్ని సంవత్సరాలలోనే. పల్నాటి చరిత్ర పైన రోగెయ్‌ర్ (Roghair, 1982), కొంగునాటి చరిత్ర గురించి బెక్ (Beck, 1982) క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రచురించిన విపులమైన వ్యాసాలు ప్రత్యేకించి ఈ మార్పుకు కారణం. ఈ అధ్యయన పరంపరకు కొనసాగింపుగా భావిస్తూ నేను రాస్తున్న ఈ వ్యాసానికి మూలాధారాలు కేవలం తెలుగునుంచే తీసుకున్నాను. కానీ, ఈ వ్యాసంలో నేను ప్రస్తావించిన పరిశీలన పద్ధతులు, ఇతర భాషా ప్రాంతాల మౌఖిక సారస్వతాన్ని కూడా ఆకళింపు చేసుకునేందుకు దోహదపడతాయి.


ఈ వ్యాసపు ఆంగ్లమూలం – ఎనదర్ హార్మొనీ:
న్యూ ఎస్సేస్ ఆన్ ఫోక్‌లోర్ ఆఫ్ ఇండియా.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రచురణ
సంపా. ఎ. కె. రామానుజన్, స్టూవర్ట్ బ్లాక్‌బర్న్
(వ్యాస సంకలనం, బర్కిలీ 1986)

తెలుగునాట ఎంతో ప్రాచుర్యం ఉన్నప్పటికీ, ఈ రకమైన సాహిత్యానికి తెలుగులో ప్రత్యేకంగా ఒక పేరు లేదు. ఇతర భారతీయ భాషల్లో కూడా లేదు. సంస్కృత పదమైన ఇతిహాసం (Epic) ఈ సాహిత్యాన్ని నిర్వచించడానికి ఇంచుమించుగా సరిపోయే పదం. చెప్పబడే చరిత్రం ఏదైనా దానిని కథ అని అనడమే తెలుగులో ఆనవాయితీ. ఆ కథనానికి ఐతిహాసిక స్థాయి (Epic Status) ఉన్నదా లేదా అన్నది ఈ కథ అన్న పదం గుర్తించనీయదు. కానీ ఒక భేదాన్ని తెలుగు శ్రోతలు విస్పష్టంగా చూపిస్తారు. ఆ భేదం కథలో ‘నిజం’ ఎంత? అనే శ్రోత నమ్మకంపైన ఆధారపడి ఉంటుంది. కొన్ని కథలు నిజంగా జరిగినవి అని, కొన్ని కథలు కట్టు కథలు అనీ శ్రోతలు నమ్ముతారు. వస్తుసేకరణ కోసం నేను తిరిగిన ప్రాంతాలన్నిటిలోనూ ఇది నాకు అనుభవంలోకి వచ్చిన విషయం. సాధారణంగా కథ అయిపోగానే అనే “కథ కంచికి, మనం ఇంటికి” అనే ముక్తాయింపు ఈ తేడా చూపించడానికి వాడతారు. ఇందులో పుణ్యక్షేత్రమైన కంచి ప్రస్తావన ఎలా వచ్చిందో నాకు ఆధారాలేమీ దొరకలేదు. ఆ వాక్యం బహుశా, కట్టు కథలలా ఎక్కడికో వెళ్ళిపోకుండా, నిజమైన కథలు శ్రోతలతోనే నిలిచిపోతాయనే భావాన్ని తెలిపేందుకు వాడతారేమో.

మౌఖిక సాహిత్యం మాటల్లో కథలుగా చెప్పుకునేది, పాటలలాగా (బుర్రకథలు ఇత్యాదివి) పాడుకునేదిగా రెండు పద్ధతుల్లో ఉంది. ఈ వ్యాసంలో నేను వాటిని జానపద కథలు (Folk tales) అని, ఇతిహాస లక్షణాలు ఉండి పాడుకోబడే కథనాలని వీరగాథలు (Folk epics) అని విడమర్చి ప్రస్తావిస్తాను.

జానపద కథలు కల్పితాలే అని సమాజంలో అన్ని వర్గాలవారు భావిస్తారు. అందుకు ప్రతిగా వీరగాథలన్నీ చారిత్రక వాస్తవాలే అని ఏకాభిప్రాయంగా ఎక్కడా కనపడదు. సమాజంలో ఏదైనా కథనాన్ని ‘తమది’గా అనుకున్న ఒక వర్గం మాత్రమే ఆ కథకు చారిత్రక విలువని ఆపాదించుకుంటుంది. కానీ అది ఇతర వర్గాలలో కేవలం కథగానే చూడబడుతుంది. ఉదాహరణకి బాలనాగమ్మ కథ. బుర్రకథ రూపంలో ఎంతో ప్రసిద్ధమైన ఈ కథను శ్రీకాకుళం జిల్లా వీరభద్రాపురంలో నా కోసంగా కొందరు ఆడవారు పాడి వినిపించారు. వారందరూ బాలనాగమ్మ కథ నిజంగా జరిగిందనే నమ్ముతారు. కానీ, ఆ శ్రోతల్లోనే ఉన్న మగవాళ్ళకు ఇది కేవలం కట్టు కథ మాత్రమే. ఒక కథపై వారికున్న విశ్వసనీయత ఆ కథతో వారు ఎంత మమేకం చెంది వుంటారు అనే అంశంపై ఆధారపడి ఉంటుందని నేననుకుంటున్నాను. ఒకే కథనం, అందులో తమకు నచ్చిన నడతను చూసుకొన్నవారికి నిజంగానూ, లేనివారికి కట్టు కథగానూ కనిపించడం కద్దు.

చారిత్రక వాస్తవాల నకళ్ళు ఉన్నంత మాత్రాననే కాకుండా ఏదైనా కథ ‘తమ’దైన ప్రాపంచిక దృక్పథాన్ని కూడా కలిగి వున్నప్పుడే, ఒక కులం, లేదా సామాజిక వర్గం ఆ కథని వీరగాథగా భావిస్తుంది. ఇందుకు ఉదాహరణ సర్వాయి పాపడి కథ. సర్వాయి పాపడు తక్కువ కులానికి చెందిన బందిపోటు. మొఘల్ కాలపు దస్తావేజుల్లో ఒక బందిపోటు ప్రస్తావన ఉంది. ఈ కథలో కనిపించే ప్రదేశాలు నిజంగానే ఉన్నాయి. ఇలా వాడి సాహసాలను వివరించే ఈ కథలో చారిత్రక వాస్తవాలు కూడా కనిపిస్తాయి. సర్వాయి పాపడి పుటక, జీవితం, మరణం ఇవన్నీ కూడా ఇతర జానపద కథానాయకులకు మల్లేనే ఉంటుంది. ఈ కథకు ఉండవలసిన అన్ని ఐతిహాసిక లక్షణాలూ ఉన్నాయి.అయినా కూడా, సర్వాయి పాపడి వృత్తాంతాన్ని వీరగాథలా కాకుండా కేవలం ఒక జానపద కథగానే శ్రోతలు భావిస్తారు. ఈ కథను పాడేవారు కూడా వినేవారి ఆనందం కోసం మాత్రమే ఈ కథను పాడతామని నాకు స్పష్టం చేశారు. ఏ కులం వారు ఈ కథను ‘తమది’గా చేసుకోనప్పటికీ, విద్యాధికులైన సాహిత్యవేత్తలు కొందరు, సర్వాయి పాపడిని ముస్లిం రాజుల పీడనకు ఎదురొడ్డిన ఒక గొప్ప హిందూ వీరుడిగా పునర్నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలకు తగినంత వత్తాసు దొరికితే, ఈ జానపద కథ ‘నిజ’త్వాన్ని సంతరించుకొని, కొంతకాలంలో ఐతిహాసిక స్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదు.

ఒక కథను వీరగాథగా మల్పించడానికి, చారిత్రక వాస్తవికతను జోడించి ఆ కథను యదార్థంగా చేయడం ఎంత ముఖ్యమో, ఒక చారిత్రక సంఘటనని కేవలం కట్టుకథగా మార్చి చూపడానికి, ఆ చారిత్రక వాస్తవాన్ని పూర్వపక్షం చేయడం అంతే ముఖ్యమైన ప్రక్రియగా మనం గమనించాల్సి వుంటుంది. మనదేశంలో తరచూ జరిగే వాదనల్లో ఒకటి, రామాయణ మహాభారతాలకు చారిత్రక సత్యత ఉన్నదా, అనేది. శోధన ద్వారా చరిత్రను నిర్థారించే దృక్పథం వున్న శాస్త్రజ్ఞులు, పురావస్తు తవ్వకాలలో దొరికిన నాణాలు, పనిముట్లు, ప్రాచీన శిలాశాసనాలు తదితరమైన రుజువుల ఆధారంగా కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగిందనో, జరగలేదనో, రామాయణంలోని లంక ఇప్పటి శ్రీలంక అనో, కాదనో – ఇలా వాదిస్తారు. అయితే ఈ నిదర్శనలు కేవలం చారిత్రక పరిశోధనకు సంబంధించినవిగానే మిగిలిపోవు. మనదేశంలో వార్తాపత్రికలు తరచూ, పురావస్తు అన్వేషణలో బయటపడే సాక్ష్యాల సమాచారాన్ని ఐతిహాసిక దృక్పథంతోటే ప్రచురిస్తాయి. పురావస్తు పరిశోధన ఫలితాలను రామాయణం, మహాభారతం వంటి కావ్యాల ఐతిహాసికతను నిర్ధారించడానికో, నిరాకరించడానికో ఉపయోగపడే ముఖ్యమైన ప్రమాణాలుగా భావించడం వల్లనే వార్తాపత్రికలు వాటికంత ప్రాముఖ్యత నిస్తాయి.

అలాగే, సాంప్రదాయ వాదాన్ని ఎదురించే ఆధునిక కవులు, వ్యాసకర్తలు ఈ ఇతిహాసాలను పుక్కిటి పురాణాలుగానే భావిస్తారు, ఆ అభిప్రాయాన్నే బలంగా వినిపిస్తారు. గజేంద్ర మోక్షంలో ఏనుగు, మొసలి మధ్య పోరాటం, సమాజంలోని పీడితుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు, పాలక వర్గం ప్రచారం చేసే ఒక అబద్ధంగా శ్రీశ్రీ వాదించాడు.(ఇది జరిగిన కథ కాదని / ఎవరో కల్పించినదని/ ఇంచుక యోచించగల వాడెవడైనా గ్రహిస్తాడు – సదసత్సంశయం కవితలో.) ఆయన పాఠకులకు భాగవత పురాణం ఒక కట్టు కథ మాత్రమే. కానీ సాంప్రదాయ హిందువుల దృష్టిలో గజేంద్ర మోక్షం నిజంగా జరిగిన సంఘటన. వారికందులో ఏ సంశయము లేదు. ఒక ఇతిహాసపు స్థాయి, అది ఎంత నిజం అనే నమ్మకం పైన ఆధారపడి ఉందని ఇక్కడ గ్రహించవలసిన సంగతి.

ఒక కథనం ఇతిహాసమా, కాల్పనికమా అనేది ఆ కథనానికి నిజత్వాన్ని ఆపాదించడం, లేదా లేకుండా చేయడం మీద ఆధారపడింది కాబట్టే ఇతిహాసాలు మనదేశంలో ఆదర్శాల (Ideology) వ్యాప్తికి వాడుకోబడుతున్నాయి. ప్రత్యేకించి తెలుగు వంటి భాషలలో, సామాజిక వర్గాలు ఈ కథలని ‘తమ’విగా వాటిని సొంతం చేసుకోవడం వల్ల, జానపద ఇతిహాసాల (లేదా వీరగాథల) విషయంలో ఈ వాడుక మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీరగాథలతో కూడి కొన్ని పండగలు, జాతరల వంటి సంప్రదాయాలు ఉండటం, ఆ ప్రత్యేక సందర్భంలో ఆ వీరగాథను ప్రదర్శించే హక్కు కొంతమంది కళాకారులకే ఉండటం ఒక ఇతిహాసాన్ని ఒక వర్గం తమ కులచరిత్రగా చూపుకోటానికి మరింతగా సహకరిస్తాయి. ఒక ఇతిహాసం చారిత్రక సత్యంగా భావించబడి, దాని ఆధారంగా ఆచార వ్యవహారాలు ఎప్పుడైతే దైనందిన జీవితంలో చోటు చేసుకుంటాయో, అప్పుడు ఆ ఇతిహాసం ఆ సామాజిక వర్గాన్ని మరింతగా ప్రభావితం చేస్తుంది. ఆ వర్గానికి సమాజంతో ఉండే లావాదేవీలు, అంతర్గత సంబంధాలు, సంప్రదాయాలు ఇత్యాది స్వభావాలని ఆ ఇతిహాసం నియంత్రిస్తుంది.

ఒక ఇతిహాసపు సంఘటనలు యదార్థమని, అందులోని పాత్రలు నిజమైనవే అని నమ్మినప్పటికీ, ఐతిహాసిక కథనంలో మార్పులు చోటు చేసుకుంటూనే వూంటాయి. ఇవి కేవలం వీరగాథలని పాడేవారు తమ ప్రతిభతో కథనానికి చేసిన చేర్పుల వంటివి కావు. ఈ మార్పులు మరింత లోతైనవి. అవి ఏ సామాజిక వర్గమైతే ఆ ఇతిహాసాన్ని ‘తమ’దిగా అనుకుంటున్నదో, ఆ వర్గపు ఆదర్శాలలో వచ్చిన మౌలికమైన మార్పులు ఇవి. అంటే కాలక్రమేణా ఆదర్శాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇతిహాసం కూడా మారుతూ వుంటుంది. మనదేశంలో ఇతిహాసాలు ఇప్పటికీ ఈ విధంగానే సృష్టించబడుతున్నాయి, నిర్మూలించబడుతున్నాయి కూడా. లిఖిత ఇతిహాసాలు, మౌఖిక వీరగాథలు రెంటిలోనూ ఈ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల వాటి మధ్య వున్న తేడా కూడా అక్కడక్కడా చెరిగిపోతున్నది. జానపద వీరగాథలు క్రమంగా లిఖిత ఇతిహాసాలుగా పరిణమించడం, లిఖిత ఇతిహాసాలలోని కథనాలు జానపద వీరగాథలుగా అవతరించడం ఇందువల్లనే.

ఈ ఐతిహాసిక పరిణామాన్ని పరిశీలించటం కోసంగా నేను మొదట ఆరు జానపద వీరగాథలని, వాటిని తమవిగా అనుకునే సామాజిక వర్గాల గురించి చర్చిస్తాను. ఆపైన ఆ వీరగాథల ఐతిహాసికతలో వచ్చిన మార్పులు, ఎలా ఆ వర్గపు సిద్ధాంతభావాలలో వచ్చిన మార్పులని ప్రతిఫలిస్తున్నాయో వివరిస్తాను. ఇందుకోసంగా నేను తీసుకుంటున్న వీరగాథలు ఇవి: 1. పల్నాటి కథ; 2. బొబ్బిలి కథ; 3. కాటమరాజు కథ; 4. కన్యకా అమ్మవారి కథ; 5. సన్యాసమ్మ కథ; 6. కామమ్మ కథ.

జానపద వీరగాథలు

కథనపు వైఖరి ఆధారంగా ఈ వీరగాథలను త్యాగచరితలు, వీరచరితలు అనే రెంటిగా విడగొట్టవచ్చును. వీరచరితలు యుద్ధభూమిలో మరణించే మగవారి చుట్టూ, త్యాగచరితలు ఆత్మాహుతి చేసుకునే ఆడవారి చుట్టూ అల్లబడ్డాయి (ఎలాగో తర్వాత వివరిస్తాను.) ముందుగా ఈ కథల గురించి క్లుప్తంగా చెప్తాను.

పల్నాటి కథ ఇద్దరు సవతి బిడ్డల మధ్య నడిచే పోరుని వర్ణిస్తుంది. ఒక కూటమికి నాయకురాలు విధవ అయిన నాగమ్మ, రెండవ కూటమికి వీరుడైన బ్రహ్మనాయుడు నాయకుడు. ఇతను అలుగురాజుకు మంత్రి. మరణశయ్యపైన ఉన్న రాజు తన ఇద్దరు భార్యలకు పుట్టిన ముగ్గురేసి పిల్లల బాధ్యత బ్రహ్మనాయుడికి అప్పచెప్పి చనిపోతాడు. ఈ ఆరుగురు పిల్లలలో పెద్దవాడైన నలగామరాజుకి పట్టాభిషేకం చేస్తాడు బ్రహ్మనాయుడు. కానీ త్వరలోనే, నాగమ్మ నలగామరాజుని తన గుప్పిట్లోకి తెచ్చుకుని, తమ్ముడైన పెద్దమలిదేవరాజు నుంచి విడగొడుతుంది. బ్రహ్మనాయుడు రాజ్యాన్ని రెండు ముక్కలు చేసి, పెద్దమలిదేవరాజుని రాజుగా చేసి తన సంరక్షణలో ఉంచుకుని రాజ్యభారాన్ని తను మోస్తుంటాడు. నాగమ్మ, బ్రహ్మనాయుడి మధ్య వైరం చివరికి ఒక కోడిపందెంలో ముగుస్తుంది. పందెంలో ఓడిన బ్రహ్మనాయుడు రాజుతో సహా ఏడేళ్ళు దేశం వదిలి వెళ్ళవలసి వస్తుంది. ఆపైన నలదేవరాజు, నాగమ్మ ప్రబోధంతో, రాజ్యాన్ని తిరిగి పెద్దమలిదేవరాజుకి ఇవ్వననడంతో యుద్ధానికి సిద్ధమౌతారు. కానీ, యుద్ధసన్నాహాలు జరుగుతుండగా నాగమ్మ, నలగామరాజు అర్థ రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని రాయబారం పంపుతుంది. కాని, బ్రహ్మనాయుడి కొడుకైన బాలచంద్రుడి ప్రతీకార వాంఛ వల్ల సంధి విఫలమౌతుంది. యుద్ధంలో రెండువైపులా ఎందరో చచ్చిపోతారు. నాగమ్మ పారిపోతుంది. బాలచంద్రుడు కూడా మరణిస్తాడు. ఇలా ఎన్నో మలుపులు తిరిగి కథ ముగుస్తుంది.