తిరగబడ్డ తొమ్మిది
అప్పటిదాకా ఊరి పొలిమేరల్లో తచ్చాడుతున్న చీకటి మెల్లిగా ఊరి మధ్యలోకి పాకి చెట్ల ఆకుల మధ్యలో ఆకాశాన్ని నల్లగా పులిమేసి, ఠంచనుగా వెలిగిన వీధి దీపాల నియాన్ లైట్లకింద పసుపు పచ్చని పిచ్చుక గూళ్ళు కట్టింది. ఆకాశంలోకి నిటారుగా ఎగబాకిన ఆ ఆఫీసు బిల్డింగు కిటికీల అద్దాలు మెల్లమెల్లగా నల్లబడుతున్నాయి. అక్కడక్కడా కొన్ని కిటికీలలో ఆ పూటకి ఇంకా మిగిలిపోయిన వ్యవహారమేదో వెలుగుతూనే ఉన్నా ఆ రోజుకి మాత్రం ఆఫీసు పని అయిపోయింది. హెల్మెట్లు, విండ్ చీటర్లలో భుజానికడ్డంగా బ్యాగులు వేలాడేసుకుని వయసుకొచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు; షాల్ కప్పుకుని, ఉలెన్ స్కార్ఫులు తలకు చుట్టుకుని, వయసు మళ్ళిన సెక్రటరీలు; టైలు, సూట్లలో, చెవిలో సెల్ఫోన్ల లోకి ఆర్డర్లు పారేస్తున్న మేనేజర్లు; సెల్ఫోన్ల నుంచి వినయంగా వింటున్న అసిస్టంట్లు — పార్కింగ్ నుంచి చీమల్లా బైటికి వస్తున్న కార్లూ, బైకులూ, స్కూటర్లూ, హారన్ల సందడి; హాయ్, హౌజ్ యువర్ డే, వాంటూ గోఫరే డ్రింక్, విల్కాల్యూ టునైట్, సీ యూ టుమారో, బై బై అరుపులు, జాతర కోలాహలం. కానీ కాసేపట్లోనే అంతా సద్దు మణిగిపోయింది. ఆ వీధిలో కదిలే దీపాలంటూ ఇక ఏమీ లేవు.
ప్రతీరోజు లాగే చడీ చప్పుడు లేకుండా చీకట్లో నిల్చోనున్న బిల్డింగు కిటికీల్లోంచి ఖాళీగా ఉన్న ఆఫీసులు కనిపిస్తున్నాయి. పవర్ ఆఫ్ చేసిన కంప్యూటర్ మానిటర్లు, టేబుల్ కిందికి నెట్టిన కుర్చీలు, ఒద్దిగ్గా సర్దిపెట్టిన ఫైల్ ఫోల్డర్లు, ఔట్ గోయింగ్ ట్రేలో సంతకాలు పెట్టి మూసేసిన డిపార్ట్‌మెంటల్ మెయిల్ ఎన్వలప్‌లు, పగలంతా పని చేసి మౌనవ్రతం పట్టిన ఫోటోస్టాట్ మెషీన్లు, స్కానర్లు, టెలిఫోన్లు, పూర్తిగా నిండీ నిండని చెత్తబుట్టలు — కరెంటు ఆదా కోసం వరుస ఒదిలి వరుసలో వెలుగుతున్న ట్యూబ్ లైట్ల వెలుగులో కదలకుండా, మెదలకుండా నిలబడి నిద్రపోతున్న కొంగల్లా ఉన్నాయి. కార్డ్ బోర్డ్ గోడ మీద పుష్ పిన్ గుచ్చి నిలబెట్టిన ఫామిలీ ఫోటోల్లో నవ్వుల లాగానే ఆఫీసంతా అచేతనంగా అలా ఇప్పుడైతే ఉంది కానీ ఇంకెంతసేపో ఉండబోటం లేదు.
ప్రతీరోజు లాగే ఆ బిల్డింగ్ వెనకాల గుమ్మం దగ్గరికి ఆకుపచ్చ రంగు వ్యాన్ వచ్చి ఆగగానే బిలబిల్లాడుతూ చీరలు, చుడీదార్ల మీద నీలంరంగు డాక్టరు కోటు లాంటిది వేసుకున్న ఓ పదీ పన్నెండు మంది ఆడవాళ్ళు దిగిపోయారు. దిగిన కాసేపట్లోనే బ్రూములు, వెట్‌మాపులు, స్ప్రే బాటిళ్ళు, నేప్కిన్లు పట్టుకొని అంతస్తు నుంచి అంతస్తుకి, టేబుళ్ళని తుడిచేస్తూ, వైట్ బోర్డులు చెరిపేస్తూ, కార్పెట్లని దులిపేస్తూ, చెత్తబుట్టల్లో చించేసిన కాగితాల ముక్కల్లో నిజాలను, ఆరోగ్యం కోసమో అందం కోసమో ఒక్కపొద్దున్న ప్లాస్టిక్ రేపర్ల అబద్ధాలను, ఖాళీ చేస్తూ — పగలంతా నడిచిన పాదాల మరకలు మాయం చేస్తూ గచ్చు నేల మీద తడిగుడ్డతో ముగ్గులేసే మంత్రగత్తెలు, సందడి లేని సందడి చేస్తూ ఆఫీసులో నీడల్లా పాకిపోయారు.
“చిన్నోడా, కిటికీ షట్టర్లేయడం అయిందా?”
ఒక్కో కిటికీ ముందు అద్దంలో వాణ్ణి వాడు చూసుకుంటూ, కిటికీ బ్లైండ్స్ పై అంచు దాకా లాగి, ధనామని ఒకేసారి వదిలిపెడుతూ కెమెరా షట్టర్‌లాగా, ఒక్కో కిటికీని మూసి దాని వెనకాల మాయమైపోతూ, వాడిలోకంలో వాడున్న రాజుగాడు ఉలిక్కిపడి, ఆ గదిలో మిగిలిపోయిన కాసిని కిటికీలకు చకచకా బ్లైండ్స్ వేసేసి కారిడార్లోకి వచ్చి పడ్డాడు. బ్లైండ్స్ ముందు వేసేస్తే తర్వాత వాటిని టకటకా తుడుచుకుంటూ పోవచ్చు. ఫోటో ఫ్రేములూ, ఫ్లవర్ వేజుల దుమ్ము దులుపుతున్న సునంద వాణ్ణి చూసి పలకరింపుగా నవ్వి, “మీ అమ్మ ఆ గదిలో ఉంది, పో!” అని తలూపుతూ చెప్పింది. సునంద యమున కంటే పదేళ్ళు చిన్నది. అయినా వాళ్ళిద్దరికీ మంచి దోస్తీ. ఇంతలో యమునే అక్కడికొచ్చింది.
“అమ్మా, కిటికీలేశా. చెత్త బుట్టలు తీసేదా?”
“నా బంగారు నాన్నే. జాగ్రత్తమ్మా, నేల మీద పడున్నవి తీయకు, సరేనా?”
యమునకి రాజుగాడి కళ్ళ మీద నిద్రమత్తు కనిపించకుండా పోలేదు. వాడికి రేపు స్కూలు కూడా ఉంది. యమున గమనించినా ఏం చేస్తుంది, అవసరం అలాంటిది. అప్పుడప్పుడూ తప్పనిసరై వాణ్ణి వెంట తెచ్చుకుంటుంది సహాయం కోసం. అమ్మను ఎక్కువగా తిరగనీయకుండా వాడే అటూ ఇటూ పరుగెత్తుతూ పని సాయం చేస్తుంటాడు.
నిద్రమత్తులోంచి మెలకువలోకి, మెలకువలోంచి ఇంకో నిద్రమత్తులోకి అటూ ఇటూ ఊగుతూనే ఒక పెద్ద గార్బేజి బ్యాగులోకి చెత్తబుట్టల్ని ఒక్కోటీ ఒంపుకుంటూ, వీలైనంత నిదానంగా ఆ ఆఫీసు గది ఖాళీ చేసి, వాడికంటే రెండు రెట్లున్న ఆ బ్యాగు వాడి వెనకాలనే ఈడ్చుకుంటూ రాజుగాడు కారిడార్లోకి తెచ్చి పడేశాడు. అలా బైటికి తెచ్చి పడేసిన బ్యాగులన్నీ మోటార్ ట్రాలీ మీద కెక్కించి తర్వాత బైటికి తీస్కెల్తారు ఇంకెవరో.
రాజుగాడికి అన్నిటికంటే ఇష్టమైన పని చెత్త బుట్టలు ఖాళీ చేయడం. అందుకే నిదానంగా చేస్తాడు, నిద్రొస్తున్నా రాకపోయినా. పెద్ద పెద్ద గదులు; వాటి మధ్యలో అడ్డంగా నిలువుగా వరసల్లో చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాంటి క్యూబు గదులు. ప్రతీ క్యూబులో ఒక టేబులు, ఒక కుర్చీ, టేబుల్ మీద ఒక కంప్యూటరు, పక్కనే ఫోను. టేబుల్ పక్కగా దానికానుకొని ఒక ఫైల్ కేబినెట్, టేబుల్ కింద ఒక పక్కగా చిన్న చెత్తబుట్ట. అన్ని క్యూబుల్లో ఒకే రకం ఫర్నిచరు. గదిలో గోడవారగా కొంచెం పెద్ద గదులు, అవీ అగ్గిపెట్టెల్లాగే. కాకుంటే మసక అద్దాల తలుపులతో. వాటికి తాళాలుండవు, చక్రాల మీద పక్కకు జరుగుతాయి. ఆ గదుల్లో కూడా ఇలానే టేబులు, కుర్చీ, కంప్యూటరు, ఫైలు కేబినెట్ అన్నీ ఉంటాయి కానీ కొంచెం పెద్దవి. అంతే తేడా. ఆ గదుల్లో ఫోన్ల మీద బటన్లు కూడా ఎక్కువుంటాయి. ఆ కంప్యూటర్లని చూసుకుంటూ, వాటి సన్నటి రొద వింటూ, ఫోన్ల మీద వెలిగీ ఆరిపోతున్న ఎర్రలైట్లు చూస్తూ, అక్కడక్కడా ఇంకా టేబుల్ మీదే ఒదిలేసిన కాల్‌క్యులేటరో, మర్చిపోయిన సెల్ఫోనో చేత్తో పట్టుకొని మరీ చూస్తూ మళ్ళీ అక్కడే పెట్టేస్తూ, వాడి లోకంలో వాడు ఒంటరిగా ఆ పెద్ద పెద్ద గదుల్లో అలా తప్పిపోవడం రాజుగాడికి చాలా ఇష్టం. అంతేకాదు, సునంద జోరీగలా ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటుంది. ఆ రొద తప్పించుకొని పోడానిక్కూడా.
సునంద డిగ్రీ సగంలో ఆపేసింది. ఎవరైనా అడిగితే సీఐఎఫ్‌ఎమ్‌టీలో జానిటోరియల్ స్టాఫ్‌గా పనిచేస్తాను అని గర్వంగా చెప్తుంది. అంటే ‘కన్సార్టియం ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ మానిటరీ ట్రాన్సాక్షన్స్! ప్రపంచంలో కంపెనీలు, గవర్నమెంట్లు, ఇచ్చుకునే అప్పులూ, పెట్టుకునే ఖర్చులూ అన్నీ లెక్క చూసేది మన కంపెనీనే. పైసా అటూ ఇటూ పోకుండా లెక్క చూస్తారు తెలుసా? మనం గానీ లేకపోతే అంతే, అంతా ఉష్‌కాకీ’ అని రాజుగాడికి నేర్పించింది కూడా తనే. ఆషామాషీ కంపెనీకి పని చేయటం లేదని సునందకి తెలుసు. యమునకి ఇవేమీ పట్టవు. సీఐఎఫ్‌ఎమ్‌టీ అయినా కూరగాయల కొట్టయినా ఆమెకొకటే. సునందకి ఆ బిల్డింగులో ఆఫీసుల పేర్లన్నీ తెలుసు, జానిటర్ల రూల్సు కూడా తెలుసు.
“… యమునక్కా, ముందుపోయి అకౌంట్స్ కానిచ్చి ఆ పైన, లిటిగేషన్స్ లోకి పోదాం. ఈరోజు పొద్దునంతా అక్కడేదో మీటింగ్ జరిగిందంట. అదేదో దేశం అబ్బా, మీ అప్పు నేను కట్టను, ఏం పీక్కుంటారో పీక్కోండి అందట. ఎవరో తెల్లాయన, నల్లాయన చివరికి కొట్టుకునే దాకా వచ్చారట. అక్కడే మనకు ఎక్కువ పని పడేది ఈ రోజు.”
“… యమునక్కా, నీకెన్నిసార్లు చెప్పానే? టేబుల్ ఖాళీగా పెట్టకపోతే నువ్వు తుడవక్కర్లేదని. నీ తప్పు కాదు కదే. ఉత్తగా గుడ్డతో ఫోన్ ఒకసారి దులుపు, చాలు. ఇంటికెళ్ళే ముందు టేబుల్ ఖాళీ చెయ్యాలని గూడా తెలీదా ఏందీ, ఈ మిడిమాలపోళ్ళకు!”
“… యమునక్కా, ఇందాక సుదర్శనం సారు రూముకి పోతే కాయితాలు ఎక్కడ పడితే అక్కడే పడేసున్నై. బోర్డు మీద డు నాట్ వైప్ అని రాసిపెట్టి మరీ పోయాడే. ఆయన బ్యాగు కూడా మర్చిపోయాడు. ఏందబ్బా ఎప్పుడూ శుభ్రంగా ఉంటాడే, ఏమైందో అనుకున్నా. ఈ రోజు ఏదో తిరకాసైనట్టే వుంది.”
సునందకి తెలీనిది లేదు. అప్పుడప్పుడూ టేబుల్ మీద ట్రేలో ఉన్న ఉత్తరాలు, కవర్లు తీసి చూస్తుంటుంది. సున్నాలు లెక్కపెడుతూ ‘అమ్మో ఇన్ని కోట్లే ఒక చెక్కు మీద!’ అని ఆశ్చర్యపోతుంటుంది. ఇందులో పది సున్నాలు తీసేసినా పర్లేదు, ఇట్లాంటి చెక్కు ఒక్కటి మనకిస్తేనా అని యమునతో చెప్తూ ఊహల్లో తేలిపోతుంటుంది.
“అబ్బ పోనీవే నందూ, మనకెందుకే ఇవన్నీ… పోనీలేవే, కాగితాలొక పక్కకి నెట్టి టేబులు ఊరికే అట్లా ఒకసారి తుడిస్తే ఏం కాదు లేవే… తిరకాసెందుకయిందే? మనకేం కాదుగా, రాజుగాడి చదువైపోతే చాలు. అప్పటిదాకా ఈ ఉద్యోగం పోకుంటే చాలు దేవుడా.” యమున లోకం యమునది.
వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకరు ఎలా భరిస్తారో రాజుగాడికర్థం కాదు. సునంద పొడుగ్గా సన్నగా ఉంటుంది, మగరాయుడిలా నడుస్తుంది; గొంతు కూడా పెద్దది, ఎవరన్నా లెక్క లేదు. అమ్మేమో సన్నగా చిన్నగా ఉంటుంది, అతి భయం, జాగ్రత్త; కొత్తవారిముందు గొంతు పెగలదు. సునంద టేబుళ్ళ మీద కంప్యూటర్లూ అవీ దులిపేటప్పుడు, దర్జాగా వెనకాలున్న కుర్చీలో కూర్చుంటుంది. అలా మేనేజర్లు, డైరక్టర్ల కుర్చీల్లో కూర్చుని చేతిలో డస్టరును నిర్లక్ష్యంగా ఆడిస్తూ వాళ్ళంత దర్జా వొలకపోస్తుంది. అమ్మ మాత్రం పక్కా పల్లెటూరిదానిలా పని చేస్తుంది. టేబుల్ మీద అవీ ఇవీ అటూ ఇటూ జరిపి తుడుస్తుంటే, పేడతో ఇల్లు అలుకుతున్నట్టు వుంటుంది. ఇద్దరూ కలిసే పనిచేస్తారు. ఏదో ఒకటి ముచ్చట్లు సాగుతూనే వుంటాయి. వాళ్ళిద్దరినీ తప్పించుకొని దూరంగా ఆఫీసుల్లోపల్లోపలికి వెళ్ళిపోతుంటాడు రాజుగాడు. అది వాడి లోకం. ఆ పల్చటి నిద్రమత్తులో, కంప్యూటర్ల సన్నని రొదలో, అనంతమైన ఆ ప్రపంచంలో వాణ్ణి వాడు ఎవరికీ కనిపించని ఒక చీమలాగా ఊహించుకుంటాడు. ఒక గది ఎకరమంత ఉంటుంది, టేబులు కాలు తాడి చెట్టంత పొడుగుంటుంది. ఆ ఊహలో పూర్తిగా ముణిగిపోయిన తర్వాత వాడికే అనుకోకుండా భయం పుడుతుంది. ఉన్నట్టుండి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తుంటాడు, ఎక్కడైనా మనిషి అలికిడి వినిపిస్తుందని చూస్తుంటాడు. ఈ లోకంలో వాడికి తెలిసిన ఆనవాళ్ళు వెతుక్కుంటాడు.
టేబుల్ మీద వేసిన అద్దం కింద కనిపించే ఫోటోలలో ఆమెవరో, అతనెవరో. చిన్న మోకాళ్ళ పీట మీద సెక్రటరీ పెట్టుకున్న పూల కుండీ. ఒక చెత్తబుట్టలో ఫిల్మ్ ఫేర్ పత్రిక. ఇంకోదాంట్లో ఒకే ముఖం బొమ్మ ఒక్కోదాని మీద ఒక్కో రకంగా గీసి నలిపి ఉండలుగా చేసి పారేసిన పోస్ట్ఇట్ నోట్లు. సిగరెట్లు తాగకపోయినా టేబుల్ మీద ఇంకా పెట్టుకున్న ఒక ఆష్‌ట్రేలో లిక్కర్ చాకొలెట్ల తగరపు కాయితాలు. మార్కర్ పెన్నుతో టేబుల్ మీద రాసిన రెండు పొడి అక్షరాలు, వాటి మధ్య గుండె బొమ్మ. ఒక కుర్చీ నుంచి సన్నగా లావెండర్ వాసన, ఎవరిదో… ఇది వాడి లోకమే. ఏ లోకాన్నైతే చూసి భయపడ్డాడో, ఇప్పుడిక అది వాణ్ణి భయపెట్టదు. ఇది వాడి సొంత లోకం, వాడు దానికి రాజు.
ఆ గదిలో పని అయిపోగానే రాజుగాడు ట్రాష్ బ్యాగు ఈడ్చుకుంటూ వచ్చి కారిడార్లో పడేశాడు. దాని మూతి కట్టేసి ఇంకో బ్యాగ్ తీసుకొని ఆ ఆఫీసు వెనక వైపు ఉన్న రెండో గదిలోకి పోయాడు. ఆ గది నిండా పెద్ద పెద్ద మెషీన్లున్నాయి, లైబ్రరీలో పుస్తకాల అల్మారాల్లాగా వరసగా, నేలనుంచి పై కప్పు దాకా. ప్రతీ మెషీను నుంచి రంగురంగుల వైర్ల కట్టలు నేలమీద కొండచిలవల్లా చుట్టలుగా పరచుకొని, గోడల్లోకి దూరిపోయి వున్నాయి. ఇప్పుడున్న మెషీన్లు అంత చప్పుడు చేయవు కానీ రకరకాల లైట్లు మాత్రం వాటిమీద వెలిగీ ఆరిపోతుంటాయి. ఇంతకుముందు ఈ గదిలో ఒక మెషీనుండేది. దానిమీద రెండు పెద్ద పెద్ద సినిమా రీళ్ళలాంటివి ముందుకూ వెనక్కూ తిరుగుతూ ఉండేవి. వాటి కిందగా, ఒక పొడుగాటి కాగితం, దాని మీద అక్కడక్కడా చిల్లులుండేవి, అది మెషీన్ లోపలికీ బైటికీ నాలికలా పోతూ వస్తూ ఉండేది. అంతా భలేగా ఉండేది. అప్పుడొకాయన తెల్లకోటు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని ఆ గదిలోనే ఉండేవాడు ఆ మెషీనుకు ఆ చిల్లుల కాగితాలు తినిపిస్తూ. ఆయనే రాజుగాడికోసారి అవేమిటో చెప్పాడు గూడా. “ఇవేంటో తెలుసా? సూపర్ కంప్యూటర్లు. తొందర్లోనే అన్ని పనులూ ఇవే చేస్తాయి. అప్పుడెవరి అవసరం ఉండదు. నీది, నాది కూడా.”
రాజుగాడు సునంద దగ్గరికి పరిగెత్తాడు. “అక్కా, ఆ చివరి గదిలో మెషీన్లేందో తెలుసా? అవిట… తొందర్లోనే అన్ని పనులూ అవే చేస్తాయట.”
“అవా?!” సునంద తీసిపారేసింది. “ఏంది చేసేదీ అన్ని పన్లు? వచ్చి మన పని చేయమను, చెప్తా. అవీ, పాతసామాన్లోడికి అమ్ముకుంటే కేజీ ఉల్లిపాయలు కూడా రావు. నీకో సంగచ్చెప్పేదీ. జగన్రాజు గారి బావమరిది కంపెనీ వాటిని తయారు చేస్తే, పెళ్ళాం మాట కాదనలేక వాటిని కొనిపించి ఆ గదిలో పెట్టించాడు ఆయన ప్రెసిడెంటుగా ఉన్నప్పుడు. అదీ కథ.” రాజుగాడేమీ మాట్లాడకుండా తల తిప్పుకున్నాడు. సునందకి ఏమీ తెలీదని మళ్ళీ తెలిసిపోయింది. అక్కకి తెలీదు ఆ మెషీన్లకి అంతా తెలుసని. నిన్న జరిగింది, మొన్న జరిగిందీ, అప్పుడెప్పుడో జరిగింది, రేపు జరగబోయేదీ, అన్నీ వాటికి తెలుసు. తొందర్లోనే అవే అన్ని పన్లూ చేస్తాయి. అప్పుడు ఆఫీసులు పొద్దున పూట కూడా ఇప్పుడున్నట్టే ఉంటాయి, ఎవరూ లేకుండా.
రాజుగాడికి ఇప్పుడదే ఆలోచన మళ్ళీ వచ్చింది, బోసిగా ఎవరూ లేకుండా ఆఫీసులు పగలంతా ఉంటే ఎలా వుంటుందో అని. మనుషుల్లేని ఆఫీసులు. ఆ ఊహలోనే వాడు పరిసరాలు మర్చిపోయిన పరధ్యానంలో ఒక క్యూబికిల్ తలుపు పక్కకు నెట్టాడు. “అవ్!!” అనే అరుపుతో ఉలిక్కిపడి స్పృహలోకొచ్చాడు. ఆ గది ఖాళీగా లేదు. ఇంటికెళ్ళకుండా ఇంకా పనిచేస్తున్నారు ఇద్దరు ఆ గదిలో; పోనీ టెయిల్ కట్టుకున్న ఒక అమ్మాయి, టై కట్టుకున్న ఒక అబ్బాయి. శ్రద్ధగా పని చేస్తున్నారేమో, తలుపు ఉన్నట్టుండి కదిలేటప్పటికి అమ్మాయి దడుచుకుంది. రాజుగాడిని, వాడి వెనకాలే ఉన్న ట్రాష్ బ్యాగునూ చూసి, మళ్ళీ వాళ్ళిద్దరూ వాళ్ళ పనిలో పడిపోయారు. రాజుగాడు కదల్లేదు.
ఆ అమ్మాయి ముందో ల్యాప్‌టాప్ ఉంది టేబుల్ మీద. మిగతా టేబుల్ అంతా ఏవేవో కాగితాలు పర్చుకోనున్నాయి. ఆ అబ్బాయేమో వాటి మీదకు ఒంగి చూస్తూ ఏవేవో అంకెలు చెప్తున్నాడు, ముందుకు పడుతున్న జుట్టు వెనక్కు తోసుకుంటూ. ఆ అమ్మాయి వాటిని కంప్యూటర్లోకి టైపు చేస్తోంది. ఆ అబ్బాయి కాసేపు ఆ టేబుల్ మీదకి ఒంగి వుంటున్నాడు, ఆపైన ఆ ఆమ్మాయి వెనక కుర్చీ మీద చెయ్యేసి ఆమె భుజం మీదగా కంప్యూటర్లోకి చూస్తున్నాడు. మళ్ళీ వెంటనే ఒకసారి టేబుల్ పక్కగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. చేతుల్లో పెన్సిల్‌తో తల గీక్కుంటూ, నోట్లో పెట్టుకుంటూ, చెవిపైన గుచ్చుకుంటూ తనలో తనే మాట్లాడుకుంటున్నట్టుగా వుంటూ అమ్మాయి దగ్గరికి వస్తున్నాడు, తటపటాయించినట్టుగా దూరంగా జరుగుతున్నాడు. ఉన్నట్టుండి ఒక్క క్షణం కదలకుండా నిలబడి ఆ అబ్బాయి ఇంకేవో అంకెలు చెప్పాడు. ఆ అమ్మాయి వినీ వినపడకుండా ఏదో అంది. అతను చొక్కా చేతులు పైకి లాక్కుంటూ వచ్చి మళ్ళీ ఆ అమ్మాయి కుర్చీ మీద చెయ్యి వేసి కంప్యూటర్లోకి చూస్తూ అవే అంకెలు నిదానంగా చెప్పాడు. ఆ అమ్మాయి టైప్ చేసి, ఆఖరి కీ ఏదో కొంచం గట్టిగా కొట్టి తల వెనక్కి వాల్చింది, అమ్మయ్య అన్నట్టు. అలా వాల్చడంలో పోనీటెయిల్ ఆ అబ్బాయి చెయ్యి మీద పడింది. ఆ అమ్మాయీ, అబ్బాయీ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ఏదో మార్పు వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. వెంటనే చూపులు తిప్పుకున్నారు. ఆ అబ్బాయి మళ్ళీ టేబుల్ మీదకు వొంగి కాగితాల మీద పెన్సిల్‌తో గీతలు గీస్తూ, మళ్ళీ ఏవో అంకెలు చెప్పాడు. మళ్ళీ అంతా మామూలే.
రాజుగాడు చిన్నగా తలుపు తట్టాడు. వాళ్ళిద్దరూ వాడివైపు చూశారు. వాడు చెత్తబుట్ట వైపు వేలు చూపించాడు. ఆ అబ్బాయి తలూపాడు, పర్లేదు లోపలికి రా అన్నట్టు. రాజుగాడు మెల్లిగా గది లోపలికి వచ్చి చెత్తబుట్ట తీసి ట్రాష్ బ్యాగులోకి వంచాడు. వాళ్ళిద్దరూ వాణ్ణే చూస్తున్నారని వాడికనిపించి చెవులు వెచ్చగా అయినై. గంభీరంగా చెత్తబుట్టను బ్యాగులోకి వంచి విదిలించాడు. ఆ పైన అంతే గంభీరంగా చెత్తబుట్టను వెనకనుంచి అరచేత్తో తట్టాడు. ఏదైనా కూని రాగం తీద్దామనుకున్నాడు కానీ గొంతు పెగల్లేదు. చెత్తబుట్ట మళ్ళీ టేబుల్ పక్కన పెడుతూ కళ్ళెత్తి చూశాడు. ఆ అబ్బాయీ అమ్మాయీ ఒకర్నొకరు చూస్కుంటున్నారు. ఆ అమ్మాయి కళ్ళలో నవ్వు. ఆ అబ్బాయి పెదాలపైన కూడా. రాజుగాడు రావడం వాళ్ళ ధ్యానాన్ని కాసేపు చెడగొట్టినట్టుంది. రాజుగాడు మళ్ళీ గుమ్మం దగ్గరికొచ్చేసరికి ఆ అబ్బాయి మళ్ళీ ఏవో అంకెలు చెప్తున్నాడు, ఆ అమ్మాయి కంప్యూటర్లోకి టైపు చేస్తోంది, మొఖం మీదకు కొత్తగా పడిన పాయను పైకి నెట్టుకోకుండానే. కానీ రాజుగాడికి అంతకు ముందు లేనిదేదో ఆ గదిలో ఇప్పుడున్నట్టు అనిపించింది.
కారిడార్లోకి వచ్చిన రాజుగాడికి కాస్త దూరంగా సునంద గొంతు వినిపించింది.
“ఏమాఫీసులు బాబూ, ఇవి! కనీసం గుమ్మాల దగ్గర పట్టాలు కొనుక్కునే డబ్బులు కూడా లేవా ఏంది! గోనెపట్టాలన్నా తెచ్చి పడేసుకోవద్దా కాళ్ళు తుడుచుకోడానికి. బురద చెప్పులేసుకొనే తిరుగుతారు, వాళ్ళ సొమ్మేం పోయింది. నడ్డిరగ్గొట్టుకుంటూ తుడిచేది వాళ్ళు కాదుగా. ఒక్క మరక కనిపిస్తే చాలు కొంపలంటుకుపోయినట్లు చాడీలైతే చేస్తారు…”
“పైనసాలేసి తుడిస్తే పోతుంది లేవే నందూ. నేను తుడుస్తానుండు..” అమ్మ గొంతు.
రాజుగాడికి అక్కడుండబుద్ధి కాలేదు, వాళ్ళిద్దరి గొంతులూ వింటూ. వాడికి మళ్ళీ వెనక్కు వెళ్ళి ఆ అబ్బాయినీ అమ్మాయినీ చూడాలని వుంది. ఇలా ఒంటరిగా, రాత్రుళ్ళు కలిసి పనిచేసే వాళ్ళ మధ్య, పగలంతా లేని వింత ఆకర్షణ ఏదో ఉంటుంది కాబోలు. మిగతా ప్రపంచానికంటే వాళ్ళిద్దరే కలిసి ఎక్కువ బరువు మోస్తున్నట్టు, అలా మోయడంలో, ఆ శ్రమ పంచుకోడంలో వాళ్ళిద్దరి మధ్య దాక్కొని వున్న ఏదో ఒక రహస్యం కొత్తగా బైటికి వచ్చినట్టు… ఇవన్నీ అర్థమయ్యే వయసు కాదు వాడిది. ఇదంతా వాడికి తెలీదు, అయినా వాడికి వాళ్ళ కళ్ళల్లో ఏదో కనిపించింది. అది మళ్ళీ చూడాలని వాడికి బాగా అనిపించింది. ఇంకో బ్యాగు తీసుకుని జిరాక్స్ మెషీన్లున్న గదివైపు పోయాడు. వస్తూ వస్తూ అటునుంచి చుట్టు తిరిగి మళ్ళీ ఆఫీసులోకి వెళ్ళాడు వాళ్ళిద్దరూ పనిచేస్తున్న గది వైపుగా, కావాలని కాకుండా, అటువైపు నుంచి వెళుతున్నట్టుగా.
ఆ గదిలోనుంచి ఏ చప్పుడూ వినిపించలేదు. ఇంటికెళ్ళిపోయారా ఇంతలోనే? తలుపు వారగా తల వంచి చూశాడు. ఆ అమ్మాయి తన చేతిని ఆ ఆబ్బాయి వైపు చాచి ఉంది. నాజూకు చేతి చివర్న ఎర్రరంగు నెయిల్ పాలిష్. ఆ అబ్బాయి ఆ అమ్మాయి రెండు భుజాల మీద చేతులు వేయబోయేలా వున్నాడు. రాజుగాడి భుజం తగిలి తలుపు కదిలి చప్పుడైంది. చప్పున వాళ్ళిద్దరూ సర్దుకున్నారు. ‘ఓ! నువ్వేనా!’ అన్నాడు ఆ అబ్బాయి. ఇంకేమీ అనకుండానే వాళ్ళిద్దరు వాళ్ళ బ్యాగులు, స్వెట్టర్లు తీసుకొని బైటికి వచ్చేశారు. కారిడార్ చివర్లో మెట్లు దిగబోతుండగా ఆ అబ్బాయి ఆ అమ్మాయి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అలా మెట్లు దిగిపోతూ క్రమంగా మాయమైపోయారు. వాళ్ళలా వెళ్ళిపోకుంటే బాగుండేది అనుకున్నాడు రాజుగాడు. ఇప్పుడు సునంద గొంతు తప్ప వినడానికింకేమీ లేదు.
బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ అని రాసున్న గది పక్కగా వెళుతూ రాజుగాడు ఆ గదిలోకి చూశాడు. గది మధ్యలో పెద్ద టేబుల్ చుట్టూ లెదర్ కుర్చీలు. బాగా పాలిష్ పెట్టిన టేబుల్ అద్దంలా మెరిసిపోతోంది. రాజుగాడు టేబుల్ మీదకి తల వంచి వాణ్ణి వాడు చూసుకున్నాడు. టేబుల్ మీదకు చేపపిల్లలా ఎగిరి దూకి ఈ చివరినుంచి ఆ చివరంటా జారితే ఎలా ఉంటుందో? ఎగరబోయి తమాయించుకుని టేబుల్ మీద తన చూపుడు వేలుతో గీతలా రాసుకుంటూ ఆ చివరిదాకా వెళ్ళి టేబుల్ మీదకు తల పెట్టి వారగా చూశాడు. సన్నగా మరక పడింది. ఏమనుకున్నాడో ఏమో, చొక్కా చేయి మోచేతి మీదకు లాక్కొని ఆ మరకను చొక్కాతో తుడిచి ఆ గదిలోంచి బైటికొచ్చాడు. ఇంకెంతో పని మిగిలి లేదు. అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ ఒక్కటీ మిగిలిపోయింది.
అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అన్నిటికన్నా వెనకాల, ఒక మూలగా ఉంటుంది. మిగతా ఆఫీసుల్లాగానే పెద్ద గది, దాని నిండా చిన్న చిన్న అగ్గిపెట్టెలాంటి గదులు. ఎక్కణ్ణుంచో ఇంకా టిక్కు టిక్కుమని చప్పుడు వినిపిస్తోంది. అంటే ఎవరో ఇంకా పనిచేస్తున్నారు. అన్ని క్యూబికిల్స్ దాటుకుంటూ లోపలికి వెళ్ళాడు రాజుగాడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ. వాటికి వెనకాల గోడవారగా కొంచెం పెద్ద గదులున్నాయి.
“ఎవరక్కడ?”
ఉన్నట్టుండి వినిపించిన ప్రశ్నకి భయపడ్డాడు రాజుగాడు. బెరుకు బెరుగ్గా “నేనండీ” అన్నాడు.
“నేనెవరు?”
గొంతు వినిపించిన గది గుమ్మం దాకా నడిచి అక్కడే నిలబడ్డాడు రాజుగాడు. గదిలో ఒక టేబుల్ ల్యాంప్ మాత్రం వెలుగుతోంది టేబుల్‌ని మాత్రమే వెలిగిస్తూ. టేబుల్ వెనకాల దుబ్బుగా పెరిగిన చింపిరి జుట్టు, ఇంచుమించు తెల్లబడిపోయి ఒత్తుగా గడ్డం మీసాలు; వాటి మధ్యలో దళసరి కళ్ళజోడు, దాంట్లో మెరుస్తున్న రెండు టేబుల్ ల్యాంపులు.
“నా పేరు రాజండీ…”
“రాత్రప్పుడు ఇక్కడేం చేస్తున్నావ్? పిల్లలు ఈపాటికి పడుకుని నిద్రపోతుండద్దూ?”
“మా అమ్మ యమున జానిటరండీ. నేను…”
“ఓ! యమున కొడుకువా. ఈ రోజు పొద్దు పోయిందా? ఎప్పటిదాకా పని చేస్తారూ?”
“పన్నెండూ ఒంటిగంట దాకండీ. అప్పుడప్పుడూ రెండవుతుందండీ. కొన్నిసార్లు పొద్దున పూట ఓవర్‌టయిం చేస్తామండీ”
ఆ గొంతు ఎవరిదో తెలిసినాక రాజుగాడికి భయం పోయింది. ఆయన లెక్కల పిచ్చిపంతులు. సునంద అలానే పిలుస్తుంది. ఆయన అసలు పేరు నరసింహమూర్తి. సీఐఎఫ్‌ఎమ్‌టీకి చీఫ్ అకౌంటెంట్ ఆయన. పగలు చూసి ఎన్నేళ్ళయిందో అన్నట్టు ఉంటాడు. నలిగిపోయిన పాంటూ చొక్కా. చొక్కా జోబు నిండా కుక్కినట్టుగా ఏవో కాయితాలు. చూడగానే భయం పుట్టేట్టు వుంటాడు కానీ చాలా సౌమ్యంగా మాట్లాడతాడు. తొందర్లో రిటైర్ అవుతాట్ట ఆయన. ఆయన పోతే ఇంకెవరూ అలాంటివాళ్ళు దొరకరని అందరూ అనుకుంటున్నారట. సునంద చెప్పింది. యమున మాత్రం ‘ పోన్లెద్దూ. రిటైరైతే చల్లగా ఇంటిపట్టున ఉంటాళ్ళే ప్రశాంతంగా. ఈ పాపిష్టి పని ఆయన ప్రాణాలు తోడేసింది పాపం’ అన్నది. యమునకి సహాయంగా ఆయనప్పుడప్పుడూ ఆ ఆఫీసులో చెత్త ముందే ఎత్తిపెట్టి వుంచుతాట్ట. అలా పరిచయం.
“పొద్దున పూట ఓవర్‌టైమ్. హుఁ, అది మేం రాత్రిపూట చేసేది…”
“రోజూ కాదండీ, అప్పుడప్పుడూనే. పనెక్కువుంటేనేనండీ, లేకుంటే గచ్చు పాలిష్ చేసినప్పుడేనండీ.”
“అవునా, నేను రోజూ ఓవర్‌టైమ్ చేస్తాను. అయినా కాదు.”
“ఏదండీ, లెక్కలేయడమా?”
“కాదు. తప్పులు దిద్దడం.”
“ఆన్సర్లు సరిగ్గా రావా అండీ?”
“ఊహూ. ఎప్పుడూ రావు. వచ్చేదాకా ఆగే ఓపిక కూడా ఎవరికీ లేదు.”
ఆయన టేబుల్ మీద లెడ్జర్లు నాలుగు తెరిచి వున్నాయి. అవి కాక టేబుల్ పక్కన చిన్న బల్ల మీద, గోడకు ఆనించీ ఇంకా నాలుగు లెడ్జర్లు. ఒక్కోటీ రెండడుగులు పొడుగూ వెడల్పూ, అరడుగు పైన మందం. టేబుల్ మీద ఒక ప్రింటింగ్ కాల్‌క్యులేటర్. ఇవే కాక ఆయన వెనక సన్నటి బల్ల మీద చీకట్లో కంప్యూటర్ స్క్రీను, దాని మీద ఏవో నంబర్లు కిందనుంచి పైకి పారిపోతున్నాయి. ఇవన్నీ ఉండి కూడా లెక్కలెలా తప్పు పోతాయో… అడగాలి. ధైర్యం తెచ్చుకున్నాడు రాజుగాడు.
“మరి కంప్యూటర్లన్నీ ఈ లెక్కలన్నీ అవే చేస్తాయి కదండీ.”
“అన్నీ తప్పుడు లెక్కలు.”
“అంత పెద్ద కంప్యూటర్లు కూడ తప్పులు చేస్తాయాండీ?”
నరసింహమూర్తి గారు కళ్ళు మూసుకొని బలంగా ఊపిరి పీల్చి వదిలాడు. కళ్ళు తెరిచి రాజుగాడి వంక చూశాడు.
“ఇప్పుడు కాదు. మొదట్నుంచీ. ఈ తప్పు ఇప్పటిది కాదు, అప్పట్నుంచీ ఉన్నది.”
ఆయన లేచి నిలబడి కుర్చీ వెనక వేలాడుతున్న స్వెట్టరు తీసుకుని వేసుకున్నాడు. గుండీ ఒకటి ఊడిపోయి చొక్కా అస్తవ్యస్తంగా ఉంది. బొత్తాలు పెట్టుకోడం రాదేమో అనుకున్నాడు రాజుగాడు.
“నాతో రా.”
రాజుగాడు, మూర్తి గారు క్యూబికిల్స్ పక్కగా నడుచుకుంటూ, ఆ గది మూలకు వెళ్ళారు. ఆ వెనకాల ఇంకో సన్నటి కారిడార్ ఉంది. మూర్తి గారి నడకనందుకోడానికి రాజుగాడు ఇంచుమించుగా పరిగెత్తాల్సొచ్చింది. దాని చివర్న ఒక తలుపు తీసి చేయి లోపలికి పెట్టి తడిమి మూర్తి గారు లైట్ వేశాడు. ఒకటే బల్బు మెట్ల మీద గోడలో. ఎవరూ ఎప్పుడూ అటువైపుకే రారేమో. ఇనుప మెట్లు చల్లగా చీకటిగా ఉన్నాయి. ఆయన వెంటే మెట్లు దిగాడు రాజుగాడు. ఆ మెట్లు గుండ్రంగా దిగుతూ దిగుతూ, లైటు స్విచ్చులు ఎక్కడెక్కడున్నాయో బాగా తెలిసినవాడిలా, అక్కడక్కడా ఆగుతూ మూర్తి గారు ఒక్కో లైటు వేసుకుంటూ, మళ్ళీ దిగుతూ, ఎంతో సేపటికి ఇంకో తలుపు. మూర్తి గారు జేబులోంచి తాళాల గుత్తి ఒకటి తీసి దాంతో ఆ తలుపు తెరిచాడు. జోబులోంచి అగ్గిపెట్టె తీసి ఒక పుల్ల వెలిగించి, ఆ వెలుగులో తలుపు పక్కనే ఉన్న ఒక కొవ్వొత్తి వెలిగించి పట్టుకున్నాడు. లోపల ఒకే ఒక గది, గదినిండా లైబ్రరీలోలా అల్మారాలు, వాటినిండా, వాటి చుట్టుపక్కలా, అంతా పెద్ద పెద్ద లెడ్జర్లు, రిజిస్టర్లు, పద్దు పుస్తకాలు కిక్కిరిసిపోయి రాజుగాడికి కనపడినంత మేరా దుమ్ము గొట్టుకొని పోయున్నాయి. మూర్తి గారు గోడ వారగా ఉన్న ఒక లెడ్జర్ పక్కనే ఉన్న స్టూలు మీద పెట్టి తెరిచారు.
“ఇవి ఈ కంపెనీ పుట్టినప్పటినుంచీ వందేళ్ళకు పైగా రాసి పెట్టిన జమాఖర్చులు. ఇట్రా, ఇది చూడు. ఈ చేతి రాత ఎవరిదో తెలుసా? సర్ ఎడ్మండ్ బార్టిలేది. ఆయనే ఈ కంపెనీకి మొట్ట మొదటి అకౌంటెంటు. పద్దులు నడపడంలో ఆయన తర్వాతే ఎవరైనా… ఇదిగో ఇక్కడ చూడు. చూశావా ఎంత ఒద్దిగ్గా ఉన్నాయో లెక్కలన్నీ. ఒక్క పైసా అటూ ఇటూ పోనిచ్చేవాడు కాదు. అంత శ్రద్ధగా, బాధ్యతగా ఉద్యోగం చేసేవాళ్ళు ఇప్పుడెవరూ లేరు. ఇక్కడ చూశావా. ఈ పేజీ అంచు మీదగా ఆయన గుర్తుకోసం రాసిపెట్టుకున్న పాయింట్లు. ఇక్కడ చూడు, తన తర్వాత అకౌంట్లు చూడబోయేవారికి అవి అర్థం కావడానికి వివరంగా ఎలా నోట్సు రాసిపెట్టాడో.”
రాజుగాడి ఎంతో ఆసక్తిగా చూశాడు కుదురుగా ఉన్న అంకెలు, అక్కడక్కడా సాగదీసిన తలకట్లతో కలిపిరాతతో ముగ్గుగీతలా ఉన్న అక్షరాలు పదాలు వాక్యాలు.
“ఇది చూపించింది నీకొక్కడికే. ఇప్పటిదాకా నేనెవరికీ ఈ సంగతి చెప్పలేదు. అర్థమయిందా. కానీ ఎప్పుడో ఎవరికో నేను చెప్పక తప్పదు. నా వయసైపోయింది కదా.”
“ఎవరికీ చెప్పనండీ. నామీద ఒట్టు” అన్నాడు రాజుగాడు తనకు తెలీకుండానే గొంతు తగ్గించి, రహస్యం చెప్తున్నవాడిలా.
“బార్టిలే లా ఇంకెవరూ పుట్టలేదు. ఆయనలాంటి వాడు ఇంకెవరూ లేరు అప్పుడు, ఇప్పుడూ కూడా…” అంటూ కొవ్వొత్తిని పైకెత్తి నాలుగడుగులు ముందుకు నడిచారు. కదిలిన కొవ్వొత్తి వెలుగుతో పాటు గది కూడా మారిపోయింది. అక్కడ గోడ మీద బాగా పాత ఫోటోలో నిలబడున్న ఒక పెద్దమనిషి, పిల్లి గడ్డం, ఒంటి కంటిజోడు, దొరలటోపీ, లోపలి కోటు జోబుల్లో బొటనవేళ్ళు గుచ్చుకొని, నోట్లో పైపుతో, రాజుగాడిని తీక్షణంగా ఒక చూపు చూశాడు.
“అంత తెలివైనవాడు… ఇదిగో ఇక్కడ…” మూర్తిగారు ఎప్పటిదో ఇంకో లెడ్జరు తీసి ఒక నెమలీక గుర్తుగా పెట్టి వుంచిన పేజీ ఒకటి తెరిచారు.
“…ఈ తేదీ చూడు. నవంబరు 16, 1884.” వేలితో ఒక్కో అంకెల వరసను చూపించుకుంటూ వస్తూ… “ఇదిగో, ఇదిగో, ఇక్కడే! చిన్న తప్పు కూడికలో. ఎంతకిరా అంటే మూడు పైసలకి,” వేలు పేజీలో కింది దాకా పాకింది. కింద మొత్తంగా వేసిన అంకెల చుట్టూ ఎర్ర పెన్సిల్‌తో సున్నాలా గీసి వుంది. “ఈ ఎర్రపెన్సిల్ గీత నాదే. చూడు, చూడు. ఇక్కడ ఆరు కాదు వుండాల్సింది తొమ్మిది.” మూర్తిగారి గొంతులో సన్నగా వణుకు, అలిసిపోయినవాడిలా సన్నగా రొప్పుతున్నాడు.”ఎవరూ కనిపెట్టలేదు. ఇది కనిపెట్టింది నేనొక్కణ్ణే. ఇప్పుడీ సంగతి నాకు కాక నీకొక్కడికే తెలుసు. ఇంకెవరికీ చెప్పకు! నువ్వు మర్చిపోకు! ఒకవేళ నువ్వెవరికైనా చెప్తే వాళ్ళెలానూ నమ్మరు. చిన్నపిల్లాడివని నవ్విపోతారు. కానీ ఇప్పుడు అర్థమయిందా మన లెక్కలన్నీ శుద్ధ తప్పని? ఈ మూడు పైసల తేడా ఇన్నేళ్ళలో పెరిగీ పెరిగీ ఇప్పుడెంతయిందో తెలుసునా? నువ్వు ఇందాక నా గదిదాకా వచ్చేటప్పటికి పన్నెండు వందల నూట పధ్నాలుగు వేల కోట్ల ఎనిమిది వందల తొంభై నాలుగు లక్షల ఐదు వందల ఎనభై ఆరు వేల తొమ్మిదొందల పదహారు, రూపాయలు కాదు, పౌండ్లు. నువ్విందాక అన్నావే కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ బుర్రలు, వాటిని నడిపే మేధావులందర్నీ వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని లెఖ్ఖలు వేసుకోమను. అసలు తప్పు ఇక్కడుంది, ఈ లెడ్జర్లో ఈ పేజీలో ఉంది. ప్రతీ నిమిషం ఈ తప్పు పెరిగి మరింత పెద్దదౌతోంది. రేప్పొద్దున బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు నిద్దర్లేవగానే, ఈ తప్పు మరింకా పెరిగిపోతుంది. లండన్లో, న్యూయార్క్‌లో, టోక్యోలో, ముంబైలో సెంట్రల్ బ్యాంకుల వడ్డీ ఒక వందో వంతు అటూ ఇటూ జరగ్గానే, ఈ తప్పు ఇంతకింత పెద్దదవుతుంది…”
కొవ్వొత్తి ఆర్పేసి, తలుపు గట్టిగా లాగి తాళం వేసి ఇద్దరూ మళ్ళీ గుండ్రటి మెట్ల మీదగా పైకెక్కుతుంటే ప్రతీ కాసిని మెట్ల దగ్గరా ఆగి మూర్తి గారు ఒక్కో లైటు ఆర్పుకుంటూ, వస్తున్నారు.
“ఇప్పుడీ కంపెనీ ఎంత పెద్దదయిందో తెలుసునా? షేర్ హోల్డర్లు లక్షల్లో ఉన్నారు, ఈ కంపెనీకి నూటయాభై పైచిలుకు సబ్సిడరీలున్నాయి, డెబ్భై నాలుగు దేశాలలో మెయినాఫీసులు, ప్రపంచంలో బ్రాంచాఫీసులకి ఇక లెక్కేలేదు. వీళ్ళంతా కూర్చుని ఇరవై నాలుగ్గంటలూ వాళ్ళ కంప్యూటర్లలో లెక్కలేస్తూనే ఉంటారు. అంకెలు కూడుతూ తీసేస్తూనే ఉంటారు. కానీ ఆ అంకెలన్నీ తప్పే. ఒక్క అంకె కూడా నిజం కాదు. అంతా తప్పే…” కారిడార్లోనుంచి నడుస్తున్నారు మూర్తి గారి గది వైపుగా.
“సగం ఊరు అంతా ఈ అబద్ధపు లెక్కల మీదే బతుకుతోంది. ఊహు, కాదు కాదు! సగం ఊరు కాదు, సగం దేశం ఈ తప్పుడు లెక్కల మీదే బతుకుతోంది. మన బడ్జెట్లు తప్పు, మన ఎగుమతి దిగుమతుల లెక్కలు తప్పు. మన అప్పులు తప్పు, మన రాబడి తప్పు. ప్రపంచం సగం ఇప్పుడు ఆధారపడి బతుకుతున్నది ఈ మూడుపైసల తప్పు మీద. సర్ బార్టిలీ జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు. ఆ మహామేధావి, అపర గణాంకుడు, అంకెల మాంత్రికుడి జీవితంలో ఒకే ఒక తప్పు.”
మూర్తిగారు కుర్చీలో నిస్త్రాణగా కూలబడ్డాడు. వాడికి ఆయన ఉన్నట్టుండి ఇంకా వయసైపోయినట్లుగా అనిపించాడు. ఆయన మొఖం పాలిపోయింది. తల దించుకుని కూర్చున్న వాడల్లా ఉన్నట్టుండి లేచి నిలబడి టేబుల్ మీదగా ఒంగి రాజుగాడి వైపు చూశారు.
“నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ తప్పు ఆయన కావాలని చేసిందే అని.”
తగ్గించి చెప్పిన గొంతు కొంచెంగా పెరిగింది.
“చూడూ, నువ్వెవరో నాకు తెలీదు. నేనెవరో నీకు తెలీదు. మనం ఎప్పుడూ కలవలేదు.”
తల దించుకొని ఆయన పనిలో ముణిగిపోయాడు. రాజుగాడు ఒక్క నిమిషం అలానే నిలబడ్డాడు. ఏదీ ఏమీ మారలేదు. చిన్నగా వెనక్కి తిరిగి ఆ క్యూబికిల్స్ మధ్యలోంచి ఆ గదిలోంచి ఆఫీసుల్లోంచి బైటికి నడుచుకుంటూ వచ్చాడు. నిటారుగా నిలబడి నడవబోయాడు. వాడి వెన్నులోనుంచి సన్నగా వణుకు వచ్చింది. ఆగి మళ్ళీ నడిచాడు. ఏదో కూనిరాగం తీయబోయాడు కానీ గొంతు పెగల్లేదు. కారిడార్లోంచి ఎక్కడో ఫోన్ రింగవుతున్న చప్పుడు.
“హలో, హలో ? వాట్ యూ వాంట్? హలో, హలో, వాట్ యూ వాంట్?” యమున గొంతు. రాజుగాడు అటువైపుకి పరిగెత్తాడు. సునంద ఇంతలో యమున చేతిలోంచి ఫోన్ లాక్కుంది. ప్రపంచంలో ఏ మూల నుంచో, దేశాల మధ్య కాలాల్లో తేడాలు మర్చిపోయిన ఏ కంపెనీ అకౌంటెంటో.
“యెస్, యెస్, దిస్ ఈజ్ సీఐఎఫ్‌ఎమ్‌టీ… దిస్ ఈజ్ సీఐఎఫ్‌ఎమ్‌టీ. యెస్… వియ్ ఆర్ ఇండియా హెడ్డాఫీస్… వాట్? వాట్ కంట్రీ? ఫ్రాన్సా? బ్రెజిలా? నో బ్రెజిల్? బ్రజెల్సా?నో స్పీక్ ఇంగ్లీష్? దిస్ ఈజ్ నైట్ హియర్. నో వన్ ఈజ్ హియర్ వర్కింగ్. నైట్ టైం నో… ఆఫీస్ క్లోస్‌డ్ నౌ… యూ ప్లీజ్ కాల్ టుమారో… యెస్. కా – ల్ – టు – మా – రో… నో, వియ్ డోంట్ నో. వియ్ ఆర్ జానిటర్ స్టాఫ్ ఓన్లీ. అండర్‌స్టాండ్? క్లీనర్స్, వియ్ ఆర్ క్లీనర్స్ ఓన్లీ!”
(Numbers in the dark, 1958.)