ఒక నేరం కథ
ఇంకో నాలుగైదు గంటల్లో ఇన్స్యూరెన్స్ ఏజంటు సాయిరామారావు వస్తాడు రిజల్ట్ కోసం. విధవ వసుంధరాదేవి రహస్యాలు, కాలిపోయిన ఆవిడ ఇంటి వివరాలు, నేనింకా డేటా ఎక్కిస్తూనే వున్నాను కంప్యూటర్లోకి. గదులని అద్దెకిచ్చే ఆ ఇంటికంత మంచి పేరేమీ లేదు. మర్యాదస్తులెవరూ ఆ ఇంట్లో అద్దెకుండమని చెప్పరు. రైల్వే పట్టాల కవతలగా, మారిపోతున్న ఊరు మర్చిపోయిన ఒక కాలనీలో ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు కేవలం ఒక బూడిద కుప్ప. ఆ ఇల్లు బానే ఉండేదో పాడు బడినట్టుండేదో, ఇంతకు మునుపెలా వుండేది అనే సంగతి ఇన్స్యూరెన్స్ కంపెనీ చెప్పలేదు. నల్లగా పొగ చూరిపోయి అక్కడక్కడ ఇంకా నిలబడున్న మొండి గోడలు, కాలి బొగ్గైపోయిన కలప, బూడిద కుప్పలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఇంటితో పాటు కాలిపోయిన నాలుగు శరీరాలు కూడా అసలేం జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోడానికి ఏ ఆచూకీ వొదిలి పెట్టలేదు.
ఆ బూడిద కుప్పల్లో దొరికిన ఒకే ఒక్క ఆధారం పేజీలన్నీ కాలిపోయిన ఒక చిన్న స్కూలు నోట్‌బుక్కు. సగం కాలిపోయిన అట్ట మాత్రమే మిగిలింది. పై అట్ట మీద “ఈ ఇంటిలో జరిగిన నేరాల చిట్టా” అని వ్రాసి వుంది. వెనకాల అట్ట మీద నిలువు వరుసలో రాసిన పన్నెండు నేరాలు – బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించడం, మత్తుమందు ఇవ్వడం, ఆత్మహత్యకు ఉసిగొల్పడం, కత్తిపోటు, వ్యభిచారం, తుపాకీతో బెదిరింపు, కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కడం, బలాత్కారం, వలలో వేసుకోవడం, నిందించడం, దొంగచాటుగా వినడం, పీక నొక్కి వేయడం.
అప్పటికి ఆ ఇంట్లో వుంటున్న ఎవరు ఈ చిట్టా రాశారో తెలీదు. ఎందుకోసం రాసుంటారో అసలే తెలీదు. పోలీసులకు చెప్పడానికి రాశారా, తనే తప్పూ చేయలేదని చూపించుకోడానికి రాసి పెట్టుకున్నారా అన్నది తెలీదు. పోనీ, నేరం చేయడంలో తమ తెలివితేటలు చూసి పొంగిపోడానికి తమకోసమే రాసుకున్న వివరాలా అవి? అదీ తెలీదు. మనకు తెలిసిందల్లా అట్ట మీద ఉన్న ఆ పన్నెండు నేరాల చిట్టా. ఎవరిపైన ఏ నేరం జరిగిందో తెలుసుకుందామన్నా కుదరదు. ఆ నేరాలకు ఎదురుగా పేర్లేమైనా ఉన్నాయా, ఈ నేరాలు ఏ వరసలో జరిగినయో తెలుసుకోడానికి కనీసం పేజీ నంబర్లు లాంటివేమైనా, పోనీ? అబ్బే, ఏమీ లేవు. ఆ వైపు అట్ట కాలిపోయింది. ఇల్లు తగలబెట్టడం ఈ చిట్టాలో లేకపోయినా, అది పదమూడో నేరం అని ఖచ్చితంగా మనం ఊహించవచ్చు. కానీ, చేసిందెవరు? ఎందుకు చేశారు? ఈ కథ జరిగిందెలా? అది పూర్తిగా తిరిగి తెలుసుకోడం ఎలా?
ఈ పన్నెండు నేరాలూ ఒకే వ్యక్తి చేసినవి, ఒకే వ్యక్తికి చేసినవి అని అనుకుందాం. కానీ అదంత తేలిక కాదు. కాలిపోయిన ఇంట్లో దొరికినవి నాలుగు శరీరాలు. ఒకరికెదురు ఒకరుగా వెరసి పన్నెండు జతలు. ఒక్కో నేరానికి పన్నెండు జతల చొప్పున పన్నెండు నేరాలకు అన్ని పర్మ్యుటేషన్లు, కాంబినేషన్లు లెక్క కడితే వచ్చే సమాధానం – పన్నెండుకు పన్నెండు రెట్టించి – ఎనభైతొమ్మిది లక్షల పదహారు వేల కోట్ల, పది లక్షల, నలభై ఐదు వేలు. ఇన్ని సాధ్యాలలో ఏది నిజం? ఏది కాదు? ప్రమాదవశాత్తూ ఇల్లు కాలిపోయింది అని రిపోర్టు రాసేసి పోలీసులు చేతులు దులిపేసుకున్నారంటే అందులో వింతేముంది? అసలే వాళ్ళకు జీతాలు తక్కువ, చాకిరీ ఎక్కువ. పైగా నేరం చేసినవారెవరో కానీ ఆ మంటల్లో కాలిపోయే ఉంటారు. ఇంక ఆ కేసుని ఇంకా లాగడం ఎందుకు?
నేరం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఆదుర్దా చూపిస్తున్నది కేవలం ఇన్స్యూరెన్సు కంపెనీ. అగ్నిప్రమాదం భీమా తీసుకున్న ఆ ఇంటి ఓనరు కిశోరరామరాజు ఆ మంటల్లోనే కాలిపోయాడన్న నిజం ఇన్స్యూరెన్సు కంపెనీకి తలనొప్పి ఇంకా ఎక్కువ చేసింది. తాగుడు, డ్రగ్సు, వెధవ తిరుగుళ్ళు తిరిగి కుటుంబ ప్రతిష్ట మంట గలుపుతున్నాడని రామరాజుని వాళ్ళింట్లోవాళ్ళు వెలి వేశారు. ఒక దశలో తప్ప తాగి, మూసేసిన షాపుల గుమ్మాలపై పడుకున్న రామరాజుకి మిగిలింది ఈ ఇల్లొకటే. విధవ వసుంధరాదేవికి ఇల్లద్దెకిచ్చి, ఆ యింటి యాజమాన్యమూ ఇచ్చాడు. ఆమెనుంచి తిరిగి తనింట్లో తానే ఒక గది అద్దెకు తీసుకున్నాడు. ఆమెకి అప్పటికే చాలా చౌకగా ఇల్లంతా అద్దెకిచ్చినా, ఈ గది ఇచ్చినందుకు ఇంకా కొంత రాయితీ ఇచ్చాడు. వంశోద్ధారకుణ్ణి కూడా కాదనుకున్న ఆ రాజవంశస్థులు ఎప్పుడూ ఒక్క నయాపైసా కాదనుకున్న పాపాన పోలేదని, పోనివ్వరనీ అందరికీ తెలిసిన సంగతి. తాగిన మైకంలో ఒకవేళ నేరాలన్నీ చేసింది, ఇల్లు తగులబెట్టింది రామరాజే అని నిరూపించగలిగితే ఇన్స్యూరెన్సు కంపెనీ రామరాజు కుటుంబానికి ఒక్క పైసా నష్ట పరిహారం చెల్లించనక్కర్లేదు.
అయితే ఇదొక్కటే పాలసీ కాదు, ఇన్స్యూరెన్సు కంపెనీకి చుట్టుకున్నది విధవ వసుంధరాదేవి తీసుకున్న జీవితభీమా కూడా. వసుంధరాదేవి ప్రమాదవశాత్తూ పోతే ఆ పాలసీ లబ్ధిదారి అయిన ఆమె కూతురు తారామనోహరి కూడా ఆ మంటల్లోనే కాలిపోయింది, ఆమెకున్న రెండు వందల ముప్ఫైరెండు కొప్పులు, సవరాలతో సహా. (ఆమె కేశవర్ధిని తలనూనె మోడల్. బాగా పల్చటి పొట్టి జుట్టు. అంత అందమైన ఆమెకి ఆ పీలికల జుట్టేమిటో.) మనోహరికి ఒక నిర్మాత వల్ల పుట్టిన కూతురు, మూడేళ్ళది, ఆమె తమ్ముడి దగ్గర చెన్నైలో పెరుగుతోంది. ఆ తమ్ముడికి ఈ విషయం తెలిస్తే నిమిషం వృధా చేయకుండా ఇన్స్యూరెన్సు కంపెనీ పీక పట్టుకుంటాడు. భీమా చెల్లించకుండా తప్పించుకోవాలంటే ఒకటే మార్గం: విధవ వసుంధరాదేవిని చంపేసింది తారామనోహరి అని (కత్తిపోటు? పీక పిసకడం?) నిరూపించడం. అదేపనిగా కొప్పులు, సవరాలు కూడా తారా మనోహరి వల్లనే కాలిపోయాయి అని చూపిస్తే ఆ భీమా గొడవ కూడా తీరిపోతుంది.
ఇక, మంటల్లో కాలిపోయిన ఆ నాలుగో శరీరం కుర్ర వస్తాదు శివనాగరాజుది. కిరాయి చెల్లించేది ఆ ఇంట్లో అతనొక్కడే. వసుంధరాదేవి చాలా తెలివైనది, వ్యాపారపు కిటుకులు నేర్చుకున్నది. అతన్నీ ఏమాటా అనకుండా చూసుకొనేది. అంతే కాదు, శివనాగరాజు ప్రతీ యేటా కుస్తీ పోటీలకు వెళ్ళడానికి ఆమె అతనికి డబ్బిచ్చేది కూడా. అతనికే ప్రమాదం జరిగినా, కుస్తీపోటీల్లో కాలు చేయీ విరిగినా, ఏదైనా జబ్బు చేసినా, ఒకవేళ పోయినా, తనకు నష్టం రాకుండా అతని మీద ఒక భీమా పాలసీ తీసుకుంది. ఇప్పుడు కుస్తీ పోటీల నిర్వాహకులు ఆ భీమా మీదగా తమకు నష్టపరిహారం చెల్లించమని కంపెనీని నిలదీస్తున్నారు. వారినుంచి తప్పించుకోవాలంటే, వసుంధరాదేవి వల్లనే శివనాగరాజు చనిపోయాడని (ఆత్మహత్యకు ప్రేరేపించడం, లేకపోతే మత్తుమందు ఇవ్వడం, బ్లాక్‌మెయిల్ చెయ్యడం?) నిరూపించడం తప్ప వేరే దారి లేదు.
సాలెగూటిలోకి ఒక్కో ఈగను పంపి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో చూసినట్టు, నేను ఒక్కొక్కటిగా ఎక్కిస్తున్న ప్రత్యామ్నాయాలను తన డేటా బాంక్ పళ్ళతో నమిలి ఒకే క్షణంలో ఏది ఎంతవరకు ఎందుకు సాధ్యమో, కంప్యూటర్ తన అభిప్రాయాలను మోనిటర్ మీదకు ఉమ్మేస్తోంది. కానీ ఎక్కిస్తున్న ఊహలు ఒక్కటొక్కటిగా నా మెదడంతా ఆక్రమించుకుంటున్నాయి. నిండిన బస్సులోకి ఎక్కుతున్న ప్రయాణీకులు సర్దుకుంటున్నట్టుగా అవి మెదడులో జొరబడి అలానే నిలబడిపోతున్నాయి. నేను ఒద్దనుకున్నా వాటిని ఆపడం నా వల్ల కాటల్లేదు. సాయిరామారావుకి కావలసింది కంప్యూటర్ రిజల్ట్ కానీ నేను ఇచ్చే సలహా కాదు.
చనిపోయిన నలుగురూ నేరం చేయగల సమర్ధత ఉన్నవారిగానే అనిపిస్తున్నారు. ఏదైతే అసంభవం అనుకుంటామో అదే చివరికి నిజం కావచ్చు కదా. నేరాల చిట్టానే చూడండి. అన్నింట్లోకి చిన్న తప్పుగా కనిపిస్తున్నది ఏమిటి? వలలో వేసుకోవడం. అవునా? ఎవరు ఎవరిని వలలో వేసుకున్నారు. తీవ్రంగా ఆలోచిస్తున్న నా బుర్ర మెల్లిగా వేడెక్కడం మొదలు పెట్టింది. కలైడోస్కోపులో గాజుముక్కల్లా రకరకాల ఊహలను కలుపుతూ విడదీస్తూ సినిమా రీళ్ళలా మనసులో తిప్పుతూ చూస్తున్నాను. ఎర్రరంగు నెయిల్ పాలిష్‌తో తారామనోహరి నాజూకైన చేతి వేళ్ళు, కిశోరరామరాజు చెంపలని సుతారంగా నిమరడాన్ని చూస్తున్నాను. అవే చేతి వేళ్ళు శివనాగరాజు ఛాతీపై పాకడాన్ని కూడా చూస్తున్నాను. ఆ స్పర్శతో పొంగి బిగిసిన కండలతో, మత్తెక్కిన కళ్ళతో ఉన్న వస్తాదును ఊహిస్తున్నాను. కానీ, మరుక్షణంలోనే రామరాజు తన పెదాలతో చెవి తమ్మె నొక్కుతూ చెప్పిన ఊసుతోనో, శివనాగరాజు చేతులు వెనకనుంచి తన నడుము చుట్టూ పెనవేసుకుంటేనో, ఇష్టంతో ఎరుపెక్కిన తారామనోహరి చెక్కిళ్ళనూ నేను గమనిస్తున్నాను. అంతే కాదు, వయసు మళ్ళినా మనసు మళ్ళని శరీరం అడిగే కోరికల వేడితో విధవ వసుంధరాదేవి పెదాలకు లిప్‌స్టిక్ పూసుకొని సింగారించుకోడాన్నీ, నాజూకైన రామరాజునో, కండలు తిరిగిన నాగరాజునో, లేకపోతే ఇద్దరినీనో, వేరు వేరుగా వేరు వేరు రకాలుగా చుట్టుకొనిపోవడం చూస్తున్నాను. తనకంటే వయసులో పెద్దది అన్న విచక్షణ లేకుండా రామరాజో, నాగరాజో, విధవ అన్న లోకువతో వసుంధరాదేవిని లొంగదీసుకోడానికి ప్రయత్నించడం చూస్తున్నాను. చివరికి, నాగరాజు గానీ రామరాజు గానీ స్వలింగ సంపర్కులేమో అన్న ఊహనూ నేను ఒదిలి పెట్టలేదు.
నేర తీవ్రత పెరిగినా కూడా ఈ అన్ని రకాల పద్ధతులు సాధ్యమే. అవేమీ తక్కువ కావాలనేమీ లేదు. కత్తిపోటునే తీసుకోండి. ఎవరు ఎవరినైనా కత్తితో పొడవగలరు. నా ఊహల్లో ఇప్పటికే శివనాగరాజు మెడలోకి వెనకనుండి దిగిన కత్తిని చూస్తున్నాను. గాజులు గలగలమంటున్న చేతితో ఆ కత్తిని మెడలో అటూ ఇటూ మెలితిప్పుతున్నది తారామనోహరి కావచ్చును. లేదూ, ఆషామాషీగా ఆటలాడుతున్నట్టుగా కత్తిని కదిలిస్తున్న ఆ నాజూకైన చేయి రామరాజుదీ కావచ్చును. ఇంటిపనితో కరుడు గట్టిన వసుంధరాదేవి చేతివేళ్ళు నిద్రపోతున్న ఎవరి మొఖం పైననో దుప్పటి కప్పి పీక బలంగా నొక్కి పట్టడాన్ని కూడా చూస్తున్నాను.
కేవలం ఇవే కాదు నాకొస్తున్న ఆలోచనలు. తారామనోహరి కాని, వసుంధరాదేవి కానీ రామరాజుని గొర్రెను కోసినట్టు కోయడం; రామరాజు కాని, మనోహరి కానీ, వంటింట్లో వసుంధరాదేవి వాడే కూరగాయల కత్తితో ఆమెను కసికసిగా పొడవడం; వసుంధరాదేవి కాని, రామరాజు కానీ నగ్నంగా ఉన్న తారామనోహరి అందమైన శరీరాన్ని (ఆమె తప్పించుకోడానికి వీల్లేకుండగా కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి?) కోసివేయడం; ఇలా.
శివనాగరాజు ఒక్కడే కత్తితో మిగతా అందరినీ చీరేయడం అంత కష్టమైన ఊహ కాదు కానీ, అతని బలం, నేరాల చిట్టా, రెండూ గమనిస్తే పీక నొక్కి చంపడం అతనికి కత్తితో పొడవడం కన్నా సులభం అని అనిపిస్తుంది. పీక నొక్కి చంపడం అనే నేరం అతను చేయగలిగిందే కానీ అతనిమీద జరగగలిగే నేరం కాదు. మిగతా ముగ్గురు కలిసి ప్రయత్నించినా శివనాగరాజు బలిసిన మెడ వాళ్ళ చేతుల్లో పట్టదు.