1. తెరెసా! ఓ తెరెసా!
పేవ్‌మెంట్ దిగి పైకి చూసుకుంటూ ఓ ఆరడుగులు వెనక్కేసి వీధి మధ్యలో నిలబడి రెండు చేతులతో నోటిని మెగాఫోన్‌లాగా కప్పి పై అంతస్తుల కేసి చూస్తూ గొంతెత్తి అరిచాను: “తెరెసా!”
నడినెత్తికెక్కిన చంద్రుణ్ణి చూసి నా నీడ నాకాళ్ళ మధ్యలో దాక్కుంది. ఎవరో అలా ఆ పక్కగా నడుచుకుంటూ వెళుతున్నాడు. నేను మళ్ళీ అరిచాను: “తెరెసా!” ఆ వెళ్ళే ఆయన నాదగ్గరికొచ్చాడు.
“ఇంకొంచెం పెద్దగా అరవండి. లేకపోతే ఆవిడకు మీ పిలుపు వినపడదు. నేనూ సహాయం చేస్తానుండండి. మూడు లెక్కెట్టి ఇద్దరం ఒకటే సారి పిలుద్దాం.”
“ఒకటీ, రెండూ, మూడు.” ఇద్దరం పెద్దగా గొంతెత్తి అరిచాం: “తెరెసా!”
కొంతమంది కుర్రాళ్ళు, స్నేహితుల గుంపు అనుకుంటా, సినిమా చూసి వస్తున్నారో, లేదూ సెంటర్లో కాఫీ తాగి వస్తున్నారో, వీధి మధ్యలో నిలబడి మేం పిలవడం చూసి, “మేం కూడా గొంతు కలుపుతాం. అందరం కలిసి పిలుద్దాం” అంటూ మా దగ్గరికొచ్చారు. వీధి మధ్యలో నిలబడి పైకి చూస్తూ, మొదటాయన “ఒకటీ, రెండూ, మూడు!” అనగానే అందరం కలిసి పెద్దగా అరిచాం: “తెరెసా!”
ఇంకెవరో వచ్చి మా గుంపులో కలిశారు. ఓ పావుగంట గడిచేప్పటికి ఓ ఇరవైమంది దాకా అయ్యాం. ఒకళ్ళూ ఇద్దరూ అడపా దడపా వచ్చి కలుస్తున్నారు.
ఇంతమందిమయ్యేప్పటికి అందరూ ఒకే గొంతుతో అరవడం కుదరలేదు. ఒకరు ఒక క్షణం ముందు మొదలెట్టేవాడు. లేదూ, ఇంకొకాయన ఓ క్షణం ఎక్కువగా పిలుపు సాగదీసేవాడు. ఇక ఇలా కాదని అందరం ఓ ఒప్పందానికొచ్చాం – తె లోగొంతుకతో పొడూగ్గా, రె గొంతెత్తి పొడూగ్గా, సా లోగొంతుకలో పొట్టిగా సాగదీయకుండా పిలవాలి. ఒప్పందం బానే కుదిరింది, ఒకటీ అరా బెసుగులు మినహాయించి, పిలవడంలో ఒక పద్ధతి అంటూ వచ్చింది.
కాసేపటికి, ఒకే గొంతుతో పిలవడం మాకు కుదుర్తున్న వేళకి, మా గుంపులో చేరిన జీరగొంతు పెద్దమనిషి నావైపు తిరిగి, “ఏం సార్, ఆవిడ ఇంట్లోనే ఉందని మీకు ఖాయంగా తెలుసా?” అనడిగాడు.
“తెలీదండీ.”
“అయ్యో, అవునా,” ఇంకొకాయన, “తాళం చెవి మర్చిపోయారేఁవిటి?”
“లేదండీ. నా కీ నా జోబులోనే భద్రంగా ఉంది.”
“ఆఁ, మరైతే మీరే పైకెళ్ళిపోవచ్చుగా?”
“వెళ్ళచ్చు. కానీ నేనిక్కడుండనండీ. నేనుండేది సెంటర్‌కి అటువైపు వీధిలో”
“అయ్యా, మీ వ్యవహారంలో వేలెట్టడం కాదు కానీ, మరిక్కడ ఉంటుందెవరండీ?” జీరగొంతాయన కొంచెం గీరగా అడిగాడు.
“నాకు తెలీదండీ,” చెప్పాన్నేను.
ఈ విషయం మా గుంపుకి నచ్చినట్టు లేదు. కాస్త చిరాగ్గా నావైపు చూశారు.
“మరైతే మహాశయా. ఇలా ఇక్కడ వీధి మధ్యలో నిలబడి తెరెసా! తెరెసా! అని ఎందుకు పిలుస్తున్నారో మేం తెలుసుకోవచ్చునేం?” అన్నాడొకాయన కాస్త కటువుగానే.
“నిజం చెప్పాలంటే తెరెసాకి బదులుగా ఇంకో పేరు పెట్టి పిలుద్దాఁవంటే నాకేఁవీ అభ్యంతరం లేదు. నాకే పేరైనా పర్లేదు, అదేమంత పెద్ద విషయం కాదు.”
ఈసారి అందరికీ బాగానే కోపం వచ్చినట్లుంది.
“ఏఁటి గురూ, మా చెవుల్లో పూలెడతన్నావా?” కటువుగొంతాయనకు అనుమానమొచ్చింది.
“నేనా?” విసురుగా, కొంచెం కోపంగా అన్నాను గుంపులో మొఖాలకేసి చూస్తూ. ఎవరూ మాట్లాడలేదు. నా నిజాయితీ మీద వాళ్ళకి నమ్మకం ఇంకా ఉండే ఉండాలి.
“అబ్బ పోనియ్యండి సార్! ఓ పన్చేద్దాం. అందరం కలిసి ఆఖరు సారిగా పిలిచి, ఎవరి పని వాళ్ళు చూసుకుందాం,” అన్నాడు కుర్రాళ్ళ గుంపులో టీషర్టు కుర్రాడు.
సరే, అలానే అందరం కలిసి ఇంకోసారి పిలిచాం. “ఒకటీ, రెండూ, మూడు!”, “తే-రే-సా!”
ఒకరటూ, ఒకరిటూగా గుంపులో జనాలంతా ఎవరి దారి వారు పట్టుకుని పోవడం మొదలెట్టారు. నేనప్పటికే వీధి మొగదలకొచ్చి సెంటర్ వైపుకి నడుస్తుంటే లీలగా అరుపు వినిపించింది: “తే-రే-సా!”
ఎవరో ఇంకా అక్కడే ఉండి అరుస్తున్నట్టున్నాడు. ఎవరో కాస్త మొండిఘటం.
(మూలం: The man who shouted Teresa, 1943.)
2. జ్ఞానోదయం
ఉన్నట్టుండి ఒక రోజు చెప్పా పెట్టకుండా హఠాత్తుగా కిక్కిరిసిన నాలుగు రోడ్ల కూడలిలో జనాలంతా హడావిడిగా అటూ ఇటూ నడుచుకుంటూ పోతున్నప్పుడు, జరిగిందది.
నేను ఠకామని ఆగిపోయి, తల విదిలించేను. నాకున్నట్టుండి ఏఁవీ అర్థం కాలేదు. నా చుట్టూ మనుషుల గురించి, వస్తువుల గురించి, ఈ లోకం గురించి, ఏఁవీ, అసలేఁవీ, దేని గురించీ ఏమాత్రమూ అర్థం కాలేదు. అంతా ఒక అర్థం పర్థం లేకుండా అసంగతంగా తోచింది. అక్కడే నిలబడిపోయి పెద్దగా నవ్వడం మొదలెట్టాను.
నాకా క్షణంలో వింతగా కొత్తగా, అప్పటిదాకా నాకెప్పుడూ తట్టని నిజం ఒకటి ఉన్నట్టుండి తట్టింది. అదేమిటంటే నేనప్పటిదాకా ఈ ప్రపంచంలో ప్రతీదీ ఒక కారణం తోటే ఉందని నాకు తెలియకుండానే నేను నమ్ముతున్నానన్న నిజం. నా చుట్టూ నడుస్తున్న ఈ మనుషులు, కార్లు, ఈ ట్రాఫిక్ లైట్లు, ఈ దుకాణాలు, సినిమా పోస్టర్లు, యూనిఫాముల్లో స్కూలు పిల్లలు, మునిసిపాలిటీ వర్కర్లు, ఈ కూడళ్ళలో అలా నిలబడిపోయున్న ఈ నాయకుల విగ్రహాలు, చెల్లా చెదురుగా పడున్న ప్లాస్టిక్ సంచులు, వాటర్ బాటిళ్ళు, గాలికటూ ఇటూ ఎగిరిపోతున్న చిత్తు కాగితాలు ఇవన్నీ కూడా, – నిజానికి ఒకదానికొకటి ఏమాత్రమూ సంబంధం లేని ఇవన్నీ కూడా – ఒక అవినాభావ సంబంధంతో, ఒక అవసరంతో, ఒక కార్యకారణబంధంలో అలా అక్కడ ఉన్నాయనీ, అవి అలా ఉండటానికి ఒక కారణం, వాటన్నిటి మధ్యా ఒక బలమైన బంధమేదో ఉందనే ఒక నమ్మకాన్ని – నేనెప్పుడూ ఏమీ ఆలోచించకుండానే ఒప్పుకుని అప్పటిదాకా బతికేస్తున్నానని నాకు తట్టింది.
ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే నా నవ్వు వెంటనే ఆగిపోయింది. సిగ్గుతో నా ముఖం కందిపోయింది. నా చుట్టూ హడావిడిగా కదిలిపోతున్న జనాల దృష్టి నామీదకు మరల్చడం కోసం చేతులు బార్లా ఊపుతూ పెద్దగా అరవడం మొదలు పెట్టాను.
“ఆగండి, అందరూ ఆగండి! నేను చెప్పేది వినండి. ఒక్కసారి దయచేసి వినండి. ఇక్కడేదో తిరకాసుంది. ఇక్కడొక పెద్ద తప్పు జరుగుతోంది. మనమందరం మనకు తెలీకుండానే, అర్థం లేకుండా, కారణమేదో తెలియకుండా, ఇలా ప్రవర్తిస్తూ బతికేస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఇదిలా ఉండకూడదు. ఇదెప్పటికైనా మారాల్సిందే. మనం ఇలా ఎంతకాలం ఉండాలి? ఎందుకు ఉండాలి?”
నా చుట్టూ జనాలు గుమిగూడారు. కాస్త ఉత్సుకత తోటీ, కొంచెం అనుమానంగా నన్ను పరిశీలించడం మొదలెట్టారు. గుంపు మధ్యలో నేను చేతులూపుతూ, నా ఆలోచనలని వాళ్ళకర్థమయేలా వివరించి చెప్పడానికి ప్రయాసతో, నాకు హటాత్తుగా కలిగిన ఈ జ్ఞానోదయంలో వాళ్ళని భాగస్వాముల్ని చేద్దామని, నా జ్ఞానాన్ని వాళ్ళకు పంచుదామని ప్రయత్నించ బోయాను. కానీ మాట పెగల్లేదు. నేను మాట్లాడదామని చేతులెత్తిన క్షణం, నోరు తెరవబోయిన మరుక్షణం, నా జ్ఞానోదయం నాలోనే పొగమంచులా ఆవిరై పోయినట్లయి, నాలోపల్లోపలే ఆనవాలు లేకుండా కరిగిపోయి, కేవలం ఖాళీ మాటలు, ఉత్త మాటలు మాత్రమే తత్తరపాటుతో తోసుకుంటూ నా నోట్లోంచి బయటకు వచ్చినై.
“”ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ఇప్పుడేమయిందని?” అని నన్ను వాళ్ళంతా నిలదీశారు. “జరక్కూడనిది ఏమిటి జరిగిందని నీ కంగారు? మేమూ చుట్టూరా చూస్తున్నాం. అన్నీ సక్రమంగా, సవ్యంగానే ఉన్నాయే! ఏదెక్కడుండాలో అక్కడే ఉంది. ఏదెలా జరగాలో అలానే జరుగుతూ వుంది. నువ్వంటున్నట్టు అర్థం పర్థం లేని అయోమయంగా మాకేమీ కనపట్టం లేదు మరి!”
తల తిప్పి చుట్టూ చూశాను. మళ్ళీ అన్నీ వేటి స్థానంలో అవి సహజంగానే కనపడుతున్నాయి. ట్రాఫిక్ లైట్లు, యూనిఫాములు, బిచ్చగాళ్ళు, సిటీబస్సులు, కూడలిలో విగ్రహాలు, చుట్టూ మనుషులు, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ సంచులు – అన్నీ ఈ ప్రపంచంలో ఏవి వుండాల్సిన చోట్లో అవి సహజంగా, తమ చుట్టూ వున్న మిగతా వాటితో ఒక అవినాభావ సంబంధంతో సరిగ్గానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దారి తప్పిన వాడికొచ్చే అయోమయంతో నేనక్కడే నిలబడిపోయాను, ఉలుకూ పలుకూ లేకుండా. చుట్టూ ఉన్న ప్రపంచం మళ్ళీ మామూలుగా అర్థవంతంగా కనిపించడం నాకేమీ ఊరట నివ్వలేదు సరిగదా, నా మనసులో ఏదో అలజడి మొదలైంది.
“నన్ను క్షమించండి.” అన్నాను వాళ్ళను సమాధానపరుస్తూ. “బహుశా సవ్యంగా లేనిది నేనేనేమో. తప్పు నాలోనే ఉందేమో. ఎందుకో ఒక్క క్షణం నాకలా అనిపించింది. ఇప్పుడంతా మళ్ళీ మామూలు గానే, బాగానే ఉంది. దయచేసి నన్ను క్షమించండి.” అని మెల్లిగా వాళ్ళ మధ్యనుండి తల దించుకొని బయటకొచ్చాను. వాళ్ళంతా ఇంకా నాకేసి కోపంగా చూస్తున్నట్టు నాకు తెలుస్తూనే ఉంది.
కానీ, ఎప్పుడైనా నాకేదైనా అర్థం కానప్పుడు, నాకు మళ్ళీ ఏమీ అర్థం కాకుండా పోయి అర్థరహితంగా ప్రపంచం కనిపిస్తుందనీ, ఆ రోజు కేవలం ఒక లిప్తలో తటిల్లుమని మెరిసి మాయమైపోయిన ఆ ప్రపంచపు జ్ఞానం మళ్ళీ నాలో సాక్షాత్కరిస్తుందనీ, ఒక ఆశ, ఒక నమ్మకం నన్ను ఇప్పటికీ, నిలువెత్తునా కదిలించివేస్తుంటుంది.
(మూలం: The flash, 1943.)
3. ఐకమత్యం
వాళ్ళని గమనించడం కోసమే ఆగాను.
నేను జోబుల్లో చేతులు పెట్టుకుని ఊరికే ఒక దారీ తెన్నూ లేకుండా నడుస్తున్నాను. అర్ధరాత్రి వేళ, నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధిలో, ఒక దుకాణం తలుపు దగ్గర నిలబడున్నారు వాళ్ళు. ఒక గునపాన్ని షట్టరు కిందకి నెట్టి ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అదేమో అంగుళం కూడా కదల్లేదు. బాగా గట్టి షట్టరనుకుంటాను. సహాయం చేద్దామని నేనూ దగ్గరికి వెళ్ళి గునపం మీద చెయ్యేశాను. వాళ్ళు పక్కకు జరిగి నాక్కొంచెం చోటిచ్చారు. అందరం కలిసి ఒకేసారి ఎత్తడానికని కొంచెం పెద్దగా ‘ఐస్సా’ అని అన్నాను. వెంటనే పక్కనున్నోడు నా డొక్కలో మోచేత్తో పొడిచాడు. “మతేమైనా పోయిందేట్రా? ఆళ్ళుగానింటే మనపనింతే, ఎర్రెదవా!” అన్నాడు లోగొంతుకతో. తల అడ్డంగా ఊపాను తప్పయిపోయిందనట్టు.
బానే కష్టపడాల్సొచ్చింది ఆ షట్టరు కదలడానికి. అందరికీ చెమటలు పోసినై. చివరికి ఎలాగైతేనేం ఒక మనిషి దూరేంత సందు వచ్చింది. అందరమూ ఒకళ్ళ తరువాత ఒకళ్ళం లోపలికి దూరాం. నా చేతికో గోనె సంచీ ఇచ్చి పట్టుకోమని దాంట్లో దుకాణంలోని సామాన్లు అవీ ఇవీ తెచ్చి పడేయడం మొదలెట్టారు.
“ఉన్నట్టుండి ఆ పోలీస్ నాయాళ్ళు రాకపోతే బావుణ్ణు” మధ్యమధ్యలో వాళ్ళంటున్నారు.
“అవున్నిజంగానే దొంగనాయాళ్ళు.”
“ఉష్. ఏందో అడుగుల్చప్పుడు ఇనిపిస్తుళ్ళా?”
నేను చెవులు రిక్కించాను. “కాదు కాదు. పోలీసోళ్ళు కాదు,” అన్నాన్నేను కొంచెం భయంగా.
“అదాటునొచ్చి మీదపడిపోతారు ఎదవనాయాళ్ళు!”
“పోలీసోడని చూడకుండా లేపేస్తే సరి,నాయాళ్ళని!”
“సర్లేవో, వచ్చేడో పెద్ద మొనగాడు! అయ్యా, ముందరా కడదాకెల్లి ఎవడైనా ఇటేసి ఒస్తన్నాడేమో సూసిరా పో!”
సరేనని తలూపి నేను బైటికొచ్చి వీధి చివరికి నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడో మూసేసిన దుకాణం తలుపునానుకొని చీకట్లో ఇంకొందరున్నారు. నేను వాళ్ళ పక్కకెళ్ళి నిలబడ్డాను.
“అదిగో, ఆ కిరాణా కొట్టు పక్క షాపులోంచే చప్పుళ్ళొస్తున్నాయిరా,” అన్నాడొకడు చిన్నగా. నేను ముందుకొంగి మరీ చూశాను.
“ఛస్! నీయమ్మ! వాళ్ళు చూస్తే? ఏమాత్రం వాసనొచ్చినా లటుక్కున కలుగులో దూరిపోతారు. అసలే మహా కంతిర్నాకొడుకులైతే! ఈసారి కూడా తప్పించుకుంటే మనకు సున్నం బొట్లే,” లోగొంతుకలోనే నన్ను కసురుకున్నాడు. తప్పయిపోయిందన్నట్లు తల అడ్డంగా ఊపాను.
“అరేయ్, మనం విడివిడిగా పోయి షాపు ముందునుంచి, ఎనకమాల్నుంచి చుట్టుముడితే ఆ నాకొడుకుల్ని పట్టేస్కోగలం, అంతమంది ఉన్నట్టు లేరీసారి.” అన్నాడింకొకడు.
మేమందరం రెండు మూడు గుంపులుగా విడిపోయి ముంగాళ్ళ మీద చప్పుడు కాకుండా నడుచుకుంటూ కిరాణా కొట్టు వైపు నడిచాం. మా అందరి కళ్ళూ చీకట్లో మెరుస్తున్నై.
“ఈసారి తప్పించుకోలేరు నాకు తెలుసు,” అన్నాను.
“మరే! రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోతారు దొంగెదవలు.”
“టైమొచ్చిందిలే వీళ్ళగ్గూడా.”
“పోరంబోకు నాకొడుకులు గాకపోతే షాపుల్లో ఈ దొంగతనాలేందిరా ఈళ్ళకి?”
“నిజమే, పోరంబోకు నాకొడుకులు, నాకొడుకులనీ.” అన్నాన్నేను కోపంగా.
వాళ్ళు నన్ను ముందెళ్ళి ఓ చూపేసి రమ్మన్నారు. నేను మళ్ళీ షాపులోకి దూరాను.
“ఈపాలికొరే, మావలకి మనం చిక్కవంటే చిక్కం,” అంటున్నాడొకడు నిండిన గోనె సంచీ భుజానేసుకుంటూ.
“ఆ ఎనకమాల కిటికీనుండి సప్పుడ్నేకుండా బైటపడ్తిమంటే, ఆళ్ళ కళ్ళ ముంగట్నుంచే మాయమైపోవడం కాయం,” అన్నాడింకొకడు. అందరం మొహమొహాలు చూసుకున్నాం. అందరి మొఖాల్లోనూ చిర్నవ్వులొచ్చినై, సాధించామన్న తృప్తితో.
“వాళ్ళు కసితో ఉడుక్కొని చస్తారీసారి, నాకు తెలుసు.” అన్నాను. అందరం షాపు వెనకవైపున్న కిటికీలోంచి నిశ్శబ్దంగా పక్కనున్న గల్లీలోకొచ్చి పడ్డాం.
“మాఁవల్ని మళ్ళీ ఎర్నాకొడుకుల్ని చేసేం గదరా!” అంటున్నాడొకడు. ఇంతలోనే “ఎవర్రా అక్కడ!” అనొక అరుపూ, దాంతోటే కొన్ని టార్చ్ లైట్లు మావైపుగా వెలిగినై. మేమంతా చటుక్కున పాత డబ్బాలెనకాల నక్కి కూర్చున్నాం ఒకళ్ళ చేతులొకళ్ళు పట్టుకుని. అందరి చేతులూ చెమటతో తడిసి చల్లగా అయినై.
ఓ ముగ్గురు నలుగురు ఆ గల్లీలోకొచ్చి టార్చ్ లైట్లు అటూ ఇటూ తిప్పి చూసి మమ్మల్ని గమనించకుండానే తిరిగెళ్ళిపోయారు. మేం వెంటనే బైటకు దూకి బలమంతా పిక్కల్లోకి తెచ్చుకొని ఆక్కుండా పరిగెత్తాం. నేనొకట్రెండు సార్లు తట్టుకొని పడబోవటంతో కాస్త నిదానంగా పరుగెత్తుతూ వెనకపడ్డాను. కాసేపటికే వెనకాలనుంచి పరిగెత్తుకొస్తున్న వాళ్ళతో కలిశాను.
“కమాన్, పరిగెత్తండ్రా, పరిగెత్తండి, ఈసారి ఆ నాకొడుకుల్ని ఒదలకూడదు. ఇక్కడే ఎక్కడో ఉంటారాళ్ళు,” అనుకుంటూ ముందు వాళ్ళెంబడి పడ్డారు.
“రేయ్, ఈ సందులోంచి అడ్డం కొయ్యండి, ఇదిగో ఇటేపు నుంచి… కమాన్ కమాన్…” అరుచుకుంటూ అందరం పరిగెత్తాం. కాసేపట్లోనే ముందు పరిగెత్తుతున్న వాళ్ళు కనపడ్డారు. “అదిగో, అదిగో, వాళ్ళే! పట్టుకోండి, పట్టుకోండి. చూద్దాం ఎలా తప్పించుకుంటారో.”
నేను మళ్ళీ వేగం పెంచి పరిగెత్తి వాళ్ళల్లో ఒకడిని అందుకున్నాను. “సెబాశ్‌రా తమ్మీ. దొరికిపోయేవేమో అనుకున్నాను. ఆ చెత్తకుప్పెనకాల సందునుంచి ఎలితే ఇక పోలీసోళ్ళకి దొరికే చాన్సే లేదు. పద, పద.” అంటూ నా చేయి పట్టుకొని సందులోంచి పరిగెత్తాడు. ఇద్దరం అలా కాసేపు పరిగెత్తాం. కాసేపైంతర్వాత, మళ్ళీ నేనొక్కణ్ణే మిగిలిపోయాను. సందు చివర మెయిన్ రోడ్ పక్కగా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చాడు.” పద పద! వాళ్ళనిటుగా రావడం చూశాను. ఎంతో దూరం పోయుండరు.” నేను అతని వెనకే పరిగెత్తాను.
కాసేపటికే నాకు ఆయాసంతో చెమటలు పోసి పరిగెత్తడం మానేశాను. చుట్టూ చూశాను, ఎవరూ కనిపించలేదు. ఏ అరుపులు గానీ, ఎవరూ పరిగెత్తుతున్న చప్పుడు కానీ ఏమీ వినిపించలేదు. నేను జేబుల్లో చేతులు పెట్టుకుని ఊరికే ఒక దారీ తెన్నూ లేకుండా నడవడం మొదలుపెట్టాను.
(మూలం: Solidarity, 1943. Numbers in the dark and other stories, Italo Calvino.)