జామపండు

విమానం ఇంజన్ల చప్పుడు ఆగిపోయింది. ఇక వేరే ఏ చప్పుడూ లేదు, కేబిన్ వెనకవైపు నుంచి సన్నగా వినిపిస్తున్న ఒక ఏడుపు తప్ప. ఫ్లైట్ అటెండంట్ ఎవరో ఏడుపు ఆపుకోడానికి ప్రయత్నం చేస్తోంది. తల పక్కకు తిప్పి విమానం కిటికీ లోంచి రామచంద్రమూర్తి బైటకు చూశాడు. విమానం కింద అంతా తెల్లగా గడ్డకట్టినట్టున్న మేఘం కనిపించింది. విమానం ఆ మేఘం లోంచి ఒక రాయిలా జారి పడిపోతుంది. అది పడుతున్నప్పుడు మేఘంలో ఒక పెద్ద రంధ్రం అవుతుంది. కానీ దాని వెనకే గాలి ఒరవడికి ఆ రంధ్రం వెంటనే మూసేసుకుంటుంది, అసలక్కడ ఏమీ జరగనట్టుగానే. కనీసం ఆనవాలు కూడా లేకుండా, మేఘం మళ్ళీ గడ్డకట్టుకుంటుంది. రామచంద్రమూర్తి ఇదంతా స్పష్టంగా ఊహించగలిగేడు. ‘పడిపోకు’ అనుకున్నాడు తనలో తాను ‘ఏమైనా సరే, పడి మాత్రం పోకు.’

సరిగ్గా రామచంద్రమూర్తి చనిపోబోయే నలభై క్షణాల ముందు, అతని ముందు ఒక దేవత ప్రత్యక్షమయ్యాడు. చూడ్డానికి కూడా దేవత లాగానే ఉన్నాడు, మన ఊహల్లో ఉన్నట్టుగానే. మూర్తికి ఆఖరి కోరిక కోరుకునే వరం ప్రసాదించబడింది. అది తీర్చడానికి వచ్చానన్నాడు. రామచంద్రమూర్తికి సందేహం కలిగింది. వరం ప్రసాదించబడడం అంటే ఎలా? ఏదో అదృష్టవశాత్తూ అనుకోకుండా తగిలిన లాటరీ లాగానా? అలా కాదు, జీవితంలో చేసిన మంచిపనులకు మెచ్చి అభినందిస్తూ ఇచ్చిన బహుమతి లాగానా?

దేవత భుజాలెగరేశాడు. “ఏమో నాకూ తెలీదు” అన్నాడు దేవతలకు ఉన్నంత, ఉండాల్సినంతా నిజాయితీతో. “ఉన్నపళాన నన్ను పిలిచారు. వెంఠనే ఇక్కడకు పొమ్మన్నారు. నీ కోరిక తక్షణమే తీర్చమన్నారు. ఎందుకూ ఏమిటీ ఆ వివరాలు నాకు చెప్పాలేదు, నాకు అడిగేంత సమయం ఇవ్వాలేదు.”

“ఛ! వాట్ ఎ షేమ్!” అన్నాడు రామచంద్రమూర్తి. “ఇదంతా బానే ఉంది కానీ చూడు. ఇంకాసేపట్లో నాకు ఈ లోకంలో నూకలు చెల్లిపోతాయి, నేనేమైపోతానో నాకే తెలియదు. కనీసం ఎలా పోతున్నానో కూడా తెలీకుండా ఎలా? ఇదీ ఇంకొక జీవితం అని మందలో మేకలాగా పంపేస్తున్నట్టా లేకపోతే, సార్థకమైన జీవితం గడిపాడు అని మెచ్చుకొని వీపు మీద తట్టి పంపుతున్నట్టా? నాకు కొంచెమైనా తెలియాలి కదా!”

“చూడూ, నీకు మిగిలింది ఇరవై క్షణాలు.” దేవత తనని తాను తమాయించుకుంటూ చెప్పాడు. “ఈ ఇరవై క్షణాలనూ ఇట్లానే నాతో వాదిస్తూ గడుపుతాను అంటే అది నీ ఇష్టం. నాకేమీ ఇబ్బంది లేదు. తొందరా లేదు. కానీ గుర్తు పెట్టుకో. నీకున్న గడువు చాలా కొద్దిసేపే. ఆలస్యం చేస్తే నష్టపోయేది నువ్వే. యూ డిసైడ్ నౌ!”

రామచంద్రమూర్తి అర్థమయిందన్నట్టు తలూపి వెంటనే తన చివరి కోరిక కోరుకున్నాడు. కానీ కోరుకోబోతూ, “నీ యాస తమాషాగా ఉందే! దేవతలు మాట్లాడేదిలా లేదే!” అని వ్యాఖ్యానించి మరీ కోరుకున్నాడు. దేవత నొచ్చుకున్నాడు, కొద్దిగా కోపం తెచ్చుకున్నాడు. “దేవతల యాసా? అంటే? ఏం తెలుసు నీకు, ఉన్నట్టుండి నేను మాట్లాడే తీరును ఆక్షేపించడానికి? అసలు దేవతలు ఎలా మాట్లాడతారో నువ్వెప్పుడైనా విన్నావా ఇంతకు ముందు?” దేవత మొఖంలో దైవత్వం కాస్త తగ్గింది. కొద్దిగా అప్రసన్నత కనిపించింది. అయితే రామచంద్రమూర్తి కోరిక విన్న తరువాత దేవత పెట్టిన మొఖంతో పోల్చుకుంటే ఇదేమీ ఒక లెక్కలోకి కూడా రాదు.

“ప్రపంచశాంతా?” పెద్దగా అరిచాడు, మొఖం ఎర్రగా కందగడ్డల్లే చేసుకొని. “ప్రపంచశాంతా? ఏం, తమాషాగా ఉందా? ఆటలాడుతున్నావా నాతో? ఆర్ యూ కిడింగ్ మీ?!”

కానీ రామచంద్రమూర్తి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే చెప్పలేడు కాబట్టి. ఆ క్షణమే అతను చనిపోయాడు.

రామచంద్రమూర్తి చనిపోయాడు కానీ దేవత మాత్రం అక్కడే మిగిలిపోయాడు. ఇప్పటిదాకా ఎవరూ కోరుకోనిది, ఏ రకంగానూ సాధ్యం కానిది, ఎంతో కష్టమైనదీ అయిన కోరిక తీర్చే బాధ్యత అతని భుజాలమీద పడింది. అయినా ఇదేం కోరిక! ఎవరైనా ఎలాంటివి అడుగుతారు ఇటువంటి సమయాల్లో? భార్యకొక ఇల్లు, కొడుక్కో కూతురుకో మంచి ఉద్యోగం. ఇలా ఆర్చగలిగేవి, తీర్చగలిగేవి అడుగుతారు కానీ ఇదేంటి! ఆశకైనా హద్దుండద్దూ! ఈ భూమి మీద శాంతి నెలకొల్పడం అంటే అయ్యే పనేనా? అయినా వీడెవడండీ బాబూ! ముందరేమో ప్రశ్నలు వేసి చంపుకుతిన్నాడు. ఆపైన తను మాట్లాడే తీరుకు వంకలు పెట్టాడు. చివరికి భూమి మీద శాంతి అని గుదిబండ ఒకటి తగిలించిపోయాడు.

దేవత ఉస్సురుమన్నాడు. నిజానికి రామచంద్రమూర్తి కానీ ఇంకా బ్రతికే ఉంటే సుఖరోగం అంటుకున్నట్టు అంటుకొని దేవత అతను వేరే కోరిక కోరుకునే దాకా వదిలిపెట్టేవాడు కాదు. కానీ రామచంద్రమూర్తి ఏడు లోకాలలో ఎక్కడున్నాడో ఎవరికి తెలుసు! వెతకడం ఎవరి తరం! ‘ప్రపంచశాంతి’ తనలో తనే గొణుక్కున్నాడు దేవత. ‘ప్రపంచశాంతి.’

దేవత ఇక్కడ ఇలా మల్లగుల్లాలు పడుతూ ఉంటే, అక్కడ రామచంద్రమూర్తి ఆత్మ ఇదంతా పూర్తిగా మరిచేపోయింది. అసలు తను రామచంద్రమూర్తి అనే పేరున్న ఒక శరీరానికి చెందినదన్న ఊహ కూడా లేదు దానికి. పునర్జన్మ సంప్రదాయం ప్రకారం ఆ ఆత్మ ప్రక్షాళించబడి స్వచ్ఛమయింది. పూర్తిగా పరిశుద్ధమై కొత్త జన్మనెత్తింది, ఒక జామపండుగా.

ఈ కొత్త ఆత్మకు ఆలోచనలు లేవు కానీ స్పందించే గుణం ఉంది, జీవరాశులన్నిటికీ ఉన్నట్టే. దానికి అన్నిటికంటే ఎక్కువగా ఉన్న స్పందన భయం. అవును. చెట్టునుంచి రాలిపడిపోతానేమో అన్న భయం. అలా అని ఆ భయాన్ని మాటల్లో చెప్పలేదు కాని, దానికే మాటలొచ్చి ఉంటే ‘దేవుడా, నన్ను కాపాడు తండ్రీ!’ అనో, అలా ఇంకేదో అనో వుండేది. కానీ దానికి తన భయాన్ని తార్కికంగా అర్థం చేసుకొనే శక్తి లేదు. అది ప్రాణభయంతో బిర్రబిగిసి, ఆ కొమ్మకు అలా వేలాడుతూనే ఉంది. ఇంతలో ప్రపంచంలో మెల్లిగా శాంతి నెలకొనసాగింది. ప్రజలు కత్తులు కటార్లు కరిగించి వాటితో నాగళ్ళు చేసుకుంటున్నారు. అణుకర్మాగారాలు కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమే నడుపుతున్నారు. కానీ ఇవేమీ ఆ జామపండుకు తెలియవు, ఏ తృప్తినీ ఇయ్యలేవు. దానికి తెలిసింది ఒక్కటే. చెట్టు పొడుగ్గా ఉంది. నేల అక్కడెక్కడో దూరంగా కనిపిస్తోంది. పడితే ముక్కలవడం ఖాయం. ‘పడిపోకు’ అనుకున్నది తనలో తాను ‘ఏమైనా సరే, పడి మాత్రం పోకు.’

(మూలం: Guava)