రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం

నీకు నచ్చిన ఆహారం భుజించు, పరులకు నచ్చిన దుస్తులు ధరించు.

– అరబిక్ సామెత


విజయనగర సామ్రాజ్యాన్ని రాబర్ట్ సూవల్ (Robert Sewell) తన ఎ ఫర్గాటెన్ ఎంపైర్ (1900) పుస్తకంలో “మహమ్మదీయుల దండయాత్రలకు ఎదురొడ్డి నిలిచిన హిందూ కోటగోడ”గా వర్ణిస్తూ ఆ సామ్రాజ్య చరిత్ర పునర్నిర్మాణానికి నాంది పలకడంతో, ఈ వర్ణన ఒక స్వయంసిద్ధసత్యంగా చరిత్రకారుల్లో స్థిరపడిపోయింది. తుంగభద్రా నదీ తీరంలో తమ రాజధాని కేంద్రంగా సుమారు 140,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల రాజ్యాన్ని విజయనగర రాజులు మూడు తరాలు – 14వ శతాబ్దం మధ్య నుంచి 17వ శతాబ్దం మధ్య వరకూ – సమర్థవంతంగా పాలించారు. సూవల్ ఈ సమర్ధతని భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని విరామం లేకుండా జరుగుతున్న మహమ్మదీయుల ప్రయత్నాలకు ఒక సహజమైన ప్రతిచర్యగా అభిప్రాయపడ్డాడు.

గత శతాబ్దాలలో దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన హిందూ రాజ్యాలు 14వ శతాబ్ద్యారంభంలో మహమ్మద్ బిన్ తుగ్లఖ్ దండయాత్రలతో ముక్కలుగా విడిపోయాయి. ఎప్పుడైతే ముష్కరులైన ఆక్రమణ దారులు కృష్ణా నదీ తీరాన్ని సమీపించారో, బలహీనమైన ఈ చిన్న రాజ్యాలు భయంతో కూడిన తొందరపాటుతో కూటమిగా ఏర్పడి, దండయాత్రల నుండి రక్షణ కలిగించే శక్తి ఉన్నట్టుగా అప్పటికి కనిపించిన విజయనగర సామ్రాజ్యం నీడలోకి చేరారు. ఈ విధంగా ఆ పాత రాజ్యాలన్నీ మాయమైపోయి, వీరులైన విజయనగర రాజులు రెండున్నర శతాబ్దాల పాటు దక్షిణభారతానికి ఏకైక రక్షకులైనారు – ఇదీ సూవల్ అభిప్రాయం.

కాలక్రమేణా ఈ అభిప్రాయబలం కొంచెం తగ్గినా సూవల్ చేసిన ప్రతిపాదన దక్షిణభారత దేశపు చరిత్రకారుల సాంస్కృతిక చరిత్ర నిర్మాణపు పోకడలపై తన ప్రభావాన్ని ఇప్పటికీ చూపిస్తూనే ఉంది. అయితే, 14 – 17 శతాబ్దాల మధ్య కాలంలో దక్షిణ భారత చరిత్రను కేవలం హిందూ – ముస్లిం ఘర్షణగా పరిమితం చేసే వర్ణన తప్పనీ, ఆ కాలంలో హిందూ ముస్లిం రాజ్యాలు ఒకరితో ఒకరు మాత్రమే కాకుండా తమలో తాము సైతం పోట్లాడుకునేవారనీ కొత్త పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యాన్ని ‘దక్షిణ భారత దేశంలో ఇస్లాం వ్యాప్తిని అరికట్టి హిందూ సంస్కృతిని పరిరక్షించడం ప్రధానోద్దేశంగా’ ఏర్పడిన సామ్రాజ్యమని, ఇప్పటికీ చరిత్రకారులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇందువల్ల అంతర్లీనంగా కొన్ని అపోహలు ఏర్పడుతున్నాయి.

ముఖ్యంగా, మొదటిది – విజయనగర సామ్రాజ్యపు ఆవిర్భావమూ, మనుగడల చారిత్రక విశిష్టతను కేవలం హిందూ సంస్కృతి పరిరక్షణ అనే సంకుచిత దృక్పథానికి పరిమితం చేయడం; ఈ కాలంలో సనాతన హిందూ సంస్కృతీ సాంప్రదాయాలు ఏ మార్పూ లేకుండా తరువాతి తరాలకు సంక్రమించాయని నమ్మడం. ఇక రెండవది – దక్షిణ భారతదేశంలో హిందూ సంస్కృతి తన పరిశుద్ధతను నిలబెట్టుకోగలిగిందనీ, ఇస్లాం సాంప్రదాయాల ప్రభావంతో ఉత్తరభారత దేశపు హిందూ సంస్కృతిలా మలినం కాలేదని నమ్మడం.

ఈ వ్యాసం ద్వారా నేను ఈ నమ్మకాలని ప్రశ్నిస్తూ, విజయనగర సంస్కృతిపై నిజానికి ఇస్లాం సంస్కృతీ సాంప్రదాయాల ప్రభావం ఎంతగానో ఉన్నదనీ, తద్వారా ఎంతగానో మార్పు చెందిందనీ ప్రతిపాదిస్తున్నాను. విజయనగర రాజుల విశాల దృక్పథం, లౌకిక వ్యవహారశైలి గురించి, ఆ రాజ్యపాలనా వ్యవస్థపై ఇస్లాం సంస్కృతిక ప్రభావం గురించి తెలుసుకోవాలంటే, విజయనగరాన్ని మత ప్రాతిపాదికన ఏర్పడ్డ రాజ్యంగా గుర్తించకూడదు. అంతే కాక, పర మత సంస్కృతీ ప్రభావాలతో వచ్చే అన్ని మార్పులను దుర్ఘటనలుగా, వినాశహేతువులుగా కాక ఏ సంస్కృతికైనా సహజమైనవిగానూ, ఆ సంస్కృతికి వినూత్న జీవాన్నీ ఇచ్చేవి గానూ గుర్తించాలి. కేవలం అప్పుడే విజయనగర సామ్రాజ్యపు కాలం దక్షిణ భారత చరిత్రలోనే ఒక ఉత్తేజభరితమూ, విభిన్నమూ అయిన కాలంగా మనం గ్రహించగలం.

ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిశోధనలలో, విజయనగర సామ్రాజ్యపు రాజకీయ మంత్రాంగం, సైన్య నిర్వహణ, పరిపాలనా యంత్రాంగం లాంటి అంశాలలో ఇస్లాం సాంప్రదాయపు ధోరణులను చరిత్రకారులు మరింతగా గుర్తిస్తున్నారు. ఉదాహరణకి, విజయనగరపు కాలం నాటి స్థూపాలలో కనిపించే ఇస్లాం శిల్ప శైలి అందరూ గుర్తించినదే. కానీ, ఈ సాంస్కృతిక మార్పులను కేవలం చెదురు మొదురు సంఘటనలుగా కాక, దక్షిణ భారత దేశపు సాంస్కృతిక వ్యవస్థను సమూలంగా మార్చివేస్తున్న ఒక విస్తారమైన ప్రభావంలో భాగాలుగా ఎవరూ గమనించి నిర్వచించకపోవటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ప్రస్ఫుటమైన, విస్తారమైన ప్రభావాన్నే నేను ఈ వ్యాసంలో ఇస్లామీయకరణ (Islamicization) అని పిలుస్తున్నాను.

ఇస్లామీయకరణలో భాగంగా ఒక ముఖ్యమైన మార్పు విజయనగరపు రాజాస్థానపు దుస్తులలో వచ్చింది. అప్పటిదాకా ప్రాచుర్యంలో ఉన్న దక్షిణ భారత దేశపు సాంప్రదాయపు దుస్తుల వైఖరి, పధ్నాలుగు, పదిహేను శతాబ్దాలలో పూర్తిగా తొలగిపోయి, ఇస్లాం దేశాలలో వాడే వస్త్రాల ఆధారంగా వచ్చిన ఒక కొత్త వైఖరి – కబాయి అని పిలవబడే ఒక పొడుగాటి అంగీ (అరబీ ‘కబా’), కోలగా ఉండి జరీతో అలంకరించబడి కుళ్ళాయి అని పిలవబడే తలపాగా(టర్కీ, పర్షియా దేశాల ‘కులా’ ఆధారంగా) – ఆ స్థానే చోటు చేసుకుందనీ నేను ఈ వ్యాసం ద్వారా నిరూపించదలిచాను. అంతే కాక, ఈ మార్పు కేవలం విజయనగర రాజుల మోజు ముచ్చట్ల వల్ల వచ్చిన మార్పు కాదనీ, ఇది అప్పటి రాజకీయ మంత్రాంగం ఉద్దేశ పూర్వకంగా చేసిన ఒక వ్యూహాత్మకమైన మార్పు అని నేను నమ్ముతున్నాను. రాజాస్థానపు వేషధారణలో ఈ మార్పు, రాజకీయ పరిభాషలో మార్పులకు సమాంతరంగా జరిగింది. ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ, ఈ సమయంలోనే విజయనగర రాజులు స్వీకరించిన బిరుదు – హిందూరాయసురత్రాణ (హిందూ రాజ సుల్తాను). ఈ విధంగా, విజయనగర రాజులు తమ వేషభాషల్లో ఇస్లామీయకరణ ద్వారా చూపెట్టిన మార్పులు ఎంతో వ్యూహాత్మకమైనవి, ప్రస్తుతం చరిత్రకారులు వారికి ఆపాదిస్తున్న అల్పమైన ఉద్దేశాలకంటే చాలా లోతైనవి, అర్థవంతమైనవి.

విజయనగర రాజుల వస్త్రధారణ వైఖరిలో వచ్చిన మార్పులు పరిశీలించడం ఈ వ్యాసపు ముఖ్యాంశం. ఐతే, ఇది ఆ కాలపు దుస్తుల చరిత్ర మీద ఆసక్తితో కాకుండా, విజయనగర సామ్రాజ్యంలో ఇస్లామీయకరణానికి ఒక సూచికగా పరిశీలిస్తున్నాను. విజయనగరపు రాజుల కాలం నాటి దుస్తుల ఆనవాళ్ళు కూడా దొరకనప్పటికీ, ఆ కాలపు వర్ణచిత్రాలలోనూ, ఆ రాజుల గురించిన సాహిత్యంలోనూ మనకు ఎన్నో వివరాలు దొరుకుతాయి. వీటి ద్వారా దుస్తుల వివరాలే కాకుండా, ఆ దుస్తుల వాడుక వెనక గల ఆంతర్యాన్ని కూడా తెలుసుకోగలం. అంతే కాక, వాస్తు పద్ధతుల్లో ఇస్లామీయకరణ రుజువులతో సహా మన ముందు ఉన్నా వాటి వివరాలు వేషభాషల వర్ణనలంత విస్తారంగా సాహిత్యంలో నమోదు కాలేదు. ఇందువల్ల, విజయనగర సామ్రాజ్యంలో ఇస్లామీయకరణ తెచ్చిన సాంస్కృతిక మార్పులను మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఆ కాలపు వస్త్రధారణలో మార్పులను విశ్లేషించడం మరింత ఉపయోగపడుతుంది.

ఇస్లామీయకరణ: ఒక సాంస్కృతిక మార్పు

విజయనగర రాజాస్థానపు దుస్తుల గురించి చర్చించే ముందు, నేనిక్కడ ప్రతిపాదిస్తున్న ఈ ఇస్లామీయకరణ వెనక ఉన్న సిద్ధాంత సూత్రాలను ఒక్కసారి విశదీకరించడం అవసరం. ప్రాథమిక స్థాయిలో ఈ సాంస్కృతిక మార్పును ఇలా నేను నిర్వచిస్తున్నాను.

ఇస్లామీయకరణ మత సంబంధమైన మార్పును కాక ఒక రాజకీయమైన మార్పును సూచిస్తుంది. అప్పటికే ప్రబలి వున్న ఇస్లాం సంస్కృతిలో పాలు పంచుకోడం ద్వారా రాజ్యాధికారాన్నీ, స్వయంప్రపత్తినీ నిలబెట్టుకోడానికి రాజులు తెచ్చుకున్న మార్పు ఇది.

ఈ మార్పు వేషభాషలు, అలంకరణల వంటి లౌకిక స్థాయిలో జరిగినదే. ఇస్లామీయకరణ అని నేనంటున్నది మతానికి ఏ మాత్రమూ సంబంధించినది కాదు. ప్రత్యేకించి విజయనగర సామ్రాజ్యం గురించిన చర్చలో ఇది స్పష్టం. ఎందుకంటే తమ రాజకీయ జీవనంపై ఎంత ఇస్లాం నాగరిక ప్రభావం ఉన్నప్పటికీ, ఆ కాలంలో ఏ రకమైన మత మార్పిడులు లేదా మత సమ్మేళనం జరిగినట్లు దాఖలాలు లేవు.

ఇస్లామీయకరణ అన్న ఈ పదాన్ని నేను సంస్కృతీకరణ (Sanskritization) అన్న పద అర్థానికి దగ్గరగా వాడుతున్నాను. భారతదేశ భాషలపై సంస్కృత భాష ప్రభావం ఎలా వుందో, ఇస్లామీయకరణ కూడా భారతీయ సంస్కృతిపై అదే రకమైన ప్రభావాన్ని చూపించింది. ఈ రెండు మార్పులూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను సమూలంగా నిర్మూలించి ఆ స్థానే వచ్చినవి కావు. ఇవి అప్పటికే అస్తిత్వంలో ఉన్న భాషలు, ఆచార వ్యవహారాలు అదనంగా సంతరించుకున్న స్వభావసిద్ధమైన మార్పులు అని మనం గ్రహించాలి.