అతడు, నేను, అతడి కథ

[పాఠకుల సౌలభ్యం కోసం కథ-06లో ప్రచురితమైన అతడూ.. నేనూ.. లోయ చివరి రహస్యం కథను మీకందిస్తున్నాం. మీరు ఇప్పటిదాకా చదవక పోయినట్లైతే, ముందుగా కథను చదవమని మా మనవి. ఈ కథను మీకందించడానికి ఈమాటకి ప్రత్యేకంగా అనుమతినిచ్చిన కథాసాహితి సంపాదకులు నవీన్, రచయిత భగవంతం లకు మా కృతజ్ఞతలు – సం.]


 

నేనెప్పుడూ విశాఖపట్నం వెళ్ళలేదు, అరకులోయ భీమిలీలు చూడలేదు ఇన్నేళ్ళలోనూ. కానీ సినిమాలో, ఫ్రెండ్స్ తీసుకొచ్చిన మంచి ఫోటోలో, ఆ ప్రాంతమంతా నా కళ్ళకి కట్టినట్టే ఉంటుంది – నేనే వెళ్ళి ఆ లోయలన్నీ, ఆ కొండలన్నీ ఒంటరిగా తిరిగినట్లు. భక్తి సంగీతం విని పరవశించిపోడానికి కావలసింది దేవుడి మీద నమ్మకం కాదు, భక్తి భావం అర్ధం కావడం. భక్తిలో దైవంతో మమేకమైన ఆ మానసిక స్థితిని అనుభవించగలిగితే చాలు కదా.

నేను ఆత్మహత్య చేసుకోడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ ఎందుకు చేసుకోవాలనిపిస్తుందో తెలుసు, బాగా లోతుగానే, అరకులోయ కంటే దగ్గరగానే. ఆకలీ అప్పుల చావులు కాదు నేననేది, ప్రేమనుకొని ఆ భ్రమలో ఫెయిలై నిద్రమాత్రలు మింగడమో, మణికట్లు కోసుకోడమో గురించీ కాదు – ఇవి అర్ధమవుతై, కారణాలు ఎదురుగానే కనపడుతుంటాయి కదా, అందుకు. ఏ కారణమూ లేకుండా కుతూహలంతోనో నిర్లిప్తతతోనో చేసుకునే ఆత్మహత్య సంగతి నేనంటున్నది. ఏ ఆలోచనో చచ్చిపోతే ఎలావుంటుందీ అని ఏ రాత్రో ఏ పగలో ఏ ఒంటరి క్షణంలోనో ఠక్కున ఎందుకు తడుతుంది? బ్రతుకు మీద నిర్లిప్తతా చావు మీద కుతూహలాన్ని ప్రేరేపించేది? తన అస్తిత్వానికి ఏ విలువా కనపడక ఒక ఊహను పట్టుకుని జీవితాన్ని దాటుకుని అలా వెళ్ళిపోతే, అది మనకు తెలిసిన మరణమేనా, ఆత్మహత్యేనా, వేరే పదాలేమీ లేవా?

ఎవరో భగవంతం అట, ‘అతడూ నేనూ లోయ చివరి రహస్యం’ కథ-06లో కూడా అచ్చేశారు, మాగొప్పగా రాశాట్ట, అని హడావిడిగా మెయిలొచ్చింది ఓ రెండేళ్ళ క్రితం. ఓ వారం తర్వాత పేపర్లో ‘అర్ధం కాకపోయినా అద్భుతంగా ఉంది’ అనెవరో సమీక్షిస్తే ‘అద్భుతంగా ఉందన్నారుగా, అర్ధం కాకపోయినా పర్లేద’ని అతనన్నాడని ఓ వూసు. కథ చేతికి రాగానే ఒకట్రెండుమూడు సార్లు చదివి, ఒక పండితుడికిచ్చి, మంచి కథండీ అన్నాను, ఆయన చదివి “అర్ధం కానివన్నీ గొప్ప కథలేనా?” అన్నారు, తృణీకారంతో.


చీరాలలో చదువుకునే రోజుల్లో, ఒంగోలు నుంచి స్నేహితులతో కలిసి రోజూ రైల్లో పోయొచ్చేవాణ్ణి. రైలు పెట్టె గుమ్మం దగ్గర బైటి మెట్లపై కాళ్ళు పెట్టి కూర్చునే వాళ్ళం అప్పుడప్పుడూ. కరవది స్టేషన్ దాటగానే గుళ్ళకమ్మ మీద బ్రిడ్జీ ఇప్పుడెలా వుందో తెలీదు కానీ, అప్పుడు బోసిగా అటూ ఇటూ ఏ చట్రాలూ గట్రా లేకుండా నగ్నంగా వుండేది. వంతెన మీంచి రైలు పోతున్నప్పుడు, ముందుకొంగి చూస్తే గాల్లో తేలుతున్నట్టు ఉండేది, కాళ్ళకీ, కింద ఏటికీ ఇసకకీ మధ్య ఏమీ లేకుండా. తెలీకుండానే దూకేస్తామేమో అన్నట్టు గుమ్మానికుండే హ్యాండ్‌రైల్‌ని మరింత గట్టిగా పట్టుకునే వాళ్ళం, ఒక చిన్న గగుర్పాటుతో.

“ఈ లోయ సౌందర్యంచూస్తోంటే ఉన్నపళంగా అమాంతం ఇందులోకి దూకేయాలనిపిస్తోంది… కాసేపటికి ఈ ఆకుపచ్చ లోయలోంచే పక్షిలా అలా గాల్లోకి ఎగురుతూ రాగలనేమో అని కూడా అనిపిస్తోంది,” అన్నాను భావోద్వేగంతో. చుట్టూ ఎత్తయిన కొండల మధ్య నుండి వీస్తోన్న చల్లగాలికి ఆ క్షణం నా చర్మం రక్తమాంసాలతో కలిసి నృత్యం చేయసాగింది.

అతడూ కాసేపు ఆ లోయలోకి చూసి – “చాలాకాలంగా నేనూ ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నాను. కానీ ఫలితం.. ఊహూ… శూన్యం,” అన్నాడు.
“ఏదీ… పక్షిలా ఎగురుతూ పైకి లేవడమా…?” అన్నాను అతనితోపాటే కదలుతూ.
“కాదు. మనిషిలా నేల మీద బరువుగా నడవగలగడం,” అన్నాడతను మళ్ళీ ఆశ్చర్యపరుస్తూ.
…పరిచయమైన రెండు గంటల్లోనే చాలా చొరవ తీసుకుంటున్నాడనిపించింది.

నిజమే, ఆలోచన వచ్చేముందు చెప్పి మరీ రాదు, వస్తే చొరవ తీసుకుని మెదడంతా నిండిపోతుంది. అందులోనూ ఉన్నపళంగా లోయలోకి దూకేయాలనే ఆలోచన వస్తే, శరీరం జలదరించేదాకా. నడిచే మనిషికీ ఎగరాలనే కోరిక, ఎగిరే మనిషికి నడవాలనే కోరిక, ఏదైనా కుతూహలమే, వైవిధ్యం లేని జీవితం శాసిస్తోంది కాబట్టే. కథ మొదలుపెడుతూనే ఏం జరగబోతోందో తెలుస్తూనే వుంది. ఎలా జరుగుతుందన్నదే…


నాకు డలీ అంటే ఇష్టం. పూర్తిగా అర్ధమౌతాడని కాదు. అర్ధమయీ అవకుండా వుంటాడని, మరీ అబ్‌స్ట్రాక్ట్‌గా కాకుండా – మనం రోజూ చూసే ప్రపంచం లోనుంచే రోజూ రాని ఊహల్ని రప్పిస్తాడని. మా ఇంట్లో గోడకు వేలాడుతున్న ‘మెటమార్ఫసిస్ ఆఫ్ నార్సిసస్‌’ను అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాను. మోకాలి పై తల పెట్టుకొని నీళ్ళలోకి చూస్తూ నార్సిసస్, అవశేషాలుగా మిగిలిన చేతి వేళ్ళలో పిగిలిన గుడ్డులోంచి విచ్చుకుంటున్న నార్సిసస్ పూవు కొత్త జీవితాన్ని సూచిస్తున్నట్టు, క్షయానికీ మరణానికి గుర్తుగా చీమలు, మాంసం కొరుకుతున్న బక్క కుక్కా… అర్ధమయ్యీ కాకుండా ఉండడం ఇది. ఏది మరణానికి సంకేతం, ఏది జీవితానికి చిహ్నం? ఏది ఎక్కడ ఆగిపోయి రెండోది మొదలవుతుందో ఈ స్రవంతిలో? ఏది ఆ రెంటినీ కలిపే సన్నని తెర? పోనీ, విడదీసే తెర?

ఇదంతా నాన్సెన్స్ అంటే ఏం చెప్పను? అర్ధం కాని వన్నీ గొప్పవేనా అంటే ఏం చెప్పను? ‘పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ’ మనకు ఉంటుందని నేననుకుంటాను. కాదు, ఉంటుంది. అది సాధనతో రాణించే గుణం. వాడేకొద్దీ పదునెక్కే కత్తి లాంటిది. నిర్వచించలేకపోయినా మన అనుభవంలో ఉన్నదే – ఇది మంచిదనీ అది కాదనీ, ఇది బాగుందనీ అది లేదనీ, మనం అంటున్న ప్రతిసారీ పదునెక్కుతున్నదిదే. మనకు వెంటనే అర్ధం కాకపోయినా ఒక కవిత, ఒక చిత్రం, ఒక వస్తువు, ఇది గొప్పదే, మంచిదే, మెరుగైనదే అని తడితే అది దీనివల్లే. స్ఫటికానికీ, వజ్రానికీ తేడా తెలిసేది దీనివల్లే. పిసరంత ఊహకు మసిపూసి మారేడు చేసి లేని విద్వత్తుని ప్రదర్శించే శుష్క ప్రేలాపనల నుంచి, రచయిత ఒక గంభీరమైన భావనని తన భాషలో చెప్తే, ఆ భాషను అర్ధం చేసుకోడానికి మనమే కష్టపడాలని ఎలా తెలుసుకోగలం, అంటే ఇదిగో ఈ పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ వల్లే. రెండూ ఒకే విధంగా ఆకృతమైనా భావసాంద్రతకీ, శబ్దకాలుష్యానికి తేడాని అనుభవించగలం, మన అనుభూతిని వివరించలేకపోయినా. ఈ కథను అర్ధం చేసుకోవాల్సింది నేనే అనిపించింది కూడా నా పర్సెప్షన్ వల్లే. ఇది మంచి సాహిత్యం కలిగించే అవసరం అనీ, ఇది నాకు నేను చేసుకుంటున్న సహాయం అని కూడా తెలుసు నాకు.


“మళ్ళీ ఒక సారి చదవండి. అర్ధమున్నదీ, అయ్యేదే. ఈ కథ ఒక ఆత్మహత్య గురించి” అన్నాను ఆయనతో.

అరకు వరకేనని అతనితో అబద్ధం చెప్పాను కానీ, నిజానికి నా గమ్యం – నేనిట్లా నేల మీద నడుస్తూ నడుస్తూ పక్షిలా మారిపోయి..గాల్లోకి ఎగిరేంతవరకూ. ఈ విషయం అతనితో చెప్పదలచుకోలేదు…
…..
ఒక్కసారి చుట్టూ ఉన్న పరిసరాల వంక పరిశీలనగా చూశాను. లోయలు శూన్యాన్ని తింటూ శూన్యాన్ని నెమరు వేసుకుంటున్నాయి. చెట్ల ఆకుల కింది నీడలు మధ్యాహ్నపు నిద్రలో జోగుతున్నాయి. ఆకాశంలోని నీలిరంగుని కూడా కలుపుకొని వెలిగిపోతున్న ఎత్తయిన కొండలు ఎవరికీ అంతుబట్టని రహస్యాల గురించి గుసగుసలాడుకొంటున్నాయి… ఈ భూమ్మీద ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలెన్నింటినో వదిలేసి నాగరికులంతా ఇరుక్కొని ఇరుక్కొని కాలుష్యాన్ని తింటూ నగరాల్లో ఎందుకు బతుకుతుంటారో కదా అనిపించింది. ఎవరి సంగతో ఎందుకు… నిన్నా మొన్నటి దాకా నేనూ అట్లా బతికినోడినే కదా…!

ఏదో.. ఆ బతుకు మీద విరక్తి కలిగి… ఉన్నట్లుండి ఒక రోజు ఎందుకో – జీవితాన్ని మరణానికి ముందుండే కొద్దిపాటి సమయంతో ముడిపెట్టి చూసినందువల్లే కదా.. లక్ష్యమేదో తెలిసినట్లనిపించి.. ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా ఇలా బయలుదేరింది…?

యోసెమిటీ నేషనల్ పార్కు వెళ్ళేవాళ్ళంతా గ్లేషియర్ పాయింట్‌కి వెళ్తారు. అది, షుమారు మూడువేల అడుగుల ఎత్తున్న కొండ చరియ అంచు. అక్కణ్ణుంచి యోసెమిటీ వ్యాలీ అంతా చూడచ్చు. వచ్చేవారి కోసం కొండ అంచుకి దగ్గరగా ఒక మెటల్ రెయిలింగ్ కట్టుంటుంది, దాన్ని దాటద్దన్న హెచ్చరికతో. ఈ ఫెన్సు వెనకగా చరియనుంచి పక్షి ముక్కులా పొడుచుకొచ్చి ఒక రాయి ఉంటుంది కింద లోయలోకి తేలుతూ (ఏడో ఫోటో).

ఒకసారి రెయిలింగ్ దూకి వెళ్ళి ఆ రాయి వెనక అంచు దగ్గర నిలబడ్డాను. శరీరమంతా ఒక వింత గగుర్పాటు, గుళ్ళకమ్మ వంతెన మీద లాగే, ఇంకొంచెం బలంగా. నన్ను చిన్నగా అటూ ఇటూ ఊపుతున్న గాలి. ఒక్క పెద్ద అడుగు వేస్తే రాయి ముందు అంచు మీదికొస్తాను, నేనూ లోయపైన తేలతాను. అడుగు ముందుకు వేద్దామన్న కోరిక. వేయలేకపోయాను. శరీరంలో ఉన్న ఉద్వేగం సరిపోదు, ఇంకేదో కావాలి. ఉద్వేగాన్ని దాటిపోవాలి. అడుగు ముందుకు వేయాలంటే ఉద్వేగం నుంచి ఉన్మాదంలోకి నా మనస్థితి మారాలి. అప్పుడే అది సాధ్యం. అడుగు ముందుకు వేయడానికి, వేయకపోడానికీ మధ్య ఒక సన్నని తెర వుంది, వాటిని కలుపుతూనో, విడదీస్తూనో. ఆ తెర దాటి ఉన్మాదాన్ని పొందలేక పోయాను – నన్ను నేను మర్చిపోగలగాలి. నన్ను నేను నిర్వచించుకుంటున్నది నేనున్న స్థలాన్నీ కాలాన్నీ బట్టే కదా? లోయ మీద తేలాలంటే స్థలకాలాల స్పృహ పోగొట్టుకోవాలి – ఆ పని చేయలేకపోయాను.

పక్షుల గుంపొకటి మా తలలకు కొంచెం దూరంలోంచి వెళ్ళిపోయింది. సూర్యాస్తమయ సమయం దగ్గర పడుతోందని అర్థమైంది. ఇతను అరకు వరకే నాతో కల్సి ప్రయాణం చేస్తాడు. నేను అరకు దాటి చాలా దూరం వెళ్ళాలి. నా లక్ష్యాన్ని చేరుకోడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో తెలీదు.

“బాగా చీకటిపడేలోగానే అరకులోయ చేరుకోవాలి” అన్నాడతను.
“స్థలకాలాల స్పృహ మీకు బాగానే ఉంది కాబట్టీ త్వరలోనే మీరు మనిషి బరువును పొంది నేల మీద పూర్తిగా నడవగలరన్న నమ్మకం కలుగుతోంది నాకు,” అన్నాను అభినందన పూర్వకంగా.


ఉద్వేగాన్నుంచి ఉన్మాదంలోకి దూకటానికి ఏ ఆలోచన చేయూతనిస్తుంది? ఉద్వేగం నుంచి ఉన్మాదాన్ని విడదీసే లేదా కలిపే ఆ సన్నని తెరను దాటటానికి ఏ అనుభవాలు, ఏ నమ్మకాలు ప్రేరేపిస్తున్నాయి? ఇందుకేనా “There is but one truly serious philosophical problem, and that is suicide. Judging whether the life is or is not worth living amounts to answering the fundamental question of philosophy.” అని ఆల్బేర్ కామూ అన్నది? జీవితంలో నిర్లిప్తత ఎంత గాఢంగా ఉంటే, దాన్ని ఎంత తీవ్రంగా స్పర్శిస్తే మరణంపై అంత కుతూహలం పుడుతుందా? అసలు అది మనమనుకునే మరణమేనా? చావు అనే మాటకి వేరే అర్ధం ఉందా? అది కేవలం జీవితం కానిదిగానే స్ఫురించగలదా? ఏదో ఆశయం కోసం ప్రాణాలివ్వడానికీ, ఏమీ తోచక, బ్రతకడానికి కారణాలేమీ కనపడక అలా జీవితాన్ని దాటి వెళ్ళిపోడానికీ ,తేడా ఏమిటో? నాకు నిజంగానే తెలీదు.

…ఈ పరిసరాల్లోని వెలుగునీడల్లో, ఎత్తుపల్లాల్లో, మడతల్లో ఏదో అవ్యక్త దివ్యత్వం ఉన్నట్లనిపిస్తుంది… చెట్టు మీది నుండి చెట్టు మీదికి ఎగురుతూ నిశ్శబ్దాన్ని కొంచెం కొంచెంగా తాగుతున్న పిట్టల్ని చూస్తుంటే బరువెక్కిన మానవ జీవితాన్ని తల్చుకుని దుఃఖం కలిగింది…. కొంచెం దూరం నడిచాక ఎందుకో వెనక్కి తిరిగి చూశాను. నాకెందుకో – ముందుకు వెళ్తూ మనిషి వెదుకుతున్నదేదో… అది ఇంతకు క్రితమే అతడు దాటి వచ్చిందై వుంటుంది, అని అనిపిస్తుంటుంది. ఎందుకలా అనిపిస్తుందో తెలియదు.
…..
“… నాకెందుకో ఈ ప్రయాణంలో మీ పరిచయం, అనుకోకుండా ఇవాళ పౌర్ణమి అయి వుండడం.. ఇవన్నీ తల్చుకుంటోంటే ఈ రాత్రే ఈ దార్లో నేను కలలో వెదుకుతోన్న అద్భుతం ఎదురవుతుందని అనిపిస్తోంది. ఎందుకో… అసలు ఇది మొత్తం నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన రాత్రి అని కూడా అనిపిస్తోంది” అన్నాను, కొండల మీద పూర్తిగా పరుచుకుంటున్న చీకటిని చూస్తూ. అతను ఆలోచన్లో పడ్డాడు. ఏమనుకున్నాడో ఏమో కాసేపటి తర్వాత “పదండి నేను మీతోనే వస్తాను… అన్నాడు. నాకు చాలా ఆనందం కలిగింది…

ఏదో ఒక తోడు లేకపోతే ‘పోల్చుకోవడం’ చేతకాక – ‘నిర్ధారణ’కు రావడమెట్లాగో తెలియక పిచ్చెక్కి… మనిషి ఆత్మహత్య చేసుకుంటాడనుకుంటా.


ఉద్వేగాన్నుంచి ఉన్మాదానికి మధ్యలో ఉన్నది ఒక్క తెర అనుకున్నాను. అవును ఒక్క తెరే, కానీ తెరలు తెరలుగా తెరలున్న తెర. ఉద్వేగానికీ ఉన్మాదానికీ మధ్య తెరలు ఎలా మాయమౌతాయో ఎలా తెలుసుకోవడం? ఒక్కటే ఆలోచన, ఒక్కటే ఊహ, ఉద్వేగాన్ని మరింత బలంగా చేస్తూ, మనకు తెలిసిన నిజాలనన్నీ కొత్త రూపాల్లో చూపిస్తూ, జీవితానికీ యదార్థానికీ ఒక కొత్త భాష్యం చెపుతూ, ఒకే ముగింపు వైపు మొగ్గుచూపుతూ… భగవంతమే తెరలు తీసేస్తున్నాడు మనకోసం. ఎప్పుడైతే ఉద్వేగానికీ ఉన్మాదానికి మధ్య తెర తొలిగిపోయిందో, అప్పుడిక ఉన్నదల్లా అడుగు ముందుకేయడమే, మరో జన్మ ఎత్తడమే. స్థలమూ కాలమూ లేనిచోట అభూతమే భౌతికం. కల్పనే యదార్థం.

అరకు రైల్వేస్టేషన్ని సమీపించాం, కానీ దాని స్థల స్పృహ కూడా లేకుండా ఆ స్టేషన్ని దాటి చాలా దూరం వచ్చేశాం. ఇప్పుడు కాలస్పృహ కూడా పోయింది. అర్ధరాత్రి దాటిపోయిందన్న విషయాన్ని కూడా మేము పట్టించుకోలేదు.
…..
పున్నమి చంద్రుడు పెట్రేగిపోతున్నాడు. ఆకాశం నుండి కారుతున్న వెన్నెల కింద తడుస్తూ కొండలు, మలుపులు, చెట్లు, ఆకులు, ఆ ఆకుల చివరనుండి మొదలయ్యే శూన్యం.. అన్నీ ఆ రాత్రి తాంత్రిక స్నానం చేస్తున్నట్లనిపించాయి. లోయల మీద పరుచుకున్న వెన్నెల చర్మ సౌందర్యాన్ని తాగుతూ …కీచురాళ్ళ శబ్దానికీ శబ్దానికీ మధ్యనున్న నిశ్శబ్దంతో కలిసి మా ఇరువురి శరీరాలు ఆ ఎత్తయిన కొండల మీది రైలు పట్టాల మధ్య అలా చాలా దూరం ప్రయాణించాయి.
…..
“ఇంకాసేపట్లో పెద్ద టన్నెల్ రాబోతోంది. ఇంతకు ముందు మనం దాటొచ్చిన అన్ని సొరంగాల కన్నా పొడవైంది… ఈ రాత్రి నుండి వస్తున్న వాసనను గమనిస్తుంటే ఈ సొరంగం అవతలికి వెళ్ళేలోఫు నా లక్ష్యం నెరవేరబోతోంది అనిపిస్తోంది” అన్నాడు. అతని మాటల్లో ఏదో ప్రాకృతిక రహస్యం బలంగా వ్యక్తం కావడానికి గింజుకున్నట్లనిపించింది… నేను కూడా పక్షిలా ఎగరగలిగే సమయం ఇక వచ్చేసిందేమో అనిపించింది. ప్రతి రాత్రీ కలలో ఈ దార్లో నేను వెతికే అద్భుతం బహుశా ఈ టన్నెలేమో అని కూడా అనిపించింది.


కామూ తన ‘మిథ్ ఆఫ్ సిసిఫుస్‘ వ్యాసంలో అబ్సర్డ్ రీజనింగ్ గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు, “స్వచ్ఛందంగా చచ్చిపోదామన్న ఊహ ఒక అద్భుతమైన వర్ణచిత్రంలా మనసు లోతుల్లో ఒంటరితనం నింపిన నిశ్శబ్దంలో రూపు దిద్దుకుంటుంది. అయితే ఇది మనకు తెలియకుండానే అలవాటు సంకెళ్ళలో రోజూ జీవితం నిర్దేశించిన పనులు మనం చేస్తూండగానే జరిగిపోతుంది. అలా చనిపోడానికి కారణం – నిరర్ధకంగా, జీవితానికి బానిసలా నిర్బంధంగా, రోజువారీగా ఒక అలవాటుగా బ్రతుకుతూ ఉండటంలోని అపహాస్యతని- మన బ్రతుకులోని ఈ అర్ధరాహిత్యాన్ని స్వతఃసిద్ధంగా తెలుసుకోగలగడమో, ప్రయత్నపూర్వకంగా గుర్తించగలగడమో.

జీవితంలోని ఈ అర్ధరాహిత్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పట్నుంచీ జీవనం దుర్భరమవుతుంది. ఒక ఉన్మాదపు ఆలోచనలా అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది, ఒక ఆవేశపు కోరికలా దహించివేస్తూ వుంటుంది. ఒక గమ్యం కోసం, ఒక అర్ధం కోసం, మనం నిరంతరమూ వెతికేలా చేస్తుంది. ఐతే, ఈ అన్వేషణలో – అర్ధరాహిత్యాన్ని ఒక జీవన సత్యంగా అంగీకరించీ రాజీ పడటమా, ఆ లేమిని ఎలా పూరించుకోవాలో తెలియని ఆవేశంలో ఆత్మాహుతులైపోవడమా – ఏ ముగింపు వైపు మొగ్గుతున్నామన్నది ముఖ్యమైన ప్రశ్న.

మనసులో రూపు దిద్దుకునే ఈ భావాలు మాటల్లో మనం వ్యక్తం చేయగలిగిన దానికన్నా మరింత లోతైనవి. ఈ ఊహలు ఏ కార్యరూపం దాలుస్తాయో అవి పుట్టిన మనసుకి కూడా అర్ధం కానంత బలమైనవి. అత్యద్భుతమైన, అతి దుర్భరమైన, ఒక ప్రపంచాన్ని ఈ భావాలు తమవెంట తీసుకొస్తాయి. తమ ఆవేశపు వెలుగులో ప్రత్యేకమైన ఆ ప్రపంచంలో తమకు అనుకూలమైన వాతావరణాన్ని అవి ఏర్పరచుకుంటాయి.”

…”అయితే ఇంకో ప్రయోగం చేద్దాం… మనమిద్దరం ఒక నూతన జన్మను ఎత్తాలనుకుంటున్నాం కాబట్టి – అప్పుడే జన్మించిన శిశువులా నగ్నంగా మారిపోదాం. కొత్త జన్మ ఎత్తడానికి ఒక్కోసారి ఒంటి మీద నూలుపోగు కూడా అడ్డం అవుతుంది …మిత్రమా! ఇంక ఎక్కువ సమయం లేదు. పరుగెత్తు. మళ్ళీ ఈ టన్నెల్ చివర్లో కలుద్దాం” అంటూ అతను పరుగెత్తడం మొదలు పెట్టాడు…

నా వెనుక అనంతమైన నిశబ్దం మిగిలిపోయింది. ఒంటరి తనాన్ని ఆసరా చేసుకుని భయం ప్రవేశించకముందే లక్ష్యం వైపు గురిపెట్టాలి అనుకుని – గుండెల నిండా గట్టిగా గాలి పీల్చుకుని రైలుపట్టా ఇవతలి పక్క నుండి పరుగెత్తడం ప్రారంభించాను… నా నగ్న శరీరం ఆ టన్నెల్లో గడ్డకట్టిన చీకటిని కత్తిలా కోయసాగింది …అవతల వెన్నెల్లో వెలుగుతోన్న ప్రకృతి ఈ రాత్రి సంభవించబోయే అన్ని పరిణామాలను కనురెప్ప కూడా వాల్చకుండా ఉద్విగ్నంగా చూస్తున్నట్లనిపించింది.

రెండు చేతుల మీదా స్ప్రింగ్‌లా లేచి నిలబడి, పిచ్చి పట్టినట్లు పరుగెత్తడం మొదలు పెట్టాను… శరీరంలోని శక్తిని మొత్తం కాళ్ళలోకి తెచ్చుకుని… పరుగెత్తడం… పరుగెత్తడం.. పరుగె.. ఏదయితే అదైంది – మరింత.. మరింత వేగంగా.. ఒంట్లోని రక్తాన్నంతా పాదాల్లోకి తెచ్చుకుని… అంతే… చాలా పెద్ద గెంతు అది …ఏదో తేడాగా అనిపించింది.. తేలుతున్నాను కానీ పైకెగరడానికి బదులు కిందికి జారుతున్నాను.. నేనో పెద్ద లోయ లోంచి వేగంగా జారిపోతున్నాను…


ఈ కథ అప్పట్లో నన్ను తరచూ పలకరిస్తుండేది – డాలీ చిత్రాలను చూస్తూ పోగేసుకున్న నిమిషాలల్లే, ఒక అర్ధమయీ కాని ఏ కామూదో కాఫ్కాదో భావాన్ని భుజాన మోసుకు తిరిగే దినాలల్లే. నేను రహస్యంగా ఏ రాత్రి మూసిన రెప్పల వెనుకో తనను ఆత్మహత్యల గుసగుసల్లో కలుసుకుంటూ ఉండేవాణ్ణి, ఒంటరిగా.

తర్వాతెప్పుడో ఓ మంచిమనసు ఏమిటీ కథ అని నిజంగానే అంటే, ఇంకోసారి చదవండి అన్నాను ఎప్పట్లాగే. అప్పుడే ఈ కథపై నా ఊహలేమిటో కూడా చెబుతాననే అన్నాను. ఇది ఒక ఏడాది పైచిలుకు మాట. అప్పుడే చెప్పకపోవడం నా అలసత్వమే. ఇప్పుడు చెప్తున్నా కూడా ఆలోచనలు అప్పటివే, అభిప్రాయాలూ అప్పటివే, రెండేళ్ళ కిందట మొదటి ఒకట్రెండుమూడు సార్లు ఈ కథను చదివినప్పటివే.

కామూ రచయితకు తెలుసో లేదో, నాకు తెలియదు. నిజానికి తెలియాల్సిన అవసరం లేదనే నా నమ్మకం. కొన్ని ఆలోచనల పోలికలు తప్పితే కథలో కామూ జాడలూ అంతగా కనపడవు – జీవితాన్ని మరణానికి ముందు వుండే కొద్దిపాటి సమయంతో ముడిపెట్టటం లాంటివి తప్ప. జీవితంలోని అర్ధరాహిత్యాన్ని కామూ విశ్లేషిస్తున్నాడు, అది తప్పదని నిర్ధారిస్తూ ఆ యదార్థాన్ని గుర్తించడమే బ్రతకడానికి అవసరంగా చూపెడుతున్నాడు. కానీ భగవంతం భావోద్వేగంతో, ఒక మార్మిక తాత్త్వికతతో, ఆ అర్ధరాహిత్యాన్ని తప్పించుకోడానికి, ఒక కొత్త ప్రపంచాన్ని చిత్రించి ఈ జీవితాన్ని దాటి వెళ్ళిపోడానికి ఆలంబనగా అందిస్తున్నాడు. ఏ నిర్దిష్టమైన క్షణంలో, ఈ భావం ఆ ఏకాంతమైన మనసు లోయలో రూపు దిద్దుకుందో, ఏ కార్యరూపం ఎలా దాల్చిందో చెపుతున్నాడు, పదాలు ఎక్కువై అనుభవాన్ని చంపేయకుండా – తనకి లాగానే కామూ అవసరం మనకీ లేకుండా చేస్తున్నాడు.

అర్ధమయీ కానట్టిదీ, మనమింకా గుర్తించనిదీ, లేదా గుర్తించనట్టే ప్రవర్తిస్తున్నదీ అయిన ఈ ఇంకో ప్రపంచం మనకు కలిగిస్తున్న విస్మయపు తెరలు తీసి చూడండి, ఏం కనిపిస్తుందో? అస్తిత్వానికి ఏ విలువనూ ఇయ్యలేని జీవనాన్ని దాటిపోడానికి ఒక ఊహ పుట్టడం, తను బలోపేతం కావడానికి అనుకూలమైన వాతావరణం క్రమంగా ఆ ఊహ ఏర్పరచుకోవడం, ఆ క్రమంలోనే మొదట ఉన్న స్థల కాలాల స్పృహ మాయమైపోవడం, ఉద్వేగం ఉన్మాదమై ఆ ప్రపంచాన్ని అందుకోడానికి లోయపై పక్షిలా తేలడం. ఆ ఊహను మమేకం చేసుకుంటే చాలు పూర్తిగా అనుభవించడానికి, ఆ ప్రపంచంపై నమ్మకం ఉన్నా లేకున్నా.

కొన్ని నెలల తర్వాతనుకుంటాను, గుర్తులేదు. నవీన్‌, కథ-06 పుస్తకం విడుదల చేసినప్పుడు రచయితల్ని తమ కథల గురించి మాట్లాడమన్నామనీ, ఆఖరున మాట్లాడింది భగవంతమనీ అంటే, ఆయనేమన్నాడని అడిగాను. నేను చేసిన ఒక్క పొరపాటు ఆ ఇద్దర్నీ ఆ పల్చటి తెర కటూ ఇటూ ఉన్న ఒకే మనిషి ప్రతిరూపాలనుకోవడం – ‘నేను’ ఉద్వేగం తెర దాటడానికి చేయూత కోసం ఊహించుకున్న రూపమే ‘అతడు’ అనుకోవడం. కానీ, ఈ కథలో మనకు కనిపించేది ఎల్ లాబరింతో దెల్ ఫానో సినిమాలోలా చివరికి దొరికే ఒక సహేతుకమైన వివరణ లాంటిది కాదు. ఇది నిజంగానే ఫాంటాస్మగోరియా! మన నమ్మింతర్వాతే తలుపులు తెరుచుకునే మరో లోకమేమో అనే అనుమానం తొలుస్తున్నా, ఈ రకమైన అభిప్రాయానికి రావడం తర్కమూ హేతువూ వెతకడానికి అలవాటు పడ్డ ప్రాణం కావడం వల్ల అనుకుంటా. రచయిత తాంత్రిక ఊహాశక్తిని తక్కువ అంచనా వేశాను, అతనికి వారిద్దరూ యదార్థాలే! కథ మొదట్లోనే అతను ఏం చెప్తున్నాడో సరిగ్గా పట్టించుకోలేదు, ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే తప్పు నాదే. కానీ, ఇప్పటికీ ‘అతను’ ప్రతిరూపమైనా యదార్థమైనా తేడా ఏమిటో, నాకు తెలియటంలేదు. బహుశా, డాలీ చిత్రం లాగా భగవంతం కథ కూడా అక్కడక్కడా మన సొంత రంగులు అద్దుకోడానికి చోటిస్తోందేమో.


అంతే… చాలా పెద్ద గెంతు అది… ఏదో తేడాగా అనిపించింది… తేలుతున్నాను కానీ పైకెగరడానికి బదులు కిందికి జారుతున్నాను… నా ఒంటి మీద జీన్ ప్యాంటు. టీ షర్టూ ఉన్నాయి. టన్నెల్ అవతలి ద్వారం దగ్గర నేను విడిచి పడేసినవి… చుట్టూ చూశాను. నేనో పెద్ద లోయ లోంచి వేగంగా జారిపోతున్నాను. నా శరీరంలో ఎలాంటి మార్పు లేదు. అదే బరువు. దాని చుట్టూ కమ్ముకున్న అదే మానవ చర్మం.

ఏదో అనుమానం వచ్చి తలను పూర్తిగా పైకెత్తి నేను జారుతున్న లోయ పైభాగపు అంచు వైపు చూశాను…

దూరంగా… చాలా.. చా…లా.. దూరంగా…లోయ రెండు అంచుల్నీ కలుపుతూ వేసిన రైలు పట్టాల మధ్యలోంచి ఒక పక్షి ఆకాశం వైపు ఎగురుకుంటూ వెళ్తోంది. ఒకే… ఒక… పక్షి… అనుమానం లేదు.. అది… అతడే… పాపం పూర్ ఫెలో అనుకున్నాను.

క్రమంగా నాకు ఏదో కొంచెం కొంచెంగా అర్ధమవసాగింది. కానీ ఒక్క విషయం మాత్రం ఎందుకో అర్ధం కాలేదు.

అది అర్ధం కాకపోవడమే మంచిదేమో! అర్ధం అవుతూ అవనట్టే… ఒక మంచి కథ లోతు పూర్తిగా మనకు అందీ అందనట్లే…