ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం

మనమందరమూ కవితలు చదువుతూనే ఉంటాం – ఇష్టంతోనో, యాదాలాపంగానో. మనలో కొందరు కవితలు రాస్తారు కూడా. ఈ రాసేవారి సంగతి కాసేపు పక్కన పెడితే, ఇంచుమించు మనందరికీ ఎప్పుడో ఒక్కప్పుడు ఒక సందేహం వచ్చేవుంటుంది. అది, ఏ కవితనో చదువుతున్నప్పుడు – ఇదసలు కవితేనా, లేకపోతే వాక్యాన్ని పొట్టీ పొడుగూ ముక్కలుగా విరక్కొట్టి ఇది కవిత అని రాసినవారు బుకాయిస్తున్నారా? అని. ఆలోచిస్తే ఇదేమంత పెద్ద విషయం కాదు. ఆ రాసిన దాంట్లో కవితాంశ అనే ఆ మిస్టరీ పదార్థం ఉంటే అది నిజంగా కవితో కాదో మనమే అర్థం చేసుకుంటాం. అయితే ఇక్కడ ప్రశ్న అసలది కవిత్వమా కాదా అని కాదు; అది కవిత్వమే అయితే, కవి ఏ ఆధారంతో ఆ కవితలో పాదాలని విరక్కొడుతున్నాడు? అని. కవి తన కిష్టమొచ్చిన చోట, ఇష్టమొచ్చిన విధంగా పాదాలని విరక్కొట్టొచ్చా? దానికొక నియమమూ, నిబంధనా ఉంటాయా? ఉండవా? ఉండకపోతే ఉండాల్నా? అక్కర్లేదా?

ఈ సందేహాలు పద్యాలు రాసేవారికి ఉండవు. ఎందుకంటే, కవి ఏ పద్యం రాయదల్చుకున్నారో ఆ పద్యానికి లక్షణాలు అన్ని ముందే నిక్కచ్చిగా చెప్పబడి ఉన్నై కాబట్టి. ఉత్పలమాలలో రాయాలంటే భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు ప్రతీ పాదంలోనూ వచ్చేట్టే రాయాలి. ప్రాస యతి నియమాలు చెప్పిన అక్షరాలకి సరిపోయేట్టూ చూసుకోవాలి. ఇవన్నీ ఛందశ్శాస్త్రంలో ముందే నిర్దేశింపబడి ఉన్నై కాబట్టి మన కవి చేయాల్సిన పనల్లా వాటిని అతిక్రమించకుండా ఆ పద్యపు చట్రంలో ఇమిడేట్టుగా తను చెప్పదలచుకున్నది చెప్పడం. (అలా రాసినవన్నీ కవిత్వం కావనుకోండి, కానీ అది అప్రస్తుతం). ఈ ప్రశ్న ముఖ్యంగా వచ్చేది వచన కవిత్వం విషయంలో. దీనికి సమాధానం దొరకాలంటే ముందు వేయాల్సిన ప్రశ్న ఇది – వచనకవిత్వం పద్యంలోంచి పుట్టిందా, గద్యం(వచనం) లోంచి పుట్టిందా?

1910ల్లో గురజాడ వ్యావహారికభాషోద్యమం లేవనెత్తి, ముత్యాలసరాలనే కొత్త పద్యంతో నవయుగానికి నాంది పలికినా, ఆ పై కృష్ణశాస్త్రి తదితరులు భావకవిత్వంలో ఛందో నియమాలతో ఆటలాడినా, అప్పటికి వచన కవిత్వం పూర్తిగా రూపు దిద్దుకోలేదు. శ్రీశ్రీ 1930ల్లో రాసిన కవితలనేకం, మహాప్రస్థానంతో సహా, ఛందోధర్మాలకు లోబడి ఉన్నవే. వచన కవిత్వంలో మనం ఇప్పుడు చూస్తున్న మార్పు కుందుర్తి ఆంజనేయులు, మాదిరాజు రంగారావు, రమణారెడ్డి, దేవరకొండ బాలగంగాధర తిలక్ తదితరుల కవిత్వంతో ఆరంభమయిందే. ఈ మార్పు లక్షణం ఏమిటంటే, నిశ్చితమైన పద్యాల రూపు నుంచి పాదాల సంఖ్యపై పరిమితి లేకుండా ఒక నియమిత లయ, గతి ఉన్న గేయకవితలు గానూ, ఆపై ఏ లయ, గతి క్రమం లేకుండా పూర్తి వచనంలా చదువుకొన గలిగేట్టుగా కవిత్వపు రూపురేఖలు మారడం. స్థూలంగా చెప్పాలంటే పాడుకునే పద్ధతి నుంచి చదువుకునే పద్ధతికి కవిత్వం పరిణామక్రమంలో వచ్చిందనేది ఒక వివరణ. ఇదేమీ కాదు. వచన కవిత్వం అనేది ఛందోనిబంధనలలో చిక్కిన పాత కవిత్వాన్ని పూర్తిగా తోసిరాజని, సాంప్రదాయాలపై ఒక తిరుగుబాటుగా, అభ్యుదయ ఉద్యమానికి ప్రతీకగా వచ్చిన కవిత్వమని, దానికి ఏ నియమిత రూపురేఖలు లేవని, ఉండవని ఇంకో వాదన.

ఏ నియమిత రూపురేఖలు లేకపోతే, కవి తన ఇష్టం వచ్చినచోట వాక్యాలు విరక్కొట్టి కవితగా రాయవచ్చు. ఆ రాసింది కవిత్వమనే అనుకుంటే, చదివేటప్పుడు మనం కవి చెప్పినట్లుగా కాకుండా, మనకు నచ్చినట్లుగా ఆ పాదాలని పేర్చుకొని చదువుకుంటే భావవ్యాప్తిలో తేడా ఏమైనా ఉంటుందా? తేడా లేకపోతే, ఎవరికి వారే తమ కిష్టమైన పద్ధతిలో కవిత పాదాలను పేర్చుకుని చదువుకునే పక్షంలో, కవి తన కవితను పాదాలుగా విరక్కొట్టడమే అనవసరం కదా. పోనీ తేడా ఉంది. అంటే, కవి ఒక నియమం ప్రకారం తన కవితలో పాదాలు విభజిస్తున్నాడు. మరి ఆ నియమం పాఠకుడికీ తెలియాల్సి ఉంటుంది (కనీసం అర్థం కావలసి ఉంటుంది). అంటే ఆ కవిత విని మనం అచ్చులో రాసినప్పుడు, కవి ఏ రకంగా పాదాలు విభజించాడో, ఆ రకంగానే ఆ కవితను తిరిగి రాయగల్గడం. అంటే వచన కవితకు కూడా నియమాలుండాలని, ఉంటాయని (అంటే అది ఛందోధర్మానికి లోబడి ఉందని) ఒప్పుకోవడం. లేదూ, ఆ విభజనకు ఏ ఆధారమూ, నియమమూ లేదు. కవి, పాఠకుడు ఒకే రకంగా ఆ కవితను పాదాలుగా విడదీయాలనే నియమం ఏమీ లేదు. ఆ పాదాలుగా విరక్కొట్టడం కవి ఆర్బిట్రరీగా, నిర్హేతుకంగా చేసిన విభజన. దాన్ని ఎవరెలా రాసుకున్నా, చదువుకున్నా వచ్చే లోటేమీ లేదు అని తీర్మానించడం. ఏ రకంగా చూసినా కవిత అనేటప్పటికి పాదాలుగా విభజించబడి ఉండటం – పాదబద్ధత కలిగి ఉండటం – ముఖ్య లక్షణం అని తేలిపోతుంది.

ఈ వాదనల వెనకాల ఉన్న రాజకీయ కారణాలని కాసేపు పక్కన పెడదాం. ఎందుకు తన కవితలో పాదాలు ఎక్కడ విభజిస్తున్నాడో కవికే తెలియకపోవటం, లేదా కవికే స్పష్టత లేకపోవడం కవి లోపమే (లేదా కవి కనవసరం) అన్న వాదననూ పక్కన పెడదాం. పద్యగద్యాల మధ్య ఈ స్పష్టత లేకపోవడం వల్లనే పొడుగూ పొట్టి వాక్యాలుగా తాము రాసిందల్లా కవితలనే కవుల అభిప్రాయలూ, అవి కవితలే కాదనే మన నమ్మకాలనీ పక్కన పెడదాం. ఇవి కవితాత్మకి సంబంధించినవి. అలా కాకుండా, అసలు వచన కవిత్వానికి పాద బద్ధతలో నియమాలు ఉండాలా, లేదా? ఉంటే అవి ఏమిటి, అవి శాస్త్రపరీక్షకు నిలుస్తయ్యా, నిలవ్వా? – ఇదీ, ఒక సాహిత్యరూపానికి నిరపేక్షకమైన లక్షణాలు నిర్ధారించే తీరు. అలా వచన కవితకి కూడా నిర్దిష్టమైన లక్షణాలని ప్రతిపాదించవచ్చా? శాస్త్రపద్ధతిలో చర్చించి ఆ లక్షణాలు నిరూపించవచ్చా?

నిరూపించవచ్చనే అంటారు సంపత్కుమారాచార్య. అలా 1960ల్లో ఆయన కొన్ని వ్యాసాలలో – ‘వచన పద్యం’ అని ఆయన ఆ కవిత్వానికి పెట్టిన పేరు – ఆ లక్షణాలను నిర్వచించడానికి ప్రయత్నించారు. పాదవిభజనకు ఒక పద్ధతి ఉందనీ, ఒక్కో పాదం ఒక భావంతో కానీ, ఒక భావాంశతో కానీ పూర్తి కావాలనీ, ఒకే భావాంశం రెండు పాదాల్లోకి విడిపోకూడదనీ ఆయన ప్రతిపాదన. అయితే, సంపత్కుమార చెప్పిన లక్షణాలేవీ శాస్త్రపరీక్షకు నిలవ్వనీ, వాటికి హేతుబద్ధత లేదనీ, అవి ఆభాసాలేననీ భాషాశాస్త్రజ్ఞుడు చేకూరి రామారావు (చేరా) 1972లో ఆంధ్ర పత్రికలో ఒక వ్యాసం రాశారు. దానికి భారతిలో సంపత్కుమార జవాబుగా ఇచ్చిన వ్యాసంతో, నూతన తెలుగు సాహిత్యంలో ఒక అపురూపమైన చర్చ ఈ ఇద్దరు పండితుల మధ్య మొదలైంది. రాజకీయ వాదాలతో కాకుండా, శాస్త్రబద్ధంగా వచన పద్యపు లక్షణాల గురించి భాషాశాస్త్రాన్నీ, ఛందశ్శాస్త్రాన్నీ మధించి చేసిన చర్చ ఇది. ఈ చర్చ ముగిసేటప్పటికీ, ఇద్దరి అభిప్రాయాల్లోనూ మార్పులొచ్చినై, ఇతరుల వాదనలోని సహేతుకాంశాలని ఆదరించడం ద్వారా. ఎక్కడా మర్యాద తప్పకుండా, సాహితీ సంస్కారంతో, దూషణలకు తావివ్వకుండా, పరస్పర గౌరవంతో జరిగిన ఈ చర్చ నిజంగానే తెలుగులో సాహిత్య చర్చ ఉండాల్సిన పద్ధతికి ఒక చక్కటి ఉదాహరణ.

1. వచన పద్యం – ఆభాస లక్షణ నిరాకరణం, 2. వచన పద్యం – లక్షణ నిరూపణం, 3. వచన పద్యం ఛందోవిభాగం కాదు, 4. వచన పద్యం పద్యమే, 5. పద్యం, గద్యం, వచన పద్యం వగైరా, 6. వచన పద్యం – వాదసమాపనం: ఇలా ఆరు భాగాలుగా ఉన్న ఈ చర్చ పూర్తిపాఠం ఈ సంచికలో మీకు అందిస్తున్నాం. తప్పక చదవండి. మీకు ఛందస్సంటే ఏమీ తెలీదా? ఛందస్సంటే ఏ పద్యానికెన్ని గణాలో చెప్పే పాతకాలపు నియమాలు మాత్రమే అనే అనుకుంటున్నారా? ఛందశ్శాస్త్రం గురించి ఒక కొత్త అవగాహన మీకు ఏర్పడుతుంది. భాష ఉన్నది భావవ్యాప్తి కోసం. వ్యాకరణం అంటే కర్త, కర్మ, క్రియలే కాదు. అది భాషలో భావాలను ఎలా నియంత్రిస్తుంది, వాటిని ఎలా భాష ద్వారా ప్రసారం చేస్తుందో తెలుస్తుంది. ఈ చర్చ చదివితే, వ్యాకరణం అంటే ఒక కొత్త గౌరవం మీకు ఏర్పడుతుంది. నిష్కర్షకీ నిందకీ తేడా తెలియకుండా, వ్యక్తిగత దూషణలూ, అమర్యాదాపూర్వక అవహేళనలే సాహిత్య విమర్శగా కనిపిస్తూ, అందులో తప్పేమీ లేదనే వింత వాదనలు వినిపిస్తున్న ఈ రోజుల్లో, సామరస్యాపూర్వకంగా సాహిత్య చర్చ ఎలా చేయచ్చో తెలుస్తుంది. మీరు కవితలు చదివేవారైతే, ఆ కవితల నిర్మాణాన్ని గురించి కొంత లోతుగా ఆలోచించడానికి, కవితనూ, కవినీ అర్థం చేసుకొనడానికీ తోడ్పడుతుంది. మీరే కవులైతే, మీరు రాయబోయే కవిత ఎలా రూపుదిద్దుకుంటున్నదో, ఆ కవితా నిర్మాణాన్ని మీ కవిమేధ ఎలా శాసిస్తున్నదో మీకు మరింత తేటతెల్లం అవుతుంది. మీరెవరైనా సరే, కవిత్వ లక్షణం గురించి ఒక కొత్త ఆలోచన ఈ చర్చ మీలో రేకెత్తిస్తుంది. ఈ చర్చను (మళ్ళీ) చదవడానికి ఇలా ఎన్నో కారణాలున్నాయి.

ఈ చర్చ 1978లో ‘వచన పద్యం – లక్షణచర్చ’ అన్న పేరుతో పుస్తకంగా వెలువడింది. ఆ పుస్తకం పీఠికలో వారివురూ ఇలా అన్నారు – “ఈ పుస్తకప్రచురణ మా తత్త్వాన్వేషణకు సమాప్తి కాదు. మా అన్వేషణ మా మార్గాల్లో ఇంకా సాగుతూనే ఉంటుంది.”

సంపత్కుమారాచార్య స్మరణలో వస్తున్న ఈ సంచికలో, ఈ చర్చను పూర్తిపాఠంగా ఇవ్వటం ఆయన పాండిత్యానికి ఒక చక్కటి జ్ఞాపికగా ఉంటుందనే మా విశ్వాసం.


ఇంకొన్ని వివరాలకు సంప్రదించవలసిన పుస్తకాలు:

1. వచన పద్యం – లక్షణచర్చ, 1978, నాగార్జున ప్రింటర్స్, హైదరాబాదు.
2. ముత్యాల సరాల ముచ్చట్లు (చేకూరి రామారావు), 1997, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు.