కాల్వీనో కథల నుంచి – 6అ

గూగోళ జ్ఞానం

రా శ్రీకాంత్, రా. ఆ తలుపేసి వచ్చి ఇలా కూర్చో. ‘మీ రాజీనామా ఆమోదించడమైనదని తెలియజేస్తున్నాము’ అనేశారయ్యా మన కంపెనీ బాసులందరూ. నువ్వు వెంటనే డైరక్టర్‌వి కావడం తథ్యం. ఇదిగో, ఇకనుంచీ ఈ కుర్చీ నీది. మరీ అంత ఆశ్చర్యం నటించకోయ్! మన ఆఫీసులో పుకార్లు నీ చెవిలో పడలేదని నన్ను నమ్మమంటావ్! మెరికలాంటి కుర్రాడివి. నీ పనితనం నీతోపాటుగా చేరిన కుర్రాళ్ళలో ఎవరికుంది చెప్పు? అందుకేగా వాళ్ళింకా డివిజన్ హెడ్‌లు కూడా కాలేదు. నువ్వు చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ అయ్యే ఏడాది దాటింది. ఇంత చిన్న వయసులోనే సీవోవో కావడమంటే మాటలా? ఇదిగో, ఇదేదో నా సొంతానికి నిన్ను పిలిచి ఇలా పొగుడుతున్నానని అనుకునేవు. అదేమీ కాదు. పొద్దున్నే సీఈవో నుంచి ఫోన్ కాల్. నిన్ను పిలిచి వివరంగా అంతా చెప్పమని. నీకింకా మన కంపెనీ గురించి ఒకట్రెండు సంగతులు తెలీవు. అందుకనే కొంచెం వివరంగా మాట్లాడదామని నిన్ను పిలిచాను.

అసలూ, జ్ఞానం అంటే ఏమిటి శ్రీకాంత్? జ్ఞాపకాలే కదా. అనుభవాలు మనకిచ్చిన జ్ఞాపకాలన్నిటినీ కలిసికట్టుగా మనం ఒకరికొకరం సమాచారంగా అందించుకుంటున్నాం. అలా పోగైన సమాచారాన్నే జ్ఞానం అంటున్నాం. మన కంపెనీ కొన్నేళ్ళుగా ఈ విశ్వంలోనే అతి పెద్ద జ్ఞాపకాల డేటా ఆర్కైవ్ తయారు చేస్తున్నదని, మనకే కాదు, అందరికీ తెలుసు. జ్ఞానసర్వస్వం అను, జ్ఞాపకసర్వస్వం అను, ఈ ఆర్కైవులో ప్రపంచంలోని ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రతి వస్తువు గురించి తెలిసిన ప్రతి విషయాన్ని మనం కూరుస్తున్నాం. తొందరలోనే ఈ జ్ఞానసర్వస్వంలో లేని జ్ఞాపకాలు ఇక్కెక్కడా ఉండవు. ఇప్పుడు బ్రతికేవాళ్ళ వివరాలే కాదు, కాలం మొదలైనప్పటినుండీ జరిగిన ప్రతి సంఘటన వివరాలూ అందులో ఉన్నాయి. అంటే ఫలానా సంవత్సరం, ఫలానా రోజు, ఫలానా నిమిషంలో ఎక్కడెక్కడ, ఎవరెవరి జీవితాల్లో ఏమేం జరిగిందో దొంతరలు పేర్చి చూసినట్టుగా ఒకే సమయంలో మన ఆర్కైవుల్లో చూడవచ్చన్నమాట. చాలా పని ఇప్పటికే అయిపోయింది. ప్రపంచంలో ఉన్న పబ్లిక్ లైబ్రరీలు, ప్రైవేట్ లైబ్రరీల సమాచారమంతా డిజిటైజ్ చేసి ఆర్కైవ్ లోకి ఎక్కించాం. ప్రపంచంలో ఇప్పటిదాకా ప్రతీ దేశం నుంచీ వచ్చిన దిన పత్రికలు, వార్తా పత్రికలు, గజెటీర్లు, సువనీర్లు, డైజెస్టులు, వీటన్నిటి నుంచీ సమాచారం మన ఆర్కైవుకి చేరిపోయింది.

అన్నిటికంటే ముఖ్యంగా ప్రతీ దేశం ప్రతీ ప్రాంతపు ప్రతీ మనిషి నుండీ సమాచారం సేకరిస్తున్నాం. ప్రపంచంలో ప్రతీ అనుభవం జ్ఞాపకంగా మారుతున్నది మారుతున్నట్టుగా మన శాటిలైట్ డేటా సెంటర్స్‌లో నమోదు అవుతోంది. ఆపైన ఆ సమాచారమంతా ఒక్క మన లేబరేటరీకే వస్తుంది. మనం ఇక్కడ ఒక రిడక్షన్ ప్రాసెస్ ద్వారా ఆ సమాచారాన్ని వడపోస్తున్నాం. పాలను చిలికి అందులోంచి గడ్డగా వెన్నను తీసినట్టు, సేకరించిన సమాచారాన్ని తేటగా చేసి కుదిస్తున్నాం. అలా ముఖ్యమైన వివరాన్ని సమాచారం నుంచి చిక్కబట్టి క్వాంటమ్ మెమొరీ స్ట్రింగ్స్ మీద శాశ్వతంగా భద్రపరుస్తున్నాం. దీజ్ స్ట్రింగ్స్ ఆర్ పర్మనెంట్. దీజ్ విల్ బి అవర్ అల్టిమేట్ రియాలిటీ. ఈ రిడక్షన్ ప్రాసెస్ ఎక్కడ ఆపాలి అనే విషయం మీద మనకింకా సరైన పట్టు దొరకటం లేదనుకో. కానీ, మన లక్ష్యం ప్రపంచంలోని ఈ జ్ఞానాన్ని అంతటినీ వీలైనంత తక్కువ స్థలంలో భద్రపరచాలని కదా. ఉదాహరణకు, మన మెదడు సైజులో ఎంత చిన్నది చెప్పు? కానీ అందులోనే ఎన్ని కోట్ల వేరు వేరు జ్ఞాపకాలు, వేటికవే ప్రత్యేకంగా, లేవు? మన జ్ఞానసర్వస్వం నమూనా కూడా అదే.

వర్క్ అయిపోగానే ఇంటికి పోనియ్యకుండా పిలిచి మరీ నాకు తెలిసిన విషయాలే స్కూలు పిల్లవాడికి పాఠం చెప్పినట్టు ఎందుకిలా చెప్తున్నాడీ చాదస్తపు పెద్దమనిషి, అనుకుంటున్నావా? నిజమే, నీకు విసుగ్గానే అనిపించవచ్చు. నువ్విక్కడ చేరి ఐదేళ్ళు కూడా కాలేదు. మన లేబరేటరీ గురించి నాకెంత తెలుసో ఇంచుమించుగా నీకూ అంత తెలుసు. ఇంటర్వ్యూలో నువ్విచ్చిన సెమినార్ పేరేమిటీ, ఆ! ‘పల్లీ గింజలో ప్రపంచ సాహిత్యం’ కదూ. నీ సెమినార్ అయీ అవకముందే ఛైర్మన్ నీకు జాబ్ ఆఫర్ ఇచ్చాడు కదూ? నూటికో కోటికో ఒక్కరుంటారయ్యా నీలాంటి వాళ్ళు. మరి నీలాంటి మేధావికి నేను చెప్పేది చాదస్తపు ఉపన్యాసంలాగే అనిపిస్తుంది. కాదనను. కానీ కొంచెం ఓపిక పట్టు, శ్రీకాంత్. దయచేసి ఈ పూట నేను చెప్పదలచుకున్నదంతా చెప్పనివ్వు.

మనకు తెలిసిన ప్రపంచంలో ఇదొక్కటే ఇలాంటి లేబొరేటరీ అని నీకు తెలుసు. ఈ లేబరేటరీని ఊహించిందీ, నిజం చేసిందీ, అక్కణ్ణుంచి ఫౌండింగ్ డైరెక్టర్‌గా దీని బాధ్యతలన్నీ ఇప్పటిదాకా ఒంటిచేత్తో మోసిందీ నేనేనని నీకు తెలుసు. నాకు తెలిసిన జీవితం ఈ లేబరేటరీనే. ఇదే నా సర్వస్వం. కానీ నాకిక ఓపిక లేదు శ్రీకాంత్. నేనిక ఈ బరువు మోయలేను. వదిలివెళ్ళడం ఎంత బాధగా ఉన్నా తప్పదు. విచిత్రమైన పరిస్థితుల్లో నా భార్య మాయమైపోయిన దగ్గరినుండీ నేను నేనుగా లేను. తను లేని ఒంటరితనం నన్ను కృంగదీస్తోంది. ఏమాత్రం ఒంట్లో శక్తి ఉన్నా ఈ ఉద్యోగం వదిలిపెట్టేవాణ్ణి కాదు. ఇక నేను మామూలు మనిషిని ఎప్పటికీ కాలేను. ఈ మనాది నుంచి తప్పించుకోలేకనే, నేను ఛైర్మన్‌కి, ట్రస్టీలకీ నన్ను తప్పించమని ఉత్తరం రాశాను. వాళ్ళూ అర్థం చేసుకున్నారనుకుంటాను, నన్ను అట్టే ఇబ్బంది పెట్టకుండానే ఒప్పుకొని, నా చోట్లో నిన్ను కూర్చోపెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల ఇప్పటిదాకా తెలియని కొన్ని రహస్యాలు నీకిప్పుడు చెప్పాల్సిన బాధ్యత నామీద పడింది.

ఇలా మానవుల జ్ఞాపకాలని, మన ప్రపంచపు జ్ఞాన సమాచారాన్ని మనం ఎందుకిలా భద్రంగా కూడబెడుతున్నామో నిజంగా నీకు తెలుసా? అసలు కారణం ఇప్పుడు చెప్తాను విను. యుగాంతం. అవును శ్రీకాంత్, యుగాంతం. త్వరలోనే మానవాళి పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుందని మన కంపెనీ అంచనా. మన చరిత్ర, విజ్ఞానం, మన ఉనికి, సర్వస్వం తుడిచిపెట్టుకొని పోకుండా మన తర్వాత వచ్చే ప్రాణికోటికి అందజేయాలి. ఆ వచ్చేవారెవరో, ఎలా ఉంటారో మనకేమీ తెలియదు. అయినప్పటికీ అందజేయాలి, తప్పదు.

బైదివే, ఒక పెగ్ తీసుకుంటావా? ఈ మధ్య ఒక చిన్న బాటిల్ ఉంటోందిలే నా సొరుగులో ఎమర్జన్సీ కోసం. ఇక ఎంతోకాలం మన భారాన్ని భూమి మోయలేదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉన్నారు, అయినా మనం మారడం లేదు. అందువల్ల భూమి మీద జీవరాశి ఎంతో కాలం ఉండదు. సూర్యుడి జీవితం సగం గడిచిపోయిందని మనకు తెలుసు. మహా అయితే ఇంకో నాలుగైదు కోట్ల సంవత్సరాలలో మొత్తం నాశనమైపోతుంది. అది కూడా, అకస్మాత్తుగా ఏ అనర్థమూ జరక్కుండా ఉంటే. కానీ మనమీద మనకు ఆ నమ్మకం ఉందా? మనం ప్రశాంతంగా కలిసి మెలిసి జీవించే ప్రాణాలం కాదు. అందువల్ల ఏ క్షణంలో మనల్ని మనమే నాశనం చేసుకుంటామో మనకే తెలియదు, ఇప్పటికే ఎంత చేసుకున్నామో కూడా. మనకున్న ఈ అవలక్షణం గురించి ఏడ్చి ప్రయోజనం లేదు. మనం ఎంత ఏడ్చినా పోగొట్టుకున్నది తిరిగి వస్తుందా? నేనెంత ఏడ్చినా నా జానకి మళ్ళీ తిరిగి వస్తుందా? ఏమనుకోకు, జానకిని మర్చిపోలేక పోతున్నాను. తనను గుర్తుకు తెచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. …

ఈ బ్రహ్మాండంలో అనేకమైన గ్రహాలున్నాయి. వాటి మీద కూడా జీవరాశి ఉండే ఉండుండచ్చు. వాళ్ళ జీవనం మనలాగే ఉండుండచ్చు, లేకపోవచ్చు. అందుకని, మనం ఆగిన చోటునుంచి మన ఉనికిని వాళ్ళు కొనసాగించగలరా? మానవాళి అస్తిత్వం మన పిల్లల ద్వారా కొనసాగుతుందా? అలా కాకుండా ఆ గ్రహాంతర వాసుల ముందు తరాల వల్లనా? ఈ ఆలోచనలన్నీ అనవసరం. మరి ఏది అవసరమూ అంటే, మనం ఇప్పటిదాకా సంపాదించుకున్న జ్ఞానం వాళ్ళకి అందజేయడం. అందుకు గాను ఈ ప్రపంచపు జ్ఞాపక సర్వస్వాన్ని క్రోడీకరిస్తున్న ఏకైక కంపెనీకి, మైడియర్ శ్రీకాంత్, నువ్విప్పుడు డైరక్టర్‌వి కాబోతున్నావ్.

భయపడకు, ఇంతపనీ నేనొక్కణ్ణే చూడాలా అని. నీ పని పెద్దగా ఏమీ మారదు. ఇప్పుడు చేస్తున్న డేటా పనే ఇక ముందు కూడా. మన జ్ఞానాన్ని గ్రహాంతర వాసులకి ఎలా అందించాలో ఇంటర్‌స్టెల్లార్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ వాళ్ళు చూస్తున్నారు. ఆప్టికల్ వేవ్ మీడియా, సౌండ్ వేవ్ మీడియా – ఈ రెంటి మీదా ప్రయోగాలు చేస్తున్నారు. ఏ మీడియం వాడతారో ఇంకా తెలీదు. అసలు ట్రాన్స్‌మిట్ చెయ్యకుండా డేటా స్ట్రింగ్స్ ఒక క్యాప్సూల్‌లో పెట్టి భూమి లోపల ఎక్కడన్నా దాచిపెడతారేమో కూడా. ఎప్పటికో ఒకనాటికి గ్రహాంతర పురావస్తు శాఖ వాళ్ళెవరో మన గ్రహం మీద తవ్వి మన నిక్షేపాన్ని కనుక్కుంటారని ఊహిస్తున్నారేమో. అంతకు తెగించిన అసాధ్యులే మనవాళ్ళు. ఈ డేటా అంతటినీ డీకోడ్ చెయ్యడానికి కావలసిన లాంగ్వేజ్ టూల్స్, సెమాంటిక్స్, గ్రామర్ అంతా కూడా ఎబయాటిక్ లింగ్విస్టిక్స్ బ్రాంచ్ చూస్తోంది. వాళ్ళ పని పూర్తయింతర్వాత అవి స్ట్రింగ్స్ మీదకి చేర్చడం మాత్రమే మన పని. అందుకని ఇప్పటికి వాళ్ళ తలనొప్పులేవో వాళ్ళని పడనిద్దాం, మనకెలానూ సరిపోయినంత పని ఉండనే ఉంది. ఇంతకీ నేను చెప్పదలచుకుందేంటంటే, ఒక డైరక్టర్‌గా నీకుండబోయే బాధ్యతలు తప్ప కొత్తగా నీ భుజాలమీద ఇంకే బరువు పెట్టబోటం లేదని. అందుకని, నువ్విక ముందు చేయబోయే పని గురించి మాట్లాడడానికే ముఖ్యంగా నిన్నీరోజు నేనాపింది.

మన మానవజాతి తుడిచిపెట్టుకొని పోయేటప్పటికి ఎలా ఉంటుంది, ఊహించగలవా, శ్రీకాంత్? మన జ్ఞానం పెరగకుండా మట్టుగా నిలిచిపోయి ఉంటుంది. అనంతమైన కాలప్రవాహంలో ఈ విశ్వం మనకు ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చింది సమాచారం సేకరించడానికీ, పంచుకోడానికీ. మనకేదో లాటరీ తగిలినట్టుగా, అంటే నీకు అభ్యంతరం ఉండదనుకుంటాను. అంతకంటే ముఖ్యంగా సమాచారాన్ని పుట్టించే అవకాశాన్ని మనకిచ్చింది. చెప్పేవాడు, వినేవాడు, లేకపోతే చెప్పటానికి, వినటానికి ఒక విషయం అనేదే ఉండదు. అంటే సమాచారమనేదే ఉండదు. అవునా? ఈ భూమి మీద ప్రాణికోటి, ప్రత్యేకించి మన మానవ జాతి అట్లాంటిది. మన అనుభవాలను గుర్తుంచుకోవడం కోసం భాషలను పుట్టించుకొని, వ్రాయటం నేర్చుకొని సమాచారాన్ని పెంచుకోవడం పంచుకోవడమే మన లక్ష్యంగా, సమాచారమే మన ఉనికికి ప్రమాణంగా చేసుకున్నాం. సమాచార జీవితం యదార్థం గానూ, యదార్థ జీవితం సమాచారంగా మారడానికి పనికొచ్చే జ్ఞాపకంగా మాత్రమే మనం బ్రతుకుతున్నాం. నశించబోయే జాతి కొత్తగా నేర్చుకొని, పంచుకునే జ్ఞానం అంటూ కూడా ఎక్కువగా ఏమీ ఉండదు. ఒకసారి పూర్తిగా నాశనమైన తరవాత కొత్తగా పుట్టే సమాచారం అసలు ఉండదు. అంటే తొందర్లోనే ఏదో ఒకరోజు మన జ్ఞానం ఇక పెరగడం ఆగిపోయి, నశించిపోయిన భాషల పదకోశం లాగా పరిమితం అయిపోతుంది. అభివృద్ధి చెందుతున్నంత సేపే కదా మన జ్ఞానం కూడా పెరుగుతూ ఉండేది. అందుకనే, ఈ సమాచారమంతా వృధా కాకుండా మన కంపెనీ భద్రపరుస్తోంది, అది వేరేవారికెవరికో అందించగలమా లేదా అన్నది పూర్తిగా వేరే సంగతి.

అందుకని, ఒక డైరక్టర్‌గా నీ ముఖ్యమైన బాధ్యత ఏ వివరమూ ఒదిలేయబడకుండా చూసుకోవడం. ఏ వివరమైతే మనం ఒదిలేస్తామో అది లేనట్టే, అసలు ఎప్పుడూ జరగనట్టే. అట్లా అని, ఏ వివరమైనా గందరగోళానికి, అయోమయానికి దారి తీసేదిగా ఉంటే, ఆ వివరం ఎప్పుడూ జరగనట్టుగానే ఒదిలివేయడం కూడా నీకున్న ముఖ్యమైన బాధ్యతే అని మర్చిపోవద్దు. ఏ వివరమూ ఒదిలిపెట్టకపోవడం, అయోమయానికి దారితీసే ఏ వివరమైనా ఒదిలివేయడం, ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇదీ నీ బాధ్యత. మనం జ్ఞానసర్వస్వాన్ని వీలైనంత క్లుప్తంగా పొసగడానికి ప్రయత్నిస్తున్నామని మర్చిపోవద్దు. ఏ వివరమైనా చేరిస్తే ఆ క్లుప్తత పోతుంది అనుకున్నప్పుడు ఆ వివరం తుడిచివేయడమే మంచిది. ఓటి కుండలు పేర్చి అనవసరంగా కావడి బరువు పెంచడం లాంటిదే ఈ వివరాలు చేర్చడం కూడా.

మనం పేరుస్తున్న జ్ఞానసర్వస్వం ఎలా ఉండాలంటే, అది టూకీగా అందించే వివరం నుంచి, అది చెప్పని వివరాలన్నీ ఊహించి తెలుసుకోగలగాలి. ఏమీ మాట్లాడకుండా ఎంతో మాట్లాడినట్టు, వివరించి చెప్పకుండా ఎంతో వివరించినట్టు – ఇది నీకు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. కొన్ని సార్లు మనం ఒకటి రెండు మాటల్లోనే అరగంట మాట్లాడినదానికంటే ఎక్కువ అర్థం పొసుగుతాం. ఇది ఇందాక చెప్పినట్టు మన మెదడు లాగా. ఒక మాటనుంచో, ఒక ఊహనుంచో ఎన్నో రకాలైన ఆలోచనలను, జ్ఞాపకాలను మెదడు తవ్వితీసుకొస్తుంది. మన జ్ఞానసర్వస్వం ఆర్కైవ్ కూడా ఈ నమూనా ఆధారంగానే. ఈ నమూనాలో గొప్పతనం ఏంటంటే కేవలం మనం అందించింది మాత్రమే సమాచారం కాదు, మనం అందించనిది కూడా సమాచారమే. కేవలం అప్పుడు మాత్రమే ఆర్కైవులో సమాచారాన్ని చదివేవాళ్ళందరూ ఇప్పటిదాకా జరిగినదానిలో ఏది ముఖ్యం, ఏది కాదు, నిజానికి ఏది జరిగింది, ఏది జరగలేదు అని ఒక అంచనాకు రాగలరు. ఎందుకంటే మన జ్ఞానసర్వస్వం నుంచి మాత్రమే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏది జరిగిందో, జరుగుతున్నదో, జరగబోతుందో తెలిసేది. అందులో లేనిది అసలు లేదు. ఏకం సత్ అంటారు చూడూ, ఆ సత్యమే మన గూగోళం. సృష్టికి ప్రతిసృష్టి లాగా భూగోళపు యదార్థ ప్రపంచానికి ప్రతిగా మనం నిర్మిస్తున్న సమాచార ప్రపంచం గూగోళం.

కానీ నిజంగా మనం కూడబెడుతున్నది మాత్రమే అవసరమైన వివరమా? ఈ ప్రశ్న మన వృత్తిలో ఉన్నవారికి రాక తప్పదు. మన ఆర్కైవులో చోటు చేసుకోని వివరాలే నిజంగా పనికొచ్చే జ్ఞానం అని మనకు అనిపించవచ్చు. ఒక క్షణంలో అనుభవంలోకి వచ్చి తమ ఉనికి కూడా లేకుండా మాయమైపోయిన సంఘటనలు నిజాలు కావా? అటువంటి నిజాలకు మన గూగోళంలో చోటెక్కడ? ఈ ప్రశ్న అప్పుడప్పుడూ మనల్ని చికాకు పెడుతుంది. ఈ విషయం నీకూ అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఉన్నట్టుండి వచ్చిన ఆవులింత, జుయ్యిమని వినిపించిన ఈగ మోత, ఒక గగుర్పాటు, ఒక దురద, ఒక గిలిగింత ఇలా ఎన్నిటినో మనం క్షణకాలంలో అనుభవించి అంతే వేగంగా మర్చిపోతుంటాం. కానీ అవి మనమీద ఏదో ప్రభావాన్ని చూపిస్తాయి. మన ఆలోచననో, మన ధ్యానాన్నో మారుస్తాయి, ఆరకంగా మన గతిని మారుస్తాయి. ఇలాంటి మార్పుల అతి చిన్న వివరాలే జ్ఞానసర్వస్వంలో ఒక వింతా, వేడుకా లేకుండా నిరాసక్తంగా, మొక్కుబడిగా నమోదు అవుతున్న మన జ్ఞాపకాలపై ఆసక్తిని కలిగిస్తాయి. చదువరికి కుతూహలం కలిగిస్తాయి. న్యూటన్ ఆపిల్ పడడం చూశాడనీ, కెకూలే నిద్రమత్తులో కంచెను చూసి కలగన్నాడనీ, ఇలా మన జ్ఞానం అంతా కూడా ఒక దానితో ఒకటి పొంతన లేని చిన్న చిన్న సంఘటనల జ్ఞాపకాలే అని, వాటిని నమోదు చేయకుండా మనం వాటి ప్రాముఖ్యతను తుడిచిపెట్టేస్తున్నామనీ, అవి లేని గూగోళం లేని ఫోటోకి కట్టే ఫ్రేమ్ లాంటిదని, మనకనిపించడం సహజం.

అయితే, మన బలహీనత ఏంటంటే మనం ఈ రకంగా గమనించగానే వెంటనే ఆ విషయాన్ని గూగోళంలోకి నమోదు చేసేయాలని మనం తపన పడడం. ఎందుకంటే అదీ ఒక జ్ఞాపకమే కదా! ఈ బలహీనతకు నేనేమీ అతీతుణ్ణి కానని ముందే ఒప్పుకుంటున్నాను. నా కూనిరాగాలు, పలవరింతలు, పులకరింతలు, అర్థం పర్థం లేని ఆలోచనలు, ఇలాంటి వివరాలన్ని నేను ఆర్కైవులోకి అప్పుడప్పుడూ ఎక్కించి జనసామాన్యపు ఉమ్మడి జ్ఞాపకాల వివరాలలో దాచేశాను. ఇలా జ్ఞానసర్వస్వం పైన నీదంటూ ఒక ముద్ర వేయగలగడం, ఒక డైరక్టర్‌గా రేపు నువ్వు ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు నీకు దొరికే అదనపు హక్కు. దయచేసి నేను చెప్తున్నది పూర్తిగా అర్థం చేసుకో, శ్రీకాంత్. ఇది నీకిష్టమొచ్చినట్లు అడ్డూ ఆపూ లేని నిర్ణయాలు తీసుకోడమో, నీ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చెయ్యడమో కాదు. ఇది మన పనిలో ఒక విడదీయరాని భాగం అని గమనించు. మధ్యస్తంగా, ఏ సందేహానికీ, ఏ చర్చకూ అవకాశం ఇవ్వని విషయాల చిట్టాపద్దు, ప్రతీ సంఘటనకూ ఉండే ప్రత్యేకతను చెరిపివేసి విసుగు పుట్టించేలా సాగే నిజాల ఏకరువు, మన ప్రపంచం గురించిన నిజమైన జ్ఞానాన్ని వేరేవారికి ఎలా అందిస్తుంది? ఎవరికైనా అది తెలుసుకోవాలనిపిస్తుందా?

నీకొక ఉదాహరణ ఇస్తాను. ఏదో వేరే గ్రహం నుంచి మనకే ఒక జ్ఞానసర్వస్వం అందింది అనుకుందాం. దానినిండా, కేవలం నిర్ధారించబడిన నిజాలు, నిర్దిష్టంగా నమోదు చేయబడిన సంఘటనలు, అస్పష్టతకు తావు లేని అక్షర సత్యాల వంటివి మాత్రమే ఉన్నాయనుకుందాం. ఆ రకమైన జ్ఞానసర్వస్వం మనలో ఏ రకమైన కుతూహలాన్నీ రేకెత్తించలేదు. మన కల్పనకు తావిచ్చే సమాచారమే మనలో ఉత్సుకత రేకెత్తిస్తుంది. ప్రతి రోజూ కళ్ళకెదురుగా కనపడే నిజాలని మనం ఎంత ఆసక్తితో గమనిస్తున్నాం? అసలు గమనిస్తున్నామా? మన దృష్టి ఎప్పుడూ కనిపించీ కనిపించని వివరాల మీదే ఉంటుంది. మన కుతూహలం అంతా అర్థమయ్యీ అర్థంకాకుండా మసకగా ఉండే సమాచారం మీదే ఉంటుంది. మన ఆలోచనకూ, ఊహకూ పని పెట్టేవి, మన మెదడుకు మేత పెట్టేవి, మన కోరికల కడుపు నింపేవి, ఆ వివరాలమీదనే మనకు మోజు. ఒక పుకారు, ఒక గాసిప్ కలిగించే కుతూహలం ఒక నిజం కలిగిస్తుందా? తటస్థంగా ఒక దినపత్రికలో రాసిన వార్తకూ, అవే వివరాలను తన సొంత అభిప్రాయాల రంగులద్ది రాసే వార్తకూ ఉండే తేడా లాంటిదే ఇది. ఇలా రంగుటద్దాలలో చూపే నిజంలో నిజం వుండదు, నిజమే. కానీ, అదే ఎక్కువగా మనల్ని ఆకర్షిస్తుంది అనడంలో, ఇలా మసకబారిన నిజం అసలు కంటే కూడా ఎక్కువ నిజంగా అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఏదో ఒక రంగు మరక లేని నిజం నిజం కాదు.

ఈ విషయం నువ్వెప్పుడూ మర్చిపోకూడదు. ఒక డైరక్టర్‌గా నీ బాధ్యత ప్రపంచం నాల్గుదిక్కుల్నుండీ మన ఆఫీసులు సేకరించి ఆర్కైవులోకి చేరుస్తున్న సమాచారానికి రిడక్షన్ ప్రాసెస్‌లో నీదంటూ ప్రత్యేకమైన ఒక రంగు అద్దటం. నీ యునీక్ సబ్జెక్టివ్ శ్లాంట్, నీ స్పెషల్ సిగ్నేచర్ దానిమీద ఉంచడం. నిజానికి రంగు పూసి ఆసక్తికరంగా చేయటం. ఇలా ఆ సమాచారానికి నీ వ్యక్తిగతమైన రంగు అద్దకపోతే అది నిస్సారమైన నిజం అయిపోయే ప్రమాదం ఉంది. అక్కడక్కడా ఒక అభిప్రాయం, ఒక వ్యాఖ్య, ఒక చురక, ఇలా కావచ్చునేమో అనే ఒక ఊహ – ఇలాంటి అదనపు చమక్కు ఆ సమాచారానికి నువ్వివ్వాలి. ఎంతో సున్నితంగా, పరీక్షగా చూస్తే కానీ తెలియనంత తేలికగా ఈ సవరింపులుండాలి. నీకు డైరక్టర్ బాధ్యతలు అప్పగించబోయే ముందే నీతో నేను చెప్పదలచుకున్నది ఇదే.

రేపు ఒక డైరక్టర్‌గా నువ్వీ గూగోళాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న సవరింపులు నీకు కనిపిస్తాయి. నేను చేసినవి, నాకే ప్రత్యేకమైనవి. ఒక సంఘటనకో, ఒక యదార్థానికో నేను కట్టిన విలువ, ఒక నిజాన్ని పూర్తిగా తేటతెల్లం చేయకుండా నొక్కిపెట్టిన ఒక చిన్న వివరం, కొన్నికొన్నిసార్లు ఒక పల్చటి అబద్ధం కూడా. పుప్పొడి రాలినంత సుతారంగా అక్కడక్కడా నేను జల్లిన తళుకులవి, నా కుంచె గీసిన గీతలవి. అబద్ధాలు కూడానా అంటే అవును, అబద్ధాలు కూడా. అబద్ధాలలో ఏమాత్రం నిజం ఉండదనడం ఆలోచించకుండా చేసే ఆరోపణ. నిజాలు నిజాన్ని ఎంతగా మనకు చూపిస్తాయో అబద్ధాలు కూడా నిజాన్ని అంతే వివరంగా చూపించగలవని నీకూ తెలుసు. సైకియాట్రిస్ట్‌కి మనం చెప్పే నిజాలలో ఎంత విలువ ఉంటుందో, అతనితో మనం ఆడే అబద్ధాలలో కూడా అతనికి అంతే విలువ కనిపిస్తుంది. అదే రకంగా, మన గూగోళాన్ని పరిశోధించే వారంతా కూడా అందులో గూడార్థాన్ని ఇలానే తెలుసుకోగలుగుతారు.

ఈ వివరాలన్నీ నీకు మన సీఈవో చెప్పమన్నాడని నీకిప్పుడు చెప్పట్లేదు, శ్రీకాంత్. ఇవన్నీ కూడా నా సొంత అనుభవాల నుంచి నేను నేర్చుకున్న పాఠాలు, నా బాధ్యతలు తలకెత్తుకోబోతున్న నీకు ఒక సహోద్యోగిగా, ఒక సాటి మనిషిగా నీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా విను: అబద్ధమే మనం అందించాల్సిన నిజమైన సమాచారం. ఎక్కడైతే మనం ఇవ్వదల్చుకున్న సమాచారాన్ని అస్తవ్యస్తం కానీయకుండా, సుళువుగా అర్థం చేసుకునేలా మారుస్తుందనుకున్నప్పుడు, అబద్ధాలు జోడించవలసిన బాధ్యత నీకుంది. ఆ విచక్షణ నేను కాదనుకోలేదు. నా గురించిన జ్ఞాపకాలనే తీసుకుంటే నిజాలు కాని ఎన్నో వివరాలు ఇలా నేను స్ట్రింగ్స్ మీద జోడించాను. నా జీవితంలో సంఘటనలను నేను తారుమారు చేయడం, ఇదేమీ నైతికంగా తప్పు అనో, ఉద్యోగ ధర్మం కాదనో నేననుకోటం లేదు. అయినా నా జీవితం ఎలా ఉంటే ఎవరు పట్టించుకుంటారు గనక! ఉదాహరణకి, జానకితో నా జీవితం ఒక గొప్ప ప్రేమకథలా మార్చేశాను. మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా చిలకా గోరింకల్లా కలిసి మెలిసి ఏ కష్టమొచ్చినా, సుఖమొచ్చినా నవ్వుతూ పంచుకున్నట్టుగా , శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటేగా, నా దాంపత్యాన్ని నేను ఎలా ఊహించుకున్నానో అలాగే మార్చేశాను. కానీ అది నిజం కాదు, శ్రీకాంత్. జానకి కేవలం నన్ను తన సౌకర్యం కోసం పెళ్ళి చేసుకుంది. పెళ్ళయిన రోజు నుండీ తను నన్ను కేవలం తన అవసరాలకు వాడుకుంది. మా దాంపత్యం సాగినన్నాళ్ళూ ఒక అబద్ధం, ఒక మోసం, ఒక కపట నాటకం. మా మధ్య రోజూ నిజంగా ఏం జరిగిందనేది ఇప్పుడు అనవసరం. జానకి గూగోళంలో పదిమందికీ ఆదర్శంగా నిలిచిపోయే ఒక భార్యగా, ఒక సహచరిగా, ఏ కళంకమూ అంటలేని స్త్రీమూర్తిగా కలకాలం నిలిచిపోతుంది. ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడైన భర్త ఇంకొకడు ఉండడని కూడా అదే విధంగా పదిలపడుతుంది.

నిజానికి మొట్ట మొదట్లో నేను చేసినదల్లా మా రోజువారీ జీవితంలో వివరాలకి అక్కడక్కడా రంగులద్ది కొద్దిపాటి ముస్తాబు చెయ్యడమే. ఆ మాత్రం మార్పు చాలనే అనుకున్నాను. కానీ రాను రానూ, జానకి ప్రవర్తనను గమనించే కొద్దీ నా అనుమానాలు బలపడుతూ వచ్చినై. తన బట్టలలో వెతికాను, తన ఉత్తరాలు చదివాను. ఒక స్థితిలో తనను రహస్యంగా వెంబడించాను కూడా. ఏదైతే నేను జరగకూడదని అనుకున్నానో అదే జరుగుతున్నదని తెలిసినప్పుడు, నా అనుమానం నిజమై నా కళ్ళముందే నవ్వుతూ నన్ను ఎగతాళి చేస్తుంటే, ఆ పరిస్థితుల్లో నేనేం చేయగలను, శ్రీకాంత్? పవిత్రమైన ప్రేమమూర్తిగా ఉన్న జానకి రూపం మీద నల్ల సిరా మరకలు ఎలా పడనివ్వను? అందుకనే, నాకిక వేరే గత్యంతరం లేక, ఒక్కొక్క వివరాన్నీ జాగ్రత్తగా చెరిపేస్తూ వచ్చాను. ఎంత శ్రద్ధగా ఒక్కో నిజాన్నీ నేను చెరిపేస్తూ వస్తున్నా, ఏమూలో నాలో భయం పూర్తిగా పోలేదు. ఎక్కడో ఒక చోట, జ్ఞానసర్వస్వం వెతికేవారికి ఒక చిన్న కూపీ, ఒక చిన్న వివరం, ఒక చిన్న సైగ దొరికితే చాలదా, వారికి తెలిసిపోడానికి నిజంగా జానకి ఎలాంటిదో, తను గడిపిన జీవితం ఏమిటో అర్థం చేసుకోడానికి? శాశ్వతం కాని భూగోళంలోని నీడ శాశ్వతమైన గూగోళంలోని తన రూపుపై పడకుండా కలకాలం ఉండగలదా? అందుకే పగలూ రాత్రీ తేడా లేకుండా పని చేసి ప్రతి చిన్న విషయం, ప్రతి చిన్న వివరం చెరిపేసుకుంటూ, మార్చుకుంటూ వచ్చాను. ఇదంతా అసూయతో చేయలేదు, శ్రీకాంత్. ఈ లోకంలో జానకి చేతిలో చిత్తుగా ఓడిపోయాను, కనీసం ఆ లోకంలోనైనా నేను గెలవాలి అన్న కోరిక తోనే చేశాను.

ఇప్పటిదాకా నేను పడ్డ కష్టం వృధా కాకూడదు అంటే జానకి జీవితం గురించిన కొత్త సమాచారం గూగోళంలోకి నమోదు కాకూడదు. నశించిపోయిన జీవం కొత్త సమాచారాన్ని పుట్టించలేదని కదా ఇంతకు ముందు అనుకున్నాం. గూగోళంలో మన రూపం మన గురించిన జ్ఞాపకాలతో నిర్మించబడ్డ అవతారమే కాబట్టీ, జానకి జీవించినంత కాలం కొత్త కొత్త జ్ఞాపకాల వివరాలు గూగోళంలోకి నమోదవుతూ అప్పటికే నేను తీర్చిదిద్దిన జానకి రూపాన్ని మారుస్తూనే వుంటాయి. అలా కాకుండా ఉండాలంటే జానకి ఉండకూడదు. తను మాయమైపోవాలి, తన గురించి ఎంత వెతికినా ఏ ఆచూకీ ఉండకూడదు. తన శరీరాన్ని ఎలా ముక్కలుగా చేశాను, ఒక్కొక్క ముక్కనూ ఎలా మాయం చేస్తూ వచ్చాను, ఈ వివరాలన్నీ ఇప్పుడిక అనవసరం.

అరెరె! శ్రీకాంత్, ప్లీజ్, ప్లీజ్! దయచేసి కూర్చో శ్రీకాంత్. ప్లీజ్ స్టే కామ్. నేను చెప్పేది పూర్తిగా విను. ప్లీజ్ కామ్ డౌన్. దేర్ ఈజ్ నథింగ్ టు బి ఎఫ్రైడ్ ఆఫ్. ఆ వివరాలేవీ కూడా ఇప్పుడు మన ముందున్న పనికి ఏ మాత్రమూ పనికొచ్చేవి కావు, ఎందుకంటావా? ఇప్పటికే నేను గూగోళంలో అందరూ అసూయపడేలాంటి భర్తను. ఆపైన భార్యను పోగొట్టుకొని ఎవరూ తీర్చలేని ఒంటరితనంలో మిగిలిన జీవితాన్ని గడిపిన ప్రేమికుడిని. ఇదే క్వాంటమ్ మెమొరీ స్ట్రింగ్స్ మీద నా గురించి మిగిలిపోయే చివరి సమాచారం. గూగోళంలో నేనిలా శాశ్వతంగా మిగిలిపోవడం కంటే నాకు కావలిసినది ఏమీ లేదు.

కానీ నేను చేయవల్సిన పని పూర్తి కాలేదు, ఒక చిన్న వివరం కొంచెంగా మిగిలిపోయింది. గూగోళపు జ్ఞాపకాలలో ఏదో సంభాషణలో దొర్లిన ఒక ఊసు, పేరు చెప్పని ఒక మనిషిపై వినిపించిన పుకారు, ఎవరి మీదో ఒక గాలివాటు అపవాదు, ఏ గొంతులోనో ఏ సందర్భంలోనో ఒక వ్యక్తి గురించి తొణికిసలాడిన వ్యంగ్యం, ఇలా ఒక అతి చిన్న జ్ఞాపకం లోనో, తనకు ప్రత్యక్షంగా ఏ సంబంధమూ లేని ఏ సంగతి లోనో జానకి మిగిలిపోయి వుంటే? అలా కాకపోయినా డేటాబేస్‌లో ఒక స్ట్రింగ్ తెగిపోయి కొన్ని వివరాలు మారిపోవచ్చు, డేటా డీకోడర్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. మన లింగ్విస్టిక్ టూల్స్ కానీ, మన సెమాంటిక్ ప్రోగ్రామ్స్ కానీ ఏ సంబంధమూ లేని రెండు వివరాల మధ్య ఒక కొత్త సంబంధాన్ని చూపించచ్చు. జ్ఞాపకాల బంధుత్వంలో ఒక కొత్త కోణం కనపడచ్చు. అందుకనే, జానకితో పరిచయమున్న ప్రతి వ్యక్తి వివరాలు చెరిపి వేయడానికి నేను నిశ్చయించుకున్నాను. ఈ రిడక్షన్ ప్రాసెస్‌లో మన కొలీగ్స్ కొంతమంది తమ ఉనికి అనేదే లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకొనిపోడం నాకు ఇబ్బందిగానే వున్నా ఆ పని చేయక తప్పలేదు.

ఈ వివరాలన్నీ నీ అవసరం నాకుందనో, నీ సహాయం నాకు కావాలనో చెప్పట్లేదు, శ్రీకాంత్. జానకి ఎవరికోసమైతే నన్ను మోసం చేసిందో ఆ ప్రియుడి గురించిన వివరాలన్నీ మాయం చెయ్యడానికి నేను ఎంత విపరీతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో నీకు అర్థం కావడానికే నేనిదంతా నీకు చెప్తున్నది. నా వయసెలానూ అయిపోతోంది. నాకు ఈ లోకంలో మిగిలిపోయిన ఈ కొన్నేళ్ళు, గూగోళం ఆయుష్షుతో పోల్చుకుంటే కనురెప్పపాటులో వెయ్యో వంతు కూడా కాదు. మెమొరీ స్ట్రింగ్స్ మీది సమాచారాన్ని ఎవరూ మార్చలేరని నీకు తెలుసు. ఇప్పటికే గూగోళంలో నేనెలా నిలిచిపోదలుచుకున్నానో ఆ వివరాలన్నీ వాటి మీద పూర్తిగా నమోదైపోయాయి కాబట్టి ఇక నా శాశ్వతరూపంలో ఇక ఏ మార్పూ రాదు.

ఇక ఈ ప్రపంచంలో చేయాల్సిన పని అంటూ ఏమన్నా ఇంకా మిగిలే ఉందీ అంటే అది నిజాన్ని సవరించడం. గూగోళంలోని జ్ఞాపకాలకి సరిపోయేటట్టుగా మన ప్రపంచంలోని నిజాలను మార్చడం. ఒక జ్ఞాపకంతో సరిపోలని నిజాన్ని తుడిచివేస్తేనే కదా ఆ జ్ఞాపకం నిజంగా నిర్ధారణ అయేది. ఎలా అయితే మెమొరీ స్ట్రింగ్స్‌కి ముందే రిడక్షన్‌లో జానకి ప్రియుడిని పూర్తిగా తుడిచేశానో, అదే విధంగా మన ప్రపంచం నుంచి కూడా వాడిని తుడిచిపెట్టేయాలి. అందుకే శ్రీకాంత్, నా చేతిలో ఈ రివాల్వర్ ఇప్పుడు నీ నుదుటి మధ్యకు చూస్తున్నది, ఈ క్షణంలో నేను ట్రిగ్గర్ నొక్కుతున్నది.

(World memory, 1968.)