నేతల తలకోతలు
ఆ రాజధానిలో ఏ సంబరం ముందురోజో దిగినట్టున్నాను, ఎక్కడ చూసినా ఒకటే హడావిడిగా ఉంది. ఒకే రకం యూనిఫార్మ్ లాంటిది వేసుకున్న వలంటీర్లు కూడళ్ళలో వేదికలు కడుతున్నారు, పెద్ద పెద్ద మనుషుల కటౌట్లను వేదికల వెనక నిలబెడుతున్నారు. కరెంటు స్తంభాలకు రంగురంగుల తోరణాలు, జెండాలు వేలాడేస్తున్నారు. ఈ హడావిడి తప్పించుకుంటూ ఎదురుగా కనపడ్డ ఒక బార్ లోకి దూరాను. కిటకిటలాడుతోంది అది కూడా. ఎలానో బార్ కౌంటర్ దగ్గర ఒక కుర్చీ దొరికింది.
“ఏమైనా పండగా? నేషనల్ ఫెస్టివల్ లాంటిది?”
“లేద్సార్. మా లీడర్ల పండగ రేపు.” బీర్ గ్లాస్ నాముందు పెట్టి చూడమన్నట్టుగా తల ఎగరేస్తూ చెప్పాడు బార్ టెండర్. చుట్టూ చూశాను. బార్ గోడల మీద కూడా చాలామంది ఫోటోల పోస్టర్లున్నాయి. లీడర్లయుండాలి.
“ఓ! కొత్త ప్రభుత్వమా!” బైటనుంచి వినపడుతున్న కన్‌స్ట్రక్షన్ చప్పుళ్ళను దాటి మాట వినపడాలంటే అరవాల్సి వస్తోంది.
కౌంటర్ వెనకాల నుంచి తల అడ్డంగా ఊగింది. “లేదు. కొత్త ప్రభుత్వం కాదు. కొన్నేళ్ళుగా ఉన్నదే.”
“మీ గవర్న్‌మెంట్ అధికారంలోకి వచ్చిన రోజా?”
“అలాంటిదే అనుకోండి. ఈ పండగ ప్రతీ ఐదేళ్ళకూ వస్తుంటుంది. ఈసారి వీళ్ళ వంతు.” నా ప్రశ్న బార్ టెండర్‌కు వినిపించిందో లేదో కాని, నా కుర్చీ వెనకనే ఆర్డరిద్దామని నిలబడ్డ కస్టమర్‌కు వినిపించింది.
“వీళ్ళ వంతా? దేనికి?”
“వేదిక మీదకు ఎక్కడానికి.”
“ఏ వేదిక? ప్రతీ సెంటర్ లోనూ కడుతున్నారు కదా. చాలా చూశాను ఇక్కడకి వస్తూ, అలాంటివి.”
“అవును. ఎవరి వేదిక వారిదే. మాకు చాలామంది నాయకులున్నారు.”
“ఎక్కి? ఉపన్యాసాలిస్తారా?”
“ఉపన్యాసాలా? అబ్బే. అలాంటివేమీ ఉండవండీ.”
“మరి? వేదిక మీదకు వెళతారు. వెళ్ళి ఏం చేస్తారు?”
“ఏముంది చేయడానికి. అక్కడ ఏర్పాట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసేదాకా ఒక పక్కగా నిలబడుంటారు, ఎదురు చూస్తూ. అన్నీ సరిగానే ఉంటే సరిగ్గా రెండు నిమిషాల్లో తంతు పూర్తయిపోతుంది.”
“మరి మీరు? అంటే అదే, ప్రజలు.”
“చూస్తాం.”
“అంటే రీ-ఎలక్షనా? లేదూ ఈ ఐదేళ్ళలో వాళ్ళ వాగ్దానాలు అమలు చేశారా లేదా తేల్చుకుంటారా?”
బార్ లోకి చాలామంది వలంటీర్లు వస్తూ పోతూ ఉన్నారు. ఆ పూటకు వారి పని అయిపోయినట్టుంది. బార్ దగ్గరే నిలబడి ఒక పెగ్ తాగి వెళ్ళిపోతున్నవారు కొందరు. ఒక బీర్ చేత్తో పట్టుకుని అక్కడే నిలబడి కబుర్లాడుకుంటున్నవారు ఇంకొందరు. పెద్దగొంతుతో నేనడిగే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు ఒక్కోసారి ఒక్కొక్కరినుంచి రావడం మొదలయింది.
“లేదు. లేదు. మీరు కొత్త అనుకుంటా. మీకు అర్థం కావటంలేదా? ఇదే ఆఖరు వాళ్ళకు. వాళ్ళ టైము ఐపోయింది. వాళ్ళు ఇక లీడర్లు కారు. పెద్దతలలు ఇక పెద్దవి కావు. అందుకని రాలిపడాలి.”
“మరి రేపు వేదికలెందుకూ ఎక్కడం?”
“తల రాలిపడినప్పుడు అందరికీ కనిపించద్దుటండీ? తల ఎలా తెగింది, ఎంత శుభ్రంగా కత్తి వాదర మెడ మీద పడింది, రక్తం ఎంత తక్కువ చిమ్మింది, తల బంతిలా ఎలా ఒక్క గెంతు వేసి వేదిక ముందు పెట్టిన బుట్టలో పడింది, ఇవన్నీ కదూ రేపు అందరూ మాట్లాడుకొనేదీ!”
నాకు కొద్దికొద్దిగా అర్థమవుతోంది కానీ నమ్మకం కలగడంలేదు. గ్లాసు ఎత్తి బీరు గొంతులోకి పోసుకున్నాను. ఇంకో గ్లాసు ఆర్డరిచ్చి పక్కనున్నాయన వైపు తిరిగాను.
“మీరు చెప్పడం మీ నేతల తలలా? నిజంగా తలలు. అవి రాలిపడతాయా? బుట్టల్లోకి?”
“అవును. అవును. భలే ప్రాసలో చెప్పారు మీరు. నేతల తలలే తెగి రాలి పడునులే!”
నేను ఇక్కడికి కొత్త, ఇదే మొదటిసారి రావడం. నాకు ఫోన్, నెట్ వంటివి ఇంకా రాలేదు. బయలుదేరే ముందు ఈ ఊరి గురించి వివరాలు వెతుక్కొనే టైమూ దొరకలేదు. అందుకే ఈ సంప్రదాయం గురించి నాకేమీ తెలీదు. నేనొచ్చే దారిలో ఎక్కడా న్యూస్ పేపర్లూ కనపడలేదు, కనీసం అలా అయినా తెలుస్తుందంటే.
“అలా చులాగ్గా! రేపే, టకామని ఉన్నట్టుండి?”
“వచ్చే రోజు ఎలానూ రానే వస్తుందండీ, మీరు రావాలనుకున్నా, ఒద్దనుకున్నా. పోయిన సారి వీకెండ్‌లో శనివారం నాడు వచ్చింది. ఈ సారి వారం మధ్యలో వచ్చింది. నేషనల్ హాలీడే ఇచ్చారు. రేపు అన్నీ బంద్. ఆఫీసులు, ఫాక్టరీలు, స్కూళ్ళు, రైళ్ళు, బస్సులు ఏవీ పనిచేయవు.”
“కాయ పండు కాగానే కోస్తాం. చెట్టుమీదే కుళ్ళిపోనియ్యం కదా? నేతలూ అలానే. వాళ్ళ తలలూ అలాగే.” నాకు ఇటుపక్కగా కౌంటర్ దగ్గరే కూర్చొని అప్పటిదాకా మౌనంగా ఉన్న ఒక పెద్దాయన ఉన్నమాటగా అన్నాడు. తల తిప్పి చూశాను. వయసులో కొద్దిగా పెద్ద. కణతల దగ్గర నెరిసిన జుట్టు. అనుభవాలు మూటగట్టుకున్న మొఖం.
నేనిక ఏమీ మాట్లాడలేదు. బార్ వెనకాలగా ఔట్‌డోర్ ఏరియా లోంచి ఆ కూడలిలో వలంటీర్లు కడుతున్న వేదిక కనిపిస్తోంది. మైనం కాగితపు పట్టా ఒకటి వేదిక అంతా పరిచారు. ఆపైన వేదిక మీద ఒక సారువ, వెడల్పాటి ద్వారబంధం లాంటిది నిలబెట్టారు. దానికి ఊతంగా అటూ ఇటూ ఏటవాలుగా ఇనుప తీగలు కట్టి వాటిని గూటాలతో నేలలోకి గుంజి పాతారు. ఆ సారువ పైరెండు అంచుల్లోను రెండు గిలకలు బిగించారు. వాటి ఇరుసులకు జిడ్డు పట్టించారు. వాటినుంచి మందపాటి తాళ్ళతో గొడ్డలిలా వెడల్పైన ఒక కత్తి వేలాడేశారు. వేలాడుతున్న ఆ గిలెటిన్ కింద ఒక పెద్ద పళ్ళెం లాంటిది పెట్టి దాని మీద నున్నగా మెరక పట్టిన ఒక కొయ్య దుంగ పెట్టారు. ఆ పళ్ళెం నుంచి రక్తం పారడానికి కాలువలలాగా గొట్టాలు బిగించి వాటిని వేదిక అంచు దాటించారు. కత్తి మీద, దుంగ మీద మట్టం సరి చూశారు. కత్తిని నిదానంగా పైకీ కిందకూ దింపుతూ లేపుతూ కత్తి వాదర ఆ దుంగ మీద ఎక్కడ ఆనుతోందో చూసి అక్కడ గుర్తులు పెట్టారు. ఆపైన ఒక మనిషిని ఆ గుర్తు మీద మెడ ఆనించి పడుకోబెట్టి మరీ కత్తి వాదర మెడ మీద పడుతోందో లేదో నిర్ధారించుకున్నారు. వేదికకు ఒక పక్కన గుడ్డల పొత్తి ఒకటి పెట్టారు, పొరపాటున రక్తం చిందితే పీల్చివేయడం కోసం అయుండాలి. అంతా హడావిడిగా, చకచకా పనిచేస్తున్నారు. ఎవరి ముఖంలోనూ అలసట లేదు. అంతా ఉత్సాహంగా పనిచేస్తున్నారు పెళ్ళిమండపం కడుతున్నంత ఆనందంగా. అప్పుడప్పుడూ పెద్దగా నవ్వుతున్నారు కూడానూ, ఎవరో ఏదో జోక్ వేసుండాలి. నిదానంగా తల తిప్పి చూశాను. ఇటుపక్క ఆయన మౌనంగా తన గ్లాసులోకి చూస్తున్నాడు.
“ఎందుకు ఇదంతా? మీరు ఆనందంగా లేరా? వాళ్ళు మంచి నాయకులు కాదా? మీ లీడర్లు అంటే మీకు ఇష్టం లేదా?”
“అయ్యో, అదేం లేదు. అలా ఎందుకనిపించింది మీకు?” ఆశ్చర్యంగా అడిగాడు ఒక వలంటీరు. ఇంకో ఇద్దరు ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. “వాళ్ళు మంచి నాయకులే. అంటే మంచి అనీ కాదూ చెడు అనీ కాదు. వాళ్ళ ముందరి వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళూ అలానే ఉన్నారు. ఎక్కువా లేదు తక్కువా లేదు. మీకు తెలిసే ఉంటుంది కదా నాయకులు ఎలా ఉంటారో. ప్రధానమంత్రులూ, ముఖ్యమంత్రులూ, అధ్యక్షులూ, అటువంటి పదవులు కోరుకొని ఆ అధికారం కోసం ప్రయత్నించే రాజకీయ నాయకులందరి లాగానే వీళ్ళు కూడానూ.”
“కానీ, ముందు వాటికన్నా ఈ ప్రభుత్వం అంటే నాకు కొద్దిగా ఇష్టం.” ఒక వలంటీర్.
“అవును. నాకూ ఇష్టమే.” “నాకూ ఇష్టమే.” మరికొన్ని గొంతులు వంత పాడాయి. “నిజానికి వీళ్ళ మీద నాకే ఫిర్యాదులూ లేవు.”
“మరి? వాళ్ళను చంపుతున్నందుకు మీకు బాధగా లేదా?” అడిగాను.
“మేం మాత్రం ఏం చేయం? ఎవరి చేతుల్లో మాత్రం ఏముంది? ఇలా నాయకుడిని అవాలి అనుకున్న ప్రతీ మనిషికీ, నాయకుడు కావడానికి ఒప్పుకున్న మరుక్షణం తెలుసు ఏం కాబోతోందో, తన జీవితం ఎలా ముగుస్తుందో. హాయిగా మంచంలో పడుకొని నిద్రలోనే పోతానని ఊహించుకుంటారా ఏం?”
అందరూ నవ్వారు పెద్దగా. “ఆహా! అద్భుతంగా ఉంటుంది. ఎవరో ఒకరు నాయకులవుతారు. పాలిస్తారు. శాసిస్తారు. ఆపైన ఏమీ జరగనట్టు, గద్దె దిగి హాయిగా ఇంటికి పోయి శేషజీవితం గడుపుతారు.”
“ఏ లోకంలో బాబూ అది! అప్పుడు ప్రతీవాడూ నాయకుడవాలనే అనుకుంటాడు. ఎవరో ఎందుకూ, నేను కూడా లీడర్ కావాలనుకుంటాను.” ఇంకో నవ్వు.
“నేను కూడా!” “నేను కూడా!” నవ్వులు. గ్లాసులెత్తి ఛీర్స్ చెప్పుకుంటూ మళ్ళీ నవ్వులు.
“నేను కాదు. ఆ పద్ధతిలో అయితే కాను. ఏం ప్రయోజనం అలా లీడర్ అయి?” ఒక కళ్ళజోడు పెద్దమనిషి అన్నాడు. ఆయన మాట్లాడే తీరు చూస్తే బాగా చదువుకున్నవాడిలా అనిపించాడు.
“అవును. అవును. అలా ఇంటికెళ్ళిపోగలిగితే లీడర్ అవడంలో ఉపయోగం లేదు.” వెంటనే పదిమంది ఒప్పుకున్నారు. “ఏం జరగబోతోందో, ఏం కాబోతోందో తెలిసి అలాంటి ఉద్యోగం చేయడం ఒక ఎత్తు. అలాంటి ఉద్యోగాలు ఇంకెలా చేస్తారు?”
ఆ కళ్ళజోడు పెద్దమనిషి నావైపు తిరిగి నాకు పాఠం చెప్తున్నట్టుగా చెప్పాడు: “ఇతరుల మీద నీకున్న అధికారం, వారికి నీమీద ఉన్న అధికారం వేరు వేరు కాదు, ఒకటే. ఈరోజు ఒక నాయకుడిగా వారిపై నీకున్న అధికారమే, త్వరలో ఏదో ఒకరోజు ఆ కొయ్యదుంగ మీద నీ తల ఆనించడానికి వారికీ ఉంది. అలా లేనప్పుడు నాయకుడి ప్రత్యేకత ఏముంటుంది? తన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిన నాయకుడి మొఖంలో కదా ఆ నాయకత్వపు ధీమా, ఆ సత్యం అతని చుట్టూ వెలుగుతూ కనిపించేది! తన అంతం గురించిన ఆ స్పష్టత, అతను పాలించిన ప్రతిక్షణమూ ఆ నేత కళ్ళల్లో నువ్వు చూడగలగాలి. పౌరసమాజాలు ఈ అధికారవిచక్షణ ఆధారంగానే, అది ఇలా రెండువైపులా సమానంగా ఉండడం మీదనే ఆధారపడి వున్నాయి. ఏ సమాజమూ ఇంకే రకమైన అధికారవిభజననూ అమలు చేయలేదు.”
“అలా ఎలా అంటారు?” అడ్డం తగిలాను. “మీకు కావాలంటే నేను కొన్ని ఉదాహరణలు…”
“సమాజం అంటే నిజమైన పౌరసమాజాల గురించి చెప్తున్నాను నేను.” కళ్ళజోడులోంచి నేరుగా చూస్తూ అన్నాడు ఆయన. “నేను అరాచకపు ప్రభుత్వాల గురించి, అటువంటి అనాగరిక సమాజాల గురించీ మాట్లాడటంలేదు, అలాంటివి ఎన్ని ఏండ్లపాటు మనుగడలో ఉన్నా.”
“తల మెడ మీద ఉన్నంత వరకూ శాసిస్తూనే ఉంటుంది.” కాయ పండు చెట్టు అని ఉదాహరణ చెప్పి, ఇప్పటిదాకా నిదానంగా తాగుతూ, తన గ్లాసులోకే చూస్తూ మౌనంగా ఉన్న ఆ పెద్దాయన తనలో తనే గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు.
“అర్థం కాలేదు. మీ ఉద్దేశ్యం ఏమిటో చెప్తారా?” ఒక వలంటీరు అన్నాడు. “ఉదాహరణకు, ఒక నాయకుడున్నాడు. ఐదేళ్ళు పాలిస్తాడు. ఆ తర్వాత, మాట వరసకు, అతని తల తెగిపోకుండా ఉంది అనుకుందాం. మీరు చెప్పడం, అతను ఇంకా అధికారాన్ని అంటిపెట్టుకొనే ఉంటాడా, మనల్ని శాసిస్తూనే ఉంటాడా?”
“ఒకప్పుడు పరిస్థితులు అలానే ఉండేవి.” పెద్దాయన ఒప్పుకుంటున్నట్టుగా తల ఊపాడు. “ఎవరైతే నేత అవుతారో, త్వరలోనే వారి తల తెగిపడుతుంది అన్న స్పష్టత లేని రోజుల్లో, అధికారం ఎవరికైతే వచ్చేదో, దాన్ని చివరిదాకా అంటిపెట్టుకొనే ఉండేవాళ్ళు.”
నేను ఏదో అనబోయి నోరు మూసుకున్నాను. నేను ఎన్ని ఉదాహరణలిచ్చినా, ఏమైనా చెప్పబోయినా ఎవరికీ వినపడేలా లేదు.
“మరి, మరి అప్పుడు ప్రజలేం చేశారు?” వలంటీర్లు ఆ పెద్దాయనను అడిగారు.
“ఇష్టమున్నా లేకున్నా వాళ్ళ తలలు తెంచేవాళ్ళు. మొండిగా మొరటుగా, ఆ నాయకుల ఇష్టానికి వ్యతిరేకంగా. ఇప్పట్లా ముందే అనుకున్న రోజున కాదు. ఎప్పుడు పడితే అప్పుడు. ఇక వారిని భరించలేం అనుకున్నప్పుడూ, నిజంగానే భరించలేక పోయినప్పుడూ. అలా జరుగుతుండేది, లీడర్లు అందరూ ఒప్పుకొని ఇలా దారికి రాకముందు…”
“ఆహా! అలా ఒప్పుకోకుండా ఎలా ఉండేవాళ్ళో మేమూ చూసేవాళ్ళం.” ఒక వలంటీరు. “అవును మేమూ చూసేవాళ్ళం.” అందరి వంతపాట.
“అది మీరనుకుంటున్నట్టు కాదు.” కళ్ళజోడు పెద్దమనిషి అందర్నీ ఆపుతూ అన్నాడు. “నాయకులు బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా చంపబడ్డారనేది నిజం కాదు. అలా అంటున్నారూ అంటే మన రాజ్యాంగపు చట్టాలను సరిగ్గా అర్థంచేసుకోలేదన్నమాటే. నాయకులను ప్రజలతో నిజంగా కలిపే బంధం మన చట్టాల నిజమైన అర్థం, ఆశయం. నేతల తలలే తెగిపడతాయి ఎందుకూ అంటే తెగిపడడానికి సిద్ధపడని తల ఒక సమాజానికి పెద్దతల కాలేదు. ఈ కత్తి వాదరకు తల సాచడం తమ ధర్మం, తమ బాధ్యత అనుకొనే తల మాత్రమే నేత కాగలుగుతుంది. అధికారాన్ని కోరుకుంటుంది. ప్రమాణస్వీకారం చేసిన రోజునే తన తల తెగిపోయింది అని అనుకున్నవాడు మాత్రమే అధినేత కాగలడు.”
మెల్లిమెల్లిగా బార్ పలచబడింది. వలంటీర్లు అందరూ వెళ్ళిపోయారు. కొందరు తిరిగి వేదికల దగ్గరకు బయలుదేరారు, ఆఖరుసారి ఏర్పాట్లన్నీ తనిఖీ చేసుకోడానికని. ఆ కళ్ళజోడు పెద్దమనిషి ఇప్పుడు నేరుగా నాతోనే మాట్లాడుతున్నాడు: “అధికారం అంటే అదే. ఈ ముగింపు కోసం ఎదురు చూడడమే. ఆ కత్తి వాదర గాలిని చీలుస్తూ వస్తున్న ఆ సన్నని చప్పుడు వినపడుతున్నప్పుడు, అది మెడను తాకి మెరుపు తీగతో కోసినట్టుగా తలను తెంపినప్పుడు, అది బంతిలా దొర్లి ఒక్క గెంతులో ఆ బుట్టలో పడ్డప్పుడు, అందరూ చరిచే చప్పట్లు–నీ ప్రమాణస్వీకారం రోజున చరుస్తున్న చప్పట్లు ఇవే అని అప్పుడు వింటున్నప్పుడే తెలిసిరావడం. అదే అధికారం అంటే. ఇంకేమిటో కాదు.”
మాటలాపి కళ్ళజోడు తీసి రుమాలుతో తుడుచుకున్నాడు. అతని కంట్లో కన్నీళ్ళు. ఇంకేమీ మాట్లాడకుండా తన బీర్ డబ్బులు బార్ కౌంటర్ మీద పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
బార్ టెండర్ చేస్తున్న పని ఆపి కౌంటర్ మీదగా నావైపు వంగాడు. “ఈయన కూడా రేపు ఒకరు సార్,” అంటూ బార్ కిందనుంచి ఒక ఫోటోల బొత్తి తీశాడు. అన్నిటికన్నా పైన ఆ కళ్ళజోడు పెద్దమనిషి ఫోటో ఉంది. “ఇప్పుడు ఆ గోడల మీద ఉన్నవి రేపు తీసేసి ఇవి వేలాడేయాలి. అదిగో ఆ ఫోటో చూశారు కదా. ఈయన ఆయన స్థానంలోకి ఎన్నుకోబడ్డాడు. మీరేమైనా అనుకోండి కాని ఇలా ఒకరోజు ముందు ఆయనకు గుర్తుచేయడం పద్ధతి కాద్సార్. ఆయన మాట్లాడే తీరు గమనించారు కదా. రేపు ఈయన ఆ పోయేవారి తల తెగిపడడం చూస్తాడు, అది తనే అనుకుంటాడు, అది తన తలే అనుకుంటాడు. వీళ్ళంతా అంతే సార్, మొదట్లో ఒకట్రెండు వారాలు ఇలానే ఉంటారు. కాసేపు బాధపడతారు. ఆపైన ఆవేశం చూపిస్తారు. అది తమ బాధ్యత, ధర్మం అని ఏదేదో చెప్తారు. ఎక్కణ్ణుంచి తెస్తారో కాని ఇంత పెద్ద పదాలు తమ గురించి చెప్పుకోడం కోసం, ఎంత గొప్పలకు పోతే మాత్రం, మరీ ఇంతా.”
“ఆ తర్వాత?”
“అందర్లానే మెల్లిగా అలవాటుపడిపోతారు. చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. దాన్తో మర్చిపోతారు. మళ్ళీ వాళ్ళ రోజు వచ్చేదాకా దీని గురించి ఆలోచించే పాటి తీరికుండదు. అయినా ఈ నాయకులు ఏం ఆలోచిస్తున్నారో మనకు ఏం తెలుస్తుంది సార్. వాళ్ళ తలల్లోకి మనమేమైనా తొంగి చూస్తామా? నిజమో కాదో తెలీదు కాని, ఈ రోజు గురించి ఆలోచిస్తున్నట్టు మాత్రం బైటకు కనపడరు.
ఇంకో బీర్ తెమ్మంటారా?”
టెలివిజన్ వస్తూ చాలా మార్పులు తెచ్చింది. ఒకప్పుడు అధికారం ఎక్కడో దూరంగా ఉండేది. నాయకులు కనిపిస్తే వేదికల మీద ఉపన్యాసాలిస్తూనో, లేదూ కటౌట్లలో గంభీరంగా, గర్వంగా, ఉన్నతంగా ఆకాశం వైపు వేలు చూపిస్తూ, లేదూ దీవిస్తున్నట్టో, అభయమిస్తున్నట్టో చేయి చూపిస్తూ, ఇలా మామూలు రక్తమాంసాలున్న మనుషుల్లా కనిపించేవారు కాదు. అధికార దర్పం, ఆ నాయకత్వపు ఠీవి మాత్రమే అందరికీ కనిపిస్తుండేది. టెలివిజన్ వచ్చి అది మార్చేసింది. నాయకులు ఇళ్ళల్లోకి, మన రోజువారీ జీవితాల్లోకి వచ్చేశారు. కుర్చీలో సాగిలబడి కనిపిస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో కునికిపాట్లు పడుతూ కనిపిస్తారు. నోరు జారి అనకూడని మాటలంటూ కనిపిస్తారు. హాయిగా సోఫాలో కూర్చొని తీరిగ్గా టీవీ చూసే వారందరూ నాయకుల ప్రతీ కదలికనూ స్పాట్ లైట్ల కింద సునిశితంగా గమనించగలిగారు. అదురుతున్న కన్ను, వణుకుతున్న పెదవి, మాటకూ మాటకు మధ్య తడారుతున్న గొంతు, పెదాలు తడుపుతున్న నాలిక–ప్రత్యేకించి చావు మూడినప్పుడు, అప్పటిదాకా ధీరగంభీరంగా ఉన్న ఆ నాయకుడి స్వరూపం పూర్తిగా మారిపోతుంది. ఉపన్యాసాలిచ్చేప్పుడు, ప్రతిపక్షాలతో వాదించేప్పుడు, చాలా హుందాగా ఠీవిగా కనిపించే ఆ శరీరం, చావు దగ్గరికి వచ్చేసరికి పండుటాకులా వడలిపోతుంది. అలా టెలివిజన్ వచ్చి తమ నాయకులూ తమలాంటివాళ్ళే, ఏదో ఒకరోజు పోవల్సినవాళ్ళే అని ప్రతీ సామాన్య పౌరుడు అనుకునేట్టు చేసింది. ఆ నాయకులు ఎవరో కాదు, తమలో ఒకరే అనుకునేట్టూ చేసింది. వారిని తమకు బాగా దగ్గర చేసింది. గర్వంగా రిపబ్లిక్ డే పెరేడ్‌లో సెల్యూట్ చేస్తున్నప్పుడూ, ఏదో ఒక పెద్ద ఫాక్టరీనో, ప్రాజెక్టో శంకుస్థాపనో, రిబ్బన్ కట్ చేయడమో చేస్తూన్నప్పుడూ, టీవీలో వారిని చూస్తున్న సామాన్య పౌరుడు ఆ ముఖాలలో చావు వస్తూ తెచ్చే భయాందోళనలను వెతుకుతుంటాడు. చావు తర్వాత రక్తం చల్లబడుతూ చర్మం నల్లబడుతూ, ఇప్పుడు దర్పంతో ఉపన్యాసాలిస్తున్న ఆ నోళ్ళ నుంచి ఆ చావు కేక ఎలా బైటకి వస్తుందో ఊహిస్తుంటాడు.
ఇదిగో ఇందులోనే ఉంది, నాయకుడికి ప్రజల తలల మీద కాళ్ళు పెట్టి పైకి ఎగబాకి వారిపై పెత్తనం చెలాయించగలగడం లోని కిటుకు. ఎందుకంటే అతని చావు పబ్లిక్‌గా అందరి ముందూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడే ఉంటామన్న కచ్చితమైన నమ్మకం ప్రజలందరికీ ఉంటుంది. అలా అందరూ ఆ క్షణం వచ్చేదాకా అతని చావును గురించే ఆలోచిస్తూ ఉంటారు. అతని దినచర్యను, అతని ప్రవర్తనను, అతని నిర్ణయాలను ఉత్కంఠతో గమనిస్తూ ఉంటారు. అలా నాయకులు మన దృష్టిని వాళ్ళ మీదే నిలుపుకుంటారు. వాళ్ళ పట్ల మనకున్న యావను అలా అనుభవిస్తారు. ఒకప్పటి లాగా, నాయకులు వాళ్ళ ఇళ్ళల్లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పక్కన ఉండో, లేకుంటే ఏకాంతంలోనో చచ్చిపోయారు అని ఊహించాలన్నా కూడా కష్టమే. అలా, కొంతకాలం పాలించి, గద్దె దిగి వారి జీవితాలు వారు బతకగలడం, అదే ప్రజాస్వామ్య పద్ధతి అని అనుకొనేవారని తెలిసినప్పుడు మనకు నవ్వాగదు; టీవీ ఛానెళ్ళు ఆ నాయకుల చావును రకరకాల ఫ్రేముల్లో, రకరకాల కాప్షన్‌లతో ప్రతీ పౌరుడికీ అందేలా చేసి, ఆ ప్రోగ్రామ్ అయిపోగానే మనం టీవీ కట్టేసి వెళ్ళిపోకుండా, దానికి కొనసాగింపుగా కొత్త నాయకులనూ చూపించి ఇది నిరంతరం అని, ఇదే ప్రజాస్వామ్య పద్ధతి అని మనకు తెలిసేలా చేశాయి. ఇప్పుడు నెట్, సోషల్ మీడియా వంటివి టెలివిజన్ తెచ్చిన మార్పుని మరికొంత పెంచాయి. నాయకులను మరింత మరింత దగ్గరికి, వారు మాట్లాడుతుంటే ఆ నోళ్ళ తుప్పర మనమీద పడేంత దగ్గరికి తెచ్చాయి. వారి ముఖాలలో రాబోయే చావును మనం తాకగలిగేంత, తాకి ఒకరకమైన ఉన్మాదంతో వణికిపోయేంత దగ్గరికి తెచ్చాయి. ఇక టెలివిజన్‌లో లాగా ప్రోగ్రామ్ అయిపోతుందన్న భయం లేదు, ప్రతీ రోజూ కొత్త చావు కోసం ఎదురుచూస్తూనే ఉంటాం, కుతూహలంతో, ఉత్కంఠతో ప్రతీ నాయకుడి రాబోయే చావును ఊహిస్తూ ఆ రోజు వచ్చేదాకా అతన్ని మన జీవితాలలో నింపుకుంటూనే ఉంటాం. అతను పోగానే ఇంకొకరు, ఆపైన ఇంకొకరు, ఇలా మన జీవితాలలోకి వరుసగా వస్తూనే ఉంటారు.
మనకు తెలుసు, ఒకానొకప్పుడు అధికారమార్పిడి రక్తపాతంతో మాత్రమే జరిగేదని; చావులు హటాత్తుగా వచ్చినా, చెప్పి మరీ వచ్చినా. కానీ అప్పట్లో చాలా కొద్ది సందర్భాల్లో తప్ప నిజంగా చచ్చిపోయినవాళ్ళు ఎవరూ నాయకులు కారు, వారిని నీడల్లా అంటిపెట్టుకున్నవారు, వారి సహచరులు, ఎవరికీ తెలియని వారు, అజ్ఞాతులైన అనుచరులు, కిందస్థాయి అధికారులు. వారి చావు ఎవరికీ తెలిసేది కాదు. వారి హత్యలు ఎప్పుడూ వెలుగు చూసేవి కావు. ఒకవేళ చూసినా పట్టించుకొనేవారు కాదు. పోనీ పట్టించుకున్నా వాటికేదో కుంటిసాకులు, దొంగ కారణాలు చెప్పేవారు. ఇక ఇప్పుడలా కాదు. చంపేవాడూ చచ్చేవాడూ అనే రెండు పాత్రలు కలిసి ఒకటే చక్రబంధంలో నిరంతరంగా తిరుగుతూ, మనకు నిరంతరాయంగా వారి ప్రతీ కదలికనూ మాటనూ చేష్టనూ చూపిస్తూ, మన మనసులోని మూలమూలల్లో గూడు కట్టుకున్న ద్వేషలేశాలన్నిటినీ రగిలించి రగిలించి మరీ సంతృప్తిపరుస్తూనే ఉంటాయి. మనమీద మనకున్న జాలిని ద్వేషంగా తిరిగి మారుస్తూనే ఉంటాయి. అలా ఈ నిర్ధారిత ప్రజాస్వామ్యంలో, నాయకుల తలలు తెగిపడుతున్నప్పుడు, వారి మొఖాలను అతిదగ్గరగా–భయంతో తెరిచిన నోరు, మెడ మీద ఉబుకుతున్న నరం, కంటిలో ఒక కన్నీటి చుక్క, మిలటరీ యూనిఫార్మ్‌లో ఉన్న తలారి ఛాతీపై ఉన్న మెడల్స్‌ను భయంతో ఆసరాగా పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న చేయి– మనం, నక్షత్రాలు నిండిన చీకటి ఆకాశంలో, గ్రహాలు తమ కక్ష్యలలో తిరగడాన్ని గమనించినంత ప్రశాంతతతో గమనిస్తాం.
“మమ్మల్నిప్పుడే చంపేద్దామనుకుంటున్నారా? చంపేస్తారా?”
అది అరాచక ప్రజాస్వామ్య దళం సమావేశం. ఆ మాటన్నది కామ్రేడ్ ఆసిపోవిచ్. కొద్దిగా వణుకుతున్న పిడికిలి ఎత్తి అతనడిగిన ఈ ప్రశ్న అప్పటిదాకా వాడిగా వేడిగా చర్చలు చేసిన — “అరాచకం – వర్ధిల్లాలి! అందరు ఒకటే – కావాలి!” అంటూ అరుస్తూ ఆవేశంతో ఊగిపోయిన– ఆ సమావేశపు ధోరణికి భిన్నంగా ఉండి, అందరినీ కొద్దిగా నవ్వించి చల్లబరిచింది. ఆసిపోవిచ్ ఎక్సెక్యుటివ్ కమిటీ సభ్యుడు. మిగతా సభ్యులకంటే వయసులో చిన్న. నుదుటి మీద పడుతున్న ఉంగరాల జుట్టు. బలంగా బిగించిన పిడికిలి వేళ్ళు దేశాధ్యక్షుడి కాన్వాయ్ వచ్చే రోడ్డు తవ్వి అక్కడ బాంబులు పెడుతున్నప్పుడు వణకలేదు.
ఆ గది ఏదో గిడ్డంగిలా ఉంది. పొగ చూరి ఉంది. చీకటి చీకటిగా ఉంది. గది మధ్యలో ఒకటే బల్బ్ వెలుగుతోంది. దాని చుట్టూ సిగరెట్ పొగలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ గది నిండా క్షేత్రస్థాయి కార్యకర్తలున్నారు. గది గోడల వెంబడి వేసిన బల్లలపై కూర్చొనున్నారు. కొందరు నేల మీద కూర్చున్నారు. కొందరు గోడలకు ఆనుకొని నిలబడున్నారు. గది మధ్యలో టేబుల్. దాని చుట్టూ కమిటీ సభ్యులు, ఎనిమిదిమంది కుర్రవాళ్ళు కూర్చోనున్నారు. టేబుల్ మీద పరిచిన కాగితాలను, పరీక్షకు ముందు గ్రూప్ స్టడీకి కూర్చున్న స్టూడెంట్లలా తలలన్నీ దగ్గరికి చేర్చి మరీ చదువుతున్నారు. గది నాలుగు మూలలనుంచీ అప్పుడప్పుడూ వస్తున్న ప్రశ్నలకు తల ఎత్తకుండానే కమిటీలో ఎవరో ఒకరు సమాధానం చెప్తున్నారు. అప్పుడప్పుడూ కార్యకర్తలు తోసుకుంటూ కమిటీ చుట్టూ గుమిగూడుతున్నారు. మళ్ళీ చిన్నగా సర్దుకుంటున్నారు.
పొడుగ్గా గడ్డం పెంచుకునున్న కమిటీ సెక్రటరీ, కామ్రేడ్ సెరపనోవిచ్, అప్పటికే చాలాసార్లు ఇలా భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడల్లా సర్దిచెప్తూ ఇచ్చే నినాదాన్ని ఇస్తూనే ఉన్నాడు — “ఎప్పుడైతే ఎక్కడైతే కామ్రేడ్ చేయి ఇంకో కామ్రేడ్ చేతిని వదిలిపెడుతుందో, అక్కడ అప్పుడు శత్రువు చేయి ఇంకో శత్రువుతో కలుస్తుంది.” అతని నినాదానికి బదులుగా కార్యకర్తలూ నినదిస్తున్నారు — “మనది కాని విజయం ఏది? ఆపై మెడ మీద నిలబడ్డ తల ఏది? గర్వంతో తెగిపడని తల ఏది?” ఇదే నినాదం కార్యకర్తలందరూ కమిటీ అధికారులకు శెల్యూట్ చేస్తూ చెప్తారు. కమిటీ సభ్యులూ ఒకళ్ళనొకరు ఇలానే పలకరించుకుంటారు.
అరాచక ప్రజాస్వామ్య దళం ఉద్యమం ఇంకా పూర్తిగా వేళ్ళూనుకోలేదు. అప్పటిదాకా ఉన్న నియంతృత్వ ప్రభుత్వాలు, రాచరికపు పాలనల శిథిలాలపై మొదలవుతున్న ఉద్యమం అది. క్రమం తప్పకుండా ప్రతీ కొన్ని ఏళ్ళకూ ఎన్నుకోబడిన వారి తలలు నరికివేయడం ద్వారా అధికారాన్ని ఏ ఒక్కరి సొత్తో కాకుండా చేద్దామని ప్రయత్నిస్తున్న ఉద్యమం అది. నియంతల పోలీసు దళాలు, సైన్యాల తాకిడి ఎక్కువగా ఉండడంతో దళంలో నియమాలు చాలా కఠినంగా అమలు జరుగుతున్నాయి. ఎవరైనా ఎక్సెక్యుటివ్ కమిటీ తీసుకునే నిర్ణయాలకు తల ఒగ్గాలే తప్ప ఎదురు మాట్లాడకూడదనే నియమం అందుకే. అదే సమయంలో కమిటీలో ప్రతీ సభ్యుడికీ దళం మానిఫెస్టో ప్రతీక్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది–అధికారాన్ని ఆనందించని, అనుభవించని వాళ్ళకు, బతికివుండీ తమను తాము చచ్చిపోయినవాళ్ళుగా అనుకునేవాళ్ళకు తప్ప– వేరెవరికీ అధికారం కోరుకునే హక్కు లేదని.
కమిటీ సభ్యులు, కార్యకర్తలు అందరూ వయసులో ఉన్నవారు. అంతా కుర్రవాళ్ళు. తాము కోరుకుంటున్న ఆ అరాచక ప్రజాస్వామ్యపు వసుధైక కుటుంబం వచ్చినాక ఎలా ఉండబోతోందో, అది వీరి భవిష్యత్తు ఎలా నిర్ణయించబోతోందో అన్న ఆలోచన ఇంకా రాలేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితి వారిని అంతదూరం ఆలోచించనీయటం లేదు. అరెస్టులు, ఉరితీతలు, ఎన్‌కౌంటర్లతో దళంలో సభ్యులు ఎవరూ ఎక్కువ కాలం ఉండటంలేదు. పైగా తమ ఆదర్శం ఆచరణలో ఎలా కార్యరూపం దాలుస్తుంది అన్న స్పష్టత కూడా వారికి ఇంకా రాలేదు. వయసులో ఉండే ఆవేశం, ప్రస్తుత సమాజం పట్ల ద్వేషం, చిన్నచూపు వారిని వారి ఆదర్శాలను కేవలం కలల వెలుగులోనే చూడనిస్తున్నాయి. కాని, క్షేత్రస్థాయి కార్యకర్తలనుంచి అందరికీ తెలుసు. వారి ఆదర్శం వారిని త్వరలో హంతకులను చేస్తుందని, అది కేవలం ప్రస్తుత సమాజాన్ని కూలగొట్టడం వరకే కాక, ఆపైన రాబోయే సమసమాజంలోనూ ఇదే వర్తిస్తుందని. అయితే ఈ నిజాన్ని ఎలా ఒప్పుకోవాలో, ఇంకెలా చెప్పుకోవాలో తెలియకపోవడంతో, అది ఒక బింకంగా పొగరుగా ప్రకటిస్తున్నారు. ఎంత మర్యాదగా మాట్లాడినా ఆ పొగరు సమావేశాలలో వారి గొంతుల్లో వినిపిస్తుంటుంది. అది బెదిరింపులా వినపడుతూ కమిటీ సభ్యులను కుంగదీస్తుంటుంది.
మనం మన శత్రువు ఎవరో మర్చిపోనంతవరకూ… అన్నాడు ఆసిపోవిచ్. ఇంతలో అతని కాళ్ళ దగ్గర కూర్చున్న కామ్రేడ్ ఓల్గా, ముగ్గురు అక్కలు అని పిలవబడే అమ్మాయిలలో ఒకరు, అతని చేతిని ఓదార్పుగా తన చేతిలోకి తీసుకుంది. ఆపైన తన గోళ్ళతో గట్టిగా రక్తం వచ్చేలా గీరింది.
“మనం ఎవరూ మర్చిపోకూడదు కామ్రేడ్స్. మీరు మన ఆదర్శాన్ని, మన మానిఫెస్టోని కమిటీకి తరచూ గుర్తుచేయడం మీ బాధ్యత. కానీ…” అన్నాడు ఇంతలో కామ్రేడ్ అపాలొనొవిచ్, కమిటీ సభ్యులలో అందరికన్నా పెద్దవాడు, తగాదాలు వచ్చినప్పుడు సరిదిద్దడంలో ముందుండేవాడు.
“ఆఁ! ఉత్త కబుర్లు!” అన్నారెవరో ఒక మూల నుంచి.
“ఎవరది? ఎందుకలా అన్నారు?” కామ్రేడ్ అపాలొనొవిచ్ కళవళపడ్డాడు.
“మన సిద్ధాంతం ఎప్పుడూ వల్లె వేయడం తప్ప ఇంకేమీ ఆలోచించడం, మనం ఇంకేమీ చేయకూడదనా మీ అభిప్రాయం?” సన్నగా పొడుగ్గా ఉన్న ఒక కార్యకర్త అడిగాడు ఇంకో మూల నుంచి. అతనికి ఆవేశం ఎక్కువ. కొత్త రిక్రూట్‌లలో మిలిటెంట్ స్వభావం ఉన్నవాడని పేరు తెచ్చుకున్నవాడు. “మన సిద్ధాంతం మిగతా ఉద్యమాల సిద్ధాంతాల వంటిది కాదని మనకు స్పష్టంగా తెలుసా?”
“అవును, అందులో సందేహం లేదు. కేవలం మన సిద్ధాంతం మాత్రమే ఆచరణలోకి వచ్చినాక అధికారం అధికారాన్ని చెడగొట్టలేని సమాజం సాధ్యమని నిరూపిస్తుంది.”
“మరి సిద్ధాంతం ఆచరణలోకి వచ్చేదాకా ఆగడం ఎందుకు? అది మనం ఇప్పుడే ఎందుకు అమలు చేయకూడదు?”
“ఇప్పుడే!” “ఇప్పుడే!” గది నాలుగు మూలలనుంచీ అరుపులు.
ఇంతలోనే “తప్పుకోండి. తప్పుకోండి” అంటూ ముగ్గురు అక్కలు అని పిలవబడే అమ్మాయిలు, కూనిరాగాలు తీసుకుంటూ వచ్చి, పిక్నిక్ టేబుల్ సర్దుతున్నంత ఆనందంగా గది మధ్యలో ఉన్న టేబుల్ మీద తెల్ల గుడ్డ ఒకటి పరిచారు.
“మన సిద్ధాంతపు ప్రత్యేకత ఏమిటంటే అది కేవలం కత్తితోనే రాయబడుతుంది, మన నాయకుల శరీరాల మీద.” అన్నాడు మిలిటెంట్ కార్యకర్త. అందరూ మధ్య టేబుల్ చుట్టూ స్కూల్ పిల్లల్లా మూగారు. తోపులాట, అరుపులు కాసేపాగి సద్దుమణిగాయి.
ఆసిపోవిచ్ దేనికీ భయపడే రకం కాదు, ఆడవాళ్ళతో తగాదా అంటే తప్ప. అది ఎంత చిన్నదైనా సరే. లేచి నిలబడి, చేతి మీద రక్తపు గాట్లను నోటితో పీలుస్తూ అన్నాడు.
“మమ్మల్నిప్పుడే చంపేద్దామనుకుంటున్నారా? చంపేస్తారా?”
“లేదు లేదు. చంపడమా? చంపడం గురించి ఎవరన్నారు? మీరు మా లీడర్స్. మీరంటే మాకు ఇష్టం. మీరు లేకుండా మేమేం చేయగలం? మనం నడవాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. మమ్మల్ని ఎవరు నడిపిస్తారు అక్కడిదాకా? మేము మీ వెనకే నడుస్తాం చివరి అడుగు దాకా.” అంటూ మిలిటెంట్ కార్యకర్త కమిటీ సభ్యులను ఓదార్చేలా మాట్లాడాడు. “ఇది చిన్నదే కాని బలమైనది. మన సిద్ధాంతం పట్ల మన నమ్మకాన్ని మరింత పెంచేది, మన నిశ్చయానికి ఊతమిచ్చేది. కొంచెం నొప్పి పుడుతుంది. కాదనను, కాని మీరు మా నిజమైన లీడర్లు అన్న నమ్మకం మా అందరికీ వస్తుంది. చాలా చిన్న కోత. అంతే. ఇలాంటి నిరూపణలు అప్పుడప్పుడూ ఉంటేనే కదా నాయకత్వం పట్ల కార్యకర్తలకి నిజమైన గౌరవం ఉండేది. అలా నిరూపించగలరనే కదా మన ఉద్యమపు నాయకులు ఇంకెవరిలా కాదు అని అందరూ అనేది.”
అతనామాట అంటూండగానే “తప్పుకోండి. తప్పుకోండి” అంటూ ముగ్గురు అక్కలు తెల్లటి డాక్టర్ కోట్ల వంటివి వేసుకొని ఒక చిన్న బండి నెట్టుకుంటూ వచ్చారు కూనిరాగాలు తీస్తూ. ఆ బండి మీద సర్జికల్ పరికరాలున్నాయి. వాటితో పాటు గాజుగుడ్డలు, అయొడిన్ టింక్చర్ సీసాలు, ఆల్కహాల్ వైప్స్ వంటివి ఉన్నాయి. వారలా రాగానే ఆ గదిలో ధోరణి పూర్తిగా మారిపోయింది. గొంతులు పెరిగాయి. ఒక రకమైన ఉద్రిక్తత ఏర్పడింది.
అప్పటికే కమిటీ సభ్యులనందరినీ ఏమాత్రమూ కదలలేకుండా కొన్న పదుల చేతులు గట్టిగా పట్టేసుకున్నాయి. ముగ్గురు అక్కలూ ఆ సర్జికల్ సామానులన్నిటినీ టేబుల్ మీద చక్కగా సర్దారు. గదిలో మెల్లిగా టింక్చర్ వాసన పేరుకుంది. ఇంతలో మెడికల్ కాలేజిలో చదువుతూ ఒదిలేసి వచ్చిన కామ్రేడ్ సిపిదనోవిచ్ ముందుకు వచ్చాడు, గ్లవ్స్ వేసుకున్న చేతులను గుండెపై అడ్డంగా పెట్టుకొని ఎవరినీ తాకకుండా, జాగ్రత్తగా. అతనికి సిగ్గు బిడియం ఎక్కువ. అది కప్పిపుచ్చుకోడానికి చిన్నపిల్లవాడిలా నవ్వుతూ, చమత్కారంగా మాట్లాడుతుంటాడు.
“ఊఁ! చెయ్యి. చేతిలో చెయ్యి వెయ్యి. హహహ. చేయి పట్టుకోవడం కోసం ఉన్న శరీర భాగం. ప్రిహెన్సయిల్ ఆర్గాన్ అంటాం. చాలా ఉపయోగం ఉంది దీనితో. అందుకే మనకు రెండున్నాయి. ఒక్కో చేతికి ఐదు వేళ్ళు. అలా పది వేళ్ళు. ఒక్కో వేలికి మూడు కణుపులు. మొదటి కణుపు, మధ్య కణుపు, చివరి కణుపు…”
“ఆపు! నీ సోది వింటుంటే చిర్రెక్కిపోతోంది మాకు. ఇప్పుడు మాకు మెడికల్ పాఠాలక్కర్లేదు. చేయాల్సింది నోరు మూసుకొని త్వరగా చెయ్యి!” టేబుల్ చుట్టునుంచి అరుపులు. (చివరికి కామ్రేడ్ సిపిదనోవిచ్ అంటే ఎవరికీ ఇష్టం లేకుండా పోయింది.)
మొదటగా ఆసిపోవిచ్ తేబడ్డాడు. కేవలం తన చూపుడు వేలి మొదటి కణుపు దాకానే తెగ్గొడతారని తెలుసుకున్నాక, అతనికి కొంచెం ధైర్యం వచ్చింది. పళ్ళబిగువున నొప్పి ఓర్చుకొని తన పరువు నిలబెట్టుకున్నాడు. కానీ కొందరు సభ్యులు నొప్పి తట్టుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. కొందరిని టేబుల్ మీద కదలకుండా పట్టుకోడానికి చాలా కష్టమయింది. ఏమైతేనేం ఇంచుమించు అందరూ కాసేపట్లో స్పృహ తప్పారు, భయంతోనో బాధతోనో. ఒక్కో లీడర్‌కు ఒక్కో రకమైన కోత, కానీ అందరూ ఒప్పుకున్నది, ఎవరికీ కూడా రెండు కణుపుల కంటే ఎక్కువ తీయకూడదని. (అయితే, ఇలాంటి పండగలు ఇకముందూ ఎన్నెన్నో జరుగుతాయని, అప్పుడు మిగిలిన కణుపులు కూడా తీసేయబడతాయనీ ఎవరూ మర్చిపోకూడదు.) అనుకున్నదానికంటే రక్తం ఎక్కువగానే కారింది. కాని ముగ్గురు అక్కలూ శ్రద్ధగా మరకలన్నీ తుడిచారు.
ఈ తెగకోతల కార్యక్రమం అయినాక తెల్లటి గుడ్డ మీద మిగిలిన ఆ వేళ్ళ ముక్కలు గొంతులో గాలం చిక్కుకొని నల్లగా కమిలిపోయిన చేపల్లా ఉన్నాయి. త్వరలోనే రక్తం కారిపోయి అవి ఎండిపోయాయి. వాటిని ఏం చేయాలీ అని చర్చ జరిగింది. ముందు వాటిని అద్దాల ఫ్రేముల్లో పెట్టి గోడల మీద అలంకరిద్దామనుకున్నారు కాని, చివరికి వాటిని ఎత్తి చెత్తిబుట్టలో పారేశారు.
ఇలా నాయకులను కత్తిరించడం మంచి ఫలితాలను ఇచ్చింది. పోగొట్టుకుంది శరీరంలో ఒక చిన్న ముక్క మాత్రమే అయినా, అది నాయకులలోనూ కార్యకర్తలలోనూ ఎంతో నైతిక స్థైర్యాన్ని, మానసిక బలాన్ని నింపింది. అలా ముక్కలు పోయేకొద్దీ నాయకుల పలుకుబడి, వారి అధికారం పెరిగాయి. ఏ నిరసన జరుపుతున్నప్పుడో, వేళ్ళు లేని ఒక చేయి లేచిందీ అంటే దానిచుట్టూ ఆందోళనకారులంతా చేరిపోయేవారు. వారిని అదుపు చేయడంలో అశ్వారూఢులైన పోలీసు దళాలు కూడా నిస్సహాయమైపోయేవి. “అరాచకం! – వర్ధిల్లాలి! అందరు ఒకటే! – కావాలి!” “మనది కాని విజయం ఏది? ఆపై మెడ మీద నిలబడ్డ తల ఏది? గర్వంతో తెగిపడని తల ఏది?” ఇలా నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తి పోయేది. ఆ అరుపులు ఊరికి బైట, కారాగారాల్లో మగ్గుతున్న వారి సాటి కామ్రేడ్లకు వినపడేవి. వారు తమ సంకెళ్ళతో తలుపు చువ్వల మీద లయగా కొడుతూ వంత పాడేవారు.
ఒక ఒప్పందం మీద సంతకం చేయడానికి చేయి చాచినప్పుడో, ఏదో ఉపన్యాసంలో ఊనిక కోసం చేయి ఎత్తినప్పుడో, యువనాయకులకు తమ అంగవైకల్యం కనిపించేది. అది వెంటనే ఏ వేలు, ఏ కణుపు ఎక్కడ తెగ్గొట్టబడిందో ఆ సందర్భాన్ని, దానితో జతకూడిన సిద్ధాంతాన్ని లేదా దానికి అనుబంధంగా ఉద్యమంలో వచ్చిన ఒక ఆలోచనని గుర్తుచేసేది. ఎందుకంటే, మిగతా విషయాలెలా ఉన్నా ఆ పద్ధతి సులభంగా అమలు పెట్టగలిగిన పద్ధతి. ఎక్కడ సమావేశం జరుగుతుంటే అక్కడ, అప్పటికప్పుడు ఆపరేషన్ బల్ల ఒకటి ఏర్పాటు చేసి, స్టూడెంట్లో నర్సులో, చేతికి ఏ కత్తి కత్తెర దొరికితే దానితో లీడర్ల వేళ్ళూ కణుపులూ తెగకొట్టేవాళ్ళు. పొరపాటున ఎవరైనా పోలీసులకు దొరికినా వేలు తెంపినందుకు శిక్ష పెద్దదేమీ ఉండేది కాదు, అది చిన్న నేరం కింద జమ కట్టేవారు కాబట్టి. అదేమైనా తలలు తెగగొట్టినంత నేరం కాదు కదా. ఆ రోజుల్లో నాయకులను చంపేయడం అనేది సైద్ధాంతికంగా అధికారులు ఎవరికీ అర్థమయిన విషయం కాదు. అలా ఎవరైనా చంపినా వారిని హంతకులని, వారి కారణం పగ ప్రతీకారం లాంటివని నేరం మోపేవారు.
ఉద్యమంలో ప్రతీ దళంలో, ప్రతీ ప్రాంతీయ శాఖలో, ప్రతీ స్థాయిలో కొంతమంది కార్యకర్తలు, నాయకులు కానివారు, ఈ తెగవేత కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నారు. ఎంత తరచుగా తెక్కొట్టాలి, ఏది తెక్కొట్టాలి, ఎంత తెక్కొట్టాలి లాంటివి వారే నిర్ణయించేవారు. కోత తర్వాత కట్టుకు కావల్సిన గాజుగుడ్డలు, దూది, అయొడిన్ వంటివి వారే చందాలు వేసుకొని అమర్చేవారు. కొన్నిసార్లు కోత కార్యక్రమం కూడానూ, ఎవరైనా పక్కన నిలబడి చెప్తుంటే వీరే చేసేవారు. ఆ రకంగా ఇది ఒక ప్రత్యేక సమితిగా ఉండేది. కాని రాజకీయపరమైన నిర్ణయాలు వీరి చేతిలో ఉండేవి కావు. వాటిని తీసుకొనే అధికారం కేవలం ఎక్సెక్యుటివ్ సమితి అధికారంలో ఉండేది.
రానురానూ నాయకుల వేళ్ళన్నీ తెగిపోయినాక, ఇక తెంపడానికి వేళ్ళు కరువైతుండేసరికి, తెగవేత సమితి నాయకుల మిగతా అవయవాల వైపు చూపు తిప్పింది. మొట్టమొదటగా వారి కంట్లో పడ్డది నాలుక, ఎందుకంటే కొద్దికొద్దిగా చాలాకాలంపాటు కోయనిస్తుంది. అది ఒక కారణం. కాని, నాలుక కోయడం అనేది వారి సిద్ధాంతానికి ఒక బలమైన ప్రతీక కావడం వారికి ముఖ్యకారణం అయింది. ఎందుకంటే, నాలుక కొద్దిగా కోసినప్పుడల్లా ఆ నాయకుడి గొంతు మారేది. కొన్ని పదాలు పలికేవి కావు. మాట తొస్సిపోయేది. అనర్గళంగా ఉపన్యసించగలిగే శక్తి పోయేది. ఐతే, ఇలా నాలుకను కోయడం, అది కాస్త సున్నితమైన అవయవం కావడంతో, అనుకున్నదానికంటే కష్టమైన పని అయింది. తెగకోత సమితికి వేరే అవయవాలు కోయడం అవసరం అయింది. చెవులు, ముక్కు కోయడం, పళ్ళు ఒకటీ రెండు పీకడం వంటివి; చూడగానే కనిపించేవే అయినా మరీ అంత బాధించేవి కావు. (ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. మగ లీడర్లకు వృషణాలు ఎందుకు తెగకొట్టలేదు? అని. అలా చేయడం లింగవిచక్షణ అవుతుందని, అది ఒక లైంగిక చర్యగా కామోద్రేకాన్ని ప్రేరేపిస్తుందని వాటి జోలికి వెళ్ళలేదు. ఆడవారు లీడర్లు కారు కాబట్టి వారి శరీరంలోని అలాంటి భాగాలు చర్చలోకి కూడా రాలేదు.)
ఉద్యమం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ఉంది. విప్లవశంఖం ఇంకా పూరింపబడనే లేదు. ఉద్యమ నాయకులు తమను తాము కత్తి కోతలకు గురిచేసుకుంటూనే ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు అధికారం చేజిక్కించుకున్నా అది ఎంత ఆలస్యమైనా సరే, వారిపై అందరూ ఉంచుకున్న నమ్మకాలను వమ్ము చేయని మొట్టమొదటి నాయకులు వీరే అవుతారు. ఊతకర్ర చంక కింద పెట్టుకొని కుంటికాలితో నడుస్తూ, వారికి కనీసం ఒక కాలయినా మిగిలివుంటే; చక్రాల కుర్చీలో కూర్చొని తోసుకుంటూ, తోయడానికి కనీసం ఒక చెయ్యయినా మిగిలివుంటే; మాస్కులతో మొఖాలపై కోసివేయబడిన ముక్కూచెవుల వికారాన్ని కప్పుకుంటూ, మరికొందరు ఆ కోసివేయబడిన ముక్కలనే గర్వంగా చూపుకుంటూ, అవంటూ మిగిలేవుంటే; జెండాలు వేలాడుతున్న వీధులలో తమ ప్రమాణస్వీకారం కోసం కదిలివస్తున్న వీరిని ఇప్పటికే మనం చూడగలం. అరకొర శరీరాలతో మిగిలిపోయిన ఆ నాయకులలో, అధికారం అనేది ఇంకా అందుకోడానికి ఏమైనా మిగిలి ఉంటే, దాన్ని అందుకునే శక్తి అయినా కనీసం ఉంటుందో లేదో కూడా తెలియదని, ఆ క్షణంలోనే మనకు స్పష్టంగా తెలిసివస్తుంది.
(Beheading the heads, 1969)