ఒక అద్దం, ఒక లక్ష్యం
“ఒరే మాధవా! ఏం చేస్తున్నావురా? స్కూలుకు టైమవుతోంది. పుస్తకాలు సర్దుకున్నావా? రమా! వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూడు!”
అమ్మ గొంతు వినగానే నేను గంభీరంగా మొఖం పెట్టి, చటుక్కున గూట్లోంచి దువ్వెన తీసి తల దువ్వుకుంటున్నట్లు, పాపిడి శ్రద్ధగా తీసుకుంటున్నట్లు నటించేవాణ్ణి. ఇంతలో అక్క గొంతు వినపడేది.
“ఇంకెక్కడుంటాడు! అద్దం ముందు నిలబడి అందం చూసుకుంటుంటాడు. పెద్ద హీరో అని! పోజులు కొడుతుంటాడు కోతిరాయుడల్లే.”
నిజమే. చిన్నప్పడు అద్దం ముందు గంటలు గంటలు గడిపేవాణ్ణి. అక్కయ్యకు ఇప్పటికీ అర్థంకాదు. నేనేదో చాలా అందంగా ఉన్నాననో, చూసేకొద్దీ నా మొహం నాకు మరింత నచ్చుతుందనో నేనెప్పుడూ అద్దం ముందు నిలబడలేదు. చిన్నప్పణ్ణుంచీ అదొక అలవాటు నాకు. తను ఇప్పటికీ ఎవరికి చెప్పినా నా గురించి అలానే చెప్తుంది. కానీ అది నిజం కాదు.
నిజానికి నాకు నా మొహం ఎప్పుడూ నచ్చేది కాదు. అందుకే నేను గంటలు గంటలు అద్ధం ముందు నిలబడేవాణ్ణి, రకరకాల మొహాలు పెడుతూండేవాణ్ణి ఒక కొత్త మొహం కోసం వెతుక్కుంటూ. ఒక కొత్త మొహం అద్దంలో కనపడగానే దాన్ని మార్చేస్తూ మరొకటి. అలా నేను ఎందరో మనుషులను. ఎన్నో రకాల మనుషులను. ఎన్నో రకాల మనుషులు ఒకరి తర్వాత ఒకరు అలా నేనుగా మారిపోతుంటారు. నేను వారిలా అయిపోతుంటాను. అలా వారూ ఒకరు ఇంకొకరిగా మారిపోతూ ఉంటారు. నేను మాత్రం ఎప్పుడూ నేనుగా మాత్రం ఉండను.
కొన్నిసార్లు, ఒక నాలుగో ఐదో పదో పదిహేనో మొహాలు మార్చాక, నాకు వాటిల్లో ఒక మొహం నచ్చింది అని అనిపించేది. మళ్ళీ మొహం అలా పెట్టడానికి ప్రయత్నించేవాణ్ణి. కానీ, అస్సలు కుదిరేది కాదు. అదేరకంగా ఎప్పటికీ కుదిరేది కాదు. ఒక్కసారి ఒక మొహం పెట్టి, అది పోయిందీ అంటే ఇక ఎప్పటికీ తిరిగి రాదు. మళ్ళీ ఆ మొహం నాకు ఇక అద్దంలో కనపడదు. దాని కోసమని ఇంకా రకరకాలుగా ప్రయత్నించేవాణ్ణి. కోపపు మొహాలు, ఏడుపు మొహాలు, ఉడుకుమోతు మొహాలు, ఇలా పెట్టే కొద్దీ ఆ మొహం ఇంకా దూరమయ్యేది దగ్గర కాకుండా. చివరికి ఎప్పటికో అద్దంలో నా మొహం ఒక్కటి మాత్రం మిగిలుండేది. అది నాకు ముందుకంటే ఇంకా బాలేదనిపించేది, ఇంకా తక్కువ నచ్చేది. కానీ ఈ ప్రయత్నాలు ఎప్పుడూ ఎక్కువసేపు సాగేవికావు.
“వెధవా! ఎన్నిసార్లు చెప్పాను, అద్దం ముందు నిలబడి అలా మొఖాలు పెట్టకని! ఇంకొక్కసారి చూశానంటే వీపు చిట్లగొడతాను రాస్కెల్!” నాన్న ఎక్కణ్ణుంచి వచ్చేవాడో చడీ చప్పుడూ లేకుండా, చటుక్కున నా చెవి పట్టుకొని మెలేసి ఈడ్చుకుపోయేవాడు. ‘లేదు నాన్నా! ఇప్పుడే మొహం కడుక్కున్నాను. తల దువ్వుకుంటున్నాను.’ ‘లేదు నాన్నా! కంట్లో ఏదో పడింది, మంటగా ఉంటే చూస్కుంటున్నాను.’ ‘లేదు నాన్నా! ముక్కు మీద ఏదో సెగగడ్డలా ఉంటేనూ’… నా సాకులు ఎప్పుడూ పారేవి కావు. కొన్నిసార్లు అమ్మ గొంతో నాన్న గొంతో ముందుగది లోంచో వంటింట్లోనుంచో వినగానే చటుక్కున మొహం ఏ భావమూ లేకుండా పెట్టేవాణ్ణి. ఆ మొహం వెంటనే అటెన్షన్‌లో నిలబడ్డ సైనికుడి మొహం, యెస్ సర్ అని భక్తిగా శెల్యూట్ చేస్తున్న పోలీస్ మొహం, తప్పు చేసి దొరికిపోయిన దొంగ మొహం, రాముడు మంచి బాలుడు మొహం, స్కూలెగ్గొట్టి మాట్నీ చూసొచ్చిన మొహం, పిక్‌పాకెటర్ మొహం, విలన్ మొహం, హీరో మొహం, దయ్యం మొహం, దేవుడి మొహం, మొహం తర్వాత మొహం తర్వాత మొహం తర్వాత మొహం… అలా.
‘పిచ్చెధవా! ఏమిట్రా అలా పొద్దుగూకులూ అద్దం ముందు! బైట చూడు, ఎంత బాగుందో! అదిగో ఆ నల్లమబ్బులు చూడు ఎలా కమ్ముకున్నాయో! అబ్బా! ఇట్రారా, వరండాలో నిలబడితే జల్లు ఎలా కొడుతోందో! ఒరే, ఆ మందారాలు చూడు ఎంత ముద్దగా ఉన్నాయో! ఆ గుడి చూడు సీరియల్ లైట్లతో ఎంతా బాగా డెకరేట్ చేశారో! అబ్బా మన ఊరు జాతర ఎంత సందడిగా ఉంటుందో! ఆహా, బైట నిండు పున్నమి పిండారబోసినట్టు, అన్నాలు పెరట్లో తిందాం రా! కరెంటు పోయినట్టుంది, చూడు ఆకాశంలో ఎన్ని చుక్కలు కనిపిస్తున్నాయో! అరేయ్, ఆ మోటర్ సైకిల్ చూడరా ఎంత బాగుందో! కొంటే ఆ కారే కొనాలి! చూడు… చూడు… చూడు… అది చూడు… ఇది చూడు… అమ్మ, నాన్న, అక్కయ్య, అన్నయ్య, తమ్ముడు, చెల్లెలు, పిన్నులు, బాబాయిలు, అత్తయ్యలు, మామయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు, ఆంటీలు, అంకుళ్ళు, టీచర్లు, మాస్టర్లు, స్కూల్ ఫ్రెండ్స్, కాలనీ ఫ్రెండ్స్, ఎవరెంతగా చెప్పినా నా బుర్రకు అవేమీ పట్టేవి కావు. వాటిని వారు చూసిన కళ్ళతోనే నేనూ చూడాలని, వాళ్ళందరికీ అంతగా నచ్చినవి నాకూ నచ్చాలని అనుకొనేవారు. కాని, వారిని అలా అంతగా నచ్చేలా చేసిన శక్తి ఏదో నాలో ఉండేది కాదు. వాళ్ళు చూపించిన ప్రతీదీ చూసేవాణ్ణి. గుచ్చి గుచ్చి చూసేవాణ్ణి. కళ్ళు నొప్పెట్టేలా చూసేవాణ్ణి. కానీ వాళ్ళకెందుకు అంత నచ్చిందో నాకు అర్థమయేది కాదు. నాకు అవన్నీ మామూలుగానే కనపడేవి. వాటిల్లో అంతలా అబ్బా! అనేదేముందో, ఆ అందమేమిటో ఎప్పుడూ తెలిసేది కాదు. ఎప్పుడూ అవేమీ నాకు ఆసక్తి కలిగించలేదు.
ఏమో, వీటి వెనకాల దాక్కొని ఇంకేమైనా ఉన్నాయేమో కనపడకుండా! అవి వాళ్ళకు కనిపిస్తున్నాయేమో. అవి చూపించచ్చు కదా నాకు. ఆఁ, అవి చూడమంటే చూస్తానేమో. కాదు, చూస్తాను, నిజంగా ఇష్టంగా చూస్తాను. అవంటే నాకు చాలా ఆసక్తి. కొన్నిసార్లు దేన్నో చూస్తాను, ఎవరినో, ఏ అమ్మాయినో చూస్తాను. కాని వారు ఇలా కనిపించి అలా మాయమైపోతారు అదేమిటో, వారెవరో నాకు తెలిసే లోపే. నేను వెంటనే వారి వెనుక పరిగెడతాను. నాకు దేంట్లోనైనా సరే ఆ దాక్కొని ఉన్నవైపు, కంటికి కనిపించని ఆ రెండోవైపు అంటే చచ్చేంత కుతూహలం. ఇంటికెదురుగా నిలబడితే ఇంటి వెనుకవైపు గురించి, కొండకిటుగా నిలబడితే అటువైపు గురించి, వీధికివతల నిలబడితే అవతలవైపు గురించి, టీవీలు, రేడియోలు, కార్లు, మెషీన్లు, ఊళ్ళు, సముద్రాలు, నక్షత్రాలు, గ్రహాలు, నా చూపు ఎప్పుడూ ఆ కనిపించని వైపు మీదే, దాక్కొని ఉన్న ఆ రెండో వైపు గురించే. కానీ, కొన్నిసార్లు ఆ రెండో వైపుకు, ఆ దాక్కొని ఉన్నవైపుకు నేను వెళ్ళి చూసినప్పుడు నాకర్థమయేది, నాక్కావల్సింది ఆ రెండోవైపు కాదు, ఆ రెండోవైపుకు రెండోవైపు. ఆ దాక్కొని ఉన్నవైపుకు అటుగా దాక్కొని ఉన్న ఇంకో వైపు. నాకు రాన్రానూ తెలిసొచ్చింది. నేను వెతుకుతున్నది దాక్కొని ఉన్నవైపుకు దాక్కొని ఉన్నవైపు. ఇంకా చెప్పాలంటే దాక్కొని ఉన్నవైపుకు దాక్కొని ఉన్నవైపుకు దాక్కొని ఉన్నవైపుకు దాక్కొని ఉన్నవైపు. ఊహూ! కాదు. దాక్కొని ఉన్నవైపుకు దాక్కొని ఉన్నవైపుకు దాక్కొని ఉన్నవైపుకు దాక్కొని ఉన్నవైపుకు దాక్కొని ఉన్నవైపుకు దాక్కొని ఉన్నవైపుకు…
‘ఏరా మాధవా? ఇక్కడేం చేస్తున్నా? ఏమైనా పోగొట్టుకున్నావా? ఎవరి కోసమైనా వెతుకుతున్నావా? దేని కోసం మాధవా?’ ఎవరైనా అడిగితే నాకేం సమాధానమియ్యాలో తెలిసేది కాదు.
కొన్నిసార్లు అద్దంలో నా మొహం వెనకాల ఎవరో ఉన్నట్టనిపించేది. చటుక్కున జరిగి చూసేవాణ్ణి, కాని నాకంటే ముందే ఆ మొహం మాయమైపోయేది. తప్పించుకొని నా వెనకాల దాక్కొనేది. అలా కాదని, నేను అద్దంలో నా మొహాన్ని కాకుండా దాని వెనకాల ఉన్న ప్రపంచాన్ని చూడ్డానికి ప్రయత్నించాను. ఎంత చూసినా చూస్తున్నది దేనికోసమో అది కనిపించేది కాదు. చివరికి అద్దం ముందు నుంచి ఇటువైపుకు తిరగబోతున్నప్పుడు, అటువైపు అంచులోకి చటుక్కున జారిపోయేది. ఆమెవరో తెలిసేది కాదు, ఎప్పుడూ తనని నా కొనకంటితో మాత్రమే చూడగలిగేవాణ్ణి. ఎప్పుడూ ఊహించని చోట మాత్రమే చూడగలిగేవాణ్ణి. నేను ఎంత గభాలని తిరిగినా, ఎంత ప్రయత్నించినా, కాస్త స్పష్టంగా తనెవరో చూద్దామనుకొనే లోపలే మాయమైపోయేది. అంటే, మెరుపులా మెరిసి మాయమైపోయేది కాదు. వంపు తిరిగిపోయిన నదిలాగా సున్నితంగా, నీళ్ళ అడుగున ఈదుతున్న ఏదో జలకన్యలాగా, సుతారంగా అటు వైపు తిరిగి మరుగైపోయేది.
నేను అద్దంలో నా మొహం చూసుకోకుండా ఆ అంచు లోకి చూడ్డం మొదలు పెట్టాను. ‘నర్మదా! నర్మదా!’ అని పిలిచాను. ఎందుకంటే నాకు ఆ పేరు ఇష్టం, నేను ఇష్టపడ్డ అమ్మాయి, నానుంచి అలా దాక్కొనే అమ్మాయికి ఆ పేరు తప్ప ఇంకే పేరూ ఉండడానికి వీల్లేదు. అంతే. నర్మదా! ఎక్కడున్నావ్? ఎక్కడ దాక్కున్నావ్? నాకెప్పుడూ అనిపించేది తను ఎదురుగ్గానే ఉందని. ఎక్కడో దగ్గర్లోనే ఉందని. ఆ మూలనో ఈ మూలనో ఉందని. కాని, నేను ఎప్పుడూ తను మాయమైపోయిన ఒక క్షణానికి కాని అక్కడకు చేరేవాణ్ణి కాదు.
‘ఏరా మాధవా? నర్మద ఎవర్రా?’ ఎవరైనా అడిగితే నాకేం సమాధానమియ్యాలో తెలిసేది కాదు.
‘ఒరే మాధవా! మనిషన్నాక ఒక లక్ష్యం ఉండాల్రా. జీవితంలో తనకేం కావాలో, దాన్ని ఎలా సాధించాలో తెలిసుండాల్రా. ఏం చేయదల్చుకున్నావని ఎప్పుడడిగినా అలా మాట దాటేస్తావేంట్రా! చుట్టూ చూడరా ఒకసారి. నీ స్నేహితుల్ని, మిగతావాళ్ళని చూడు. అందరూ ఎంత కష్టపడుతున్నారో చూడు ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని, సీఈఓలు కావాలని. కష్టపడాల్రా, లేకుంటే ఏమీ సాధించలేవు ఈ జన్మలో. నీకంటూ ఒక గమ్యం పెట్టుకోవాలి. దాన్ని సాధించాలి నిద్రాహారాలు మానేసి అయినా. చెప్తున్నా విను. ఇది పోటీ ప్రపంచం. నువ్వు బరి లోకి దూకకా తప్పదు, గెలవకా తప్పదు. ఒక్కసారి గమ్యం చేరుకున్నావూ, ఇక నీకు ఢోకా లేదు. సంపాదించినంత సంపాదన. దాచుకున్నంత ఆస్థి.’
అందరు చెప్పిందీ విన్నాను. ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, చదివినాక ఏం చేయాలి, అన్నీ నిర్ణయించుకున్నాను. కష్టపడ్డాను. ఇంజనీరింగ్ డిగ్రీ కోసం, ఫారిన్ లాంగ్వేజెస్‌లో డిప్లొమా కోసం, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ కోసం, చదువైపోక ముందే కనీసం పది లక్షలు సంపాదించాలని పెట్టిన స్టార్టప్ కోసం. కానీ నా గమ్యం ఎప్పుడూ దూరంగా జరిగిపోతూనే ఉంది. నేను ఎంత ప్రయత్నించినా అందుకోలేనిది గానే ఉండిపోయింది. మాధవ్! కీప్ ట్రైయింగ్ మై బాయ్! మళ్ళీ ఇంకోసారి ట్రై చేయరా! నాకు నీ మీద నమ్మకం ఉంది. యూ విల్ సక్సీడ్! వన్ నీడ్స్ టు కీప్ ప్లౌవింగ్ త్రూ అంటిల్ హి గెట్స్ టు ది ఎండ్! ప్రయత్నించాను. లక్ష్యం వైపు నేరుగా పరిగెత్తు! నేను పైకీ కిందకూ, పక్కకూ ముందుకూ పరుగులెత్తాను. అడ్డంకులు నిన్ను ఆపనీయకు! ఎగిరి దాటబోయాను. మరిన్ని అడ్డంకులు వచ్చి మీద పడ్డాయి. చివరికి నిరాశ తప్ప ఏం మిగిలింది? ఏమీ మిగల్లేదు. అద్దంలో నా మొహాలు కూడా నాకు ఏ ఓదార్పూ ఇవ్వలేక పోయాయి. అద్దం నాకు నా మొహం చూపించడం మానేసింది. కనీసం నర్మద నీడను కూడా చూపించలేదు. నా మొహానికి బదులు చంద్రుడి మీదలా రాళ్ళూ గుంటలతో నిండిన ఒక మైదానం లాంటిదేదో చూపించేది ఎప్పుడూ.
జీవితంలో గెలవడం ఎలా? అని ఒక పుస్తకం రాసిన ఒకతను చెప్పాడు నేను నా కేరక్టర్ మరింత స్ట్రాంగ్‌గా చేసుకోవాలని. అలాగేనని, నా మనసును ధృఢంగా చేసుకోవాలని, నా దీక్ష, నా లక్ష్యసాధన మెరుగుపడాలని, నేను ఆర్చరీ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. నా ఆలోచనలూ, చేతలూ బాణాలలాగా ఉండాలి. అవి రయ్యిరయ్యిన గమ్యం వైపు దూసుకొని పోవాలి. బుల్స్ ఐ! అన్ని రంగుల వృత్తాల మధ్యలో ఉన్న ఆ నల్లటి వృత్తంలోకి దిగబడిపోవాలి. కానీ, నాకు గురి ఎప్పుడూ కుదిరేది కాదు. నా బాణాలు ఎప్పుడూ బుల్స్ ఐ చేరలేదు.
నా టార్గెట్ ఎప్పుడూ దూరంగా, ఇంకా దూరంగా, ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు కనిపించేది నాకు. ఆ ప్రపంచంలో అన్నీ స్పష్టమైన గీతలతో రంగులతో కచ్చితమైన సరిహద్దులతో ఉంటాయి; ఆ ప్రపంచం లోని మనుషులంతా క్రమశిక్షణతో సైనికుల్లా ఏ అడుగు వేసినా ఒక వ్యూహం ప్రకారం, పూర్తి తెలివిడితో వేస్తారు; తెలిసీ తెలియనితనంతో అయోమయంగా ఎవరూ ఏమీ చేయరు; ఎందుకంటే ఆ ప్రపంచపువారికి వేసే ప్రతీ అడుగూ చేసే ప్రతీ పనీ అన్నీ సరళ రేఖలు, చతురస్రాలు, వృత్తాలు ఇలా ప్రతీదీ స్పష్టంగా గీయబడిన గీతలలాగానే ఉంటాయి…
మొదటిసారి యమునను చూడగానే, తను ఆ ప్రపంచపు మనిషి అని, అందులో నాకు ఇంకా చోటు లేదనీ తెలిసిపోయింది. యమున ఎడమచేత్తో విల్లు పట్టుకొని నారి సారించి బాణం ఒదిలితే చాలు. జూమ్, జూమ్, జూమ్, బాణాలు ఒకదాని తర్వాత ఒకటి దూసుకొని పోతాయి. థడ్, థడ్, థడ్, అంటూ నేరుగా ఆ నల్లటి వృత్తం లోకి, ఆ బుల్స్ ఐ లోకి దిగబడి పోతాయి.
“నువ్వు నేషనల్ ఛాంపియన్‌వా?”
“కాదు. యూనివర్సల్ ఛాంపియన్‌ని.”
“నువ్వు బాణం వేసేప్పుడు విల్లు రకరకాలుగా ఒంచుతావు. ఒక్కోసారి ఒక్కోరకంగా పట్టుకుంటావు. అయినా సరే, బాణాలు నేరుగా బుల్స్ ఐ లోకి వెళతాయి. అలా ఎలా కొడతావు టార్గెట్‌ను?”
“చూడూ, నేనిక్కడ నా టార్గెట్ అక్కడ లేదు. నాకు తెలుసు, నువ్వు అలానే అనుకుంటావని. కాదు. నేనే ఇక్కడా ఉన్నాను అక్కడా ఉన్నాను. నేనే ఆర్చర్, నేనే టార్గెట్. బాణం నేనే, గమ్యం నేనే. ఎక్కుపెట్టే విల్లు నేనే, దూసుకొచ్చే బాణం నేనే, దాన్ని ఎట్రాక్ట్ చేసే గమ్యం కూడా నేనే.”
“నాకు అర్థం కాటల్లేదు నువ్వేం చెప్తున్నావో.”
“నువ్వూ నాలాగా అయితే నీకు అర్థం అవుతుంది.”
“ఐతే నేనూ నేర్చుకోవచ్చా?”
“నేర్చుకుంటాను అంటే నేను నేర్పిస్తాను నీకు.”
యమున నాకు మొట్టమొదటి పాఠం నేర్పింది: నీ కంటికి గురి రావాలి, వచ్చిన గురి నిలబడాలి, అంటే నువ్వు ముందు నీ లక్ష్యం వైపు చూడాలి. తదేకంగా చాలాసేపు అలా చూస్తూ ఉండాలి. ముందు చూడు, మామూలుగా చూడు. చూస్తూ చూస్తూ ఉండు. నువ్వు అలా కన్నార్పకుండా చూస్తూ ఉండాలి కొంతసేపటికి నిన్ను నువ్వు మర్చిపోయి, దానిలో నువ్వు కలిసి పోయేదాకా. నువ్వే లక్ష్యం, నువ్వే టార్గెట్ కావాలి. ఈ ప్రపంచంలో ఆ టార్గెట్ తప్ప ఇక మరేమీ లేదని, నువ్వు దానిలో అన్నిటికన్నా మధ్యనున్న ఆ చిన్న బ్లాక్ సర్కిల్‌లో ఉన్నావని నీకు పూర్తిగా నమ్మకం రావాలి. నువ్వే బుల్స్ ఐ. ఆ బుల్స్ ఐ నువ్వే. సరేనా?
నేను టార్గెట్ వైపు సూటిగా చూశాను. ఇప్పటిదాకా అది ఒకేచోట కదలకుండా ఉంది అని నిశ్చయంగా అనిపించేది. ఇప్పుడు ఆ నమ్మకం రానురానూ పోయి అనుమానాలు వచ్చాయి. ఎర్ర సర్కిల్ పైకి ఉబ్బి ఆకుపచ్చ సర్కిల్ కంటే ముందుకు ఉన్నట్టూ, తెల్ల సర్కిల్ లోపలికి వంగిపోయి వెనకాలకు ఒత్తుకుపోయినట్టూ అనిపించేది. ఆ వృత్తాల మధ్య గీతలు పెద్దవయేవి, చిన్నవయేవి, కొన్నిసార్లు మాయమయేవి. ఇంకొన్నిసార్లు వాటి మధ్య ఖాళీ జాగా వచ్చేది. ఆ జాగా పెరిగేది, పెద్దదయేది. దానిలో లోయలు, కొండచరియలు కనిపించేవి. అన్నిటికన్నా మధ్యలో ఉన్న నల్ల సర్కిల్ కొన్నిసార్లు అగాధపు లోతుల్లో కనిపించేది. ఇంకొన్నిసార్లు ముందుకు పొడుచుకొనివచ్చి శూలపు మొనకు వేలాడుతున్నట్టుగా అనిపించేది. కదులుతూ, తిరుగుతూ, ఆ వృత్తాల అంచులు రథం ముగ్గు మెలికల్లా అయిపోతుండేవి. పాముల్లా పాకిపోతున్న ఆ గీతల మధ్య ఒక చేయి, ఒక మనిషి… నర్మద! అనిపించేది వెంటనే. కాని, వెంటనే తల విదిలించుకొని ఆ ఆలోచన మర్చిపోవడానికి ప్రయత్నించేవాణ్ణి. ఇప్పుడు నేను అనుసరించాల్సింది యమునను, నర్మదను కాదు. యమున మొహం కనిపిస్తే చాలు, లక్ష్యం దానంతటదే దగ్గరవుతుంది.
యమున నాకు రెండో పాఠం నేర్పింది: ఎప్పుడైతే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా అవుతుందో అప్పుడే బాణం విల్లును ఒదిలిపెడుతుంది. కానీ అలా కావడానికి ముందు బాణం మీద సరిపోయినంత ఒత్తిడి ఉండాలి. నువ్వు బాణంలా కావాలి అంటే రెండు సంగతులు తెలుసుకోవాలి. ప్రశాంతత, అది రావడానికి ఉండాల్సిన ఒత్తిడి. ఏకాగ్రత నీ లోపలికి, నీ గురించి ఉండాలి. నిన్ను నువ్వు కాన్సన్‌ట్రేట్ చేసుకో నీ లోపలే. అన్ని రకాల ఒత్తిళ్ళనూ నీ బైటే ఒదిలివేయి.
నేను బాణంలాగా నన్ను నేను ఒత్తిడి పెట్టుకొని ప్రశాంతం చేసుకొన్నాను. జూమ్! బాణంలాగా నేనూ దూసుకొని పోయాను. ఆ వెంటనే వీమ్! ఫీమ్! రీమ్! అటూ ఇటూ చెదిరి పోయాను, ఎటుకెటుకో వెళ్ళిపోయాను. తీగలాగా ఒణికి పోయాను. ఆ వణుకు తరంగాలుగా, సంగీతంలో గమకపు లయగా నా చుట్టూ పాకింది. ఆ తరంగాల మధ్య శూన్యం, ఆ శూన్యంలో పుట్టిన సుడిగాలులు. ఒక వీమ్, ఒక ఫీమ్ మధ్య ఊగుతూ కనిపించిన ఉయ్యాల. నేను ఆ సుడిగాలి బొంగరం మధ్యగా, మరమేకులా నన్ను నేను తిప్పుకుంటూ ఆ శూన్యంలోకి పైపైకి వెళ్ళాను. అక్కడ ఆ ఉయ్యాల మీద ఊగుతూ నర్మద. ఇంతలో ఆ తరంగాలు చెదిరి పోయాయి. నేను నేలమీద పడిపోయాను.
యమున నాకు మూడో పాఠం నేర్పింది: నువ్వే ఒక బాణం. దూసుకొని వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించు.
గాలిని చీల్చుకుంటూ పరిగెత్తాను. నన్ను నేను బాణంగా భావించుకున్నాను. కాని, ఆ నేను-బాణాలు గురి తప్పి అటూ ఇటూ పడిపోయేవి. ఒక్క లక్ష్యం తప్ప అన్ని వైపులకూ దూసుకెళ్ళేవి. నేను పరిగెత్తుకుంటూ వాటిని పట్టుకోడానికి ప్రయత్నించాను. ఏరడానికి వాటి వెంబడి పరిగెత్తుతూ చంద్రుడి మీదలా రాళ్ళు గుంటలతో నిండిన ఒక మైదానం లోకి చేరాను. ఆ మైదానం నేనేనా? అద్దం నాకు చూపించిన నా మొహం ఇదేనా? ఆ రాళ్ళ మధ్య నాకు ఆ బాణాలు కనిపించాయి. వంగిపోయి, ములుకులు విరిగిపోయి, వాటి ఈకలు ఊడిపోయి ఉన్నాయి. అదిగో, ఆ విరిగిపోయిన బాణాల మధ్య నర్మద. గాలిలో తేలుతున్నట్టుగా, నిదానంగా ప్రశాంతంగా ఏ తోటలోనో ఒత్తుగా పెరిగిన పచ్చిక తివాచీ మీద నడుస్తూ, నేలమీద రాలిపడిన పున్నాగ పూలు ఏరుకుంటూ, బంతి పూల మీద వాలిన సీతాకోకచిలుకలను పట్టుకుంటూ, ఒదిలిపెడుతూ.
నేను: “నువ్విక్కడ ఎందుకున్నావ్ నర్మదా? మనం ఎక్కడున్నాం? చంద్రుడి మీదనా?”
నర్మద: “మనం గమ్యానికి అటువైపు, అది దాక్కొని ఉన్నవైపున ఉన్నాం.”
నేను: “గురి తప్పిన బాణాలన్నీ ఇక్కడికేనా వచ్చేది?”
నర్మద: “గురి తప్పడమా? అలాంటిదేమీ లేదు. గురి తప్పడం అనేది లేనే లేదు.”
నేను: “మరి ఇక్కడ అవి దిగిపోవడానికి లక్ష్యం ఏమీ లేదుగా?”
నర్మద: “ఇక్కడ బాణాలు నేలలోకి దిగిపోతాయి. వేళ్ళూనుతాయి. చెట్లుగా పెరిగి అడవులవుతాయి.”
నేను: “ఇక్కడ నాకు రాళ్ళూ రప్పలూ ఎర్రమన్నూ తప్ప ఏమీ కనిపించటంలేదు.”
నర్మద: “రాళ్ళూ రప్పలూ పైకి పేరిస్తే ఇళ్ళవుతాయి. ఇళ్ళు పైకి పేరిపోతే తిరిగి రాళ్ళూ రప్పలూ అవుతాయి.”
యమున: “మాధవ్! ఎటెళ్ళిపోయావ్! టార్గెట్! టార్గెట్!”
నేను: “ఇక నేను వెళ్ళాలి నర్మదా. నేనిక్కడ నీతో ఉండలేను. నేను టార్గెట్ ఆ వైపు వున్నదాన్ని అందుకోవాలి.”
నర్మద: “ఎందుకలా?”
నేను: “ఇక్కడేదీ సరిగ్గా లేదు. ఏదీ పద్ధతిగా లేదు. స్పష్టంగా గీయబడిన గీతలు లేవు. దేనికీ ఒక ఆకారం రంగూ అదేమిటో కచ్చితంగా తెలిసేట్టు లేవు.”
నర్మద: “మళ్ళీ చూడు. బాగా దగ్గరనుంచి చూడు. ఏం కనిపిస్తోంది?”
నేను: “గుంటలు పడ్డ నేల. బరక బరకగా స్ఫోటకం మచ్చలున్న మొహంలా కనిపిస్తోంది.”
నర్మద: “ఆ గుంటల మధ్యలోకి, ఆ ఇసుక లోపలికి, ఆ రాళ్ళ మధ్య చీలికల్లోకి వెళ్ళు. అక్కడ నీకు ఒక పెద్ద తలుపు కనిపిస్తుంది. దానిలోంచి పోతే పూలతోట ఒకటి వస్తుంది. అక్కడ పచ్చగా తివాచీలా గడ్డి మెత్తగా పరచుకొని ఉంటుంది. నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి. వాటిల్లో నీలంగా ఆకాశం మెరుస్తూ ఉంటుంది. వాటి అడుగున ఉంటాను నేను. రా.”
నేను: “నేను ఏది ముట్టుకున్నా ఇక్కడ పొడిగా దుమ్ముదుమ్ముగా ఉంది.”
నర్మద: “ఆ నేల మీద చేయిపెట్టి చూడు. నీ అరచేతితో నెమ్మదిగా నిమురు. అది మబ్బు అంత తేలిగ్గా, వెన్న అంత మెత్తగా ఉంటుంది.”
నేను: “ప్రతీదీ ఒకేలా ఉంది. దేనికీ చలనం లేదు. అన్నీ ఒకేలా ఉన్నాయి.”
నర్మద: “కళ్ళూ చెవులూ తెరుచుకో. చుట్టూ ఉన్న ఊరు చూడు. ఆ రొద విను. ఆ కూడళ్ళలో ఆ నియాన్ లైట్ల వెలుగులు చూడు. వాటిల్లో మెరుస్తున్న కిటికీల అద్దాలు చూడు. అటూ ఇటూ నడుస్తూ, అరుస్తూ పరుగెడుతూన్న వాళ్ళందర్నీ చూడు. నల్లగా, తెల్లగా, ఎర్రగా, పచ్చగా, నీలంగా, రకరకాల రంగుల్లో వాళ్ళు వేసుకున్న బట్టలు చూడు.”
యమున: “మాధవ్! ఎక్కడున్నావ్? హర్రీ అప్!”
కాని ఈసారి నేను నర్మద లోకంలోంచి బైటకు రాలేకపోయాను. ఆ లోకం ఒక నగరం, ఒక మేఘం, ఒక పూలతోట. ఇక్కడ ఏ బాణమూ నేరుగా ఒక సరళరేఖ మీదగా పోటల్లేదు. అన్నీ చిక్కుపడిన ఉండలో దారం లాగా మెలికలు మెలికలుగా అటూ ఇటూ ఒక పద్ధతి లేకుండా పోతున్నాయి. వాటిల్లో అవి చిక్కుపడి పోతున్నాయి. కాని గురి మాత్రం తప్పట్లేదు. చివరికి ఎలాగోలా వెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి. టార్గెట్ చేరుకొని ఆ నల్ల సర్కిల్ లోకి దిగబడుతున్నాయి. కొన్నిసార్లు అది నేను అనుకున్న టార్గెట్ కాదు, ఇంకో టార్గెట్. అయినా సరే.
ఇదంతా జరుగుతున్నప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటుంది–ఈ ప్రపంచమనేది ఎవరికీ అర్థం కాని, ఎవరికీ అంతుబట్టని, ఎవరూ విడదీయలేని ఒక పెద్ద చిక్కుముడి అని నాకు తెలిసి వస్తున్నకొద్దీ, అందరూ అనుకుంటున్నట్టు ఆ ముడి విప్పడం ఎంతో కష్టం కాదని, ఆ చిక్కు విడదీసుకొని ముందుకు నడవడానికి నేను తెలుసుకోవలసిన విషయాలు నిజానికి చాలా కొన్నే అని, అవి కూడా చాలా చిన్నవి, చాలా సులభమైనవి అని నాకు అర్థం అవుతూ రావడం. ఆ చిన్న చిన్న విషయాలు సరిగ్గా నేను అర్థం చేసుకుంటే చాలు, చాలా సునాయాసంగా ఆ చిక్కు అంతా విడిపోయి ప్రతీదీ సరళ రేఖలా స్పష్టంగా అయిపోతుంది. ప్రతీ బాణమూ లక్ష్యం చేరుకుంటుంది.
ఈ సంగతి నేను నర్మదకూ, యమునకూ కూడా చెప్దామనుకున్నాను కాని వాళ్ళని చూసి కలిసి చాలా కాలమయింది. వాళ్ళిప్పుడెక్కడున్నారో కూడా తెలీదు. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం? నాకు ఇప్పుడు ఎవరు ఎవరో సరిగ్గా గుర్తు లేదు. యమునను నర్మద అనీ, నర్మదను యమున అనీ తరచూ పొరపడుతున్నాను.
అద్దంలో నన్ను నేను చూసుకొని కూడా చాలా కాలమయింది. ఒకరోజు ఎక్కడికో వెళుతూ, అనుకోకుండా తలతిప్పి అక్కడ ఒక షాప్ ముందు పెట్టిన ఏదో అద్దం లోకి చూసినప్పుడు నాకు మళ్ళీ అదే లక్ష్యం కనిపించింది. రంగురంగుల వృత్తాలు ఒకదాని చుట్టూ ఒకటి రానురాను చిన్నవవుతూ మధ్యలో నల్ల వృత్తంతో. బుల్స్ ఐ! నేను కొద్దిగా పక్కకు తిరిగాను. అయినా టార్గెట్ కనిపిస్తూనే ఉంది. ఇంకొద్దిగా తిరిగాను. టార్గెట్ ఇంకా కనిపిస్తూనే ఉంది. అంటే, తల తిప్పుకొని కూడా లక్ష్యాన్ని చూడగలిగాను. యమునా! యమునా! చూడు చూడు, నువ్వెలా ఉండమన్నావో అచ్చు అలా అయిపోయాను నేను! కాని, వెంటనే తెలిసి వచ్చింది నేను అద్దంలో చూస్తున్నది నన్నే కాదని, నాతో ఉన్న ప్రపంచం మొత్తాన్ని కూడా అని. ఆ మొత్తంలో ఆ వృత్తాల్లో ఆ రంగుల్లో యమున ఎక్కడ ఉందో వెతకాలి. మరి నర్మద? కనిపిస్తూ మాయమవుతూ తనూ వాటిల్లోనే ఉండి వుండాలి. ఇప్పుడు ఆ అద్దం లోకి సూటిగా తదేకంగా చూస్తున్నప్పుడు ఆ రంగుల వృత్తాలలో, వాటి మధ్యలో, వాటి అంచులలో, కనిపిస్తూ మాయమవుతున్నది ఎవరు? నర్మదా? యమునా?
ఎక్కడో వీధుల్లో నడుస్తున్నప్పుడు, కొన్నిసార్లు తనెక్కడో ఎదురుపడినట్లు, తనో, కాదు తనో, నాకేదో చెప్పాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. కాని, రెండు రైళ్ళు అటొకటీ ఇటొకటీ పోతూ ఒకదాన్ని ఒకటి దాటిపోతున్నప్పుడు, ఆ రైలు బోగీ కిటికీ అద్దాల ఫోటో ఫ్రేముల్లోని మొఖాలు చిన్నప్పుడు అద్దంలో ఒకప్పుడు నేను పెట్టిన మొఖాలలానే కనిపిస్తూ చకచకా కదిలిపోతున్నప్పుడు, వాటి మధ్యగుండా అటువైపు నుంచి కనిపిస్తూ మాయమవుతూ ఉన్న ఆ మొఖం యమునదా, నర్మదదా!
(A mirror, A target. 1978.)