గూఢచారి కోడిపెట్ట
బంగార్రాజు తదేకంగా చికినీ కేసి చూశాడు.
ఆ పెద్ద ఫ్యాక్టరీ వెనకవైపు షెడ్లు కట్టించి పెట్టిన వర్క్‌షాపు ఏరియా అది. చుట్టూ గుండ్రంగా కంచె. కంచెకు ఆ వైపు మూలకు ఒక పెద్ద సెక్యూరిటీ గేటు, సెంట్రీ కాబినూ. గుండ్రంగా కంచెవాలుగా ఉన్న షెడ్ల మధ్యలో కాస్త ఖాళీ జాగా, ఒక చావడి లాగా కాస్త గడ్డీ గట్రాతో. చికినీ ఆ జాగాలో అటూ ఇటూ తిరుగుతోంది, దాని మానాన అది, ఎప్పళ్ళానే ఎవరికీ అడ్డం రాకుండా, ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించకుండా. అందులో ఆశ్చర్యమేమీ లేదు.
ఆశ్చర్యం కలిగించే విషయం బంగార్రాజుకు తదేకంగా చూసేంత తీరిక ఎలా వచ్చిందీ అని. అరవైకి దగ్గర పడుతున్న బంగార్రాజు ఆ ఫ్యాక్టరీ వర్క్‌షాప్‌లో లేత్ మెషీన్ టర్నర్‌గా చేరి అప్పటికి నలభై యేళ్ళు కావస్తోంది. ఒక మూలగా ఉన్న షెడ్ అతనిది. ఒకటే పెద్ద గది. ఆ గదికున్న తలుపు, ఆ గదికున్న ఒకే పెద్ద కిటికీ – రెండూ ఆ చావడి వైపుకే చూస్తాయి. అన్ని షెడ్ల తలుపులూ అలానే కాబట్టి, షిఫ్టులు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళూ ఆ జాగాలోంచే రావాలి పోవాలి. అందుకని, అప్పుడప్పుడూ తలెత్తి కిటికీలోంచి ఆ ఆవరణలో ఏం జరుగుతోందో చూడచ్చు. కానీ రానూ రానూ బంగార్రాజుకు ఆ తలెత్తే సమయం తగ్గిపోతూ వచ్చింది.
బంగార్రాజు ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఆ గదిలో రెండు మెషీన్లుండేవి. బంగార్రాజు, ఇంకొకతనూ కలిసి పని చేసేవాళ్ళు. ఉన్నట్టుండి ఆ రెండో అతనికి హెర్నియా వచ్చి పనిలోకి రావడం మానేశాడు. దాంతో రెండు మెషీన్లనూ బంగార్రాజే చూసుకోవల్సి వచ్చింది. దానికోసం తన పని పద్ధతీ కొంచెం మార్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడొకటి గుంజి ఇదయేలోపల అక్కడొకటి లాగి మళ్ళీ అక్కడొకటి గుంజి అదయే లోపల ఇక్కడకొచ్చి ఇది లాగి – ఇలా ఆగకుండా రెంటి మీదా పని నడిచింది. కొంతకాలానికి, ఆ హెర్నియా కేసు తిరిగొచ్చింది ఉద్యోగానికి. కాని, అతను లేకున్నా రెండు మెషీన్లూ బానే నడుస్తున్నాయని గమనించడంతో, అతన్ని తీసుకెళ్ళి ఇంకో ఉద్యోగంలో పడేసింది యాజమాన్యం. అలా బంగార్రాజే పూర్తిగా రెండూ చూసుకోవలసి వచ్చింది. అక్కడితో బంగార్రాజును ఫ్యాక్టరీ పెద్దలేమీ మర్చిపోలేదు. కొంతకాలానికి ఒక నిపుణుల బృందం వచ్చి వర్కర్ల పని పద్ధతి, పరిస్థితులూ గమనించింది. కదలికలను పొదుపు చేసి కాలాన్ని ఎలా మిగుల్చుకోవచ్చో పరిశోధనలు చేసిన బృందం అది. ఈ మెషీన్ మీద గుంజి, ఆ మెషీన్ మీద లాగి, అవి అటు సర్ది, ఇవి ఇటు జరిపీ – ఇలా కదలికల మధ్యలో కొన్ని క్షణాలు మిగలడానికి ఆస్కారం ఉందని, మరింత సమర్థవంతమైన పనితనానికి మరికొంత చోటు ఉందనీ గమనించి చేసిన సిఫారుసుతో ఆ గదిలోకి మూడో మెషీన్ వచ్చింది. మరికొంత కాలానికి, శ్రామిక సామర్థ్యం, ఉత్పత్తి పెరుగుదల – లాంటి ఏదో అర్థం కాని ప్రతిపాదన ఒకటి ఆ ఫ్యాక్టరీ పై అంతస్తుల్లోని ఎ. సి. గదుల్లో ఆమోదించబడి, బోనస్ లాంటిదేదో కూడా ఇస్తామన్న పొగమంచు హామీతో పాటుగా బంగార్రాజు షెడ్‌లోకి నాలుగో మెషీన్ కూడా వచ్చి చేరింది. ఇరవై యేళ్ళ వయసులో చేసే పని అరవైకి వచ్చేసరికి అదే పదిగంటల్లో నాలుగురెట్లు చేయడం నేర్చుకోవలసి వచ్చింది. కానీ జీతం రెండు రెట్లకు కూడా బోలెడంత దూరంలోనే ఉండడంతో బంగార్రాజు జీవితంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాలేదు, వయసు మీద పడి వచ్చిన ఉబ్బసపు దగ్గు, అలసటతో ఎక్కడైనా ఒక్క క్షణం కూర్చుంటే చాలు చటుక్కున మూతపడే కన్నూ తప్ప.
కాని, బంగార్రాజు కష్టాన్ని నమ్ముకొని బతికే మనిషి. మంచిరోజులింకెంతో దూరం లేవు అని ఎప్పుడూ నమ్మే మనిషి. అందుకని బతుకు గురించి ఎప్పుడూ నిరాశపడిన దాఖలాలు లేవు. అలా తన కదలికలను, ఆలోచనలనూ ఆ మెషీన్ల అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నాడు. ఫ్యాక్టరీ రొద, లేత్ మెషీన్ల చప్పుడు కలిసి ప్రతీ ఉదయం బంగార్రాజు బుర్రలో నేపథ్యసంగీతం మొదలవుతుంది. దానికి తగినట్టు శరీరమూ మనసూ కదులుతూ ఉంటాయి, ఏదో మత్తులో ఉన్నట్టు వాటంతటవే.
ఒకవేళ (ఇక్కడ లివర్ కిందకి గుంజు) నా పెద్దకూతురి పెళ్ళి గాని వచ్చే ఏడాదికల్లా (ఒక అడుగు ఇటు వేసి ఆ బటన్ ఒత్తు) చేసి అది అత్తారింటికి పోతే (రెండడుగులు అటు నడిచి షీట్ ముందుకు నెట్టు) ఇల్లు కొంచెం ఖాళీ అవుతుంది. వేరే ఇల్లు చూసుకో (ఈ లివర్ పైకి నెట్టు) నక్కర్లేదు. ఆఖరోడు ఎలానో టెంత్ (ఆ నాలుగు ముక్కలూ అంచులు సరిచూడు) క్లాస్ పాసయ్యాడంటే వాడికీ (స్పిండిలు వదులుచేయి) ఏదో ఒక ఉద్యో (ప్రెస్ బిగించు) గంవచ్చివాడూ రెండురాళ్ళు సంపాదించుకుంటే కా (స్పిండిల్ ఎందుకో జామయింది గట్టిగా తిప్పు) స్తయినా… తస్సాదియ్యా ఇది ఇరుక్కుపోయింది. దీన్నిగట్టిగావెనక్కులాగుతూ (ఫ్యాక్టరీయూనియన్ కనీసంఎలానోలావచ్చేబోనస్‍ఇప్పిం) ఆ హేండిలు పైకినెట్టి (చిపేగ్రేడ్‍పెంచేలాచేస్తే) ఇటులివర్‍కిందకులాగి (రిటయిర్మెంటుకైనా కనీసం ఇంటిప) ఆనాలుగు ప్లేట్లూ ఒకే లెవలుకు… జాగ్రత్త! (ట్టునుండి మనవళ్ళను చూసుకోవచ్చు) అమ్మయ్య! లేజర్ లెవలు సరిచూడు. మూడడుగులు వెనకకు (పెద్దోడు మొండెదవ. ఆ గవర్రాజుగాడి కూతుర్నే చేసుకుంటానని) ఆ నాలుగు స్విచ్చులూ ఆఫ్ పొజిషనుకు (ఏం చూశాడో ఆ పిల్లలో. బిడ్డ మంచిదేలే. ఆ గవర్రాజుగాడే ఉత్త…). మెయిన్ పవర్ స్విచ్చి స్టాండ్‍బైలో. ఈపూటకు పనయ్యింది.
అయితే, ఎంత పకడ్బందీగా కట్టిన జైలయినా తప్పించుకొని పోవడానికి ఏదో ఒక దారి ఉండకపోదు. అలా బంగార్రాజు కూడా అంత పనిలోనూ ఎంతో కొంత సమయం మిగుల్చుకోగలిగాడు. చేతికండ ఎప్పుడు బిగించాలి, ఎక్కడ వదులు చేయాలి, తొడలెప్పుడు బిగించాలి, కాలెక్కడ ఒత్తిపెట్టాలి – ఇలా చేసే పనిలో శరీరం బిగుస్తూ వదులవుతున్నట్లే బంగార్రాజు ఆలోచనలూనూ. ఎలానో అక్కడో క్షణం, ఇక్కడో క్షణం మిగిలేది. ఫోర్‌మన్ దగ్గర్లో లేకుంటే, ఎవరైనా అటూ ఇటూ పోతుంటే ‘ఎలా ఉన్నా?’ అని అడగడానికో, బీడీ వెలిగించుకోవడానికో, జిలపుడితే గీక్కోడానికో కాస్త తీరిక దొరికేది. ఇలా దొరికిన ఒక తీరికలోనే బంగార్రాజుకు మొదటిసారి చికినీ కనిపించింది. ఆ తర్వాత అదెప్పుడు కనపడ్డా, అది ఆ చావడిలో అటూ ఇటూ తిరుగుతుంటే, దానిలానే తానూనూ ఈ నాలుగు మెషీన్ల మధ్య అనుకునేవాడు, తదేకంగా దాన్ని చూడగల్గినంతసేపు చూస్తూ.
ఆ రోజు, అలా దానితోపాటే, ఎవరూ చూడకుండా జోబులోంచి జొన్నగింజలు కొన్ని తీసి చల్లుతూ, దాన్ని రమ్మని పిలుస్తూ ఆ మూలగా ఉన్న షెడ్ ముందు క్వాలిటీ కంట్రోలు గవర్రాజూ కనిపించాడు. బంగార్రాజు చిరాకుతో పళ్ళు కొరికాడు, తన నేపథ్యసంగీతానికి అనుగుణంగా కాళ్ళూ చేతులూ ఆడిస్తూనే.
అసలా కోడిపెట్ట వీళ్ళిద్దరిదీ కాదు. అది సెక్యూరిటీ గార్డు సాల్మన్రాజుది. అతనికి అదంటే ప్రాణం. కొని తెచ్చుకున్న దగ్గరినుండీ దానికి చికినీ అని పేరుపెట్టి పిలుచుకున్నాడు. దాన్ని ఇంటి దగ్గర ఒదిలిపెట్టి రావడానికి మనసొప్పుకోలేదు. తన పై అధికారిని బతిమాలుకున్నాడు – సెక్యూరిటీ గేటుకు ఇవతలగా, కేబిన్ వెనక ఎవరికీ కనిపించకుండా, ఎవరికీ అడ్డం రాకుండా ఒక గంప కింద ఉంచుకొని, అప్పుడప్పుడూ దాన్ని చూసుకొనేట్టు. అలా మొదలయింది కాని, చికినీ చిన్నచిన్నగా అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టింది. ఆ చావడిలో తుప్పు పట్టిన మేకులు, ఇనుప చెత్తతో పాటూ పురుగులూ ఎక్కువే కావడంతో, దానికి తిండీ దొరికేది. అది నోరు లేనిది. అప్పుడప్పుడూ ఉండీ లేనట్టు అది లోగొంతులో గురగురమని చప్పుడు చేయకపోయుంటే అది మూగది అనుకునేవారే అందరూ. పెద్దగా రెక్కలల్లార్చడం, ఉన్నట్టుండి అటూ ఇటూ పరుగులెత్తడం, కాళ్ళకడ్డం పడడం లాంటివేమీ చేయకపోవడంతో, అది ఆ షెడ్ల మధ్య ఆ చావడిలో అలా తిరుగుతున్నా ఎవరూ ఏమీ అనలేదు. అది క్లక్ క్లక్ అని వదరుతూ ఆ ఫ్యాక్టరీ ప్రశాంతతను ఎప్పుడూ భగ్నం చేయకపోవడంతో సెక్యూరిటీ హెడ్ ఆఫీసర్ కూడా చూసీ చూడనట్టే ఊరుకున్నాడు. అలా రానురానూ, చికినీ రోజంతా దాని ఇష్టానుసారంగా ఆ చావడిలోనూ ఆ షెడ్ల మధ్యా తిరుగుతూ ఆ మెయిన్ ఫ్యాక్టరీ వెనకాల కట్టిన ఈ వర్క్‌షాపు ఏరియాలో పనిచేసే వర్కర్లందరికీ పరిచయమయింది. ఏ ఆజమాయిషీ, చీకూచింతా లేకుండా అదలా తిరుగుతూ వారి అసూయకూ కాస్త కారణమయింది.
చికినీ రోజూ తెల్లవారగానే సెంట్రీ కాబిన్ వెనకాల సాల్మన్రాజు పెట్టిన బుట్టలో కూర్చుని ఒక గుడ్డు పెడుతుంది. సాల్మన్రాజు అది గర్వంగా గమనిస్తాడు. తను తొందర్లో ఇంకో పెట్టను, ఆపైన ఇంకో పెట్టను కొంటాడు. అవన్నీ గుడ్లు పెడతాయి. వాటిని పొదిగిస్తాడు. పిల్లలు పుడతాయి. అలా పెరిగి పెరిగీ, బోలెడన్ని అవుతాయి. అప్పుడు హాయిగా సాల్మన్రాజు కోళ్ళఫారం పెట్టుకుంటాడు. ఇదీ భవిష్యత్తు గురించిన కల. గేటు దగ్గర వచ్చేవాళ్ళవి, పోయేవాళ్ళవీ బ్యాగులు, టిఫిన్ కారియర్లు, చొక్కా ప్యాంటూ జోబులు వెతుకుతూ ఈ కలలోనే బతికేస్తున్న సాల్మన్రాజుకు, ఆ గేటు లోపల ఆ చావడిలో ఏం జరుగుతోందీ ఏ మాత్రమూ తెలియదు సరికదా, అలా ఒకటి జరగవచ్చన్న ఊహ కూడా రాలేదు.
గవర్రాజు తెలివైనవాడు కావడంతో చికినీ లోని ఉత్పాదకశక్తిని గమనించాడు. జతగా, యాజమాన్యం తనకు చేసిన అన్యాయాలకు ప్రతీకారంగా చికినీ ఉత్పత్తిని తాను సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకని, తన షెడ్ వెనకాల అట్టపెట్టెతో ఒక గూడు కట్టి, చికినీ రోజూ దాని దగ్గరకు వచ్చేలాగా జొన్నగింజలు ఒక వరుసలో చల్లుకుంటూ వచ్చేవాడు. ఎలాగైనా చికినీ గుడ్డు తన గూటిలో పెట్టేలా మచ్చిక చేసుకోవాలి. అదీ అతని ఆశయం.
గవర్రాజు రోజూ పనికి జోబులో కాసిని జొన్నగింజలు పోసుకొని వస్తున్నాడని, అవి చికినీకి ఎర వేస్తున్నాడనీ తెలియగానే బంగార్రాజుకు కోపం వచ్చింది. అసలే గవర్రాజు కూతురును తప్ప పెళ్ళి చేసుకోనని పెద్ద కొడుకు మొండికి పడ్డాక గవర్రాజంటే చిరాకు మరింత పెరిగింది. బంగార్రాజుతో సంబంధం కుదిరాక, ఆడపిల్ల తండ్రయినా తన ముందు హెచ్చులు పోతుంటాడు గవర్రాజు. తనంటే లెక్క లేనట్టుగా ప్రవర్తిస్తాడు. చీటికీ మాటికీ ఏదో ఒక తగాదా అవుతూనే ఉంది ఇద్దరి మధ్యా. అందుకే ఎప్పుడు గవర్రాజు ఏ ఎత్తు వేసినా, బంగార్రాజు దానికి పై ఎత్తు వేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడూ అదే జరిగింది. తనూ, ఒక అట్టపెట్టె తెచ్చి తన వర్క్‌షాప్ బెంచ్ కింద పెట్టి, జొన్నలూ సజ్జలూ కలిపి షెడ్ ముందు నుంచి ఆ పెట్టె దాకా రోజూ చల్లడం మొదలుపెట్టాడు బంగార్రాజు కూడా – చికినీ ఆ పెట్టే గుడ్డేదో తన పెట్టెలో పెట్టాలని. ఇలా ఈ కాబోయే వియ్యంకులిద్దరూ చికినీ కోసం పోటీపడ్డారు. ఒకరు అది పెట్టే గుడ్డు కోసం, ఇంకొకరు ఆ ఒకరిని ఓడించాలన్న పంతం కోసం. అలా, నిజానికి సాల్మన్రాజుకూ ఈ ఇద్దర్రాజులకూ మధ్య జరగాల్సిన ఈ స్పర్థలో సాల్మన్రాజు ఎప్పుడూ లేడు. అది వీళ్ళిద్దరి మధ్యే మిగిలిపోయింది.
తమాషాగా చికినీకి ఇదేమీ పట్టలేదు. దాని మానాన అది హాయిగా వీళ్ళు పెట్టిన గింజలు తింటూనే ఉంది. కాని, గుడ్డు మాత్రం పొద్దున్నే సాల్మన్రాజు గంపలోనే పెట్టేది, చావడి లోకి షికారుకు రాబోయేముందే. కొంతకాలం ప్రయత్నించాక, ఇక ఇలా కాదని ఈ కాబోయే వియ్యంకులు ఆ కోడిపెట్ట తమ దగ్గరికి రాగానే పట్టుకొని తోక ఎత్తి పొత్తికడుపు ఒత్తుతుండేవారు, అలాగైనా దానితో గుడ్డు పెట్టిద్దామని. ఎలానూ గొంతు లేనిది, నెమ్మదయినది కాబట్టి చికినీ కూడా ఏమనేది కాదు. వారిని అలా పొట్ట వత్తనిచ్చేది. కానీ, ఏమీ ఉండేది కాదు పెట్టడానికి. పొట్ట ఖాళీ.
బంగార్రాజుకు ఇలా చికినీ పొట్ట వత్తేంత తీరిక అదనంగా దొరకడానికి కొంతకాలం క్రితం తొత్తునారాయణను అతనికి హెల్పరుగా యాజమాన్యం పంపడం కారణం. ఇప్పటికీ నాలుగు మెషీన్లూ బంగార్రాజే నడుపుతాడు కాని, మెటల్ కటింగులు కొన్నిటికి అంచుల దగ్గర మరికొంత పాలిషింగ్ అవసరమని యాజమాన్యం ద్వారా నిర్ణయింపబడటంతో ఆ పని తొత్తునారాయణకు అప్పగించబడింది. అలా ఆ ప్లేట్లను ఒకవైపు వరుసగా పేర్చే పని బంగార్రాజుకు కొంత తప్పింది. వాటికి పాలిషింగ్ అవసరం అతనికేమీ కనపడలేదు. కాని, ఆమాట ఎవరితో అనడం? ఎందుకూ అనడం. అన్నా వినేదెవరు? ఎవరి పని వారిది. పైగా కొంచెం తీరిక కూడా దొరుకుతోంది మరి.
తొత్తునారాయణ అసలు పేరు సత్యనారాయణ. మొదట్లో వర్క్‌షాపుల షెడ్లను చిమ్మడం, కసువెత్తడం కోసం వచ్చేవాడు పొద్దునొకసారి, సాయంత్రం ఒకసారీ. ఫ్యాక్టరీలో మొట్టమొదట ఉద్యోగానికి తీసుకున్నప్పుడు అతని పని బాత్రూములు కడగడం, గచ్చు తుడవడం, బాత్రూముల్లో వర్కర్లు మాట్లాడుకొనే మాటలు వినడం. అవి యాజమాన్యానికి చేరేయడం అసలు పని. అలా బాత్రూముల్లో వినడానికి అంత గొప్ప రహస్యాలేముంటాయీ అనేది ఎవరికీ అర్థం కాని విషయం. పోనీ, అవేమైనా మాట్లాడుకోవడానికి వీలైన ప్రదేశాలా అంటే అదీ కాకపోయె. తలుపులూ కిటికీలూ ఏమీ లేకపోవడమే కాదు, ఒకటే చప్పుడూ కంపూనూ. దానికి తోడు సెక్యూరిటీ గార్డులు ప్రతీ ఐదూ పదినిమిషాలకు లోపలికి తొంగి చూసిపోతుంటారు, నిజంగా పని కానిస్తున్నారా, లేక ఊరికే నిలబడున్నారా అని. కాని, ఒక్కటి మాత్రం నిజం. అప్పటికప్పుడు ఉద్యోగం ఊడిపోకుండా ఏదో ఒక మనసులో మాట ఒకరికొకరు చెప్పుకోవాలంటే ఆ ఫాక్టరీ మొత్తంలో ఆ బాత్రూములే గతి. ఓసారెవరో ఇద్దరు కమిటీ మెంబర్లు, యూనియన్ కార్యకర్తలు, ఒకేసారి ఆ బాత్రూములోకి వెళ్ళారని, ఏవో కాసిని సలహాలు ఇచ్చుకున్నారని తెలిశాక – పనివేళలో యాజమాన్యంపై కుట్ర పన్ని ఫాక్టరీ శాంతిభద్రతలకు ఆటంకం కలిగించడానికి పాల్పడుతున్నారన్న అభియోగంతో – ఆ ఇద్దరి ఉద్యోగాలూ ఊడిపోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఈ సంగతి యాజమాన్యానికి ఎలా తెలిసిందీ అని తెలియడానికి అంతకంటే తక్కువ సమయమే పట్టింది. ఇది సత్యనారాయణ పనే అని అందరికీ తెలిశాక అందరూ అతన్ని తొత్తునారాయణ అని పిలవడం మొదలు పెట్టారు. ఆపైన ఎవరూ బాత్రూముల్లో మాట్లాడుకోలేదు. నారాయణకు శరీరాల చప్పుళ్ళు, నీళ్ళ చప్పుళ్ళూ తప్ప వినడానికేమీ మిగలలేదు.
యాజమాన్యం ఎప్పుడూ పనివారిమీద ఒక కన్నేసి ఉంచాలి. కేవలం వారితో సమర్థవంతంగా పని చేయిస్తే సరిపోదు. వారి మెదడులోనూ ఖాళీలుంచకూడదు. అలా ఖాళీ ఉండి, పనివారికి ఆలోచనలొచ్చినప్పుడల్లా చరిత్రలో ఏం జరిగిందో, యాజమాన్యం వారికి తెలుసు. అందుకే వారి ఆలోచనల్లో ఎప్పుడూ కుట్ర గురించిన భయాలుంటూనే ఉంటాయి. బాత్రూముల్లో ఈమధ్య వినడానికి ఇంక ఏమీ లేకపోవడంతో తొత్తునారాయణను పూర్తిగా వర్క్‌షాప్ ఏరియాలోనే ‘పని’ చేయమని యాజమాన్యం అతన్ని బంగార్రాజు షెడ్‌లో హెల్పరుగా నియమించింది. రోజూ పొద్దున్నే మెషీన్ల మీద నుంచి నాలుగు మెటల్ ప్లేట్స్ తీసుకొనివెళ్ళి షెడ్ ముందు మెట్లపై కూర్చొని ఆకురాయితో ఒక్కో ప్లేట్ అంచునూ చిన్నగా గంట సేపు సానపడతాడు ఏదో ఆలోచిస్తూ, అటూ ఇటూ చూస్తూ, అందరినీ గమనిస్తూ. కాని, అతని అసలు పని ఏదో అందరికీ తెలుసు కాబట్టీ అతనున్నచోట ఎవరూ ఏమీ మాట్లాడరు కాబట్టీ తన ఉపయోగం యాజమాన్యానికి రాను రానూ తగ్గిపోతోంది. ఇక తన ఉద్యోగం కూడా తొందర్లో ఊడుతుందన్న భయం పుట్టింది తొత్తునారాయణకు. బంగార్రాజు ఎప్పుడూ ఆ మెషీన్ల మధ్యే తిరుగుతుంటాడు. వాటి చప్పుడుతో వినికిడి కూడా సరిగ్గా ఉండదాయె. ఇక ఈ చెవిటి ముసలోడి షెడ్‌లో ఏ రహస్యాలు వినాలి, ఏం చేరవేయాలి? తొత్తునారాయణ బుర్ర వేడెక్కిపోయింది. తాను పట్టించినవాళ్ళ లానే తాను రోడ్డు మీద అడుక్కోవాల్సిందేనా? రకరకాలుగా ఆలోచించాడు తొత్తునారాయణ. వెతికితే ఎక్కడో ఒకచోట ఏదో ఒక కుట్ర కనపడక పోదు. ఎక్కడ? ఎక్కడ?
ఒకరోజు బంగార్రాజు మెషీన్ల మీద కోసి పెట్టిన ఒక నాలుగు ప్లేట్లను మొక్కుబడిగా షెడ్ ముందు మెట్ల మీద కూర్చొని పరధ్యాన్నంగా ఒక్కోటీ సుర్రూ సుర్రూ అని సానపడుతున్న తొత్తునారాయణ కంటికి చికినీ కనిపించింది. రోజూ చూస్తూనే ఉన్నాడు కాని, ఈ రోజెందుకో దాని మీదకు అతని ధ్యాస మళ్ళింది. అది ప్రతీరోజూ ఇదే సమయానికి వస్తుంది. ముందు గింజలు, పురుగులు ఏరుకుంటూ బంగార్రాజు షెడ్‌కు వచ్చి, అతని వర్క్ బెంచ్ దగ్గర కాసేపు తచ్చాడుతుంది. ఆపైన నిదానంగా తీరిగ్గా నడుస్తూ అది గవర్రాజు షెడ్ వెనకాలకు వెళుతుంది. అక్కడా కాసేపుండి బైటకు వస్తుంది. తొత్తునారాయణ బుర్ర పాదరసంలా పనిచేసింది. ఇక్కడేదో గూడుపుఠాణీ జరుగుతోంది. దీన్ని కూపీ తీయాలి.
తొత్తునారాయణకు ఈ ఆలోచన రాగానే చికినీని, ఇద్దర్రాజులనూ గమనించడం మొదలుపెట్టాడు. చికినీ దగ్గరకు రాగానే బంగార్రాజు చేసే పని ఆపి మరీ దాన్ని ఎత్తుకొని దాని తోక కింద ఒత్తి ఒదిలిపెడతాడు. అదీ బాగా అలవాటయినదానల్లే హాయిగా ఉంటుంది, మిగతా కోళ్ళల్లే విదిలించుకొని పారిపోకుండా. దింపగానే అది ఆ షెడ్ వైపు వెళుతుంది. అక్కడ గవర్రాజూ తోక ఎత్తి కింద చేయి పెడతాడు. అక్కడా ఈ కోడిపెట్ట ఏమీ అనదు. అంటే వీళ్ళిద్దరికీ ఇది అలవాటయిన పెట్ట. వీళ్ళిద్దరూ ఈ పెట్ట ద్వారా ఏదో రహస్యాలు చేరవేసుకుంటున్నారు. సందేహం లేదు. తంతే బూరెలబుట్టలో పడడం అంటే ఇదే!
మరుసటి రోజు, బంగార్రాజు చికినీ తోకకింద ఒత్తి రోజువారీ నిరాశతో దానిని నేల మీద వొదిలి పెడుతూండగానే, తొత్తునారాయణ చేస్తున్న పని ఉన్నది ఉన్నట్టు ఒదిలేసి పరుగందుకున్నాడు. చికినీ చిన్నగా కాళ్ళతో నేలను ఏరుతూ ముక్కుతో ఒక్కో గింజ, ఒక్కో పురుగూ తింటూ చావడిలో నిదానంగా గవర్రాజు షెడ్ వైపు నడుస్తోంది. ఇంతలోనే తొత్తునారాయణ, వెంబటే నల్లటి యూనిఫార్మ్ వేసుకున్న ఇద్దరు గార్డులూ వచ్చారు. చికినీని చుట్టుముట్టి ఎటూ ఎగిరిపోకుండా పట్టుకోవాలని ఒక ప్రణాళిక వేసుకున్నారు కాని, వారికి ఆమాత్రం శ్రమ కూడా కలిగించకుండా చికినీ వెంటనే వారి చేతుల్లోకి వచ్చి చిక్కింది. దాని రెండు కాళ్ళకూ చిన్న సంకెల వేసి గార్డులు దాన్ని సెక్యూరిటీ హెడ్ ఆఫీసులోకి తీసుకువెళ్ళారు.
ఆ కోడిపెట్ట సాల్మన్రాజుది కాబట్టి, అతని పాత్ర ఈ కుట్రలో ఏమీ లేదని నిర్ధారించలేరు కాబట్టి, ప్రాథమిక విచారణ అతను లేకుండానే జరిగింది. చికినీ ఒంటిమీద ఏమీ దొరకలేదు. సాల్మన్రాజు పిలిపించబడ్డాడు. వస్తూనే తన ఇద్దరు సహోద్యోగుల మధ్య కట్టివేయబడి కదలకుండా ఉన్న చికినీని చూడగానే అతనికి కన్నీళ్ళాగలేదు. చికినీ ఏం అపరాధం చేసిందో అని భయపడ్డాడు. తనదే తప్పు. చికినీని ఎప్పుడూ చావడిలో తిరగనీయకుండా ఉండాల్సింది. ఏమయింది సార్? ఇదేం చేసింది సార్? సార్, సార్! దాన్నేం చేయకండి సార్! అదెప్పుడూ గంపలోనే ఉంటుంది సార్! పొరపాటున షెడ్ల మధ్య తిరిగిందేమో సార్! బతిమాలుకుంటూ మాట్లాడబోయాడు. కాని, కాసేపటికే అతనికి తెలియవచ్చింది, చికినీపై ఆరోపణలు అంతకు వెయ్యిరెట్లు తీవ్రమైనవి.
సెక్యూరిటీ హెడ్ రిటయిర్డ్ ఆర్మీ మేజర్. ఇక్కడ ఫ్యాక్టరీ సెక్యూరిటీ దళంలో గార్డులుగా పని చేసే రిటయిర్డ్ ఆర్మీమెన్ అందరిమీదా అప్పటి అధికారం ఇంకా ఉన్నవాడు. క్రమశిక్షణతో ఆ అధికారాన్ని ఇక్కడ ఇప్పుడు కూడా నిలుపుతున్న వాడు. అణచివేత మంత్రాంగం ఆ క్రమశిక్షణను ఆశిస్తుంది. హెడ్ బులెట్లు పేల్చినట్టు వరుసాగ్గా ప్రశ్నలు పేల్చేడు. తన మేజర్ ముందు తన నడవడికపై ఎలాంటి ఆరోపణలొస్తాయో అన్న భయం సాల్మన్రాజును మింగేసింది, చికినీ మీద ప్రేమ కన్నా, తన కోళ్ళఫారం కల కన్నా ఎక్కువగా. మనిషి నిలువెల్లా ఒణికిపోయాడు. దాపరికం లేకుండా జరిగిందంతా చెప్పాడు. అవును, ఆ కోడిపెట్ట నాదే. నేనే దానిని గంపలోనుంచి వదిలాను. నేనే దాన్ని చావడిలో తిరగనిచ్చాను.
కాని, ఆ కోడిపెట్టకు వర్కర్స్ యూనియన్‌కూ ఉన్న సంబంధం ఏమిటో సాల్మన్రాజు చెప్పలేకపోయాడు. చికినీ కార్మిక సంఘాల కుట్రలో భాగం అని ఒప్పుకోలేకపోయాడు. అలా అని దాన్ని క్షమించమనీ అడగలేడు. అలా అడిగితే అదేదో తప్పు చేసిందని ఒప్పుకోవడమే అవుతుంది మరి. ఇక ఏమీ చేయలేని స్థితిలో ‘నాకేమీ తెలీదు. ఇందులో నాకేమీ భాగం లేదు’ అని మంత్రంలా జపిస్తూ తన తప్పేమీ లేదని సాల్మన్రాజు తన చుట్టూ గోడ కట్టేసుకున్నాడు. చివరికి సాల్మన్రాజు నిర్డోషిత్వం ఒప్పుకోబడింది. కాని, అది అతనికి అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వలేదు. అతను పశ్చాత్తాపం నిండిపోయిన మనసుతో దీనంగా చికినీ వైపు చూస్తూ మౌనంగా నిలబడిపోయాడు. సెక్యూరిటీ హెడ్ ఆ పక్షిని వెతకమని ఆజ్ఞాపించాడు. గార్డులు వెతికారు కాని ఏమీ దొరకలేదు. ఇక నిపుణుల రంగప్రవేశం తప్పనిసరి అయింది.
దోషులతో నిజం చెప్పించడం లోను, రహస్యాలు వెలికితీయడం లోను శిక్షణ పొందిన ప్రత్యేకదళ సభ్యులు వారు. చికినీ రెక్కలు ఎడంగా లాగి ఇద్దరు పట్టుకున్నారు. మరి ఇద్దరు అత్యంత శ్రద్ధగా చికినీ నోటినుంచి తోక దాకా అంగుళం అంగుళం వెతికారు. ఈకల సందుసందుల్లోకి వేళ్ళు జొనిపి దాని శరీరమంతా తడిమారు. ఒకడు తన చూపుడువేలుతో దాని రంధ్రాన్వేషణ కూడా చేసి రక్తం అంటిన తన వేలునూ శ్రద్ధగా పరిశీలించాడు. ఇదంతా అయేసరికి గదంతా చికినీ ఈకలు పరుచుకున్నాయి తప్ప ఏమీ దొరకలేదు.
ప్రత్యేకదళ సభ్యులందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. కోడిపెట్ట దగ్గర ఏమీ దొరకకపోయినా దాని నిర్డోషిత్వం అనుమానాస్పదమే. చికినీ కపటి అని, అమాయకమైనది కాదనీ వారొక నిర్ధారణకొచ్చారు. ఇక దాన్ని ఒదిలిపెట్టడం శాంతిభద్రతలకు, ఫ్యాక్టరీ భవిష్యత్తుకూ కూడా ప్రమాదమే. నల్లరంగు యూనిఫార్మ్ వేసుకున్న ఇద్దరు గార్డులు చికినీని తీసుకొని సెక్యూరిటీ ఆఫీస్ వెనక ఉన్న ఖాళీ స్థలం లోకి తీసుకువెళ్ళారు. అక్కడంతా ఎండ పొడ లేకుండా మసకమసకగా ఉంది. ఆ ఇద్దరు గార్డులూ చికినీని రెండు రెక్కలూ లాగి పట్టుకున్నారు నాలుగడుగుల ఎత్తులో. వారితోపాటూ వచ్చిన మూడో గార్డు చికినీ మెడ పట్టుకొని పటుక్కున విరిచాడు. జీవితంలో ఎప్పుడూ కనీసం ఆనందంతో అయినా ఒక్కసారి క్లక్ క్లక్ అనని ఆ కోడిపెట్ట మెడ విరిగిపోతూండగా గొంతెత్తి ఒక్కసారి, ఒక్కసారంటే ఒక్కసారి, వికృతంగా బాధగా క్లక్‌క్లకాక్ అని పెద్దగా అరిచి చచ్చిపోయింది. కళ్ళముందే కూలిపోయిన కోళ్ళఫారం కలలాగే సాల్మన్రాజూ కూలిపోయాడు. అణచివేత యంత్రాంగం తనకోసం పనిచేసే వారిని అలాగే శిక్షిస్తుంది. ఫాక్టరీ పై అంతస్తులో, ఉద్యోగాలు ఊడిపోయినవారికోసం ధర్నా చేస్తున్న యూనియన్ వారికి తగిన సమాధానం చెప్పడానికి తయారవుతున్న యజమానికి చికినీ చావుకేక వినిపించింది. తీతువుపిట్ట కేకలా అది ఒక అపశకునంగా తోచి అతని ఒళ్ళు ఒక్కసారి జలదరించింది.
(Workshop Hen, 1954)