అసమర్థుని జీవయాత్రేనా?

(కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంత్యుత్సవాల సందర్భంగా సెప్టెంబరు 26-27, 2009న డి. టి. ఎల్. సి. వారు నిర్వహించిన సభలో గోపీచంద్ నవల “అసమర్థుని జీవయాత్ర” పై చేసిన ప్రసంగపు పాఠం).

ముందొక లెక్క – “1972లో రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. ఇది ముందు సంవత్సరం కంటే 5శాతం ఎక్కువ. 1972 నుంచి వరుసగా ప్రతీ సంవత్సరమూ రాష్ట్ర జనాభా 6.1 శాతము పెరిగినది. ఈ పెరుగుదలను గ్రాఫు సహాయముతో సూచించుము.”

అప్పుడే, అంటే ఎనిమిదో తరగతిలో గ్రాఫ్ పేపర్లపై ప్లాట్స్ గీయడం నేర్పించేటప్పుడే అనుకుంటా, మా లెక్కల మాస్టారు ఓ కథ చెప్పాడు. మాకంటే రెండేళ్ళ ముందు ఒకడుండేవాట్ట ఆయన క్లాసులోనే, కాస్త వింత వ్యక్తి. ఇలా లెక్క ఇస్తే, లెక్క చేయకుండా, ఇచ్చిన లెక్కలో నిజమెంత అని ఆలోచించి పరీక్షల్లో కూడా వాడి ఆలోచనలే రాసేవాట్ట. అంటే, పై లెక్క వాడికిస్తే, 1972 లో నిజంగానే మన రాష్ట్ర జనాభా 3.5 కోట్లు ఉందా? ఆ తర్వాత అది ప్రతీ ఏడాది 6.1 శాతమే పెరిగిందా? అంత ఖచ్చితంగా ఇన్నేళ్ళూ 6.1 శాతంతోనే ఎలా పెరుగుతుంది? ఇది నిజమేనా? అసలు వీళ్ళెలా లెక్క కట్టారు? ఇలాగా. కానీ, వాడన్ని విషయాల్లో ఇలానే ఉండేవాడు కాదు.

నా ఆలోచనలలాంటి వెర్రి తలలేయకపోయినా, నాకెప్పుడూ లెక్కలంటే భయం పోలేదు. నిజానికి ఒక లెక్క చూడగానే నాకు మెదడు పనిచేసేది కాదు. ఎలా చేయాలో ఏం చేయాలో తెలిసేది కాదు. ఏ లెక్కకా లెక్క ఎవరైనా వివరించి చెపితే ఎలా చేయచ్చో తెలిసేది, కానీ ఆ తర్వాత లెక్కకు మళ్ళీ మొదటికొచ్చేది. అలా ఒకరకమైన న్యూనత నాకు తెలీకుండానే నాలోకి ఇంకిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్కుంటే, లెక్కల విషయానికొస్తే మా ఇద్దరిలో నేనే నిజమైన అసమర్థుణ్ణని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే, లెక్క ఎందుకు ఉంది, దాని ఉద్దేశమేమిటి, అది ఎందుకు చేయాలి, చేస్తే ఏమౌతుంది – ఇలా నేను చేస్తున్న పనికి సంబంధించిన లౌకిక స్పృహ నాకుంది. అప్పటికీ నేను చేయలేకపోయాను, దాన్ని సాధించలేకపోయాను. ఇదీ అసమర్థత అంటే.

కానీ వాడున్నాడు, వాడికి ఈ విషయంలో లౌకిక జ్ఞానం లేదు. వాడి ఆలోచన, వాడి మనస్థితీ ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కుని పోయాయి. వాడికి తను చేస్తున్న పనికి సమాజంలో ఉన్న విలువ తెలీదు. వాడి ఆలోచనల్లో నిజమూ విలువా లేకపోలే. కానీ అవి మన ప్రపంచపు పరిధిలోనివి కావు. వాడి ప్రపంచం మన ప్రపంచంలా పనిచేయట్లేదు. అందువల్ల మనం వాణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు గానీ అసమర్థుడనలేం. అంటే, ఒకణ్ణి మనం అసమర్థుడు అని అనాలంటే వాడికి రెండు కనీస లక్షణాలుండాలి – 1. మన లౌకిక ప్రపంచ పరిధిలో వాడి ఆలోచన, ప్రవర్తన ఉండటం, 2. ఈ పరిధిలోనే, అందుకోదగిన విలువలుగా నిర్వచించబడిన వేటినీ వాడు అందుకోలేకపోవడం.

అందువల్ల అసమర్థుడు అంటే బైట ప్రపంచంలో బతకలేనివాడు అని మనం అనుకుందాం. కానీ ఈ నిర్వచనాన్ని, ఇదేరకమైన నియమాన్ని మనం ఒక పిచ్చివాడికి, ఒక ఉన్మాదికి, ఒక మానసికంగా ఎదగని రోగికి అన్వయించలేమని గమనించండి. ఎందుకంటే, వాడు మన లౌకిక పరిధిలో లేడు. వాడికి డబ్బు సంపాదించటం, ఉద్యోగం, పరువు, పరపతీ, అధికారం లాంటి మనం అందుకోదగినవిగా నిర్వచించుకున్న వేటి విలువా వాడికి తెలీదు. వాడికా సమర్థత లేదు. అయినా సరే వాణ్ణి మనం అసమర్థుడు అనం, గమనించారా? మీరూ మీ స్నేహితుడూ ఒకే పరీక్ష రాసి మీలో ఒకరు తప్పితే అసమర్థుడంటారనుకుందాం. అంటే మిమ్మల్ని మీలాంటి ఇంకో మనిషితోనే పోల్చి చూస్తున్నాం, మీ ఇద్దరూ కూడా లౌకిక ప్రపంచపు విలువలు తెలిసినవారు కాబట్టీ. మిమ్మల్నో పసికందుతోనో పిచ్చివాడితోనో పోల్చి వీళ్ళిద్దరిలో ఒకడు అసమర్థుడు అని అనం. ఎందుకంటే, ఇద్దరి లౌకిక పరిథులు ఒకటే కావు కాబట్టీ.

అసమర్థతని ఆపాదించేముందు, మనం ఆపాదిస్తున్న వ్యక్తి మన లౌకిక ప్రపంచపు స్పృహలో భాగమై ఉండాలి. ఇది ముఖ్యంగా గమనించండి.


మనం మాట్లాడుకుంటున్నది గోళ్ళు కొరికిస్తూ చదివించే అపరాధ పరిశోధన గురించి కాదు కాబట్టీ ముందే చెప్పేస్తాను. సీతారామారావులో అసమర్థత కంటే ఉన్మాదం పాళ్ళు ఎక్కువనీ, సీతారామారావుని అసమర్థుడిగా మొదలుపెట్టబోయినా ఆ తర్వాత గోపీచంద్ విఫలమైనాడనీ, అది ఆ రచయితకూ తెలుసనీ, కానీ అతనేమీ చేయలేదనీ నా అభియోగం. ఇంకో రకంగా చెప్పాలంటే రచయితకి సీతారామారావుని ఒక ఉన్మాదిని చేయకుండా తను చెప్పదల్చుకున్నది చెప్పలేకపోడంతో సీతారామారావుని అసమర్థుడిగా మిగలనీయకుండా తనకు అనుగుణంగా వాడుకున్నాడని నా ఆరోపణ.

సీతారామారావు కేవలం అసమర్థుడు కాడు అని అనటానికి కారణాన్ని కూడా నేను సాహిత్యంలోంచే వెతుక్కున్నాను. అసమర్థుడు అనగానే మనకు ముందు గుర్తొచ్చేది సుబ్బయ్య. వీడో అల్పజీవే అయినా రావి శాస్త్రి పుణ్యమా అని చిరంజీవి అయినాడు. తిలక్ రాసిన గొంగళి పురుగులు కవిత అసమర్థుని లక్షణాల మానిఫెస్టో! కొన్ని లక్షణాలు చూడండి.

బల్లపరపుగా పరచుకున్న జీవితం మీద భార్యామణి నడిచొచ్చి పంచదార లేదు, పాల డబ్బాల్లేవు అంటే, రోజూ పాడే పాత పాటకి రోజూ ఏడ్చే పాత చావుకి విలువలేక, విని కూడా కదలకుండా, సగం సగం తిన్న కలల్ని నెమరేస్తూ నిద్రపోతుంది గొంగళి పురుగు.

రోజూ ఆవకాయ తిన్నట్లు రొటీన్ అలవాటైన బల్లపరుపు జీవితం కింద కాషస్ గా దాచిన కోర్కెల సీక్రెట్ బాక్స్ లోంచి తీసి ఉద్రేకాన్నీ, సెక్స్ నీ, శృంగారాన్నీ క్రైం నీ, షాక్ నీ, లాటరీ కాగితాల్నీ చాటుకుండా చూసుకుని నవ్వుకుని మీసం మెలేసుకుని జెంటిల్మెన్ లా పడుకుంటుంది గొంగళి పురుగు.

బస్టాప్ దగ్గర పరాయి ఆడది తనకేసి చూసిందనీ, కాంటీన్ ఇవతల నించుంటే మినపట్టు వాసన ఘాటుగా వేసిందని, పెళ్ళాం దగ్గర చెప్పాలని సరదా పడి “హయ్యో రామ! నీ బతుక్కి” అన్నట్టు మూతి విరిచే అర్థాంగి ఆకారం గుర్తొచ్చి ముడుచుకుపోయి గోడవతలకి తన్ను తానే గిరాటేసుకుటుంది గొంగళి పురుగు.

‘కోకొల్లలుగా బతికే ఈ అసమర్థపు గొంగళిపురుగులు’ ఎంత అసమర్థమైనవీ అంటే

విసుగెత్తి చివరికి గొంగళి పురుగు
బల్లపరుపుగా పరచుకున్న తన జీవితాన్ని పరుపుచుట్టలా చుట్టి
ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటుంటే
పెళ్ళాం మాట వినబడి, బాస్ కేక వినబడి
భయంతో గజగజా వణుకుతూ
తిరిగి జీవితాన్ని బల్లపరుపుగా పరచుకుని
దాని మీద నిద్రపోయింది గొంగళిపురుగు
సగం సగం తిన్న కలల్ని నెమరేస్తూ
సగం సగం చచ్చిన ప్రాణాలని జోకొడుతూ.

ఇదీ అసమర్థత అంటే. తనని కూడా తాను చంపుకోలేక, సగం చచ్చిన ప్రాణాల్ని జోకొడుతూ ఉండటం. అసమర్థుడికి ఉన్మాదిగా మారే సమర్థత కూడా ఉండదు, ఏ రకమైన స్ఫోటనా ఉండదు. పోనీ అసమర్థులు తమ చేతకానితనం వికటించి ఉన్మాదానికి లోనైనా అది తమలోకి తాము ముడుచుకుపోయే అంతః స్ఫోటన (implosion) తరహా అవుతుంది కానీ బైటి ప్రపంచంపై విరుచుకుపడే విస్ఫోటన (explosion) ఉండదు. ఎందుకంటే అసమర్థుడికి ఆ శక్తి లేదు కాబట్టీ.

స్థూలంగా నవలానుక్రమం ఇదీ – సీతారామారావుది ఉన్న కుటుంబం. తన కుటుంబం గొప్పతనం గురించి వినీ వినీ సీతారామారావుకి పడిన నమ్మకం డబ్బు కన్నా పేరు ముఖ్యం అని. అందుకోసమే అడిగిన వారికీ అడగని వారికీ డబ్బు దానం చేశాడు. వాళ్ళ మామ ఇవ్వాల్సిన నలభై వేలకు బదులుగా పదివేలు చేసే పొలం తీసుకుని చెల్లు చేశాడు. త్వరలోనే డబ్బంతా హరించుకుపోయింది. పెళ్ళి కూడా అయింది. మామ ఇచ్చిన ఉద్యోగం నచ్చక వదిలేశాడు. ఏ పనికీ ఏ సార్థకతా, పరమార్థమూ కనపడక ఏ పని చేయకుండా ఉన్నాడు. రామయ్య తాత సలహాలు వినలేదు. మిత్రులతో ఏవో వితండవాదాలు చేస్తూ కాలం గడిపేడు. రాను రాను అసహనం కోపం చిరాకు ఎక్కువైనై. భార్య మీద చేయి చేసుకున్నాడు. గమ్యం లేకుండా నడుచుకుంటూ పోతూ ఏదో సభలో పిచ్చి కేకలేశాడు. అందర్నీ భయపెట్టాడు. అలా పోతూ పోతూ రామయ్య తాతను కలిశాడు. ఆతర్వాత శ్మశానంలో తనను తానే హింసించుకొని చచ్చిపోయాడు. ఇదీ కథ.

మొదట్నించీ చూసుకుంటూ వద్దాం. మొదటగా మనకు తెలిసిన సీతారామారావుకి వంశమూ, గౌరవమూ, సమాజాల స్పృహ ఉన్నది. అతను ఆలోచిస్తున్న తీరు, అతని మనోభావాలూ మనకేమి కొత్తగానో, విపరీతంగానో అనిపించవు. మొట్ట మొదటి అనుమానం మనకొచ్చేది సీతారామారావు ఉద్యోగం పోయిన పద్ధతిలో. పద్దుపుస్తకంలో ఒక బొమ్మ గీస్తాడు. ఆ బొమ్మ కూడానూ చిన్న పిల్లలు గీసినట్టే ఉంటుంది. మేనేజరు తిడతాడు. సీతారామారావు వెకిలిగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ మా మామ, మా మామ, అని ఇకిలిస్తూ, మీసాలు.. పోలీసు మీసాలు అంటూ గెంతులు వేస్తాడు. ఈ సన్నివేశం అంతా ఒక్కసారి ఊహించుకోండి. వాడు గీసిన ఆ బొమ్మ చూడండి. ఇది నిజంగా ఒక అసమర్థుడు ప్రవర్తించే, ప్రవర్తించగలిగే తీరేనా? ఆలోచించండి. ఆ తర్వాత నా ఉద్యోగం మా మామ వల్లే పోయింది అని అంటుంటాడు కానీ అప్పటికి మామ మీదే కాక ప్రపంచం మీదే కోపం ఉంది అతనికి. మామ మీద ఒక అసమర్థుని కసి కంటే ఒక ఉన్మాదపు చాయ ఎక్కువగా కనిపిస్తుంది ఈ సన్నివేశంలో.

సీతారామారావుకి కుటుంబజీవితం రోతగా అనిపిస్తుంది. గర్భిణి స్త్రీల ప్రవర్తన అతనికి కంపరం కలిగిస్తుంది. ఆకర్షణీయంగా అలంకరించుకుని అందంగా ఉండే ఆడవాళ్ళంటే అతనికి మరీ కంపరం పుట్టేది. “ఏం చూసుకుని వీళ్ళకీ నిక్కు? మామూలు వాళ్ళలా వీళ్ళూ రోజూ కాలకృత్యాలు తీర్చుకునేవాళ్ళేగా” అనుకుంటాడు. ఊహించుకునే కొద్దీ, ఏడవడమూ, చీదుకోడము లాంటివి చేసే ఆడవాళ్ళు అందరినీ అసహ్యించుకుంటాడు.

శరీర ధర్మాలు ఉంటై. భౌతికమైంది కాబట్టీ పరిమితులు ఉంటై. పసికందుగా ఉన్నప్పుడు శౌచాశౌచాల స్పృహ ఉండదు. పెరిగే కొద్ది సిగ్గు, సమాజపు కట్టుబాట్లతో వాటిని బహిరంగంగా చేయరు. అప్పటికీ, ఇవి పిల్లలకు నవ్వు పుట్టిస్తాయి. యుక్తవయసు దాటి పెరిగే కొద్దీ, ఆ నవ్వులు మాయమైతై. శరీరపు పరిమితులనీ అవసరాలనీ అర్థం చేసుకుంటారు. వాటికీ, మనోభావాలకీ లంకె పెట్టుకోరు. జలుబు చేసిందనో, డయేరియా వచ్చిందనో విడాకులు తీసుకోరు. రోగి పరిస్థితి మీద జాలి పడతారు. పైగా ప్రేమతో రోగికి సపర్యలు చేస్తారు. మనందరమూ మన భాగస్వాములతో ఉండట్లేదా? ఏదైనా రోగం వస్తే చూసుకోటల్లేదా?

పెరిగే కొద్దీ ఈ రకమైన మార్పు రావడానికి మనం ఎవరమూ మేధావులమూ తత్వవేత్తలమూ కానక్కరలేదు. మానవ శరీరమూ, ఈ సృష్టిలో దాని ఉనికీ గురించి విశ్లేషణాత్మక చింతనలూ చర్చలూ చేయనవసరం లేదు. ఒక మామూలు మనిషిగా పెరిగితే చాలు. పెద్దయినాక కూడా ఈ కనీస జ్ఞానం, అది కూడా సహజంగా అబ్బేది రాకపోతే, లేకపోతే మనకు అనుమానం రాదూ ఆ మనిషి మీద? ఆ మెదడు చిన్నప్పుడే పెరగడం మానేసిందని, వెర్రి బాగులదనీ అనిపించదూ? సాహిత్యం మొత్తం లోనో, నిజమైన సమాజంలోనో గాలించి ఒక్క ఉదాహరణ చూపించగలరా నాకు – ఇది అసమర్థతకి ఒక లక్షణమని?

ఇదేదో చిన్న విషయమని కొట్టేయకండి. ఈ ఆలోచనలూ మాకు వస్తై అనేయకండి. ఇలాంటి ఆలోచనలు సీతారామారావొక్కడికే కాదు. మనలోనూ చాలామందికి వచ్చినై, వస్తుంటై కూడా. కానీ అవి మన జీవితం మీద ప్రభావాన్ని చూపవు. అంటే ఆ ఆలోచనలని మనం అమల్లో పెట్టం, కానీ నా చిన్నప్పటి లెక్కల క్లాసు కుర్రాడలా కాదు. సీతారామారావు అలా కాదు. ఇలాంటి చిన్న విషయాలలోనూ, సీతారామారావు చేసే చింతనలో అక్కడక్కడా ముక్కల్లోనే అతని ఉన్మాదపు సూచికలు కనిపిస్తై. అంటే మనల్నీ సీతారామారావుల్నీ విడదీస్తున్నది మనకున్న లౌకిక స్పృహ అన్నదిందుకే. అందుకే ఈ ఉదాహరణ ఇవ్వాల్సి వచ్చింది.

అంతేకాదు, సీతారామారావు తన భార్యతో ప్రవర్తించే తీరు గమనించండి. తనకే తెలీని అర్థంకాని తన ప్రవర్తనని, ఒక వావీ వరసా లేకుండా సాగే ఆ ఆలోచనలను చూడండి. వాటిలో మనకేరకమైన అర్థమూ, పారదర్శకతా కనిపించదు. సీతారామారావు మిత్రులని, వారి వాదనా పటిమను, వారి ఆలోచనల లోతునూ బట్టి చూస్తే వారికి పెద్ద తెలివి లేదనీ, ఉత్త చవటలనీ తెలిసిపోతుంది. భూమి గుండ్రంగా ఉండడం వల్లనే వాడి రచనలు తిరిగొస్తున్నాయని అనుకుంటుంటాడు వాళ్ళలో ఒకడు. సీతారామారావు ఆలోచనలన్నీ ఒకచోట మొదలై వెర్రి తలలు వేసి ఎటో పోతుంటై. సామ్యవాదం నుంచి, ఆధ్యాత్మిక వాదం లోంచి, ఇంకెటో వెళ్ళిపోతుంటై. అవి తను ఒక పూర్తి అవగాహనతో తర్క సహితంగా చేస్తున్నట్టుగా ఉండవు. కేవలం పదాలనూ, నిర్వచనాలనూ వేసి గిలక్కొట్టి ఒంపిన డబ్బాలా ఉంటుంది అతని ఆలోచనల ధోరణి. జీవచైతన్యమూ జడత్వమూ గురించి చర్చలో కారు, అంటే ఒక యంత్రాన్ని ఉదహరించడం, ఇలా. ఆ డబ్బా లాగానే, ఇతని మెదడుకి కూడా జ్ఞాన మీమాంసలో ఉండాల్సిన లౌకిక స్పృహ ఉండదు.

సీతారామారావుకు వచ్చే కలలు చూడండి. అతను గీసే బొమ్మలు చూడండి. అతను రాసే కవితలు చదవండి. అవి ఎలాంటివో సీతారామారావు వయసూ, పరిస్థితుల నేపథ్యంలో పరిశీలించండి. ఇంత చెప్పనవసరం లేకుండానే మీకే తెలిసిపోతుంది – సీతారామారావు కేవలం అసమర్థుడు కాదనీ, ఒక మానసిక రుగ్మత ఉన్నవాడనీ, నవల సాగేకొద్దీ అతనికి కావలసింది వైద్య చికిత్స అనీ, తత్వ బోధన కాదనీ. నవల చదువుతూ పోయే కొద్దీ సీతారామారావులో పెరిగిపోతున్న ఉన్మాద లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిజానికి అతని అసమర్థత (అంటే అతనిలో లౌకిక స్పృహతో ఉన్న భాగం) సీతారామారావు కూతురుని దండించినప్పుడూ, భార్యతో భోజనం దగ్గర తగాదా పెట్టుకున్నప్పుడూ, ఇలా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నా, సీతారామారావు కేవలం అసమర్థుడు అనుకోడానికి కారణాలు దొరకవు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మానసిక రుగ్మత అతని అసమర్థతకు పర్యవసానంగా కనిపించదు, అదీ వచ్చిన పెద్ద చిక్కు.

ఈ విషయం రచయితకి తెలుసనీ, అయినా ఆయనేమీ చెయలేకపోయినాడనీ ముందు అన్నాను. రచయిత ఎవరో కాదు, రామయ్య తాతే. ఎలా అంటారా? మరి పుస్తకంలో చెప్పబూనిన తన తాత్విక దృక్పథాన్ని రచయిత మనకెలా చెప్పగలిగాడు? ఒక పాత్రతో సుదీర్ఘ ఉపన్యాసం ఇప్పించడం ద్వారానే కదా. ఈ రకమైన ఉదాహరణలు – రచయితలు ఒక పాత్రలా జొరబడి మనకు ఒక సందేశాన్నివ్వడం – సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తాయి.

నవల ప్రారంభంలో రచయిత కొంచెం ఆలోచన చెప్పబోతాడు సీతారామారావుకి. పశ్చాత్తాప పడే పనులేమీ చేయ్యద్దని సలహా ఇస్తాడు. కానీ, సీతారామారావులో అప్పటికీ ఉన్మాదపు లక్షణాలు ప్రస్ఫుటంగా లేవు. అందువల్ల రామయ్య తాత వాటిని గుర్తించలేదు. క్రమేణా, సీతారామారావు పిచ్చి ముదిరి ఆ లక్షణాలని ప్రదర్శిస్తూ వెర్రి ప్రేలాపనలు చేస్తుంటే ఈ రామయ్య తాత కూడా, ఈ రచయిత కూడా వాణ్ణి నువ్వో పిచ్చివాడివి అని అనేస్తాడు. ఇది రచయితకు క్రమేణా ఏర్పడిన అవసరంతో వచ్చిన సందిగ్ధత. సీతారామారావుని తన అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ పోవడంలో వచ్చింది. ఇది గుర్తించలేక పోవడం వల్లనే రచయిత సీతారామారావుతో చేయించే ఆలోచనల్లో ఒక పద్ధతి లేని తనం కనిపిస్తుంది, పిచ్చి పిచ్చిగా సాగే ఆలోచనల్లో ఉన్నట్టుండి ఒక బరువైన ఆలోచన, ఒక లోతైన తాత్విక ఛాయ కనిపిస్తుంది. లోతైన తాత్విక స్రవంతిలో వెర్రి పోకడలు కనిపిస్తై. కానీ ఇలా కనిపించి మాయమయే స్వచ్ఛత వల్ల ఆలోచనా స్రవంతి మొత్తమూ అర్థవంతం కాదు, కాలేదు. అందువల్ల రచయిత ఉన్మాదాన్ని తన పని తాను చేసుకొని పోనిస్తాడు. అది సీతారామారావుని కబళించి వేస్తూ ఉంటుంది. సీతారామారావు చివరికీ ఆ పిచ్చి లోనే తనను తాను హింసించుకుని శ్మశానంలో హీనంగా చచ్చిపోతాడు, ఆ ఉన్మాదం వికటించి విస్ఫోటించి పూర్తిగా చెయిజారిపోయిన స్థితిలో.


మద్దిపాటి కృష్ణారావు నన్నీ నవల గురించి మాట్లాడమని అన్నప్పుడు ఆయన మాట కాదనలేక ఒప్పుకుని ఈ పనికి పూనుకున్నాను, నవల గురించి దగ్గిర స్నేహితులతోనూ చర్చించాను. మద్దిపాటి కృష్ణారావు నవల నేపథ్యం గురించి నాకు చెప్పారు. 1920-60 ప్రాంతాలలో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల కమ్మ కులస్తుల్లో వచ్చిన – లోకజ్ఞానంతో సమన్వయం లేని ఆదర్శాలూ, కొత్తగా వచ్చిన భేషజాలు, బ్రాహ్మినైజేషన్ ఆఫ్ కమ్మా కేస్ట్ లాంటివి – మార్పులను సీతారామారావు తాత తండ్రుల ప్రవర్తన ఎలా పట్టుకోగలిగిందో కూడా చెప్పారు. ఈ మార్పులు నిజానికి నవల మొదట్లోనూ తర్వాత సీతారామారావుకి మేనమామ రాసిన ఉత్తరంలో మనకు కనిపిస్తాయి. కానీ అక్కడ కూడా, సీతారామారావు నాన్న అహంకారమూ, వ్యక్తిత్వపు విలనీ గురించిన చర్చే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ నవల ఉద్దేశం ఒక కులంలో జరిగిన సామాజిక మార్పులని నమోదు చేయడం కాదని అనిపిస్తుంది. ఈ సామాజిక నేపథ్యం నవల ముఖ్య ఉద్దేశానికి సమాంతరంగా నడుస్తుందే తప్ప దానితో మమేకం కాలేక పోయింది. అటు తాత్విక చింతనకీ, ఇటు సామాజిక సందేశానికీ చెందక రెంటికీ చెడినట్టనిపిస్తుంది. ఇదిగో ఈ ప్రమాదం వల్లనే రచయిత రామయ్య తాత రూపంలో ఒక పెద్ద ఉపన్యాసం చివర్లో ఇవ్వాల్సి వచ్చింది. నిజంగా ఇది అప్పటి సమాజంలో ఒక కులంలో వస్తున్న మార్పులను విశ్లేషించి ఎత్తిచూపే ఉద్దేశం ఉన్న నవలే అయివుంటే దానికింత తాత్వికత జోడింపు అవసరం లేదు. నిజానికి ఆ నవలా నేపథ్యానికీ, నవలలో ఉన్న తాత్వికతకీ పొసగలేదు. ఇదీ చిక్కు.

ఈ ప్రసంగం తయారు చేసుకుంటూ ఉండగా వచ్చిన అనుమానం ఇదే. ఒక అసమర్థుని జీవయాత్రను వివరించడానికి రచయిత తాత్విక చింతనా పద్ధతిని ఎంచుకోలేదని. తన తాత్విక చింతనను వివరించడానికి సీతారామారావుని తయారు చేసుకుని వాడుకున్నాడనీ అనిపించింది. అందువల్లనే, సీతారామారావు అసమర్థుడిగా మిగిలిపోక ఒక ఉన్మాదపు స్థితికి జార్చివేయబడ్డాడు. పైన చెప్పిన ఉద్యోగం పోయిన సన్నివేశం, సీతారామారావుకి స్త్రీల విషయంలో రోత, ఇవన్నీ కూడా ఎందుకు ఆపాదించబడ్డాయి? రామయ్య తాత చివర్లో ఉపదేశం ఇవ్వటానికి వీలుగా. అందువల్లనే సీతారామారావు జీవితం కేవలం అతని అసమర్థతకు పర్యవసానం కాదు అని నేను అంటున్నది. అలా కాకపోయి ఉంటే అతని పాత్రలో ఒకదానికికొకటి సంబంధం లేని అన్ని రకాల తాత్విక సంశయాలను గుప్పించే వెసులుబాటు రచయితకి దొరికేది కాదు. రచయితకీ తెలిసి తెలిసీ సీతారామారావుని ఒక పావుగా వాడుకున్నాడని ముందర ఆరోపించింది ఇందుకే.

అందుకేనేమో, షుమారు ఇరవై అయిదేళ్ళ తర్వాత ఈ నవల మళ్ళీ చదువుతూ చివరిలో రామయ్య తాత ఉపన్యాసం మొదలు పెట్టేటప్పటికి పుస్తకాన్ని ఇక చదవలేకపోయాను, ఎందుకంటే రామయ్య తాత మాటలు, రచయిత చెప్పుకుంటున్న మాటలు. అవి సీతారామారావుకి పనికొచ్చేవి కావు. నవలలో అప్పటిదాకా జరిగిన జీవితాలకీ సంబంధించినవీ కావు. మనకి అవసరమైనవీ కావు.