పట్నాలు – ప్రేమలు
అప్పుడప్పుడూ మా ఊరి పక్కగుండా ఒక రైలు పోతుంటుంది. ఆ రైలులో నేనుంటాను. నాకు ఇష్టం లేదు మా ముతక పల్లెటూళ్ళో ఉండడం. కొండచరియకేసి కొట్టుకొనే సముద్రం తప్ప మాకేముంది ఇక్కడ. అప్పుడప్పుడూ రోడ్డువారగా ఆగి, కొబ్బరి బోండాలు తాగి వెళ్ళిపోతుండే కార్ల లైసన్స్ ప్లేట్లు చూడ్డం, అవి ఏ రాష్ట్రానివో అని వాదించుకోవడం తప్ప. నేను పోతున్నాను. పల్లెటూరూ టాటా!
మా ఊరికి ఆవల, ప్రపంచంలో పట్నాలున్నాయి, కొన్ని సముద్రం ఒడ్డునుంటాయి. కొన్ని కొండల మీదుంటాయి. కొన్ని కొండల మీద సముద్రం పక్కనే ఉంటాయి. మరికొన్ని లోయల్లో ఉంటాయి. వచ్చీపోయే రైలు పట్టాల చుట్టూ పరచుకొని ఉంటాయి. ఆ రైళ్ళు ఎక్కడినుంచి వస్తాయో నాకు తెలీదు, ఉస్సుబుస్సుమనుకుంటూ కొండల్లోంచి కోనల్లోంచి ప్రయాణాలు చేసీ చేసీ. అలాంటి పట్నాల్లో నేను అప్పుడప్పుడూ ఎక్కడో ఒకచోట దిగిపోతుంటాను. ఎప్పుడు ఎక్కడ దిగినా ఆ పట్నానికి అదే మొదటిసారి వచ్చినవాడిలా ఉంటాను, దుమ్ము కొట్టుకుని ఎర్రబడి మంట పుడుతున్న కళ్ళతో.
రాత్రిపూట ఆ ఊళ్ళో మంచం మీద పడుకుంటాను, లైట్ ఆర్పేసి చీకట్లో, మెట్రో రైలు చప్పుళ్ళు వింటూ. అవి నాకు మా పల్లెటూరిని గుర్తు చేస్తాయి, అదెక్కడ ఉందో అంత దూరంలో. అసలు ఒకదానికొకటి ఇంత దూరంగా ఈ పట్నం, నా పల్లెటూరు ఒకేసారి ఈ ప్రపంచంలో ఉన్నాయని అనుకోవడానికి కూడా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడో తెలియనప్పుడు నేను నిద్రలోకి జారుకుంటాను.
పొద్దున్నే కిటికీలోంచి చూస్తాను. బైట ఊరు ఎంత ఉంటుందో తిరగడానికి, కొత్తగా పరిచయం చేసుకోవడానికి. కొన్ని పట్నాల్లో రోడ్లు నేరుగా బారుగా ఉండి, పొడూగ్గా ఎక్కడికో పోతుంటాయి. వాటి పక్కన చూడటానికి ఇళ్ళు కనపడవు. అవి లోపలెక్కడో ఉంటాయి. కొన్ని పట్నాల్లో రోడ్లు ఎత్తులు పల్లాలుగా మెలికలు తిరిగివుంటాయి, కొండల్లో తిరిగిపోతూ. ఆ కొండల మీద పేర్చినట్టు, రోడ్ల పక్కనే వరుసగా ఎర్రపెంకుల ఇళ్ళు కనిపిస్తుంటాయి. కొన్ని పట్నాల్లో అన్నీ ఉంటాయి. కొండలు, మిట్టలు, నదులు, ఇళ్ళు, పొద్దున్నే కప్పుకునే పొగమంచు, రాత్రిపూట వేసే చలి, అన్నీ. ఏ ఊరికావూరే వేరేగా ఉంటుంది. ఆ దుకాణాలు, ఆ మనుషులు, ఆ మాటలు, ఆ రంగులు – ప్రతీ పట్నం దానికదే, అది ఇంకో వేరే ఏ పట్నంలానూ కాదు. ఇంకా ఇలాంటి పట్నాలు ఎన్నో ఉన్నాయి. నేను ఒకరోజు ఎప్పుడో వాటిల్లో రైలు దిగుతాను. ఎప్పుడు ఎక్కడ దిగినా ఆ పట్నానికి అదే మొదటిసారి వచ్చినవాడిలా ఉంటాను, దుమ్ము కొట్టుకుని ఎర్రబడి మంట పుడుతున్న కళ్ళతో.
కాని, నేను ఏ పట్నానికి వెళ్ళినా నాకు అద్దెకు దొరికే గది అచ్చు ఒకేలా ఉంటుంది. అదే గది అదే కిటికీ. నేను రాబోతున్నానని తెలియగానే, ఆ ముందు పట్నంలో నేనున్న ఇంటిగలవారినుంచి ఆ మంచం, ఆ పరుపు, ఆ బీరువా ఈ కొత్త ఇంటిగలవాళ్ళు తెప్పించి పెడతారేమో. బాత్రూము సింక్ దగ్గర నా టూత్‌బ్రష్, నా రేజర్ కూడా నేను పెట్టినట్టుండవు. నేను రాకముందునుంచే అవి అక్కడ ఉన్నట్టు ఉంటాయి. అవి నావి అనిపించవు. ఏ ఊరికెళ్ళినా అచ్చు ఒకేలా ఉండే ఈ గదుల్లో నేను పదేళ్ళుండనీ, ఇరవై ఏళ్ళుండనీ, అది నాది అని ఇసుమంత కూడా అనుకోకుండా ఉండగలను. ఆ గదిలో నేనున్నానన్న జాడ ఒక్కటి కూడా మిగల్చకుండా ఉండగలను. అందుకే నా సూట్‌కేసు ఎప్పుడూ సర్దే ఉంటుంది, వేరే ఇంకో పట్నానికి నేను చేయబోయే ప్రయాణం కోసం – ఈ దేశంలో ఏ పట్నమూ సరైన పట్నం కాదు, ఎక్కడా సరైన ఉద్యోగం దొరకదు, ఒకవేళ దొరికినా ఉండడానికి సరైనది కాదు. ఎప్పుడూ ఎక్కడో ఇంకో పట్నం ఉంటుంది దీనికన్నా మెరుగైనది, నేను పోయి సరైన ఉద్యోగం వెతుక్కుని ఉండగలిగింది. అందుకే అద్దె గదిలోకి రాగానే అక్కడ ఎప్పుడూ ఒకేలా ఉండే బీరువాలో నా బట్టలు ఎప్పుడూ ఒకేలా సర్దుతాను, దొంతరలు అలానే తీసి చటుక్కున సూట్‌కేస్‌లో మళ్ళీ వెంటనే పెట్టగలిగేలా.
అలా కొన్ని రోజులు, వారాలు గడుస్తాయి. అలా తిరుగుతున్న నాకెవరో ఒకమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అమ్మాయి నాకు ప్రతీ పట్నంలో ఎప్పుడూ పరిచయం అయే అమ్మాయే అనిపిస్తుంది. ఈ పట్నంలో పరిచయమయిన ఈ అమ్మాయికి, ఆ పట్నంలో పరిచయమయిన ఆ అమ్మాయికీ నాకు తేడా ఏమీ కనిపించదు. వాళ్ళు పరిచయం అవుతున్నప్పుడు వారితో మాట్లాడే పద్దతి ఒకటి ఉంటుంది, పూజావిధానం లాగా ఒకే పద్ధతిలో చేసేది. ఆపైన ఆ అమ్మాయితో చాలా సేపు గడపాల్సి వస్తుంది, చాలా పనులు చేయాల్సి వస్తుంది, ఎందుకు, ఎలా, ఏమిటీ అని ఇద్దరికీ ఒకరికొకరు అర్థం కావడానికి. ఆ తర్వాత ఆ అమ్మాయి కొత్తగా అనిపిస్తుంది, ఆమెలో ఏదో కొత్తగా కనిపిస్తుంది, మొదటి సారి ముద్దు పెట్టుకున్నాక, మొదటి సారి కౌగిలించుకున్నాక, కలిసి పడుకున్నాక. ప్రేమ ఋతువు గడిచినంత కాలం అలా సాగుతుంది. ఆ తర్వాత ఇంకొంత కాలం గడిచాక ఈ అమ్మాయి కూడా నాకు పరిచయమైన అందరమ్మాయిల్లాంటిదే అని, నేనూ అంతేనని అనిపిస్తుంది. తను చేసే ప్రతీ పని, తన ప్రతీ మాట విసుగనిపిస్తుంది, అద్దాలమహల్లో ఎటు చూసినా కనిపించే అదే బొమ్మ లాగా. నేను పోతున్నాను. అమ్మాయీ టాటా!
మొదటిసారి ఆ అమ్మాయి నా గదికొచ్చినప్పుడు, ఆ అమ్మాయి పేరు మిత్రవింద అనుకుందాం మాటవరసకు, ఆ మధ్యాహ్నం నేను ఏమీ చేస్తుండను. గదిలో ఖాళీగా గడుపుతుంటాను. ఏదో పుస్తకం చదువుతుంటాను. ఉన్నట్టుండి నాకు తెలుస్తుంది గత ఇరవై పేజీలుగా నేను చదవటం లేదని, అక్షరాలను బొమ్మలని చూసినట్టు చూస్తున్నానని. ఏదో కాగితం మీద గీస్తాను, పిచ్చిగీతలు, అవి మెల్లిగా ఒక ఏనుగు బొమ్మలా అవుతాయి. నేను దాన్ని పెన్సిల్‌తో దిద్దుతాను. దానికి పెద్ద పెద్ద దంతాలొస్తాయి. దానికి తల మీద, ఒంటిమీద జూలు వస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏనుగుకు పదిరెట్లుండే ఏనుగు లాంటి ఇంకో జంతువు, మామత్, అవుతుంది. కాని దీన్నేమనాలో నాకు తెలీదు. దీన్ని మహాయేనుగు అంటాను. ఇంతలోనే నాకు దానిమీద కోపం వస్తుంది. చించేస్తాను. ఎప్పుడూ మహాయేనుగేనా? మహాయేనుగూ, టాటా!
నేను మహాయేనుగును చించేస్తున్నప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. మిత్రవింద. పరుగెత్తుకుంటూ వెళ్ళి ముందు తలుపు తీస్తాను, మా ఇల్లుగలావిడ చువ్వల కిటికీ తలుపు కొద్ద్దిగా తెరిచి, ‘ఎవరూ? ఏం కావాలీ?’ అని పెద్దగా అరవకముందే. ఆ అరుపులకు మిత్రవింద భయపడి తిరిగి వెళ్ళిపోకముందే.
ఒకరోజు మా ఇల్లుగలావిడ చచ్చిపోతుంది. తనను దొంగలు పీక పిసికి చంపుతారు. అలా ఇక్కడ రాసిపెట్టబడివుంది. దానిని ఎవరూ మార్చలేరు. ఆవిడ, ఎవరైనా కాలింగ్‌బెల్ మోగిస్తే, తలుపు తీయకుండా, ఎవరూ? అని పెద్దగా అరిచి తనను తాను కాపాడుకున్నాననుకుంటుంది. కాని, ఆ జాగ్రత్తలేవీ పనిచేయవు. ప్రింటరు ఇప్పటికే వార్త కంపోజ్ చేసి పెట్టుకున్నాడు, టైటిల్‌తో సహా – ‘గుర్తు తెలియని దొంగల చేతిలో పీకపిసికి చంపబడ్డ ఇంటి యజమానురాలు’ – కన్ఫర్మేషన్ రాగానే వార్తను పేజీ లోకి ఎక్కించడానికి.
మిత్రవింద తలుపుకవతల. జుట్టు గాలికి చెదరకుండా చున్నీ తలచుట్టూ కప్పుకొని, గుండెలాగా ఉండే గుండ్రటి నోటితో. తలుపు తీసి లోపలికి వచ్చేంతలోనే తన దగ్గర ఒక ఉపన్యాసం సిద్ధంగా ఉంటుంది. తనేం చెప్తుందన్నది ముఖ్యం కాదు. ఆపకుండా మేమేదో ఒకటి మాట్లాడుకోవడం ముఖ్యం. ఇల్లుగలావిడ చూడకముందే వరండా పక్కనున్న మెట్లమీంచి తనను నా గదిలోకి తీసుకొస్తాను. తన ఉపన్యాసం మధ్యలోనే అయిపోయేంత చిన్నది కాకూడదు, మా ఇద్దరి దగ్గర మాటలేవీ లేకపోతే, నా గది మాటలందించదు. అది పాతగది, ఒక మంచం ఒక బీరువా తప్ప ఇంకేమీ లేని గది, ఏం కబుర్లు అందిస్తుంది?
“మిత్రవిందా, ఇలా రా. ఈ కిటీకీలోంచి చూడు.”
అది నిజానికి కిటికీ కాదు. బాల్కనీ తలుపు. కాని తెరిస్తే బాల్కనీ ఉండదు. తలుపు గుమ్మానికి అడ్డంగా నడుమెత్తులో రెయిలింగ్ ఉంటుంది. ఇప్పుడెవరూ ఇలాంటివి కట్టరు. నిలువెత్తు కిటికీలు. ఫ్రెంచ్ బాల్కనీలు. ఈ పట్నంలోనే ఉంటాయి. అన్ని పట్నాల్లో ఉండవు. ఆ కిటికీ తలుపు అందుకోవాలంటే దాని గుమ్మానికి ముందున్న మూడు మెట్లు ఎక్కాలి. మాకు ఎన్నో మెట్లెక్కినట్టు అనిపిస్తుంది. బైట వరుసగా ఇంటికప్పులు. వాటిమీద వాటర్ టాంకులు, కుండీల్లో మొక్కలు. కొన్నిటిమీద నీలంరంగు రేకుల షెడ్లు. సగం కట్టి ఆపేసిన పారాపెట్ గోడల కిందనుంచి పొడుచుకొచ్చిన చువ్వలు. తన భుజం మీద నేను చేయి వేస్తాను. అది నా చేయని నాకు అనిపించదు. ఉబ్బిపోయినట్టు లావుగా కనిపిస్తుంది, మేమిద్దరం ఒక నీళ్ళకర్టెన్ లోనుంచి ఒకరినొకరం తాకుతున్నట్టు.
“చూసింది చాలా?”
“చాలు.”
“సరే. కిందకు దిగు ఇక.”
కిటికీ తలుపు మూసి కిందకు దిగుతాం. ఇప్పుడు మేము నీళ్ళల్లో మునిగివుంటాం. మాలో ఏదో తెలియని గగుర్పాటు. గదిలో మహాయేనుగు పచార్లు చేస్తుంటుంది. ఒక పురాతన మానవ ఉద్రేకం గదంతా.
“ఇంకా?”
నేను తన చున్నీ తీసి మంచం మీదకు విసిరేస్తాను.
“లేదు. నేను వెళ్ళాలి.”
తను అది తీసి మళ్ళీ కప్పుకుంటుంది. నేను మళ్ళీ దాన్ని లాగి పైకి ఎగరేస్తాను. తను అందుకోబోతుంది. నేను అందనివ్వను. గదంతా పరిగెడతాం. ప్రేమ. ఒకళ్ళనొకళ్ళం తోసుకుంటూ చేయి చాచి అందుకోవాలని ప్రయత్నిస్తూ. ప్రేమ. గీరుకుంటూ, గిచ్చుకుంటూ మునిపళ్ళతో కొరుక్కుంటూ. ప్రేమ. భుజాల మీద చిన్నగా గుద్దుతూ కూడా. ప్రేమ. నొప్పి అనేంతగా కౌగిలించుకుంటూ. ప్రేమ. ఒకరి లోతులు ఇంకొకరు తెలుసుకోవాలన్న ఆత్రంతో. ప్రేమ. అలసిపోయి, మంచానికడ్డంగా పడిపోయి రొప్పుతూ మరొక్కసారి ముద్దు పెట్టుకొని. ప్రేమ.
కాసేపయాక తను సిగరెట్ తాగుదామా అని అడుగుతుంది. మా వేళ్ళ మధ్య సిగరెట్లు పొడూగ్గా పెద్దవిగా అనిపిస్తాయి, నీళ్ళకింద వస్తువులల్లే. మేమెందుకు సంతోషంగా లేం?
“ఏమయిందీ?” మిత్రవింద అడుగుతుంది.
“మహాయేనుగు.” చెప్తాను నేను.
“ఏంటది?” మిత్రవింద అడుగుతుంది.
“ప్రతీక, ఎ సింబల్.” చెప్తాను నేను.
“దేనికి?” మిత్రవింద అడుగుతుంది.
“తెలీదు.” చెప్తాను నేను. “ఒక ప్రతీక.”
“విను. ఒకరోజు నేను ఒక నది ఒడ్డున ఒకమ్మాయితో కూర్చొనున్నాను.” చెప్తాను నేను.
“పేరు?”
“నది పేరు గోదావరి. ఆ అమ్మాయి కావేరి. ఎందుకు?”
“ఊఁహూఁ ఏమీ లేదు. నువ్వెవరితో ఉన్నావో తెలుసుకుందామని.”
“సరే. మేమలా కూర్చొనున్నాం, నది ఒడ్డున ఇసుకలో. అప్పటికే కొద్దిగా చీకటి పడుతోంది. నీళ్ళల్లో దూరంగా పడవ, నిలబడి తెడ్డు వేస్తున్న ఇద్దరు మనుషుల నీడలు. అటుపక్క ఒడ్డు మీద పట్నంలో వెలగడం మొదలుపెట్టిన లైట్లు. మేము ఇటుపక్క ఒడ్డు మీద ఉన్నాం. ప్రేమ అంటారే, దానిలో మునిగి. ఒకరినొకరు చూసుకుంటూ, తెలుసుకుంటూ, ఒకరి రుచి ఒకరికి వగరుగా, తెలుసుగా నీకు, ప్రేమలో. నా మనసంతా నిండిపోయిన విషాదం, ఒంటరితనం. ఆ సాయంత్రం నదుల ఒడ్డున నీడలు, కొత్త ప్రేమలలో ఉండే విషాదం, ఒంటరితనం. పాతప్రేమల నెమరువేత తెచ్చే విషాదం, ఒంటరితనం, పోగొట్టుకున్నతనం. రాబోయే ప్రేమలు తెచ్చే విషాదం, ఒంటరితనం, నిరాశ.”
“నాతో కూడా అలాగేనా?” మిత్రవింద అడుగుతుంది.
“నువ్వు చెప్పు. నీకేం తెలుసో?” నేను గొంతు పెంచి అరుస్తాను, కోపంతో. కొన్నిసార్లు మనమాటలు మనకే ప్రతిధ్వనిలా వినిపించి పిచ్చి పట్టిస్తాయి.
“నన్నేం చెప్పమంటావూ? ఇదంతా ఏంటో… మీ అబ్బాయిలు… నాకు తెలీదు.”
“అదంతే. అలాగే. అమ్మాయిలు ప్రేమ గురించి విన్నదంతా అబద్ధం. వాళ్ళకు రకరకాల కథలు చెప్పారు అందరూ. అన్నీ అబద్ధాలు. వాళ్ళ అనుభవాలూ అంతే. కాని, మీ అమ్మాయిలందరూ వాళ్ళు చెప్పే కథలనే నమ్ముతారు. మీ అనుభవాలను నమ్మరు. అందుకే మీ ఆలోచనలన్నీ అడ్డదిడ్డంగా ఉంటాయి.”
“నాకు, అంటే, మా అమ్మాయిలకు ఇష్టం…” చెప్తుంది మిత్రవింద. “అబ్బాయిలు. చిన్నప్పణ్ణుంచీ చదివింది, విన్నది, చిన్నపిల్లప్పటినుంచీ చెవిలో రోజూ చెప్పేది అదే. అదే ముఖ్యం అని. అందరం కోరుకోవాల్సింది అదే అని. దాన్ని మించింది లేదని. పెరిగాక ఏం అర్థమవుతుంది నీకూ అంటే ఆ అదే నీకు ఎప్పటికీ దొరకదని. నిజంగా ఆ అదే నువ్వు ఎప్పటికీ అందుకోలేవని. అది అన్నిటికంటే ముఖ్యం కాదు. దానికి మించినవి చాలా ఉన్నాయి. అసలు ఆ అది లేకుండా ఉంటే ఎంత బాగుండేది. అంతకంటే ముఖ్యంగా ఆ అది గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. కాని, ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటావు. ఏమో, నువ్వు ఒక తల్లివి అయితే అది ఏమిటో పూర్తిగా అర్థమవుతుందేమో. లేకుంటే వేశ్యవయితేనో.”
అదీ. బాగుంది. మనం అందరికీ మనందరికీ రహస్యంగా ఇచ్చుకునే వివరణలు, సంజాయిషీలూ ఉంటాయి. ఒక్కసారి ఎవరి వివరణ ఐనా నువ్వు వింటే ఇకవారు నీకు పరాయివారు కాలేరు. నేను, మిత్రవింద మంచం మీద రెండు పిల్లుల్లా ఒకళ్ళనొకళ్ళు కరుచుకొని పెనవేసుకొని పడుకుంటాం. లేకుంటే జలదేవతల్లా కరుచుకొని పెనవేసుకొని.
“చూడూ” చెప్తుంది మిత్రవింద. “నాకు నువ్వంటే భయమేమో. అది ఎలా దాచుకోవాలో నాకు తెలీదు. నా ఆకాశపు అంచులో వేరే ఏమీ లేదు, ఒక్క నువ్వు తప్ప. నువ్వే నా పులివి. నువ్వే నా గుహవి. అందుకే ఇప్పుడు నీచేతుల్లో ఇలా నిన్ను కౌగిలించుకొని పడుకున్నాను. నువ్వే నన్ను నువ్వంటే ఉన్న భయం నుంచి రక్షిస్తావని.”
భయం అయినా సరే, ఆడవాళ్ళకే అది సులభం. వాళ్ళలో జీవనది ప్రవహిస్తుంటుంది. వాళ్ళలో ప్రకృతి అంతు చిక్కకుండా ఉంటుంది. వారే సృష్టి స్థితి లయలు. ఒకానొకప్పుడు మాతృస్వామ్యం ఉండేది. మనుషుల కథలు, చెట్లూ పుట్టల కథల్లా హాయిగా ఉండేవి. ఆపైన సోమరి మగతేనెటీగలకు అహంకారం పెరిగింది. ఒక విప్లవం, ఒక యుద్ధం తరువాత మనకు నాగరికత వచ్చింది. జరిగింది అదేనని అనుకుంటాను కాని అలానే జరిగిందని నమ్మను.
“ఒకసారి ఒక అమ్మాయితో నేను కొనసాగలేనని అర్థం అయిపోయింది.” చెప్తాను నేను. “ఒక కొండ మీద, వాలుగా ఉన్న కాస్త పచ్చికలో, పసుపు పచ్చ పూల మధ్య. ఆ కొండ పేరు సింహాద్రి ఆ అమ్మాయి అద్రి. చుట్టూ పొదలు. పూలచుట్టూ గిరికీలు కొడుతూ గిజిగాడు పిట్టలు. చుట్టూ కీచురాళ్ళ రొద. చెవులు చిల్లులు పడేంతగా. తనకు నిజంగా అర్థం కాలేదు, నేను ఎందుకు ఉన్నట్టుండి లేచి నిలబడ్డానో, పద పోదాం, ఆఖరి పడవ ఇంకాసేపట్లో వెళ్ళిపోతుంది అని అన్నానో. అవును, అక్కడికి పడవలోనే పోవాలి. ఆ పడవ అటూ ఇటూ ఊగినప్పుడల్లా లోపలంతా ఏదో ఖాళీగా అయిపోతున్నట్లుంటుంది. తను చెప్పింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు అలా ఉంటుంది, అని. నాకు అమ్మయ్య అనిపించడం గుర్తుంది.”
“నువ్వు నాకు అలాంటివి చెప్పద్దు.” చెప్తుంది మిత్రవింద. “ఇక పులి ఉండదు, గుహ కూడా ఉండదు. ఒక్క భయం మాత్రమే ఉంటుంది. నా చుట్టూ కమ్ముకొని, దానితోనే మిగిలిపోతాను నేను.”
“చూడు మిత్రవిందా…” చెప్తాను నేను. “వస్తువులనూ ఆలోచనలనూ విడివిడిగా చూడాలి. వాటిని దూరంగా ఉంచాలి. మన తరానికున్న శాపం ఇదే. అనుకున్నది చేయలేకపోవటం. చేసినదేమిటో ఆలోచించలేకపోవటం. నీకో ఉదాహరణ చెప్తాను. చాలా ఏళ్ళ క్రితం (నా ఐడి కార్డ్ మీద నా వయసు తప్పుగా రాయించాను, నాకంత వయసు లేదు అప్పటికి) ఒక బ్రోతల్ హౌస్‌కు వెళ్ళాను, అక్కడుండే ఒక వేశ్య కోసం. ఆ ఇంటి అడ్రస్ 23-4/181, ప్రశాంత్ నగర్ కాలనీ. ఆ వేశ్య పేరు చామంతి.”
“ఏంటీ?”
“చామంతి. అప్పుడు సంఘం బూడిదరంగులో ఉండేది, ప్రభుత్వం కూడా. రంగుల పేర్లన్నీ వేశ్యల పేర్లలోనే ఉండేవి. చామంతి, గులాబి, రోజా, మల్లిక, సంపెంగ, ముద్దబంతి…”
“ముద్దబంతా?”
“అవును. ముద్దబంతేనని గుర్తు. నేను నిన్ను ఇప్పణ్ణుంచీ ముద్దబంతీ అని పిలవనా?”
“ఒద్దు.”
“సరే. మళ్ళీ కథలోకి పోదాం. ఆ కాలంలోకి. చామంతి కోసం వెళ్ళాను. నేను ఇంకా పిల్లగాణ్ణి. ఆమె ఎత్తుగా లావుగా ఉంది. ఆమె ఒంటి మీదంతా వెంట్రుకలున్నాయి. నేను భయంతో పారిపోయాను. ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాకే పారిపోయాను. మెట్లు దిగి పరిగెడుతుంటే, మిగతా అందరూ వాళ్ళ వాళ్ళ గదుల్లోంచి వచ్చి నన్ను చూసి పెద్దగా పగలబడి నవ్వుతున్నట్టనిపించింది. ఒక్కసారి ఇంటికి పోగానే, చామంతి కేవలం ఒక ఆలోచనగా మారిపోయింది. నాకు ఆమె అంటే భయం ఇంక లేకుండా పోయింది. ఆమె మీద కోరిక మళ్ళీ పుట్టింది. ఆపుకోలేనంతగా పెరిగిపోయింది. అదీ నేను చెప్తున్నది. నిజంగా ఎలా ఉండేది, అదే మన ఊహల్లో ఎలా ఉండేది – ఈ రెండూ వేరు వేరు.”
“అవును. నిజం.” చెప్తుంది మిత్రవింద. “నేనిప్పటికే అన్ని రకాలుగా ఆలోచించాను, జరగగలిగే ప్రతీ విషయం. నా ఊహల్లో నేను వందల వందల జీవితాలు గడిపాను. పెళ్ళి చేసుకున్నాను, గంపెడు సంతానాన్ని కన్నాను, కడుపు తీయించుకున్నాను, బాగా డబ్బున్న ఒకణ్ణి పెళ్ళి చేసుకున్నాను, కటిక బీదవాణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను, డబ్బున్న వాళ్ళకు హై సొసైటీ కాల్‌గర్ల్ అయ్యాను, మధ్యతరగతి వేశ్యనయ్యాను, బార్లలో డాన్సర్ అయ్యాను, కాన్వెంటులో నన్ అయ్యాను, బీచ్ దగ్గర పల్లీలు అమ్ముకొని బతికాను, సినిమా తారనయ్యాను, ఐటమ్ గర్ల్ అయ్యాను, రాజకీయాలలోకి దిగి పార్లమెంట్ మెంబర్నయ్యాను, అంబులెన్స్ డ్రైవర్, డాక్టర్, టీచర్, పెయింటర్, క్లాసికల్ డాన్సర్, టెనిస్ ప్లేయర్. వందల వందల జీవితాలు వాటి ప్రతీ చిన్న వివరంతో సహా, స్పష్టంగా. అన్ని జీవితాలూ చివరికి ఆనందంగానే ముగిశాయి. కానీ నిజంగా నా జీవితంలో అవేమీ జరగవు. ఎప్పటికీ జరగవని నాకు తెలుసు. అందుకే అలాంటి ఊహలు వచ్చినప్పుడల్లా నాకు చాలా భయం వేస్తుంది. వాటిని ఆపడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే, అది ఊహల్లోకి వస్తే నిజంగా ఎప్పటికీ రాదు ఇక.”
మంచి అమ్మాయి, మిత్రవింద. మంచి అమ్మాయి అంటే నా ఉద్దేశ్యం నేను చెప్పే సంగతులు కష్టమైనవి కూడా వెంటనే అర్థం చేసుకుని వాటిని సులభంగా మార్చేస్తుంది. ముద్దు పెట్టుకుందామనుకుంటాను. కాని, ఇప్పుడు నేను తనను ముద్దు పెట్టుకుంటే నాకు తనను కాక, మిత్రవింద అన్న ఒక ఊహను ముద్దుపెట్టుకుంటానని అనిపించింది. తను కూడా తనను ముద్దు పెట్టుకుంటున్నది నేను కాదని, నేను అన్న ఊహ అని అనిపిస్తుందనిపించింది. ఏమీ చేయలేదు. ఊరుకున్నాను.
“మన తరం మళ్ళీ తనకు కావలసినదాన్ని గెల్చుకోవాలి మిత్రవిందా.” చెప్తాను నేను. “ఆలోచన, కార్యాచరణ రెండూ ఒకే సమయంలో చేయాలి మనం. చేయగలగాలి. పూర్తిగా చివరిదాకా ఆలోచించకుండా పనులు చేయకూడదు. అనుకునేదానికి, జరిగేదానికి మధ్య తేడా ఉండకూడదు. ఉన్నది, అనుకున్నది రెండూ ఒకటే కావాలి. అప్పుడు మనం హాయిగా ఆనందంగా ఉంటాం.”
“ఇలా ఎందుకుంది, ఐంది?” తను అడుగుతుంది నన్ను.
“అంటే, అందరికీ ఇలానే ఉండదు.” చెప్తాను నేను తనకు. “నా చిన్నప్పుడు ఒక పెద్ద బంగళాలో ఉండేవాళ్ళం. ఆ బంగళా మొదటి అంతస్తు పొడుగునా వరండా ఉండేది. పిట్టగోడ నుంచి కప్పుకు వరుసగా స్తంభాలు ఉండేవి, పడుకుని చూస్తే అవి నీలాకాశంలోకి పోతున్నట్టుగా. ఆ స్తంభాల వెనుక దాక్కొని ఉండేవాణ్ణి నేను ఎప్పుడూ. రోజులు రోజులు గడిపేవాణ్ణి. చిన్నప్పుడు నేను చాలా ఒంటరిగా ఉండేవాణ్ణి కావడంతో నాకు ప్రతీదీ వింతగా ఒక ప్రతీకగా అనిపించేది. దేనికి ప్రతీక? తెలీదు. చెట్టు మీద వేలాడే పండ్ల గుత్త్తులు చూసేవాణ్ణి. అరటి గెలలు, కొబ్బరి గెలలు, తాటికాయలు వేపకాయలు ఈతపండ్ల గుత్తులు. పండుకూ పండుకూ మధ్య జాగా వింతగా అనిపించేది. జెముడు చెట్ల పట్టలు, వాటి మీద ముళ్ళూ వింతగా అనిపించేవి. బంగళా ముందు పరిచిన కంకరలో రాళ్ళమధ్య వంకర టింకరగా ఖాళీ ఏదో చెప్తున్నట్టుండేది. అప్పుడు పెద్దవాళ్ళుండేవారు, వయసొచ్చినవారు. వాళ్ళ పని నిజం పనులు చేయడం. నాకున్న పనల్లా కొత్త కొత్త ప్రతీకలు కనుక్కోవటం, దానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించడం. నా జీవితమంతా అలానే బతికాను నేను. అర్థాల కోటల్లో బతికాను, నిజం వస్తువులు, సంగతుల మధ్య కాదు. బతకడానికి కావలసిన అవసరాల కోసం నేను ఇప్పటికీ నిజం పనులు చేసే పెరిగిన పెద్దవారి మీద ఆధారపడతాను. కానీ కొందరుంటారు. చిన్నప్పణ్ణుంచీ లేత్ మీద పని చేసినవారు. వస్తువులు తయారు చేసే యంత్రం. దానికంటూ, అది తయారు చేసే వస్తువులు కాకుండా, వేరే అర్థం లేదు. నాకు అన్ని యంత్రాలూ మాయలఫకీరు గుహలా అనిపిస్తాయి. లోపల చిన్న చిన్న మనుషులుంటారు. వాళ్ళు దానిలో ఇరుసులు తిప్పుతూ చక్రాలను కదిలిస్తుంటారు. కాని లేత్ ఏమిటో ఎప్పుడూ నాకు అర్థం కాలేదు. దేవుడికే తెలియాలి అదేంటో. నీకు తెలుసా లేత్ మెషీన్ అంటే, మిత్రవిందా?”
“లేత్… ఊఁ, ఉఁహుఁ నాకు తెలీదు.” అంటుంది మిత్రవింద.
“అవి నిజంగా ముఖ్యమయినవి అయుండాలి. వాటితో ఎలా పనిచేయాలో, ఎలా తిప్పాలో అందరికీ నేర్పించాలి. తుపాకులు ఎలా పేల్చాలో నేర్పించకుండా. చూడు, తుపాకీ కూడా ఒక ప్రతీక, దానికి నిజంగా ఏ ఉపయోగమూ లేదు.”
“నాకు ఇష్టం లేదు లేత్ ఎలా తిప్పాలో నేర్చుకోవడం.” అంటుంది మిత్రవింద.
“లేత్ కాకుంటే నీకు వేరేవున్నాయి నేర్చుకోవడానికి. నువ్వు తప్పించుకొని పోవడానికి వీలుగా నీ ఊహలు కొన్నే ఉన్నాయి. నాకు ప్రతీదీ ఒక ప్రతీక. ప్రతీదీ ఒక అర్థం. కాని, ఒక్కటి మాత్రం నిజం. మనం మనకు కావల్సిన వస్తువులు తిరిగి సాధించుకోవాలి.”
నేను తన మెత్తని వీపు మీద సుతారంగా నా చేయి రుద్దుతాను.
“నేనూ ఒక వస్తువునేనా?” అడుగుతుంది మిత్రవింద.
“ఊఁ.” అంటాను నేను.
తన కళ్ళలోకి చూసి చూపు మర్లుతాను. తన ఎడమ భుజం మీద, చంకకు పైన ఒక చిన్న బుగ్గమీది సొట్ట లాంటిది కనిపిస్తుంది. దాన్ని తాకుతాను, మెత్తగా ఉంటుంది. దానిమీద నా నోరు పెట్టి మాట్లాడతాను. “భుజం లాంటి సొట్టబుగ్గా!” అంటాను. నేననేది సరిగా వినిపించక తనకు అర్థం కాదు.
“ఏంటీ?” అంటుంది తను. కాని, తనకు నా సమాధానం మీద ఆసక్తి ఉండదు.
“ఆకాశం లాంటి అవకాశం” అంటాను ఆ సొట్టకు నా నోరు ఆనించి. తనకు అర్థం కాదు. అయినా నవ్వుతుంది కిలకిలా. మంచి అమ్మాయి మిత్రవింద.
“సముద్రం లాంటి ఆహ్వానం” అంటాను. వెంటనే నా నోరు తీసేసి ఆ సొట్ట మీద నా చెవి పెడతాను. నా గొంతు ప్రతిధ్వని వినడానికి. కానీ వినపడదు. మిత్రవింద ఊపిరి వినిపిస్తుంది. దూరంగా తన గుండె చప్పుడు కూడా.
“హృదయం లాంటి ప్రయాణం” అంటాను నేను.
“అబ్బా! చక్కిలిగిలి.” నవ్వుతుంది మిత్రవింద,
“పట్నం లాంటి ప్రేమ.” అంటాను నేను.
అనగానే: మిత్రవింద నిజం మిత్రవింద, నా ఊహలో ఉన్న మిత్రవింద అనే రెండు వేరు వేరు కాదు; ఎదురుగా ఉన్న ఒకే ఒక్క మిత్రవింద అవుతుంది. ఏదో ఒక మిత్రవింద కాదు మాటవరసకు. ఈ మిత్రవింద ఇంకెవరూ కాదు. తనొక్కతే. ఇప్పుడు మేం చేస్తున్నది ఊహకు, నిజానికి తేడా లేనిది. కొంత వాస్తవం కొంత కల్పన కానిది. పట్నపు ఇంటికప్పులపైన తేలుతూ, సముద్రపు ఒడ్డునున్న మా ఇంటి ముందున్న సరుగుడు చెట్టులా ఊగిపోతూ, ఒక ఈదురుగాలి మా గదిని డాబాల మీదగా, వాటర్ టాంకులు, పూలకుండీలు, నీలిరంగు రేకుల మీదగా తీసికెళ్ళిపోతూ…
మా పల్లెటూరి దగ్గరున్న సముద్రం నన్ను గుర్తు పడుతుంది. నన్నో పెద్ద కుక్కపిల్లలా ఆహ్వానిస్తుంది, ఎగురుతూ. పెద్ద స్నేహితుడిలా తెల్ల తెల్లని చిట్టి చిట్టి చేతులు చాచి, చరియమీదకు దూకుతూ. వెంటనే కుక్కపిల్లలా వెల్లకిలా పడి తన తెల్లటి పొట్టను చూపిస్తుంది. కీచురాళ్ళు చప్పుడు చేయవు. లోతట్టు అంతా మునిగిపోతుంది. ఉన్నట్ట్టుండి ఒక రైతు పార పైకెత్తి పట్టుకొని అరుస్తాడు: సముద్రం మాయమయిపోయింది. సముద్రమూ టాటా!
నేనూ మిత్రవిందా చేయీ చేయీ పట్టుకొని, వీలయినంత వేగంగా బైటకు పరుగెత్తుతాం, గదిని దాటి మెట్లమీదనుంచి కిందకు, గుమ్మంలోంచి బైటకు, మా ఇల్ల్లుగలావిడ కిటికీలోంచి మాకళ్ళల్లోకి చూసి అంతా అర్థం చేసుకోకముందే.
(Love Far from Home, 1946)