కాల్వీనో కథల నుంచి – 5

ఒక నేరం కథ

ఇంకో నాలుగైదు గంటల్లో ఇన్స్యూరెన్స్ ఏజంటు సాయిరామారావు వస్తాడు రిజల్ట్ కోసం. విధవ వసుంధరాదేవి రహస్యాలు, కాలిపోయిన ఆవిడ ఇంటి వివరాలు, నేనింకా డేటా ఎక్కిస్తూనే వున్నాను కంప్యూటర్లోకి. గదులని అద్దెకిచ్చే ఆ ఇంటికంత మంచి పేరేమీ లేదు. మర్యాదస్తులెవరూ ఆ ఇంట్లో అద్దెకుండమని చెప్పరు. రైల్వే పట్టాల కవతలగా, మారిపోతున్న ఊరు మర్చిపోయిన ఒక కాలనీలో ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు కేవలం ఒక బూడిద కుప్ప. ఆ ఇల్లు బానే ఉండేదో పాడు బడినట్టుండేదో, ఇంతకు మునుపెలా వుండేది అనే సంగతి ఇన్స్యూరెన్స్ కంపెనీ చెప్పలేదు. నల్లగా పొగ చూరిపోయి అక్కడక్కడ ఇంకా నిలబడున్న మొండి గోడలు, కాలి బొగ్గైపోయిన కలప, బూడిద కుప్పలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఇంటితో పాటు కాలిపోయిన నాలుగు శరీరాలు కూడా అసలేం జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోడానికి ఏ ఆచూకీ వొదిలి పెట్టలేదు.

ఆ బూడిద కుప్పల్లో దొరికిన ఒకే ఒక్క ఆధారం పేజీలన్నీ కాలిపోయిన ఒక చిన్న స్కూలు నోట్‌బుక్కు. సగం కాలిపోయిన అట్ట మాత్రమే మిగిలింది. పై అట్ట మీద “ఈ ఇంటిలో జరిగిన నేరాల చిట్టా” అని వ్రాసి వుంది. వెనకాల అట్ట మీద నిలువు వరుసలో రాసిన పన్నెండు నేరాలు – బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించడం, మత్తుమందు ఇవ్వడం, ఆత్మహత్యకు ఉసిగొల్పడం, కత్తిపోటు, వ్యభిచారం, తుపాకీతో బెదిరింపు, కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కడం, బలాత్కారం, వలలో వేసుకోవడం, నిందించడం, దొంగచాటుగా వినడం, పీక నొక్కి వేయడం.

అప్పటికి ఆ ఇంట్లో వుంటున్న ఎవరు ఈ చిట్టా రాశారో తెలీదు. ఎందుకోసం రాసుంటారో అసలే తెలీదు. పోలీసులకు చెప్పడానికి రాశారా, తనే తప్పూ చేయలేదని చూపించుకోడానికి రాసి పెట్టుకున్నారా అన్నది తెలీదు. పోనీ, నేరం చేయడంలో తమ తెలివితేటలు చూసి పొంగిపోడానికి తమకోసమే రాసుకున్న వివరాలా అవి? అదీ తెలీదు. మనకు తెలిసిందల్లా అట్ట మీద ఉన్న ఆ పన్నెండు నేరాల చిట్టా. ఎవరిపైన ఏ నేరం జరిగిందో తెలుసుకుందామన్నా కుదరదు. ఆ నేరాలకు ఎదురుగా పేర్లేమైనా ఉన్నాయా, ఈ నేరాలు ఏ వరసలో జరిగినయో తెలుసుకోడానికి కనీసం పేజీ నంబర్లు లాంటివేమైనా, పోనీ? అబ్బే, ఏమీ లేవు. ఆ వైపు అట్ట కాలిపోయింది. ఇల్లు తగలబెట్టడం ఈ చిట్టాలో లేకపోయినా, అది పదమూడో నేరం అని ఖచ్చితంగా మనం ఊహించవచ్చు. కానీ, చేసిందెవరు? ఎందుకు చేశారు? ఈ కథ జరిగిందెలా? అది పూర్తిగా తిరిగి తెలుసుకోడం ఎలా?

ఈ పన్నెండు నేరాలూ ఒకే వ్యక్తి చేసినవి, ఒకే వ్యక్తికి చేసినవి అని అనుకుందాం. కానీ అదంత తేలిక కాదు. కాలిపోయిన ఇంట్లో దొరికినవి నాలుగు శరీరాలు. ఒకరికెదురు ఒకరుగా వెరసి పన్నెండు జతలు. ఒక్కో నేరానికి పన్నెండు జతల చొప్పున పన్నెండు నేరాలకు అన్ని పర్మ్యుటేషన్లు, కాంబినేషన్లు లెక్క కడితే వచ్చే సమాధానం – పన్నెండుకు పన్నెండు రెట్టించి – ఎనభైతొమ్మిది లక్షల పదహారు వేల కోట్ల, పది లక్షల, నలభై ఐదు వేలు. ఇన్ని సాధ్యాలలో ఏది నిజం? ఏది కాదు? ప్రమాదవశాత్తూ ఇల్లు కాలిపోయింది అని రిపోర్టు రాసేసి పోలీసులు చేతులు దులిపేసుకున్నారంటే అందులో వింతేముంది? అసలే వాళ్ళకు జీతాలు తక్కువ, చాకిరీ ఎక్కువ. పైగా నేరం చేసినవారెవరో కానీ ఆ మంటల్లో కాలిపోయే ఉంటారు. ఇంక ఆ కేసుని ఇంకా లాగడం ఎందుకు?

నేరం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఆదుర్దా చూపిస్తున్నది కేవలం ఇన్స్యూరెన్సు కంపెనీ. అగ్నిప్రమాదం భీమా తీసుకున్న ఆ ఇంటి ఓనరు కిశోరరామరాజు ఆ మంటల్లోనే కాలిపోయాడన్న నిజం ఇన్స్యూరెన్సు కంపెనీకి తలనొప్పి ఇంకా ఎక్కువ చేసింది. తాగుడు, డ్రగ్సు, వెధవ తిరుగుళ్ళు తిరిగి కుటుంబ ప్రతిష్ట మంట గలుపుతున్నాడని రామరాజుని వాళ్ళింట్లోవాళ్ళు వెలి వేశారు. ఒక దశలో తప్ప తాగి, మూసేసిన షాపుల గుమ్మాలపై పడుకున్న రామరాజుకి మిగిలింది ఈ ఇల్లొకటే. విధవ వసుంధరాదేవికి ఇల్లద్దెకిచ్చి, ఆ యింటి యాజమాన్యమూ ఇచ్చాడు. ఆమెనుంచి తిరిగి తనింట్లో తానే ఒక గది అద్దెకు తీసుకున్నాడు. ఆమెకి అప్పటికే చాలా చౌకగా ఇల్లంతా అద్దెకిచ్చినా, ఈ గది ఇచ్చినందుకు ఇంకా కొంత రాయితీ ఇచ్చాడు. వంశోద్ధారకుణ్ణి కూడా కాదనుకున్న ఆ రాజవంశస్థులు ఎప్పుడూ ఒక్క నయాపైసా కాదనుకున్న పాపాన పోలేదని, పోనివ్వరనీ అందరికీ తెలిసిన సంగతి. తాగిన మైకంలో ఒకవేళ నేరాలన్నీ చేసింది, ఇల్లు తగులబెట్టింది రామరాజే అని నిరూపించగలిగితే ఇన్స్యూరెన్సు కంపెనీ రామరాజు కుటుంబానికి ఒక్క పైసా నష్ట పరిహారం చెల్లించనక్కర్లేదు.

అయితే ఇదొక్కటే పాలసీ కాదు, ఇన్స్యూరెన్సు కంపెనీకి చుట్టుకున్నది విధవ వసుంధరాదేవి తీసుకున్న జీవితభీమా కూడా. వసుంధరాదేవి ప్రమాదవశాత్తూ పోతే ఆ పాలసీ లబ్ధిదారి అయిన ఆమె కూతురు తారామనోహరి కూడా ఆ మంటల్లోనే కాలిపోయింది, ఆమెకున్న రెండు వందల ముప్ఫైరెండు కొప్పులు, సవరాలతో సహా. (ఆమె కేశవర్ధిని తలనూనె మోడల్. బాగా పల్చటి పొట్టి జుట్టు. అంత అందమైన ఆమెకి ఆ పీలికల జుట్టేమిటో.) మనోహరికి ఒక నిర్మాత వల్ల పుట్టిన కూతురు, మూడేళ్ళది, ఆమె తమ్ముడి దగ్గర చెన్నైలో పెరుగుతోంది. ఆ తమ్ముడికి ఈ విషయం తెలిస్తే నిమిషం వృధా చేయకుండా ఇన్స్యూరెన్సు కంపెనీ పీక పట్టుకుంటాడు. భీమా చెల్లించకుండా తప్పించుకోవాలంటే ఒకటే మార్గం: విధవ వసుంధరాదేవిని చంపేసింది తారామనోహరి అని (కత్తిపోటు? పీక పిసకడం?) నిరూపించడం. అదేపనిగా కొప్పులు, సవరాలు కూడా తారా మనోహరి వల్లనే కాలిపోయాయి అని చూపిస్తే ఆ భీమా గొడవ కూడా తీరిపోతుంది.

ఇక, మంటల్లో కాలిపోయిన ఆ నాలుగో శరీరం కుర్ర వస్తాదు శివనాగరాజుది. కిరాయి చెల్లించేది ఆ ఇంట్లో అతనొక్కడే. వసుంధరాదేవి చాలా తెలివైనది, వ్యాపారపు కిటుకులు నేర్చుకున్నది. అతన్నీ ఏమాటా అనకుండా చూసుకొనేది. అంతే కాదు, శివనాగరాజు ప్రతీ యేటా కుస్తీ పోటీలకు వెళ్ళడానికి ఆమె అతనికి డబ్బిచ్చేది కూడా. అతనికే ప్రమాదం జరిగినా, కుస్తీపోటీల్లో కాలు చేయీ విరిగినా, ఏదైనా జబ్బు చేసినా, ఒకవేళ పోయినా, తనకు నష్టం రాకుండా అతని మీద ఒక భీమా పాలసీ తీసుకుంది. ఇప్పుడు కుస్తీ పోటీల నిర్వాహకులు ఆ భీమా మీదగా తమకు నష్టపరిహారం చెల్లించమని కంపెనీని నిలదీస్తున్నారు. వారినుంచి తప్పించుకోవాలంటే, వసుంధరాదేవి వల్లనే శివనాగరాజు చనిపోయాడని (ఆత్మహత్యకు ప్రేరేపించడం, లేకపోతే మత్తుమందు ఇవ్వడం, బ్లాక్‌మెయిల్ చెయ్యడం?) నిరూపించడం తప్ప వేరే దారి లేదు.

సాలెగూటిలోకి ఒక్కో ఈగను పంపి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో చూసినట్టు, నేను ఒక్కొక్కటిగా ఎక్కిస్తున్న ప్రత్యామ్నాయాలను తన డేటా బాంక్ పళ్ళతో నమిలి ఒకే క్షణంలో ఏది ఎంతవరకు ఎందుకు సాధ్యమో, కంప్యూటర్ తన అభిప్రాయాలను మోనిటర్ మీదకు ఉమ్మేస్తోంది. కానీ ఎక్కిస్తున్న ఊహలు ఒక్కటొక్కటిగా నా మెదడంతా ఆక్రమించుకుంటున్నాయి. నిండిన బస్సులోకి ఎక్కుతున్న ప్రయాణీకులు సర్దుకుంటున్నట్టుగా అవి మెదడులో జొరబడి అలానే నిలబడిపోతున్నాయి. నేను ఒద్దనుకున్నా వాటిని ఆపడం నా వల్ల కాటల్లేదు. సాయిరామారావుకి కావలసింది కంప్యూటర్ రిజల్ట్ కానీ నేను ఇచ్చే సలహా కాదు.

చనిపోయిన నలుగురూ నేరం చేయగల సమర్ధత ఉన్నవారిగానే అనిపిస్తున్నారు. ఏదైతే అసంభవం అనుకుంటామో అదే చివరికి నిజం కావచ్చు కదా. నేరాల చిట్టానే చూడండి. అన్నింట్లోకి చిన్న తప్పుగా కనిపిస్తున్నది ఏమిటి? వలలో వేసుకోవడం. అవునా? ఎవరు ఎవరిని వలలో వేసుకున్నారు. తీవ్రంగా ఆలోచిస్తున్న నా బుర్ర మెల్లిగా వేడెక్కడం మొదలు పెట్టింది. కలైడోస్కోపులో గాజుముక్కల్లా రకరకాల ఊహలను కలుపుతూ విడదీస్తూ సినిమా రీళ్ళలా మనసులో తిప్పుతూ చూస్తున్నాను. ఎర్రరంగు నెయిల్ పాలిష్‌తో తారామనోహరి నాజూకైన చేతి వేళ్ళు, కిశోరరామరాజు చెంపలని సుతారంగా నిమరడాన్ని చూస్తున్నాను. అవే చేతి వేళ్ళు శివనాగరాజు ఛాతీపై పాకడాన్ని కూడా చూస్తున్నాను. ఆ స్పర్శతో పొంగి బిగిసిన కండలతో, మత్తెక్కిన కళ్ళతో ఉన్న వస్తాదును ఊహిస్తున్నాను. కానీ, మరుక్షణంలోనే రామరాజు తన పెదాలతో చెవి తమ్మె నొక్కుతూ చెప్పిన ఊసుతోనో, శివనాగరాజు చేతులు వెనకనుంచి తన నడుము చుట్టూ పెనవేసుకుంటేనో, ఇష్టంతో ఎరుపెక్కిన తారామనోహరి చెక్కిళ్ళనూ నేను గమనిస్తున్నాను. అంతే కాదు, వయసు మళ్ళినా మనసు మళ్ళని శరీరం అడిగే కోరికల వేడితో విధవ వసుంధరాదేవి పెదాలకు లిప్‌స్టిక్ పూసుకొని సింగారించుకోడాన్నీ, నాజూకైన రామరాజునో, కండలు తిరిగిన నాగరాజునో, లేకపోతే ఇద్దరినీనో, వేరు వేరుగా వేరు వేరు రకాలుగా చుట్టుకొనిపోవడం చూస్తున్నాను. తనకంటే వయసులో పెద్దది అన్న విచక్షణ లేకుండా రామరాజో, నాగరాజో, విధవ అన్న లోకువతో వసుంధరాదేవిని లొంగదీసుకోడానికి ప్రయత్నించడం చూస్తున్నాను. చివరికి, నాగరాజు గానీ రామరాజు గానీ స్వలింగ సంపర్కులేమో అన్న ఊహనూ నేను ఒదిలి పెట్టలేదు.

నేర తీవ్రత పెరిగినా కూడా ఈ అన్ని రకాల పద్ధతులు సాధ్యమే. అవేమీ తక్కువ కావాలనేమీ లేదు. కత్తిపోటునే తీసుకోండి. ఎవరు ఎవరినైనా కత్తితో పొడవగలరు. నా ఊహల్లో ఇప్పటికే శివనాగరాజు మెడలోకి వెనకనుండి దిగిన కత్తిని చూస్తున్నాను. గాజులు గలగలమంటున్న చేతితో ఆ కత్తిని మెడలో అటూ ఇటూ మెలితిప్పుతున్నది తారామనోహరి కావచ్చును. లేదూ, ఆషామాషీగా ఆటలాడుతున్నట్టుగా కత్తిని కదిలిస్తున్న ఆ నాజూకైన చేయి రామరాజుదీ కావచ్చును. ఇంటిపనితో కరుడు గట్టిన వసుంధరాదేవి చేతివేళ్ళు నిద్రపోతున్న ఎవరి మొఖం పైననో దుప్పటి కప్పి పీక బలంగా నొక్కి పట్టడాన్ని కూడా చూస్తున్నాను.

కేవలం ఇవే కాదు నాకొస్తున్న ఆలోచనలు. తారామనోహరి కాని, వసుంధరాదేవి కానీ రామరాజుని గొర్రెను కోసినట్టు కోయడం; రామరాజు కాని, మనోహరి కానీ, వంటింట్లో వసుంధరాదేవి వాడే కూరగాయల కత్తితో ఆమెను కసికసిగా పొడవడం; వసుంధరాదేవి కాని, రామరాజు కానీ నగ్నంగా ఉన్న తారామనోహరి అందమైన శరీరాన్ని (ఆమె తప్పించుకోడానికి వీల్లేకుండగా కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి?) కోసివేయడం; ఇలా.

శివనాగరాజు ఒక్కడే కత్తితో మిగతా అందరినీ చీరేయడం అంత కష్టమైన ఊహ కాదు కానీ, అతని బలం, నేరాల చిట్టా, రెండూ గమనిస్తే పీక నొక్కి చంపడం అతనికి కత్తితో పొడవడం కన్నా సులభం అని అనిపిస్తుంది. పీక నొక్కి చంపడం అనే నేరం అతను చేయగలిగిందే కానీ అతనిమీద జరగగలిగే నేరం కాదు. మిగతా ముగ్గురు కలిసి ప్రయత్నించినా శివనాగరాజు బలిసిన మెడ వాళ్ళ చేతుల్లో పట్టదు.

ఈ విషయాలు కంప్యూటర్ తన లెక్కలోకి తీసుకోవాలి: ఒకటి, శివనాగరాజు వేరేవాళ్ళని కత్తితో పొడవడం కంటే పీక పిసకడానికే ఆస్కారం ఉంది. రెండు, వేరేవాళ్ళు అతన్ని పీక పిసికి చంపే అవకాశం లేదు. తుపాకీతో బెదిరించి అతని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కడం ఒకటే దీనికి మినహాయింపు. అయితే ఒక్కసారి కాళ్ళూ, చేతులూ, నోరూ కట్టేయబడ్డ శివనాగరాజుపై ఏ నేరమైనా సాధ్యమే, బలాత్కారంతో సహా. వసుంధరాదేవి, రామారాజు, తారామనోహరి – ఎవరైనా సరే ఆ స్థితిలో నాగరాజుని చెరచగలరు.

ఇలా కాదు. ఒక పద్ధతి ప్రకారం, మినహాయింపులు, అవకాశాలు వరుసలో పెట్టుకోవాలి. ఎవరైనా ముందుగా తుపాకీతో బెదిరించి, ఆ తర్వాత కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కగలరు. ముందు కట్టేసి ఆ తర్వాత ఎవరైనా బెదిరిస్తారా! వింటే నవ్విపోతాం. అలానే, తుపాకీతో బెదిరించిన తర్వాత కత్తితో పొడిచో, పీక పిసికో చంపడం కూడా నమ్మబుద్ధి కాదు. వలలో వేసుకున్న వ్యక్తి ఇష్టంతోటే దగ్గరకొస్తుంటే అక్కడ బలాత్కారం అవసరం లేదు. అత్యాచారం ఉన్నచోట వలలో వేసుకోడం కూడా అనవసరమే. అలానే వ్యభిచారానికి నెట్టేవారు ఆ వ్యక్తిని అంతకు ముందు లొంగదీసుకొనో, బలాత్కరించో ఉండాలి. వ్యభిచారంలోకి దింపిన తర్వాత ఆ రెండు పనులూ ఊహకు పొసగవు. బ్లాక్‌మెయిల్ చేయాలనే ఉద్దేశంతో దొంగచాటుగా ఎవరైనా వారి మాటలు వినచ్చు కానీ ఒకసారి అపవాదు వేసి నిందించిన తర్వాత మళ్ళీ మళ్ళీ నిందించడం వారినింకేమీ భయపెట్టదు. అందువల్ల నిందించదలచుకున్న వ్యక్తికి దొంగచాటుగా వినాల్సిన అవసరం కానీ, బ్లాక్‌మెయిల్ అవసరం కానీ రాదు. కత్తితో ఒకళ్ళని పొడిచిన వ్యక్తి ఇంకొకళ్ళను పీక పిసకడం, మరింకో వ్యక్తిని ఆత్మహత్యకు పురిగొల్పడం జరగవచ్చు. కానీ, మూడు నేరాలు ఒకే వ్యక్తి మీద ఎలా జరుగుతాయి? ఒకే వ్యక్తిని పీక పిసికి, ఆపైన కత్తితో ఎందుకూ పొడవడం?

ఇలా పద్ధతి ప్రకారం నియమావళి రాసుకుని కంప్యూటరుకి ఎక్కిస్తే వీటి ఆధారంగా అది ఆ వేల కోట్ల సాధ్యాసాధ్యాలలో పనికి రాని వాటిని ఏరి పారేయడానికి వీలవుతుంది. మిగిలిన వాటిల్లో నిజంగా ఏ జరిగిందో తెలుసుకునే అవకాశాలు ఎక్కువవుతాయి.

కానీ, ఇది జరిగేదేనా?

ఒకవైపు నేను, కంప్యూటర్ మోడల్ మీద పనిచేస్తున్నాను. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ల ఆధారంగా నేరం జరిగిన పద్ధతుల అవకాశాలని లెక్క కడుతున్నాను. ఈ క్రమంలో, ఈ సున్నాలు ఒకట్ల సామ్రాజ్యంలో నేను ఆ నలుగురినీ ప్రాణం లేని పదార్థాలుగా, నిర్జీవమైన అంకెలుగా మాత్రమే చూస్తున్నాను. అదే నేను రెండోవైపు, ఆ నలుగురినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వారి మనసుల్లో దూరి, వారే విధంగా ఆలోచించి వుంటారో, ప్రవర్తించి వుంటారో తెలుసుకుందామని ప్రయాస పడుతున్నాను. వాళ్ళు నలుగురూ మసక మసకగా ఒక రూపు నుంచి ఇంకో రూపుకి మారిపోతూ, కనిపిస్తూ మాయమౌతున్నారు. బహుశా, మత్తుమందు ఇవ్వడం అనేది ఈ నేరాలన్నిటికీ ఇరుసు లాంటిదేమో. దాని చుట్టూనే మిగతా నేరాలన్నీ అల్లుకున్నాయేమో. నాకు వెంటనే తెల్లగా పాలిపోయిన కిశోరరామరాజు మొఖం కనిపించింది. తనకు తానే మాదకద్రవ్యం ఏదో ఇచ్చుకొని మత్తులో మునిగిపోతే అది నేరం కాదు. ఇక్కడ నేనంటున్నది బలవంతంగానో, వారి ఇష్టానుసారంగానో వేరొకరికి మత్తుమందు నివ్వడం.

పూర్తిగా మత్తులో వున్న కిశోరరామరాజు, ఆ స్వర్గం రుచి చూడమని మిగతావారందరికీ ఆశపెట్టుండడం నేను ఊహిస్తున్నాను. రామరాజు నుంచి తారామనోహరికో, వసుంధరాదేవికో, చేత్తో చుట్టిన ఆ గాంజా సిగరెట్టు చేతులు మారడాన్ని చూస్తున్నాను. తారామనోహరి అందమైన ముఖాన్ని గంజాయి దమ్ము పొగలో మత్తుగా మసకగా చూస్తున్నాను. రామరాజు తన వేదాంతాన్ని వినిపించి ఆ ఇంట్లో అందరినీ మత్తులో ముంచడాన్ని నేను ఊహిస్తున్నాను. కాదా? విధవ వసుంధరాదేవికే ఒకప్పుడు ఈ అలవాటు ఉండిందేమో. రామరాజు అనుకోకుండా ఆవిడ గంజాయి ఎక్కడ దాచిపెట్టిందో చూసి, తుపాకితో ఆమెను బెదిరించడమో, బ్లాక్‌మెయిల్ చేయడమో చేసుంటాడు. వెంటనే వసుంధరాదేవి సహాయం కోసం అరిచి వుంటుంది. ఎదురు తిరిగి, తారామనోహరిని వలలో వేసుకుని వ్యభిచారానికి దింపావని, రామరాజునే నానామాటలు అని వుంటుంది. ఇంతలో అక్కడికొచ్చిన శివనాగరాజు ఈ మాటలు విని రామరాజు పీక పిసికి చంపేసి వుంటాడు. తప్పించుకోడానికి ఇంకే దారి లేక వసుంధరాదేవి శివనాగరాజుని ఆత్మహత్యకు ప్రేరేపించి వుంటుంది. ఎందుకంటే ఆమెకు శివనాగరాజు పోతే భీమా డబ్బులెలానూ వస్తాయి. కానీ, ఇది ఊహించిన శివనాగరాజు, తారామనోహరిని బలాత్కారం చేసి, కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి, ఇంటికి నిప్పంటించి తన పగ చల్లార్చుకుని వుంటాడు.

చిన్నగా, చిన్నగా. నేను నిదానంగా ఆలోచించాలి. తొందరపడి లాభం లేదు. నాకేమైనా కంప్యూటర్‌తో పోటీనా? అసలు ఆ ఇంట్లోకి డ్రగ్స్ వచ్చింది శివనాగరాజు వల్లనే అయుండాలి. కుస్తీపోటీల్లో నొప్పి తెలియకుండా ఉండటానికో, ఓడిపోతే అవమానం భరించలేకో అలవాటు చేసుకునుండాలి. వసుంధరాదేవి శివనాగరాజుని లాలిస్తూ ఆ మందులు తినిపిస్తుంటుంది. ఎప్పుడూ వాటికోసమే వెతుకుతుండే రామరాజు దొంగచాటుగా ఈ వ్యవహారం గమనించి, తనకు కాసిని డ్రగ్స్ ఇమ్మని అడుగుతాడు. వాళ్ళు కాదంటారు. రామరాజు వెంటనే ఈ విషయం కుస్తీ పోటీల నిర్వాహకులకు చెప్తానని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. శివనాగరాజు వెంటనే రామరాజుని కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కుతాడు. ఆ తర్వాత కిశోరరామరాజంటే పడిచచ్చే తారామనోహరికి అతన్ని తారుస్తాడు, ఆమె ఇచ్చే డబ్బు కోసం. మత్తులో వున్న రామరాజు శరీరం సహకరించదు. అతనిలో కామం ప్రేరేపించాలంటే లైంగికహింస తప్పదు. తారామనోహరి తన నాజూకైన వేలితో రామరాజు మెడ మీది కార్టాయిడ్ నరాన్ని నొక్కిపెడుతుంది. శివనాగరాజు కూడా కొంచెం సహాయం చేయబోతాడు కాని అతని వేలి ఒత్తిడికి రామరాజు హరీ అనుంటాడు. ఇప్పుడీ శవాన్ని ఏం చేయాలి? ఆత్మహత్యగా చూపిద్దామని వాళ్ళు రామరాజు శవాన్ని కత్తితో పొడుస్తారు.

స్టాప్! స్టాప్! ఆల్ట్-కంట్రోల్-ఎఫ్8! ప్రోగ్రాం ఆపాలి. ఇంతకు ముందు ఇన్‌పుట్ చేసిన నియమం – పీక పిసికించుకున్న వ్యక్తికి కత్తిపోటు అనవసరం – మార్చాలి. కంప్యూటర్ పాత మెమరీని తుడిచేసుకొని సున్నాలూ ఒకట్లను కొత్త కొత్త వరసల్లో నిలబెట్టుకుంటోంది. నాకు సన్నగా చెమట పట్టింది.

ఇలా లాభం లేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. నేను కుదుటపడాలి. మళ్ళీ మొదటినుంచీ మొదలు పెడతాను. అసలు నా పని ఏమిటి? నా బాధ్యతలేమిటి? నా పని నా క్లయింటు అడిగిన పని చేసిపెట్టడం. నా బాధ్యత క్లయింటిచ్చిన డేటాను కంప్యూటర్‌లోకి ఒక వరుస ప్రకారం, ఒక లాజికల్ పద్ధతిలో ఫీడ్ చేయడం. నాకు సంబంధించినంత వరకూ వాళ్ళు మనుషులు కారు. వాళ్ళకి మంచీ చెడ్డా లేవు. వాళ్ళ చెడును చూపించే సమాచారం మాత్రమే నాకెందుకిచ్చారో నాకనవసరం. ఆ వివరాల ఆధారంగా జరిగిన కథ చెప్పాల్సిన పని కంప్యూటర్‌ది. నేరాల స్వభావాన్ని అది నిర్ణయించలేదు. నేరం జరిగిన పద్ధతిని, ఇచ్చిన సమాచారం ప్రకారం, ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది అని ఒక వరుసలో చూపించగలదు. నా పని కంప్యూటర్ సహాయంతో నాకిచ్చిన ఈ నేరాల చిట్టా ఆధారంగా ఆ ఇంట్లో జరిగిన కథని మళ్ళీ పూర్తిగా కట్టడం. అంతే! నేను ఇలా జరిగిందని చెప్పే కథనం, నిజంగానే నిజమా కాదా నాకు అనవసరం.

జరిగిన కథనం… జరిగిన కథ అంటే అది రాసేవాడొకడు ముందుగా ఉండి తీరాలి. నోట్‌బుక్ రచయిత కత్తిపోటు తోనో, పీక నులమబడో చచ్చిపోయి వుండడు. తన చావు తానే ముందుగా ఊహించి అలా చస్తే నోట్‌బుక్‌లో వివరాలు రాయడం సాధ్యం కాదు. ఆత్మహత్య ఒక్కటే సాధ్యం. ముందు నోట్‌బుక్‌లో జరగబోయేది రాసిపెట్టి ఆపైన ఆత్మహత్య చేసుకోవచ్చు. కాకపోతే, ఇంకొకరు తనని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారని తెలిసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోడు. ఏ రకంగా ఆలోచించినా, చిట్టా రాసిన వ్యక్తి ఇంకొకరి చేతిలో బలిపశువు అయుండడు. ఈ ఊహ బలపడుతున్నకొద్దీ, అతనే ఈ నేరాలన్ని చేసినవాడు అనే ఊహ కూడా అంతే నిజంగా అనిపిస్తోంది. నేరాల చిట్టా రాసిన వ్యక్తే వాటిని మొదట ఊహించి వుంటాడు, ఆ తర్వాత ఆచరణలో పెట్టి వుంటాడు. నేరానికి, అది జరిగిన వివరాలకీ ఒక కాకతాళీయ సంబంధం ఎప్పుడూ వుంటుంది. ఇది నాకేమీ కొత్త సంగతి కాదు. నా పనిలో తరచూ చూసేదే. కాలిన నోట్‌బుక్ అయినా కంప్యూటర్ ఫైల్ అయినా ఈ సంబంధం మారదు.

కంప్యూటర్‌కి కొత్త సమాచారం ఎక్కించాను. నాలుగు పాలసీలు సాయిరామారావు ఆ ఇంట్లో వారితో చేశాడు. ఒకటి కిశోరరామరాజుతో, ఒకటి తారామనోహరితో, రెండు విధవ వసుంధరాదేవితో (ఒకటి తనకు, ఒకటి శివనాగరాజుకు.) ఈ పాలసీలకూ, ఆ నేరాలకూ సంబంధం ఏమైనా, ఎంత చిన్నదైనా ఉందో లేదో కంప్యూటర్ తేల్చి చెప్పాలి. ఈ కథకు అంతస్సూత్రాన్ని లక్షల లక్షల ట్రాన్సిస్టర్ల ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్‌ల ప్రాసెసర్ కవాతులలో అది చూడగలగాలి. సున్నాలూ ఒకట్లుగా నిరంతరంగా చలిస్తున్న ఆ పాలసీ వివరాలు నా మనసులో అప్పుడే ఊహాచిత్రాలు గీస్తున్నాయి. అది ముసురు పట్టిన సాయంకాలం. సాయిరామారావు కాలింగ్ బెల్ నొక్కుతున్నాడు. ఎవరో అద్దెకు వచ్చాడేమో అని వసుంధరాదేవి అతన్ని మర్యాదగా పలకరిస్తోంది. కుర్చీలో కూర్చున్న సాయిరామారావు తన బ్రీఫ్‌కేసు నుంచి పాలసీ వివరాల బ్రోషర్లు బైటికి తీస్తున్నాడు. వసుంధరాదేవి ఇచ్చిన టీ తాగుతూ ఆమెతో మాట్లాడుతున్నాడు. నాలుగు పాలసీలూ ఒకేసారి అయే ప్రశ్నే లేదు. సాయిరామారావు, తన పరిచయాన్ని ఆ ఇంట్లో అందరితోనూ పెంచుకునుంటాడు. తారామనోహరి సవరాలనీ, కొప్పుల్నీ ఒద్దిగ్గా సర్దిపెట్టి ఆమెకు సహాయం చేసుంటాడు (ఆమెకు చాలా దగ్గరగా నిలబడి.) విధవ వసుంధరాదేవికి నడుము బెణికితేనో, తలనొప్పిగా వుంటేనో, డాక్టరంత ధీమాగా, కొడుకంత ప్రేమగా ఆమెకు అమృతాంజన్ రాసుంటాడు. కిశోరరామరాజుకి, ఆ ఇంటినెలా కాపాడుకోవాలో సలహాలిచ్చుంటాడు. తనకు తెలిసిన కాంట్రాక్టర్లున్నారని, పెద్దగా ఖర్చు కాకుండానే ఇంటి మరమ్మత్తులన్నీ చేయిద్దామనీ భరోసా ఇచ్చుంటాడు. శివనాగరాజుతో ఏ పోటీలో ఎవరు గెలుస్తారో పందేలు కట్టుంటాడు. పెద్దగా నవ్వుతూ, అభిమానంగా అతని వీపు చరిచి వుంటాడు. భుజాల మీద చెయ్యేసి అతనితో జోకులు వేసుంటాడు.

నిజం చెప్పద్దూ, సాయిరామారావంటే నాకంతగా పడదు. ఈయనగారు ఎప్పుడెక్కడ ఏ పాలసీలు తీసినా ఏదో ఒక చిక్కు పడుతూనే వుంటుంది. చోద్యం కాకపోతే, వసుంధరాదేవి ఇంట్లో ఈయనకు అంత చనువు, పరిచయం ఉన్న మనిషి కదా. అన్ని పనులూ చేసిపెట్టింది ఈయనే కదా. మరి ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో ఆ మాత్రం తెలిసుండదా? ఈ కేసు సాల్వ్ చెయమని నా దగ్గరికి ఎందుకూ రావడం? ఆ కాలిపోయిన నోట్‌బుక్ నాకెందుకూ ఇవ్వడం? అసలా నోట్‌బుక్ ముందు చూసింది ఎవరు, సాయిరామారావేనా? ఇంకా మాట్లాడితే, ఆ పుస్తకం అక్కడ పెట్టింది ఈయనేనా? ఈయనేనా నాకు ఆ నలుగురి గురించి కేవలం చెడు వివరాలు మాత్రమే ఇచ్చింది? ఈయన ఆ ఇంట్లో అడుగు పెట్టడం వల్లేనా ఇదంతా జరిగింది? ఆ చెడు ఇప్పుడు పాదరసంలా ఆ ఇంట్లోంచి నా ఒంట్లోకి ఇప్పుడు ఈ కంప్యూటర్లోకి పాకుతోంది, ఎందుకు?

విధవ వసుంధరాదేవి ఇంట్లో జరిగిన దారుణంలో పాత్రధారులు నలుగురు కాదు. ఐదుగురు. సాయిరామారావు వివరాలని కూడా నేనిప్పుడు ప్రోగ్రాం లోకి ఎక్కించాలి. అసలు ఈ నేరాలన్నిటిలో వాళ్ళ తప్పు ఎంత వుందో ఈయన తప్పు అంతే వుండుంటుంది. సాయిరామారావే బ్లాక్‌మెయిల్ చేసుంటాడు. మత్తుమందు ఇచ్చి వుంటాడు. ఆత్మహత్యకు ప్రేరేపించి వుంటాడు. వ్యభిచారంలోకి నెట్టడం, పీక పిసకడం కూడా చేసుంటాడు. పర్మ్యుటేషన్లూ, కాంబినేషన్లూ పెరిగిపోతాయి. తెలుసు, కానీ తప్పదు. కంప్యూటర్ ఓవర్ క్లాకింగ్ చేసినా పర్లేదు, జరిగింది ఇదీ అని ఊహించడానికి ఒక చిన్న నమూనా దొరికితే చాలు. మాట వరసకి, సాయిరామారావే ఈ నేరాలన్నిటికీ మూలకారణమని, ఈయన తలుపు తట్టకముందు ఆ ఇల్లు ప్రేమాలయమనీ కంప్యూటర్లోకి ఒక రొటీన్ ఎక్కించి చూస్తాను. ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ వుంటుంది. విధవ వసుంధరాదేవి తెల్లటి చీరలో ప్రశాంతంగా దేవుడి పూజ చేసుకొని, తంబూరా మీటుతూ భజన గీతాలు పాడుతూ వుంటుంది. మనిషి వస్తాదు అయినా మనసు ఇంకా చిన్నపిల్లవాడిదే అయిన శివనాగరాజు తన కోతిచేష్టలతో అందరినీ నవ్విస్తూ ఉంటాడు. కుండీలో పెరిగే మల్లె, జాజి, కనకాంబరం మొక్కలకు తారామనోహరి నీళ్ళు పోస్తుంటుంది. ఒక బొండు మల్లెను తుంచి కిశోరరామరాజు మనోహరి తలలో (ఆమె సవరంలో) తురుముతుంటాడు ఎంతో ప్రేమగా. ఆమె అతన్ని ఎంతో ఆరాధనగా చూస్తుంటుంది.

ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. సాయిరామారావు. అద్దెకుండడానికి గది వెతుకుతున్నారా? లేదండీ, నేను ఏజంటును. మంచి పాలసీలున్నాయి. మీకు నచ్చితే చేయిద్దామని. జీవితభీమా, అగ్నిప్రమాదం, ఇంటికి భీమా, అందులో వస్తువులతో సహా. నెలసరి బకాయి తక్కువ. కండిషన్లు కూడా ఎక్కువ లేవు. సాయిరామారావు అందరినీ ఆలోచించమంటాడు. వాళ్ళు ఆలోచిస్తారు. ఇంతకు ముందు ఆలోచించనివన్నీ ఇప్పుడు ఆలోచిస్తారు. కొత్త ఆలోచనలనుంచి కోరిక పుడుతుంది. వారి మనసుల్లో విషబీజం నాటుకుంటుంది. అది మొక్కై ,మానై మనసంతా ఆక్రమించుకుంటుంది… నాకు తెలుస్తూనే వుంది. సాయిరామారావంటే నాకున్న అయిష్టత వల్ల నేను నిజాయితీగా ఆలోచించట్లేదు. నా పక్షపాతం కంప్యూటర్ రిజల్ట్సు మీద కూడా పడే ప్రమాదం వుంది. నిజం చెప్పాలంటే, నాకు మాత్రం సాయిరామారావు గురించి ఏం తెలుసు? ఆయన గురించి నేను చెడుగా ఎందుకు అనుకోవడం? ఆయన మనసు మల్లెపూవులా స్వచ్ఛమైనది కాకూడదా? ఈ దారుణంలో ఏ పాపమూ ఎరుగని నిర్దోషి ఆయనొక్కడేనేమో. వున్న ఆధారాల ప్రకారం, వసుంధరాదేవి డబ్బు ఆశ, తారామనోహరి అహం, శివనాగరాజు పశుత్వం, కిశోరరామరాజు అధోలోకం – వీళ్ళే కావాలని సాయిరామారావుకు ఎరవేసి వుంటారు. వీళ్ళే ముందు ఆయనని పిలిచి వుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి వున్న పగతో పాలసీలు తీసుకుని వాళ్ళను నాశనం చేద్దామనే కక్షతో. ఈ రాబందుల మధ్య సాయిరామారావు ఒక పావురాయి, అంతే.

బీప్. బీప్.. ఫేటల్ ఎర్రర్! ఎక్స్‌బీకే 017924 – ప్రాసెసర్ ఓవర్‌లోడ్! ప్రోగ్రాం అబార్టెడ్! ప్రెస్ ఎనీ కీ టు రీబూట్! పోయింది. మెమరీలో వున్నదంతా పోయింది. రక్షించాల్సిన అమాయకులెవరూ మిగల్లేదు. మళ్ళీ మొదలు పెట్టాలి. ఈ కథ మొట్టమొదటి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి.

కాదు. ఆ ఇంటి తలుపు తట్టింది సాయిరామారావు కాదు. బైట సన్నగా జల్లు పడుతోంది. బాగా ముసురు పట్టి వుంది. ఆ మసక చీకటిలో మొఖాన్ని పోల్చుకోవడం కష్టం. గడప దాటి లోపలికొచ్చిన తర్వాతే మనిషెవరో చూడగలిగింది. లోపలి కొచ్చి గొడుగు ముడిచి పక్కన పెట్టి రెయిన్‌కోట్ తీసేసి వాళ్ళకి పరిచయం చేసుకున్నది నేను. నమస్కారం వసుంధరాదేవిగారూ. మీ ఆరోగ్యం ఎలా వుంది? నా పేరు లక్ష్మీనారాయణ. డిజిక్రైమ్ సొల్యూషన్స్ అనే కంపెనీలో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా పని చేస్తుంటాను. మీ అనుమానం నిజమే. మీరు నన్నింతకు ముందు కలవలేదు. కానీ నా కంప్యూటర్లో డేటా వల్ల మీరు నాకు బాగా పరిచయం. ఏవండీ శివనాగరాజుగారూ? ఎలా వున్నారు? కసరత్తు రోజూ చేస్తున్నట్టున్నారు. మెట్లమీద ఆ పొడుగాటి జడ ఆవిడ తారామనోహరి కదూ? రామరాజుగారూ, ఏమిటలా తటపటాయిస్తూ వెళ్ళిపోబోతున్నారు, ఇలా రండి.

అమ్మయ్య, అందరూ వచ్చారా. నేనెందుకొచ్చానో నన్ను చెప్పనివ్వండి. నేను మీతో పనుండి వచ్చాను. నేనెంతో కాలంగా పని చేస్తున్న ప్రాజెక్టుకి మీ సహాయం కావాలి. పగలంతా నేను క్లయింట్లకు పనిచేస్తాను. కానీ రాత్రిళ్ళు, నా ఆఫీసు గదిలో ఒంటరిగా నేను చేసే పని వేరే ఉంది. ఒక కొత్త రకమైన ప్రోగ్రాం మీద రీసర్చ్ చేస్తున్నాను. మనుషుల్లో ఉండే చెడ్డ లక్షణాలను – కోపం, కామం, అహంకారం, అసూయ వంటివి – తీసుకొని సంఘానికి ఉపయోగపడే మంచిగుణాలుగా మార్చడమే నా లక్ష్యం. ఇంకోరకంగా చెప్పాలంటే మంచికి రెండోవైపు చెడు అనే ఎందుకుండాలి? మంచికి మంచే ప్రతిక్రియ ఎందుకు కాకూడదు? నా ఆలోచన సరైన దోవలో ఉందో లేదో నేను నిర్ధారించుకోవాలి. ఈ ఇంటిని మించిన చోటు అందుకిక వేరే లేదు. అందుకని ప్రస్తుతానికి, నన్నూ మీ స్నేహితుడిగా, మీ ఇంట్లో అద్దెకున్న వాడిగా, మీలో ఒకడిగా అనుకోండి.

ఈ ఇల్లు తగులబడిపోయింది. మీరందరూ చచ్చిపోయారు. కానీ కంప్యూటరులో నేను ఈ సంఘటనలని వేరే లాజిక్ వాడి వేరు వేరు వరసల్లో పెట్టగలను. లక్ష్మీనారాయణ మోడల్ అని వ్రాసి ప్రోగ్రామ్‌లో నేనూ భాగం కాగలను. పాత్రల సంఖ్య అలా ఆరుకు పెంచి ఈ సంఘటనలు జరిగే ఆస్కారాలను కొన్ని లక్షలకు పైగా పెంచగలను. కొత్త కొత్త కాంబినేషన్లు పుట్టించగలను. ఈ ఇల్లు బూడిదనుండి తిరిగి కట్టుకుంటుంది. అందరూ చావు నుంచి తిరిగి బతికొస్తారు. ఒక పెద్ద సూట్‌కేస్, నా క్రికెట్ కిట్టూ పట్టుకుని నేను అప్పుడు మీ ఇంటి తలుపు తడతాను. ఏమండీ, మీ ఇంట్లో ఒక గది అద్దెకు వుందా అని అడుగుతాను…

వసుంధరాదేవితో సహా అందరూ నిశ్శబ్దంగా నేను చెప్పేది వింటారు. కానీ నన్ను నమ్మరు. సాయిరామారావు పంపిన ఇన్స్యూరెన్సు కంపెనీ ఏజంటునని, కూపీ లాగడానికి వచ్చాననీ అనుమానపడతారు. వాళ్ళ అనుమానం నిజం కాదని అనలేం. ఎందుకంటే నేను నిజానికి పనిచేస్తున్నది సాయిరామారావుకే కాబట్టి. సాయిరామారావే నను అడిగి వుండచ్చు వాళ్ళ నమ్మకం సంపాదించమని, వాళ్ళ ప్రవర్తనను పరిశీలించమని, వాళ్ళ మనసుల్లో చెలరేగే కోరికల వల్ల జరగబోయే నేరాలను ముందే పసిగట్టమని. వారి ప్రేరణలను, వారి మనస్తత్వాలను, వారి ఇష్టాయిష్టాలను లెక్కించి కంప్యూటర్ డేటాకి జమచేయమని… లక్ష్మీనారాయణ ప్రోగ్రాం, సాయిరామారావు ప్రోగ్రాముకి నకలైన పక్షంలో ఈ వివరాలన్నీ కంప్యూటర్‌కి ఎక్కించి ప్రయోజనం లేదు. లక్ష్మీనారాయణ, సాయిరామారావుకి ఒకరంటే ఒకరికి పడకూడదు. మా ఇద్దరి మధ్య వైరం వల్లనే ఈ మిస్టరీ వీడిపోవాలి.

ముసురు పట్టి జల్లు పడుతున్న ఆ చీకటి సాయంకాలం ఆ కాలనీ దగ్గరగా ఇద్దరు మనుషుల నీడలు కనిపిస్తాయి. ఉన్నట్టుండి వసుంధరాదేవి ఇంటి కిటికీల నుంచి వెలుగు కనిపిస్తుంది. అప్పటికీ సాయిరామారావు, లక్ష్మీనారాయణ కలుసుకోలేదు. ఒకరెవరో ఇంకొకరికి తెలియదు. ఇద్దరూ ఒకరికి తెలీకుండా ఒకరు ఆ ఇంటికే వస్తున్నారు. ఇద్దరిలో ఎవరు మొదట తలుపు తడతారు? సందేహం లేదు, ఇన్స్యూరెన్సు ఏజంటు సాయిరామారావే మొదటగా డోర్‌బెల్ నొక్కేది.

“నమస్తే. నా పేరు సాయిరామారావు. మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు సారీ. మా కంపెనీ, ప్రమాదాలు జరగడంలో మనస్తత్వాల పాత్ర ఎంత అని రిసర్చ్ చేస్తున్నది. దానిలో భాగంగానే నేనిక్కడికి వచ్చాను. మీకేమీ పెద్దగా ఇబ్బంది వుండదు. మీకే ఆటంకమూ లేకుండా మిమ్మల్ని నేను గమనిస్తూ వుంటాను. మీ మనస్తత్వాన్ని అంచనా వేసుకుంటూ వుంటాను. ఇందుకు ప్రతిగా మా కంపెనీ మీకు కొన్ని పాలసీల మీద సగానికి పైగా రాయితీ ఇస్తోంది. ఇంత మంచి అవకాశం మీకు మళ్ళీ దొరకదు…

ఆ నలుగురూ నిశ్శబ్దంగా వింటారు. అప్పటికే వాళ్ళ తలల్లో ఆలోచనలు ఒక రూపు దిద్దుకుంటాయి. ఈ అవకాశాన్ని ఎవరు ఎంతలా ఎలా సొమ్ము చేసుకోగలరో ఎవరి మనసులో వారివి వ్యూహాలు రాయబడుతుంటాయి.

కాని, సాయిరామారావు అబద్ధం చెప్తుంటాడు. అతనికి ముందే తెలుసు వీళ్ళలో ఎవరు ఏం చేయబోతున్నారో. అతని దగ్గ్గర అప్పటికే ఒక నేరాల చిట్టా వుండి వుంటుంది. వీళ్ళు ఆ నేరాలు చేశారని అతను ఖాయం చేస్తే చాలు. అతనికప్పటికే తెలుసుండాలి, కొన్ని నేరాలు వరుసగా జరగబోతున్నాయని, కానీ తన కంపెనీ పైసా కూడా నష్ట పరిహారం చెల్లించక్కర్లేదని, ఎందుకంటే ఆ నలుగురూ ఒకరినొకరు చంపుకోబోతున్నారనీ. అతనికి ముందే తెలుసు. ఈ ముందుచూపు అతనికి ఒక కంప్యూటర్ రిజల్ట్ ద్వారా వచ్చి వుంటుంది. అది నేను కాదు. అంటే ఇంకో ప్రోగ్రామర్ ఒకడు ఉండుండాలి. సాయిరామారావుకి సహచరుడు. ఆ కుట్రలో భాగస్తుడు. ఆ కుట్ర ఇలా వుంటుంది:

నేరం చేయగలిగే స్వభావం ఉన్న మనుషుల వివరాలు ఒక సెర్చ్ కంపెనీ డేటా సర్వర్లలో వుంటాయి. అందులో కొన్ని లక్షలకు పైగా పేర్లు, వివరాలు వుంటాయి. ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆ వివరాలను కొనుక్కుంటుంది. ఆపైన, వారిని భయపెట్టో, నచ్చచెప్పో వారికి పాలసీలు అమ్ముతుంది. ఆ పాలసీలు అమ్మిన తర్వాత వాళ్ళు వాటి కోసం ప్రమాదాలు సృష్టించి ఒకరినొకరు చంపుకుంటారు. ఈ ప్రమాదాలలో తనకు ఉపయోగపడే సమాచారం కంపెనీ ముందే సేకరించుకొని వుంటుంది. నేరం చేసేవాళ్ళ మనస్తత్వం, వాళ్ళ అలవాట్లు, కోరికలు – ఇలాంటి వాటి వల్ల ప్రతీ నేరం ఒకేలా జరగదు. అది జరిగే తీరులో తేడాలుంటాయి. ఈ తేడాల వివరాలు కూడా నేరపు వివరాలతో కలిసి వస్తాయి. కానీ, ఈ అదనపు సమాచారం మన ధ్యాస తప్పించే జోరీగ రొద లాంటిది. ఏ రకమైన ఉపయోగమూ లేని వివరం ఇది. ఈ రొద మన దృష్టి మళ్ళించి, నిజాన్ని చూడనీయకుండా చేస్తుంది. ఈ రొదనే ఒక ముసుగులా ఇన్స్యూరెన్స్ కంపెనీ వాడుకుంటోంది. ఏ నేరానికి ఎంత రొద అవసరమో ముందే లెక్కవేయబడి వుంది. చిట్టాలో ఉన్న పన్నెండు నేరాలూ నిజంగా జరిగినవి కావు. అందులో కొన్ని ఊరికే రొద పుట్టించడం కోసం, కావాలని నిజాన్ని దాయటం కోసం, మనల్ని దారి తప్పించటానికి ఇరికించినవి.

వసుంధరాదేవి ఇల్లు తగలబడడం ఈ కుట్ర మొదటి ప్రయోగం. ఇది సక్సెస్ కాగానే సాయిరామారావు ఈ వివరాలేమీ తెలియని వేరే కంప్యూటర్ ప్రోగ్రామర్ దగ్గరికి వెళతాడు. ఇలా ప్రమాదం జరిగింది, ఇవీ దొరికిన ఆధారాలు, ఈ వివరాలతో ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోగలమా అని అడుగుతాడు. ఈ రెండో ప్రోగ్రామర్‌కి సాయిరామారావు కావలసినంత మటుకే వివరాలు ఇస్తాడు. ఆ వివరాలతో పాటు కొంచెం పనికిరాని వివరాలు, రొద, కూడా ఇస్తాడు. ఈ రొద వల్ల కంప్యూటర్ ప్రోగ్రాం చెడిపోయి ఎక్కించిన డేటా అంతా పోతుంది. పాలసీలు తీసుకున్న వారి వివరాలు మాత్రం దృష్టాంతంగా మిగిలిపోతాయి. పాలసీ చేయించిన వారి పాత్ర ఎక్కడా కనపడదు.

ఆ రెండో ప్రోగ్రామర్ని నేను. సాయిరామారావు ప్లాన్ పక్కాగా వేశాడు. ప్రోగ్రామ్ ముందే రాయబడింది. కేవలం డేటా ఎక్కించి కంప్యూటర్లో రన్ చేయడమే నేను చేసేది. నేను మార్చలేని కథను నేనే రాయక తప్పని పరిస్థితి. నన్ను నేను ప్రోగ్రాములో ఇరికించుకొని ప్రయోజనం లేదు. లక్ష్మీనారాయణ ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్ళడు. ఆ నలుగురిని ఎప్పుడూ కలుసుకోడు. వాళ్ళెవరో ఎలాంటివారో ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. తను ఊహించుకున్నట్టుగా తారామనోహరిని వలలో వేసుకునే నేరం లక్ష్మీనారాయణ చెయ్యడు. ఆ మాట కొస్తే సాయిరామారావు కూడా కంప్యూటర్లోకి ఎక్కించబడే ఒక వివరం మాత్రమేనేమో. అసలు కంప్యూటర్ ఇంకెక్కడో ఉందేమో.

కానీ, రెండు కంప్యూటర్ల మధ్య జరిగే ఆటలో ఒక కంప్యూటర్ రెండో దానికంటే బాగా ఆడినంత మాత్రాన గెలవదు. రెండోది తనకంటే బాగా ఎలా ఆడగలుగుతుందో తెలుసుకోగలగాలి. అప్పుడే గెలుపు సాధ్యం. నా కంప్యూటర్‌కి నేను ఎక్కించింది నా శత్రువు గెలిచే ఆట. నేను ఓడిపోయినట్టేనా?

ఎవరో బైట డోర్ బెల్ మోగిస్తున్నారు. బైటికి వెళ్ళి తలుపు తీసే ముందే తన ఆట నేను పసిగట్టానని తెలిస్తే సాయిరామారావు ఎలా రియాక్ట్ అవుతాడో నేను ఊహించుకోవాలి. ఎందుకా? సాయిరామారావు నాచేత కూడా అగ్నిప్రమాదం పాలసీ ఒకటి కట్టించాడు. నా చావుకి అన్ని ఏర్పాట్లు చేసే వుంటాడు. నా ఆఫీస్ తగలబెట్టేస్తాడు, తన వివరాలన్నీ మాయం చేసి, నా ఆఫీస్ నేనే తగలబెట్టి, ఆ ప్రమాదంలో చచ్చిపోయినట్టుగా వివరాలు సృష్టిస్తాడు.

ఫైరింజన్ల సైరన్ దగ్గరికొస్తూ వినిపిస్తోంది. నేనే వాళ్ళని పిలిచింది. సొరుగు లోంచి గన్ తీసుకుని సేఫ్టీ రిలీజ్ చేసి పట్టుకున్నాను. ఇక ఇప్పుడు వెళ్ళి తలుపు తెరవచ్చు.

(The burning of the abominable house, 1973.)