ఈమాట సంపాదకుల పద్ధతి

ముందు మీరొక కథ లేదా కవిత రాయదల్చుకున్నారు. రాయడం మొదలు పెట్టేముందే ఈ కథ/కవిత ఎలా చెప్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు. ఒకసారి ఆ ఫ్రేమ్‌వర్క్ మీరు తయారు చేసుకున్నాక దాన్ని పేపరు మీద పెట్టబోతారు. అప్పుడు గానీ తెలిసిరాదు, మనం చెప్దామనుకుంటున్న కథ, మనం నిజానికి చెప్తున్న కథ వేరు వేరని. కారణం, చెప్పదలచుకున్నది పూర్తిగా స్పష్టంగా మనసులో ఒక రూపు దిద్దుకొని ఉండకపోవడం.

పేపర్ రాసి చూపిస్తే బాలేదు మళ్ళీ రాయి అన్నాడు. బాలేదా? నేను రాసింది ఇంత స్పష్టంగా ఉంటే? అన్నాను. అది నీ రిసర్చ్ కాబట్టీ నీకు అలా అనిపిస్తోంది! అన్నాడు మా అడ్వైజరు. పీహెచ్డీ రోజుల్లో ఆయన దగ్గర నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలలో అది ఒకటి. ఇదే చాలామంది రచయితలకు, కనీసం తొంభైశాతానికి, చెప్తాను. కథలో ఆ విషయం స్పష్టంగానే చెప్పాను కదా? అంటారు. చెప్పలేదండీ, ఆ స్పష్టత కేవలం మీ మనసులోనే ఉంది. మీ మాటలో లేదు. మీరు చెప్దామనుకున్న కథ, మీరు రాసి నాకు పంపిన, ఇప్పుడు నేను చదువుతున్న కథ ఒకటి కావండీ, అని నా సమాధానం. నేను రాసిన పేపర్ నా కొన్నేళ్ళ పరిశోధన ఫలితం. అందువల్ల నాకు అందులో ఉన్నంత అవగాహన నా పాఠకులకు ఉండదు. అందువల్ల నేను ఏం రాసినా అది స్పష్టంగా ఉన్నట్టే నాకు తోస్తుంది. సృజనాత్మక రచన అయినా ఇదే వర్తిస్తుంది.

సంపాదకుడిగా నేను చేసే పని–నా ఎదురుగా ఉన్న ఈ ‘రాసిన కథ’ను చదివి, రచయిత ‘రాద్దామనుకున్న కథ’ను తెలుసుకోగలగటం. నా బాధ్యత మీ మనసులో కథ, మీరు నాకు పంపిన కథ ఒకటిగా ఉండేలా సరిదిద్ది ప్రచురించడం. మళ్ళీ చెప్తున్నాను. నా పని మీ కథను మార్చడం కాదు. మీ సందేశం మార్చడం కాదు. మీరు చెప్పిన కథను మీరు చెప్పదలచుకున్న కథగా పాఠకుడికి అందేలా చేయటంలో సహాయపడడం.

మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు, మీరు ఎలాంటి కథలు/కవితలు వేస్తారు?, ఎలాంటి రచనలు ప్రచురిస్తారు? అని. ఎప్పుడూ చెప్పే సమాధానం ఒక్కటే–అది కథ/కవిత అయితే వేస్తామండీ, రచన బాగుంటే చాలండీ. ఎలాంటివి వేయాలి అనే నిబంధన మాకు లేదండీ, అని. ఈ బాగుండడం అంటే ఏమిటీ అనేది వేరే చర్చ. కాని, ఈమాటలో సాహిత్యం గురించి ఎలాంటి నియమాలు కాని, నిబంధనలు కాని లేవు. వస్తువు ఏదైనా సరే, అది స్వయంపరిపూర్ణంగా ఉండాలి. అంటే ఏమిటీ?

ఎన్నిరకాల పేర్లతో పిలిచినా ఏ సృజన అయినా–కథ, కవిత, నాటకం, సినిమా, చిత్రకళ–చెప్తున్న వస్తువు ఒకటుంటుంది, చెప్పిన తీరు ఒకటి ఉంటుంది. వస్తువును అంశం అని తీరును శిల్పం అని అనచ్చు. నేను భావం, నిర్మాణత అని పిలుస్తాను నా స్పష్టత కోసం. ఒక సృజనను మెచ్చుకోవాలంటే అది సహజమైనదే కానక్కర్లేదు. ఉదా: స్టార్ వార్స్ వంటి కల్పనాత్మక చిత్రం తీసుకోండి. విశ్వాంతరాళంలో గ్రహాల మధ్య జరిగే యుద్ధాలు ఆ సినిమా వస్తువు. అది ఆలోచన. అది భావం. ఇక, ఆ సినిమా బాగోగులు చర్చించాలి అంటే ముందు ఆ కథ చేస్తున్న కొన్ని ప్రతిపాదనలు మనం ఒప్పుకోవాలి. లైట్ స్పీడ్‌లో గలాక్టిక్ ప్రయాణాలు, లైట్ సేబర్లు వంటివి సాధ్యం అని. ఆపైనే కదా ఎంత పకడ్బందీగా కథను చిత్రీకరించారు? అన్నది ముఖ్యంగా మనం విశ్లేషించేది. నిర్మాణత అనుకుందాం దీన్ని. పోనీ స్ట్రక్చరాలిటీ అనండి తెలుగులో. అంటే ముందే ఒప్పుకోవాల్సిన లక్షణాలు ఎంత ఊహాత్మకమూ తర్కరహితమూ అయినా, ఎలాంటివైనా కూడానూ, వాటిని ఆధారంగా చేసుకున్నాక వాటిమధ్య ఒక తర్కబద్ధమైన సంబంధం మాత్రమే ఉంటుంది అని మనం గమనించాలి. (తర్కబద్ధం అంటే మన భౌతికప్రపంచపు నియమాలే కావు, మానవప్రపంచపు స్వభావాలు కూడా.) ఎలాంటి ఊహాలోకాల పునాదుల మీద సృజించబడిన ఏ కళాకృతి అయినా నిర్మించబడినాక ఈ తర్కబద్ధసంబంధాన్ని తప్పించుకొని మాత్రం మనలేదు. ఉదా. ఐన్ రాండ్ అంటుంది కదా షేక్‌స్పియర్ నాటకాలు చదివేముందు జీవితం విషాదాంతం అని మనం నమ్మాలి. అలా నమ్మితేనే ఆ నాటకాలు మనకు అర్థవంతంగా అనిపిస్తాయి, అని. అలా ప్రతీ సృజనకి ఒక సందర్భం (అది చేస్తున్న కొన్ని ప్రతిపాదనలు) ఒక పరిధి (మనం ముందే ఒప్పుకొన్న ఆ ప్రతిపాదనలు) ఉంటాయి. ఆ రచన విలువను ఆ పరిధిలో పరిశీలించాలి. సృజనకు వెలుపల ఆ సృజనకు ఏ ఆధారమూ ఉండకూడదని నేను బలంగా నమ్ముతాను. ఇదే అది. స్వయంపరిపూర్ణత. An art form that is internally consistent and, inherently complete. చూడటానికి ఎంత అందంగా కట్టిన భవంతి అయినా నిర్మాణత సరిగ్గా లేకుంటే కూలిపోతుంది. అలా అని గట్టిగా ఉండాలని ఇల్లును జైలులా ఒక నాలుగు గోడలుగా మాత్రమే కట్టుకోం కదా. రచన కూడా అంతే. (చివరికి బ్రూటలిస్ట్ ఆర్కిటెక్చర్‍లోనూ ఎంతోకొంత అందమూ, సౌష్టవమూ ఉంటాయి.)

ఇలా భావం బలంగా, నిర్మాణత పటిష్టంగా–అంటే చెప్పదలచుకున్నది స్పష్టంగా లోతుగా రూపు దిద్దుకొని, చెప్పినతీరు ఆసక్తికరంగా కొత్తగా–ఉండి, చదివించేలా ఉన్న రచనలు పదికాలాలు నిలుస్తాయి, పదిమంది చదివేలా చేస్తాయి. ఈ భావమూ నిర్మాణతా కట్టుదిట్టంగా కలిస్తే వచ్చే అందం, అదే నాణ్యత అంటే. అది గుర్తించడమే కదా పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ. రసజ్ఞత అంటే అదే కదా. ముఖ్యంగా గమనించాల్సింది ఇది అపేక్షకం. అంటే మీ వైయక్తిక అభిరుచి ఇక్కడ పనికిరాదు. భావం మీకు నచ్చకపోయినా నిర్మాణత ఔన్నత్యాన్ని మీరు కాదనలేరు. లేదూ, నిర్మాణత లోపించినా భావపటిమను తీసివేయలేరు. ఆ తర్వాత మీరు చేసే విమర్శ ఆ భావంపై మీ అభిప్రాయం, లేదా మీ తాత్విక దృక్పథం వల్ల వచ్చేదే కానీ ఆ సృజనలో లోపం వల్ల కాదు. (కథను రాసుకునేది పాఠకుడే, ఆథర్ ఈజ్ డెడ్ లాంటి ప్రతిపాదనలు పూర్తిగా నిజం కాదనే నా అభిప్రాయం. కాని వాటిని గురించి ఇక్కడ చర్చించలేను. కాని, వస్తువు స్పష్టంగా, నిర్మాణత కట్టుదిట్టంగా ఉన్న కథ రకరకాల అర్థాలకు తావివ్వదు. రంగస్థలం ఏదైనా కావచ్చు కాని నాటకం ఒకటే అయినట్టు, పాఠకులు దానిని తమ స్వానుభవాల అద్దాలనుంచి చూసినా ఎటువంటి నేపథ్యంలో ప్రతిష్టించుకున్నా మూలకథ మాత్రం మారదు అని చెప్పగలను.) అలా కాక, కథలో రచయిత చెప్పినదేదో చదవకుండా, ఒక రచనను ఆసాంతం పరిశీలించకుండా, ఒక కవితలో మీకు నచ్చిన ఏ రెండు వాక్యాలో విడదీసి కోట్ చేసి ఎంత గొప్ప భావనో అనడం; కథా వస్తువో, భాషాడంబరమో, కథలోని ఒక సంఘటన, ఒక వాక్యం నచ్చి కథ బాగుంది అనడం కేవలం చదవడంలో లోపం.

అదలా ఉంచి, నిర్మాణత సరిగా లేని భావం చప్పున ఆకట్టుకోదు. కానీ భావలేమి ఉన్నా పటిష్టమైన నిర్మాణం మిమ్మలని ఆగి చూసేలా చేస్తుంది. ముందు చెప్పినట్టు సాహిత్యం మిమ్మల్ని ముందు చదివించగలగాలి. క్లుప్తంగా చెప్పాలంటే కొన్నిసార్లు భావం బలహీనంగా ఉన్నా నిర్మాణతలో పటిష్టత ఆ భావానికి ఊతాన్నిస్తుంది. ఛందస్సు పద్యానికి చేసే పని అదే. సాహిత్యం బాలేకున్నా చక్కగా రాగం కట్టిన పాట మనల్ని మెప్పిస్తుంది కదా. కథ ఏమీ లేకున్నా, పాతకథే అయినా సినిమా తీసిన పద్ధతి వల్ల మనం ఆనందిస్తాం కదా. ఐతే ఈ నిర్మాణత సహాయపడుతుందే కానీ భావలేమిని పూరించలేదు. భావం లేని నిర్మాణత అప్పటికప్పుడు ఆసక్తి రేపినా అది తాత్కాలికమే. ఒక ఏక్షన్ థ్రిల్లర్ మీరు చూసినంత సేపో చదివినంత సేపో ఉత్కంఠ ఉంటుంది. నిర్మాణత ఎంత పకడ్బందీగా ఉంటే అంత ఉత్కంఠ. కానీ, ఒక క్లాసిక్ కావాలంటే, సాహిత్యం పదికాలాలు నిలవాలంటే, ఈ మాత్రం సరిపోదు. ప్రతీదీ క్లాసిక్ కాలేదు కాబట్టే, దాని ఆశయమూ అది కాకపోయుండడం వల్ల, కనీసం అప్పటికప్పుడైనా ఆసక్తి రేపుతుంది కాబట్టే ప్రెజెంటేషన్–అంటే కథ, కవిత ఎలా చెప్తున్నారు? చదివించగలుగుతున్నారా? అన్నది ముఖ్యమైన విషయం అవుతుంది.

అదే సమయంలో చదివించే గుణం అంటే వాక్యం సరిగ్గా రాయడం అని మాత్రమే కాదు. అది మాత్రమే ఐతే ఆ ప్రతిభ ఎందరికో ఉంది. వాక్యానికున్న బలమే కథకున్న బలం అనే నమ్మకం తప్పు. శబ్దగాంభీర్యం భావగాంభీర్యం కాదు అని కొంత కాలానికి అర్థమైపోతుంది. మొదట్లో ఈ రచన నచ్చింది వాక్యశైలి వల్ల, అది దాటి చూస్తే అసలు రచన పేలవమైనదని ఆ రచన నిజమైన విలువ తెలుస్తుంది. అంటే శైలి ఎంత బాగున్నా దానిని దాటుకుని అసలు కథ విలువను గుర్తిస్తాం. నిజానికి చక్కటి వాక్యం చేసే ఏకైక సహాయం అది. దాని కర్తవ్యం అది. అది తను అదృశ్యమైపోయి అసలు కథను, చర్చకు తెస్తుంది. పాఠకుడు కథను, పాత్రలను, సంఘటనలను నిజజీవితంలోవిగా చర్చిస్తాడు. కేవలం వచనాన్ని పొగిడి ఊరుకోడు. యజ్ఞం, మిథునం వంటివాటిని కేవలం వాక్యం చూసి మనం గొప్ప కథలనలేదు. అలా వాక్యం రాయడం సులభం కాదు. పరిశ్రమ కావాలి. పరిష్కరణ కావాలి. అలా అని వర్ణనాత్మక వాక్యం కూడదనీ కాదు. దాని సందర్భం దానికి ఉంటుంది. ప్రతీదీ ఒకే గొంతులో చెప్పడం వార్తలు చదివేవారికి నప్పుతుంది కాని నటులకు కాదు. రచయితలకూ ఇదే వర్తిస్తుంది. కథను బట్టి వాక్యం ఉంటుంది.

కథాంశం మీకు నచ్చకపోవచ్చు, ఆహ్లాదాన్ని కలిగించవచ్చు లేదా జుగుప్సనో ఏహ్యతనో కలిగించనూ వచ్చు. అలా అని అది చెత్త కథ కాలేదు. మీకు నచ్చనిది మాత్రం అవుతుంది. కథాంశం మీకు నచ్చినది కావచ్చు. అంత మాత్రాన అది గొప్ప కథ కాలేదు. అది వైయక్తికం. ఈ పరిధికావలగా కథను, కథాంశాన్ని, కథనాన్నీ–భావాన్నీ నిర్మాణతనూ – లేదా వస్తువునూ తీరునూ–అవన్నీ కలిసి కూడి రూపు తెచ్చుకున్న పద్ధతినీ పరిశీలిస్తే కానీ కథను సద్విమర్శ చేయలేం. సాహిత్యాన్ని అలా మన పరిధులకు వెలుపలగా చూడాలి. చదవడం అంటే ఇదే. సాహిత్యాన్ని చదివే ఏకైక పద్ధతి ఇదే. ఇంకో రకంగా చదవడం అనేది లేదు. పాఠకుడిగా చదవడం, విమర్శకుడిగా చదవడం అనేవి లేవు. ఉన్నది ఒకటే పద్ధతి. సంపాదకులైనా, పాఠకులైనా ఎవరైనా సరే — మన ఇష్టాయిష్టాలకు వెలుపలగా సాహిత్యాన్ని చూడాలి అనే ఇదంతానూ. మననుంచి బైటికి వచ్చి మన ఇష్టాయిష్టాలకు ఆవలగా ఏ రచననైనా దాని సందర్భం, పరిధుల్లోనే చదవాలి పరిశీలించాలి. దాని గొప్పతనాన్ని అలానే బేరీజు వేయాలి. (ఆ కథలోని వస్తువు ఏదైనా సరే, అది సమాజానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా, అభ్యుదయమా, సంప్రదాయకమా, లాంటి చర్చలు సాహిత్యావరణానికి ఆవలగా జరిగే రాజకీయ చర్చలు. వాటితో సాహిత్య నాణ్యతకు సంబంధం లేదు.)

అందువల్ల, ప్రత్యేకించి ఒక సంపాదకుడికి, కథ కవిత వ్యాసం దేనిగురించి అనేది ఇంచుమించు పూర్తిగా అనవసరం. సాహిత్యం మీ ప్రధాన ఉద్దేశ్యమైనప్పుడు భాష గురించి కాని, భావం గురించి కాని, అభిప్రాయం పట్ల గాని, వస్తువు గురించి గాని పట్టింపు ఉండకూడదు. కొన్నిరకాల మాటలు, కొన్ని రకాల అంశాలు సాహిత్యానికి పనికిరావు వంటి నమ్మకాలు, సాహిత్యేతర వాదాభిప్రాయాలు పనికిరావు. సంపాదకుడిగా నేను, వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా, ఒక కథ కానీ కవిత, వ్యాసం కానీ చదివిస్తున్నదా అనే చూస్తాను మొదట. ఎందుకంటే సాహిత్యం చేయాల్సిన మొట్టమొదటి పని చదివించడం. అది చేయలేనిది సాహిత్యం ఎలా అవుతుంది?

ఇదిగో ఇక్కడే సంపాదకుడి అవసరం వస్తుంది ఏ రచయితకైనా.

అయితే, సంపాదకుడు ఎక్కడ ఆగిపోవాలి? ఎక్కడిదాకా చొచ్చుకుపోవాలి? సంపాదకుల అధికారాలూ బాధ్యతలూ ఏమిటి?

మూడు ఉదాహరణలు చెప్తాను సంపాదకుల గురించి. 1. హార్పర్ లీ (Harper Lee) రాసిన టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ 2. జేన్ ఆస్టిన్ (Jane Austin) రాసిన ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీ 3. ఆన్రి షరియేర్ (Henri Charrière) రాసిన పపియాఁ (Papillon).

  1. హార్పర్ లీ మొదట 1960లో రాసిన పుస్తకం తర్వాత, 2015లో గో సెట్ ఎ వాచ్‌మన్ అని ఆ పుస్తకపు మొదటి ప్రతి అచ్చయేదాకా మొదటి పుస్తకంలో మనం చూసిన ఆటికస్ ఫించ్ నిజానికి ఎలాంటివాడో తెలుస్తుంది. రేసిస్ట్ అయిన ఆటికస్ అలా కనిపించకపోడానికి కారణం టే హాహాఫ్ (Tay Hohoff). హార్పర్ లీ ఎడిటర్. చాలా ఆధిపత్యం ప్రదర్శించేది, డెల్బాన్కో అనే రచయిత పుస్తకాన్ని 500 పేజీల నుంచి 200 పేజీలకు కోసేసింది. (దానికాయన ఆమెకు జీవితాంతం రుణపడివున్నానని చెప్పుకొనేవాడనుకోండి, అది వేరే సంగతి.) న్యూయార్క్ టైమ్స్‌లో వ్యాసం ఆధారంగా తెలుసుకున్నదిది. హార్పర్ లీకి, టే హాహాఫ్‌కీ మధ్య చాలా గాఢమైన అనుబంధం ఉంది. టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ ఒక గొప్ప పుస్తకం కావడానికి టే తోడ్పాటు ఎంతో ఉంది. అవన్నీ మంచి విషయాలే అయినా, లీ ఫించ్‌ను చూపించదలచుకున్నట్టుగా కాక, ఒక మంచివ్యక్తిగా మార్చడం అనేది ఎలా అర్థంచేసుకోవాలి? రచయిత కథను సంపాదకుడు మార్చివేయడం కాదా ఇది? ఇదొక చర్చనీయాంశం.
  2. (ఈ రకమైన ఆధిపత్య సంపాదక ధోరణి ప్రస్తుతం తెలుగులో ఊహకు కూడా అందదు. అది వేరే విషయం. ఇంకొకటి, మన సాహిత్య ప్రపంచం ఆర్థికసామ్రాజ్యం కాదు. అందులో డబ్బు లేదు. అందువల్ల ఇది ఒక అభిలాష, ఒక హాబీ లాంటిదే. అందుకని ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించడం నప్పదు అనేమాట నేను ఒప్పుకోను. మంచి సాహిత్యం రావాలి అంటే డబ్బు ఉన్నా లేకున్నా మంచి ప్రమాణాలు, ఆచరణ పద్ధతులు ఉండాల్సిందే. తెలుగులో నేను కవిని అంటే ఎవరూ కాదనరు. కనీసం సాటి కవులయినా ఎవరు ఎందుకు కవో ఎవరు ఎందుకు కాదో చెప్పగలగాలి. అది జరగదు కాని, అప్పుడప్పుడూ నేను పగటికలలు కంటుంటాను.)

  3. అలానే, జేన్ ఆస్టిన్ రాసిన నవలల్లోని భాష ఆమెది కాదు. కేథరిన్ సదర్‌లండ్ (Kathryn Sutherland) అనే ఒక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆమె వ్రాతప్రతులను పరిశీలిస్తే కనిపించినవి వ్యాకరణ దోషాలు, విరామచిహ్నాలు ఏమీ లేకపోవడం, పదాల స్పెలింగ్ తప్పులూ. అసలు విషయం ఏమిటంటే ఏ వాక్యనిర్మాణానికి జేన్ ఆస్టిన్ గొప్ప పేరు తెచ్చుకుందో అది ఆమెది కాకపోవడం. విలియమ్ గిఫర్డ్ అన్న ఎడిటర్ జేన్ ఆస్టిన్ రచనలను ప్రచురణ కోసం దిద్ది పెట్టాడు. మనం చదివి మెచ్చుకున్న జేన్ ఆస్టిన్ వాక్యం గిఫర్డ్ రాసినది. ఆస్టిన్‌ది కాదు. ఇది ఎన్పీఆర్‌లోనూ ఇంకొన్ని పత్రికలద్వారానూ తెలుసుకున్నది. ఇక్కడ జేన్ ఆస్టిన్ చెప్పదలచుకున్న కథ మారలేదు కాని ఆమెదైన భాష కాకుండా పోయింది. మనం విన్నది రచయిత గొంతేనా? ఈ రకమైన పరిష్కరణ మొదటి ఉదా అంత తీవ్రమైనది కాదు. ఇదీ కొంత చర్చనీయాంశమే.
  4. చివరిగా, ఆన్రీ షెరియేర్ రాసిన పపియాఁ అన్న పుస్తకం. షెరియేర్ పెద్దగా చదువుకోలేదు. చేయని నేరానికి జైలుకెళ్ళాడు. ఫ్రెంచ్ గియానాలోని డెవిల్స్ ఐలండ్‌లో 14ఏళ్ళ జైలు జీవితం. నవలగా రాశాడు. ఇతర వివాదాలు అలా ఉంచి, తను రాసిన భాష బాగా పామరుల భాష. మొరటు భాష. ఎంతోమంది ప్రచురణకర్తలు తిప్పికొట్టారు. చివరికి ఆ పుస్తకాన్ని ప్రచురించిన లఫాఁట్ సంస్థ సంపాదకులు చేసిన పని ఏమిటీ? షెరియేర్ రాసిన భాషలోని సహజత్వాన్ని గుర్తించి ఏమీ మార్చకుండా పుస్తకాన్ని అలానే ప్రచురించారు. ఇది నా కాపీలోని ముందుమాటలో చదివిన విషయం. ఇక ఆ పుస్తకం ఎంత పేరు తెచ్చుకుందో మీకు తెలుసు.

అందువల్ల సంపాదకుడు అంటే ప్రతీ రచనను ఎలా పరిష్కరించాలో అనే కాక ఎంత పరిష్కరించాలీ అనేది తెలుసుకొని ఉండాలి. చాలా కొద్ది రచనలు, కనీసం కామా కూడా దిద్దలేనంత పటిష్టంగా ఉంటాయి. మరికొన్ని పూర్తి కథనే తిరగరాయాల్సి వస్తుంది. ఇందులో తప్పేమీ లేదు. రచయితను తక్కువచేయడమూ లేదు. రచయిత ఊహ మంచిదే కాని దానికి సరితగ్గ రూపం ఇవ్వలేకపోయినప్పుడు ఇది తప్పనిసరి అవుతుంది. పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు ఆంధ్రజ్యోతి పత్రికకు సంపాదకులుగా ఉన్నప్పుడు ఇలా పూర్తిగా తిరగరాసి ప్రచురించిన కథలున్నాయని విన్నాను. ఆ అనుభవం కాస్త మాకూ ఉంది ఈమాటలో.

ఐతే, ఏ దుర్ముహూర్తాన శ్రీశ్రీ సంపాదకుడంటే నాకింపారెడు భక్తి కలదు అని వెటకరించాడో, అది ఆయన సరదాకన్నాడో, అనుభవమయ్యే అన్నాడో కాకుండానే అన్నాడో కాని, అది పట్టుకుని కర్రసాము చేయడం ఒక అలవాటయింది కవులకూ రచయితలకూ. అసలే సాహిత్య విమర్శ మనకు మృగ్యం. అలాంటప్పుడు నేను రాసింది దిద్దడానికి నువ్వెవరు అనడం రానురానూ ఏ విమర్శనూ తీసుకోలేకపోవడానికి దారితీసింది. మొదలే సాహిత్య వ్యాసంగం ఏ రకమైన ఆదాయానికీ నోచుకోక కేవలం ఒక అభిరుచిగా మాత్రమే మిగిలిపోయింది. దీనికి తోడు చాలామందికి సాహిత్య సృజన పట్ల ఉన్న ఊహలూ అపోహలూ, తమపట్ల తమకున్న అహాలూ, అహంభావాలూ. నిజంగా సాహిత్యానికి ఇవ్వవల్సినంత గౌరవం ఇస్తున్నామా? ఉపాధి ఇవ్వకున్నా, ఇచ్చే ఉద్యోగం అంత శ్రద్ధగా సాహిత్యవ్యాసంగాన్ని నిర్వహిస్తున్నామా? అన్నవి కవిరచయితలందరూ తమకుతాము వేసుకోవల్సిన ప్రశ్నలు. ఎవరూ వేసుకోవడం లేని ప్రశ్నలు. అందుకే ప్రస్తుతం తెలుగు సాహిత్యరంగంలో కవి కూటములు, రచయితల సంఘాలు ఉన్నాయి. ఎందరో కవిరచయితలకు సాహిత్య వ్యాసంగం తమ సాంఘిక సభ్యత్వానికి ప్రవేశరుసుము లాంటి ఒక అవసరం. అందుకే ఇప్పుడు ఒకరి వీపు ఒకరు చరుచుకోటానికి మాత్రమే సమీక్షలు, ముందుమాటలు ఉన్నాయి. ఇక ఇప్పుడు వాటిని సమీక్షలు అనడం మానేసి పుస్తక పరిచయాలు అనేసి సరిపెట్టుకుంటున్నారు. పొరపాటున ఎవరైనా మీ కథ బాలేదు అంటే రచయితే స్వయానా వచ్చి సోషల్ మీడియాలో తన కథ ఎందుకు గొప్పదో, అందులో తానేం చెప్పాడో వాదించి మరీ ఒప్పిస్తున్నారు. ఇవన్నీ మాకు స్వానుభవాలే.

ఇదీ పరిస్థితి. కానీ ఇదే పరిస్థితి కాదు. ఇప్పటికీ ఎక్కువగా ఇదే చలామణీ అవుతున్నా, సాహిత్యాన్ని శ్రద్ధతో గౌరవంతో సమీపించే రచయితలకు ఒకప్పుడు లేని వేదిక ఇంటర్నెట్ ఇచ్చింది. అంటే రచయితకూ సంపాదకుడికీ మధ్య ఒక సంభాషణకు తావిచ్చింది. ఇది తెలుగు సాహిత్యవాతావరణానికి ఇది గొప్ప వరం లాంటిది. అచ్చు పత్రికలలో లాగా కాకుండా- అంటే పత్రిక చేతికొచ్చినాక మాత్రమే తన కథ ఎలా అచ్చయిందో చూసుకొనే స్థితి–వెబ్ పత్రికల సంపాదకులు రచయితకు వారి రచనను ముందే చూపించవచ్చు. ఇదిగో మీ రచన అచ్చులో ఇలా వస్తోంది అని ప్రివ్యూ చూపించవచ్చు. అంటే వ్యాసాన్ని తప్పులు దిద్ది, బొమ్మలు గట్రా పెట్టి ముస్తాబు చేసి చూపడం ఒకటి. అక్కడిదాకా రావడంలో రచనను సంపాదకులు ఎలా పరిష్కరించారో చూపించడం రెండవది. ఈ కారణాల వల్ల ఈ కథను, ఈ కవితను ఇలా పరిష్కరించాం అని సంపాదకులు, ఆ మార్పులు నచ్చినా నచ్చకున్నా తన అభిప్రాయాలు వెంటనే చెప్తూ కవులు రచయితలు, ఇలా విస్తృతంగా చర్చించుకుని ఒక రచనను ప్రచురించడంలో కలిసి పనిచేయడం అనేది ఇప్పుడు సాధ్యమయింది. ఆధిపత్యధోరణి లేకుండా సంపాదకులు, విమర్శ ఎంత నిక్కచ్చిగా ఉన్నా తీసుకొనే ధోరణిలో రచయితలు కలిసి పనిచేయాలి. సంపాదకుడు, విమర్శ అంటే నాది నీది అన్న ధోరణి కాక, ఇద్దరి ఆశయమూ ఒకటే. అది రచన మెరుగుపడడం కోసం కృషి చేయడం అన్న భావన ఇలా కలిసి పనిచేసినప్పుడు రచయితలకు వస్తుంది. అది సంపాదకులు, సమీక్షలు, మార్పులు, పరిష్కరణ అనేవాటి గురించే కాక రచనావ్యాసంగం, సృజన, అభివ్యక్తి వంటి వాటిపట్ల రచయితలకు ఉన్న అపోహలనూ పోగొడుతుంది. అలా ప్రయత్నం, ప్రయాసతో పరిష్కరించబడిన రచన ప్రచురించినప్పుడు వచ్చే సంతృప్తి మాత్రమే కాదు, సాహిత్యం పట్ల వారికున్న గౌరవం, నిబద్ధత, అవి ఉండడంలోని అవసరం, రచయితలకు స్పష్టమవుతాయి. నేను ఊహించి చెప్పటంలేదు. అనుభవం నుంచి చెప్తున్నాను. ఇలా ఎందరో రచయితలతో కలిసి పనిచేసి వారికి నేర్పించినవీ ఉన్నాయి, వారినుంచి నేర్చుకున్నవీ మరిన్ని ఉన్నాయి. తెలుగు సాహిత్యం ఉన్నత ప్రమాణాలు అందుకోవాలి అంటే ఈ సమష్టి కృషి తప్పదు. ఈ కృషిలో పైన చెప్పిన ఉదాహరణలనుంచి ఎంత వరకూ పరిష్కరణ సబబు అన్నది ఆ రచనను బట్టి ఆధారపడి ఉంటుంది.

ఇదీ మా నమ్మకం, ఇదీ ఈమాటలో మేము పాటించే పద్ధతి.

[డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (DTLC) ఇరవై ఏళ్ళ పండగ (సెప్టెంబర్ 29-30, 2018) సందర్భంగా ఇచ్చిన ప్రసంగపాఠం కొన్ని మార్పులూ చేర్పులతో.]