కాల్వీనో కథల నుంచి – 2

1. నిత్యావసరం

అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊళ్ళో అన్నింటి పైనా నిషేధం ఉండేది.

అలా నిషేధం లేకుండా ఉన్నది పిచ్చుంగుంటలు ఆట ఒక్కటే. మరి, నిషేధం లేనిది ఆ ఒక్క ఆటపైనే కాబట్టి ఊళ్ళో వాళ్ళంతా కూడళ్ళలోనూ, చావిళ్ళలోనూ, చెరువు గట్ల మీదా, చింత తోపులో చెట్ల కిందా గుమిగూడిపోయి పిచ్చుంగుంటలు ఆడుకుంటూ రోజులని గడిపేస్తూ వుండేవాళ్ళు.

నిజానికి అన్నింటి మీదా నిషేధం అదాటున ఒకేసారిగా అలా ఏమీ రాలేదు. కాలక్రమేణా ఒక్కొక్క దానిపైనా నిషేధం అమలవుతూ వచ్చింది. ఆ ఊరి ప్రభుత్వపు పెద్దలు, సైన్యాధ్యక్షులు ఒకసారికి కేవలం ఒకే ఒకదాన్ని నిషేధించడం, అలా నిషేధించడానికి ఒక మంచి కారణం ఉందని చూపించడంతో ఫిర్యాదులంటూ ఎవరూ చేయలేదు. చేయడానికి కారణం కూడా ఏమీ అంతగా కనిపించలేదు. పెద్దగా ఇబ్బంది పడకుండానే ఒక్కో నిషేధానికి క్రమంగా అలవాటు పడిపోతూ వచ్చారలా ఆ ఊరివాళ్ళు.

కొన్నేండ్లు అలా గడిచినై. ఆ ఊరి ప్రభుత్వపు పెద్దలకు ఉన్నట్టుండి ఒక రోజు, ఇలా అన్నింటి మీదా నిషేధం ఉండాల్సిన అవసరమేమీ ఇక అనిపించలేదు. వెంటనే సైనికులని పిలిచి ఊరు ఊరంతా చాటింపు వేయించమని ఆజ్ఞాపించారు. సైనికులు అలానే దండోరాగాళ్ళని వెంటేసుకొని కూడళ్ళకీ, చావిళ్ళకీ, చెరువు గట్లపైకీ, ఊరి దాపుల్లో ఉన్న చెట్ల తోపుల్లోకీ వెళ్ళి మరీ చాటించారు – “ప్రజలారా! బహు పరాక్! బహు పరాక్! మన ఊళ్ళో ఇప్పుడు దేని మీద కూడా నిషేధం లేదు. అందువల్ల, మీరు మీకిష్టమొచ్చిన దేదైనా సరే స్వేచ్ఛగా చేయచ్చు!” అనేసి.

ఊళ్ళోవాళ్ళు వాళ్ళ మానాన వాళ్ళు పిచ్చుంగుంటలు ఆడుకుంటూనే వున్నారు.

“మీకు అర్థం కావటం లేదా? నిషేధాలన్నీ పెద్దలు ఎత్తేశారు. ఇప్పుడు మీ మీద ఏ ఆంక్షలూ లేవు. మీకిష్ఠమొచ్చింది, అది ఏదైనా సరే స్వేచ్ఛగా మీరు చేయచ్చు,” అని సైనికులు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పారు. మరింత గట్టిగా టముకు కొట్టించారు, మరిన్ని సార్లు చాటింపేయించారు.

“సరే!” అన్నారు ఊళ్ళోవాళ్ళు, “మేము స్వేచ్ఛగా పిచ్చుంగుంటలు ఆడుకుంటున్నాం.”

వాళ్ళకి అర్థమయేట్టుగా చెప్పాల్సిన బాధ్యత సైనికులకే అప్పగించారు పెద్దలు. సైనికులు ఊళ్ళోవాళ్ళకి రకరకాలుగా నచ్చచెప్పారు. నిషేధాలు లేకముందు ఊళ్ళోవాళ్ళు ఎన్ని రకరకాలైన పనులు చేసేవాళ్ళో, ఎన్ని రకరకాలైన వ్యాపకాల్లో ఉండేవాళ్ళో, ఎన్ని ఆటలు ఆడేవాళ్ళో, పాటలు పాడేవాళ్ళో ఊరిస్తూ గుర్తు చేశారు. మళ్ళీ ఆ వ్యాపకాలన్నీ మొదలెడితే ఎంత బాగుంటుందో మరీ మరీ వర్ణించారు. ఊళ్ళోవాళ్ళు కనీసం అటు కాలు ఇటు ముడవకుండా, అటు చూపు ఇటు తిప్పకుండా, ఊపిరి సలపనీకుండా పిచ్చుంగుంటలు ఆడుతూనే ఉన్నారు.

తమ ప్రయత్నాలన్నీ అలా వమ్ముకావడంతో సైనికులు ఊరి పెద్దలు, సైన్యాధ్యక్షుల దగ్గరికెళ్ళి మొర పెట్టుకున్నారు, “అయ్యల్లారా! మేమెంత చెప్పినా ఊళ్ళోవాళ్ళంతా పిచ్చుంగుంటలు ఆడుతునే వున్నారు” అని.

“ఓస్, అంతేనా!” అన్నారు పెద్దలంతా. “ఇదేమంత కష్టమైంది కాదు. పిచ్చుంగుంటలు నిషేధిస్తే సరి!”

అది జరిగిన మరుక్షణం ఆ ఊళ్ళోవాళ్ళంతా ఒక పెద్ద విప్లవం లేవదీసి ఆ పెద్దలనందరినీ చంపేశారు. ఆ తర్వాత, కాలయాపన కాకుండా వెంటనే తిరిగి పిచ్చుంగుంటలు ఆడుకోడం మొదలు పెట్టారు.

(మూలం: Making Do, 1943.)

2. అంతరాత్మ

పక్క దేశంతో యుద్ధఁవొచ్చింది. వలంటిరీగా వచ్చేసి సైన్యంలో చేరిపొమ్మంటూ అప్పల్నర్సిమ్మడికి కబురొచ్చింది. ఊళ్ళో అందరూ అప్పల్నర్సిమ్మన్ని తెగ పొగిడేరు.

వాడు నేరుగా కంటోన్మెంటు కెళ్ళిపోయేడు. అక్కడ వీడిలాంటి వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి సైన్యాధికారులు వాళ్ళకి రైఫిళ్ళిస్తున్నారు. అప్పల్నర్సిమ్మడు కూడా ఒక రైఫిల్ పుచ్చుకున్నాడు.

“ఇగ జూస్కోండి. నేను ఎట్టయితేనేఁ, ఆ ఖదీరుగాణ్ణి దొరకబుచ్చుకుని సంపేయకపోతే!” అన్నాడు.

ఖదీరుగాడెవడేమిటని వాళ్ళడిగేరు. “ఇరోది” చెప్పేడు అప్పల్నర్సిమ్మడు. ” ఆడు నా పగోడండి.”

వాళ్ళు వివరించేరు – వీడికి రైఫిలిచ్చింది కేవలం ఒక ప్రత్యేకమైన రకం శత్రువులను చంపడానికే అని, వీడిష్టమొచ్చినట్లు ఎవర్ని పడితే వాళ్ళని కాల్చేయకూడదనీ. నర్సిమ్మడిలా అన్నాడు.

“నానేటి మొద్దు మొగాన్ననుకురేటండీ? నాకామాత్రం తెలీదేటండీ? ఈ ఖదీరుగాడు అచ్చం మీరు సెప్పే టైపు సత్రువేనండి. ఈడు ఆళ్ళలోడేనండి. మీరాలమీద యుద్దానికెల్తున్నారని తెలీగానే నాననుకున్నానండి. నానూ తగూలోకి బోయి ఖదీరుగాడు దొరగ్గానే ఆన్ని సంపేయాలని. మీకు తెల్దుగాని ఆడు నాకు బాగ తెల్సండి. ఆ ఖదీరుగాడు మాఁవూలోడు కాడండి. పరఁవ నికృష్టపు నాకొడుకండి ఆడు. ఏటికి నేదండీ, ఉత్తి పున్నేనికే ఆడ్నన్ను మోసం జేసేడండి. ఒకాడదాని ముందు నా పరువు దీసేసేడండి. దానిముందు నన్నెందుకు కొరగానోన్ని సేసేడండి. ఇంకా శానా అన్నేయాలు జేసేడండి. అబ్బో, ఈ కతిప్పడిది గాదునెండి. అవినా సరే, ఆణ్ణి మాత్రం నేనొదల్నండి. నామీద నమ్మకం నేకపోతే సెప్పండి, మీకు జరిగిందంతా ఇవరంగా సత్తెప్రెమానికంగా సెబుతానండి.”

“అఖ్ఖర్లేదఖ్ఖర్లేదు. నువ్వేమీ మాకిప్పుడు ఈ కథలన్నీ చెప్పఖ్ఖర్లేదు”

“మరిహనేఁ, ఆ ఖదీరుగాడెక్కడ దాక్కున్నాడో సెప్పండి. ఆతట్టుకే ఎల్లి కలబడతా.”

“వాడెక్కడున్నాడో మాకు తెలియదు.”

“మరేటి పర్నేదు నేండి. ఆడి ఇవరం తెల్సినోడు ఎవడో ఒకడు సెప్పడేంటి. ఈపాలి కాకపోతే ఇంకోపాలి, ఆడ్ని దొరికించుకుంటాన్లెండి.”

అధికారులు అలా కుదరదన్నారు. వాళ్ళెక్కడికి పంపిస్తే అక్కడికే పోయి యుద్ధం చేయాలని, అక్కడ ఎవరుంటే వాళ్ళనే కాల్చాలనీ చెప్పేరు. ఖదీరుగాడెవడో వాళ్ళకి తెలీదని ఇంకోసారి చెప్పేరు.

“మీకర్థం గావట్నేదేటండీ?” పట్టు వదల్లేదు అప్పల్నర్సిమ్మడు. “ఆడు నిజెంగా పెద్ద నికృష్టుడండీ బాబూ. ఆడి మీద యుద్ధానికెల్లి మీరు మంచి పనే జేస్తన్నారండి. నామాటినుకోండి. ఇహిట్టయితే మీకాడి కత జెప్పాల్సిందేనండి మరి.”

అధికారులకెవరూ వినమని చెప్పేరు. వాళ్ళకిదంతా అనవసరమని నిక్కచ్చిగానే అనేసేరు. అప్పల్నర్సిమ్మడికి ఇందులో తర్కం బోధపడలేదు.

“సూడండి బాబులూ. మీకేఁవో నానెవర్ని సంపినా పర్నేదు. నాకు మాత్రం ఖదీరుగాడే గావాల. ఆడికి బదులు, ఆడికేవిటికీ సమ్మందం గూడా లేనోల్లని సంపీడానికి నా మనసొప్పుకోదండి. అన్నెం పున్నెం తెలీనోల్లని చంపి ఆల్ల ఉసురు నేనెందుకండీ పోసుకుంట?” అని వాదించేడు.

అధికారులకి ఓపిక చచ్చిపోయింది. హవల్దారొకడు నర్సిమ్మడి చెవి పట్టుకుని మెలేసి మరీ పాఠం చెప్పేడు. దేశాలంటే ఏమిటో, యుద్ధమంటే ఏమిటో, అదెందుకు చేస్తారో, ఎలా చేయాల్సొస్తుందో, సైనికులైన వాళ్ళు అలా వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన శత్రువుని మాత్రమే ఎందుకు కాల్చకూడదో వివరంగా చెప్పేడు.

“మరలాగైతే నన్నొగ్గేయండి బాబులూ. నేను మా ఊరికి బోతా,” నన్నాడు అప్పల్నర్సిమ్మడు.

“ఠాట్! అదేవీ కుదర్దు. నువ్వు సైన్యంలో చేరావు కాబట్టీ చచ్చినట్టు మేం చెప్పినట్టు యుద్ధం చేయాల్సిందే!” ఆజ్ఞాపించేరు సుబేదార్లు. “ఆగే బఢ్! ఎక్, దో, ఎక్, దో, ఎక్, దో” అని అరుస్తూ వాణ్ణి ఓ చోట యుద్ధంలో పడదోశారు. అప్పల్నర్సిమ్మడి ఉత్సాహమంతా ఆవిరైపోయింది. వాడు అలక్ష్యంగానే శత్రువులని చంపడం మొదలు పెట్టేడు, కనీసం అలాగైనా ఏదో ఒకరోజు ఖదీరుగాడో, వాడి అన్నల్దమ్ములో ఎక్కడో ఒకచోట కనపడక పోతారా అనే ఆశతోనే.

అప్పల్నర్సిమ్మడి ఆలోచన ఇదీ: “ఇయ్యాలో పదిమందిని నాను సంపేసినాను. రేపింకో పదిమందినిలాగే కాలుస్తును. ఆళ్ళనిలా లేపేసుకుంటూ పోతే ఆళ్ళ మంది తగ్గిపోయి సివరికి ఆడు నాకు దొరక్కపోడు. లచ్చమందిలో తప్పించుకుంటాడు గాని ఆడు వందమందిలో ఎలా దాక్కుంటాడేటి?”

వాడొక్కొక్క శత్రువుని చంపినప్పుడల్లా అధికారులు వాడికి ఒక్కో పతకాన్నిచ్చేరు. అయినా వాడికేమీ ఆనందం కలగలేదు. ఇంతమందిని చంపిన తర్వాత కూడా చివరికి ఖదీరుగాణ్ణి చంపలేకపోతే, వీళ్ళందరినీ ఉత్తపుణ్యానికే చంపినట్టవుతుంది గదా, అని వాడు మథనపడుతూనే వున్నాడు. ఇదిలా వుంటే, అప్పల్నర్సిమ్మడికి అధికారులు పతకాల మీద పతకాలు – కాంస్యం, రజితం, స్వర్ణం, ఇలా ఇస్తూనే ఉన్నారు.

ఇంతలోనే, ఖదీరుగాడు ఇంకా దొరక్కముందే పక్కదేశం ఓడిపోయి చేతులెత్తేసింది. యుద్ధం అయిపోయింది. అప్పల్నర్సిమ్మడికి మనాది పట్టుకుంది. ఏ ప్రతిఫలమూ లేకుండా అంతమందిని అనవసరంగా చంపేసేనే అని వాడు కుమిలిపోయేడు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య శాంతి నడుస్తోంది. అప్పల్నర్సిమ్మడు వాడికొచ్చిన పతకాలనన్నీ పట్టుకొని ఆ దేశం పోయేడు. అక్కడ వీడు చంపేసిన ప్రతివాడి ఇంటికీ పోయి వీడి పతకాలు ఆ చచ్చిపోయినోళ్ళ పెళ్ళాం బిడ్డలకిచ్చేసుకుంటూ పోయేడు, ఆ దేశం అంతా తిరుగుతూ.

అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఒకరోజు ఉన్నట్టుండి వాడికి ఖదీరుగాడు కనపడ్డాడు. “ఆలీసమైతే అయింది గానీరా, పోనీలే ఇప్పుటికైనా దొరికేవు,” అని అప్పల్నర్సిమ్మడు ఖదీరుగాడిని అక్కడే చంపేసేడు.

వెంటనే వాళ్ళు వాణ్ణి పట్టుకొనేసి జైల్లో పెట్టేరు. హత్యానేరం కింద వాణ్ణి విచారించి ఉరి శిక్ష వేసి, వాణ్ణి కొయ్యకు వేలాడేసేరు. అప్పల్నర్సిమ్మడు ఆ చివరి నిమిషం దాకా వాడు ఖదీరుగాణ్ణి చంపడం కేవలం వాడి అంతరాత్మ కుదుటపడ్డం కోసంగా చేసిందేనని పదే పదే అంటూనే ఉన్నాడు.

కానీ, ఎవరూ వాడు చెప్పేది వినిపించుకోలేదు.

(మూలం: Conscience, 1943.)

3. ఉలిపికట్టె

ఒకానొకదేశంలో అందరూ దొంగలే ఉండేవారు.

రాత్రిళ్ళు చీకటి పడగానే ప్రతి ఒక్కరు దొంగతాళంచేతులు, చిన్న బుడ్డి లాంతరు పట్టుకొని ఇరుగుపొరుగు వాళ్ళ ఇళ్ళలో దొంగతనం చేసేవాళ్ళు. అలా లూటీ చేసిన సొమ్ము మోసుకుని తెల్లారేటప్పటికల్లా ఇంటికొచ్చి చూస్తే, వాళ్ళ ఇళ్ళలో కూడా దొంగతనం జరిగి వుండేది.

అలా అందరూ ఆనందంగా కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవారు. ఎవరూ పోగొట్టుకున్నదేమీ లేదు కదా! ఎందుకంటే మొదటివాడు రెండోవాడినుంచి దొంగిలించేవాడు, ఆ రెండోవాడు మూడోవాడినుంచి, ఆ మూడోవాడు నాలుగోవాడినుంచి, ఇలా పోయి పోయి ఆఖరివాడి దగ్గరికి మనం వచ్చేసరికి ఆ ఆఖరివాడు మొదటివాడిని దోచేసి వుండేవాడు. ఇక ఎలానూ తప్పదు కాబట్టి ఆ దేశంలో వ్యాపారమంతా కూడా ఇలానే జరుగుతుండేది. అమ్మేవాణ్ణి కొనేవాడు, కొనేవాణ్ణి అమ్మేవాడు మోసం చేసుకునేవాళ్ళు. అలాగే ప్రభుత్వం కూడా ఒక పెద్ద దొంగల ముఠానే. అది దానితో అవసరం ఉన్న సంస్థలనీ, ప్రజలనీ మోసం చేసి దోచుకునేది. వాళ్ళు కూడా తిరిగి ఎప్పుడూ ప్రభుత్వాన్ని అలాగే మోసం చేసి దోచుకుంటుండేవాళ్ళు. ఈ విధంగా ఏ ఒడిదుడుకులూ లేకుండా జీవితం అందరికీ సాఫీగా సాగిపోతుండేది. ఎవరూ ఉన్నవాడు కాదు, ఎవరూ లేనివాడు కాదు.

ఎలా జరిగిందో మనకైతే నిజంగానే తెలీదు సుమండీ, ఒకసారేమయిందంటే, ఎవరో ఒక మహా నిజాయితీ గల మనిషొకాయన ఆ దేశంలో ఉండటానికొచ్చాడు. రాత్రి కాగానే, యథా ప్రకారం దొంగతాళాల గుత్తి, లాంతరు, గోనె సంచీ పట్టుకొని పోకుండా ఈ నిజాయితీపరుడు ఎంచక్కా భోజనం కాగానే పడక్కుర్చీలో వాలి, చుట్ట వెలిగించి పుస్తకం ఒకటి పట్టుకుని చదువుకుంటూ కూర్చున్నాడు.

దొంగలొచ్చారు, ఇంట్లో దీపాలు వెలుగుతుండడం చూసి లోపలికి పోకుండానే తిరిగి వెళ్ళిపోయారు.

ఇలా కొన్ని రోజులు గడిచినై. ఈయన ప్రవర్తనేమీ మారలా. చివరికి మిగతావాళ్ళందరూ ఈయనకు అర్థం అయేలా చెప్పాల్సిన అగత్యం ఏర్పడ్డది. ఈయన ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి, ఇలా ఏమీ చేయకుండా ఉండటానికి ఈయనకు స్వతంత్రం ఉన్నమాట నిజమే. కాకపోతే అది వేరేవాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఎలా? ఈయన ఇంట్లో గడిపిన ప్రతి రాత్రి ఒక కుటుంబానికి మరుసటి రోజు తినటానికి ఏమీ ఉండట్లేదు కదా!

నిజాయితీపరుడు నొచ్చుకున్నాడు. ఇందులో కాదనడానికేముంది, మీరు చెప్పిందీ నిజమే అని ఒప్పుకున్నాడు. అందుకని ప్రతి రాత్రి చీకటి పడగానే ఈయన కూడా బైటికి వెళ్ళి ఉదయాన్నే తిరిగి ఇంటికి చేరుకునేవాడు. అయితే దొంగతనం చేసేవాడు మాత్రం కాదు. ఆయన నిజాయితీపరుడు. అది ఆయన రక్తంలో ఉంది, అది మార్చడం మన వల్ల ఏమవుతుంది? ప్రతీ రాత్రి ఊరు బైటదాకా వెళ్ళి వంతెన గట్టు మీద కూర్చుని కింద పారుతున్న ఏరుని చూస్తూ రాత్రిళ్ళు గడిపేవాడు. పొద్దున్నే ఇంటికొచ్చేటప్పటికి ఇంట్లో దొంగతనం జరిగుండేది.

ఎంతోకాలం ఇలా గడవలేదు. నిజాయితీపరుడి దగ్గర తినడానికేమీ లేకుండా, ఇంట్లో వస్తువన్నది లేకుండా, ఆయన దగ్గర చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది. కానీ ఇది ఆయన స్వయంకృతాపరాథమే కాబట్టి చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అని మనం నిమ్మళంగా ఉండచ్చును. కానీ అలా వీల్లేకుండా పోయింది. ఎందుకంటే కథ అక్కడ ఆగలేదు. ఈయన నిజాయితీ పర్యవసానం వ్యవస్థ మీద కూడా పడింది! ఎట్లాగంటారా? ఈయన సాటివాళ్ళను తనింట్లో దొంగతనం చేయనిస్తాడు కానీ ఈయన ఎవరింటినీ దొంగిలించడు. అంటే, దొంగతనం ముగించుకొని తన ఇంటికి వెళ్ళేటప్పటికి ఎవడో ఒకడికి వాడిల్లు దోపిడీ కాకుండా నిక్షేపంలా చెక్కు చెదరకుండా వుంటుంది కదా. లెక్క ప్రకారం ఆ ఇంటిని దోచుకోవల్సింది ఈ నిజాయితీపరుడేనాయె. మరి ఈయనేమో దోచుకోకపాయె.

ఎవడి ఇంట్లో అయితే దొంగతనం జరగలేదో వాడింట్లో ఆ రాత్రి వస్తువులు పోకుండా వున్నట్టేనా? అంటే పక్క రోజుకి వాడింట్లో పక్కింటికంటే ఎక్కువ సొమ్మున్నట్టేనా? అందువల్ల కొంతమంది మిగతావాళ్ళ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అవుతారా లేదా? అవుతారు, కొన్ని రోజుల్లోనే అయ్యారు కూడా. ఇలా ఇంకొన్ని రోజులు గడిచింతర్వాత ఈ ఉన్నవాళ్ళ ఇళ్ళల్లో మరింత సొమ్ము పోగయ్యేసరికి వాళ్ళు కాస్తా దొంగతనం చేయడం మానుకున్నారు. బట్టనెత్తి వాడి మీదే తాటికాయ పడ్డట్టు, ఉన్నవాళ్ళు కానివారి పరిస్థితి మరింత దిగజారింది. నిజాయితీపరుడి ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇల్లంతా బోసిపోయి ఉండడంతో ఏమీ దొరికేది కాదు. దాంతోటి వాళ్ళు వట్టి చేతుల్తో తిరిగిపోవాల్సొచ్చేది. కానీ వాళ్ళ ఇళ్ళు మాత్రం ఖాళీ అవుతుండేవి. అలా వాళ్ళు లేనివాళ్ళుగా అయిపోయారు.

ఇదిలా ఉంటే, ఈ తలనొప్పి చాలదన్నట్టు ఉన్నవాళ్ళందరూ నిజాయితీపరుడి అలవాటు పుణికి పుచ్చుకొని, చీకటి పడగానే వంతెన గట్టెక్కి కూర్చుని రాత్రంతా కింద పారుతున్న ఏటి నీళ్ళను చూడ్డం మొదలు పెట్టారు. ఇది మరింత గందరగోళానికి దారి తీసింది. వీళ్ళ కొత్త అలవాటు వల్ల కొందరేమో కొత్తగా ఉన్నవాళ్ళయ్యారు. మిగతా అందరేమో లేనివాళ్ళయ్యారు.

ఇలా ఎంతకాలమో గడవకుండానే ఉన్నవాళ్ళకి విషయం తెలిసిపోయింది, ప్రతి రాత్రీ ఇలానే వంతెన గట్టుకి షికారుకి పోతే వాళ్ళు ఉన్నవాళ్ళుగానే ఉండలేరని, చటుక్కున లేనివాళ్ళయి పోగలరని. అందుకని వాళ్ళు – మనం ఇలా కాకుండా కొంతమంది లేనివాళ్ళకి జీతమిచ్చి మనకోసం దొంగతనాలు చేయించుకుందాం, అని తీర్మానించుకున్నారు. అలా ఉన్నవాళ్ళు లేనివాళ్ళకు జీతాలు, భత్యాలు ఇచ్చి ఒడంబడికలు చేసుకున్నారు. వాళ్ళు పోయి వీళ్ళకోసం దొంగతనాలు చేసేట్టుగా పత్రాలు రాసుకున్నారు. అంతే కాదు, లూటీలో వాటా కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే, ఈ కొత్త పద్ధతిలో ఉన్నవాళ్ళు కూడా దొంగలే అయినా, వాళ్ళు చేసేది కూడా దోపిడీనే అయినా, ఇలాంటి పద్ధతుల్లో ఎప్పుడు జరిగినట్టే ఇప్పుడూ జరిగింది. ఉన్నవాళ్ళు మరింత ఉన్నవాళ్ళుగా అయితే లేనివాళ్ళు ఇంకా లేనివాళ్ళయి ఆపైన మరింత లేనివాళ్ళయ్యారు.

ఈ ఉన్నవాళ్ళలో కొంతమంది ఇలా మరింత బాగా ఉన్నవాళ్ళయ్యారు. వాళ్ళకిక దొంగతనాల అవసరం తీరిపోయింది. వాళ్ళు దొంగతనం చేయక్కర్లేదు, జీతాలిచ్చి వేరేవాళ్ళతో చేయించుకోనక్కర్లేదు కూడా. కానీ వాళ్ళు దొంగతనాలు మానేస్తే లేనివాళ్ళు ఎలానూ వాళ్ళ దగ్గరనుండి దొంగతనం చేస్తారు కాబట్టి వీళ్ళూ తొందరలోనే లేనివాళ్ళుగా మారిపోతారు. అలా కాకుండా ఉండడానికి మరింత బాగా ఉన్నవాళ్ళు మరింత లేనివాళ్ళకి జీతాలిచ్చి లేనివాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో దొంగతనాలు చేయకుండా కాపలాగా పెట్టుకున్నారు. మరి కాపలా అంటే రక్షణే కాబట్టీ అందుకోసం ఆ విధంగా రక్షకభటులు పుట్టుకొచ్చారు. వారి వెంబడే చెరసాలలు వగైరా పుట్టుకొని రానే వచ్చినై.

నిజాయితీపరుడు ఊళ్ళోకొచ్చి ఇలా కొన్నేళ్ళు గడిచేటప్పటికి దొంగతనాలు చేయడం, చేయించుకోడం గురించి ఊళ్ళో బొత్తిగా మాట్లాడ్డమే మానేశారు. అసలు ఆ ఊసే ఎవరూ ఎత్తరిప్పుడు. ఇప్పుడంతా ఉన్నవాళ్ళు, లేనివాళ్ళ గురించే ఎప్పుడూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పటికీ అందరూ దొంగలే; మొదట్లో వచ్చిన ఆ నిజాయితీపరుడు ఒక్కడు, కేవలం ఆయనొక్కడు తప్ప.

ఏంటీ, ఆయన ఇప్పుడెలా ఉన్నాడని అడుగుతున్నారా? ఎక్కువ కాలం లేడండీ ఆయన. ఆకలికి ఓర్చుకోలేక అప్పుడే చచ్చిపోయాడు.

(మూలం: The black sheep, 1944.)


(Numbers in the dark and other stories, Italo Calvino.)