1. లైబ్రరీలో సేనాపతి
ప్రజాతంత్ర రాజ్యాధ్యక్షుల వారికి ఉన్నట్టుండి ఒక అనుమానం పొడసూపింది. అక్కడితో ఆగకుండా అది పెనుభూతమైంది. వెంటనే త్రిదళాధిపతుల్ని పిలిపించి వారితో సమావేశమయ్యారు. సూటిగా విషయంలోకి వచ్చారు. తమ పాలనను అధిక్షేపించే పుస్తకాలు పత్రికలు లైబ్రరీల నిండా ఉన్నాయని, అవి తమ ప్రభుత్వాన్ని, వారికి కొమ్ముగా నిలిచిన సైన్యాధ్యక్షులనీ కూడా విమర్శిస్తున్నాయని, వాటిని అలానే కొనసాగనిస్తే తమ పరపతి దెబ్బతింటుందని తమకొచ్చిన అనుమానాన్ని వారితో పంచుకున్నారు.
త్రిదళాధిపతులు ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. తమ వెంటే తెచ్చిన ఒక రహస్య నివేదికను రాజ్యాధ్యక్షుల వారికందించారు. సరిగ్గా ఇదే అనుమానంతో గత కొన్ని నెలల నుంచీ ప్రజలందరిపైనా నిఘా వేసి, రహస్యంగా విచారణలు జరిపించి, కూపీలు లాగి మరీ సైన్యాధ్యక్షులు సేకరించిన వివరాలున్నయి అందులో. ముఖ్యంగా ఆందోళన కలిగించిన సంగతులేమిటంటే – ప్రభుత్వాధిపతులు, సైన్యాధికారులు దైవాంశ సంభూతులు కారని, మామూలు మనుషుల లాగానే వారూ తప్పులు చేయగలరని, తరచూ చేస్తారని, వారి ఆలోచనలు, నిర్ణయాలు ఎప్పుడూ ప్రజల మంచి కోసమే కాదనీ ప్రజలు అనుకుంటున్నారు. అంతే కాకుండా యుద్ధాలన్నీ ప్రభుత్వం చెబుతున్నట్టు చెడు మీద మంచి వీరోచితంగా గెలవడం గురించి కాదని, ప్రభుత్వం తన స్వార్థం కోసమే యుద్ధాలు చేస్తుందని కూడా అనుకుంటున్నారు. పాలకులపై ఈ రకమైన విమర్శ చాలా పుస్తకాలలో – కొత్తవి, పాతవి, స్వదేశి, విదేశి, స్వభాష, పరభాష – ఎప్పట్నుంచో ఉంటోందని, ప్రజలు వాటిని చదివే తమ గురించి గొప్పగా అనుకోవడం లేదని, ఆ రహస్య నివేదిక సారాంశం. అంతే కాక, సైనికులు అవి చదివిన పక్షంలో వారి నైతికత దెబ్బతినడానికి, లేకపోతే తిరుగుబాటు చెయ్యడానికి ఆస్కారం ఏర్పడుతుందని కూడా ఆ నివేదిక హెచ్చరించింది.
రాజ్యాధ్యక్షుల వారి అధ్యక్షతన సైన్యాధ్యక్షుల సమావేశం ఏర్పాటయింది. అధిపతుల మేధ, సమర్థత, పాలనల గురించి ప్రజలకున్న అపోహల వివరాలు చర్చించబడినై. మేధోమథనం జరిగింది. గణాంక పట్టికలు శల్యపరీక్ష చేయబడినై. కారణం తెలిసింది కాబట్టి, ఇక కార్యాచరణ ఎలా? సమావేశమందిరం ఆలోచనల సెగలతో వేడెక్కి పోయింది. అధిపతులందరూ ఇంతగా తలలు పట్టుకోడానికి కారణం, ఎవరికీ ఏం చేయాలో ఇదమిథ్థంగా తెలియకపోవడం. యుద్ధాలంటే పాత చింతకాయ పచ్చడే కానీ, పుస్తకాల గురించి ఏమీ తెలియదే! మరి వాటిని ఎలా ఎదుర్కొనడం?
శత్రువులకి సింహస్వప్నమని, ఖచ్చితమైన వాడని, అత్యంత విశ్వసనీయుడనీ పేరు పొందిన కల్నల్ సర్వగ్యాని అధ్యక్షతన ఒక మిలటరీ కమీషన్ ఏర్పాటు చేయాలని నిశ్చయించి సర్వగ్యానిని పిలిపించారు. కమిషన్ పని ప్రజాతంత్ర రాజ్యంలోనే ముఖ్యమైనది, అతి పెద్దది అయిన సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నిటిని పరిశీలించి ఆరు నెలల్లోగా తమకు ఒక విస్తృత నివేదిక అందించడం. అంతే కాదు, రిటైరైన మిలటరీ అధికారులు, జడ్జీలతో ఏర్పాటు చేసిన ఒక మేధోకూటమికి ప్రతీ రోజూ సాయంత్రం ఏడు గంటలకు రోజువారీ రిపోర్టు పంపాలి. మేధోకూటమి ఎప్పటి కప్పుడు ఆ రిపోర్టులు పరిశీలించి సర్వగ్యానికి సూచనలు, సలహాలు ఇవ్వడం, కమీషన్ పనితీరుని పర్యవేక్షించడం, గడువు ముగిసే లోగానే పని పుర్తయ్యేలా చూడడం, వగైరా వగైరా ఆజమాయిషీ చేస్తుంది.
ప్రజాతంత్ర విశ్వ సారస్వత నికేతనం (సెంట్రల్ లైబ్రరీ అసలు పేరు) బాగా పాతబడ్డ మూడంతస్తుల భవనం; పెద్ద ద్వారబంధం, ముందు వెడల్పాటి నాపరాతి మెట్లు. గుమ్మానికి అటూ ఇటూ పొడూగ్గా స్థంభాలు. ఒకప్పటి రాజుగారి హవేలీని అప్పుడెప్పుడో లైబ్రరీకని ఇప్పించుకున్నారు. అక్కడక్కడా పెచ్చులూడిపోయిన గోడలు, ప్రహరీ గోడ బీటల్లోంచి, మెట్ల సందుల్లోంచి పెరుగుతున్న పిచ్చి మొక్కలు, ఆలనా పాలనా సరిగ్గా లేకపోయేప్పటికి ఆ మేడ మరింత పాతగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల గోడలు వానకు తడిసి, ఎండకు ఎండీ కూలిపోయినై కూడా. ఇక లైబ్రరీ ముందూ వెనకా ఉన్న తోట గురించి చెప్పనక్కర్లేదు, కలుపు మొక్కలతో నిండిపోయి ఒక చిన్న అడివిలా ఉంటుంది. లోపలికెలితే అటూ ఇటూ పై అంతస్తులకి మెట్లు, లెక్కలేనన్ని గదులు, ప్రతీ గదిలోను లెక్కలేనన్ని పుస్తకాలు, బీరువాల నిండా. కొన్ని గదుల్లో అవి చాలక నేలమీదే గుట్టలు గుట్టలుగా దుమ్ము పేరుకొని పోయి పడుంటై. కొన్ని గదుల్లోకైతే ఎలుకలు మాత్రమే దూరగలవు; ఇంకొన్నింటిలో కేవలం బొద్దింకలే. పాపం, ప్రజాతంత్ర దేశపు ప్రభుత్వాదాయమంతా సైన్యానికి, దాని అవసరాలకే సరిపోతుంది, లైబ్రరీలకీ స్కూళ్ళకీ దాని దగ్గర డబ్బుల్లేకపోయె.
ముసురు పట్టి జల్లు పడుతున్న ఆ నవంబరు 3వ తేదీ ఉదయాన, లైబ్రరీ ముందు ఒక మిలటరీ జీపు, దాని వెనకాలే ఒక ట్రక్కు వచ్చి ఆగినై. జీపు లోంచి కల్నల్ సర్వగ్యాని ముందుగా దిగాడు. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన మిలటరీ యూనిఫారం, నున్నగా గీసుకున్న గడ్డం, క్రమశిక్షణతో పెరిగిన మీసం, తీక్షణమైన కళ్ళకు అడ్డంగా నల్ల కళ్ళజోడు, ధృఢచిత్తంతో బిగుసుకున్న దవడ కండరం, గీత గీసినట్టున్న పెదాలు, ముడిపడిన నుదురు – సర్వగ్యాని వెనకాలే ఇంకో నలుగురు అనుచరులు, కవళికల్లో కల్నల్ మల్లేనే ఉండి, జీపు వెనకాలనుంచి దిగారు. వాళ్ళ చేతుల్లో బ్రీఫ్‌కేసులున్నై. లైబ్రరీ భవనాన్ని పైనుంచి కిందిదాకా నిశితంగా పరిశీలించి, తల చివాలున పంకించి కల్నల్, ఆయన అనుచరులు నిటారుగా లోపలికి నడిచారు. వెంటనే వెనకాల ట్రక్కులోంచి కొంత మంది సైనికులు దిగి పెద్ద పెద్ద ట్రంకు పెట్టెలు దింపడం మొదలు పెట్టారు. కాసేపటికి లైబ్రరీ బిల్డింగు వెనకాల పెరిగిపోయిన తుప్పల్ని నరకడం, నేల చదును చేసి, వంట చేయడానికి వీలుగా గోడవారన రాళ్ళు పేర్చడం, ఎండు తుప్పల్ని ఒక మూలగా నెట్టి మంట పెట్టడం, చెట్ల కింద గుడారాలు పాతడం – ఇలా కాసేపట్లో అక్కడంతా పెద్ద హడావిడి మొదలయింది. మెషీను గన్లు పట్టుకున్న ఇద్దరు సైనికులు గేటుకి అడ్డంగా ‘ప్రవేశము లేదు’ అని ఒక హెచ్చరిక వేలాడేసి, దానికటూ ఇటూ కాపలా కాస్తూ, దేనివంకా చూడకుండా అన్నిటిని గమనిస్తూ నిలబడ్డారు.
పొద్దున్నే గొడుగులు పట్టుకొని, భుజాలకు సంచీలు వేలాడేసుకొని, కళ్ళజోళ్ళు సర్దుకుంటూ, లైబ్రరీలో పుస్తకాల మధ్య రోజంతా గడపడానికి వచ్చేవాళ్ళంతా ఈసురోమంటూ మళ్ళీ ఇళ్ళకు పోవాల్సొచ్చింది. వాళ్ళకేమీ పాలు పోలేదు. ఏమిటిదంతా? లైబ్రరీ దగ్గర సైన్యం ఎందుకుంది? వెనకాల ఆ గుడారాలేమిటి? ఆ కవాతులేమిటి? వాళ్ళు పుస్తకాలన్నీ తగలేస్తారా? లైబ్రరీకొచ్చే వాళ్ళందర్నీ కాల్చేస్తారు కూడానా? – ఇలా రకరకాలుగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎవరి దగ్గర చూసినా ప్రశ్నలే తప్ప జవాబుల్లేవు. సర్వగ్యాని కమీషన్‌కి ఒప్పచెప్పిన పని వివరాలు ఎంతో గోప్యంగా ఉంచాలని, పత్రికలకు, ప్రజలకు ఏమాత్రం తెలియకూడదనీ రాజ్యాధ్యక్షుల వారి ఆదేశం మరి.
కల్నల్ సర్వగ్యాని ఆదేశం మేరకు, లైబ్రరీలో పనిచేసే వాళ్ళందరికీ పిలిచేదాకా రావద్దని చెప్పి మరీ సెలవులిచ్చి ఇళ్ళకు పంపేశారు. కేవలం ఒక్క లైబ్రేరియన్‌ని మాత్రం ఉండమన్నారు, ఏ పుస్తకం ఎక్కడుందో వెతికేవాళ్ళకు తెలియాలి గదా! పొట్టిగా, బక్కపల్చగా కళ్ళజోడు, పెద్ద నుదురుతో ఉండే ఆ లైబ్రేరియన్ పేరు సోమయాజి. ఆయన ఎన్నేళ్ళ నుంచీ అక్కడ పనిచేస్తున్నాడో ఎవ్వరికీ తెలీదు కానీ చాలామంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళ చిన్నతనం నుంచీ ఆయన్ను అక్కడే చూస్తుండేవాళ్ళం అని పిల్లలకు చెప్తుంటారు.
కల్నల్ సర్వగ్యాని ముందున్న మొట్టమొదటి బాధ్యత వ్యూహ రచన. పని పూర్తయే దాకా లైబ్రరీ వదిలి రావద్దని అధిపతుల ఇచ్చిన ఉత్తర్వులు తప్పకూడదు. ముందున్న పని సామాన్యమైనది కాదు; ఎంతో ఏకాగ్రత, క్రమశిక్షణ అవసరం. వసతి సౌకర్యాల నిర్వహణ లెఫ్టినెంట్ ఏకవేదికి అప్పగించబడింది. అతను వెంటనే, ఆరునెలలకు కావల్సిన వెచ్చాలు, వంట చెరకు తెప్పించి లైబ్రరీ వెనక నిలవ చేయించాడు. సైనికులందరికీ గుడారాల్లో హరికేన్ లాంతర్లు పెట్టించాడు. మడత మంచాలు, రాత బల్లలు వేయించాడు. లైబ్రరీలో గుమస్తాలు కూర్చునే గదులు ఖాళీ చేయించి, కల్నల్‌కు, మిగిలిన వారికి అక్కడ మంచాలు వేయించాడు. గదుల్లో ఎలుకల బోన్లు పెట్టించాడు, బొద్దింకలమందు కొట్టించాడు. లైబ్రరీలో కొత్త బల్బులు, హీటర్లు పెట్టించాడు. ఆ లైబ్రరీలో అంతకు ముందెప్పుడూ అంత వెలుతురు గానీ వెచ్చదనం గానీ ఎవరూ ఎరిగిన పాపాన పోలేదు.
సైనికులని దళాలుగా విభజించి వారికి పని అప్పచేప్పే బాధ్యత లెఫ్టినెంట్లు ద్వివేది, త్రివేది, చతుర్వేదులకి ఇవ్వబడింది. వారు వెంటనే ఆరుగురు సైనికుల్ని ఒక దళంగా, ఆ దళానికి ఒక నాయకుణ్ణి, అలాంటి దళాలు మూడిటికి ఒక మహా నాయకుణ్ణి నియమించారు, అలాంటి ముగ్గురు మహానాయకులకు ఒక అధినాయకుడు. ఒక్కో దళానికి లైబ్రరీలో ఒక్కో శాఖ కేటయించబడింది. ఒక శతాబ్దపు చరిత్ర అంతా సుబేదార్ ముఖర్జీ దళానికి, ఆర్థిక, సామాజికాంశాలు ఛటర్జీ దళానికి, సాహిత్యం, విద్యా శాఖలు బెనర్జీ దళానికి, ఇలాగా. కెప్టన్లు త్రిపాఠి, ఏకపాఠి, ఘనాపాఠి తదితరులు ఆ రకంగా దళాల పర్యవేక్షణకు అధినాయకులుగా నియమించబడ్డారు. పుస్తకాన్ని చదవగానే దళంలో సభ్యుడు ఆ పుస్తకం మీద సమీక్ష రాసి వారి నాయకుడికి ఇస్తాడు. అలా అర్జీలనుంచి ఏదో ఒక పాఠికి, ఆ పైన ఎవరో ఒక వేదికి పుస్తకం వివరాలు అందుతాయి. పాఠీలు తమకందిన సమాచారాన్ని వేదీలతో చర్చిస్తారు, వేదీలు తమ అభిప్రాయాలని సర్వగ్యానికి సమర్పిస్తారు. ఆఖరున కల్నల్ సర్వగ్యాని ఆ పుస్తకం అర్హత నిర్ణయిస్తాడు – ఆ పుస్తకం సైనికులు, సామాన్యులు చదవదగిందేనా? లేక సైనికాధికారులకే పరిమితమా? నిషేధించవలసిన పుస్తకంగా సిఫారసు చేస్తూ మేధోకూటమికి పంపించడమా? – ఈ రకంగా బేరీజు వేసి, పుస్తకం మీద తగినట్టుగా రబ్బరు స్టాంపు ముద్ర ఒకటి వేస్తాడు.
ఇలా కల్నల్ సర్వగ్యాని ఆధ్వర్యంలో కమీషన్ పని మెరుపు వేగంతో మొదలయింది. ప్రతి రోజు ఠంచనుగా ఏడుగంట్లకు లైబ్రరీలో అమర్చిన రేడియో గుండా, మిలటరీ వేవ్‌లెంగ్త్ మీద కల్నల్ సర్వగ్యాని, మేధోకూటమికి ఆ రోజు ఫలితాలను అందించేవాడు. సాధారణంగా – ఆ రోజున ఎన్ని పుస్తకాలు పరీక్షించారు. ఎన్ని పుస్తకాలు అనుమానాస్పదంగా అనిపించాయి. ఎన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ని పుస్తకాలు సైనికులు, ప్రజలు చదవటానికి యోగ్యమైనవిగా నిర్ణయించారు – ఇలాంటి ఖచ్చితమైన గణాంకాలు మాత్రమే ఉంటై సర్వగ్యాని నివేదికలో. అడపాదడపా, ఫలానా సైనికుడికి కళ్ళజోడు కావాలనో, ఫలానా అర్థశాస్త్రం అసలు ప్రతిని ఎలుకలు కొరికేసి చదవ యోగ్యం కాకుండా చేసినై అనో కూడా ఆ నివేదికలో వినిపిస్తుంటై.