యాదవుల గురించిన కాటమరాజు కథ కూడా ఇలాగే కొంచెం క్లిష్టమైన కథ. కథ. పశువులు కాచుకునే వీరిని గొల్లవారు అని కూడా అంటారు. మహాభారతకాలం నుంచీ యాదవులు శ్రీకృష్ణుని వంశం వారని చెప్పుకుంటారు. కథానాయకుడైన కాటమరాజు తన విస్తారమైన పశుగణానికి గ్రాసం కోసం చోళ రాజు నల్లసిద్ధి భూముల్లో గడ్డిని పశువులు యదేచ్ఛగా మేసేటట్టుగా, అందుకు ప్రతిగా వాటికి పుట్టిన దూడలని చోళరాజు కిచ్చేటట్టుగా ఒప్పందం కుదుర్చుకుంటాడు. నల్లసిద్ధి వెలయాలైన కుందవాదేవి కాటమరాజుకీ నల్లసిద్ధికీ మధ్య వైరానికి కారణం. ఆమె పెంపుడు చిలకను యాదవులు బాణంతో చంపడం వల్ల ఆమె యాదవుల గోవులని చంపమని స్థానికులని రెచ్చగోడుతుంది. తమ గోగణం కోసం వన్యప్రాణులని చంపుతున్న యాదవుల మీద వారప్పటికే కోపంతో ఉన్నారు. వారి చర్య వల్ల కాటమరాజు తన కప్పం చెల్లించనంటాడు. కరువు కాటకాలవల్ల భూములు బీడు పోతాయి. ఒప్పందాన్ని మాటకు మాటగా తీసుకున్న కాటమరాజు తన పశువులని వరిచేలలోకి వదులుతాడు, అదీ గడ్డే కాబట్టి. అలా మొదలైన స్పర్థ యుద్ద్ధంగా మారి, ఎందరో యాదవ వీరులు ప్రాణాలు పోగొట్టుకోడంతో ముగుస్తుంది.
తమ భూములని రక్షించుకోవడం కోసం వీరులు ప్రాణాలర్పించడం అనే సూత్రం బొబ్బిలి కథలో కూడా కనిపిస్తుంది. వెలమ కులస్థులకు చెందిన ఈ కథకి సందర్భం 18వ శతాబ్ది లో బొబ్బిలి, విజయనగర సంస్థానాల మధ్య కలిగిన వైరం. ఫ్రెంచి సేనాని బుస్సీ చర్యల వల్ల ఈ రెంటి మధ్యా శత్రుత్వం మరింత ప్రబలుతుంది. క్షత్రియుడైన విజయనగరపు సంస్థానాధీశుడు బుస్సీని కలిసి బొబ్బిలి రాజుని ఓడించడానికి సహాయం అడుగుతాడు. రాజుకి లోబడిన మధ్యవర్తుల కుతంత్రంవల్ల బుస్సీ వెలమ కులస్తుడైన బొబ్బిలి రాజు రంగారావుని కోట తమకు ఆధీనం చేసి వెళ్ళాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. రంగారావుకి ఇది తీవ్రమైన అవమానంగా అనిపించి ఎదురు తిరుగుతాడు. ఫ్రెంచి, విజయనగర సైన్యాలు బొబ్బిలి కోటను ముట్టడిస్తాయి. కోటను కాపాడుకుంటూ వెలమ వీరులందరూ మరణిస్తారు. వారి ఆడవారు మంటల్లోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటారు.
ఈ కథలకు విరుద్ధంగా ముందు చెప్పబోయే మూడు త్యాగచరితలలో ప్రధాన పాత్ర స్త్రీ. ఆమె ఆత్మాహుతి చేసుకోవడం, ఆ తర్వాత ఆమె దైవంగా పూజించబడడం ఈ చరితల్లోని అంతస్సూత్రం.
కన్యకా అమ్మవారి కథా స్థలం, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పట్టణం. ఆ ఊరి కోమటి నాయకుడు కుసుమశ్రేష్టి కూతురు కన్యక. అపర సౌందర్య రాశి. ఒకరోజు ఆ ప్రాంతపు రాజు పెనుగొండ వస్తాడు. కోమటి వారంతా రాజుకు సత్కారాలు చేస్తారు. హారతి ఇవ్వడానికి వచ్చిన కన్యకను చూసి రాజు మోహిస్తాడు. తనకిచ్చి వివాహం చెయ్యకుంటే పెనుగొండపై దండెత్తి ఆమెను చెరబడతానని కోమటివారికి చెప్పిస్తాడు. కులపెద్దలందరూ సమావేశమౌతారు. విషయం తెలిసిన కన్యక వివాహానికి పెద్దలు ఒప్పుకున్నారనీ, కానీ పెళ్ళిపనులకు సమయం పడుతుందనీ రాజుకు వర్తమానం పంపుతుంది. రాజు ఊరి బయట కొండలలో మకాం వేసి వుంటాడు, కన్యక తన కులపెద్దలకు, ఆత్మాహుతి చేసుకుందామన్న తన నిర్ణయం చెప్తుంది. తనతో పాటు ఎవరు అగ్నికి ఆహుతి కాదలచుకున్నారో అడుగుతుంది. అందుకు సిద్ధమైన నూట ఇద్దరు గోత్రీకుల కుటుంబాలనుంచి భార్యాభర్తలని ఎంచుకుని, యువతీ యువకులకు కులాన్ని వృద్ధిచేయడానికి ఒదిలిపెడుతుంది. మిగతా గోత్రీకులందరిని కులం నుంచి వెలివేస్తుంది.
రాజుకి అనుమానం వచ్చి సైనికులని, ఆలస్యానికి కారణం కనుక్కోమని పంపుతాడు. వారు తిరిగిరాకపోవడంతో తనే దండెత్తుతాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది. పెద్ద పూడికలో వ్రేల్చిన మంటలో కన్యక తదితరులు ఆహుతి అయిపోతారు. చనిపోయేముందు కన్యక, కోమటివారిలో మేనరికాలు ఎవరు కూడా ఏ కారణం చేతనైనా కాదనకూడదనీ, కోమటి వారి ఆడపిల్లలకు తన పేరు పెట్టుకోవాలని ఆదేశిస్తుంది. పరపురుషులు మోహించకుండా వారి ఇళ్ళలో ఆడపిల్లలు అందవిహీనంగా పుడతారనీ, తనను మోహించిన రాజు ఊరిలోకి అడుగుపెట్టగానే చచ్చిపోతాడని, పెనుగొండ తన తర్వాత వారికి ఒక పెద్ద పుణ్యక్షేత్రం అవుతుందనీ చెప్పి మంటలోకి దూకుతుంది.
సన్యాసమ్మ కథ ఆమె పుట్టుకతో మొదలవుతుంది. గాజులమ్ముకొనే కాపు దాల్నాయుడు, భార్య చనిపోగానే పిల్లలని ఒదిలేసి వేరే వివాహం చేసుకుంటాడు. సన్యాసమ్మను ఆమె అన్న రామినాయుడు ఎంతో ప్రేమతో పెంచుతాడు. ఆమెకు మేనత్త దాలమ్మ కొడుకైన చెంచన్నతో పెళ్ళి జరిగిన తర్వాత పెద్దమనిషి కాని కారణంగా పుట్టింట్లోనే ఉంటుంటుంది. ఒకరోజు రామినాయుడు దూరాభారం పోవలసి వచ్చి తన భార్య పాపమ్మకు ఇల్లు అప్పచెప్పి వెళతాడు. సవతి తల్లి కొడుకుతో సన్యాసమ్మ ఎద్దులపోటీలు చూడటానికి వెళ్ళడంతో సవతి తల్లి చేతిలో చీపురు దెబ్బలు తింటుంది. తన తప్పేమీ లేదని, అదే నిజమైతే దెబ్బలు కొట్టినవారికే తగులుతాయనీ సన్యాసమ్మ అంటుంది. ఆమె చెప్పినట్టే సవతి తల్లి ఒంటిమీద వాతలు తేలతాయి. ఆ తర్వాత, సన్యాసమ్మ అత్తవారింటికి చేరుతుంది. చెంచన్న, ఇంగ్లీషు చదువులు చదువుకొని, ఉద్యోగం వెతుక్కుంటూ మద్రాసుకి వెళతాడు. మేనత్త, ఆడపడుచు చేతుల్లో సన్యాసమ్మ ఎన్నో కష్టాలు పడుతుంది. తన మీద పడేసిన బండెడు చాకిరీని తన సత్యవతి కావడంతో వచ్చిన శక్తితో సకాలంలో చేస్తూ ఉంటుంది.
ఇదిలా ఉండగా, సన్యాసమ్మ మరిది అయిన అప్పన్న, ఆమెకు తన తల్లి తిండి పెట్టడం లేదని గమనించి, తాగమని పాలు ఇస్తాడు. ముందు సందేహించినా, సన్యాసమ్మ ఆ పాలు సగం తాగుతుంది. ఇంతలో అప్పన్న సన్యాసమ్మ గదిలోనుంచి రావడం చూసిన అత్త, సన్యాసమ్మను వేశ్య అని నిందిస్తుంది. అంతతో విరక్తి చెందిన సన్యాసమ్మ గది తలుపులు మూసుకొని చాప మీద పడుకొంటుంది. భర్త ఎక్కడున్నాడో వెతికి తీసుకొని రమ్మని తన ఆత్మను పంపిస్తుంది. ఆ ఆత్మ మద్రాసులో చెంచన్నను కలిసి ఇంటికి రమ్మని చెప్తుంది. చెంచన్న వచ్చి సన్యాసమ్మను అత్తవారి ఆరళ్ళనుంచి దూరంగా తీసుకుపోతానని చెప్తాడు. వేరు కాపురం పెట్టుకోడానికి ఆస్తి పంపకం చేయమని అన్నను అడుగుతాడు. అన్న ఇవ్వకపోగా, చెంచన్నను అవమానించడంతో, అది భరించలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ వార్త విన్న సన్యాసమ్మ, మరిది అప్పన్నతో కలిసి మద్రాసుకు వెళుతుంది. ఈస్టిండియా అధికారులని సతికి అనుమతి నివ్వమని కోరుకుంటుంది. అందుకు ఒప్పుకోని అధికారులు ఆమెను జైలులో ఉంచినా ఆమె విచిత్రంగా తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఆమె అధికారులకు ఎన్నో మహిమలు చూపించడంతో వారు సతీ సహగమనానికి ఒప్పుకుంటారు. అప్పన్నకు పసుపు కుంకుమలు కానుకగా ఇచ్చి సన్యాసమ్మ భర్తతో పాటు చితిలో కాలిపోతుంది.
ఆఖరుగా, కామమ్మ కథ. బెస్తకుటుంబంలో పుట్టిన కామమ్మ, కరువులో తలితండ్రులు చనిపోతే, మేనమామ దగ్గర ప్రేమతో పెరిగి, తనకు వరసైన మారయ్యను పెళ్ళాడుతుంది. మారయ్య మద్రాసులో ఈస్టిండియా కంపెనీలో సైనికుడిగా చేరతాడు. ఏడేళ్ళు గడుస్తాయి. ఉద్యోగం చాలించుకొని ఇంటికి తిరిగొస్తున్న మారయ్య జబ్బు చేసి చచ్చిపోతాడు. అది విన్న కామమ్మ సతికి సిద్ధమౌతుంది. భర్త దేహాన్ని ఒక గదిలో ఉంచి తాళం వేసి కాకినాడ కలెక్టరు దగ్గర సతికి అనుమతి కోసం వెళుతుంది. మధ్యలో ఒక లోతైన కాలవ దాటవలసి వచ్చినప్పుడు, తను జాలరి కాబట్టి, తనకు అక్క వరస అయిన గంగానది కృపతో కామమ్మ కాలవ దాటుతుంది. తనతో వచ్చిన మగవారికి కాలవ దాటడానికి రెండు పడవలని చేసిస్తుంది. ఆమె అర్జీ విన్న బ్రిటీషు అధికారి, బెస్తకులపు ఆడవారు రెండో పెండ్లి చేసుకోవచ్చనీ, చేసుకొమ్మనీ సలహా ఇస్తాడు. తననీ, తన కులాన్నీ అవమానించాడని కామమ్మ అతణ్ణి నిందిస్తుంది. ఏడు రోజులు నిద్రాహారాలు లేకుండా ఆమె జైలులో ఉండగా, ఆ అధికారి మారయ్య శరీరాన్ని దహనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. అది తెలిసిన కామమ్మ, శరీరాన్ని వదిలి, ఆత్మగా మద్రాసులోని పై అధికారి కలలో కనపడుతుంది. అతను అడిగిన మహిమలన్నీ చూపించి, సతికి అనుమతి తీసుకొని కాకినాడ తిరిగి చేరుకుంటుంది. కాకినాడ కలెక్టరు పేర్పించిన చితిలో, బంధుబలగాల సమక్షంలో, భర్తతో పాటుగా కాలిపోతుంది.
ఈ కథల్లో ఉన్న ముఖ్యమైన తేడాలను మనం గమనిస్తే, వీరచరితల్లో కథానాయకులు మగవారు అనీ, త్యాగచరితలు ప్రధానంగా ఆడవారి గురించి అనీ తెలుస్తుంది. వీరచరితల్లో వైరం తమ కులానికే చెందినవారితోనో, లేదా సమకులస్తులతోనో ఉంటుంది. త్యాగచరితల్లో సంఘర్షణ పరాయి అధికారపు చొరబాటు వల్ల వస్తుంది. వీరచరితల్లో ఘర్షణ భూమి కోసం, రాజ్యం కోసం అయితే, త్యాగచరితల్లో అది కులపు మానమర్యాదలు నిలపడం కోసంగా ఉంటుంది. అంతే కాకుండా వీరచరితల్లో నాయకులు భుజబలంతో పోరాడితే, త్యాగచరితల్లో కథానాయికలు తమ మానసిక స్థైర్యంతో, తమ సంకల్పంతో, తమ ఆత్మార్పణ ద్వారా కష్టాలకు ఎదురొడ్డుతారు. వీరులు యుద్ధంలో శత్రువులను కడతేర్చడమో, వారి చేతిలో చావడమో చేస్తారు. నాయికలు ఆత్మాహుతి ద్వారానో, శాపగ్రస్తలయ్యో మరణిస్తారు. వీరచరితలు నాయకులు మరణించడం, వారికోసం మిగిలినవారి రోదనలతో ముగిసి దుఃఖాంతమవుతాయి. త్యాగచరితల్లో వైరులు ఓడిపోవడమే కాకుండా, ఆ కులం వారు వృద్ధి చెంది సమాజంలో మరింత గౌరవం పొందుతారు.
వీరగాథల కులప్రసక్తి
ఈ వీరగాథల్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక కులం లేదా ఒకే స్థాయి కులాల ప్రాపకంలో ఉన్నవి. ఇంతకుముందే చెప్పినట్టు ఈ వీరగాథలను అనుసరిస్తూ నిజ జీవితంలో ఉన్న కార్మిక సంప్రదాయాలు (జాతరలు, పండగల వంటివి) ఆయా కులాల వారు ప్రత్యేకంగా జరుపుకునేవిగా ఉంటాయి. ఈ సందర్భాలలో ఈ వీరగాథలు ప్రదర్శించడానికి కళాకారులు కూడా ప్రత్యేకమైన హక్కు కలిగివుంటారు. ఉదాహరణకి, పల్నాటి జాతరలో ఈ వీరగాథ ప్రదర్శించేవారిని ‘వీరవిద్యావంతులు’ అని పిలుస్తారు. వీరు సాధారణంగా మాల కులస్తులై ఉంటారు. ఈ జాతరలో పాల్గొనే ‘ఆచారవంతులు’ తెలగ, కమ్మ, వెలమ తదితర భూస్వామ్య కులాలవారై ఉంటారు. అదేవిధంగా కాటమరాజు కథను ప్రతి యేటా గంగజాతరలో ప్రదర్శించడానికి యాదవులు, ‘కొమ్ములవాళ్ళు’గా పిలవబడే మాదిగ కులం వారిని మాత్రమే ఆహ్వానిస్తారు.
ఈ వీరగాథలని ‘తమవి’గా స్వంతం చేసుకోవడంలో తేడాలున్నాయి. పల్నాటికథతో మమేకం కావడం కేవలం ఆ నేలకు సంబంధించినది. ‘ఈ వీరులు మా పల్నాటి గడ్డపై పుట్టి, ఇక్కడే పోరాడి మరణించినవారు’ అన్న భావన ఇది. అలాగే, బొబ్బిలి కథ ‘మా బొబ్బిలి వెలమ రాజులది’ అన్న అభిప్రాయం వల్ల దానిని కేవలం బొబ్బిలి నేలకే కాక వెలమ కులానికి కూడా అనుబంధంగా మనం గమనిస్తాం. ‘బొబ్బిలి పులి’ అని ఆ ప్రాంతపు వెలమ కులస్తులని పొగుడుకోవడం ఒక ఆనవాయితీ. కాటమరాజు కథ, కన్యకా అమ్మవారి కథ ప్రత్యేకించి కులానుబంధంగా మాత్రమే గుర్తించబడ్డవి. ఈ విషయం కన్యకా అమ్మవారి ద్వారా మనకు చక్కగా తెలుస్తుంది. వలస పోయిన కోమటి కులస్తులు కన్యక కథనీ, ఆ అమ్మవారినీ వారివెంట తెచ్చుకున్నారు. వారు స్థిరపడ్డ ప్రతీ పట్టణంలోనూ (తుర్పు కోస్తాలో మరీ ముఖ్యంగా) కన్యక అమ్మవారి గుడి ఉండటం ఇందుకే. ఆ అమ్మవారి కథను ప్రాచుర్యంలోకి తెచ్చింది, అందుకు దోహదపడింది కూడా కోమటివారే. ఈ కులస్తులు అధికంగా ఉన్న పెనుగొండలో ప్రతీ యేటా కన్యక అమ్మవారి పండగ జరుగుతుంది. ఇందుకు భిన్నంగా సన్యాసమ్మ, కామమ్మ కథలను ఏ కులాలవారూ ప్రత్యేకించి ‘తమది’గా చేసుకోలేదు. ఈ కథలకు సంబంధించి జాతరలు, పండగల వంటి సంప్రదాయం లేదు; అధికారికంగా ప్రదర్శించే హక్కు ఉన్న కళాకారులంటూ లేరు. ఈ కథలు తెలిసిన ప్రాంతాలలో ఎక్కువమంది ఇతర కులస్తులై ఉండి ఈ కథలని వారివిగా అనుకోలేకపోవడం ఇందుకు మూల కారణం.