I.
ఈసారికూడా ఎవరి చలువ వల్లనైతేనేం, మరీ ఆలస్యం కాకుండానే కథ 04 పుస్తకం చేతికందింది. పుస్తకం పంపిస్తూ కాస్తీవొక్కసారికీ నామాట విని మొదటి కథ మొదటే చదవకన్జెప్పన్నాడు, నా శ్రేయోభిలాషి మిత్రుడు (శ్రేయోభిలాషులందరూ స్నేహితులు కారు, అండ్ వైసీ వెర్సా! కర్ణమితృత్వమ్, ఆషాఢభూతిత్వమ్ గురించి మరెప్పుడైనా!). నేనూ సరేనంటూ అలాగే చదవలేదు కూడానూ. కాకపోతే, ఆ సలహా పెడచెవినెట్టినా లాభమే తప్ప నష్టమేమీ జరిగుండేది కాదని నా చదివిన్తర్వాతభిప్రాయం, కాస్త గఠ్ఠిగానే. పుర్రెలో ఏ పురుగు కదిలిందో తెలీదు కానీ, ఇలా రాయడం మొదలెట్టాను. ఇంత పొడుగ్గానా, అంటారా? మళ్ళీ మళ్ళీ చెప్పే ఓపికా కోరికా లేవు, అందుకని. చెప్పేదేదో ఒకేసారి చాతనైనంత చెప్పేద్దామని, ఎవరో ఒకరు చదవకపోతారా, ఆలోచించకపోతారా అనుకుంటూనూ. ఇక ఈ సంకలనంలో సీటు దొరికిన కథలూ, కథకుల విషయానికొస్తే…
ఈ కథ సాదాసీదాగా ఏ ఇంటలెక్చువల్ ప్రిటెన్షన్సూ లేకుండా మామూలుగా పోయొచ్చిన ఓ నాస్టాల్జిక్ ట్రిప్పు. ఏ ఎత్తుపల్లాల గతుకులూ (కథనంలో) లేకుండా సాఫీగా సాగే ఓ చిన్నప్పటి యాది.
వయసు మళ్ళింతర్వాత పట్నంలోనో వేరే ఊళ్ళోనో ఉన్న పిల్లల గూడు చేరిన తలిదండ్రులూ, వారికి ఠంచన్‌గా టైముకి చూపబడే నిరాదరణా జరపబడే అవమానాలూ, ముసలి ప్రాణం ఉసూరుమని మళ్ళీ పల్లె ఒళ్ళో తలబెట్టుకుని మూసిన కన్ను తెరవక పోవడాలూ…మంచి బిడ్డలూ వారినర్ధం చేసుకోలేని తలిదండ్రులూ మనకెక్కడా కనపడరు. ఎందుకంటే అది కథకుల టైమ్ టెస్టెడ్ అండ్ వెల్ ప్రూవెన్, అండర్‌డాగ్ క్రియేషనూ-సపోర్టూ-ఫర్ ది డౌన్‌ట్రాడెన్-ఫ్రేమ్‌వర్క్‌ని ఆబ్వియస్‌గా దెబ్బ తీస్తుంది కదా. రోజుకో వేరే చొక్కా లాగూ వారమంతా వేసి నాకేడుగురు పిల్లలని బుకాయించినట్టుంటుంది ఈ మూస కథలు చదివినప్పుడల్లా. మీరిప్పటికెన్ని కథలిలాంటివి చదివుంటారు? కానీ, కులాన్ని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నారని పిల్లల్నొదిలెళ్ళిపోవటం ఇప్పటిదాకా మీరు చూసుండరు. ఈ మధ్య శతదినోత్సవాలు జరుపుకుంటున్న సూపర్‌హిట్ క్యాస్ట్ ఐడెంటిటీ పాలిటిక్స్ కిచ్చిన మొమెంటో కాబోలు మనల్ని ‘పరవె’త్తించే ఈ మస్తాన్ గారి కథ. సెల్‌ఫోన్లకి వాడే రిప్లేసబుల్ ఫేస్ ప్లేట్లలా కులం పేరు మార్చుకుని ఈ కథని ఎవరైనా వారి వారి కులపు కథలా చెప్పుకోవచ్చు. ఇదేనేమో ఈ కథకున్న ప్రత్యేకత. అంతగా పరిచయం లేని చాకలివాళ్ళ వ్యథాభరిత జీవితాల్ని అలవోకగా చిత్రీకరించిన కథ అంటూ సంపాదకుల మెచ్చుకోలు! కొత్తగా మనకు చాకలివాళ్ళ జీవితం గురించి ఈ కథతో ఏం తెలిసిందీ అని ఏ చెరువుగట్టునో ఇంకా బండగా పడున్న ఓ చాకలిబండ కేసి మీ తల బాదుకోండి. పాపమని జాలిపడి కనీసం అదైనా ఒకటో రెండో కొత్త సంగతుల్చెప్తుందేమో చూద్దాం.
ఏవేవో కారణాలెతుకుతూ ఉన్నట్టుండి పిచికలేవబ్బా అని చుట్టూ చూసి అవి అంతరించిపోతున్నై అని హఠాత్తుగా ఎవరైనా అనుకుంటే పెద్ద ప్రమాదమేమీలేదు గానీ, అట్లా అనుకోడాల్ని ఇలా మనమీదికి అచ్చేస్తేనే తల్నొప్పంతా! నేనుండనే ఉన్నాను, చెప్పిందింకెవరో కాదూ శ్రీ పాపినేని కదాన్చెప్పి బోల్డంత కంగారడిపోయి వెంటనే వెబ్బంతా వెతికేశి, ఆర్నిథాలజిస్టు ఫ్రెండ్లను అర్ధరాత్రి కాల్చేశి ‘ఏఁవర్రా, మన పిచికేఁవైనా ఎన్డేన్జరైన్దా’ననంటూ తిట్లూ చీవాట్లూ తినేశిన్నూ. ఎన్విరాన్మెంటూ, బయోడైవర్సిటీ, ఒక్క క్షణంపాటు మనల్ని ఆలోచింపజేసేందుకు ఇంకేదో ఒక చిన్న విషయం చెప్తారేమో రచయిత అనుకుంటాం. అటువంటివేమీ జరగవు. ఈ కథ పిల్లల కోసం రాశారా లేక పెద్దల కోసమా? బహుశా సమాజం కోసమయుండవచ్చు, పిచికలంతరిస్తున్నై అంటూ, మాడిపోండని మానవాళికి శాపాలు పెడుతూ. రచయిత ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ కథాంశం కొత్తదీ కాదు, కొత్తగా మనకు చెప్పిందేమీ లేదు. మోతాదుకు మించి మెలోడ్రామా, అస్తవ్యస్తపు ఆంత్రపోమార్ఫయిజేషనూ, మాండలికమూ గ్రాంధికమూ కలగాపులగమైన భాష, అనవసరమైన వర్ణనలూ చిత్రణలతో తన కథను తానే ఇంతలా బలహీనపర్చుకోడంలో ఏ ప్రయోజనం ఉంది? ఈ కథను కనీసం ఒక్కసారైనా ఎడిట్ చేశారా లేక పొరపాటున చిత్తుప్రతిని సంకలించారా? ఇలా అర్ధంలేని భావావేశపు అయోమయాస్పష్టతలలో ఏదేదో చెప్పబోయి ఏమీ చెప్పలేక పోయిన కథ ఈ సంకలనంలో ఇదొక్కటే కాదు. శ్రీ వెంకట కృష్ణ కథలో ఇంకొకాయనకి వాళ్ళ నాయన భిక్షావృత్తి నచ్చదు. కరువు సేద్యానికి దిగి దెబ్బ తింటాడు. చివర్లో తండ్రి దారే పట్టి చీకటి వీధుల్లో ఊరు ఊరంతా ఉలిక్కిపడి నిద్దర్లేచేలా గాఠ్ఠిగా గంట మోగిస్తాడు. ఈ రచయిత ప్రత్యేకత మన ఇంకొకాయన నష్టపోయింది ప్రెసిడెంటు రెడ్డి మోసం వల్ల, మీరనుకుంటున్నట్టు సేద్యం వల్ల కాదు అని మనకు చెంప పగిలేట్టు చెప్పడంలో తెలుస్తుంది. ఈ కథ ద్వారా రచయిత మనకేం చెప్పదల్చుకున్నారు? కులవృత్తిని ఒదులుకోవద్దనా? కరువు సేద్యం చేసుకుంటూ బతుకు గడపడం ఎంత కష్టమో అనా? ఏది సేద్యపు గండం ఏది సాటిమనుషుల మోసం? వృత్తీ, సేద్యం, మోసం, వీటికి చెప్పే కథలో పొంతన ఏమిటి? అంతుబట్టని ప్రశ్నలివి. పొరపాటున, కరువు సేద్యంలో ఉండే కష్టనష్టాల గురించో, తత్వాలు పాడుతూ తిరిగే భిక్షువుల గురించో ఏదో తెలుస్తుందనుకునేరు. అలాంటి భయమేమీ అక్కర్లేదు.
ఇలా చూస్కుంటూ పోతే, అసలెందుకు చోటుచేస్కున్నయ్యో అస్సలర్ధం కాని కథలు ఈ సంకలనంలో కాసినున్నై. మిగతావన్నీ మాగొప్పవని కాదు కానీ కొన్నిటికి ఏరకమైన కనీస ప్రచురణార్హత లేదని. పోనీ, ఆ మాటనడం పరుషమే అనుకుందాం. ఇంతకు మునుపెక్కడో అచ్చయినై కాబట్టి వాటికా అర్హత ఉందనే అనుకుందాం. కానీ ఇలా వార్షిక సంకలనాల్లో చేరేంత గొప్పదనం ఈ కథల్లో ఏమిటి? వినూత్నమైన కథావస్తువా, కనీసం ఒక్క కొత్త దృక్కోణమా? కథన శైలి, కథాశిల్పం, సంఘటనలూ పాత్రల చిత్రణా, వేటి ఆధారంగా ఈ కథలు ఎన్నుకోబడ్డాయి? ఈ సంకలనం ఇన్ని పేజీలకు తగ్గరాదన్న నియమం ఏమైనా ఉందేమో తెలియదు. షరా మామూలుగా రాసేసిన శ్రీ సుంకోజీ, శ్రీ ప్రతిమ, శ్రీ సలీం, శ్రీ జాతశ్రీ తదితరుల ఫ్రేమువర్కు కథలు షరా మామూలుగానే, ప్రతీదీ పేరుబెట్టి నే చెప్పలేను గానీ, మీరే చదూకొని నిర్ణయించేసుకోండి. బుట్టదఖలు చేయాల్సిన కథలని అనను కానీ, ఏ రకంగా చూసినా మంచి కథలు మాత్రం కాదని చెప్పగలను. చెప్పదలచుకున్న విషయం ఏమిటి? అనాదిగా ఉన్న ఆచారాలా, కొత్తగా చోటు చేసుకుంటున్న మార్పులా? వాటికి మూలాలెక్కడ, కారణాలేమిటి? వాటి స్థాయి వైయక్తికమా వ్యవస్థాగతమా, సామాజికమా సంస్థాగతమా? వాటి ప్రభావాల్ని ఎలా విశ్లేషించడం? ఎటువంటి పాత్రలూ సన్నివేశాల నిర్మాణం చెప్పదలచుకున్న విషయానికి తోడ్పడతై? ఎక్కడ క్లుప్తత, ఎంత వర్ణన అవసరం? ఏ రకమైన భాష వాడాలి? ఏ ఎమోషన్ ఇంప్లిసిట్‌గా అందించాలి, ఇంకేది ఎక్స్‌ప్లిసిట్‌గా చెప్పాలి? ఇటువంటి తర్జన భర్జనలేమీ పడకుండా రాసిన కథలని మాత్రం చెప్పగలను. ఒఖ్ఖ అక్షరం ఛస్తే కదలనని కన్ను మొరాయిస్తుంటే ఇంతలో కాసిని తెలిసిన పేర్లు కనపడ్తాయి, తెలివైనవాళ్ళని పేరుబడ్డ తాలుకు రచయితలవి.
ఇప్పుడు మీకు అర్జెంటుగా కొంచెం విశ్రాంతి అవసరం. కాస్త సేద తీరండి. నిదానంగా శ్రీ జాజుల గౌరి నీళ్ళబాయి చదవండి. కొంచెం పొడుగెక్కువ, ఐనా పర్లేదు, అదేమంత పెద్ద విషయం కాదు. ఈ కథ సాదాసీదాగా ఏ ఇంటలెక్చువల్ ప్రిటెన్షన్సూ లేకుండా మామూలుగా పోయొచ్చిన ఓ నాస్టాల్జిక్ ట్రిప్పు. ఏ ఎత్తుపల్లాల గతుకులూ (కథనంలో) లేకుండా సాఫీగా సాగే ఓ చిన్నప్పటి యాది. జ్ఞాపకాలు పాతవయ్యేకొద్దీ మనసుపై వాటి తాలూకు గాట్లు మానుతూ ఉంటై. కొత్త అనుభవాలల్లే అవి మనల్ని పట్టి ఊపేయవు. చిన్నగా పలకరించెళ్ళిపోతుంటై. అప్పుడప్పుడూ తట్టి పిలిచే వాటి తాకిడి తగ్గడం వల్లో ఆ బాధ కలవాటు పడ్డం వల్లో, అవి పంచుకునే గొంతులో సాధారణంగా వినిపించే ఒక నిర్విచారపు జీర ఈ కథలో వినండి. హోమ్‌సిక్‌నెస్సూ ఎక్యూట్ మెలాంఖలీల్లేని ప్యూరిఫైడ్ నాస్టాల్జియా. ఉన్నట్టుండి ఏదో తెచ్చిపెట్టుకున్న తపనతో, బావి పూడిపోడానికేవేవో కారణాలెతకదు, అలవాటుగా ఏ ప్రపంచీకరణనో నిందించదు, మనకింకేమో చెప్దామని తాపత్రయ పడదు. లేని గొప్పతనం ఆపాదించుకోదు, గిల్టునగలు తొడుక్కోదు. ఈ ఊసు కది అనవసరమని తెలుసేమో. ఈ నీళ్ళబాయి ప్రస్తుతం మనకున్న సోల్ వాటరు సోర్సు. ఓ గుక్క తాగి నాతోపాటుగా మళ్ళీ పదండి.
ఒక ఆలోచనొస్తుంది ఓ చిన్న ఊహనెంబడెట్టుకుని. దానికి జీవాన్నివ్వడం, పెంచి పెద్ద చేయడం, అన్ని వైపులనించీ నిశితంగా పరిశీలించి మనసుకో మేధకో మరి రెంటికీనో నప్పేటట్టు నిర్దిష్టమైన రూపాన్నీ గుణాన్నీ ఇవ్వడం లాంటి అందరు కథకులూ రొటీనుగా చెయ్యాల్సిన పనులేవో చేసేసుంటారన్న అపనమ్మకంతో శ్రీ ఆజాద్ కథలో బందీలైపోతాం. వచ్చిన ఊహను వచ్చినట్టు ప్రిమెచ్యూర్ డెలివరీ చేస్తే ఇలానే ఉంటుంది. సగటు రచయితలు చేయాల్సిన పనులు చేయడం చాతకాక కాదు, అలక్షంతో చేసుండరని నా నమ్మకం. కాస్త మంచి రచయిత అని మనమనుకుంటాం కదా అప్పుడప్పుడూ, అందుకని. ఈ కథ చెప్తున్న పాత్ర తన గురించి అంతలా చెప్పుకోవాల్సిన అవసరం కథకు ఏమిటి? ఉన్నట్టుండి చూపించిన ముగింపు అప్పటిదాకా చెప్పిన కథకు అతికిందా? కథావస్తువును పాత్రల సంభాషణలు లేదా ప్రవర్తనల ద్వారా విశదంగా చర్చించగలిగారా? పాఠకుని మదిలో ఆలోచనలు రేకెత్తించేలా కథ పదును పెట్టబడిందా? ఈ కథకు ఇంత నిడివి అవసరమా? ఈ కథలో ఏ పాత్ర ఎంత అవసరం, ఏది కాదు? ఈ కథ కాని కథ చాలా విషయాలనే చర్చకు లేవనెత్తుతుంది సంపాదకుల్చెప్పినట్టే. కాపోతే చర్చాంశాల్లో వారిచ్చిన లిస్టుకీ మన లిస్టుకీ సాపత్యమేమీ ఉండదు. అదీ వచ్చిన చిక్కల్లానూ.
ఇక, జెర్రీ వెంబడి పడే తొందర్లో ముందూ వెనుకా చూసుకోకుండా టైక్ చేతిలో చిక్కిపోయి, మొట్టికాయలూ పిడిగుద్దులూ తినేసే టామ్ గుర్తొస్తుంటాడు నాకు ఈ మధ్య వీ. చంద్రశేఖర్రావు గారి రచనల్చదివినప్పుడల్లా. అవసరం కోసం కన్న ఓ చిన్న పిల్లి తర్వాతో పెద్దపులిగా మారి మొదటికే మోసం తెచ్చినట్టు వీరి టెక్నిక్ ఓ భూతంలా పెరిగిపోయి, టైక్ టామ్‌ని ఆడించేసినట్లు, ఆయన్ని పెట్టే చిత్రహింసలు మనకీ తాకుతుంటై. ఇప్పుడిక్కడంత ప్రమాదం లేదు కానీ, అసలేం రాస్తున్నారో మనకర్థం అయ్యీ కాకముందే (తెలివైన రచయిత అని మనకో అభిప్రాయం ఉండడంతో ప్రయత్నిస్తాం గదా) ఈ కథలో ఉ.కొండయ్య ఉత్త పాత్రేనా? అంటూ మనకు సంపాదకుల ములుగర్ర పోటు, ఏదో హార్రరు సినిమా ప్రివ్యూ లాగా. సదరు ఉ.కొండయ్య గారు ఎవరైననూ పాఠకులకేమియునూ తేడా పడదని కలెక్టరుగారు గ్రామ ప్రజల కోసం వేయిస్తున్న చాటింపహో. (అయితే ఇదో సాకుగా తీసేస్కుని, ఏ టెక్నిక్ ఐనా సరే వాడ్డమే పెద్ద బ్యాడ్ అనీ, అలా రాయడం ఏ కొద్దిమంది విమర్శకుల మెప్పు కోసమో చేసే పని అనీ, అది ప్రజలకూ సమాజానికీ దూరం ఐపోడమేననీ కథాప్రయోజనాల గురించి ఊక దంచే విప్లవ ప్లావిత ప్లవంగాలను దూరంగా తరిమేయండి, యమర్జెంటుగా ఇప్పుడే).
పోతే, రామాయణం హరికథ రాత్రంతా చెప్పిన భాగవతారు కమ్యూనిజం వర్ధిల్లాలంటూ మంగళహారతందుకుంటే ఎంత అసంబద్ధంగా ఉంటుందో శ్రీ రమణజీవి కథ చదివితేగానీ తెలీదు. నలుగురు పాండవులు చదివి కొత్త గొంతూ కొత్త భావనలూ అని ముచ్చటపడి అభిమానం పెంచుకున్న మనకు కాస్త బుద్ధొస్తుంది. చాలా పొడూగ్గా ఏదో ఇంటర్‌ప్లానెటరీ యుద్ధంలో గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ లా సాగీ సాగీ ఈ కథ, చివరికి “అయితే.. దయాపూరిత మానవజాతి ఉద్భవిస్తుందని ఆశిద్దాం” అంటూ ముగించి మనల్నికూడా నిర్వీర్యుల్ని చేసేస్తుంది. అరాకొరా ఏమైనా మిగిలుంటే వెంటనే కథ ఏ ప్రేరణతో రాశారో శెలవిచ్చిమరీ నూటికి నూరు పాళ్ళ కల్తీలేని వంధ్యత్వం ప్రసాదిస్తుంది. అంత పెద్ద కథ రాసికూడా చివర్లో అదెందుకో చెప్పాల్సొచ్చిందంటే, ఇది రచయితకు మన మీదున్న నమ్మకమా, లేకపోతే తనపైనున్న గౌరవమా? ఏమైనా సరే ఇది విచారపడాల్సిన విషయం, మీకింకా ఓపిక మిగిలుంటేనే, సుమా! తప్పటడుగులేసే పిల్లలు తూలిపడ్డంలో తప్పు లేదు, చేయూతనిచ్చి లేపబుద్ధౌతుంది కూడానూ. మరి మద్దిమానుల్లా పెరిగినవాళ్ళు కూడా తూల్తుంటే? ఈ రచయితల బలమైన ఊహాశక్తినీ, ప్రతీకాత్మకతనూ మెచ్చుకుంటూ సంపాదకుల ముందుమాట చూస్తే ఉన్నట్టుండి ఏ బోడిచెట్టు కిందా కూచోకుండానే నాకొచ్చేసింది, ఎన్‌లైటెన్‌మెంటు! శ్రీ పాపినేని కథలో పిచికలు నిజం పిచికలు కావు. అవి సాహిత్య ప్రతీకలకి ప్రతీకలు. అంటే, మనం రక్షించుకోవాల్సింది పిచికల్ని కాదన్న మాట! ఎండేంజర్డ్ స్టేటస్ కావాల్సిందీ రావాల్సిందీ ప్రతీకలకి!! నౌ, ఐ ఫీల్ వెరీమచ్ లిబరేటెడ్!!
మోతాదుకు మించి మెలోడ్రామా, అస్తవ్యస్తపు ఆంత్రపోమార్ఫయిజేషనూ, మాండలికమూ గ్రాంధికమూ కలగాపులగమైన భాష, అనవసరమైన వర్ణనలూ చిత్రణలతో తన కథను తానే ఇంతలా బలహీనపర్చుకోడంలో ఏ ప్రయోజనం ఉంది?
ఈ కథామైదానం లో ఉన్న ఒక ఆముదపు చెట్టు శ్రీ అక్కిరాజు కథ అంటుకొమ్మ. సామెత కోసం అన్నమాట తప్పితే సదరు ప్రావెర్బియల్ చెట్టుకంటే ఓ జానెడో మూరెడో పొడుగెక్కువే ఉన్న కథ. కాసేపు ఆలోచింపచేసే కథ. మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చే కథ. చెప్పదలచుకున్న విషయం పై గొప్ప నమ్మకమూ, చెప్పేయాలన్న తొందరపాటూ, చెప్పే తీరులో చూపించే అశ్రద్ధా శ్రీ అక్కిరాజు కథల్లో మామూలుగా కనిపిస్తుంటై. రచయిత ఉద్దేశం గొప్పది కాబట్టీ రచన కూడా గొప్పదే అనుకుంటున్నాడేమో అనిపించేటట్టన్నమాట (మొన్నెప్పుడో గుర్తు చేసుకున్నాం, వల్లంపాటి ఈ సమీకరణం తప్పు అని కథాశిల్పం లో అంటాడు గదా, అని). చెప్పదలచుకున్న విషయంపై అవగాహనే కాక చెప్పిన తీరులో కనపడే నిజాయితీ వల్ల ఈ కథలో అదంతగా కనిపించదు. మన ఎదురుగానే ఉండీ మనం గమనించని, గమనించినా గ్రహించని ఓ చిన్న విషయాన్ని తీసుకుని (కానీ దాని ఇంపాక్ట్ చాలా పెద్దది) దానికో మంచి పోలిక నివ్వడం, ఊహించలేని ముగింపుతో పాఠకుల్ని అబ్బురపరచడం, తద్వారా రాబోయే తరంలో చెరిగిపోబోయే ఇంకొక్క అసమానతని మనసుకంటేలా సరళంగా సూచించడం, పాత్రలతో పెద్ద పెద్ద ఉపన్యాసాలూ గట్రా ఇప్పించకపోవడం, సహజమైన సంభాషణలూ సన్నివేశాలూ, ఇలా మంచి లక్షణాలు చాలా ఉన్న కథే ఇది. వచనంలో కనిపించే మొనాటనీ, అక్కడక్కడా కొంచెం పక్కదారి పట్టడమూ చిన్న వీక్‌పాయింట్స్. ఈ కథలో పాత్రలు చాలా విషయాలే చర్చిస్తాయి తమ ప్రయాణంలో భాగంగా. అయితే, వాటిద్వారా తన అభిప్రాయాల్ని మనమీద రుద్దకపోవడంలో కథ పట్ల రచయితకున్న నిజాయితీ తెలుస్తుంది. రచయిత ఏ మాత్రం నిగ్రహం కోల్పోయి కథకు ఇంకేవో రంగులద్ద ప్రయత్నించినా ఈ అంటుకొమ్మ బతికేది కాదు (మళ్ళీ ఓసారి గొంతెత్తి అరుస్తాను, సాహిత్యంలో చెప్పే విషయమే కాదూ, చెప్పే తీరు కూడా ముఖ్యమే!). అంటే, ఈ రచయిత కథల్లో కనబడే లోపాలు క్రియేటివిటీ లేక కాదు, సాహిత్యపు మౌలిక లక్షణాలూ, రచనపై వాటి ప్రభావమూ అంటే ఉన్న నిర్లక్షం వల్లనే అన్న నా అనుమానం నిజమేనేమో. ఏమైతేనేం, కథనంలో కూడా తగినంత శ్రద్ధ చూపించి శిల్ప నిర్మాణంలో కృషి చేస్తే, మనం నమ్మకం పెట్టుకో(పెంచుకో)దగిన కథకుడు.
చివరిగా నేన్చదివిన ఆ మొదటి కథ శ్రీ డా. బోయ జంగయ్య గారి ఇప్ప పూలు. ఈ పూలు నమిలిన ప్రతివారికీ గన్నేరు పప్పుల ప్యాకెట్టు ఉచితం. ఈ సంకలనంలో కథలు చదివి ఎలా రాయకూడదో చాలావరకూ నేర్చుకోవచ్చు. ఈ కథల నెన్నుకున్నది కేవలం కథాసాహితి సంపాదకులేనా? కథల్లో ఇంత వ్యత్యాసం కనపడుతుంటే వీటన్నిటికీ ఒకే బైండింగ్ ఎలా ఇచ్చారు? ఇవ్వగలిగారు? నీళ్ళబాయికో అంటుకొమ్మకో కూసింత రెస్పెక్టిచ్చి కాసిన్ని కథలు తీసేయాల్సింది. కేవలం సానుభూతి కోసం పుట్టించిన పాత్రలూ, ఎబ్బెట్టుగా అతికీ అతకని పదాలూ భావాలూ, ఏ మాత్రమూ కుదింపూ సవరింపూ లేని రచనలూ. వస్తువును లోతుగా పరిశీలించి, చక్కటి భాషతో సజీవంగా మలచగల్గిన రచయితలు కూడా ఇలాంటి కథలు ఏ ప్రయోజనం ఆశించి రాస్తున్నారో వారికే తెలియాలి. ఇవా, చివరికి ఈ సంవత్సరం వచ్చినవాటిలో గొప్ప కథలు అన్న అనుమానం మనల్ని పీడిస్తుంది. మీకో సంగతి చెప్పనా? మనం చూస్తున్నది రోగ లక్షణాల్ని, కారణాన్ని కాదు. ఈ కథలకు బదులుగా ఇంకో పన్నెండు కథలేవో సంకలించినా పెద్ద తేడా ఉండేదనుకోను. ఏదో చెప్పేసి ప్రపంచాన్ని ఉద్ధరించేయాలన్న విపరీతమైన తపనలో, అలా చేయడం ద్వారా ఏదో మహత్తర సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నామన్న ఆత్మ సంతృప్తితో స్మగ్వినయంగా* కథలు రాసేస్తూ వారూ, ఏమిటంటున్నారో ఎందుకంటున్నారో అర్థం కాక తల పగిలిపోతూ కూడా, మనకర్ధంగానిదేదో ఉండే వుండాలనుకుని సమర్ధించుకుంటూ మన అటెండన్సూ మామూలే.
* స్మగ్వినయము = A state of being smug about one’s apparent వినయము. (As usual, the word and the meaning are supplied by న్యూ సెంచురీ ఇంగ్లీష్‌టెల్గూ బైలింగ్యువల్ కాలేజియేట్ ఎడిషన్ ఆఫ్ సోకాల్డిక్షనరీ touted as a singularly unique dictionary with its title written exclusively and only in telugu).
II.
ఈ కథాసాహితి సంపాదకుల్లో శ్రీ శివశంకర్ నాకు తెలీదు కానీ నవీన్‌గారితో కొంచెం పరిచయం ఉంది. వారు పరోక్షంగానే నాకు ఎక్కువ తెలుసు, వారి గురించి విన్నవన్నీ మంచిమాటలే. డెట్రాయిట్ తానా సభల్లో కలిసినప్పుడూ చాలా సంగతులు మాట్లాడినప్పుడూ, శ్రీ నవీన్ గురించి విన్న మాటల్లో అతిశయోక్తి లేదని అనుకున్నాను కూడా. ఇదెందుకు చెబుతున్నానంటే, వ్యక్తిగతంగా వారిమీదున్న నా అభిప్రాయాల దృష్య్టా ఈ కథలను ఎంచుకోవడంలో సంపాదకుల విచక్షణలో ఏ రకమైన ఇతరత్రా హెచ్చుతగ్గులూ ఉంటయ్యని నేను అనుకోటంలేదు కాబట్టి. వారి శక్తికి మించే శ్రమించి దొరికిన అన్ని కథల్లో తాము మంచివనుకున్న కథల్నే ఈ సంకలనాల్లో చేరుస్తారనీ, ఆ శ్రమా నిబద్ధతల వల్లనే ఈ సంకలనాలు ఆటుపోట్లకు ఎదురొడ్డి ఇన్నేళ్ళుగా వస్తున్నాయనీ అనడంలో నాకు సందేహం లేదు. ఇలా అవిచ్ఛిన్నంగా సంకలనాలు తేవడంలోనూ, కథల ఎంపిక విషయంలోనూ ఎన్ని ఒత్తిళ్ళు ఉంటయ్యో మనం ఊహించగలం. వాటిని సాధ్యమైనంత తట్టుకుంటూ ఇంతకాలం నిలబడగల్గడమూ, కథని కాపాడుకోడానికి ఇంత పాటు పడడమూ సామాన్యమైన విషయాలు కాదు. అందువల్ల, సంపాదకుడు కావటంవల్లే తమ సొంత కథ వేసుకున్నారనేలాంటి చవుకబారు ఆరోపణలని ప్రస్తావించడం గూడా అనవసరమే. తనా మనా తేడా చూపకుండా ‘డూ అన్‌టూ అదర్స్…’ ని వల్లించేవాళ్ళే కాక పాటించేవాళ్ళూ ఉండడంలో ఆశ్చర్యమేమీలేదు కదా. ఈ మాటలనడంలో నాకున్న ఉద్దేశమేమంటే ఇలాంటివి విడుదలైనప్పుడల్లా సంపాదకులకీ సహకరించే వారికీ ఏవో కాన్‌స్పిరసీలూ నెపోటిజపు థియరీలూ అల్లేసి వైయక్తిక దూషణలకి దిగిపోయి రాద్ధాంతం చేసేవారివల్ల (వీరు తక్కువ సంఖ్యలో ఏమీ లేరు) ఏ ప్రయోజనమూ ఉండదు కాబట్టి విమర్శను సాహిత్యపరంగా మళ్ళించడానికి ప్రయత్నించడం.
అలాగనేసి ఈ సంపాదకులు విమర్శకు అతీతులేమీ కారు. నాకు సుతరామూ నచ్చనివి వీరు కథలకిచ్చే ముఖపరిచయాలు, మొదటే రాసే ముందు మాటలూ. ఇవి చదవబోయే కథను సూక్ష్మంగా పరిచయం చేయడం పోయి, ఆ కథను ఏదో ఒక పెద్ద చట్రంలో చూపిస్తూ వారి ఎంపికకు సంజాయిషీ నిచ్చుకుంటున్నట్లుంటై. నాగరిక, గ్రామీణ, సాంఘిక, ఆర్ధిక, మతకల్లోలాల, గ్లోబలైజేషన్ కబళింపుల, తుపాకీ గొట్టాల, ఫ్యాక్టరీ చిమ్నీ పొగల, ఏదో ఒక, మరింకేదో ఒక నేపథ్యాలూ, వాటిల్లోనుంచి అసలింకేదో ఒక నేపథ్యంలో శ్రామిక, రైతు, దళిత, మైనారిటీ (ఒకటే రకము), స్త్రీ (పలు రకములు), తదితర జీవితాల చిత్రణలూ లేదూ నివాళులూ ఇవీ సర్వసాధారణంగా కనపడే పరిచయాలు. వీటిని ఎంత తరచుగా వాడతారంటే, పడికట్టు పదాలకంటే విలువ తగ్గిపోయేంత ఈ నేపథ్యాలకీ, చిత్రణలకీ, నివాళులకీ. అప్పుడప్పుడూ నాకొచ్చే అనుమానం ఈ ముందుమాటల వల్లే నాకు కథలు నచ్చట్లేదా? అని. ఇవి చదివేనేమో ఎంతో గొప్పగా ఊహించుకుంటాం ఆ కథల గురించి. అవి చివరికి ఊరిజనాల్ని నిరాశ పెట్టిన సర్కస్ ఏనుగుల్లా అఘోరిస్తుంటై. కొన్నిసార్లు ఓ మాములు కథక్కూడా ఇలా ఏదో ఒక నేపథ్యం అంటకట్టి మరేదో సామాజిక ప్రయోజనాన్ని ఆపాదించటం చూసినట్టే గుర్తు. ముందుమాటకు విలువ తగ్గడమూ అపహాస్యానికి గురి కావడమే కాక సంపాదకుల ఆలోచనావగాహనలు ఒక నియమిత పరిధికి కట్టుబడున్నయ్యనే అనుమానం కలగడమూ, ఇందువల్ల వచ్చే చిక్కులు. వీటిని సులభంగానే పరిష్కరించవచ్చుననే నా నమ్మకం.
సంపాదకులకున్న నిబద్ధత కేవలం సాహిత్యానికేననీ, కథాసాహిత్యానికి అంతర్గతమైన మౌలిక లక్షణాల ప్రాతిపదికగానే కథలను అంచనా వేయడమూ సంకలనంలో చేర్చడమూ జరుగుతుంది అని అనుకున్నాం. అంటే కథను ఏ రాజకీయ సాంస్కృతిక వాద నిర్వచనాల్లోనుంచో అంచనా వేయక పోవటం ద్వారా సాహిత్యాన్ని ఏ ఒక్క రకమైన వాదానికో ప్రయోజనానికో పరిమితం చేయకపోవడం. ఇలా కాని పక్షంలో ఏ సాహిత్య లేదా సాహిత్యేతర దృక్పథంతో కథల్ని బేరీజు వేస్తున్నారో విస్పష్టంగా చెప్పవల్సిన బాధ్యత సంపాదకుల మీద ఉంది. అవి ఏవైనా కావచ్చు గాక, ఇలా వారి ప్రమాణాల్ని, ప్రామాణికాల్నీ నిర్వచించటంలో రెండు లాభాలున్నై. ఒకటి, బురద తట్టల పెద్దమనుషులకి అది చల్లే అవకాశం ఇవ్వకపోవటం (చేసే కష్టమంతా చేసి చెడతిట్లు తినడంలో ఏ తృప్తీ లేదు కదా). కానీ ఇది కాస్త చిన్న విషయం. ముఖ్యమైందీ, రెండవదీ ఈ కథలన్ని ఏ ప్రమాణాలకు బద్ధులై సంపాదకులు సంకలించారో, అవే ప్రమాణాల ఆధారంగా ఆయా సంకలనాల్ని చదివి విశ్లేషించటానికీ, విమర్శించటానికి ఖచ్చితమైన ప్రాతిపదిక నేర్పరచడం ద్వారా సాహిత్యానికి రెట్టింపు మేలు జరగడానికి దోహదపడటం. ఇదెలా అంటే, ఉదాహరణకి సంపాదకులు మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాలూ నిర్వచనాల ఆధారంగా కథల్ని ఎంపిక చేశారనుకుందాం. అప్పుడు ఆ కథల్ని అవే పద్ధతుల్లో విశ్లేషించి విమర్శించడం ద్వారా మనం ఆ నిర్వచనాలనీ, వాటి ఆధారంగా ఎంపిక చేయబడిన కథల్నీ, సంపాదకుల నిర్ణయాలనీ తులనాత్మకంగా పరిశీలించవచ్చు. ఇటువంటి సిద్ధాంతబద్ధమైన విమర్శ వల్ల సాహిత్యానికి కలిగే మేలు వేరే చెప్పనక్కరలేదు. పరోక్షంగా జరిగే ఇంకొక మంచి ఏమిటంటే, ఇలాంటివే సంకలనాలు తెస్తున్న ఇతరులు వారి వారి ప్రమాణాలను నిర్వచించుకోవడం ద్వారా విభిన్నమైన సాహిత్యాన్ని వెలికితెచ్చే వారవుతారు. తెలుగులో ప్రస్తుతం వస్తున్న కొన్ని కథలు అన్ని వార్షిక సంకలనాల్లో చోటుచేసుకోవడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఇదంతా అద్దంలో చంద్రుణ్ణి చేత్తో పట్టుకొనే తపనే కావచ్చు, కానీ ప్రయత్నించడంలో తప్పు లేదనే నా విశ్వాసం.
ఇక కొంచెం ఇబ్బందిగానే చెప్దామనుకున్న మాటొకటుంది. కనీస ప్రచురణార్హత (లేదా సంకలనార్హత) లేని కథలు కొన్నున్నై ఈ పుస్తకంలో అన్న అభిప్రాయంలో నేను ఏకాకిని కాను. ఎవరి అభిప్రాయాల నిమిత్తమూ లేకుండా సంపాదకులు తమ ముందుమాటలనీ అసలు కథలనీ పోల్చి చూసుకొని నిజానిజాలు వారే నిర్ణయించుకోవచ్చు కూడా. ఇదే అభిప్రాయం పదిమందిదీ అయిన పక్షంలో (కాకపోయినా పర్లేదు) అటువంటి కథలు ఈ సంకలనంలో చోటు చేసుకోడం వెనుక మనకు రెండు కారణాలు కనపడతై. ఒకటి, సంపాదకుల దృష్టిలో కనీసమాత్రపు కథలను ఖరాబైన కాగితాల్నుంచి వేరు చేసే గీత ఏ పాతాళరేఖ దిగువో ఉండడం, లేదా రెండు, ఏవోకొన్ని సామాజిక సాహిత్యేతర ఒత్తిళ్ళ బలవంతానికి తల క్షణికంగా ఐనా సరే ఒంచడం(లేకపోతే, ఈ సంకలనం ఖచ్చితంగా మరింత సన్నంగా ఉండాల్సింది). అయితే ఈ రెండో కారణం ఇతరుల బలవంతం వల్లే కానక్కరలేదు, సదరు కథలు ప్రచురించడం వల్ల ఒక గొప్ప సామాజిక ఉపయోగముంది, అట్లుండేదే సాహిత్యమనే నమ్మకంలో సంపాదకులు ఇష్టపూర్వకంగానే చేసుండొచ్చు. అలా చేస్తే ఆ సామాజిక ఉపయోగపు నైజాన్నీ లక్షణాల్నీ బట్టి సంపాదకులు ఏదో ఒక వాద నిర్వచనపు గిరిలో ఉన్నట్టౌతుంది. ఇది నిజం కాదేమో అని ముందు పేరా మొదట్లో అన్నాను కదా. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ సంకలానాల్లో ప్రచురింపబడే కథలు నిజంగానే తెలుగులో వచ్చిన అన్ని కథల్లోనూ మంచివి అన్న అపోహను మనం పోగొట్టుకోవచ్చు. కానీ, ఇది నిజం కాదనే నా నమ్మకం, కాకూడదనే నా అభిలాష.
ఇందాకే ప్రస్తావించాను సంపాదకులు వాడే ముందుమాటల్లో తరచూ కనబడే పదాల గురించి. అయితే వారినే ఎందుకు తప్పు పట్టడం? వస్తున్నవన్నీ పడికట్టు కథలే అయితే వారు మాత్రం ఏం చేయగలరు, పడికట్టు ముందుమాటలు రాయడం తప్ప. సమస్య ఏ ఒక్క వార్షిక సంకలనానికో పరిమితం కాదు. ఇది రచయితల సాహిత్య దృక్పథానికి కూడా సంబంధించింది. సామాజిక సంక్లిష్టతల్ని ప్రదర్శించేదే కాక వైయక్తిక స్థాయిలో పరామర్శించే సాహిత్యం కూడా సాహిత్యమే, దాని కర్తవ్యాన్ని అది చక్కగా నెరవేర్చినంతవరకూ. ఏదో వాదాన్ని సమర్ధించేదో, ఏవో అసమానతల్ని ఎత్తిచూపేదో, ఏ సామాజిక సమస్యను గుర్తించేదో లేదా పరిష్కారం చూపేదో, ఏ వ్యథాభరిత జీవనచిత్రాన్ని ఆవిష్కరించేదో మాత్రమే గొప్ప రచన లేదా నిబద్ధసాహిత్యం (కమిటెడ్ లిటరేచర్) అనడం తప్పు. అటువంటి అభిప్రాయం ఉండటం వల్ల తాము మాత్రమే నిర్వచించిన సదరు సామాజిక ప్రయోజనాల పరిధిలోకి రాని ప్రతీదీ ఉబుసుపోక రచనే అని కొట్టివేయడానికి ఆస్కారం చాలా ఎక్కువ (ఏమి సమాజమో ఏమి ప్రయోజనమో, ప్రత్యేకించి సాహిత్యంలో ఎంత నైరూప్య పదార్ధమో ఇది!). పైన చెప్పినవన్నీ మంచి సాహిత్య సృష్టికి తోడ్పడే అంశాలే, కానీ వాటి చిత్రణ మాత్రమే గొప్ప సాహిత్యం కాదు. ఎక్కడిదాకో ఎందుకు, మన దగ్గరే మన చుట్టూనే ఉన్న జీవితాన్నీ, సంఘటనలు కూడగట్టుకుంటూ సాగుతున్న జీవనాన్నే చూడండి. ఎన్నో వేలవేల అనుభవాల అనుభూతుల కలగూర గంపలు, మన జీవితాలు. పల్లె నుంచి వచ్చినా పట్నం బిడ్డయినా, రైతుకూలీ గుమస్తా మంత్రీ మహారాజూ ఎవరి పిల్లలమైనా, బంగారు ఊయల నుంచి మురికికాలువ పక్కకు చేరినా, మురికి గుంటల్లో పుట్టి ముత్యాల పల్లకీ నెక్కినా, కోరికలూ బాధలూ, సుఖ దుఃఖాలూ, ఆవేశాలూ ఆనందాలూ అనుబంధాలూ ఎన్నో నిండివున్న జీవితాలు మనవి. ఏ సామీప్యం లేకపోయినా ఎంతో సారూప్యం ఉన్న జీవితాలు మనందరివీ. ఇంత విస్తారమై కూడా అనుక్షణమూ మరింతగా విస్తరిస్తూనే ఉంటై మన జీవనాలూ జీవితానుభవాలూ. వాటన్నిటినీ నిబద్ధసాహిత్యానికి పనికిరావని తోసిరాజనకండి. ఏ ఒక్క పక్కకొమ్మకో మాత్రమే ఆకులున్న వేయి కొమ్మల మర్రిచెట్టు పచ్చదనానికి సంకేతం కాదు. బోడికొమ్మల చెట్లకింద నీడ దొరకదు.
తమ కుల మత రాజకీయ వాద ప్రచారాల్నీ స్వప్రయోజనాలనీ వారి రచనలకి సాకుగా వాడుకుంటూ అదే నిజమైనదని చేసే నినాదాల దౌర్జన్యంతో వచ్చేది నిబద్ధత గల సాహిత్యం కాలేదు. అపరిపక్వమైన ఊహా సంపర్కపు ఆద్యంతపు తొందరలో ఫ్రాంకెన్‌స్టైన్ ప్రయోగాలు ప్రసవించే అష్టావక్ర కథాకళేబరాలు నియంత్రణ గల సాహిత్యం కాలేవు. దినపత్రికల వార్తల్నుంచి అరువు తెచ్చుకున్న అర్ధగంట అనుభవాల అనుభూతుల్లోంచి పుట్టేది నిజాయితీ గల సాహిత్యం కాలేదు. రచయిత లక్ష్యం తనలో మమేకమైన భావానికి నిర్దిష్టమైన రూపాన్నిచ్చి సంపూర్ణమైన రచనగా తీర్చి దిద్దటం. అదొక్కటే రచయితకు తన పట్లా తన రచన పట్లా సమాజం పట్లా ఉన్న బాధ్యత. ఆ ఏకైక బాధ్యతను అంకితభావంతో నిర్వర్తించినప్పుడు పుట్టేది నిబద్ధసాహిత్యమే. అలా కానప్పుడు జరిగేది సాహిత్య విధ్వంసమూ, చేసేది సమాజ విద్రోహమూ. పడగెత్తి బుసకొట్టే నాగుపాము నెదుర్కోడానికి చెదలు పట్టి పొడి రాల్తున్న వెదురు బద్ద పనికిరాదు. జిలేబీలు తిన్న వేళ్ళు నాక్కుంటూ సద్గురుస్వాములవారు తీపి తినడం వల్ల కలిగే హాని గురించి చెప్పితే ఎవరూ వినరు. తమ స్వంత రచనల పట్లే నిబద్ధత, నిజాయితీ లేని రచయితలు చూపే సామాజిక చైతన్యమూ చేసే ఉద్బోధా ఇలాంటివే. అందుకే అంటున్నది, సాహిత్యపు మౌలిక లక్షణాలని గ్రహించాలనీ, ఎన్నుకున్న కథాంశాలకి పూర్తిగా న్యాయం చేయాలనీ, అదొక్కటే వారికున్న బాధ్యతనీ. అటువంటి నిజాయితీ రచన ఎలానూ సమాజంపై తన ప్రభావాన్ని తప్పక చూపిస్తుంది. కానీ, ఏరకమైన విమర్శనూ స్వీకరించడానికి ప్రస్తుతం రచయితలూ కవులుగా చలామణీ అవుతున్నవారు సిద్ధంగా ఉన్నారని నేననుకోను. వీరి ప్రజ్ఞా పాటవములపై వీరికి మిక్కిలి ఆత్మవిశ్వాసము, వీరి మేధోశక్తీ కీర్తీ ప్రతిష్ఠలపై నెనలేని గౌరవము. వీరి యాంతరంగమున జెలరేగు నూహల నర్ధము జేసికొనుట సామాన్య మానవుల కసాధ్యమని వీరి నమ్మకము. స్వకీయ కావ్యరచనాగ్రన్ధ ముద్రాంకితులైన వీరికి ఆత్మాభిమానము మెండు. ఏమియునూ ఎరుగకబోయిననూ వీరెరగని దేమియునూ లేదు. వీరికి సర్వంబొచ్చు. అయినా సరే, నా గోడు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు వినకపోరా అన్న నా ఆశలు మాత్రం అనంతం!
ఎటుచూసినా మనకు కనిపించేది ఈ సాహితీ కాలుష్యమే. ఇది ఈ ఒక్క సంకలనానికే సంబంధించిన విషయం కాదు, ఏ ఒక్క రచయితనో అంటున్న మాట కాదు. అడవి కాలిపోతుంటే అక్కడక్కడా మిగిలిపోయిన చిగురుకొమ్మల్ని చూపించి నాది భ్రాంతి అని దయతో నమ్మబలికే వారికి ప్రణామాలు. పడికట్టు పదాలతో వెతల ఎత్తిపోతల పద్దుచిట్టాలు సాహిత్యం కాదన్నందుకు, సాటి మనుషుల కష్టాలపై సానుభూతి లేదని నన్నధిక్షేపించే సహృదయులకు నమస్కారాలు. రోగమా ష్మోగమా, మన ప్రస్తుత సాహిత్యస్థితి హంకీడోరీగా ఉందనే జెంటిల్మెన్(అండ్ లేడీస్) ఇక్కడిదాకా ఎలానూ చదివుండరు, వారికి కథలన్నీ నచ్చేసేసి, నా మాటలు నచ్చేయకుండా ఉండుంటై కాబట్టీ, అయినాసరే వారికి నా జోహార్లు. ఇదంతా కొంతకాలమే, అనాదిగా జరుగుతున్నట్టే సాహిత్యం కూడా ఉత్కృష్ట నికృష్ట చక్రభ్రమణం చేస్తుంటుంది అనే సాహితీవేత్తలకు మాత్రం ఒక చిన్న ప్రశ్న. ఇలా సంకలించి అసాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించడం వల్ల సుసాహిత్యం ఎలా తిరిగి రాగలదో? మళ్ళీ మంచి సాహిత్యం రావాలంటే, సాహిత్యపు మౌలిక లక్షణాలూ, సామాజిక సాంస్కృతిక జనజీవన పరిణామాల్లో దాని స్థానమూ ఉపయోగాల గురించి ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న అభిప్రాయాల్నీ, నిర్వచనాల్నీ సమూలంగా పెకలించి పునర్మూల్యాంకనం చేసుకొని పునఃస్థాపితం చేయక తప్పదు. ఏ సమాజంలో నైనా ఇటువంటి పునర్విశ్లేషణలు మామూలుగా జరగాల్సినవే.
కానీ, మార్పునడ్డుకునేది కేవలం సనాతనులూ ఛాందసవాదులే కాదు, తాము ఎపుడో నమ్మిన సిద్ధాంతాల్ని శిలాశాసనాలుగా భావించి, మెదడుకు మేకులు కొట్టేసుకున్న మేధావులూ అభ్యుదయవాదులూ విప్లవాత్మకులు కూడా. పూజిస్తున్న దేవుడు రాముడైనా మహమ్మదో మార్క్సో ఐనా, చదువుతున్న పవిత్రగ్రంథం కాపిటల్ ఐనా ఖురానో గీతో ఐనా మూఢభక్తులకు తేడా తెలీదు, వారి ప్రవర్తనలో మార్పు రాదు. వారి ఏకైక నైజం మార్పు అనివార్యమని గ్రహించకపోవడం, అది తామూహించినట్టే ఉండాలన్న నియమమేమీ లేదన్న నిజాన్ని గమనించకపోవడం, వారి ఏకైక లక్షం తమను కాదన్న వారిని దౌర్జన్యంతో అఘాయిత్యంతో అణగదొక్కడానికి ప్రయత్నించటం. ఇట్లాంటి వాతావరణంలో, ఇటువంటివారి శిక్షణలో పెరిగిన రచయితలు అలాగే ప్రవర్తించడంలో ఆశ్చర్యమేముంది? మరి వారిని మాత్రమే నిందించి ప్రయోజనం ఏముంది? ఔషధం అందించాల్సింది చెట్టు కూకటివేళ్ళకి, ఎండిపోయిన కొమ్మలకి కాదు. మార్చడానికి ప్రయత్నించాల్సింది ప్రస్తుతం చలామణీ అవుతున్న సాహిత్య స్వభావాల అభాసరూపాలని. ప్రయత్నించాల్సింది ఓ మంచి రచనను గుర్తించగల్గిన విజ్ఞత ఉన్న సంపాదకులూ, సంకలన కర్తలూ. ప్రయత్నించాల్సింది నిశితమైన సాహిత్య విమర్శ ద్వారా, సుసాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించడం ద్వారా. ప్రయత్నించాల్సింది ఖచ్చితమైన ప్రమాణాలతో ఉత్తమస్థాయి సాహిత్య సృష్టికి వెసలుబాటు చేయడం ద్వారా. మంచి కథనీ కవితనీ గుర్తించగలవారు మాత్రమే చేయగల్గిన సాహిత్యవిచికిత్స ఇది, వేయగల్గిన మొదటి అడుగు ఇది. మార్పు వ్యవస్థాత్మకమైనా అంకురించేది వైయక్తిక స్థాయిలోనే. ఈ వ్యాసాన్ని ఒక వ్యక్తిగత అభిప్రాయమూ, పరిచయంతో మొదలు పెట్టిన కారణమూ ఇదే.
చివరిగా, కథల స్థాయి అంచనా లోపం, సాహిత్యేతర ఒత్తిళ్ళ ప్రభావం అంటూ ఇప్పుడే నేను చెప్పిన ఈ రెండూ కారణాలు సంకలనకర్తలపై తీవ్రమైన ఆక్షేపణలే. ఇబ్బందిగానే అని ఎందుకన్నానో మీకిప్పుడు అర్థమయుండాలి. కారణాలేమైనా, ఉద్దేశాలు మంచివే ఐనా, ఇందువల్ల జరిగేది కేవలం నష్టమే. సాహిత్యేతర నిర్బంధాల్ని నిర్దాక్షిణ్యంగా ఖండించకపోవడం సాహిత్యానికి కర్ణ మితృత్వమే. సంకలన కర్తల దృష్టిలో కథకుండాల్సిన కనీస ప్రామాణికతను నిర్వచించి ప్రచురించి ఆచరించకపోవడం లోపమే. అధ్యయన లోపమూ అశ్రద్ధా కొట్టవచ్చినట్లు కనిపించే రచనలని ఇలా వెన్ను తట్టడంలో ఏ ప్రయోజనం ఉంది? హాల్‌టికెట్‌తో కలిపి గోల్డ్‌మెడల్ కూడా పంపిస్తే ఎంతమంది కష్టపడి చదివి పరీక్షలక్కూర్చుంటారో మనకు తెలీదా? ఇది ఆషాఢభూతులకు కథాసాహితి లక్ష్యాన్ని తమ స్వప్రయోజనాలకు అణుగుణంగా మార్చుకోడానికి అవకాశాన్నివ్వడమే. ముద్దాడి మురుగులు తొడిగినంత మాత్రాన మట్టిబొమ్మ ప్రాణంతో లేచి చిరునవ్వులు చిందించదు. సంకలనాలలో చేర్చినంతమాత్రాన ఏ కథకూ లేని గొప్పతనం రాదు సరిగదా అలా చేసినందువల్ల సంకలనపు విలువ పోయే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఎక్కువే. కథాసాహితి వార్షిక సంకలనాల్లో తమ కథ చోటు చేసుకోడం ఏ రచయితకైనా గౌరవమూ, గర్వకారణమూ. పైన చెప్పినట్లుగా అర్హత లేని కథలు ప్రచురించడం వారినీ పాఠకులనూ నిరాశ పరచడమూ, అవమాన పరచడమే. పాఠకులకూ రచయితలకూ ఈ సంస్థ ప్రచురిస్తున్న సంకలానలపై ఉన్న నమ్మకమూ గౌరవాలే ఆ రెండు ఆరోపణలకూ చోటులేకుండా చేయడానికి సంపాదకులకు కావల్సిన శక్తీ, స్ఫూర్తీనూ. అవి పోగొట్టుకోకుండా ఉండడానికి పడే శ్రమే కథను కాపాడుకుందాం రండని ఎలుగెత్తి పిలుస్తున్న సంపాదకుని నిజాయితీ పిలుపుకి నిజమైన సమాధానం కూడా.