అలసిపోయిన అస్థికలు – ఒక కవిత్వ సమీక్షా పరిచయం

అలసిపోయిన అస్థికలు – రక్తనేత్ర కవితా సంకలనం
వి.క.స.(విభిన్న కవి సమాఖ్య) ప్రచురణ
సమీక్ష: చయన నయన

172 పేజీలలో 1/4 డెమ్మీ సైజులో వెలువడిన ఈ కవితా సంకలనం నవకవి రక్తనేత్ర సమాజానికి తన విభిన్నమైన గొంతుతో వినిపిస్తున్న సవాల్‌. దీనిలో అరవయ్యారూ పాయింటారూ కవితలున్నై. మల్టీకలర్లో ఉన్న అట్టమీద బొమ్మ అర్ధం కాకూడని అద్భుతంలా ఆలోచనను రేకెత్తిస్తుంది. వెనక పేజీ మీద కవి కలర్‌ ఫోటో ఆకర్షణీయకంగా ఉంది. కవి తన నయనాగ్రహజ్వాలల్లో సామాన్య ప్రజానీకం భస్మం కాగూడదని చలువ కళ్ళద్దాలు ధరించారు. కవి ఫోటో కింద, అశ్వనేత్ర విశ్వనేత్ర రక్తచక్షు లక్షకుక్షి భక్షభిక్షు రుధిరనేత్ర రుద్రనేత్ర గర్జన! రాబందులారా ఖబడ్దార్‌!! అంటూ సాగిన కవి పరిచయం మనలో కుతూహలం రేకెత్తిస్తుంది, ఈ కవి సామాన్యుడు కాడని హెచ్చరిస్తుంది.

ఎండిపోయింది ఎముకే కాదు చచ్చిపోగానే చల్లారిపోయిన చర్మం కూడా / కాలిపోయింది కండే కాదు కంప్యూటరైపోయిన గుండె కూడా (పే.32, డిజికండలు), వయసొచ్చి ముడుతలు పడ్డ చూయింగమ్‌ చర్మపు పదహారు లక్షల చక్షువులు / డాలరు బొచ్చెల్లో యూరోకూరలకై తిరుగాడే భిక్షువులు (పే.36, క్యాంటీలివర్‌ ఎముకల వంతెన) అన్న పదునైన వాక్యాలు భూగోళీకరణ వల్ల వస్తున్న ముప్పుని వేలెత్తి చూపుతై. అదే విధంగా, పరిగెత్తడానికి లిగమెంట్లు లేని బొమికల కుప్ప ఈ అస్థిపంజరం / వెయ్యి చన్నీళ్ళ కన్నీళ్ళ కుండల్లో నిట్టూర్పులు చిగురించని ఎముకల ఆనవాళ్ళు (పే.51, బొమైకస్‌ నిటూర్‌ పారా!) అనడంలో కవి తన చుట్టూ ఉన్న సమాజం కోసం పడే తపన మనసుని కదిలిస్తుంది. రాలిపోయే కండకు మల్టీనేషనల్‌ అత్తరు సోకులు జేసే ఓ గ్లోబల్‌ రాబందూ, ఎముకను ప్రేమించే నేను, నేనే నేనైన నేను, నేనిక స్నానం చేయను (పే.67) / టూ వీలర్‌ కాలుష్యంతో బిరుసెక్కిన నా కళ్ళతో నీ రక్తమాన్‌దిరాక్స్‌ తాగడానికే నేను రక్తనేత్రుడనైనాను (పే.70, గ్లోబొమికెల పులుసూప్‌) అని కవి ఆగ్రహంతో చేస్తున్న ప్రకటనలు సమాజాన్ని పీడిస్తున్న సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దుష్టశక్తులపైకి దూసుకొస్తున్న కవితా సునామీలు! తరచి తరచి ఆలోచిస్తే ఆగ్రహించిన అస్థికలు మరింత సబబైన పేరేమో అనిపిస్తుంది.

ఎక్కువగా నాలుగూ ఐదూ పేజీల పొడుగ్గా ఫీమర్‌లూ ఉల్నాల కవిత్వమున్న ఈ సంకలనంలో ఎక్కడెక్కడో మనసుని సుతారంగా తాకే ఇంకస్‌లూ మాలియస్‌ల అరపేజీ చిరుకవితలు అక్కడక్కడా లేకపోలేదు. ట్యాంక్‌బండ్‌ నడుముచుట్టూ పచ్చగా పాకుతుంది / యువరక్తపు కోలా మత్తులో వెచ్చగా చిటికెనవేలు / వెన్నెల్లో చిరు చలిలో ఎముకలు వేసిన ఈల / ఈ శతాబ్దపు ఊదా రంగు కేదారగోల (పే.76, ప్రణయాస్థికత) అంటూ నాస్టాల్జియాతో కవి మనతో పంచుకుంటున్న అద్భుతమైన ఆ కవితంతా ప్రేమమయమే. ఆమె వచ్చాడు – అతను పోయింది (పే.81) అన్న కవిత పేరుకు తగ్గట్టుగానే సామాన్యప్రజలకోసం ఎన్నో పద్‌-అర్ధాలను కొత్తగా మెత్తగా వాడిగా వేడిగా తొక్కిన తొక్కుళ్ళు సనాతన వ్యాకరణవాదులకు ఆసిఫెరస్‌ పోకింగ్స్‌!

భాషానియమాలఘోషాలో ఉన్న హైకూ మొగ్గ భావస్వాతంత్రం పొంది ఎమ్‌కూ పూవై వికసించింది ఈ కవితావనంలో. ఏమిటా, కటకటాకటకటకాటా, విరిగిన ఎముకటా! (పే.98) / ఫిబ్రవరీ ఇరవై ఎనిమిది, తెల్లారితే మార్చి ఒకటి, ఇది లీపు సంవత్సరం కాదు! (పే.103)/ వై వై వై, ఇది ఏదైనా నాదై, మై మై మై! (పే.114)/ బరువెక్కిన కామందు బొజ్జ, టైటైపోయిన పంట్లాం, పితక్కుమని ఎగిరిపోయిన బటన్‌ పిచిక (పే.119), మంచి ఎమ్‌కూల మచ్చు(మంచు) తునకలు. టెన్త్‌ క్లాసు మొదటిసారి చదివే రోజుల్లో ఆటోగ్రాఫు పుస్తకంలో ఎంతగానో ఆరాధించిన అభ్నివిష్క్ చేసిన సంతకం లాగా, మనసు తనతో తీసికెళ్ళిపోతూ నాకోసం ఎప్పుడూ టెన్త్‌లోనే ఉండిపోవా, ప్లీజ్‌! అంటూ అహితనమిత మధ్యపేజీలో పెట్టిన పెదవుల ముద్దర లాగా, మళ్ళీ మళ్ళీ చూసుకోడానికి మనసుపొరల్లో దాచుకున్న మధురభావనల వంటివే ఈ ఎమ్‌కూలు అని కవి అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు.

ఈ కవిత్వంలో కొత్త కవులు, కవిత్వానికి కూడా అర్ధం ఉండాలనే ఛాందస అవ్యాజక అవ్యాపకులూ నేర్చుకోడానికి ఎంతైనా ఉంది. ఈయన కవిత్వంలో శూన్యత తీవ్రంగా ఉందని అతిసామాన్యప్రజ గాఢాభిప్రాయం. అయితే అది పుస్తకమంతా విస్తారంగా పరుచుకున్న ఖాళీ పేజీల వల్లనేమో అనే భ్రమ భ్రమ మాత్రమే. ముందుమాటలో కవి చెప్పుకున్నట్లు అవి సమస్త జనంగాళ్ళు సంతకం చేయడానికి వదిలేసిన కవి మనోఫలకాగితాలు. కవి భాషాసంప్రదాయాలపై ఎగరేసిన తిరుగుబాటు బావుటాలను వ్యాకరణ దోషాలనో అచ్చుతప్పుల కుప్పలనో ఆక్షేపించే ఆరోపించే అవలక్షించే* కిట్టని వాళ్ళ కుటిల రాజకీయ దండోరాను ఖండించవల్సిందే! ఈ కవి కలం నుంచి, ఈ గళం నుంచి మరిన్ని ప్రభంజనాలు సాన బట్టిన రేడియస్‌లలా మనల్ని పొడిచి మన చక్షువులలో నవకవితాభాస్వరాన్ని అలముతాయని ఆశిద్దాం. ఇది ఇంటింటా ఉండవలసిన పుస్తకం. మీరో పది కొనండి. ఒక వంద కొనిపించండి.

వెల: రూ. 65.00 (18.00 యూ.ఎస్‌. డాలర్లు, పోస్టేజీ అదనం).
ప్రతులకు: రక్త నేత్ర, C/o వికస పబ్లికేషన్స్‌,
12-3-45/420, కవితాపురి, రుద్రపట్నం – 003579, ఏ.పీ.

*సూపర్‌సబ్‌ఎడిటోరియల్‌ కామెంట్

  • అవలక్షించు ( క్రి.వి.) (Metaviate) = ప్రధాన లక్షమును విస్మరించు; ప్రక్కతోవ పట్టించు; -క్షము (నా.వా.) ప్రత్యక్ష శబ్దార్ధ ప్రయోగాత్మకతకు ఉద్దేశపూర్వకముగా అభాసను ఆపాదించుటకై విశ్లేషణీకృత వృత్తరేఖాత్మక వికేంద్రీకరణైక వినిర్మాణత ద్వారా విశేషాభిబౌద్ధిక తత్వాస్తిత్వచిత్త తృతీయతలస్థిత మిథ్యార్ధ లేశమునకు ప్రాధాన్యత సంతరించు నొక విశేష ప్రయత్నము.
  • Metaviate (v.t.) (mět’ə-vē-at’) (మెటావియేట్‌) (A futuristic amalgam of meta and deviate for exclusive usage in paralinguistic salmagundi, not for public consumption) = To side track; To de-focus; -viation (n.) A hermeneutic praxis of purposive and studied subjugation of the primary signification of a text-ilified wordeme by paraxial circo-linear deconstruction to sublimate a quasi existent connotation manifested only in the intellective meta-physical tertiary dimensionality. (ఇది సంఘ వ్యతిరేక శక్తుల పరమోత్తరాధునిక వినూత్న ప్రతిపాదనాయుధము).