ఈ కథ

ఈ కథ గొప్ప కథ. ఈ సంచికలోనే గొప్పకథ. అంతేకాదు ఈమాటలో వచ్చిన కథలన్నిటికంటే గొప్ప కథ. ఇంకా చెప్పాలంటే ఇప్పటిదాకా అన్ని వెబ్ పత్రికల్లో, అచ్చు పత్రికల్లో వచ్చిన కథలన్నింటికంటే, రాబోయే కథలకన్నా కూడా గొప్ప కథ. తెలుగులో ఇదే అన్నిటికన్నా గొప్ప కథ. నిజానికి ఒక్క తెలుగే కాదు, ప్రపంచంలోని అన్ని భాషలలో వచ్చిన అన్ని కథల్లోకీ ఇదే గొప్ప కథ. ఇదేదో నేనంటున్న మాట కాదు. ఇది నా ఒక్కడి అభిప్రాయమూ కాదు. ఇది అక్షరాలా నూటపదహారుగురు, దేనితోనూ సంబంధం లేని, ఎవరి అవసరమూ లేని తెలుగు నిపుణుల అంతర్జాతీయ బృందం –కఠినమైన నియమాలతో ప్రయోగశాలలో– ప్రపంచభాషలన్నిటిలోనూ వచ్చిన కథలన్నిటినీ కాచి వడపోసి ఏరి తీసిన అచ్చమైన మేటి కథలతో పోల్చి, ఏకగ్రీవంగా చెప్పిన అభిప్రాయం ఇది.

ఈ కథ కేవలం తెలుగునాట పుట్టగలిగిన కథ, తెలుగు లోనే పుట్టిన కథ. నేను ఈ మాట అంటూండగానే మీకు అనుమానం వచ్చింది, కదూ? ఇది మన భాషలో–లాగిపెట్టి కొడితే కథను కథగా చదవడం చాతయిన పాఠకులు (రచయితలతో కలిపి) వందమంది, ఆమాటకొస్తే అసలు పాఠకులే (రచయితలతో కలపకుండా) లక్షమంది లేని తెలుగులో–ఎలా పుట్టింది, వేలల్లో రచయితలు లక్షల్లో పాఠకులు ఉన్న ఇంగ్లీష్ సాహిత్యంలో పుట్టకుండా? ఎంతో ఖర్చుతో, ఎన్నో పరిష్కరణలతో, నికార్సయిన ప్రమాణాలతో, రచయితలకు రాయల్టీలతో సహా అన్నేసి పుస్తకాలు ప్రచురించబడే ఆంగ్లసాహిత్యంలో, అందుకు మూలకేంద్రమయిన అమెరికా లాంటి దేశంలో ఎందుకు పుట్టలేదు?

మీకు తెలియనిది ఒకటి ఉంది. అదేమిటంటే ఇదే సమయంలో అమెరికన్లు కూడా మీలానే ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. ఇక ర్యాండమ్ హౌస్, మెక్‌మిలన్, పెంగ్విన్, హార్పర్ కాలిన్స్ వంటి పెద్ద పెద్ద ప్రచురణ సంస్థల్లోని పెద్ద తలకాయలెన్నో తెగిపడబోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం వారికీ తెలియక, అవసరం తీరేలోపు వారికది దొరకక.

ఎలాగైతే మన పోలీసులు ప్రపంచంలోని మిగతా అందరు పోలీసులకంటే గొప్పవారో, మన సైన్యం ఎలా మిగతా అన్ని దేశాల సైన్యాలకంటే గొప్పదో, మన దేశం, మన సంస్కృతి, మన అన్నీ కూడా మిగతావారి అన్నిటికంటే ఎలా గొప్పవో, ఈ కథ కూడా అలాగే. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది మనమే మొదట అన్నీ కనుక్కోడం గురించి. అలాగే, ఈ కథ ఎత్తుగడ కూడా ఎంత గొప్పది, ఎంత కొత్తది, ఎంత విభిన్నమైనదీ అంటే దానికి పేటెంటు హక్కులు రిజిస్టరు–తెలుగు నిఘంటువుల భాషలో చెప్పాలంటే విశిష్టస్వత్వపు హక్కులు నమోదు– చేసుకొని మరీ కాపాడుకొనేంత. ఇంతకూ ఎక్కడ ఈ నూతనకల్పనకు ఇచ్చు ప్రత్యేకాధికారము (చూ. తెలుగు నిఘంటువు.) హక్కుగా నమోదు చేయబడింది? ఇంకెక్కడ, ఈ కథలోనే!

ఈ కథలో చిక్కులు లేవు, నొక్కులు లేవు. ట్రిక్కులు లేవు, గిమ్మిక్కులు లేవు. దీనిలో కౌగిలింతలు లేవు, కారిపోయే ప్రేమలు లేవు. అసూయాగ్నిజ్వాలలు లేవు, ఆరేసుకున్న హృదయాలు లేవు. ఈ కథ ఆద్యంత విస్తారమైన పరిజ్ఞానం, అత్యంత నిశితమైన అంతర్దృష్టి–ఈ రెంటినీ సమపాళ్ళలో కలిపి కొలిమిలో మరుగుతున్న అల్యూమినియమనబడు సీమవెండి లోహపు ద్రావకములో రంగరించి అచ్చు పోసిన ఇటుక (చూ. ఆపిల్ వారి లేప్టాపులు తయారగు విధానము.) అందువల్ల దీనికి తుప్పు పట్టదు. చెదలు పట్టవు. ఇది వీగిపోదు. కొయ్యబారదు. పగిలిపోదు. పిగిలిపోదు. ఆత్మ లాగా ఇది కూడా ఎండకు ఎండదు నిప్పుకు కాలదు నీటికి నానదు. (చూ. కాదు వి. ఘంటసాల భగవద్గీత.) కాని, ఇది దారి తప్పవచ్చు అప్పుడప్పుడూ. అప్పటికీ ఈ కథ ఎప్పటికీ ఆధునికమూ అభ్యుదయశీలీ అయిన కథ. ఏనాటికైనా కూడా ఈ కథ సార్వజనీనమూ, సర్వకాలికమూ అయిన సార్వత్రిక విలువను కలిగే వున్న కథ. ఇదేదో నేనంటున్న మాట కాదు. నా ఒక్కడి అభిప్రాయమూ కాదు. నిజం ఏదో ఏది కాదో చరిత్రను నిర్ణయించనీయండి. అయినా తమకు తెలియదు కాబోలు. ఎందరో మేధావులు చెప్పిన విషయం ఏమిటంటే ఎన్నో నిర్ణయాలు ఇప్పటికే తీసుకోబడ్డాయని, వాటన్నిటిలోనూ మన కథే మకుటం లేని మారాజులా నిలబడిందనీ.

అంత గొప్ప ఏముంది ఈ కథలో? ఇది తరచుగా అందరూ అడిగే ప్రశ్న, అమాయకత్వం తోనో అజ్ఞానం తోనో (ఏదన్నది అడిగేవారిని బట్టి). ఇందులో ఏముంది? కాలిదాసు నుంచి కవిసమ్రాట్ దాకా, కాఫ్కా నుంచి కాల్వీనో దాకా, కారా నుంచి వేవేరా దాకా, ఇంకా ఎంతమందున్నారో ఎవరు లెక్కెట్టేరు; వారందరి కథల్లో లేనిది ఈ కథలో ఉన్నది ఏమిటి? అదేమిటో చెప్పడం సులభం కాదు. సమాధానం పొడుగైనది, క్లిష్టమైనది. కథకంటే పొడుగైనది కాని కథకన్నా క్లిష్టమైనది కాదు. ఎందుకంటే ఈ కథలోని చిక్కు కన్నా చిక్కయినది ఇంకొకటి లేదు. అప్పటికీ ఒక ఉదాహరణ సాయంతో వివరించడానికి ప్రయత్నిస్తాను. కాలిదాసు నుంచి కవిసమ్రాట్ దాకా, కాఫ్కా నుంచి కాల్వీనో దాకా, కారా నుంచి వేవేరా దాకా, ఇంకా ఎంతమందున్నారో ఎవరు లెక్కెట్టేరు; వారందరి కథలకూ ఈ కథకూ ఉన్న ఒక్క తేడా ఏమిటంటే, వాటిలాగా కాకుండా ఈ కథ చివరిలో, ఈ కథను సరిగ్గా చదివిన (కథ ఏం చెప్తోందో అది చదివిన) ఒక అదృష్టవంతుడైన గెలుపరికి (ఇం. లక్కీ విన్నర్; దురదృష్టవంతుడైన గెలుపరి కానివాడు)–ఈ కథ చదివిన పాఠకులలో నుండి స్వేచ్ఛగా, యథేచ్ఛగా, నియమరహితంగా (ఇం. ర్యాండమ్‌గా) ఎంచుకోబడినవాడు– తళతళా మెరుస్తున్న ఒక సిల్వర్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారు బహుమానంగా ఇవ్వబడుతుంది. ఈ కథను సరిగ్గా చదవని (కథ చెప్పనిది చెప్పినట్టుగా చదివిన) మిగతా పాఠకులనుండి కూడా ఒక ప్రత్యేక పాఠకుడిని ఎంచుకొని కాస్త తక్కువ ఖరీదుదే అయినప్పటికీ, తళతళా మెరవడంలో మెర్సిడెస్‌కి ఏమాత్రమూ తీసిపోని (రెండవ బహుమతి గెలుపరి చిన్నబుచ్చుకోకుండా), ఇంకో కారు బహుమతిగా ఇవ్వబడుతుంది.

ఎందుకంటే ఈ కథ ఉద్దేశ్యం ఎవరినీ చిన్నబుచ్చడం కాదు. ఎవరినీ అనుగ్రహించడమో, ఎవరినీ వారి హోదాను తక్కువ చేసి చూడడమో, వారిని అవమానించడమో కాదు. ఈ కథ ఇక్కడ మీ అందరి కోసం ఉంది. మిమ్మల్ని మీరు స్వయంతృప్తితో (ఇం. స్మగ్), ఆత్మాశ్రయంతో, గౌరవంగా గర్వంగా మెప్పించుకోవడం కోసం, మీ ముఖాలపై ఆ మెప్పు ఒక చిరునవ్వుగా మారడం కోసం ఉంది. మీ కాలనీ బైట మెయిన్ రోడ్ మీద మీరు తరచూ వెళ్ళే ఆ బార్ అండ్ రెస్టారెంట్ గుమ్మం గుర్తుందా? అక్కడ వేసిన కాలిపట్టా మీద ఏం రాసుందో ఎప్పుడైనా గమనించారా? మిమ్మల్ని మెప్పించామా? ఇతరులకు చెప్పండి. మెప్పించలేదా? మాకు చెప్పండి. ఈ కథ కూడా అలాగే మిమ్మల్ని మెప్పించకపోతే చెప్పండి. ఎవరికా? ఇంకెవరికి. ఈ కథకే. ఈ కథకు చెప్పడమే కాదు. వినడం కూడా వచ్చు. ఈ కథ చెవులు, సాహిత్యకారులు ప్రవ/నిర్వ/చించినట్లు పాఠకలోకపు ప్రతీ స్పందననూ వినగలిగేలా శ్రుతి చేయబడి వున్నాయి. చివరికి పాఠకలోకానికి ఇక చాలనిపించి, తట్టుకోలేక విసుగొచ్చి, దీనికెవరో ఒకరు ఒక ముగింపు ఇయ్యండి బాబో అని అరిస్తే ఈ కథ ఏమీ అనుకోదు. మీ చీర కొంగులో, ధోతీ అంచులో, చున్నీ కొసలో, ప్యాంటు చివరలో పట్టుకొని వేలాడదు. ప్రాధేయపడదు. తనను ముగింపనే ఆ తలారి మండపం మీదకు తీసుకుపోనీకుండా గింజుకోదు. ఈ కథ అతిమామూలుగా మీ కోరిక ప్రకారమే టక్కున ముగిసిపోతుంది.


కాని, ఏ రోజో మీరు ఇంటి మీద చింతతోనో, చిన్నతనపు జ్ఞాపకాల ధ్యాసతోనో వేసారుతూ గతస్మృతుల దొంతరలలో పొర్లుతున్నప్పుడు, మీకు ఉన్నట్టుండి ఈ కథ కావాలనిపిస్తే, తిరిగి రావాలనిపిస్తే ఈ కథ ఏమీ అనుకోదు. మీ కోరికను ఆనందంగా మన్నిస్తుంది.

(మూలం: The story, victorious.)