1. కొరగానితనం
బారెడు పొద్దెక్కిన ఎండ ఆఫీసు బిల్డింగుల పొడుగాటి నీడలని తీసుకొచ్చి దారి మధ్యలో పడేసింది. వాటి సందుల్లోంచి ఫాన్సీ సామాన్ల కొట్ల అద్దాల మీద పడి తిరిగి లేచోచ్చి దారికటూ ఇటూ ఫుట్పాత్ మీద హడావిడిగా నడుస్తున్న వారి కళ్ళలో అదాటున పడి వాళ్ళను కళ్ళు చికిలించుకునేట్టు చేస్తున్నది. అంత రద్దీలోనూ వాళ్ళతో అది అలా ఆటలాడుతూనే ఉంది.
నేను మొదటి సారి ఆ తేనె కళ్ళ మనిషిని చూసినప్పుడు అతను ఆ కూడలి దగ్గర నడుస్తున్నాడో, నిలబడున్నాడో నాకు సరిగ్గా గుర్తులేదు. అతనన్నా నావైపు నడిచొస్తుండాలి, లేదూ నేనే అతని వైపు నడుస్తూ ఉండుండాలి; నాకు రాను రానూ దగ్గరవుతున్నాడని మాత్రం గుర్తుంది. సన్నగా, పొడుగ్గా ఉన్నాడతను. లాల్చీ లాంటి పొడుగాటి తెల్లటి చొక్కా, నేరుగా వెనక్కు దువ్వుకున్న జుట్టు, కోల ముఖం; అతని వయసెంతో పోల్చుకోడం కష్టం. ఒత్తయిన కనుబొమ్మల నీడలో తేనె రంగు కళ్ళు, ఎంత పెద్ద కళ్ళో! ఏ భావమూ లేకుండా సూటిగా చూసే కళ్ళు. కంటి కొసల్లో ఏదో మెరుపున్నట్టు అనిపిస్తుంది. అతని కుడి చంకలో చుట్టేసిన గొడుగు; ఎడమచేతిలో ఒక పుస్తకం. గుర్తు కోసం అనుకుంటా, ఏదో పేజీలోకి చూపుడు వేలు జొనిపి గుండెకు దగ్గరగా పట్టుకుని వున్నాడు.
హటాత్తుగా అతను నన్నే చూస్తున్నాడని నాకనిపించింది. మామూలుగా చూడటం కాదు. అతని చూపులు సూటిగా, అటూ ఇటూ తొణక్కుండా నన్ను ఆపాదమస్తకం శ్రద్ధగా చదువుతున్నట్టుగా, అక్కడితో ఆగకుండా లోపల్లోపలికి చొచ్చుకొనిపోయి నా వీపుని కూడా ఒదిలిపెట్టకుండా, నా శరీరాన్ని బైటా లోపలా కూడా శల్యపరీక్ష చేస్తున్నట్టుగా, అబ్బ! చటుక్కున చూపు తిప్పుకున్నాను. నాలుగడుగులేశానో లేదో, అప్రయత్నంగానే అతని వైపు మళ్ళీ చూశాను. అదే చూపు. వెంటనే తల తిప్పుకున్నాను. మళ్ళీ ఇదే తంతు. ఎందుకలా చూడకుండా ఉండలేకపోతున్నాను? చూసిన ప్రతీసారీ అతను నాకు మరింత దగ్గరికొస్తున్నాడని, నన్నలానే చూస్తున్నాడనీ మాత్రం నాకు తెలుస్తోంది. అతను చివరికి నాకు ఎదురుగా నిలబడినప్పుడు కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూడక తప్పలేదు. సన్నటి పెదాలు ఉండీ లేనట్టుగా, నవ్వబోతున్నట్టుగా కొంచెం ఒంపు తిరిగి, అతని చూపు మాత్రం నా మీద అలానే. కుడిచేతి చూపుడు వేలును సూటిగా నా కాళ్ళకేసి గురిపెట్టి, మర్యాద నిండిన గొంతుతో:
“ఐ బెగ్ యువర్ పార్డన్. మీ షూ లేస్ ఊడిపోయింది” అన్నాడు, నిదానంగా.
నిజమే! నా షూ లేసు ఒకటి ఎప్పుడూడిపోయిందో ఏమో, కొసలు దుమ్ముకొట్టుకుని నలిగిపోయి షూకి అటూ ఇటూ వేలాడుతున్నై. నా మొఖం కొంచెంగా ఎర్రబడ్డది. లోగొంతుకతో “థాంక్యూ” అని గొణిగి, ముందుకు ఒంగి ముంగాలిపై కూర్చున్నాను.
ఫుట్పాత్ మీద షూ లేస్ కట్టుకోటం ఎంత చిరాకైన పనో కదా! మన కాలు ఎత్తి పెట్టుకోటానికి ఏ గట్టో, మెట్టో, బెంచీనో ఏదీ లేకపోతే ఇంకా ఇబ్బంది. నిలబడి ఒంటి కాలి మీద కట్టుకోవాలంటే ఆ రద్దీలో కుదరదు. ఆ తడబాటులో ముందుకు పడిపోతామేమో అనే భయం మనకుంటుంది. మనమేమో ఒంగో, ఒంటికాలిపై కూర్చునో ఉంటాం. వచ్చీ పోయేవాళ్ళు హడావిడిలో మనల్ని గమనించుకోనప్పుడల్లా మనల్ని తట్టుకొని పడబోయి పక్కకు జరిగిపోతుంటారు, లోపల్లోపలే ఏదో సణుక్కుంటూనో, లేకపోతే మనమీదోసారి చిరాగ్గా ఓ చూపు విసిరేసో.
ఆ తేనెకళ్ళ మనిషి సన్న గొంతుతో యూ ఆర్ వెల్కం అనో, విత్ ప్లెజర్ అనో ఏదో అనేసి ఆ రద్దీలో కలిసి మాయమైపోయాడు.
నాకు రాసిపెట్టి ఉందేమో అతన్ని మళ్ళీ కాసేపట్లోనే కలవాల్సి వస్తుందని. లేకపోతే నేనతన్ని పావుగంట కాకుండానే మళ్ళీ ఎలా కలుస్తాను? ఈసారి ఏదో షాపు ముందు నిలబడి అద్దాలగుండా లోపలికి చూస్తూ కనపడ్డాడు. ఎందుకో నాకే తెలీదు. అతనికి కనపడకుండా చటుక్కుమని వెనక్కు తిరిగి నడుద్దామనో, అతను నన్ను గమనించకముందే అతణ్ణి దాటుకుని వెళ్ళిపోదామనో, ఆపుకోలేని కోరిక ఒకటి నన్ను పట్టి ఊపేసింది. కానీ, జరగవల్సిన ఆలస్యం అప్పటికి జరిగే పోయింది. అతను తల తిప్పి నన్ను గమనించడం, నాకు ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా మళ్ళీ అదే చూపు చూడడం, తేరుకునేటప్పటికి అతని ముందే నేను నిలబడి ఉండడం ఎంతో మామూలుగా జరిగిపోయినై.
“చూడండి. అది మళ్ళీ ఊడిపోయింది.” అన్నాడు, మరింత మర్యాద నిండిన గొంతుతో.
చెప్పొద్దూ, నాకైతే ఉన్నపళాన మాయమైపోతే బాగుండు ననిపించింది. మాటామంతీ లేకుండా మళ్ళీ ముంగాలి మీద కూర్చున్నాను, షూ లేసు బిగించుకోడానికి. నామీద నాకే కోపమొచ్చింది. నా చెవుల్లోంచి వెచ్చగా ఆవిరి, గుయ్యిమంటున్న చప్పుడు. నా చుట్టూ ఇప్పుడు నడుస్తూ తట్టుకొని పడబోయి పక్కకు జరిగిపోతున్న వాళ్ళు కొత్తవాళ్ళు కానట్టు, ఇంతకుముందు వీధిలో నన్ను అక్కడ తట్టుకొని పడబోయిన వాళ్ళే అయినట్టు, వాళ్ళు నన్ను ఇక్కడ గుర్తుపట్టి వెటకారంగా ఏదో అనుకుంటూ వెళ్ళిపోతున్నట్టు నాకనిపించింది.
ఏమైతేనేం, షూ లేసు గట్టిగా బిగించాను. ఇక చస్తే ఊడదు. తలెత్తి చూస్తే అతనెక్కడా కనపడలేదు. నేనూ హాయిగా ఊపిరి పీల్చుకొని కాస్త నిబ్బరంగా నడవడం మొదలు పెట్టాను. కొంచెం గర్వంగా కూడా అనిపించింది. నిజానికి అతను ఇంకోసారి కనపడితే బాగుణ్ణనీ, పోయిన నా పరువు మళ్ళీ కొంచెంగా దక్కించుకోవచ్చనీ నాకు కొంచెం ఆశ కూడా పుట్టింది.
పట్టుమని పదినిమిషాలు కూడా కాలేదు. నేను కోరుకున్నట్టే జరిగింది. అలా నడుచుకుంటూ చౌరస్తా దాటి పక్క వీధిలోకి తిరిగాను అంతే. నాలుగంటే నాలుగడుగుల ఎడంగా నిలబడున్నాడు. అతన్ని చూడగానే నా నిబ్బరం ఇట్టే మాయమైపోయి ఎందుకో తెలీని భయం, తడబాటు కలిగినై. అతని చూపేమీ మారలేదు గానీ అతని మొహంలో కొంచెం విచారం లాంటిదేదో కనిపించింది. మన అదుపులోలేని మహా శక్తి ఏదో మనల్ని ఆడిస్తున్నదని, మనం కేవలం నిమిత్తమాత్రులమని మనకు తట్టినప్పుడు మనం వైరాగ్యంతో తల ఊపుతామే, అలా చిన్నగా తల అడ్డంగా ఊపుతూ అతను నా దగ్గరగా వచ్చాడు. మళ్ళీ గానీ షూ లేసు ఏమైనా ఊడిపోయిందేమో అన్న అనుమానంతో లోపల్లోపలే కుంచించుకొని పోతూ నేనూ అడుగు ముందుకేశాను. కానీ దాని ముడి గట్టిగానే ఉంది. అతను ఎందుకలా తల అడ్డంగా ఊపుతున్నాడో నాకర్థం కాలేదు.
“ఇప్పుడా షూ లేసు ఊడిపోయింది” అన్నాడు అదే మర్యాద నిండిన గొంతుతో.
మీకెప్పుడైనా ఇలాంటి పీడకల వచ్చిందా? కలలో మనం చిక్కుకుపోయుంటాం. మనకు ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాం. ఆ కలలోంచి బైటకు రావాలని ఎంత ప్రయాసపడుతున్నా రాలేకపోతుంటాం. నిద్రలేస్తే బాగుండునని అనుకుంటుంటాం కానీ లేవలేకపోతుంటాం. నా పరిస్థితి అలాగయింది. నోట్లోంచి బూతుకూత ఒకటి రాబోయింది. పెదవి కొరుక్కొని దాన్ని ఆపి, దారి మధ్యలో మళ్ళీ ముంగాలి మీద కూర్చున్నాను. కసిగా షూ లేసుని గుంజి గుంజి లాగి గట్టిగా కట్టుకుని తల దించుకొని అలాగే లేచి నిలబడ్డాను. నా చుట్టూ ఉన్నవాళ్ళ చూపులు నన్ను తూట్లు పొడుస్తున్నట్టుగా అనిపించింది. వాళ్ళందరికీ కనపడకుండా తీసికెళ్ళిపోమని మనసులో ప్రార్థించుకున్నాను కానీ అలాంటిదేమీ జరగలేదు.
నా కష్టాలిక్కడితో ఆగిపోతే బాగానే ఉండేది కానీ ఈ రోజు నాకింకా పొద్దు వాలినట్టులేదు. ఈసురోమంటూ ఇంటికేసి నడిచాను. వీలైనంత తొందరగా వెళ్ళిపోదామని పదడుగులు గట్టిగా వేశానంతే. నా షూ ముళ్ళు జారిపోయి క్రమక్రంగా వదులైపోతున్నటనిపించింది. ఇలా కాదని – కాస్త నిదానంగా నడిస్తే అడుగు తీసి వేసేప్పుడు ముడి మీద ఒత్తిడి పడదేమో, అది మరింత వదులై పూర్తిగా ఊడిపోకుండా అలానే ఉంటుందేమో ఇల్లు చేరేదాకా – కొంచెం నడక వేగం తగ్గించాను. ఊహూ, ఏమీ లాభం లేదు, నేను ఇంటి దరిదాపులకు కూడా రాలేదు. లేసు ముళ్ళు పూర్తిగా విడిపోయి వాటి కొసలు కాళ్ళకటూ ఇటూ పడి నేలను దేకడానికి ఎంతో సేపు పట్టలేదు. నాకు ఊపిరాడలేదు. ఏదో భయంతో నన్నెవరో తరుముతున్నట్టుగా పరిగెత్తాను. భయం, అతను మళ్ళీ నాకెదురౌతాడేమో నన్న భయం.
మా ఊరేమన్నా మహానగరమా! ఉన్నవే నాలుగు పెద్ద కూడళ్ళు. ఊరి కిటునంచి అటుపోవాలన్నా, అటు నించి ఇటు రావాలన్నా ఎటునుంచి ఎటు నడిచినా ఆ వాటిలో దేన్నో ఒకదాన్ని దాటుకునిపోక తప్పదు. మీరు గానీ వాటిని కలిపే ఆ వీధుల్లో అటూ ఇటూ నడిస్తే ఒక గంటలో ఆ రోడ్లమీద చూసిన మొహాలే మళ్ళీ కనపడచ్చును. మీ పరిస్థితిని బట్టి అదృష్టం బాగుండో, లేదు ఖర్మ కాలో, ఒకే మొఖం ఒక్కోసారి మూడు నాల్గు సార్లు కూడా ఆ రోజు మీక్కనపడచ్చు. ఊరు అలాంటిది మరి, నేను పరిగెత్తడం ఎందుకో అర్థమయే ఉంటుంది మీకు. నా షూ లేసులు ఊడిపోయినై అని మళ్ళీ ఎవరైనా (అతనే) గమనిస్తే అదొక అవమానం. వీధి మధ్యలో మళ్ళీ ఇంకోసారి ముంగాలి మీద కూర్చోవలసి రావడం మరొక అవమానం. ఊళ్ళోవాళ్ళందరి చూపులూ నన్నే తూట్లు పొడుస్తున్నట్టు అనిపించి ఇక తట్టుకోలేక, అక్కడే కనిపించిన ఒక ఇంటి ముంగిట్లోకి నక్కి దాక్కున్నాను. అమ్మయ్య, ముందు గుమ్మం మూసేసి ఉంది. నడవా స్తంభానికి ఆనుకొని ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొని నిదానంగా వదిలిపెడుతూ తల తిప్పి చూశాను. నడవా గుమ్మానికి అటూ ఇటూ ఇంటి వెడల్పూతా ఉండి దానికి నడుమెత్తు పిట్టగోడ కూడా ఉంది. నడవా ఆ చివరన తన గొడుగు జాగ్రత్తగా పట్టుకొని ఆ తేనె కళ్ళ మనిషి నాకోసమే ఎదురు చూస్తున్నట్టు, పిట్టగోడకు చేరగిలబడి ఉన్నాడు.
గుడ్లప్పగించి అతని వైపే కాసేపు చూశాను. భయం లోంచి ఆశ్చర్యం, అందులోంచి నిస్సహాయత పుట్టి, తప్పు చేస్తూ దొరికిపోయిన పిల్లవాడిలా ఒక వెర్రి నవ్వు ఒకటి నవ్వుతూ, అతని కేసే చూస్తూ నా కాళ్ళ కేసి నేనే వేలు చూపించుకున్నాను, అతనికి వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా. అతని మొఖంలో అంతకు ముందున్న విచారమే మళ్ళీ కనిపించింది. మళ్ళీ అదే అడ్డంగా తల ఊపడం.
“అవున్నిజమే,” అన్నాడతను, “ఇప్పుడు రెండు లేసులూ ఊడిపోయినై.”