నాకవిత్వమధర్మాయ వ్యాధయే దండనాయ వా|
కుకవిత్వం పునః సాక్షాన్మృతి రాహుర్మనీషిణః||
– భామహుడు, కావ్యాలంకారం. 7వ శతాబ్దం.
(నువ్వు కవిత్వం రాయకపోతే అది తప్పు కాదు. నీకు జబ్బు చేయదు. నిన్నెవరూ తిట్టరు, కొట్టరు. కానీ చెడు కవిత్వం రాస్తే నువ్వు తప్పకుండా నీ పాఠకులను చంపినవాడి వవుతావు.)
నా తప్పులకు పూర్తిగా ప్రాయశ్చిత్తం ఉందని, ఉంటుందని నేననుకోను. అయినా తప్పదు.
కవిత్వం విషయంలో నేను చేసిన తప్పులేమిటి?
- కవిత్వం అనేది ఒక భావావేశపు ఉన్మాదంలో పెఠిల్లుమని మనసు లోంచి బైటికి తన్నుకుని వచ్చేదని, ఏ చిన్న మార్పు చేసినా అందులో ఉండే ‘అది’ పోతుందని, ఆ కవిత సహజత్వాన్ని కోల్పోతుందనీ, కవితకూ ఇతర సృజనలకూ అదే ముఖ్యమైన తేడా అని — ఎందరో కవులు, సాహిత్యకారులు గుడ్డిగా నమ్ముతున్నారని బాధ పడ్డాను. అవి అపోహలని వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. మహాకవులు కూడా ఎన్నోసార్లు తమ కవితలకు దిద్దుబాట్లు చేస్తారు అని వాదించాను. ఎందరో ఔత్సాహికులు, కవులు నాకు చూపించిన వారి వారి కవితలని పరిష్కరించేంతగా తెగించాను.
- కొన్ని అనుభూతులు అకస్మాత్తుగా మనల్ని కదిలిస్తాయి. మరి కొన్ని క్రమంగా మనసులో రూపు దిద్దుకుంటాయి. కానీ, ఈ ఊహలకి నిర్దిష్టమైన ఆకారం ఉండదు. వీటిని వేరొకరితో పంచుకోవడానికి మాట ఒక్కటే మార్గం. అయితే ఎప్పుడు వాటిని పదాలలో, వాక్యాలలో పెడతామో, అప్పుడు అవి ఒక స్పష్టమైన ఆకృతి తెచ్చుకుంటాయి. భాష, వ్యాకరణం, వాక్య నిర్మాణం, తదితర నియమాలకు లోబడతాయి. వ్యాస వాక్యానికి ప్రత్యక్షార్థం వుంటుంది. సృజనాత్మక వాక్యానికి ధ్వని, సందర్భమూ కూడా ఉంటాయి. అందువల్ల కవికి చెప్పదలచుకున్న విషయంపై పూర్తి అవగాహన, స్పష్టత ఉండాలని; అవి రచనలో కనిపించేలా, రాసిన కవితను (కథ, వ్యాసం, ఏదైనా కూడా) అక్షరం అక్షరం సరిదిద్దుకుంటూ మెరుగు పర్చుకోవాలి అని; కవిత్వం ‘రాయడం’ మనసుకు, మేధకు రెంటికీ సంబంధించిందని, వాటి సమన్వయం చాలా ముఖ్యమనీ నమ్మాను.
- కవిత్వాస్వాదన వైయక్తికమైనప్పటికీ, అనుభవం కాగానే సరిపోదు. పశుర్వేత్తి గానరసం కదా అని మనమూ ఆ స్థాయిలోనే ఆగిపోము. పాఠకుడు అర్థం కూడా చేసుకోవాలి. శాస్త్రాలు, సిద్ధాంతాలు, ఏది కవిత్వమో ఏది కాదో మనకు చెప్పవు. కానీ అవి కవిత్వానుభవాన్ని నిర్వచించి విచారిస్తాయి. తద్వారా మన సాహిత్య వివేచనకు, విమర్శకు తోడ్పడతాయి. అలా అర్థాన్ని, అనుభవాన్ని విశ్లేషించుకుంటూ చదువుకునే కొద్దీ ఉత్తమమైన సాహిత్యాన్ని గుర్తించి, ఆనందించగలిగే రసజ్ఞత (పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ) పాఠకుడికి అబ్బుతుందని నేర్చుకున్నాను. సాహిత్యోపకరణాలను, లక్షణాలను ఉపయోగించుకుని రచయిత సమర్థవంతంగా తన సృజనకు రూపమిచ్చాడా లేదా అని చూసి తప్ప సభ్యత, నైతికత, సందేశం, ప్రయోజనం వంటి సాంఘిక నిర్వచనాలతో, వైయక్తిక అభిప్రాయాలతో సాహిత్యాన్ని బేరీజు వేయకూడదు అని; పాఠకుడితో రచన తప్ప రచయిత ఏ పరిస్థితిలోనూ మాట్లాడనే కూడదు అని బలంగా నమ్మాను.
- కవిత్వానికి (సాహిత్యానికి) సామాజిక ప్రయోజనం ఉండాలని, అభ్యుదయానికి, వికాసానికి దారి తీయాలని, కవులు, రచయితలు, కళాకారులు ఇందుకు శ్రమించాలని, వారికి ఆ అదనపు సామాజిక బాధ్యత ఉందని, ఎంతోకాలంగా చెప్తున్న విమర్శకులని వినిపించుకోలేదు. ఈ ప్రాతిపదికన చేసిన సాహిత్య వివేచనను ఒప్పుకోలేదు. కవులు, రచయితలు మనలాంటి మామూలు మనుషులే. నీతులు చెప్పడం, అన్యాయాలు అసమానతలు ఎత్తిచూపడం, మంచి చెడూ నేర్పడం, మనలో పరివర్తన తేవడం, సమాజానికి దారి చూపడం వారి పని కాదు. వారికా అవసరం లేదు. వారికి ఆ సామర్థ్యం లేదు, ఉండదు, రాదు. సాహిత్యం సమాజంలో మార్పు తేదు. దానివల్ల విప్లవాలు రావు, యుద్ధాలు జరగవు. సాహిత్యసృజన ఇతర కళల లాగే పూర్తిగా ఏకాంతము, వైయక్తికము, స్వార్థమూ అయిన వ్యాపకం అని తెలుసుకున్నాను.
- సందర్భ కవిరచయితలను, ముఖ్యంగా ఉగ్రవాద చర్యలు, మతకల్లోహాలు, మానభంగాలు, మరణాల వంటి సంఘటనలపై వెంటనే కవిత్వం రాసేవారిని సహించలేకపోయాను. అది కవి ధర్మమని, సమాజానికి ప్రాతినిధ్యమని వారు చెప్పుకుంటే విని కుంగిపోయాను. బాధ నిజమైనదే అయితే అది కవి మనసు లోనే ఎంతో కాలం కుంపటిలా రగులుతుంది. పదాలకు ఒక పట్టాన లొంగదు. బైటికంటూ వస్తే ఎప్పటికో కానీ సృజన రూపంలో రాదు. ఎవరైనా చచ్చిపోగానే, ఏదో ఒక అరాచకం జరగ్గానే కథలూ కవితలని రాసేవారు తమను గొప్ప చేసుకోవడం కోసమే రాస్తున్నారని, అలా రాయడం బాధితులను, చనిపోయిన వారిని సొమ్ము చేసుకోవడమేనని అనుకున్నాను. తాము గొప్ప కవులమని, సమాజం తమని గౌరవించటం లేదని ఆక్రోశించిన వారిని, అలా ఆశించిన వారిని చూసి నవ్వుకున్నాను.
ఎంత హాస్యాస్పదమైన ఆలోచనలు, భావనలు! ఇంకా ఎన్నని చెప్పను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికయేను!
నా తెలివితక్కువతనం కాకపోతే, నైనెలెవన్ గురించో, లుంబినీ పార్కు బాంబుపేలుళ్ళ గురించో, ముంబై దాడుల గురించో, ఢిల్లీలో అమ్మాయిపై బస్సులో జరిగిన అత్యాచారం గురించో ఇన్ని రోజుల తర్వాత — మనమంతా విచారించి, విమర్శించి, రగిలి పొగిలి, ఖండించి, వెంటనే తేరుకొని మన లోకంలో మనం బతుకుతున్న ఇన్ని రోజుల తర్వాత — ఇప్పుడు కవితలు, కథలు రాస్తే ఎవరు చదువుతారు, ఎవరు స్పందిస్తారు. పాఠకులు నవ్విపోతారు, నీకు ఇప్పుడు మెలకువ వచ్చిందా, ఇప్పుడు సందర్భం ఏమిటి? అని. నువ్వు ఇన్నాళ్ళూ మనిషివి కావా, నీకు మానవత్వం లేదా, ఇప్పుడా నువ్వు నినదిస్తున్నది? అని సాటి కవులు నిలదీస్తారు.
నిజమే! ప్రియురాలి మీద ప్రేమ అప్పటికప్పుడు ప్రకటించని కవిత ఎందుకు? అనర్థాన్ని అప్పటికప్పుడు ఖండించని కవిత ఎందుకు? పూవు పుట్టగానే పరిమళిస్తుంది కానీ పుట్టిన మూడేళ్ళకు కాదు. మనసులో పుట్టగానే అప్పటికప్పుడు పదిమందితో పంచుకోబడని అనుభవాలకి అస్తిత్వం ఎందుకు? అసలు ఆ అనుభవాలకి విలువేముంది? మీ భార్యనో, భర్తనో, పిల్లలనో ప్రేమిస్తున్నానని వారొక్కరికే చెప్పి, వారికి మాత్రమే తెలిసి ఏమిటి ప్రయోజనం? ముందు పదిమందికీ తెలియాలి, వారూ అభినందించాలి. అది మరింత ముఖ్యం. ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో, భావప్రకటనకు మునుపెన్నడూ లేనంత స్వేచ్ఛ ఉన్న ఈ సమయంలో, మన అనుభవాలనూ అభిప్రాయాలనూ మనలోనే దాచుకోవటం అవివేకం. అందుకనే రాయాలి, వెనువెంటనే ప్రచురించాలి. పదిమందికీ తెలిసేలా ప్రకటించాలి.
నా మాట నమ్మండి. ఇప్పుడు, నిక్కచ్చిగా చెప్తున్నాను. కవిత్వం అనేది సందర్భానికి రాయాలి. వాడిగా వేడిగా రాయాలి. మెత్తగా, కొత్తగా రాయాలి. చురుగ్గా, చమత్కారంగా రాయాలి. కవిత్వం అనేది ఎప్పటికీ నిలిచేది కాదు. కవిత్వం అప్పటికప్పుడు పనికిరావాలి. “కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుస్తుంది,” లాంటి అర్థం లేని నిర్వచనాలు ఇవ్వడం వ్యర్థం (మన కవితను సమర్థించుకోడానికి తప్ప.) కవిత్వం ఏదో బ్రహ్మపదార్థం కాదు. ఆకలేసిన వాడికి ఇన్స్‌టంట్ నూడిల్ సూపు అవసరం, ఆహారంలో పోషకవిలువల గురించిన చర్చ అనవసరం. కవిత్వం రాయాలనుకునే వారికి నిజంగా పనికొచ్చే సలహాలు ముఖ్యం. వారు ఆచరణలో పెట్టలేని సలహాలు ఇవ్వడం కేవలం వారిని తప్పుదారి పట్టించడం.
కవి కావడానికి పాఠాలా? అని ఈసడించుకునే మేధావులందరికీ ఒకటే మాట చెప్పదలచుకున్నాను. మీ పిల్లలనూ మీలాగే ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి చదువులే చదివించారు, -విస్తారు. ఎంసెట్లు, ఆసెట్లు, ఈసెట్లు రాయిస్తారు ఎల్కేజీనుంచీ. కానీ, ఫిజిక్స్, మ్యాథ్, బయాలజీ క్షుణ్ణంగా చదువుకుని నేర్చుకోమని ఎప్పుడూ చెప్పరు. మీరు చదువుకున్నారా? లేదు. కోచింగ్ సెంటరు వాడిచ్చిన బిట్ బ్యాంకు మాత్రం బట్టీ పట్టిస్తారు, మీరు చేసినట్టే. ఎంట్రన్స్ పరీక్షలో అడగని ప్రశ్నలకు సమాధానాలు తెలిసి ఉండటం మీకు అక్కర్లేదు. ఏం, కవి కావాలనుకునేవారికి కొన్ని షార్ట్‌కట్ సూచనలు ఇవ్వడం అంతకంటే నేరమా? ఈవిషయంలో ఇంతకన్నా చర్చ అనవసరం.
[ప్రస్తుత సమాజంలో స్త్రీ పురుషులని విడిగా సూచించే కొన్ని వ్యాపకనామాలు వాడరు. కర్త ఎవరైనా రైటర్, ఏక్టర్, పొయెట్, మినిస్టర్ — ఇలానే సంబోధిస్తారు తప్ప రైటరెస్, ఏక్టరెస్, పొయెటెస్, మినిస్ట్రెస్ అనరు. అందుకే, నేను కవి అన్నా మాట్లాడుతున్నది అందరితో. కవిత్వం విషయాలు కొన్ని కథలకు కూడా వర్తిస్తాయి కాబట్టి, కవి అంటే కవి, కవయిత్రి, రచయిత, రచయిత్రి అని. పాఠకుడు అంటే పాఠకురాలు కూడా, అతను అంటే ఆమె, అది; కవిత అంటే కథ, నవల, ఇతర రచన అని కూడా. నేను లింగవిచక్షణ పాటించను! – రచయిత.]
కవిత్వం నిజంగా ఏమిటి?
కవిత్వం – ఒక అసంకల్పిత ప్రతీకార చర్య.
శరీరం లేనిదే మనసు లేదు. ప్రేరణ లేనిదే చర్య లేదు. డాక్టర్ మోకాలి దగ్గర నరం మీద కొట్టగానే కాలు చటుక్కున కదులుతుంది. గ్రామసింహానికి ఎక్కడ దెబ్బ తగిలినా వెనక కాలితోనే కుంటుతుంది. ఉదాహరణ మొరటుగా ఉంటే క్షమార్హుణ్ణి. కవిత్వం కూడాను ఇలానే అసంకల్పితంగా ఒక అనుభవం, ఒక ఆవేశం మనల్ని ప్రేరేపించినపుడు వస్తుంది. ఒక సందర్భం అదాటుగా కవిత్వం చెప్పాల్సిన అవసరాన్ని గుర్తు చేసినప్పుడు వస్తుంది. ఆలోచనతో చెప్పరానిది ఆవేశంతో చెప్పాలి. ఆలోచన తప్పు. అది ఆవేశాన్ని నిర్వీర్యం చేస్తుంది. తన్నుకొస్తున్న వమనాన్ని ఆపడం ఎంత నిష్ప్రయోజనమో, ఉద్వేగంతో ఉబికివస్తున్న కవిత్వాన్ని ఆపడమూ అంతే నిష్ప్రయోజనం. పదాలు, పదాలు, వాక్యాలు, వాక్యాలుగా కవిత ఏకబిగిన బయటపడాలి. అందులోనే సహజత్వం ఉంది. అందులోనే కవిత్వం జీవిస్తుంది. సముద్గురుణానంతరం రోగికి కలిగే ఉపశమనం కన్నా కవిత రాసిన కవికి కలిగే హాయి, నిశ్చింత పదివేల రెట్లు ఉంటుంది. వైయక్తిక సంఘటనలు, సామాజిక దుర్ఘటనల తరువాత కవి వెంటనే ఎందుకు స్పందిస్తాడో ఇప్పుడు మీకు కొంత అర్థం అయింది.
కవిత్వం – ఒక ఔన్నత్యం, ఒక ఔదార్యం.
తమ అనుభూతిని, అనుభవాన్ని అక్షరాలలో ప్రతీవారు పెట్టలేరు. కొందరు కనీసం నోరు విప్పి చెప్పలేరు కూడా. వీరు చేతకానివారు, నిస్సహాయులు. కొందరు చెప్పగలిగీ తమలోనే దాచుకుంటారు. వారు ద్రోహులు, సమాజ వ్యతిరేకులు. కేవలం కొందరే ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ఎప్పుడు ఏ వార్త తమను కదిలించి వేసినా తక్షణమే కార్యోన్ముఖులవుతారు. వాటికి స్పందనగా, నిస్సహాయులకు ప్రతినిధులుగా తమ గళాన్ని వినిపిస్తారు. తమ ఆవేశాలని, ఆశయాలని, బాధని, వేదనని, ఆనందాన్ని, దిగ్భ్రాంతిని ప్రకటిస్తారు. వీరు ఉన్నతులు, దిశానిర్దేశకులు. ఎంతోమంది మౌనంగా దాచుకున్న అనుభవాన్ని పదిమందికీ పదాలలో, పాదాలలో వెల్లడించడం, వాటి ద్వారా తమకు తోచింది అందరి మంచీ చెడూ చేయటం, సామాన్యులు చేసే పని కాదు. అందువల్ల కవిత్వం (కథ) రాయడం అనేది కవి (రచయిత) ఔన్నత్యానికి, ఔదార్యానికి సంబంధించిన విషయం. వైయక్తిక సంఘటనలు, సామాజిక దుర్ఘటనల తరువాత కవి వెంటనే ఎందుకు స్పందిస్తాడో ఇప్పుడు మీకు ఇంకొంత అర్థం అయింది.
కవిత్వం – ఒక విప్లవం, ఒక సాహసం.
కవిత్వం రాయడం ఆషామాషీ కాదు. అగ్రరాజ్యాల దండయాత్రల నుండి భాషాఛాందసుల విమర్శల దాకా, కవిగా ప్రతీకులప్రతికూలశక్తులను గొంతెత్తి ఖండించడానికి ధైర్యసాహసాలు కావాలి. దినపత్రికలో అమెరికాను తిడుతూ, సద్దామును పొగుడుతూ కవిత రాసే కవి తన ప్రాణాలకు కిరాయి హంతకుల నుంచి, ద్రోమల నుంచి, కలిగే ప్రమాదాన్ని పట్టించుకోడు. అతని కవిత ప్రశ్నలు వేస్తుంది. మనలో ఆవేశాన్ని తన్ని లేపుతుంది. విశ్లేషణాత్మక రాజకీయ సామాజిక వ్యాసాలు, విద్యాధికులం అనుకునే వారు వారు చదువుకునే పత్రికలలో రాసుకుంటారు. అవి ఏ కొద్దిమందో చదువుతారు. ఇంకొద్దిమంది అర్థం చేసుకుంటారు, వారిలో వారే చర్చించుకుంటారు. ఆ అగ్రవర్గపు ఆలోచన, విశ్లేషణల కట్టుబాట్లను తప్పించుకొని ఒక్క కవి మాత్రమే కేవలం ఆవేశంతో ప్రతిస్పందించగలడు. తన ధనమానప్రాణహానిని సైతం విస్మరించి కవిత రాయగలడు. అందుకే కవిత్వం రాయడం ఒక విప్లవం, ఒక సాహసం. వైయక్తిక సంఘటనలు, సామాజిక దుర్ఘటనల తరువాత కవి వెంటనే ఎందుకు స్పందిస్తాడో ఇప్పుడు మీకు మరికొంత అర్థం అయింది.
ప్రేమకవితలు, భావకవితలు రాసే కవుల పంథా వేరు. అందులో విప్లవం, సాహసం కనిపించకపోవచ్చు. కానీ ఔన్నత్యం, ఔదార్యం ఇబ్బడిముబ్బడిగా ఆ లోటు మనకు తెలీకుండా చేస్తాయి. ఏ వెన్నెల రాత్రించినా, ఏ తరుల్లత కుసుమించినా, ఏ తేటి నవ్వించినా, ఏ కార్మొయిలు పొడతూపినా వారు చాలా సున్నితంగా చలిస్తారు. ఆ భావతీవ్రత మామూలు మనుషుల స్పందన కన్నా తీవ్రమైనది. మనకు సర్వసాధారణంగా కనిపించే సామాన్యాంశాలు వారి మనసులో కవితాత్మను సంతరించుకుంటాయి. తమ సునిశిత భావవీచికా లహరులలో ఈ కవులు దైనందినం తేలియాడుతుంటారు. ఐహిక ప్రపంచాన్ని నిరంతరమూ మేలి జలతారు పరదాలనుంచే చూడగల మహిమను పొంది వుంటారు. ఆ సున్నితత్వాన్ని అంతే సున్నితంగా తమ కవితల, కవితల వంటి కథల ద్వారా మనకు అందిస్తారు. అసంకల్పితత, కాల్పనిక విస్తీర్ణత వీరి కవితలను విశ్వజనీనం చేస్తాయి.
ఈ నేపథ్యంతో ఇప్పుడు ముందుకు నడుద్దాం.
కవి ఏర్పరుచుకోవలసిన లక్షణాలు
- కవి విశ్వాసం
- కవి బాధ్యత
- కవి స్పందన
- కవి కల్పన
- కవి ఐక్యత
మొట్టమొదట చేయవలసింది – మీరు కవి – అని మిమ్మల్ని మీరు బలంగా నమ్మడం. ‘నేను కవిని!’ అంటే ఎవరు మిమ్మల్ని కాదంటారు? ఇది నా భావన, ఇది నా భాష, నేను ఇలానే నా భావాన్ని ఆవిష్కరిస్తాను అని ధైర్యంగా చెప్పగలిగిన కవి హక్కును కాదనగలిగింది ఎవరు? ఏకవినైనా వారి ఒక కవిత చూపించి, ఇది ఎందుకు కవిత అని అడగండి. వారు చెప్పరు. వారు ఎందుకు చెప్పరో మీరు అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడైతే అర్థం అవుతుందో, అప్పటినుంచీ ఆ ప్రశ్నకు మీరూ సమాధానం చెప్పరు. అంటే మీ హృదయం ఇప్పుడు కవి హృదయం. మీరు కవి! అందువల్ల, మీరు రాసేది కవిత్వం కాదు అనేవారికి మీరు సమాధానం చెప్పక్కర్లేదు. అది మీ అవసరం కాదు. తర్కరీత్యా మీరు కవి కాదు అని ఎవరూ రుజువు చేయలేరు. అందువల్ల నేను కవిని, నేను రాసేది కవిత్వం అని మనసా వాచా కర్మణా నమ్మడం కవిగా మీకు మొదటి మెట్టు. (ఐతే కవిగా మీ కవిత్వాన్ని మీరే వివరించి చెప్పుకోవాల్సిన అవసరం, దురదృష్టవశాత్తూ ఏర్పడుతుంది. మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ముందు ముందు ముచ్చటిస్తాను.)
కవి బాధ్యత గుర్తెరిగి మసలండి. బాధ్యత-హక్కు శరీరం-మనసు వంటివి. కవిత్వం రాయడం ఎలా ఉన్నతమూ, సాహసమూ అయిన పనో పైన క్లుప్తంగా చెప్పాను. అందువల్ల కవి (రచయిత) ఇతర ప్రజలకంటే ఒక మెట్టు పైనుంటాడు. ప్రజలు అతనిని తలెత్తి చూస్తారు. దారీతెన్ను తోచని తమ జీవితాలలో తమ అనుభవాలకు మాటలు ఇచ్చి రూపాన్ని కట్టిన మనీషిగా కవిని ప్రజలు కొలుస్తారు. మీ రచనలు పాఠకులపై ప్రభావాన్ని చూపిస్తాయి, వారి రోజువారీ జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పుతాయి. వారికే తెలియని కొత్త లోకాలు ఆవిష్కరిస్తాయి. వారిలో కొత్త లక్షణాలు పుట్టిస్తాయి. వారెప్పుడూ మిమ్మల్ని అడగకపోయినా ఇది మీరు స్వచ్ఛందంగా చేస్తున్న పని. ఆ బాధ్యత కవిగా మీది అని ఎప్పుడూ మర్చిపోకండి. మీరు మర్చిపోనంత కాలం, మిమ్మల్ని మీరు కవి అని నమ్మడం సుసాధ్యమవుతుంది. ప్రతి సంఘటనని, అనుభవాన్ని కథగా, కవితగా మలచడం మీకు విధినిర్వహణగా మారుతుంది. ఇది మీరు మోయకతప్పని బరువు.
కవికి స్పందన ముఖ్యం. మీ చుట్టూ జరిగే ప్రతి విషయానికి కేవలం మనసుతో స్పందించండి. కొత్తల్లో ఇబ్బందిగా ఉన్నా, మీరు కవి అని బలంగా నమ్మడం ఈ అలవాటు క్రమక్రమంగా మరింత తొందరగా అయేలా సహాయపడుతుంది. నిద్రపట్టని (పట్టిన) రాత్రి గురించి, రొటీనుగా కాలకృత్యాలు తీర్చుకుని, తీరిగ్గా కాఫీ తాగుతూ, హడావిడిగా టీవీ చూస్తూ, రోడ్డు పక్క వినాయకుడికి ఫ్లైయింగ్ దణ్ణాలిస్తూ బస్టాపుకు పరిగెత్తే (బండి బైటికి తీసే) ఉదయాలు, తిరిగొచ్చే సాయంత్రాలు, మిగిలిపోయిన రాత్రులు; లిఫ్టులో, కిక్కిరిసిన బస్సులో ప్రతిరోజూ జరిగే అక్రమాలు, ఆహ్లాదాలు; ఇలా రోజువారీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకూ స్పందించండి. రాయకుండా ఉండగలగడాన్ని విసర్జించండి. తిరుపతి, టాంక్ బండ్, అరకులోయ, అరుణాచలం, నయాగరా, టైమ్స్ స్క్వేర్, గోల్డెన్ గేట్, గ్రాండ్ కేన్యన్, కసీనో, కేబరే, మ్యూజియం, ప్లానెటేరియం, ఎత్తైన భవనాలు, పచ్చటి పంటపొలాలు, రద్దీ నగరపు వీధులు, ఒంటరి వాగూ వంకలు ఏవి చూసినా… ఉన్న ఊరైనా, వేసిన కొత్త టూరైనా, పెళ్ళి పుట్టుక చావులైనా, దినపత్రిక వార్తలైనా, పాత జ్ఞాపకాలైనా, కొత్త పరిచయాలైనా… అప్పటికప్పుడు కవిత రాయండి. ఆ అనుభవం మనసులోకి ఇంకిపోయి మీ స్వంతమయే దాకా ఆగకండి. మంచి తరుణం మించిపోతుంది. ఏది చూసినా, ఏది చేసినా అది వెంటనే కవితగా రాయడం (కనీసం కాస్త పేరొచ్చేదాకా, అంతే వేగంగా ప్రకటించడం) మీ కర్తవ్యం.
ఏ సంఘటన కూడా ఆ సంఘటన మాత్రమే కాదు. కంటికి కనిపించేదే ప్రపంచం కాదు. వ్యాకరణానికి లోబడిందే భాష కాదు. అందుకే మన ప్రపంచమంతా ప్రతీకలతో నిండి వుంది. అంతమ్ లేని ఈ జగమ్, రియల్ అండ్ వర్చువల్, కేవలం ప్రతీకల ఒక పూర్ణకుంభమ్. ఆ కుండ పగలకొట్టండి. సమాసాలంకారసంధీవ్యుత్పత్తుల బంధనాలు తెంచుకొని కవిగా మీ కల్పనను విస్తరించండి. ప్రతీ కవితలోనూ నూతనత్వాన్ని ఆవిష్కరించండి. అర్థం కా(లే)కపోయినా ఒక పదం నచ్చితే వాడండి. పదప్రయోగాలతో ప్రజలని నిశ్చేష్టులను చేయండి. ‘నేను నీలోకి నదినై ప్రవహిస్తాను’ అనే ఎందుకనాలి? ‘నేను నీలోకి నదిస్తాను’ అనండి. పాదం (కవిత) చిక్కబడుతుంది. నామవాచకం తన అస్తిత్వాన్ని పోగొట్టుకొని క్రియావాచకం కావడం వ్యాకరణపు సంకెళ్ళు తెంచడమే. ‘వెండికొండ చలిని వేడిదుప్పటిలా కప్పుకుంది’ అనడంలో లాక్షణికుల ఛాందసత్వం నుంచి కవి కల్పన విడిపోలేదా? ‘నిర్లిప్త ఎయిర్పోర్ట్ క్రీనీడలో మధుపాన మద్‌హోష్ నియాన్ లైట్ల నీలిషాడోలలో బేబాక్ బాదకష్’ అన్న పదబంధం ఎంత కొత్తగా ఉంది! కవిత ఆశయం కోసం ముస్లిం ప్రస్తావనలో ఉర్దూ పదాలు, మైనారిటీ ప్రాంతీయ వాద కవితలలో ఆయా సంబంధమైన పదాలు వాడండి. కావ్యాలలో ఉన్నది బూతు మాత్రమే కాబట్టి మీరు తిట్లు వాడండి. (తేడాలు తెలియని ప్రపంచం మనది కాబట్టి ఎవరూ మిమ్మల్ని నిలదీయరు.) ఈ వాడుకలు సహజమూ అవసరమూ కూడా. ఏది చేసినా, అవధులు లేని కాల్పనిక నవ్యత మీ కవిత్వాన్ని నిత్యనూతనంగా ఉంచుతుందని గ్రహించండి.
కవిగొంతు ఒక్కటే. కవి ఒక్కడు కాదు. మత్తగజం ఒక్కటే ఘీంకరించినా అడవి కదిలిపోతుంది. అదే మత్తగజం సాటి ఏనుగులతో సమూహంగా తొండం ఎత్తినప్పుడు ఆ ప్రభావం చెప్పనలవి కాదు. అలా గుంపుగా కదిలినంత మాత్రాన మత్తగజపు విలువ తగ్గదు సరిగదా దాని బలం పెరుగుతుంది. ఇదే కవికి కూడా వర్తిస్తుంది. అందువల్ల సాటి కవులతో రచయితలతో కలవండి, కలుపుకోండి, కలిసిపోండి. రాసిన కవితలు వెంటవెంటనే పత్రికల్లో, బ్లాగుల్లో, ఫేస్బుక్లో ప్రచురించండి. రాసిన ఏ ఒక్క కవితనూ ఒదిలిపెట్టకుండా అన్నీ కలిపి సంకలనాలుగా వేయండి. ఆకట్టుకునే అట్ట వేయించండి. చక్కటి పేరు పెట్టండి. సాటి కవులతో, సహృదయులతో, మంచి ముందుమాట రాయించండి. ఆ సంకలనాలు కవి మిత్రులకు, స్నేహితులకు పంచండి. వారి కవితలను, సంకలనాలను మీరూ ప్రోత్సహించండి. మీ కవితల ప్రోత్సాహాన్ని సాదరంగా స్వీకరించండి. పేరుపేరునా ధన్యవాదాలు తెలపండి. వీలైతే సమీక్షలు రాయండి, రాయించుకోండి. అప్పుడప్పుడూ ఉమ్మడిగా కరపత్రాలు వేసి సంచలనం సృష్టించండి.
ఎవరినీ విమర్శించకండి, ఏ కవి మనసూ నొప్పించకండి. కవికి విమర్శకులు చంద్రునికి రాహుకేతువుల వంటివారు. సాటి కవులకు ఎప్పుడూ అభినందనలు, అప్పుడప్పుడూ సానుభూతి తెలపండి. ఎవరెన్ని కవితలు రాసినా, ఇంకా కవులకు, కవితలకు ఎప్పుడూ చోటు ఉంటుందనీ, ఈ ప్రపంచమొక పుష్పకవిమానమనీ గమనించండి. మీ అనుభూతికి వ్యతిరేకంగా సాటి కవి ఎచ్చోట కవిత్విస్తే, మీరు సమాధానం అచ్చోటనే కవిత్విస్తూనే చెప్పండి. (విశ్లేషణాత్మక విమర్శ కాదు కదా ఎవరూ చదవని చోట రాసుకోడానికి.) రాజకీయ సామాజికాభ్యుదయ కవితలు రాసేటప్పుడు తప్పు ఎవరిదైనా సరే, ప్రతీకాత్మకంగా ఎవరు బలహీనులో, పీడితులో కేవలం వారిని సమర్థిస్తూ మీరు కవితలు రాసినంత కాలం సాటి కవులతో మీకు ఇబ్బందులు ఉండవు. సామ్యవాదులుగా ప్రకటించుకోవడం (ఆచరించక్కర్లేదు) సహాయపడుతుంది. అన్ని అనర్థాలకు ముఖ్యంగా అమెరికా కారణం అని గుర్తిస్తే మంచిది. ఉదా. 9/11 ఎప్పుడు కూడా మంచి విప్లవాత్మక సంఘటన. బిన్ లాదెన్ ఒక ప్రతీకాత్మక అండర్ డాగ్.
ఇక, కొన్ని కవిత్వ పద్ధతులని పరిశీలించే ముందు రెండు మాటలు:
మొదటిది. నేను ఉదహరించబోతున్న కవిత్వ పద్ధతులు కేవలం సూచన ప్రాయమే, స్థాలీపులాకమే అని గమనించండి. ఈ ఉదాహరణలు ఇవ్వడం మీకు ఇటుకలు పేర్చడం చూపించడం వంటిది. ఆపైన మీరు పదాలు ఎలా పేరుస్తారు, కవితా హర్మ్యాలు, షాయరీ గలీలు, పొయెటిక్ కమ్యూనిటీలు (గేటెడ్) ఎలా కడతారు అన్నది మీకే ఒదిలేస్తున్నాను. ఈ ఉదాహరణలు అలానే పాటించవచ్చు, లేదూ ఏ కొన్ని పద్ధతులైనా మిశ్రమించి ఒక కొత్త కవితాపద్ధతి మీరు సృష్టించవచ్చు. ఒక పద్ధతిలో లక్షణాలతో ఇంకో పద్ధతిలో కవిత రాయచ్చు. మీ సృజనే మీ దారిదీపం. మీ కవిత్వ కాంక్షే మీకు కాలిబాట.
రెండవది. అచ్చులో, ఇంటర్నెట్లో – పత్రికలు, పుస్తకాలు, బ్లాగులు, ఫేస్‌బుక్ – ఎందరో లబ్ధప్రతిష్టులైన కవుల కవితలు కోకొల్లలుగా ఇప్పటికే ఉన్నవి, మీకు ఉదాహరణలుగా చూపిద్దామనుకున్నాను. నిజానికి నేనివ్వబోయే ఉదాహరణలు ఈ కవుల ప్రచురిత కవితల ముందు సూర్యుడి ఎదుట పెట్రోమేక్స్ లాంతర్ల లాంటివి. పైగా, అంత గొప్ప కవుల కవిత్వాన్ని ఉదాహరణలుగా చూపడం వల్ల, నా సూచనలతో ఆ స్థాయిలో కవితలు మీరూ వెంటనే రాయగలగడం వల్ల, కవిగా మీ ఆత్మస్థయిర్యం కూడా పెరుగుతుంది. మరైతే, నేను ఆ ప్రయత్నం ఎందుకు విరమించుకున్నాను?
నేను ఒక సంఘటన విన్నాను. ఒక ప్రసిద్ధ రచయితను ఒకరు, ‘మీరు ఫలానా రచయిత పుస్తకాలు చదివారా?’ అని అడిగాట్ట. ఆ రచయిత, ‘లేదు. నేను ఇంకెవరి పుస్తకాలూ చదవను. ఎందుకంటే వారి రచనల ప్రభావం నా రచనల మీదపడి అవి కళంకం కావడం నాకిష్టం లేదు,’ అని చెప్పారట. ఇది నిజమో కాదో తెలియకపోయినా, నిజం అనిపిస్తుంది. నిజానికి నిజానికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఇదే. నిజంలో నిజం ఎంత అనేదానికన్నా ఆ నిజం విన్నప్పుడు ఎంత నిజంగా అనిపిస్తోంది అన్న అనుభూతి ఆ నిజాన్ని అంత నిజంగా అనిపించేలా చేస్తుంది. ఈ నిజత్వం వల్లనే ఆయన చెప్పింది ఎంత నిజమో అనిపిస్తుంది.
నిజత్వం మాట ఇప్పటికలా ఉంచి, ఈ ప్రసిద్ధకవుల కవితాతేజం మిమ్మల్ని మహాభారతయుద్ధం ముందు అర్జునుడిలా సంశయాత్మకులను చేస్తుందేమో, అది నాపై మరింత భారం మోపుతుందేమో అన్న భయం వల్ల వారి కవితలు నేను ఉదహరించ దలచుకోలేదు. అంతకంటే ముఖ్యంగా, ఒక వ్యాసరచయితగా ప్రపంచంతో పంచుకోవడానికి నా దగ్గరే ఎంతో అనుభవం ఉన్నప్పుడు, వేరే వారి రచనలు చదువుతూ కాలయాపన చెయ్యడం, అవి ఉదహరించడం, బాధ్యతారాహిత్యం అనిపించుకుంటుంది. పైగా మీరు ప్రసిద్ధ సాహిత్యకారులు కావడానికి, పాతకాలంలో లాగా బాగా చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నానని మీకు తెలుస్తోంది.
సరే, ఇక మీరు ప్రయత్నించి సాధించడానికి కొన్ని కవిత్వ పద్ధతులను సోదాహరణంగా పరిశీలిద్దాం.
1. మినీ కవితలు
ప్రతి కవీ రాయవలసిన కవితలు ఇవి. తప్పకుండా ప్రయత్నించండి. ఈ కవితలలో చమక్కు ఉంటుంది. ఏ కవిత కూడా రెండు మూడు పాదాలకు మించి ఉండదు. అందువల్ల, కవితకూ కవితకూ మధ్య సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఈ మినీ ఉదాహరణ చూడండి:
ఆమె నన్ను చూసి నవ్వింది
ఆనందంతో పండు
దానిమ్మపండు విచ్చుకుంది.
నవ్వినప్పుడు ఆమె పళ్ళు దానిమ్మ గింజలను గుర్తుకు తెచ్చాయనడం సామన్య ప్రతీక. కానీ, ఇక్కడ ‘నన్ను’ పై ఆమె నవ్వు చూపించిన ప్రభావం చమత్కారంగా భాసిస్తుంది. అంటే నిజానికి విచ్చుకుంది అతడు. ఇది అసామాన్య ప్రతీక. రెండు సార్లు పండు అనడంలో పదశ్లేషని మీ ఊహకు వదిలిపెడుతున్నాను.
నేను కనురెప్పలార్పను
నా కళ్ళల్లో ఇల్లుకట్టుకున్న నీకు
లోకం చీకటి కాకూడదని
చిన్న చిన్న మాటల్లో ఎంత లోతైన భావం! ఇలా మినీ కవితలు రాసేముందు ఆ కవితల బుట్టకి ఒక చక్కటి పేరు పెట్టడం మర్చిపోకండి. జపాను వారి హైకూ కవితా పద్ధతిలో పద్ధతిని పూర్తిగా తుడిచేసి మన కవులు తెలుగులో చాలా ప్రచారం లోకి తెచ్చారు. అందువల్ల హైకూలు అని అనడం ఇప్పుడు పాతబడి పోయింది. (రక్తనేత్ర అనే కవి హైకూల ఎముకలు విరగ్గొట్టి చేసిన ‘ఎమ్‌కూ’లనే మినీ కవితల గురించి నా పేరుతో పరిచయం చేయించుకున్న ఒక సమీక్షలో చదవండి.) గూగుల్ చేసి చూస్తే, ఒక వికీ పేజిలోనే సెన్-రియు, జుయెజు, తంకా, వాకా, అలాగే తమిళ కుఱళ్, ఉర్దూ షేర్, ఇంగ్లీష్ కప్లెట్ — ఇలా ఎన్నో కొత్త పేర్లు నాకు కనిపించాయి. మనకు కావలసింది పేర్లే కానీ పద్ధతులు, నియమాలు కాదు. తెలుగులో ద్విపదలు అని ఒకటుంది. దాన్ని కొంచెం మార్చి దోపద్‌లు అని అనచ్చు. కప్లెట్‌లని సాహిత్య కట్లెట్లు చేయచ్చు. మినీలు, నానీలు, అణువులు, మిణుగురులు ఇలా కొన్ని పేర్లు కొందరు ప్రసిద్ధులైన కవులు వాడుకలోకి తెచ్చారు. మీరు కూడా వెజీలు (వెన్నెల జిలుగులు) చీపోలు (చిలిపి పొగడ్తలు) లాంటి పేర్లతో మినీ ప్రేమకవితలని రాయండి.
వెన్నెలను చూసి నేను ఇష్టపడ్డాను
అందుకని నువ్వు అసూయపడ్డావు
ఈరాత్రి నాకు రెండు పండగలు
చూశారా, ఎంత మందుగుండు దట్టించవచ్చో మూడు చిన్న వాక్యాల్లో? నిప్పులు, చురకలు, ఉల్కలు లాంటి పేర్లతో మినీ విప్లవకవిత్వం రాయండి.
నా దేశం కాలుతోంది దేహంలా
ప్రపంచపు శ్మశానవాటికలో చితిలా
విపణివీధిలో పెట్టుబడిదారు చుట్టలా
చమక్కు, చమత్కారం ముఖ్యం! మర్చిపోకండి. కవి ఐక్యత వల్ల, ప్రతీ కవితను ఆదరించి అభిమానించి లైకే సహృదయపాఠకుల వల్ల, మీ ప్రక్రియ మీకు గొప్ప పేరు తేవచ్చు. దురదృష్టవశాత్తు అలా జరగకపోయినా, అది మీ తప్పు కాదు. మీ బాధ్యత మీరు నిర్వర్తించారు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి.
2. ఫ్రేము కవితలు
పేరుకు తగ్గట్టుగానే, ఇది ఒక పద్ధతిలో రాసే కవిత. ఇది ఛందస్సులా బంధించే ఫ్రేము కాదు. ఈ చట్రం భావలహరికి కుదురునిచ్చి గీతలహరిగా స్వేచ్ఛనిచ్చేది.
ఈ ఉదయం నాకెంతో అందంగా అనిపిస్తోంది
నా హృదయం మాటిమాటికీ కూనిపాట పాడుతోంది
ముభావంగా మూతిముడిచే మొక్క కూడా నవ్వుతోంది
ఎప్పుడూ లేనిది ఒక పిట్ట ఆగి మరీ నన్ను పలకరిస్తోందిఇదంతా ఎందుకో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు
ఈరోజు నువ్వూ నేను కలిసి మనమైపోతామని
ఈరోజు నుంచీ మనం చెరిసగమవుతామని
ఈ 4-1-2 కవితను మీరు రాగయుక్తంగా కాకుండా చదవలేరు, గమనించే ఉంటారు. ఆ ఫ్రేము గొప్పతనం అది. అలా అని ప్రాస, భాష నియమాలు కూడా ఏమీ లేవు. ఈ పద్ధతిలో మొదట కొన్ని పాదాలలో మీరు పాఠకుడి మనసులో ఉత్సుకతను కలిగిస్తారు. ఆ తరువాత, మొదట మీకు తెలియదని, వెంటనే తెలిసింది చెప్పి పాఠకుడి మనసులో కవితను సంపూర్ణం చేస్తారు. ఒకటి తెలుసు అని రెండు చెప్పడం చమత్కారం. ఈ పద్ధతి విప్లవ కవితలకంటే బాగా ప్రేమ కవితలకు, లలితభావాల వ్యక్తీకరణకు నప్పుతుంది. మీ ఇష్టాన్ని బట్టి 5-1-2 అనో 7-1-3 అనో ఇలా ఒక p-1-y ఫ్రేము చేసుకున్నాక, మీరు ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు. y విలువ p విలువలో సగం కన్నా తక్కువ ఉంటే ఫ్రేము బాగుంటుంది. మధ్యలో -1- ఈ కవితలకు కీలకం అని గుర్తు పెట్టుకోండి.
ఇప్పుడిక ఈ 2-2n కవిత చూడండి.
అక్కంటే అమ్మ చాకిరి పంచుకునేదే కాదు
అమ్మ తర్వాత అమ్మంత ప్రేమ కూడా
అమ్మంటే లాల పోసి అన్నం పెట్టే చేయే కాదు
ఆదరించి లాలించే చల్లటి ఒడి కూడా
అన్నంటే నా తాయిలం లాక్కునే వాడే కాదు
తన పాత చొక్కా లాగూ నాకిచ్చేవాడు కూడా
నాన్నంటే తిట్టి దండించే నరసింహుడే కాదు
దారి చూపి నడిపించే గురువూ కాపరి కూడా
ఈ కవిత మీరు n రెండ్ల తర్వాత అలాగే ఆపేయవచ్చు. అయితే మీ అభిమానులు కొందరికి అది నచ్చదు. అలాంటప్పుడు పైన చెప్పిన y గానీ 2y గానీ వాడి ఒక చక్కటి ముగింపు ఇవ్వచ్చు, ఇలా:
ఏ దేశంలో ఉన్నా ఇల్లే జ్ఞాపకం వస్తుంటుంది
కలిసినప్పుడల్లా జీవితం బాల్యం అవుతుంటుంది
అమ్మ చేతి ముద్ద అపురూపమని గుర్తొస్తుంది
చెమరించిన కన్నుల్లో నా బిడ్డ ముఖం నవ్వుతుంది
పై ముగింపులో, మూడో పాదంలో ‘గుమ్మానికానుకుని ఎదురుచూసే అమ్మ గుర్తొస్తుంది‘ అని రాస్తే పాఠకుడిలో మరో విధమైన భావపీడనాన్ని కవిగా మీరు కలిగించిన వారవుతారు. ఒంటరి, అమ్మ, నాన్న, బాల్యం, స్నేహం, బిడ్డలు, జ్ఞాపకం, గూడు — ఇలాంటివి అతి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్నిచ్చే పదాలు. ఇవి వాడుతూ రాసిన కవితలు ఎప్పటికీ వట్టిపోకుండా అభిమానులని అలరిస్తూనే ఉంటాయి. తప్పకుండా ప్రయత్నించండి.
ఇకపోతే, ఇంకో రకమైన ఫ్రేము కవిత x-np నమూనాలో ఉంటుంది. అందులో ప్రతీ రెండు మూడు పాదాలకు కవి మకుటం x తో మళ్ళీ మొదలు పెడతాడు. p విలువ ఎంతైనా ఉండవచ్చు కాని నాలుగు కంటే తక్కువుంటే కవిత చక్కగా ఉంటుంది. ఈ కవిత (p=2) చూడండి.
ఈరోజు–
చీకటి నల్లబడింది
అమ్మ తప్పిపోయిన బిడ్డలని పిలుస్తున్నదిఈరోజు —
నది చల్లబడింది
ఖాకీ దౌర్జన్యపు సంకెల బిగుసుకున్నదిఈరోజు —
ఆకాశం ఎర్రబడింది
ప్రజానీకం విప్లవాన్ని కోరుకుంటున్నదిఈరోజు —
వెన్నెల తెల్లబడింది
ఒక సమసమాజం రారమ్మని పిలుస్తున్నది
ఈ కవితనూ ఇలానే ఆపేయవచ్చు. లేదూ, n పాదాల తరువాత ఒక ముగింపు ఇచ్చి (x-np-y) కూడా ఆపుకోవచ్చు. ఉదా:
ప్రతిరోజూ ఈరోజు,
ఒక రేపటికి దారి తీస్తుంది
ఒక కొత్త ఉదయాన్ని చూపిస్తుంది
మరుసటి రోజును మనకు తెచ్చిస్తుంది.
3. భావకవితలు
వీటి గురించి నిజానికి వేరొక వ్యాసం రాయవలసి ఉంది. అంత విస్తారమైన కవితా ప్రపంచం ఇది. ఎన్నో కవితాపద్ధతుల నందనవనం ఇది. ఇక్కడ క్లుప్తంగా రమణీయ భావకవితను మాత్రం చర్చిస్తాను. ఈ కవితలు రాద్దామనుకునే కవులు, గాంధీ గారి మూడు కోతుల లాగా, ఎక్కడా అశ్లీలాన్ని, అసహ్యాన్ని, అసభ్యాన్ని కనీసం ఊహకు కూడా రానీయకండి. మీకంటూ వేరొక లోకం నిర్మించుకోండి. అక్కడ ఏడాది పొడుగునా వాసంత సమీరాలు వీస్తాయి. పత్తిపూలు నవ్వుతూ తలలూస్తాయి. చెఱకు గడలు పుప్పొడి వెదజల్లుతాయి. సవ్వడి, రవళి మాత్రమే ఉంటాయి. ప్రతీ భావమూ హుందాగా ప్రకటించబడుతుంది. మూర్ఛ కేవలం ప్రణయతీవ్రత వల్ల వస్తుంది. స్వేదం సమాగమోద్విగ్నత వల్లనే ఉద్భవిస్తుంది. చెమట ఎప్పుడూ చిరు చెమటే. శ్రమ కూడా శృంగారాత్మకమే. అంటే, కష్టాలను కూడా భావాత్మకంగా చూపి ప్రపంచం లోని ఐహిక మకిలిని కడగడం కవి ధ్యేయం.
ఈ కవి ప్రకృతిని ప్రేమిస్తాడు. తన ఒడిలో పవళిస్తాడు. వెన్నెల, చుక్కలు, అడవులు, కొండలు, పచ్చిక బయళ్ళు, నదులు, కుందేళ్ళు, నెమళ్ళు, లేళ్ళు, శుకపికరకాలన్నీ ఈ కవి నెచ్చెలులు, నేస్తాలు. అవి ఇతనితో మనసు విప్పి మాట్లాడతాయి. అవేం అనుకుంటున్నాయో చెప్తాయి. ఇతను తిరిగి మనకు చెప్తాడు. ఈ కవి వర్షాన్ని విపరీతంగా ప్రేమిస్తాడు. వాన రాకముందు, వాన పడుతున్నప్పుడు, వాన వెలిసిన తర్వాత భావోద్వేగంతో విచలితుడవుతాడు. ఇతరుల కష్టానికి మనసులోనే కదిలిపోతాడు. ఈ యాంత్రికప్రపంచంలో భాగం అయినందుకు, అందరిలానే డబ్బు, కార్లు, నగలు, హోదా, పరపతి, కీర్తి తనకూ కావలసినందుకు సామాజిక కవితో గొంతు కలిపి వేదన ప్రకటిస్తాడు. ప్రాయశ్చిత్తంగా తన భావప్రపంచంలో తనను బందీ చేసుకుని ఆ లోకం నుంచి కథలు, కవితల ఉత్తరాలు పంపుతాడు. వాటిలో తనని తాను అపరిచితుడిగా పరిశీలిస్తాడు.
ఆ ప్రపంచపు లోతులు మీకు అంత తొందరగా అంతు చిక్కవు. భావగంభీరత గహనమై శృంగారం దైహిక స్థాయిని దాటి అలౌకికం అవుతుంది. రాగ, వర్ణ, భావ మిశ్రమాలుగా, ఒక యుగళగీతంగా స్త్రీ పురుషుల కలయిక వుంటుంది. అతను ఆతను. ఆమె ఆమే. ఇది ఒక కవితాయోగస్థితి. అలుపెరగక శ్రమించి సాధించుకోవలసి ఉంటుంది. ఒక్క ఉదాహరణ ఇచ్చి సరిపెట్టుకుంటాను, ఎంత కష్టమైనప్పటికీ. నింపాదిగా, ప్రతిపాదం అనుభవిస్తూ చదవండి.
పచ్చటి మైదానంపై వెన్నెల తుంపరలు మంచుగా రాలినట్టు
నా అనాచ్ఛాదిత శరీరంపై బెడ్రూం నీలపు కాంతి పరుచుకుంటుంది
శశీశరితో ఆడుకునే రక్తాక్షపు పెదవుల తడిముద్రల తపనలలో
పరిచితమైన బ్రాందీ వాసన, గుట్కా ఊపిరి చందన చర్చలు
మొగలిపూరేకుని మీటిన ఊదారంగు నెమలి ఈక
ఆ చీకట్లో గోడ మీది అద్దం నన్ను చూసి నవ్వుతుంది
వింటిలా వంగిన మేను ఆలపించే జన్యురాగం జలదరింపు
నేను నిజంగా ఎవరన్న ప్రశ్నకు సమాధానమవుతుంది
నాగుపాములా నన్ను చుట్టుకున్న ఆతని పరిష్వంగంలో
నవ్వుతూ నలిగిపోయిన మల్లెపూలలాంటి మధురభావనలు
నా ఈస్థటిక్ అస్తిత్వాన్ని కరిగిస్తూ ఆతని అవయవాల కాలిస్థనిక్స్.
(ఇంక రాయలేను నేస్తం. నన్ను క్షమించు.)
ఈ కవితలలో శబ్దగంభీరమైన పదాలు అలతిగా అలవోకగా వేసి ఆహ్లాదం కలిగించండి. తాత్వికవిరక్తి తాకినప్పుడు కవిత వ్యక్తీకరణలో కొంత వైరాగ్యాన్ని సూచించండి.
పచ్చటి మైదానంపై వెన్నెల తుంపరలు మంచుగా రాలినట్టు
క్షణాలని జీవితాలుగా పరుచుకుని కప్పుకున్న నిమిషాలలో
మొగలిపూరేకులపై ఊదారంగు నెమలి ఈకల జలదరింపు
పరిచితమైన బ్రాందీ వాసన, గుట్కా ఊపిరి చందన చర్చలు
ఆతని పెదవుల తడిముద్రల తపనలు పొడిపొడిగా
కటాదపు మేని పైని స్వాతిచినుకులా నను తాకీతాకకుండా
నాగుపాములా నన్ను చుట్టుకున్న ఆతని పరిష్వంగంలో
నవ్వుతూ నలిగిపోయిన మల్లెపూలలాంటి మధురభావనలు
నా ఈస్థటిక్ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ అతని అవయవాల కాలిస్థనిక్స్
నువ్వు నిజంగా ఎవరు అని నేను నన్ను సందేహిస్తాను.
సమాధానం కోసం ఆ చీకట్లో గోడ మీది అద్దంలోకి చూస్తాను
నా అనాచ్ఛాదిత శరీరంపై బెడ్రూం నీలపు కాంతి మౌనంగా పరుచుకుంటుంది.
ఈ ఉదాహరణకు ఇంకేరకమైన వివరణ నేను ఇవ్వను ఇవ్వకూడదు. తన మనసు ఎంత లోతైనదో ఇంకెవరూ ఎప్పటికీ చూడలేరు అన్న గాఢ నమ్మకం ఈ కవికి అవసరం, సరేనా!? (ఈమాటలో ప్రచురితమైన ఈ కవితలు చూడండి. మొదటిది తత్వప్రేమకు, మూడవది లలితభావుకతకు, రెండవది ఉత్తరాధునిక భావుకతకు చక్కటి ఉదాహరణలు. శీర్షికలో, పాదం విరుపులో నవ్యతను గమనించండి.)
4. సామాజిక కవితలు
సాధారణంగా ఒక దేశం ఇంకో దేశంపై దాడి చేసినప్పుడు (అంటే చైనా, పాకిస్తాన్ మనమీద దాడి చేసినప్పుడు కాదు) రాజకీయ స్ఫూర్తితో కవి అనేవాడు కవితలు రాస్తాడు. అదే విధంగా ఉగ్రవాద చర్యల్లో సామాన్యప్రజలు బలి అయినప్పుడు రాసిన కవితల్లో కూడా రాజకీయ స్ఫూర్తి ఉన్నప్పటికీ కవి మానవత, శాంతి, సమానతలకు పెద్ద పీట వేస్తాడు. ఇలా స్పందించి రాసే కవిత సామాన్యంగా ‘ఆనందం-దారుణం-ప్రశ్న-ఆకాంక్ష’ అనే నాలుగు భాగాలుగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రశ్న శాపంగా, ఆకాంక్ష హెచ్చరికగా వ్యక్తమవుతాయి. ఉగ్రవాదం, మానభంగం అనే రెండు సందర్భాలను పోల్చిచూపడానికి ఈ ఉదాహరణలో ప్రయత్నిస్తాను.
హుసేన్ సాగర్ నీళ్ళపై ఎండ బంగారు రంగు హెన్నా పెడుతున్నది. అప్పుడే విచ్చుకుంటున్న పసిమొగ్గలు తల్లిదండ్రుల పాదులలో నవ్వుల రంగు బుడగలు ఎగరేస్తున్నాయి. యువ జంటలు, స్నేహితులు, రిటైరైపోయిన ఉద్యోగులు, జీవిత శ్రామికులు అక్కడ విశ్రాంతిగా నగరాన్ని ఆనందిస్తున్నారు. | కన్నాట్ సర్కస్ చేతులపై విద్యుద్దీపాల వీధులు నియాన్ తీగల్లా మెరుస్తున్నాయి. ఆమె ముఖంలో విచ్చుకున్న చిరునవ్వు ఆనందపు క్షణాలను స్నేహితుడి నవ్వులో పంచుకున్నది. కొత్తగా తన ముందు పరచుకుంటున్న భావి జీవితపు ఆదర్శం ఆమె కళ్ళలో మెరుస్తున్నది. |
కన్నుమూసి తెరిచేలో కమ్ముకున్న చీకటి ఒక విస్ఫోటనం, ఒక చావు కేక, ఒక రోదన, ఆక్రందన. తెగిపడిన పూవురేకు, ఒక చిన్నారి తల. భర్త చచ్చిపోయిన కొత్త పెళ్ళికూతురు, ప్రియుని పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. శాశ్వతంగా రిటైరైపోయిన ముదుసలి పావురాల జంట. | చాందినీచౌక్‌లో వెన్నెల పంచిన అమాయకత్వం క్రూరమృగాల మేకతోలు మాటలు నమ్మింది. నరకం నయమనిపించే తన జీవితపు ఆఖరి ఘడియల్లోకి అడుగు పెట్టింది. హయీనాల దాడిలో శరీరం ఛిద్రమై జీవితం శిథిలమై, తనను పట్టించుకోని నగరాన్ని అర్థించి అలిసిపోయింది. |
ఏ ముష్కరులు ఈ దారుణానికి ఒడిగట్టారు? ఈ రక్తాన్ని పైశాచికంగా తాగి నవ్వుతున్నారు? ఏ స్వార్థం కోసం, ఏ దైవం కోసం ఈ ఘాతుకం? ఏ దేశం, ఏ వాదం ఈ ద్వేషం నింపుతోంది? | ఏ ముష్కరులు ఈ దారుణానికి ఒడిగట్టారు? ఈ రక్తాన్ని పైశాచికంగా తాగి నవ్వుతున్నారు? ఏం నిరూపిద్దామని ఈ ఘాతుకం? ఏ ఆకలి మగపశువును మరణమృగం చేసింది? |
ఒక కొత్త బంగారు లోకం రావాలి. మానవులంతా శాంతి సౌఖ్యాల సమానత్వంతో జీవించాలి. ఒక చిన్నారి భయం లేకుండా నవ్వాలి, ఆనందంతో ఆడాలి. ఒక పావురం స్వేచ్ఛగా నీలాకాశంలో ఎగరాలి. | ఒక కొత్త బంగారు లోకం రావాలి. అబల సబలగా సమానత్వంతో బతికే రోజు రావాలి. ఒక సోదరి భయం లేకుండా నవ్వాలి, రాత్రిపూట నడవాలి. ఒక పావురం స్వేచ్ఛగా నీలాకాశంలో ఎగరాలి. |
అగ్నిప్రమాదాలు, పెను తుఫానులు, తదితర విపత్తుల స్పందన కూడా ఈ నాలుగు భాగాలలో ఒదిగించవచ్చు. మీకు అలవడడం కోసం రైతుల ఆత్మహత్య, రైలు ప్రమాదాలు, శిశుహత్యలు, ఆసిడ్ దాడులు, సామూహిక మానభంగాలు వంటి వాటి మీద రాసి ప్రయత్నించండి. (మన సంస్కృతిలో భాగంగా రోజూ జరిగే వీటిలో వెరైటీ ఏమీ లేదని నాకు తెలుసు, కానీ ఇవి మీకు ప్రాక్టిస్‌కి బాగా పనికొస్తాయి. మీడియాకు అవసరమై దుమ్ము రేపినప్పుడల్లా మీరూ రెడీగా ఉంటారు.) నాలుగు భాగాలు ప్రతీసారి ఉండక్కర్లేదు. కొన్నిసార్లు ఒకటో రెండో ఒదిలేస్తూ, ఇంకో భాగం పొడిగిస్తూ, ఒకటే భాగాన్ని ఫ్రేము పద్ధతిలో విస్తరిస్తూ, ఇలా ప్రయోగాలు చేస్తూ కవితలు రాయండి.
దుర్ఘటనలే అయినా రాజకీయ సంబంధమైన కవితలలో కొంత లౌక్యం పాటించండి. సామ్రాజ్యవాదులను, కొన్ని మత శక్తులను తప్పించి ఎవరినీ తొందరపడి వేలెత్తి చూపకండి. ఆ దారుణాల వెనకాల గల ప్రపంచ రాజకీయాల ప్రభావాన్ని నర్మగర్భంగా ప్రశ్నించండి. ముష్కరులు కూడా దారి తప్పిన మానవులే, వారు కేవలం అగ్రరాజ్యాల కుట్రలో పావులే అని గుర్తు చేయండి. ఈ సామాజిక కవితలలో ముఖ్యంగా గమనించవలసింది కవిత వచనంలా ఉండడం. సామాజిక కవిత ఎంత వచనంగా ఉంటే అంత ప్రభావితం చేస్తుంది. పై ఉదాహరణలో కేవలం నా చేతగానితనం వల్ల పాదాలలో ప్రాస, లయ కనపడతాయి కానీ, నిజమైన కవి కేవలం పూర్తి వచనంగా రాస్తాడు.
ఈ సామాజిక కవితలకు సమయం చాలా విలువైనది. దుర్ఘటన జరిగిన తరువాత ఎంత వేగంగా మీరు స్పందిస్తే కవిత అంత సమయోచితంగా ఉంటుంది. కొన్ని సార్లు మీరు వెలిబుచ్చిన సెంటిమెంటే ఇంకో కవి కూడా వెలిబుచ్చుతాడేమో అన్న అనుమానం మీకు రావచ్చు. కానీ, కవి ఐక్యత వల్ల ఏ కవి ఎలా స్పందిస్తాడో మీకు త్వరలోనే అర్థమైపోతుంది. తద్వారా మీ ఆగ్రహం ఇతర కవులకు విభిన్నంగా ఉండేలా చూసుకోవచ్చు.
5. నివాళి కవితలు
నివాళి కవితలు సాధారణంగా మీరు ఎవరికి నివాళి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా మనకు తెలిసిన వారికి ఒకరకంగా, ప్రముఖులకు ఇంకోరకంగా నివాళి పద్ధతి ఉంటుంది. మొదటగా ఈ కవిత చూడండి.
వాడు తన చేతిసంచి నిండా
ఎన్నో వేల కలలని నింపుకుని
ఆటోరిక్షాలో మా ఇంటికి వచ్చేవాడు
వాడు రాగానే మా ఇల్లంతా పదాల పావురాలు
కువకువలాడేవి కవితలు గాలిపటాలలా ఎగిరేవి
మా సందు చివర హుసేన్ టీషాపు ముందు
బల్లపై కూర్చుని వాడు ప్రపంచాన్ని
తన మాటలలో చుట్టి వచ్చేవాడు. సమస్యలకు
సమాధానాలు పట్టేవాడు. సామ్రాజ్యవాదమూ,
ఆకలి చావులూ, చైనా రష్యా మావో స్టాలిన్
కళ్ళలో విప్లవాల నిప్పులు చిమ్మేవాడు.
వాడి సిగరెట్ పొగ వాడి ఆలోచనల్లానే సుళ్ళు
తిరుగుతూ వాడి ఆశయం లాగా ఆకాశం వైపు సాగేది
కానీ ఒకరోజు వాడు రాలేదు. వాడిక రాడని తెలిసింది
టీషాపు బల్ల అక్కడే ఉంది. వాడు మాత్రం లేడు
… …(“…”కి కన్నీళ్ళతో/ విప్లవాశ్రువులతో/ రక్తతర్పణాలతో/ లాల్ సలామ్‌తో…)
ఇప్పుడు మిమ్మల్ని ప్రభావితం చేసిన మీ స్కూలు టీచర్, మీ హాస్టల్ వార్డెన్, మీ టీమ్ మేనేజర్, ఒక గాయకుడి పాట, ఒక నటి సినిమా, మీరు పోయొచ్చిన ఊరు గురించి ఇలా రాసి ప్రయత్నించండి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవల్సింది ఇది: వ్యక్తి, అతని వస్తువులు, ఆ పరిసరాలు ఉంటాయి మొదట. కవిత రెండో భాగంలో ఆ వ్యక్తి తప్ప మిగిలినవన్నీ ఉంటాయి. అవన్నీ అలానే అప్పట్లానే ఇప్పుడూ ఉన్నాయి కానీ ఆ వ్యక్తి మాత్రం లేడు అని నివాళి కవిత చెప్పాలి.
ప్రశ్న: ఒక ఊరికి లేదా ఒక స్థలానికి — పార్కు, హోటలు, రోడ్డు — ఈ పద్ధతిలో నివాళి ఎలా చెప్తారు? ఆలోచించండి! ఆ ఊరు, ఆ చోటు ఇప్పుడు లేదని చెప్పే సందర్భాలు కొన్ని. ఆ ఊరు ఆ చోటు ఉన్నాయి, ఇప్పుడు నేనక్కడ లేను అని చెప్పే సందర్భాలు కొన్ని. అంటే రెండు రకాలుగా మీరు కవిత చెప్పగలరు. అలానే మీ వీధి చివర్లో ఎప్పుడూ నవ్వుతూ పలకరించే పాల, పూల, కూరల కొట్టబ్బాయి ఉన్నట్టుండి ఉరేసుకున్నాడు. కారణం తెలియకపోతే కవిత ఎలా చెప్తారు? పోనీ, తెలుసు. మీదో మీ అన్నయ్యదో మీ చెల్లెలిదో శుభలేఖ చూసి అలా చేశాడు. అప్పుడెలా చెప్తారు?
మరి కొన్ని నివాళి కవితలలో ఆత్మీయత, కృతజ్ఞత వ్యక్తపరుస్తూ మీ అనుబంధాన్ని మరింత బలంగా ప్రకటించవచ్చు. ఈ ఉదాహరణ చూడండి.
ఆమె ఎప్పుడు నేను చూసినా
అప్పుడే వానలో కడిగిన పువ్వులాగుండేది.
నా ప్రతీ ఉదయం ఆమెతోనే
మొదలయ్యేది సాయంకాలం అయ్యేది.
నేనేమీ అడక్కుండానే నాకేం కావాలో
ఆమె అన్నీ అమర్చిపెట్టేది.
ఇన్నేళ్ళ మా సహచర్యంలో ఎన్నడూ
ఆమె నన్ను పల్లెత్తు మాటనక పోయినా
నా పెత్తనాన్ని మాత్రం నవ్వుతూ నెత్తినెత్తుకుంది
నన్ను మౌనంగా భరించింది
… …(నా “…”కి నివాళిగా/ ప్రేమతో/ స్నేహంతో/ దిగ్భ్రమతో…)
ఈ కవిత రిటైరై పోయిన, ట్రాన్స్‌ఫరై పోయిన, వయసై పోయిన సహోద్యోగి, అనుచరి, స్నేహితురాలికి నివాళి కావచ్చు. లేదా ఇన్నేళ్ళూ మిమ్మల్ని సహించినందుకు మీ సహచరికి కృతజ్ఞత కూడా కావచ్చు. కవిత ఎందుకో, ఎవరికోసమో మీరు చెప్పేదాకా తెలియనియ్యకండి. (ఆక్సిడెంటై పోయిన వారి నివాళి సామాజిక కవితగా కూడా మీరు వ్యక్తీకరించవచ్చని మరిచిపోకండి.)
అయితే ఈ కవితలు అందరికీ కాదు. ఇలాంటి కవితలు రాయడానికి ముందు మీరు ఒక ప్రముఖ కవి కావలసి వుంటుంది. కనీసం ఒకటి రెండు సంకలనాలు వేయవలసి ఉంటుంది. అప్పుడు మీ సహచరి, సహచరుడు, మీ పిల్లలు, మీ మిత్రులు, మీ వీధిచివర దర్జీ – ఇలా అందరూ తమపై కవిత్వం చెప్పబడటానికి అర్హులౌతారు. నా ఉద్దేశం ఈ కవితలు ఔత్సాహికులు రాయకూడదని కాదు, కానీ ఏ పత్రికలూ ఈ నివాళులు ప్రచురించవు మీకు బాగా పేరు వచ్చేదాకా. (చివరికి ఈమాట కూడా!) మీరు ప్రముఖులైతే మీవారంతా ప్రముఖులే. మీరే అనామకులైతే ఇక మీవారి గురించి చెప్పడానికి ఏముంటుంది?
ఇక ప్రముఖులకు నివాళి కవితలు వారు ఏ రంగంలో నిష్ణాతులనే విషయం పైన ఆధారపడి ఉంటాయి. మీరు ముందు ఆ వ్యక్తి దేనివల్ల గుర్తింపబడ్డాడో ఆ రంగంలో కొన్ని పేర్లు జమ చేసుకోండి. వాటిని చొప్పిస్తూ ఆ వ్యక్తితో మీకున్న బలమైన అనుబంధాన్ని విషాదంగా ప్రకటించండి. మీరు బాధ పడడం ముఖ్యం కాదు. మీరు బాధ పడుతున్నారని పదిమందికీ తెలియడం ముఖ్యం. తద్వారా ఆ ప్రముఖుడి మరణానికి మీ బాధను పంచుకున్న వారంతా కూడా బాధితులై ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఒక ఉదాహరణగా ఈమధ్యనే పోయిన బాపు గురించి, ఇలా….
వెళ్ళిపోయావా బాపూ, నను ఒంటరిని చేసి
నీ నేస్తం రమణ దగ్గరకు జంట కోసం
వెళ్ళిపోయావా బాపూ…చూడు, సంపూర్ణ రాముడు దిగాలుగా కూర్చున్నాడు
చూడు, సీతా రాధలు కళ్యాణం చేసుకోనంటున్నారు
చూడు, సీగానపెసూనాంబ తల దువ్వుకోలేదు
జడ వేసుకోలేదు. బుడుగు అన్నం తిననని
మొండికేస్తున్నాడు. గోపాళం నేపాళం పట్టి
పోతానంటున్నాడు.బాపూ, నీ చేతిరాత నాపై నీ అభిమానానికి ‘సాక్షి’
నీ గీత నా తెలుగు ముంగిట్లో ‘ముత్యాలముగ్గు’
నువ్వు పోకముందు నిన్నెప్పుడూ తలవలేదు
నువ్వు పోయినప్పుడు నిన్ను చూసిన
మొదటి వెయ్యిమందిలో ఒకణ్ణి (983వ వాణ్ణి)
కావడం నా పూర్వజన్మ సుక్రుతంఅల్విదా బాపూ అల్విదా. తెలుగు వాడిగా
పుట్టినందుకు ఇంతకన్నా నీకు మేమేమి చెయ్యలేం
గుడ్‌బై బాపు గుడ్‌బై.
సామాజిక కవితల లాగా ప్రముఖుల నివాళి కవితలు కూడా ఎంత సమయోచితంగా మీరు ప్రచురిస్తే అంత ప్రభావం ఉంటుంది. చనిపోయినది సంగీతకారుడైతే వారి గాత్రం / వాయిద్యం ఏదైతే అది మూగబోయింది అని నివాళి కవిత మొదలు పెట్టండి. కొత్తల్లో కష్టంగా ఉన్నా మీకు అంతగా పరిచయం లేనివారు, మీరు ఎప్పుడూ దగ్గర కాని వాళ్ళకు కూడా నివాళి రాయడం రాన్రానూ అలవాటౌతుంది. (మర్చిపోకండి, ఇది మీ గురించి కాదు. ఆ ప్రముఖులను, కళాకారులను నిజంగా అభిమానించి ఆ విషయం బైటికి చెప్పుకోలేని నిస్సహాయులకు మీరే గొంతు. ఇది మీ కర్తవ్యం.) కింది ఉదాహరణ చూడండి.
మాండోలిన్ మూగబోయింది
ఈ వార్త వినగానే అప్పటిదాకా
‘ఆనందభైరవి’ లాంటి ఉదయం
నీరవ నిస్తేజమై ‘రజనీగంధ’ మయింది.
మౌనంగా ‘మోహన’లో కరిగి పోయిన ‘కాపీ’
కన్నీళ్ళ ‘కళ్యాణి’లో కలత చెందిన ‘కాంభోజి’
ఇక ఆ ‘మాండ్’ఓలిన్ వినిపించదన్న నిజం
నా జీవితాన్ని ఇంకెప్పటికీ వినలేని రాగంగా
ఒక మూగమనసు పాడిన ‘హంసధ్వని’గా చేసింది.
… …
(మాండలిన్ స్రీనివాస్కి నయనాశ్రుస్వరాలతో, మూగబోయిన మనసుతో…)
ఈ కవితలు కూడా శుద్ధవచనంలో మరింతగా ప్రకాశిస్తాయి అని వేరేగా చెప్పక్కర్లేదు. ఇలా ఎన్నో రకాల నివాళి పద్ధతులున్నాయి చెప్పడానికి. విఖ్యాత కవుల కవితలు తప్పక చదివినప్పుడు అవెలా రాయచ్చో మీకు తెలుస్తుంది.
ఇంకా చిత్ర, పదచిత్ర కవితలు; వాద, ప్రాంతీయ, మైనారిటీ, తిట్టు కవితలు; భావ -తాత్విక, -అస్తిత్వ, -ఆత్మాశ్రయ, -ఆధునిక, -ఉత్తరాధునిక, అనువాద కవితలు; ఛందో పద్యం, కవిత్వ సమీక్ష, ముందుమాటలు; ఇలా ఎన్నో రకాల సాహిత్యసేద్య పద్ధతులను గురించి చర్చించాల్సి ఉన్నా, అది మీపై మరింత భారం మోపుతుందని ప్రస్తుతం వాయిదా వేస్తున్నాను. కవిగా మీరు ఎలా కొనసాగాలో మూడు ముక్కలు చెప్పి ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
కవి జీవనం, విమర్శ
ఈ వ్యాసం మొదట్లో భామహుడి శ్లోకాన్ని (ఇది కథలకు, అనువాదాలకు కూడా వర్తిస్తుందిట!) ప్రస్తావించడం వెనుక రెండు కారణాలున్నాయి. ఒకటి, అతని ఆలోచన ఎంత అవుడ్డేటెడ్గా ఉందో, అలాంటి పాత చచ్చు సలహాలు మన ఫేస్బుక్యుగమ్లో ఎందుకు పనికిరావో మీకు చూపడం. రెండు, ఆ శ్లోకంతో మొదలు పెట్టడం ద్వారా ఈ వ్యాసరచయిత సంస్కృత గ్రంథాలు చదువుకున్నాడన్న నమ్మకాన్ని మీలో కలిగించడం. (ఇది సజెస్టేషన్ అనే కవి ప్రక్రియ.) కవిగా మీపై ఒక గంభీరమైన అభిప్రాయాన్ని మీ పాఠకులలో కలిగించడం అవసరం అని ఈ రకంగా మీకు చెప్తున్నాను. నాకు కావ్యాలంకారంలో ఈ ఒక్క శ్లోకమే తెలుసు, అదీ ఈ మధ్యనే ఒక పండితుడు చెప్పడం వల్ల అనేది నిజత్వం లేని నిజం. పికాసో క్యూబిౙమ్, సిబేలియుస్ సింఫొనీ, కేలూచరన్ నాట్యం, రితుపర్నో సినీమా — ఇలా దేనిపైనో మీ విజ్ఞత చూపాలంటే మీరు ఆ కళలు కొంతైనా పరిచయం చేసుకుని ఉండనక్కర్లేదు. గూగులించండి. సంకలించండి. వ్యాసించండి. ప్రస్తావించండి. మనకు ఎంత తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకు ఎంత తెలుసు అని అందరూ అనుకుంటారనేది ముఖ్యం. కవిరచయితలు (వ్యాసకర్తలు, విమర్శకులు ముఖ్యంగా) తమ స్థానాన్ని తన అభిమానుల హృదయాలలో ఇలా ప్రతిష్ఠించాలి.
కవిత్వం చలనశీలి. నిరంతరంగా చలిస్తూ శీలిస్తూ పరిణమిస్తూ ఉంటుంది. ఈ వ్యాసం మొదట్లో ‘కవిగా మీ కవితను మీరే వివరించి చెప్పుకోవాల్సిన అవసరం, దురదృష్టవశాత్తూ ఏర్పడుతుంది,’ అన్నాను. కానీ, వ్యాసం ముగింపుకి వచ్చేసరికే కవిత్వ లక్షణం మారిపోయింది. ఆ వాక్యం ఇప్పుడు ఇలా ఉండాలి: ‘కవిగా మీ కవితను మీరే వివరించి చెప్పుకోవాల్సిన అవసరం మీకు ఎప్పటికీ ఉంది. అది మీ ధర్మం, కర్తవ్యం.’
మీరు ఎంతో ఆవేశంతో కవిత రాస్తారు. ఆ కవితను అనుభవించాల్సిన విమర్శకుడు ఆ పని చేయడు. పైపెచ్చు ఆలోచిస్తాడు. కవితలో అర్థం వెతుకుతాడు. అన్వయం వెతుకుతాడు. ప్రతీకల ఔచిత్యం వెతుకుతాడు. కవిని ప్రశ్నిస్తాడు. ఈ పాదం ఇక్కడ ఎందుకు విరిచావు? వంటి సమాధానం లేని ప్రశ్నలకు ఏ కవైనా ఏమని జవాబిస్తాడు?! ఆ రకంగా కవి భావావేశాన్ని పరిహరించి విమర్శకుడు కవిత్వానుభూతిని శూన్యంగా చూపిస్తాడు. సున్నకు సున్న, హళ్ళికి హళ్ళి. ఇటువంటి వారితో ఎప్పుడూ తలనొప్పులు తప్పవు. అందువల్ల, మీ కవితను అందరికంటే ముందు మీరే సమర్థించుకోండి. మీ రచన గురించిన చర్చలో చురుగ్గా పాల్గొనండి. మీరు ఎందుకు ఈ కష్టం తలకెత్తుకున్నారో, మీ కవితల, కథల నేపథ్యం ఏమిటో వివరించండి. ఏ వాక్యం వెనకాల అర్థం ఏమిటో మీరే చెప్పండి. ఒక రాగం తీసే ముందు, ఇందులో నేను విషాదం పలికిస్తాను అని చెప్పి రాగం ఎత్తుకోవడం వల్ల శ్రోతలలో అయోమయం ఉండదు.
నవ్యత్వాన్ని ప్రశ్నించే విమర్శకులకు కూడా ఇదే జవాబు. ఉదాహరణకి, పైన చెప్పిన x-np ఫ్రేము కవితలో పాదాలను చిత్రంగా కాగితంపై అమర్చండి. అలా అమర్చి మనం మరో అర్థాన్ని, భావోద్వేగాన్ని పాఠకుల మనసులో పుట్టించగలమా? అవుననండి. ఇది మాటల్లో చెప్తే అర్థం అయేది కాదు. దానికి కావలసిన కవిహృదయం నీకు లేదు అని విమర్శకుణ్ణి దీటుగా ఎదుర్కోండి. మీ సృజన వారికి అర్థం కాదని కాలేదని అర్థం చేసుకోండి. వారి విమర్శకు ప్రతివిమర్శ చేయండి. కవి, నా కవితకు మూడేకాళ్ళనే మనస్తత్వం చూపాలి. ఆ ఆత్మవిశ్వాసాన్ని ‘నా అంత సూక్ష్మంగా, సృజనాత్మకంగా, సంక్లిష్టంగా ఇంకెవరూ ఆలోచించలేరు,’ అనే నిరంతర కవి భావన ద్వారా సాధించవచ్చు.
అప్పుడప్పుడూ మీకు కోపం వస్తుంది. తప్పదు. మిమ్మల్ని అర్థం చేసుకోని ఈ సమాజంపై మీకు విముఖత కలుగుతుంది. కొన్నిసార్లు సాటి కవులే శత్రువులవుతారు. (వీరు సాధారణంగా పరాయి ప్రాంత, -వాద, -లింగ, -వర్ణ, -భావజాలురు; ఏదో ఒక రకంగా ఇతరులు.) వారి సంకుచిత్వంపై మీకు ఏహ్యత పుడుతుంది. అప్పుడు, ప్రసిద్ధులైన కవిరచయితలలా మీ సాహిత్యానికి మీరే ముందుమాట రాసుకోండి. మీ రచన గొప్పది అని మీరే చెప్పండి, తప్పేమీ లేదు. ఎందుకో చెప్పకండి, అది మీ పని కాదు.
ఏ స్వార్థమూ లేకుండా మీరు ఇంత చేసినా కూడా, ఈ కవిత ఆ అర్థాన్ని ఎలా ఇచ్చిందమ్మా?! ఈ కథకు ఆ నేపథ్యానికి సంబంధం ఏంటబ్బా?! అని సంశయాన్ని వెలిబుచ్చే పాఠకులు చాలామందే ఉంటారు. ఉద్దేశం ఎంత గొప్పదైనా ఆచరణ అంతకన్నా ముఖ్యం. సందేశం ఏదైనా, అసలున్నా లేకున్నా, చెప్పిన కవితకు, కథకు మొదట సాహిత్య లక్షణాలుండాలి. వాక్యం, వాచ్యం సహజంగా ఉండాలి. కథాంశం గొప్పదని అనుకున్నంత మాత్రాన కథ కూడా గొప్పది అయిపోదు — అనే ఛాందసులూ ఉంటారు. ఆ అసతోములను మీరు సద్గమింపలేరు. సాహిత్య సృష్టికర్తగా వారిని చూసి జాలిపడండి. మీ ఔన్నత్యంతో వారిని క్షమించి ముందుకు సాగిపొండి. ఎలానూ, మీరు రాయడమే ఆలస్యం, అభిమానులు పుట్టుకొస్తారు. మీ సాహిత్యాన్ని సాహిత్యంగా తప్ప మిగతా అన్నిరకాలుగా విశ్లేషిస్తారు. మీకు బాసటగా నిలుస్తారు. ఏనాటికో ఒకనాటికి ఈ గుడ్డిసమాజం మీ నిజస్వరూపాన్ని కళ్ళారా చూస్తుంది.
చివరిగా మరొక్కసారి చెప్తున్నాను — మీరు రాసింది కవిత కాదు అనే అర్హత, హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు. అలా అంటున్నారూ అంటే కవిత్వాన్ని తప్పుగా బేరీజు వేస్తున్నారు అని అర్థం. విలువైన మీ ఆశయం కంటే కాగితం మీది అక్షరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థం. అందుకని, మీ రచనకి మీరే తోడూ నీడగా ఆలంబనగా నిలవండి. ఎందుకు రాశానో గమనించకుండా ఎలా రాశానో పట్టించుకునే వారికి ఈ సాహిత్యసమాజంలో చోటు లేదని నినదించండి. అటువంటి వారిని కవి ఐక్యత ద్వారా ఎదుర్కోండి. ఇది కవిగా, రచయితగా, మీ బాధ్యత.
ఎన్నో ఏళ్ళుగా సాహిత్యం గురించి ఎన్నో అపోహలతో ఎంతోమంది ఔత్సాహికులను నిరుత్సాహపరిచాను. కొందరు యువస్నేహితులని నా తప్పులు ఒప్పులని నమ్మించి తప్పుదారి పట్టించాను. వారందరికీ అసలు దారి చూపలేను. కానీ, ఈ వ్యాసం ఏ కొద్దిమందికైనా ప్రముఖ కవి, రచయిత కావడంలో వెన్ను తడితే నా తప్పులు కొంతవరకైనా ప్రాయశ్చిత్తం అవుతాయనే ఆశతో ఈ వ్యాసం రాశాను. అలాగే జరుగుతుందని ఆశిస్తాను.
[ఈ వ్యాసానికి గ్రంథసూచి లేదు.]